Jump to content

నా కలం - నా గళం/ఆత్మకథ విషయపేజీలు

వికీసోర్స్ నుండి

"నేను మళ్లీ పుట్టాను!"

ఔను! ప్రతి వ్యక్తి, లేదా ప్రతి ప్రాణి ఒకసారి పుడతారు; మరి, మళ్లీ పుట్టమేమిటి?

అప్పుడు నా వయస్సు 13, 14 సంవత్సరాలు వుంటాయి. "ట్రిపుల్‌ టైఫాయిడ్‌" వచ్చింది. అప్పటిలో జ్వరం వచ్చిందంటే, వైద్యులు "లంకణం పరమౌషధం" అనే వారు! నా చేత 108 రోజులు లంకణాలు కట్టించారు. అది 1946వ సంవత్సరం. అన్ని రోజులూ కేవలం కాఫీ, గ్లూకోజ్‌ వాటర్‌ మాత్రమే ఇచ్చారు. ఆ రోగి, అందులోను వేసంగిలో, ఏమౌతాడు?

మూడు నెలలు దాటిన తరువాత నీరసించిపోయాను. చివరికి స్పృహలేని పరిస్థితి! ఒక రోజు అయితే, ప్రాణం పోయిందనే భావించారు. మంచం పై నుంచి దించి కింద పడుకోబెట్టారు! ఏడుపులు, చుట్టు ప్రక్కల వారిలో సంచలనం! ప్రక్క ఇంటి ముసలావిడ ఊరగాయ జాడీలు "మైల" పడిపోతాయని ఇంటిలో నుంచి దొడ్లోకి చేరవేసింది!

ఆ పరిస్థితిలో డాక్టర్ వచ్చి, స్మెల్లింగ్‌ సాల్ట్‌ వాసన చూపించి, కొన్ని వైద్య ప్రక్రియలు చేసేసరికి నాడీ చలనం, హృదయ స్పందన కనిపించినవట! "ప్రాణం వున్న" దని డాక్టర్ సంతోషంతో చెప్పే సరికి తిరిగి మంచంపై పడుకోపెట్టారు! అందరిలో తిరిగి ఆనందహేల!

అంతే! ఇక క్రమంగా కోలుకోసాగాను. అప్పటిలో నాన్న గారు సుందరరామానుజరావు గారు గన్నవరంలో ప్లీడర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. మేము అప్పుడక్కడే వుండే వారం. ఆ తరువాత అయిదారు నెలల వరకు మంచం దిగలేక పోయాను!

అప్పుడే దిన పత్రికలు చదవడం ప్రారంభించాను. ఆ రోజులలో "ఆంధ్రప్రభ", ఆంధ్రపత్రిక - రెండే ప్రధాన దినపత్రికలు. అందులోను శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో మద్రాసు నుంచి వెలువడే "ఆంధ్రప్రభ"లో ఆయన రాసే సంపాదకీయాలు నన్ను ఆకర్షించాయి. ఏ కారణంవల్లనైనా పత్రిక రావడం ఆలస్యమైతే, అది వచ్చే వరకు ఏమీ తోచేది కాదు! నార్ల వారి సంపాదకీయాలను, వాటిశైలిని ఆ చిన్న వయస్సులోనే హృద్గతం చేసుకున్నాను.

ఆ శైలే వేరు, ఆ వాక్య రచనా రీతే వేరు; ప్రతి వాక్యం వచన కవితే! నా దృష్టిలో సంపాదకీయాన్ని అలా రాయగలిగిన వారు తెలుగులో ఇంత వరకు కనిపించలేదు! నేను అప్పుడే నార్ల గారికి "ఏకలవ్య శిష్యుణ్ణి" అయ్యాను. నేను కూడా ఆయన వలె పత్రికా సంపాదకుణ్ణి కావాలి! ఆయన వలె సంపాదకీయాలు, వ్యాసాలు రాయాలి! శ్రమించి, తపస్సువలె తపించి, ఆయన శైలిని పట్టుకున్నాను. అదే తుర్లపాటిలోని "జర్నలిస్టు" జననం! ఆ "జర్నలిస్టు" వయస్సు ఇది రాస్తున్న సమయంలో 65వ సంవత్సరం నడుస్తున్నది!

అదే నా పునర్జన్మ! ఆ అస్వస్థతకు "పూర్వపు జన్మ"లో నేను జర్నలిస్టును కావాలని కాని, కాగలనని కాని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే, నాన్న గారు లాయర్‌ కాబట్టి, విద్యార్ధిగా వుండగానే మా క్లాస్‌ డిబేటింగ్‌ సొసైటిలో నావాగ్ధాటిని విన్న వారు నాన్న గారి వలె నేను కూడా న్యాయవాదిగా రాణించగలనని అంటూ వుండడం వల్ల నేను కూడాలాయర్‌ను కావాలని అనుకుంటూ వుండేవాణ్ణి.

నాన్న గారి స్వస్థలం కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలోగల పామర్రు. ఆ వూరు అటు 'నట సామ్రాట్‌' అక్కినేని నాగేశ్వరరావు గారి స్వగ్రామం వెంకట రాఘవాపురానికి, ఇటు 'నటరత్న' ఎన్‌.టి. రామారావు గారి స్వస్థలం నిమ్మకూరుకు మధ్యలో వుంటుంది. నా బాల్యం బెజవాడ (అమ్మ శేషమాంబ పుట్టినిల్లు), పామర్రు, గన్నవరంలలో గడిచింది.

అన్నట్టు, మా అన్నదమ్ములం ముగ్గురం, అక్క చెల్లెళ్లు ఇద్దరు. నా పైన అన్న, అక్క, నా తరువాత తమ్ముడు, చెల్లెలు. పైన ఇద్దరు, కింద ఇద్దరి మధ్య నేను! అందువల్లనేనేమో, నాది జీవితంలో ప్రతి విషయంలోను "మధ్యమ" మార్గమే! నా ఆలోచనలు, వైఖరి, అభిప్రాయాలు అన్నింటిలో మధ్యే మార్గంగా వుండేవి. అటు అతివాదం కాదు, ఇటు మితవాదం కాదు, మధ్యమ వాదం!

పామర్రు హైస్కూలులో చదువుతున్నప్పుడు డిబేటింగ్‌ సొసైటి చర్చలలో నేను ఒక వైపు వాదించే వాడిని. ముఖ్యంగా ఫోర్త్‌ ఫారంలో డిబేటింగ్‌ చర్చలు జోరుగా వుండేవి. ఇప్పటి నా గొంతు, ఉపన్యాస ధోరణి, వాదనా శైలి అప్పుడు అబ్బినవే. ఫోర్త్‌ ఫారం "బి" సెక్షన్‌లో ఆడపిల్లల సంఖ్య హెచ్చు. వారిలో స్వరూపరాణి అనే అమ్మాయి చురుకైనది, తెలివైనది. మా ఇద్దరికీ అన్నింటిలో పోటీ; అది స్నేహ పూర్వకమైన పోటీ. పాఠం కానివ్వండి దానిలో వచ్చే పద్యాలు కానివ్వండి - తడుముకోకుండా అప్పచెప్పాలి! అందులో నేనే విజేతను! అందువల్ల, ఆడపిల్లలకు నాపట్ల అభిమానం. ఏ ఉపాధ్యాయుడైనా పాఠం చెబుతుంటే, దానిలోని పేర్ల కోసం తడుముకుంటున్నప్పుడు నేను ఆయనకు వెంటనే అందించే వాడిని! అందువల్ల, తక్కిన విద్యార్ధులు నాకు "ఎల్‌.టి. సపోర్టర్‌" అని పేరు పెట్టారు. ఎల్‌.టి., బి.ఇ.డి. - పట్టభద్రులైన ఉపాధ్యాయులకు విద్యాబోధనకిచ్చే డిగ్రీలు.

ఆ అలవాటు ఇప్పటికీపోలేదు!

