పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గువ్వలచెన్నశతకము

శ్రీపార్థసారథీ! నేఁ
బాపాత్ముఁడ నీదుపాలఁ బడినాడ ననుం
గాపాడుమనుచు నాంతర
కోపాదు లడంచి వేఁడు గువ్వలచెన్నా!

1


నరజన్మ మెత్తి నందున
సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద
చ్చరణములు మఱవ కుండిన
గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా!

2


ఎంతటి విద్యలఁ నేర్చిన
సంతసముగ వస్తుతతులు సంపాదింపన్‌
చింతించి చూడ నన్నియు
గొంతుకఁ దడుపుకొనుకొఱకె గువ్వలచెన్నా!

3


సారాసారము లెఱుఁగని
బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా?
నీరెంత పోసి పెంచినఁ
గూరగునా నేలవేము?గువ్వలచెన్నా!

4


అడుగునకు మడుగు లిడుచును
జిడిముడి పాటింతలేక చెప్పిన పనులన్‌
వడిఁజేసి నంత మాత్రన
కొడుకగునా లంజకొడుకు? గువ్వలచెన్నా!

5