పుట:2015.370800.Shatakasanputamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. ప్రకటింపంగ మదీయచిత్త మది దాఁ బంచేంద్రియోద్వృత్తమై
     ప్రకటప్రాప్తిని సోలుఁగాని మఱి నీ పాదాబ్జసంసేవనం
     బొకవేళ భజియింప నొల్లదు నిజం బూహింపఁగా నట్ల యీఁ
     గకు దుర్గంధము గాక సహ్యమగునే కస్తూరి సర్వేశ్వరా!91
మ. మలినాంగుం డగుటేమి కష్టము మనోమార్గంబు నీ భక్తిని
     ర్మలసౌభాగ్యనిధానదీపశిఖయై రంజిల్లదే భూషణో
     జ్జ్వలదేహుం డగుటేమి తేజము మనోవ్యావృత్తి దుర్మోహసం
     చలదుష్పంకముఁ బొంది పీడఁ బడఁగాఁ జర్చింప సర్వేశ్వరా!92
మ. ఇల నా చిత్తము యోగసాధనలయం దీదాడఁగాఁ గొంతని
     శ్చలతం జేరఁగవచ్చు లేక తన వాంఛావృత్తిఁ బోనిచ్చినం
     బొలుపై నీ దెసఁ జేర దట్టి దకటా భావించినం గాక కే
     వలసంబోధననేల నిల్చు ఋజువై వర్తింప సర్వేశ్వరా!93
మ. ఉదకం బింకిన లావు మాలి కడుమై యష్ణింపఁగా రొంపిలోఁ
     గదలం జాలని మీను వాన గురియం గ్రమ్మెక్కి పెన్నీటిలోఁ
     బొదలం గన్న విధంబునన్ భవముతోఁ బోరాడు మర్త్యుండు దా
     హృదయాబ్జంబున నిన్నుఁ గొల్వఁగనునే యింపొంద సర్వేశ్వరా!94