పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈవియ్యని పద పద్యము
గోవా? చదివించుకొనఁగఁ గుంభిని మీఁదన్‌
ఈ విచ్చిన పద పద్యము
గోవా మఱిఁ జదువుకొనఁగ గువ్వలచెన్నా!

6


ఇరుగు పొరుగు వారందఱుఁ
గర మబ్బుర పడుచు నవ్వగా వేషములన్‌
మఱిమఱి మార్చిన దొరలకు
గురు వగునా బ్రాహ్మణుండు గువ్వలచెన్నా!

7


అనుభవము లేని విభవము
లను భావ్యము కానియాలు నార్యానుమతిన్‌
గనని స్వభావము ధర్మముఁ
గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వలచెన్నా!

8


పదుగురికి హితవు సంప
త్ప్రదమును శాస్త్రోక్తమైన పద్ధతి నడువన్‌
జెదరదు సిరియు హరి భక్తియుఁ
గుదురును గద మదిని నెన్న గువ్వలచెన్నా!

9


వెలకాంత లెంద ఱైననుఁ
గులకాంతకు సాటి రారు కువలయ మందున్‌
బలు విద్య లెన్ని నేర్చిన
గుల విద్యకు సాటి రావు గువ్వలచెన్నా!

10


కలకొలఁది ధర్మముండినఁ
గలిగిన సిరి గదలకుండుఁ గాసారమునన్‌
గలజలము మడువు లేమిని
గొలగొల గట్టు తెగిపోదె గువ్వలచెన్నా!

11