పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెద్ద లెవ్వరు పేరఁబిలిచి మాటాడరు
               భార్య యెప్పుడు తూల బలుకుచుండు
బంధువులు నలుగురు పాటి సేయఁగఁ బోరు
               తనవార లంత ఛీ యనుచు నుండ్రు
పరమార్థ సాధనోపాయకర్మ మడంగు
               నిల్లు నొళ్ళును గూడ గుల్ల యగును
అంది పొందిన వార లందఱు తేలిక
               బట్టి బల్ గెగ్గీలు గొట్టుచుందు
రవనిలోపల జారత్వ మరయ హాని
యెంచి చూచిన బురుషుని కేది లేదు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

87


పితృ మాతృలకు మనఃప్రీతిగా మెలగుచు
               గురువులపై భక్తిఁ గుదురుకొలిపి
పెద్దలఁగని చాల ప్రేమ పూజింపుచు
               దీనుల బోషించి తెఱ వెఱంగి
బంధు విధేయుఁడై బహు జన మిత్రుఁడై
               సాధుసజ్జన గోష్ఠి సలుపుచుండి
పరకాంతలను మాతృ భావంబుగా జూచి
               సంతత ధర్మ ప్రచారుఁడగుచు
మెలఁగు చున్నట్టి వాఁడె పో దలప భవద
ఖండ కారుణ్యమునకుఁ బాత్రుండు సుమ్ము
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

88