నీలం సంజీవరెడ్డికి అందించిన మాట

1959లో విజయవాడలో పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లో పెద్ద సభ. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రధాని నెహ్రూ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. పండిట్‌ నెహ్రూ తన ఉపన్యాస క్రమంలో "కోల్డ్‌ వార్‌" అనే "ప్రచ్ఛన్న యుద్ధం" కాలంలో ఎక్కువగా వాడుకలో వున్న పదాన్ని వుపయోగించారు. దాన్ని శ్రీ సంజీవరెడ్డి "శీతల యుద్ధం" అని యథాతథంగా తర్జుమా చేశారు. అప్పటికి నేను "ప్రజాసేవ" అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్‌ను. వేదికకు ముందు వుండే "ప్రెస్‌ గ్యాలరీ" లో కూర్చున్నాను. శ్రీ సంజీవరెడ్డి "శీతల యుద్ధం" అనగానే నేను వెంటనే "ప్రచ్ఛన్న యుద్ధం" అని బిగ్గరగా కేక పెట్టాను!

ఎందువల్ల నంటే, దాదాపు లక్ష మంది ప్రధాని నెహ్రూ ఉపన్యాసం వింటున్నారు. తెలుగు పత్రికలన్నీ కూడాా "కోల్డ్‌వార్‌" అన్నమాటకు "ప్రచ్ఛన్న యుద్ధం", అంటే ప్రత్యక్షంగా ఆయుధాలతోకాక, మాటలతో, వాదోపవాదాలతో పరోక్షంగా రెండు పక్షాల మధ్య జరిగే "ముసుగులో గుద్దులాట" అని చెప్పవచ్చు.

నేను ఎప్పుడైతే, "ప్రచ్ఛన్న యుద్ధం" అని కేక పెట్టానో వెంటనే ప్రధాని నెహ్రూ, శ్రీ సంజీవరెడ్డి నా వంకకు చూశారు! శ్రీ సంజీవరెడ్డి గారు కొంచెం చిన్న బుచ్చుకున్నట్టు కనిపించింది!

సరే! తిరిగి కాలచక్రాన్ని వెనక్కితిప్పితే, ఒకసారి హైస్కూలులో డిబేటింగ్‌ సొసైటీలో "స్త్రీలకు విద్య అవసరమా? కాదా?" అన్న విషయంపై చర్చ జరుగుతున్నది. ముందు స్వరూప రాణి స్త్రీలకు విద్య అత్యవసరమని గట్టిగా వాదించింది.

తరువాత నేను లేచి, స్త్రీలకు విద్య అనవసరమని, ఎందువల్లనంటే, ఎంత చదివినా, స్త్రీలు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని, అత్తింటికి వెళ్లి వంటచేస్తూ, అంట్లు తోమవలసిందే గదా! అని ఎద్దేవాగా మాట్లాను! నా మాటకు విద్యార్థులు చప్పట్లు కొట్టారు! విద్యార్ధినులు "అలా అన్నావేమిటి?"

అన్నట్టు నా వంక బాధగా చూశారు!

కన్నీరు సృష్టించిన కలవరం

ఎందువల్ల నంటే, అంతకు పూర్వం క్లాసు మానిటర్‌గా నేను కాజ జనార్దనరావు అనే విద్యార్ధితో పోటీ చేసి, విద్యార్ధినుల ఓట్లతోనే గెలిచాను! ఒకరా, ఇద్దరా? 14 మంది అమ్మాయిలు "ఎన్‌బ్లాక్‌" గా నాకే ఓటు వేశారు! అయినప్పుడు, నేను వారిని అలా అవహేళన చేస్తానని వారు ఊహించలేదు! ఇక, స్వరూపరాణి అయితే, నావంక చూసి, బొట బొట కన్నీరు కార్చింది! ఆ కన్నీరు నన్ను కదిలించి వేసింది! నేను తప్పు చేశానని అనిపించింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు! ఎంతో సేపు నేను ఎందుకు అలా తప్పుగా మాట్లానని ఒకటే బాధ! ఆ రాత్రల్లా చాలాసేపు కన్నీటి స్వరూపరాణి రూపమే జ్ఞాపకం రాసాగింది. అప్పటికి నాకు 14 సంవత్సరాలే!

ఆ మరునాడు స్కూలుకు వెళ్లగానే అమ్మాయిలు కూర్చునే బ్లాక్‌లోకి వెళ్ళి అందరికీ "సారీ" చెప్పాను! ఇక ఎప్పుడూ స్త్రీలను గురించి అలా మాట్లాడనని, డిబేటింగ్‌ సొసైటీలో వారిని గురించి అన్న మాటలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాను. వారు చాలా సంతోషించారు.

ఆ సంఘటన నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది. అప్పటి నుంచి జీవితాంతం స్త్రీలను పురుషుల కంటె ఎక్కువగా గౌరవించాలని, ఏ పరిస్థితిలోను వారిని గురించి కించపరిచే విధంగా మాట్లాడరాదని నిర్ణయించుకున్నాను.

నా వివాహమైన తరువాత కూడా నా భార్యను "ఏమండీ!" అని సంబోధించే వాడిని! ఎందువల్ల నంటే, ఆమె నాకు పెళ్లికి పూర్వమే పరిచయం అయింది. అప్పుడు సహజంగా ఆమెను మీరు, ఏమండీ! అని సంబోధించేవాడిని. ఔను! పెళ్లికి పూర్వం ఏమండీ! అని పిలిచిన వ్యక్తిని పెళ్లి కాగానే "ఒసేయ్! ఏమేవ్‌!" అని పిలవాలా? ఏమి! పెళ్లి కాగానే స్థాయి, విలువ, గౌరవం పెరగాలి కాని, తగ్గిపోవాలా? అది పురుషాధిక్యతా మనస్తత్వం కాదా? అంతకాలం "ఏమండీ!" అని పిలిచి, మూడు ముళ్లుపడగానే భార్యకు బానిసత్వం, భర్తకు "బాస్‌ తత్వం" రావాలా? ఈ ఆలోచనే ఆమెను "ఏమండీ!" అని పిలిపించింది!

అయితే, నా "పిలుపు" కుటుంబంలోని పెద్దలకు కొంత ఇబ్బందే కలిగించింది. కవయిత్రి అయిన మా అమ్మగారు కూడా తన కుమారులమైన మమ్మల్ని "ఏరా!" అని పిలిచేది కాదు. పేరు పెట్టి పిలిచేదే కాని, "ఒరే", "ఏరా" అనేది కాదు. అప్పటిలో కోడళ్లను కొందరు అత్తలు చాలా చులకనగా, కేవలం పనిమనుషులుగా, హీనంగా చూచేవారు. ఒసే! ఏమే! అని పిలిచేవారు. మా అమ్మగారు కోడళ్లను ఏనాడూ "ఏమే" అని పిలిచేది కాదు. ఏకవచనంతో "ఏమిటమ్మా", "నువ్వు" అని మాత్రమే సంబోధించేది.

ఆమె ఒక రోజు నా వద్దకు వచ్చి "నువ్వు కృష్ణ కుమారిని "ఏమండీ" అని పిలవడం కొందరికి ఇబ్బందిగా వుంది. తక్కిన వారి మాదిరిగా నువ్వు "ఏమే", "ఒసే" అని పిలవనక్కరలేదు కాని, "నువ్వు" అని వ్యవహరిస్తే బాగుంటుంది." అని అనునయంగా, మృదువుగా చెప్పింది.

నిజమే! "తక్కిన వారు "ఒసే" అని పిలుస్తుంటే, కుటుంబరావు చూడండి, భార్యను "ఏమండీ" అని పిలుస్తాడు. మీరేమో మమ్మల్ని "ఒసే, అసే" అంటే మాకేమి బాగుంటుంది?" అని కొందరు భార్యలు భర్తలపై ఒత్తి తీసుకువచ్చారు! మొత్తం మీద అప్పటిలో కొందరు భర్తలు, భార్యలను "ఒసే" అని పిలవడం మానివేసినట్టు తరువాత దాఖలాలు కనిపించాయి.

