పుట:2015.328620.Musalamma-Maranam.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

నాటినుండి నేటిదనుక అతనిచరిత్ర వ్రాయుట నిటనాకు పనిగాదు. కాని అతనికి నాకును—అతడెచటనున్నను నే నెచటనున్నను— బంధుత్వ మెక్కడకలదా యని ఆలోచించినపుడు మాకు తెలిసిన సువార్త మరియొకరికి వ్యాపింపజేయు గుణమునందున్నదని పలుమరు తోచుచుండును. కవిత్వతత్త్వవిచారము, అర్థశాస్త్రములు మహత్తమసృష్టులే. రామలింగారెడ్డి ద్రౌపది శీలవర్ణనవ్రాసియుండిన నంతకంటె మహత్తరసృష్టి యయియుండును. కాని రెడ్డిప్రతిభ ఇట్టి సృష్టులలో ఇముడలేదు.

జిగిబిగిగల తెలుగుశైలి వ్రాసి చప్పటి తెలుగు వాక్యరచనకు చవులూరు గుణముకల్పించిన కీర్తి యతనికి చెందవలెనేమో! నన్నయ యెడల నెంతయభిమానము నితడు చూపినను తేలికవ్రాతలలో తిక్కన ననుకరించినవారిలో మా రెడ్డియొకడనియు రాయలసీమ వచనరచనకు నితడు పురోగామియనియు నాయూహ. శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మబోటి ప్రతిభావంతులను కనిపెట్టి లోకమునకు ఇచ్చుటలో రామలింగారెడ్డి అప్రతిమాన బుద్ధికౌశలమును మహోదారహృదయమును కనుపరచినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము — సవ్య తేజోవిభాసితము — విద్యాపక్షమున పూర్ణముగా నతని సృష్టి.

ఇట్టి ఈ భాషాసేవకునికి సరస్వత్యారాధకునికి దేశసేవాపరాయణునకు రెండరువదియేండ్ల ఆయువొసంగినను నొసంగతగినదే. ఈశ్వర కృప అపారముగ నీతనియెడల వెలయుగాక.

14 ఏ. సుంకువారివీధి

ట్రిప్లికేన్, మద్రాసు

29-11-40

ఇట్లు, బుధజనవిధేయుడు

గాడిచర్ల హరిసర్వోత్తమరావు

ఆంధ్రదేశ గ్రంథాలయసంఘాధ్యక్షుడు