పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

105


చ.

అనిమిషనాథుఁ డయ్యెడ మహాగ్రహదుర్గ్రహమానసస్థితిం
గనలుచు భీషణాకృతిని గన్నులు వేయును జేవురింపఁగా
ననె ననలాదిదిక్పతుల నందఱఁ గన్గొని మీరు వింటిరే
చెనటి నిశావిటుం డిపుడు చేసినయాగజగామిచందముల్.

151


శా.

అంభోజాసనుచే వరంబు గొని గర్వాయత్తుఁడై యెవ్వరిన్
సంభావింపక చేసె నాగురుసతీసంగం బతిద్రోహి యై
దంభాచారుని గౌరతల్పగుని మద్బాహాగ్రజాగ్రన్మహా
దంభోళిం దల ద్రవ్వనేసెద నహా! దౌరాత్మ్య మే సైతునే.

152


మహాస్రగ్ధర.

అని దిగ్వేదండశుండాయతపృథులభుజోదగ్రదంభోళి కేలన్
గొని రోదోమండలన్ మిణ్గురులు గుములుగా గుప్పసారించి యుద్య
ద్ఘనశక్తిన్ ద్రిప్పఁ గొండల్ గడగడ వణఁకం గల్పవిశ్రాంతివేళా
జనితామర్షాంతకాలస్మరహరుక్రియనాస్థాని దిగ్గంచు లేవన్.

153


చ.

అనలుఁడు లేచి నిర్జరకులాధిపుఁ జూచి యిదేమి చేవ! నీ
వనికిఁ జనంగ లేచె దిపు డాగ్రహవృత్తిని నింతమాత్రకై
ననుఁ బనిఁ బంపు మాఖలుని నాఘనఘోరకరాళకీలలన్
విను కరఁతున్ సముద్రనవనీతపదంబు యథార్థమై తగన్.

154


మ.

అనిన దండధరుండు చండభుజదండాస్ఫాలనోద్దండని
స్వనదీర్ఘద్రుహిణాండకంపితజగత్సప్తద్వయీదుర్నిరీ
క్షనిదాఘార్కనిభాననభ్రుకుటిదంష్ట్రాభీషణోద్యద్ఘనా
ఘనసంఘోపమకాళికాతనుతమఃక్రాంతాఖిలాశాంతుఁడై!

155


శా.

జంభారాతినిఁ జూచి యిట్టు లను దోషాకారుఁ డౌచంద్రుసం
రంభంబు ల్బహుళోపఘాతముల నారం జేసి యత్యుగ్రతన్
గుంభీపాకము కాలసూత్రము తమఃకూటంబు గాన్పింతు స
న్నంభోజాసనుఁ డిట్టి దుర్మతులఁ బోకార్పంగఁ దాఁ బూన్చుటన్.

156


చ.

అలవరుణుండు భాసురనయావరణుం డనునిర్జరేశ్వరున్
గనుఁగొని సామదానములఁ గానిపను ల్మఱి భేదవృత్తిఁ జే
గొని యొనరింప నౌ నటుల గూడనికార్యము దండయుక్తిచేఁ
గొనకొని దీర్ప నీతికిఁ దగున్ మునుమున్నుగ దండ మర్హమే.

157