ఈ విషయంలో ఆ చిన్ననాటి డిబేటింగ్‌ సొసైటిలో స్వరూపరాణి కన్నీరు ఇంత కథకు కారణమైంది. ఆమె ఎక్కడవున్నదో, ఏమో! ఆ 14,15 సంవత్సరాల వయస్సులో చూడ్డమే! మళ్లీ చూడలేదు. చూడాలనివుంది; ఈ కథ చెప్పాలని వుంది! కాని, అసలు వున్నదో, లేదో?

చిన్ననాటి నాటకాల పిచ్చి

ఆ చిన్న తనంలో నాకు నాటకాల పిచ్చి, సంగీత ప్రియుణ్ణి. పాటలో ప్రావీణ్యం లేదు కాని, డైలాగులు చెప్పడంలో నైపుణ్యం వుండేది. అందువల్ల చిన్నప్పుడు నాటకాలు వేశాము - "గయోపాఖ్యానం", సంపూర్ణ రామాయణం". వాటికి దర్శకుణ్ణి నేనే. రెండింటిలోను హీరోను నేనే. "గయోపాఖ్యానం"లో కృష్ణుడు, "రామాయణం"లో రాముడు. మా తమ్ముడు పూర్ణచంద్రరావు "గయోపాఖ్యానం"లో అర్జునుడు, రామాయణంలో లక్ష్మణుడు. వాటిలో కిరీటాలు, మేకప్పులు మేమే తయారుచేసుకునేవారం. పెద్దల సమక్షంలోనే ప్రదర్శించాం. బాగుందనేవారు. మాతమ్ముడి పద్యానికి మెప్పు; నా గద్యానికి మెప్పు. అవి పిల్లల నాటకాలు!

పామర్రు నుంచి గన్నవరం వచ్చిన తరువాత హైస్కూలులో డ్రాయింగ్‌ మాస్టారు శంకరంగారికి నాటకాల పిచ్చి. ఆయన హార్మోనిస్టు కూడాా. ఆయన మాచేత "భక్త రామదాసు" నాటకం వేయించారు. యథా ప్రకారంగా "రామదాసు"లో నేను రెండవ రామదాసును. మొదటి "రామదాసు" మా తమ్ముడు. అతనిది పద్య ప్రధాన పాత్ర. నాది జెయిలు సీనులో "రామదాసు" పాత్ర. ఇంకా ఇతర విద్యార్ధులు ఇతర పాత్రలు వేశారు. టిక్కెట్లు కూడా పెట్టారు. సొమ్ము మిగిలితే, మా హైస్కూలులో విద్యార్థులు మధ్యాహ్నం పూట ఇంటి నుంచి టిఫిన్‌ క్యారియెర్లతో తెచ్చుకున్న భోజనం చేయడానికి టిఫిన్‌ షెడ్‌ నిర్మాణానికి వుపయోగించాలని వుద్దేశం. గన్నవరంలో రెండు సార్లు ప్రదర్శించిన "రామదాసు" నాటకానికి ఖర్చులు పోను కొద్దిపాటి సొమ్ము మిగిలినా, టిఫిన్‌ షెడ్‌ నిర్మాణం దానితో కాదు. అదే సమయంలో నేను ఇంతకు ముందే పేర్కొన్న "ట్రిపిల్‌ టైఫాయిడ్‌" రావడం, పునర్జన్మ, ఆ కథ తెలిసిందే. దానితో ఆ నాటకాల అంకానికి తెరపడింది! ఆ తెర తిరిగి లేవలేదు!

"స్వరాజ్యంలో స్వరాష్ట్రం"

పాత్రికేయ రంగంలో ప్రవేశించిన తరువాత నేను రాసిన ప్రథమ వ్యాసమేది? అని చాలా మంది అడుగుతుంటారు. 1947 వరకు మనం భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతూ వచ్చాము. దేశ స్వాతంత్య్రం ముఖ్యం కాబట్టి, ఆంధ్రరాష్ట్ర నిర్మాణంపై మన దృష్టి గట్టిగా పెట్టలేదు. అప్పటిలో ఆంధ్ర మహాసభ ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేస్తున్నా, అదే తక్షణావశ్యకతగా తెలుగు వారు భావించలేదు. ఆంధ్ర నాయకులందరు కాంగ్రెస్‌లో వుండి, దాని నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడం వల్ల ఆంధ్రోద్యమం గురించి పెద్దగా పట్టించుకోలేకపోయారు. 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్‌ ప్రధాని అట్లీ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ మరి 16 నెలలలో బ్రిటన్‌ భారత దేశానికి స్వాతంత్య్ర ప్రదానం చేసి, వైదొలగుతుందని ప్రకటించారు!

కాబట్టి, ఇక ఆంధ్రులు "స్వరాష్ట్రం" కోసం కృషిని తీవ్రతరం చేయవలసిన సమయం ఆసన్నమైనదని వివరిస్తూ "స్వరాజ్యంలో స్వరాష్ట్రం" అన్న శీర్షికతో అప్పటిలో మద్రాసు నుంచి వెలువడే "మాతృభూమి"అనే రాజకీయ వారపత్రికలో నా ప్రప్రథమ వ్యాసం రాశాను! అది 1947 మార్చి నెల.

నా ప్రథమ ఉపన్యాసం

ఆ తరువాత ఆరు నెలలకు - 1947 ఆగస్టు 15న - భారతదేశానికి స్వాతంత్య్ర ప్రదానం జరిగింది. అటు పిమ్మట 1947 అక్టోబర్‌లో గన్నవరం తాలూకా కాంగ్రెస్‌ కమిటి సమావేశంలో నా ప్రథమ ఉపన్యాసం చేశాను. అప్పటికి నా వయస్సు 14-15 సంవత్సరాలే! అయితేనేమి, అంతకు పూర్వం డిబేటింగ్‌ సొసైటీలో మాట్లాడిన అలవాటు వుండడం వల్ల నేను జంకూ గొంకూ లేకుండ నా ఉపన్యాస జీవిత "అరం గ్రేటం" చేశాను. ఆ సభలో ఆ తరువాత పి.సి.సి. అధ్యక్షులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పని చేసిన స్వాతంత్య్ర సమరయోధులు "ఉక్కు" కాకాని వెంకటరత్నం, శ్రీ పేట బాపయ్య, "మాతృ భూమి" పత్రిక వ్యవస్థాపకులు శ్రీ అన్నే అంజయ్య ప్రభృతులున్నారు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఈ 65 సంవత్సరాలుగా నా కలం నిర్విరామంగా ఆడుతూనే వుంది; నా గళం మ్రోగుతూనే వుంది!

అప్పటిలో పామర్రు నుంచి మా మకాం కృష్ణాజిల్లా గన్నవరం మారింది. అందువల్ల, నేను ఉపన్యాసకుడుగా గళమెత్తింది పామర్రు అయితే, నాకు జర్నలిస్టుగా రూపు కట్టింది గన్నవరం! అక్కడి నుంచే నేను పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాయడం ప్రారంభించాను. ముందు అప్పటిలో మద్రాసు నుంచి వెలువడే "ఆంధ్రప్రభ", "ఆంధ్రపత్రిక" దినపత్రికలకు సంపాదక లేఖలు రాసేవాడిని. అవి స్థానిక సమస్యలపై కాదు, రాజకీయ సమస్యలపైనే! అంతర్జాతీయ సమస్యలపై కూడా.

