పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

శశాంక విజయము


ఉ.

సారసగర్భుఁ డాతని కొసంగెను గాండిప మక్షయాస్త్రతూ
ణీరములున్ మనోజవము నిత్యము నైనరథంబు దీధితి
స్ఫారమనోజ్ఞవజ్రకవచంబు నసాధ్యము నౌపురంబు న
వ్వీరు సురాసురావళికి వ్రేల్గొని చూపఁ దరంబె పోరులన్.

158


ఉ.

కావున దూత నొక్కరుని కైరవమిత్రుని చెంత కన్పి త
ద్భావము గాంచి వచ్చుటకుఁ బంపుట యుక్త మతండు సంధి చే
నావనజాక్షి నిచ్చినఁ బ్రియం బగుఁ గాక యెదిర్చె నేని యో
దేవ! భవద్భుజాకులిశతీవ్రత నియ్యకొనంగఁ జేయుమా.

159


చ.

అన విని యట్ల చేయఁ దగు నంచనె నైరృతి కార్య మిందునన్
గొనకొన గోట నౌపనికి గొడ్డలి యేటి కటంచుఁ బల్కె న
య్యనిలుఁడు రాజనీతి యిది యం చనె యక్షవిభుండు మంచిదే
పనుపుఁడు దూతఁ జూత మని బల్కెఁ బురాసురవైరి యయ్యెడన్.

160


క.

అనిన సురేంద్రుఁడు గురుతో
ననఘా! యిటు సేయ మీకు నభిమత మగునే
యని యాతనియనుమతిఁ గై
కొని తా నొక్కరుని బిలిచి కుశలత దోఁపన్.

161


ఉ.

చందురుచెంత కీవు చని సమ్మతిగా నిపుణత్వ మేర్పడం
బొందుగఁ బల్కి సంధి యగుపా ల్పొనరించుక ర మ్మటన్న సం
క్రందనునాజ్ఞ నౌదలను గైకొని వాఁడు విమాన మెక్కి దాఁ
జెందొవవిందుపట్టణము చేరఁగ నేఁగి వియత్పథంబునన్.

162


చ.

సరయత వచ్చి వెల్పటిహజారముచెంత రథంబు డిగ్గి భా
స్వరమణికీలితంబులు విశాలములై తగుకొన్నికక్ష్యము
ల్వరుసఁగ దాఁటి యింతిపురివాకిటిపెద్దలఁ గాంచి వారితో
సురపతిదూత వచ్చె ననుచు న్వివరింపుఁ డటన్న వారలున్.

163


క.

గమికత్తెలతో నపు డా
క్రమ మెఱిఁగింపంగ వారు గ్రక్కునఁ జేతః
ప్రమదప్రదమై యొప్పెడు
ప్రమదవనముఁ జేరి యపుడు ప్రమదం బెసఁగన్.

164


సీ.

పటికంపుసోపానపంక్తి నిజాంశుసం
        ఘటనచేఁ జాలుగాఁ గలిగి మిగులఁ