పుట:2015.370800.Shatakasanputamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     గొంకనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా
     తంకమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!99
చ. భ్రమరము గీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై
     భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాది దుఃఖసం
     తమసమెడల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూప త
     త్త్వమును ధరించుటేమరుదు దాశరథీ! కరుణాపయోనిధీ!100
చ. తరువులు పూచి కాయలగు దత్కుసుమంబులు పూజగా భవ
     చ్చరణము సోఁకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై
     కరిభట ఘోటకాంబర నికాయములై విరజానదీసము
     త్తరణ మొనర్చుఁజిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!101
ఉ. పట్టితి భట్టరార్యగురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్‌
     వెట్టితి మంత్రరాజ మొడబెట్టితి నయ్యమకింకరాళికిం
     గట్టితి బొమ్మ మీ చరణ కంజములందుఁ దలంపుపెట్టి బో
     దట్టితిఁ బాపపుంజముల దాశరథీ! కరుణాపయోనిధీ!102
ఉ. అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజ గోత్రజుఁడాదిశాఖ కం
     చెర్లకులోద్భవుండనఁ బ్రసిద్ధుఁడనై భవదంకితంబుగా
     నెల్లకవుల్‌ నుతింప రచియించితి గోపకవీంద్రుఁడన్‌ జగ
     ద్వల్లభ నీకు దాసుఁడను దాశరథీ! కరుణాపయోనిధీ!103

దాశరథిశతకము సంపూర్ణము.