1947 ఆగస్టు 15న ఏర్పడిన స్వతంత్ర భారత తొలి మంత్రివర్గంలో ఒక్క ఆంధ్రునికైనా కూడా ప్రాతినిధ్యం లభించకపోవడం శోచనీయమని, "స్వాతంత్య్రోద్యమంలో అగ్రశ్రేణిలో నిలబడి అశేష త్యాగాలు చేసిన ఆంధ్ర జాతికివ్వవలసిన గౌరవమిదేనా? ఆంధ్రులలో కేంద్ర మంత్రిత్వం నిర్వహించగల దక్షులు కాంగ్రెస్‌ హై కమాండ్‌కు కానరాలేదా?" అని ప్రశ్నిస్తూ, "స్వతంత్ర భారతంలో ఆంధ్రులకు అన్యాయం" అన్న శీర్షికతో "ఆంధ్రప్రభ"లో ఒక లేఖ రాశాను. అది అప్పటిలో "అనన్య ప్రచారం గల ఆంధ్ర దినపత్రిక" కావడం వల్ల నా లేఖ సంచలనమే కలిగించింది! అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర సమస్యలను గురించి నాకు చేతనైన రీతిలో ఆందోళన చేస్తూనే వున్నాను.

ముఖ్యంగా తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇవ్వాలని, తెలుగును భారతదేశంలో హిందీ తరువాత రెండవ అధికార భాష చేయాలన్న ఉద్యమాలను 2003 మే నెలలో నేనే ప్రారంభించానని వినమ్రతకు భంగం లేకుండా నేను చెప్పుకొనవచ్చు.

"గార్డియన్‌ ఆఫ్‌ తెలుగు"

Naa Kalam - Naa Galam Page 15 Image 0001
Naa Kalam - Naa Galam Page 15 Image 0001

1954లో ఇండియా మాజీ గవర్నర్‌ జనరల్‌ రాజాజీ (మహాత్మా గాంధి కడపటి కుమారుడు దేవదాస్‌ గాంధి ఆయన అల్లుడు) ఏదో ఒక సభలో మాట్లాడుతూ భారతదేశంలో ఉత్తమ భాషలుగా హిందీ, బెంగాలీ, తమిళ భాషలను మాత్రమే పేర్కొన్నారు కాని తెలుగు ప్రసక్తే లేదు!

ఆయనను తప్పుపడుతూ ఆయనకు లేఖ రాశాను. తెలుగును "ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌"గా పాశ్చాత్యులే పేర్కొన్నారని, తెలుగును భారతదేశానికి అధికార భాషగా చేయనగునని ప్రఖ్యాత బ్రిటీష్‌ జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జె.బి.ఎస్‌. హాల్డేన్‌ ఉద్ఘోషించారని, అలాంటి తెలుగు భాషను మీరు విస్మరించడం శోచనీయమని రాశాను.

అందుకు ఆయన సమాధానం రాస్తూ తాను కేవలం ఉదాహరణ ప్రాయంగానే కొన్ని భారతీయ భాషలను పేర్కొన్నానని, వాటిలో తెలుగుభాష లేకపోవడం కేవలం యాదృచ్ఛికమేనని ఆయన పేర్కొన్నారు. అందుపై నేను తిరిగి లేఖ రాస్తూ "ఉదాహరణ ప్రాయంగా పేర్కొనే భాషలలోనైనా తెలుగుకు ప్రథమస్థానమివ్వాలని రాస్తూ, "ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌" నానుడిని తిరిగి ఉల్లేఖించాను. అలాంటి తెలుగును విస్మరించం వుద్దేశపూర్వకమేనని స్పష్టం చేశాను.

"నా ప్రియమైన తెలుగు భాషా రక్షకుడా! ("మై డియర్‌ గార్డియన్‌ ఆఫ్‌ తెలుగు") ఈ విషయంలో మన ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదన్న అంగీకారానికి వద్దా" మని రాజాజీ ప్రత్యుత్తరమిచ్చారు.

"ప్రతిభకు పిలుపు"

నేను కృష్ణాజిల్లా గన్నవరం నుంచి నాజర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించానని ఇంతకు పూర్వమే పేర్కొన్నాను.

1951 చివరలో గన్నవరం ప్రక్కనే వున్న కేసరపల్లికి ఆచార్య ఎన్‌.జి. రంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పటిలో ఆయన సొంత పార్టీ కృషి కార్‌ లోక్‌ పార్టీ అధ్యక్షుడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత రైతు నాయకుడు. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో బలీయమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించారు. అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌కు ఆయన వ్యవస్థాపకులు. ఆయన స్వాతంత్య్రోద్యమంలో జైలుకు వెళ్లినప్పుడు ఆయన సతీమణి శ్రీమతి భారతీదేవి రంగా ఆ సంస్థకు అధ్యక్షులుగా వున్నారు.

ఆచార్య రంగా తన స్వస్థలం గుంటూరుజిల్లా నిడుబ్రోలులో రైతాంగ విద్యాలయాన్ని నెలకొల్పి, దానిలో ఎందరో యువరైతు నేతలకు శిక్షణ ఇచ్చారు. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక మహాశక్తి. గొప్ప ఉపన్యాసకులు.

కేసరపల్లి సభకు నేను ఆయన ఉపన్యాసాన్ని వినడానికి వెళ్లినప్పుడు ఆయన నన్ను చూచి, "మీరు 'వాహిని'పత్రికలో పనిచేద్దురు గాని, విజయవాడ రండి" అని చెప్పారు. నేను చాలా చిన్నవాడినైనా ఆ నాటి అతిరథ, మహారథులైన మహానాయకులు అందరు - ఒక్క "ఆంధ్రకేసరి" ప్రకాశం గారు మినహా - నన్ను "ఏమండీ, మీరు" అనే వ్యవహరించేవారు. ఆ తరువాత నా కంటె చిన్నవారిని "ఏమండీ", "మీరు" అనడం వారి వద్దనే నేర్చుకున్నాను.

ఇక "వాహిని" కథ. అది ఆచార్య రంగా గారి తెలుగు వారపత్రిక. ఆయన కర్షక, రాజకీయ ఉద్యమాల ప్రచారానికి వుద్దిష్టమైన పత్రిక. చాలాకాలం మద్రాసు నుంచి, తరువాత విజయవాడ నుంచి వెలువడేది. ఆ పత్రికకు 1937లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు పండిట్‌ నెహ్రూ ప్రారంభోత్సవం చేశారు. చాలాకాలం నడిచిన తరువాత అది 1970 దశకంలో మూతపడింది.

అయితే, ఆ పత్రికలో నేను సబ్‌ ఎడిటర్‌గా పనిచేసింది పట్టుమని రెండు నెలలైనా లేదు. ఎందువల్ల నంటే, కేవలం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి అనుకూలంగా రాయవలసిన పత్రిక; ఆ పత్రిక స్థాపనోద్దేశమే అది. అయినా, ఆ పత్రికే నా పాత్రికేయ జీవితానికి తొలిమెట్టు. అది 1951 చివరి మాట.

1952 ప్రారంభంలో ఒక రోజున విజయవాడ గాంధీనగర్‌లో ఏదో పెద్ద ఊరేగింపు వస్తూ వుంటే, ఆ జన సమ్మర్దాన్ని తప్పించుకోడనికి నేను ప్రక్కనే వున్న ఒక పెద్ద హోటల్‌ ముందు నిలబడ్డాను. అక్కడే శ్రీ చలసాని రామారాయ్ అనే ఒక "ఎమ్‌.ఎన్‌. రాయ్ అభిమాని" కూడా ఆ ఊరేగింపును తిలకిస్తున్నారు. మాటల సందర్భంలో ఆయన తాను "ప్రతిభ" అనే వారపత్రికను ప్రారంభిస్తున్నట్టు, దానికి నన్ను ఎడిటర్‌గా వుండాలని కోరారు. అది రాజకీయ వారపత్రిక; స్వతంత్ర వారపత్రిక. "వాహిని"లో చేరక పూర్వం నేను "ఫ్రీలాన్స్‌" జర్నలిస్టుగా శ్రీ ఖాసా సుబ్బారావు గారి సంపాదకత్వాన మద్రాసు నుంచి వెలువడిన "తెలుగు స్వతంత్ర" వారపత్రికలో దాదాపు రెండు సంవత్సరాలు వారం వారం విడవకుండా రాజకీయ వ్యాసాలు రాసేవాడిని. ఆ పత్రిక ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూచేవాడిని; నా వ్యాసం ఎప్పుడు చదువుదామా అని చాలా మంది పాఠకులు నిరీక్షించేవారని సాక్షాత్తు ఆ పత్రిక సహాయ సంపాదకుడు శ్రీ గోరా శాస్త్రి నాతో ఆ తరువాత స్వయంగా చెప్పారు.

