పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుకు పద్మావతి రాజపత్నితో నిట్లనియె "భర్తప్రాణములు పోయినవెంటనే ప్రేమగల పత్నియొక్క ప్రాణములు బొందినుండి వెడలును. ఇదియె నిజమైన ప్రేమయొక్క లక్షణము. అట్లు వెంటనే బొందిని విడువక తరువాత ప్రాణత్యాగము చేయుట యాత్మఘాతయెగాని పత్నీధర్మముగాదు."

పద్మావతియొక్క శుద్ధాంత:కరణమునుండి వెడలిన యీవాక్యములు ప్రభుపత్ని చెవులకు ములుకులవలె దోచగా నామె పద్మావతి తాను నిజమయిన పతివ్రతను అని వెల్లడించుటకై యీడంబములు పలికెనని యెంచి పద్మావతి నామె పరీక్షించి భంగపరచ వలయునని నిశ్చయించెను.

అందుపై గొన్నిరోజులయిన పిదప రాజుతో జయదేవు లరణ్యమున కరుగుట సంభవించెను. అప్పుడు రాజపత్ని తన మంత్రినిం బిలిచి తన కుట్ర యభిప్రాయ మాతనికి దెలిపి, తదనుసారముగా కార్యము నిర్వహింప నాతనిని నియమించెను. అట్లు కుతంత్రము పన్ని యా రాజకాంత యా రోజునగూడ దన నియమప్రకారము పద్మావతి గృహమునకరిగి యామెతో బ్రసంగించుచుండెను! అంతలో దూతిక యొకత యతి దీనవదనయై వచ్చి, కారడవిలో నాకస్మికముగా జయదేవుడు పులి నోటబడి ప్రాణములను విడిచెనని గద్గదస్వరముతో జెప్పెను! ఆ పిడుగువంటివార్త చెవిసోకినతోడనే పద్మావతి నిశ్చేష్టితయై కొంతవడి దేహము తెలియకుండి, మరల దేహస్మారకము గలిగి దు:ఖాతిరేకము పట్టజాలక పతినామము నుచ్చరించి మరణ