పుట:2015.372978.Andhra-Kavithva.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక.

నాగ్రంథమునకు నేనే పీఠిక వ్రాయుట, నాకు నేనే దండోరా వేసికొన్న ట్లుండును. కారణాంతరములచే నట్లు చేయవలసివచ్చె. గుణదోషవిమర్శనము రసజ్ఞులకే విడిచితిని. ఇచ్చట గ్రంథరచనయం దేనవలంబించిన పద్ధతులఁగూర్చి యొకటిరెండుమాటలఁ దెల్పనెంచితిని.

సాహిత్యవిషయమునఁ బ్రాక్పశ్చిమదేశములకు విరోధభావము తగదనియుఁ, బద్ధతులు వేఱయినను బరమార్థము రెంటికిని రసప్రతిపాదనమేయనియు గ్రహించినవాఁడనగుటచేఁ బాశ్చాత్యసాహిత్య విశారదుల యభిప్రాయముల నచ్చటచ్చట స్థాలీపులాకన్యాయమున సూచించుచువచ్చితిని. ప్రాక్పశ్చిమసంయోగ మసంభవమనియు, 'నెవరికివారే యమునాతీరే' యనియు, నమ్మువారికి నే నవలంబించినపద్ధతి రుచింపక పోవునేమోకాని, విశాలదృష్టితో సమరసభావముతో సాహిత్య చరిత్రము నవలోకించువారికి సాహిత్య మెట్లు జీవసూత్ర బద్ధమై దేశకాలపాత్రానుసారముగ మార్పులఁ జెందుచు, భిన్న పరిణామములఁ దాల్చుచు, నభివృద్ధిఁ జెందుచుండునో గోచరింపకమానదు. అదియునుంగాక, విద్యాలయములఁ గొంతవఱకుఁ బాశ్చాత్యసాహిత్యమును జదివినవాఁడ నగుటచే, నాయభిప్రాయముల నచ్చటచ్చటఁ బాశ్చాత్యవాసన లుండక