నా పేరు ఫలానా అని శ్రీ రామారాయ్‌తో చెప్పేసరికి అంతకు పూర్వం "తెలుగు స్వతంత్ర"లో నా వ్యాసాలు చాలా చదివి వున్నందున, ఆయన తన పత్రికకు ఎడిటర్‌గా పనిచేయాలని కోరారు. నేను వెంటనే అంగీకరించాను. అప్పటిలో నేను పని చేసిన పత్రికలన్నింటిలో కూడా అలా ఆ పత్రికల స్థాపకులు నన్ను ఎక్కడో చూడ్డం, నన్ను తమ పత్రికలోకి సంపాదకుడుగా పని చేయాలని కోరడం జరుగుతూ వచ్చింది. అలా అప్పటికి "వాహిని", "ప్రతిభ"లలో నాకు అవకాశం వచ్చింది.

"బోయ్ ఎడిటర్‌"

"ప్రతిభ"లో ఎడిటర్‌గా చేరేటప్పటికి నా వయస్సు 19 సంవత్సరాలు; అప్పటికి నేను జర్నలిజంలోకి వచ్చి, అయిదు సంవత్సరాలు. అందువల్ల, నన్ను "బోయ్ ఎడిటర్‌" (బాల సంపాదకుడు) అనే వారు. "ప్రతిభ"లోవున్నది సంవత్సరమే. అప్పటిలో ఇప్పటి ఆంధ్రప్రాంత జిల్లాలు మద్రాసు రాష్ట్రంలో వుండేవి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ (శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి).

ఆయన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకి. ఆంధ్రులు కోరుతున్న నందికొండ (నాగార్జున) ప్రాజెక్టుకు వ్యతిరేకి. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరిగితే, ఆంధ్రులు, తమిళుల మధ్య రక్తపాతం జరుగుతుందని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల మంత్రికి ఆయన రహస్యలేఖ రాసినట్టు ప్రతీతి. అంతేకాక, నందికొండ ప్రాజెక్టును కాదని, తమిళులకు వుపకరించే కృష్ణా - పెన్నార్‌ ప్రాజెక్టుకు ఆయన అనుకూలుడు. ఆయనకు తీవ్ర రాజకీయ ప్రత్యర్థి, అప్పటి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు "ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశం. ప్రకాశం వైఖరిని సమర్ధిస్తూ నేను "ప్రతిభ"లో ఎన్నో వ్యాసాలు రాశాను. అవి ప్రకాశం గారికి నచ్చేవి. అందువల్ల, తాను పెట్టబోయే "ప్రజా పత్రిక" తెలుగు దినపత్రికకు నన్ను సహాయ సంపాదకుడుగా తీసుకోవాలని ఆయన వుద్దేశం.

డాక్టర్ టి.వి.ఎస్‌.

ఈ విషయంలో మధ్యవర్తి అప్పటి విజయవాడ మున్సిపల్‌ చైర్మన్‌, ఆ తరువాత రెండుసార్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభ్యులైన డాక్టర్ టి.వి.ఎస్‌. చలపతిరావు గారు. డాక్టర్ టి.వి.ఎస్‌. ఉద్దండ రాజకీయవేత్త. గొప్ప వక్త. రచయిత. ఇంగ్లీషు, తెలుగు భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన బహుముఖ ప్రజ్ఞానిధి. ఎవ్వరినీ లెక్కచేయని స్వతంత్ర వ్యక్తిత్వం. వైద్యశాస్త్రంలో చదివింది ఎల్‌.ఎమ్‌.పి. అయినా, వైద్యంలో ఘటికుడు. ఇప్పటి ఎందరో అత్యున్నత డిగ్రీలున్న చాలా మంది వైద్యులకంటె ఆయనకు గల రోగనిదానశక్తి, చికిత్సా రీతి ప్రశంసనీయమైనవి. ఆయన "ఆంధ్రకేసరి" ప్రకాశం గారికి అత్యంత సన్నిహితులు. అంతేవాసి.

ఆయన ఒక రోజున నన్ను పిలిచి "పంతులుగారు మిమ్మల్ని తమ "ప్రజాపత్రిక"లోకి రమ్మంటున్నారు" అని చెప్పారు. (ప్రకాశంగారిని పెద్దా చిన్నలందరు "పంతులు గారు" అనే వ్యవహరించేవారు; సంబోధించేవారు).

"ఇప్పుడు ప్రతిభ"లో ఎడిటర్‌గా వున్నాను కదా!" అన్నాను

"అది చిన్న పత్రిక. పంతులు గారి పత్రిక దినపత్రిక. అందులో మీరు జర్నలిస్టుగా రాణిస్తారు. మీరు వెళ్లడం మంచిదని, మీ అభివృద్ధికి తోడ్పడుతుందని నావుద్దేశం". నేను కొంచెం ఆలోచించి "ఇప్పుడు నేను పని చేసే "ప్రతిభ"కు నాకు ప్రత్యామ్నాయంగా మరొకరిని కుదిర్చి వస్తాను" అని చెప్పాను.

అయితే, ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు ఆలస్యమైనది. ఈ లోగా మళ్లీ "ఆంధ్ర కేసరి" డాక్టర్ టి.వి.ఎస్‌.కు ఫోన్‌ చేశారు! కుటుంబరావును పంపించలేదేమని! నేను నాలుక కరుచుకుని, "ప్రతిభ"ను యజమాని రామారాయ్ కి అప్పగించి మద్రాసు పయనం కట్టాను. అంతటి "ఆంధ్ర కేసరి"కి దగ్గరగా వెడుతున్నందుకు నన్ను జర్నలిస్టుగాను, వక్తగాను రూపొందించిన గన్నవరం ఆనందంతో ఉప్పొంగింది! నాకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు జార్జి కారొనేషన్‌ క్లబ్‌లో వీడ్కోలు సమావేశం జరిపారు.

"ఆంధ్రకేసరి" శిష్యుడనైనందుకు ఆయన బాల్యంలోని ఒక పోలిక నాకు కూడా వచ్చింది. ఆయనకు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గురువుగా, మిత్రుడుగా, అడుగడుగునా మార్గదర్శిగా వున్నారు. నాకు గన్నవరంలో ఎందరో ఆత్మీయులైన అభిమానులు, మిత్రులలో ఒకరు, ఇక్కడ పేర్కొనదగిన వారు శ్రీ దాసరి పాపారావు. అడుగడుగునా నాకు ప్రోత్సాహ ఉత్సాహాలు కల్పించేవారు. నన్ను ఏవైనా రాజకీయ సభలకు తీసుకువెడితే, ఆయనే! అప్పటిలో నా మాన్‌ ఫ్రైడే ఆయనే!

ఇక మద్రాసు వెళ్లగానే సరాసరి "ఆంధ్రకేసరి" వుంటున్న మౌంట్‌ రోడ్‌లోని ప్రభుత్వ భవనంలోకి వెళ్లాను. ప్రకాశం గారు సాదరంగా, వాత్సల్యంగా పలకరించారు. "ఇక్కడి పద్ధతి ప్రకారం నిన్ను "ప్రజాపత్రిక" నిర్వాహకులు నలుగురు ఇంటర్‌వ్యూ చేస్తారు. మధ్యాహ్నం "ప్రజాపత్రిక" ఆఫీసుకురా!" అని చెప్పారు.

