పుట:Abaddhala veta revised.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దళితుల్ని పుద్ధరిస్తామంటూ, మతసంఘాలు బయలుదేరి, హిందూమతం కాదని క్రైస్తవంలోకి మార్చడం మరో తంతు. దీనివలన సమస్య పరిష్కారం కాలేదు. పేదరికాన్ని మత వ్యాపారంగా సాగించడం దారుణం. ఒక మత దోషాన్ని మరో మత దోషం రూపుమాపలేదని రుజువైంది.

దళితులకు కావలసింది మత మార్పిడి కాదు. మానవహక్కులు, వైజ్ఞానిక విద్య కాని యిన్నాళ్ళుగా దళితుల్ని కర్మవాదంతో వారి గతి అంతేనని మతం అట్టిపెట్టింది. దీనికి మార్గాంతరంగా ఆర్ధికసమస్య తీరిపోతే దళితులు మామూలుగా అందరితో సమానమౌతారని వామపక్షరాజకీయ పార్టీలు మభ్యపెట్టాయి. డబ్బున్న దళితులు సైతం అంటరానితనానికి గురౌతున్నారని యీ పార్టీలు గ్రహించకపోవడం సిద్ధాంత మూర్ఖత్వం వలననే.

దళితుల సమస్యలలో మూఢనమ్మకాలు, ఆచారాలు కూడా ప్రముఖంగా పేర్కొనాలి. అగ్రకులాలలో వున్నట్లే వీరికీ అనేక మతపరమైన అంధవిశ్వాసాలున్నాయి. పుట్టిన దగ్గరనుండీ చనిపోయేవరకూ యీ గుడ్డినమ్మకాలు వీరిని కుంగదీస్తున్నాయి.

అగ్రకులాల అంధవిశ్వాసాలు, మూఢాచారాలు, కుల అహంకారం ఖండిస్తున్న దళిత నాయకత్వం అదే స్థాయిలో దళితుల పట్ల ప్రవర్తించకపోవడం దోషమే. దళితుల దురాచారాలను, మత విశ్వాసాలను, జాతరలను, కులాన్ని వెనకేసుకురావడం దళిత నాయకత్వం లోపంగా వున్నది.

శర్మ, శాస్త్రి, ఆచారి, చౌదరి, రెడ్డి అనే కుల పేర్లను సూచించే రీతులు తప్పు అని, అవి తొలగించుకోవాలి అంటున్నాం. మాల, మాదిగ అని పెట్టుకోవడంలో గర్వించదగిందేమీ లేదని గ్రహించక, యిటీవల అలా కొందరు పేర్లకు కులం తగిలిస్తున్నారు. ఈ పని ఏ కులం చేసినా దోషమే, సంకుచితమే. కులం పోగొట్టుకోవాల్సిన అవసరం, మానవులుగా సమానత్వ హక్కులతో ఎదగాల్సిన రీతులు కావాలి. అవే పిల్లలకు నేర్పాలి. ఇందుకు దళితులు మినహాయింపుకారాదు. కాని అలా జరగడం లేదు. ఇదొక ప్రధాన సమస్య అయింది. దళితులలో కులాంతర వివాహాలు జరిగినప్పుడు, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి. వారి సంతానానికి కులప్రసక్తి లేకుండా చూడాలి. అప్పుడూ నవసమాజం అవతరించి, విలువలు కాపాడడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా, తండ్రి కులాన్ని తగిలిస్తున్నారు. కొన్ని సందర్భాలలో తల్లి కులాన్ని వాడుకుంటున్నారు. కులవ్యవస్థ పోగొట్టడానికి అది దారి తీయదని గ్రహించాలి.

దళితుల పిల్లలు చదువుకోవాలి. వారిని మానసిక విముక్తులు చేయడానికి వైజ్ఞానిక దృక్పథంతో విద్య చెప్పించడం, తప్పనిసరిగా బడికి పోయేట్లు చూడడం కర్తవ్యం. దళిత నాయకత్వం యీ రంగంలో దృష్టిపెట్టాలి. రాజ్యాంగపరంగా వున్న ఉచిత నిర్భంధ విద్య దళితులందరికీ వర్తించేటట్లు పట్టుబట్టాలి. ఒక్కతరంలోనే యీ మార్పు జరిగితే దళిత సమస్య పెద్దమలుపు తిరుగుతుంది. క్రైస్తవులుగా మారిన దళితుల పిల్లల్లో మార్పు కనిపించినా మతవిద్య