పుట:2015.370800.Shatakasanputamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     కరులౌ నశ్వములౌ ననర్హమణులౌఁ గర్పూరమౌ హారమౌఁ
     దరుణీరత్నములౌఁ బటీరతరులౌఁ దథ్యంబు సర్వేశ్వరా!87
మ. ఒకపుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం
     జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ బునర్జన్మంబు లేదన్నఁ బా
     యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచో బెద్దనై
     ష్ఠికుఁడై యుండెడువాఁడు నీవగుట దాఁ జిత్రంబె సర్వేశ్వరా!88
శా. ఆనందంబును బొందునప్పుడును నత్యాశ్చర్యకార్యార్థభా
     వానీకంబులు దోఁచునప్పుడును రోగాపాయదుఃఖాతుర
     గ్లానిం బొంది చరించునప్పుడును సత్కార్యంబున న్నీవు నా
     ధ్యానంబం దుదయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా!89
శా. నానాశాస్త్రసముచ్చయాగమపురాణప్రౌఢులై తత్త్వవి
     జ్ఞానధ్యానసమాధివిద్య లతివిస్పష్టంబుగా నేర్చి రే
     దాన న్నేర్పరులెల్ల నేరరు భవత్సద్భక్తివిద్యాసమా
     ధానప్రస్ఫుటశక్తి నీ కరుణచేతం గాని సర్వేశ్వరా!90