అక్కడ నన్ను పరీక్షించింది ఎవరో తెలుసాండీ? ఆంధ్రకేసరి ప్రకాశం, అంతకు పూర్వం మద్రాసు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన మహర్షి బులుసు సాంబమూర్తి, మద్రాసు మేయర్‌గా పనిచేసిన సామి వెంకటాచలం చెట్టి, "ప్రజాపత్రిక" మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్లపాటి అప్పారావు.

వారి ప్రశ్నలకు నేను సముచిత సమాధానాలు చెప్పిన తరువాత "మీరు ఇది వరకు రాసిన వ్యాసం ఏదైనా వుంటే చూపించవలసిందిగా" అడిగారు. నేను "మద్రాసు వలదన్న తెలుగు మంత్రి నోటికి తాళం" అన్న హెడ్డింగ్‌తో వున్న "ప్రతిభ" సంచికను చూపించాను. ఆ హెడ్డింగ్‌ వారికి చాలా నచ్చింది! అప్పటి మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కావాలని "ఆంధ్రకేసరి" పట్టుదల కాగా, మద్రాసు మంత్రివర్గంలోని తెలుగుమంత్రులు మద్రాసు లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించాలని, అలా అయితే "ఆంధ్రరాష్ట్రం" త్వరగా వస్తుందని వాదించసాగారు. అందువల్ల, తమ వాదానికి అనుకూలమైన ఆ హెడ్డింగ్‌ ఆ ఇంటర్‌ వ్యూ కమిటీకి నచ్చి, నన్ను వెంటనే వెళ్లి "ప్రజాపత్రిక"లో చేరమన్నారు.

ఆ పత్రికకు ప్రకాశం గారు చీఫ్‌ ఎడిటర్‌, ఆయన అనుంగు శిష్యుడు, ప్రముఖ రచయిత శ్రీ క్రొవ్విడి లింగరాజు అసోసియేట్‌ ఎడిటర్‌. నేను ఒక సహాయ సంపాదకుణ్ణి. ఆ సంపాదకవర్గంలో ఇద్దరు, ముగ్గురు మినహాయిస్తే, తక్కిన వారందరు పత్రికా రచనకు కొత్తవారే. నేను అప్పటికే ఏడేళ్లుగా పాత్రికేయుడుగా, "వాహిని"లో ఉపసంపాదకుడుగా, "ప్రతిభ"లో సంపాదకుడుగా పనిచేసి వుండడం వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వార్తలన్నింటికి నన్ను ఎడిటర్‌గా నియమించారు.

ఆంధ్రకేసరికి కార్యదర్శిని!

నా జీవితంలో మరపురాని, శాశ్వతంగా గుర్తుండిపోయే సంఘటన అప్పుడే జరిగింది. ఒక రోజున "ప్రజాపత్రిక" ఆఫీసుకు వచ్చిన పంతులు గారు నన్ను పిలిపించారు. ఏమై వుంటుంది? నాకిచ్చిన ఆంధ్రప్రాంత వార్తల ఎడిటింగ్‌లో ఏదైనా తప్పు పడిందా? ఎవరైనా ఫిర్యాదు చేశారా? అన్న ఆందోళనతో కూడిన ఆలోచనతో ఆయన గదిలోకి వెళ్లాను.

"కుటుంబరావ్‌! నా కార్యదర్శి కొండపి నైట్‌ కాలేజీలో "లా" చదువుతున్నాడు. అందువల్ల, ఒక సంవత్సరం పాటు అతనికి సెలవు కావలసి వచ్చింది. అందువల్ల నువ్వు సాయంత్రం నాలుగు గంటల వరకు పత్రిక పని చూసి, ఆ తరువాత రాత్రి 9,10 గంటల వరకు కొండపి చేసే పని నువ్వు చూడు" అని అన్నారు!

నాకు ఆందోళన కలిగింది! "ఆంధ్రకేసరి"కి దూరంగా వుండి, నా పని నేను చేసుకుంటూ, అప్పుడప్పుడు అయిదు నిమిషాలో, పది నిమిషాలో ఆయనను కలుసుకుని మాట్లాడ్డం వేరు. కాని, రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9,10 గంటల వరకు ఆ మహానాయకుని సమక్షంలో ఆయనకు సహాయకుడుగా పనిచేయడం మాటలా?

"ఆంధ్రకేసరి"లో ఒక విశేషం వుంది. ఆయన మందలించినా, మండిపడినా పెద్ద వారిపైనే! యువకులను ఆప్యాయంగా, వాత్సల్యంతో "ఏమోయ్! ఏమయ్యా!" అని సంబోధించేవారు. ఇక, ఆయనకు చిర పరిచితులైన పెద్దవారిని "ఏరా" అని సంబోధించేవారు! అట్టి వారిలో ఎవరినైనా, ఎప్పుడైనా "ఏమండీ!" అని కాని, పేరు తరువాత "గారు" అని కాని పిలిస్తే, ఆ పెద్ద మనిషికి ఆ రోజు ఏదో మూడిందన్న మాటే! ఆయనతో చివాట్లకు దోసిలి పట్టవలసిందే!

మద్రాసులో ఆ పది నెలలలో నా జోడు ఉద్యోగాల జీవితం సాఫీగా, సజావుగా నడిచిపోయింది. అప్పటికి నా వయస్సు 21,22 సంవత్సరాలే!

ఇంతలో "ప్రజాపత్రిక" ఆగిపోయింది! ప్రకాశం గారు విజయవాడ - గుంటూరు ప్రాంతానికి బదులు కర్నూలును ఆంధ్రరాష్ట్ర రాజధాని చేశారన్న బాధతో ఆ పత్రిక యజమాని శ్రీ కర్లపాటి అప్పారావు పత్రికను ఆకస్మికంగా మూసివేశారు! విజయవాడ రాజధాని అయితే అప్పారావు గారికి ప్రయోజనం. ఆ ప్రాంతంలో ఆయనకు చాలా స్థలాలున్నాయి. రాజధాని వస్తే వాటి విలువ విపరీతంగా పెరిగిపోయేది! మరి, ప్రకాశంగారు 1937లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రాయలసీమ నాయకుల కోర్కెపై - రాజధానిని కర్నూలు, హైకోర్టును గుంటూరులో పెట్టవలసివచ్చింది.

ఔషధ సేవకు అయిదు రూపాయలు లేని "ఆంధ్రకేసరి"

అప్పుడే అత్యంత దయనీయమైన, తలచుకుంటే ఇంతకాలమైన తరువాత, ఇప్పుడు కూడా నాకే కాదు, ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లే ఒక సంఘటన జరిగింది. అది 1953 జూన్‌ 2వ తేది రాత్రి 8 గంటల సమయం. నేను ప్రకాశం గారి మద్రాసు మౌంట్‌రోడ్‌ నివాసం ముందు పచార్లు చేస్తున్నాను, ఆయన నుంచి ఎప్పుడు పిలుపువస్తుందోనని!

ఇంతలో ప్రకాశం గారి రెండవ కుమారుడు హనుమంతరావు నా వద్దకు వచ్చి, "కుటుంబరావు గారూ! మీ దగ్గర అయిదు రూపాయలున్నాయా? నాన్నగారికి మందుకొనాలంటే డబ్బు లేదు" అన్నారు. నేను ఒక్కసారి నిర్విణ్ణుణ్ణి అయ్యాను!

ప్రకాశంగారికి నంజు వ్యాధి వుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక ఔన్సు బ్రాంది తీసుకొనకపోతే, తెల్లవారే సరికి కాళ్లు అరటి స్తంభాలవలె లావై పోయేవి! బారిష్టర్‌గా అన్ని లక్షలు సంపాదించి, అప్పటికి ఒకసారి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన ఆ మహాదేశ భక్తునికి, త్యాగధనునికి చివరికి మందు కొనడనికి అయిదు రూపాయలు లేవంటే ఏమనుకోవాలి? ఎంతటి హృదయ విదారకమైన సన్నివేశం! నేను వెంటనే జేబులో నుంచి అయిదు రూపాయలు తీసి యిచ్చాను. నా వద్ద వున్నది కూడ ఏడున్నర రూపాయలే!

