పుట:2015.370800.Shatakasanputamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామభక్తివిశేషముచే రామదాసుఁడని పేరొందిన కంచర్ల గోపన్నయే యీదాశరథీశతకమును రచించినటులు జనులు చెప్పుకొనుచున్నారు. కంచర్ల గోపన్నయే రామదాసనువిషయములో సందేహము లేదు. ఇతఁడు కంభముమెట్టు చెంతగల నేలకొండపల్లి నివాసియని కొందఱు, వినుకొండ చెంతగల కంచర్ల నివాసి యని మఱికొందఱు చెప్పికొనుచున్నారు. నేలకొండపల్లి నివాసి యనుప్రవాదము చిరకాలశ్రుతము గ్రంథస్థమునై యున్నది. తానీషా క్. శ. 1658-1687 వఱకు రాజ్య మేలియుంటచే రామదా సాకాలమునం దుండెననుట నిర్వివాదాంశము.

దాశరథీశతక కర్త తొల్లి ప్రబంధము వ్రాసి నరాంకితము గావించితి నని పశ్చాత్తాపపడుచున్నాడు, ఆగ్రంథ మేదో తెలియరాదు. రామునియందు హృదయము సర్వవిధముల లీనము గావించి తాదాత్మ్యమున నీశతకము వ్రాసినటులఁ దోఁచుచున్నది. ఇందలిపద్యములు మనోహరధారాశోభితములై భక్తిరసమును వర్షించుచున్నవి. తెలుఁగుబాసలో నిట్టిభక్తిరస ముద్బోధించుశతకము లరుదుగా నున్నవి. రామదాసు శతకము వ్రాయుచు గోదావరితీరమునఁ గూర్చుండి తాటాకుపై నొక్కొకపద్యము