పుట:2015.392383.Kavi-Kokila.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము] సీతావనవాసము 23

భద్రు : ఓసీ మాయలాఁడి. [చేయిపట్టుకొని యొడి తడవును]

మందా : [చిఱునవ్వుతో] భద్రా, మనకిరువురికి పాణిగ్రహణమా?

భద్రు : ఛీ! ఛీ! గయ్యాళి. [చేయివదలును]

మందా : నీ రసికత్వము తెలిసిందిగాని, పురోహితుని యెక్కడనైన చూచినావా ?

భద్రు : ఎందుకు ?

మందా : నిన్నటిరాత్రి నాలుగోజామున దేవిగారు దుస్వప్నము గన్నారఁట. అందుకై శాంతిపూజ చేయించవలసిందని ఆజ్ఞ అయింది.

భద్రు : [ఆశ్చర్యముతో] దుస్వప్నమా ! ఔరా ! దుర్భిక్షమునకు ముందు ధూమకేతువు.

మందా : [స్వగతము] ఈ ముసలి భద్రునకు ప్రతిదియు అమిత ముఖ్యముగ దోఁచు చుండును.

భద్రు : మందారికా, పురోహితుఁ డెక్కడనున్నాఁడో నాకుఁ దెలియదు.

మందా : ఈ వానకా ఇన్ని ఢమఢమలు ? [నిష్క్రమించును.]

భద్రు : ఇఁక నాలసింపఁదగదు. సేవకు లస్వరంత్రులుగదా.

[యవలిక.]