పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవార్త సిందేగారి దరబారున కరుగగా నదివరకు దాత్యాటోపే బోధవలన నాతనికి వశులైన సరదార్లందరును పేష్వాగారికి సహాయము చేయుదుమని చెప్పిరి; కాని ప్రభుభక్తిగల జయాజీరావు సిందేగారును, దివాను దినకరరావుగారును వారి వాక్యములను లెక్కింపక మిగులయుక్తిగా మరుసటిదినము పేష్వాసైన్యములను బారద్రోల నిశ్చయించిరి. కాని రాత్రి దివానుగారు లేనిసమయమున నెవరో మహారాజుగారిని యుద్ధమునకు బురికొల్పిరి. అంత నాయన తనకధిక విశ్వాస పాత్రములగు సైన్యములంగొని సూర్యోదయమువరకు మురారికీవల రెండు మైళ్లదూరమునగల బహాదురపురము నందు దనదండును నిలిపి యుద్ధ మారంభించెను. ప్రథమమునందు పేష్వాసైన్యములపైబడు గుండ్లను గని సిందే పూర్వము పేష్వాల బంటగుటవలన దమ కనుకూలుడై తమ నెదుర్కొన వచ్చుచున్నాడని తలచిరి. కాని యాబాణవృష్టి యంతకంత కెక్కువగుటవలన పేష్వామొదలగు పురుష శ్రేష్టులందరు రిచ్చివడి యేమియు తోచకుండిరి. కాని వారు తాను చెప్పినటుల సైన్యపు బందోబస్తు చేయకున్నను, కోపముంచక రాణీ లక్ష్మీబాయిగారు తగిన యుక్తిగరపి యుద్ధమారంభము చేసెను. అందువలన నారెండు సైన్యములును కొంతవరకు సమముగా బోరి పిదప సిందే సైన్యములకే గెలుపు దొరకు నట్లయ్యెను. అదిగని రాణిగారు తాను ధైర్యముతో గొందరాశ్వికులనుగొని సిందేగారి ఫిరంగీలపై నాకస్మికముగానడరి మహా ఘోరముగాబోర, సిందే సైనికులు పారజొచ్చిరి. అదిగని