ఉద్యోగం కాదు, తపస్సు

"ప్రజా పత్రిక"ను మూసివేయగానే తిరిగి అప్పటి నా స్వస్థలం గన్నవరం వచ్చి వేద్దామన్న సన్నాహాలలో వున్నాను. ఈ మధ్యలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అప్పటి "ఆంధ్రపత్రిక" సంపాదకులు శ్రీ శివ లెంక శంభుప్రసాద్‌ నన్ను తమ పత్రికలో పనిచేయవలసిందిగా సూచించారు. నిజమే! అది సదవకాశమే. సాక్షాత్తు "దేశోద్ధారక" కాశీనాథుని నాగేశ్వరరావు గారు బొంబాయిలో 1908లో స్థాపించిన పత్రిక అది. వారపత్రికగా ప్రారంభమైన ఆ పత్రికను 1914లో దిన పత్రికగా మార్చి, మద్రాసు తీసుకువచ్చారు. దానిలో పని చేయడం గొప్ప అవకాశమే!

కాని, ఆ పత్రిక అంతకు క్రితం వరకు నేను కార్యదర్శిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం గారికి ప్రతికూలం! ప్రకాశం గారి అప్పటి రాజకీయ ప్రత్యర్థి కళా వెంకటరావు గారికి అనుకూలం.

"అయ్య వార్లూ! (అప్పటిలో శంభు ప్రసాద్‌ గారిని గౌరవంగా అలా సంబోధించేవారు) నేను ఇప్పటి వరకు ప్రకాశం గారి పత్రికలోను, ఆయన కార్యదర్శి గాను పని చేశాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని మన "ఆంధ్రపత్రిక"లో చేరితే, నేను ప్రకాశం గారికి వ్యతిరేకంగా రాయవలసివస్తుంది కదా! అది ఆత్మవంచన అవుతుంది. ప్రకాశం గారికి అనుకూలంగా రాసిన ఈ కలంతో ఆయనకు వ్యతిరేకంగా రాయడం, లేదా ఆయనకు ప్రతికూలంగా పనిచేయడం నా వల్ల కాదు. నాకు జర్నలిజం ఒక ఉద్యోగం కాదు. ఒక తపస్సు. మీ అభిమానం నా జీవితంలో మరచిపోలేను". అని వారికి చెప్పి, నేను తిరిగి గన్నవరం వచ్చివేశాను! తిరిగి యథాప్రకారంగా ఫ్రీ లాన్స్ జర్నలిస్టుని. "తెలుగు స్వతంత్ర"కు, "ఆంధ్రప్రభ"కు, "ఆంధ్రపత్రిక"కు వ్యాసాలు రాయసాగాను.

"ప్రజాపత్రిక" నుంచి "ప్రజాసేవ"లోకి

1955 చివరిలో నేను విజయవాడ సత్యనారాయణపురంలో వున్న మా చెల్లెలు సౌందర్యవతి ఇంటి నుంచి పున్నమ్మతోటలో వున్న మా అన్నగారు సుందర రామారావు గారింటికి వస్తున్నాను. అది రెండు, మూడు కిలోమీటర్ల దూరం వుండవచ్చు. అప్పటిలో నడకే. సైకిలు రిక్షాపై రావచ్చు. కాని, దానికి రెండణాలో, మూడణాలో ఇచ్చుకోవాలి కదా! అంత ఎక్కడ వుంది? నేను గాంధినగరంలోని ఎస్‌.కె.పి.వి.వి. హిందూ హైస్కూలు ముందు నుంచి నడుస్తుండగా, అకస్మాత్తుగా వెనుక నుంచి వస్తున్న ఒక కారు నా ప్రక్కనే ఆగింది. దానిలో నుంచి "కుటుంబరావు గారూ!" అన్న పరిచితమైన గొంతు నుంచి వచ్చిన పిలుపు వినిపించింది. కారులోకి చూస్తే, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్ టి.వి.ఎస్‌. చలపతిరావు గారు! "కారెక్కండి" అన్నారాయన. "ఈ పూట నాతో కలిసి మా ఇంటిలో భోజనం చేద్దురు గాని" అని అన్నారు. ఇద్దరం భోజనం చేస్తుండగా, తాను ఒక తెలుగు వారపత్రిక పెడుతున్నట్టు, దానికి నన్ను ఎడిటర్‌గా వుండమని కోరారు. నేను అప్పటికి ఖాళీగానే వున్నాను కాబట్టి, వెంటనే సంతోషంగా అంగీకరించాను.

చలపతిరావు గారు అంతకు పూర్వం నేను ప్రకాశంగారి "ప్రజాపత్రిక"లోకి వెళ్లడంలో నిర్వహించిన పాత్రను ఇంతకు పూర్వమే పేర్కొన్నాను. ఆయనకు నా పట్ల సద్భావం, సానుభూతి వుండానికి కారణాలున్నాయి.

1951 జూలైలో విజయవాడలో "ఆంధ్రకేసరి" ప్రకాశం గారి కంచు విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయనది ప్రముఖ పాత్ర. దాదాపు రెండు లక్షల మంది హాజరైన ఆ సభలో నేను లిఖిత పూర్వకమైన, ఆవేశపూరితమైన ఉపన్యాసాన్ని చదివాను. నా ఉపన్యాసం ఆ సభా సదులతోపాటు డాక్టర్ గారికి బాగా నచ్చింది. ఆ సభకు అధ్యక్షుడు పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ పి.సి. ఘోష్‌ కాగా, కేంద్ర మంత్రి, ప్రధాని నెహ్రూకు అనుంగు మిత్రుడు రఫీ అహమ్మద్‌ కిద్వాయ్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రదేశంలోని రాజకీయ అతిరథ, మహారథులెందరో ఆ సభలో పాల్గొన్నారు.

"నీలం సంజీవరెడ్డికి బహిరంగ లేఖ"

రెండవది - 1954లో అమెరికా సందర్శనకు మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్ చలపతిరావు గారికి ఆహ్వానం రాగా, అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి - హోమ్‌మంత్రి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డి డాక్టర్ గారికి పాస్‌పోర్టు రాకుండ అవరోధించారని మా అందరికీ అసంతృప్తి. అప్పటిలో చలపతిరావు గారికి వీడ్కోలు సభ జరగగా, దానిలో నేను కూడా ఉపన్యాసకుణ్ణి. అయితే, తీరా డాక్టర్ గారు అమెరికా బయలుదేరే సమయానికి ఆయన పాస్‌పోర్టును తొక్కిపట్టారు. ఇంకేమి వెడతారు?

ఈ సంఘటన నాకు బాగా బాధ కలిగించింది. నేను అప్పుడు వ్యాసాలు రాస్తున్న "తెలుగు స్వతంత్ర"లో "శ్రీ నీలం సంజీవరెడ్డికి బహిరంగ లేఖ" అన్న శీర్షికతో శ్రీ సంజీవరెడ్డి చర్యను తీవ్రంగా విమర్శిస్తూ ఒక బహిరంగలేఖ రాశాను. ఆ వ్యాసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. శ్రీ సంజీవరెడ్డికి అసంతృప్తి, డాక్టర్ గారికి సంతోషం కలిగించింది. డాక్టర్ గారికి నాపట్ల అభిమానం కలగడానికి అది ముఖ్య కారణం.

