పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భువినొకఁడు చెడును మఱియొకఁ
డవిరళముగ వృద్ధిఁబొందు నదివిధివశమౌ
రవియుదయించును నొకదెసఁ
గువలయపతి క్రుంకునొకెడ గువ్వలచెన్నా!

102


ఎవ్వరి కెయ్యదిచెప్పిన
నెవ్వరువినరెయ్యదియును నెట్టెట్టినరుల్‌
మువ్వముగఁ జూచుచుండుము
గువ్వలనఁ జరింత్రుముందు గువ్వలచెన్నా!

103


ఎప్పటికైనను మృత్యువు
తప్పదని యెఱింగియుండి తగినచికిత్సం
దప్పింప నెఱుఁగకత్తఱి
గుప్పున నేడ్చెదరదేల? గువ్వలచెన్నా!

104


జరయును మృత్యువు మొదలుగ
మరలఁగ రాకుండునట్టి మార్గంబేదో
గురుతెఱుఁగఁ జేయుమని శ్రీ
గురుగురుని భజియింపవలయు గువ్వలచెన్నా!

105


పరమార్థము నొక్కటెఱిఁగి
నరుఁడు చరింపంగవలయు నలువురిలోఁ బా
మరుఁడనఁగ దిరిగినను దన
గురియొక్కటి విడువకుండ గువ్వలచెన్నా!

106


చతురాస్యుని సృష్టియు
ఘటకృతివర్యుని భంగికాన నేకగతి సర
స్వతిచర్య లట్లెయుండును
గుతుకముతోఁ జూచుచుండు గువ్వలచెన్నా!

107