పుట:Abaddhala veta revised.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతీంద్రియ శక్తులున్న వారిని అమెరికా, యూరోప్ లలో పోలీస్ శాఖ సైకిక్ డిటెక్టివ్ లుగా వాడుకుంటున్నది. నేరస్తులను పట్టివ్వడానికి,నేరాలలో కీలకాలు బయటపెట్టడానికి సైకిక్ డిటెక్టివ్ లు ఉపకరిస్తారని పోలీస్ నమ్మింది. కాని రుజువుకు పెడితే ఎక్కడా సైకిక్ డిటెక్టివ్ లు నిలబడలేదు. ఉజ్జాయింపుగా వూహించి చెప్పడం,అదృష్టవశాత్తు నిజమైతే తమ శక్తిగానూ,లేకుంటే నోరు మూసుకొని మరోచోటికి పోవడం జరుగుతున్నది. కంట్రోల్డ్ పరిశోధనలకు కొందరు సైకిక్ డిటెక్టివ్ లను గురిచేసి, నివేదికలు వెల్లడిస్తే వారికి ఎలాంటి ఇంద్రియాతీత శక్తులు లేవని తేలింది. పాశ్చాత్య దేశాలలో వున్న యీ సైకిక్ డిటెక్టివ్ సంప్రదాయం భారత దేశంలో సోకలేదు. ఇది బాబాలకు,మాతలకు పరిమితమైన శక్తిగానే మిగిలింది. అయితే బాబాలను శాస్త్రీయ పరిశోధనకు గురిచేయనందున వారి వ్యాపారం నిరాఘాటంగా సాగిపోతున్నది.

భారతీయ బాబా మహేష్ యోగి అమెరికా వెళ్ళి గాలిలో తేలే విద్య నేర్పిస్తానని కొంతకాలం ధనార్జన చేశాడు. ఎంతవరకూ ఆ శక్తి బయట పడకపోయే సరికి ఆయన శిష్యులే కోర్టుకెక్కారు. ఫిలడెల్ఫియా కోర్టు మహేష్ యోగి పై తీర్పు యిస్తూ ఆయన్ను డబ్బు చెల్లించమన్నది. కోర్టు బయట మహేష్ యోగి వ్యవహారం పరిష్కరించుకున్నాడు.

మనదేశంలో ఏ బాబాను శాస్త్రీయ పరిశోధనకు గురిచేసినా వారి నిజానిజాలు తెలుస్తాయి. హెచ్.నరసింహయ్య కమిటి అలాంటి పరిశోధన చేయబోగా సాయిబాబా తప్పించుకున్నాడేగాని, నిలబడలేదు. బాబాలకు పోలీస్,ప్రభుత్వం అండగా నిలిచినంతకాలం వారి అతీంద్రియ శక్తులు భక్తుల్ని వశపరుచుకుంటూనే వుంటాయి. ఇన్నాళ్ళుగా విభూతితో,ఇతర ఇంద్రియాతీత శక్తులున్నాయనే భ్రమ కల్పించిన సాయిబాబా సైతం,తనకు అలాంటి మహిమలు, శక్తులు లేవని ఒప్పుకున్నట్లే అయింది. అందుకు నిదర్శనం రోగుల్ని నయం చేయడానికి పుట్టపర్తిలో సాయిబాబా సూపర్ స్పెషల్ ఆస్పత్రి పెట్టడమే తార్కాణం. మహిమలతో రోగాలు తగ్గించగలిగితే ఆస్పత్రిలో శాస్త్రీయంగా చికిత్స దేనికి అనే అంశం భక్తులకు తెలియడానికి కొంతకాలం పడుతుంది. ఇది అందరు బాబాలకు,స్వాములకు,మాతలకు అన్వయించి చూచుకోవాలి.

కార్ల్ యూంగ్

అతీంద్రియ శక్తుల గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్,కార్ల్ యూంగ్ లు తీవ్రంగా వాదించుకున్నారు. ఫ్రాయిడ్ నాస్తికుడు మూఢ నమ్మకాలకు వ్యతిరేకి. యూంగ్ నమ్మకాల పుట్ట,అతడి ప్రభావం వలన కూడా అతీంద్రియ శక్తుల ప్రచారం బాగా సాగింది. కార్ల్ గస్టావ్ యూంగ్(1875-1961) సింక్రోనిసిటి,ఆర్డిటైప్ అనే రెండు సిద్ధాంతాలు ప్రచారంలో పెట్టి,మూఢ నమ్మకాలకు ప్రాతిపదికలు సమకూర్చాడు. యూంగ్ జ్యోతిష్యాన్ని, టెలిపతిని, గాలిలో తేలడాన్ని, వస్తువుల్ని సృష్టించడాన్ని నమ్మాడు. అతీంద్రియ శక్తుల విషయంలో యూంగ్ ఒకవైపు అతిజాగ్రత్త వహిస్తున్నట్లు అగుపించినా,వాటికి ఆధునిక శాస్త్రీయ ప్రతిపత్తి కల్పించాలని తహతహలాడాడు.