పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసెను. "నేను వెనుక దినచర్యవ్రాసి యెన్నియోదినములు గడిచెను. అయ్యో! ఈ యవకాశమునందు ఫ్రాన్సుదేశమున నెన్నియో మార్పులుగలిగినవి. పారీసు నగరమునందు మేమున్న స్వల్పకాల మా పట్టణమెంతయో రమణీయముగా నుండెను. అచటి రాజమార్గము లత్యంత రమ్యములుగానుండెను. ఆదేశంలోని సైన్యములన్నియు నత్యంత సువ్యవస్థతో నుంచబడెను. అట్తి వైభవసంపన్నమగు పట్టణము నే డిట్లు దీనదశకు వచ్చుట గన, నా కత్యంత దు:ఖకరముగా నున్నది. పృథ్విలోని సర్వపట్టణములలో నధికమయినదని ప్రసిద్ధిజెందిన పట్టణమునకిట్టి దీనావస్థ గలుగుట గని, యేరికి హృదయము కరగకుండును? ఫ్రాన్సు దేశీయులకును, జర్మనీ దేశీయులకును యుద్ధమారంభమైన నాటనుండియు నా మనసంతయు ఫ్రాన్సుదేశ జయమునే కోరుచుండెను. తుద కట్లుగాక ఫ్రాన్సుదేశమునకే పరాభవము కలుగుట మిగుల వ్యసనకరము." ఈ వాక్యములవలననే యామెకు ఫ్రాన్సుదేశమునందుగల గౌరవాతిశయము వెల్లడియగుచున్నది. ఆ దేశమునందు దనకు గల గౌరవమును తోరూదత్తు ఇంగ్లీషునందు స్వయముగా నొక పద్యకావ్యము రచించి వెల్లడించెను.

1873 వ సంవత్సరమున కొమార్తెలను దీసికొని గోవిందచంద్రదత్తుగారు తిరిగి కలకత్తా ప్రవేశించిరి. ఇంటికి వచ్చిన పిదప తోరూదత్తు ఇంగ్లీషు ఫ్రెంచుభాషలయందు నధిక పరిశ్రమ జేయుచు, తండ్రిగారియొద్ద సంస్కృతమునేర్చుకొన నారంభించెను. ఈ సమయమునందే ఆమెకు పద్య గద్య కావ్యములు వ్రాయుటకు విశేషస్ఫూర్తి కలిగెను. అందుపై నామె తండ్రి