పుట:2015.328620.Musalamma-Maranam.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మా కార్యదర్శి శ్రీ నాగభూషణము పట్టుదలచేత వారిమిత్రులు శ్రీ కొమ్మా సీతారామయ్యగారి యౌదార్యాభిమాన త్యాగములచేత పటమటలంకలో మాయుద్యమ కార్యాలయమునకు భవననిర్మాణ ప్రయత్నమును సాగుచున్నది. ‘గ్రంథాలయసర్వస్వము’ ‘ఆంధ్రగ్రంథాలయ’ మనుపేరిట పునరుజ్జీవితమయి నడచుచున్నది. ఇప్పటి గవర్నమెంటు ఉత్తమాధికారుల మంచితనముచే లోకల్ బోర్డులు మునిసిపాలిటీలు మా సభ్యులగుటకు అవకాశ మిటీవల చిక్కినది. విజ్ఞానవ్యాప్తి కార్యక్రమచరిత్రయందు మనదేశమున నేటియుగమును వయోజన విద్యయుగమని వర్ణింపవచ్చును. ప్రజాప్రభుత్వయుగమున నిది యంతర్భాగము. ఇట్టి తరుణమున శ్రీరామలింగారెడ్డిగారు ప్రజలలో వ్యక్తులు-అందులో అబలలు-ప్రజాక్షేమమునకై చేయగల అఖండత్యాగమును వర్ణించుచు రచించిన ఈ ‘ముసలమ్మమరణము’ను ప్రచురించుటకంటె వారికి మా చేయగల గౌరవము వేరుకలుగదని నిశ్చయించితిమి.

శ్రీ క. రామలింగారెడ్డి నాకు జ్యేష్ఠసోదరుడు. నాయందలి ప్రేమచే కొంతకాల మతడు నన్ను ‘సీనియర్’ –జ్యేష్ఠుడని–వ్యవహరించినను, అతడు క్రైస్తవకళాశాలలో బి. ఏ. పట్టపరీక్షయందు చరిత్రలో తేరి డబుల్ డిగ్రీకొరకు–దుశ్శాలువలకొఱ కన్నమాట– తత్వశాస్త్రము చదువుచు ఉపన్యాసవేదికలమీద ఇంగ్లీషు తెలుగుల రెంటిని అనర్గళముగా వెల్లువ లురికించుచు ప్రసంగించు దినములలోనే నా కళాశాలను ప్రవేశించి ఇతనియంతటివాడను నే నెప్పుడగుదునో యని నోరూర్చుకొనుచు నొసటిమీది ఆ పెద్దమచ్చమీదను అతని ముఖముమీదను తదేకధ్యానముగా దృష్టినిలిపి అతనిని రమారమిగా ప్రేమించితిని.