ఇక, పత్రిక సంగతి. దానికి ఏ పేరు పెట్టాలని డాక్టర్‌గారు, నేను ఆలోచించాం. "ప్రజాజ్యోతి" అన్న పేరును గురించి ఆలోచించాం. అది సామాన్య పాఠకులకు నోరు తిరగడానికి కొంచెం ఇబ్బందిగా వుంటుందేమో అనుకున్నాం. చివరికి "ప్రజాసేవ" అన్న పేరు బాగుందనుకున్నాం. నా పేరుతోనే ఆ తెలుగు వారపత్రికకు డిక్లరేషన్‌ తీసుకున్నాము. పత్రికకు ఆయన చీఫ్‌ ఎడిటర్‌ అయితే, నేను ఎడిటర్‌ను. 1955 డిసెంబర్‌ 16న ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఆత్మబలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి నాడు "ప్రజాసేవ"కు ప్రారంభోత్సవం. ప్రారంభకులు ప్రముఖ గాంధేయవాది మాత్రమే కాక, మహాత్మాగాంధికి అత్యంత సన్నిహితుడు ఆచార్య జె.సి. కుమరప్ప. సభాధ్యక్షులు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, ఆ తరువాత "లోక్‌ నాయక్‌"గా జగత్ప్రసిద్ధుడైన శ్రీ జయప్రకాష్‌ నారాయణ్‌. డాక్టర్ గారు ప్రకాశంగారి అనుంగు శిష్యుడే కాక, గాంధేయవాది. అందువల్ల, ఆ మహా మహులిద్దరిని ఆహ్వానించారు.

పత్రిక వ్యవస్థాపకులు డాక్టర్ చలపతిరావు గారు రాజకీయంగా అతివాది. అందువల్ల, పత్రికలో ఆనాటి రాజకీయాలను తీవ్రంగా విమర్శించే వ్యాసాలు, రాజకీయ విశ్లేషణా వ్యాసాలు ఎక్కువగా వుండేవి. సినిమా పేజీ ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రఖ్యాత పార్లమెంటేరియన్‌ శ్రీ తెన్నేటి విశ్వనాథం ఆ పత్రికలో "శాసన" అన్న మారు పేరుతో కొంతకాలం వారం వారం జాతీయ, అంతర్జాతీయ విశేషాలపై, తన వ్యాఖ్యలతో వ్యాసాలు రాసేవారు. దాదాపు అయిదు సంవత్సరాలు దిగ్విజయంగా, నిరాటంకంగా నడిచిన ఆ పత్రికకు రాష్ట్ర వ్యాప్తంగా మంచిపేరు, ప్రాచుర్యం లభించాయి.

కలకత్తాలో కనిపించిన "పెళ్లి కూతురు"

'ప్రజాసేవ'లో వున్నప్పుడే కలకత్తా ఆంధ్రా అసోసియేషన్‌ వారు నాకు సన్మానం తలపెట్టారు. అది 1959 జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవ సందర్భం. నాతోపాటు గన్నవరం ప్రక్కనే వున్న బుద్ధవరం కరణంగారి అమ్మాయి, "నాట్యరాణి" కృష్ణ కుమారికి కూడా సన్మానం. ఆమెకు అప్పటికి దాదాపు 18 సంవత్సరాల వయస్సు. అప్పటికే ఢిల్లీ, మద్రాసు, హైదరాబాద్‌ మొదలైన నగరాలలోను, చాలా పట్టణాలలోను దాదాపు వెయ్యి వరకు కూచిపూడి నృత్య ప్రదర్శన లిచ్చింది. 1954లో ఢిల్లీలోని సప్రూ హౌస్‌లో ఆమె నృత్య ప్రదర్శనను ప్రధాని నెహ్రూ, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రభృతులు తిలకించి, ప్రశంసించారు. ప్రధాని నెహ్రూ ఆ మరునాడు ఉదయం కృష్ణకుమారిని, ఆమెతో వున్న నాట్య బృందాన్ని తన నివాసంలో అల్పాహారం విందుకు ఆహ్వానించారు.

ఆమె చాలా చలాకీ అమ్మాయి. నాట్య కళాకారిణి కావడం వల్ల సహజంగానే బెరుకూ బెదురూ లేకుండ మాట్లాడేది. కలకత్తా సన్మానానికి విజయవాడ నుంచి రైలులో కృష్ణకుమారి, ఆమె తాతగారు, తండ్రిగారు, నాట్య బృందం అందరం కలిసే వెళ్లాము. అప్పటిలో విజయవాడ నుంచి కలకత్తా రైలు ప్రయాణమంటే సుదీర్ఘంగానే వుండేది. ఒక పగలు, రెండు రాత్రుళ్లు! మార్గం మధ్యలో రైలులో ఆమెను ఒక పాట పాడవలసిందిగా - ఉబుసు పోకకు - నాట్య బృందంలోని వారు కోరారు. ఆమె "మిస్సమ్మ" లోని "ఏమిటో ఈ మాయా! ఓ వెన్నెల రాజా!" అనే పాట పాడింది. ఆమె నాట్యకత్తె కాని పాట కత్తె కాదు. అయినా, శ్రావ్యంగానే వుంది. ఆ పాటలో "చెలిమి కోరుచూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా!" అన్న చరణం పాడేటప్పుడు ఆమె నావంక భావగర్భితంగా చూసింది! ఆ సంకేతం నాకేమీ అర్ధం కాలేదు!

ఆ తరువాత "నీ వుండేదా కొండపై, నా స్వామి నేనుండే దీనేలపై, ఏ లీలా సేవింతునో, దూరానానైనా కనే భాగ్యమీవా! నీ రూపు నాలో సదా నిల్పనీవా! ఏడుకొండలపైన వెలసిన దేవా! నా పైన దయచూపవా!" అన్న పాదాలు పాడేటప్పుడు నావంక రెండు, మూడుసార్లు ఓర చూపులు చూసింది! అప్పటికీ నాకేమీ అర్థ కాలేదు! అయితే, వాళ్ల నాన్న గారు తమ అమ్మాయి ధోరణి కనిపెట్టారు! ఈ రైలు ప్రయాణమే ఆ తరువాత మా ఇద్దరి జీవితాలలో పెద్ద మలుపు!

కలకత్తాలో మాకు "సురతీర్థ" అనే నృత్యకళాశాలలో బస ఏర్పాటుచేశారు. 1959 జనవరి 25వ తేదీ రాత్రి ఆంధ్ర అసోసియేషన్‌ వారు ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. మొదట ప్రఖ్యాత "సితార" వాద్యనిపుణుడు రవిశంకర్‌ కచేరీ, తరువాత ప్రసిద్ధ నృత్యకళాకారుడు ఉదయశంకర్‌ నాట్యం, చివరగా కృష్ణకుమారి కూచిపూడి నృత్యం. ఆమె నృత్యానికి మధ్య మధ్య నా వ్యాఖ్యానం. అది ఆంధ్ర అసోసియేషన్‌ సభ కాబట్టి, ప్రేక్షకులందరూ తెలుగు వారే కాబట్టి, ఆ మూడు కార్యక్రమాలను వీక్షించి ఆనందించారు.

ఉపేంద్ర పౌరోహిత్యం

ఆ మరునాడు - జనవరి 26 ఉదయం - కిడ్డర్‌పూర్‌ ఆంధ్ర అసోసియేషన్‌లో నాకు, ఆమెకూ సన్మానం. సభాధ్యక్షుడు ఆ తరువాత చాలా కాలానికి కేంద్రమంత్రి అయిన శ్రీ పర్వతనేని ఉపేంద్ర. ఆయన మాట్లాడుతూ "కుటుంబరావు, కృష్ణకుమారి వివాహం చేసుకుంటే, నృత్యం, సాహిత్యం ఒకే ఇంటిలో నర్తిస్తాయి" అన్నారు. ఆయనకు జర్నలిజంలో డిప్లమా వుంది. రైల్వేల పత్రికకు ఆయన ఎడిటర్‌. అప్పటికి నాలో ప్రతిస్పందన ఏమీలేదు. శ్రీ ఉపేంద్ర మాటకు ఉలిక్కిపడి, మర్యాదకోసం నవ్వి వూరుకున్నాను. ఆమె నా ప్రతి స్పందన ఎలా వుంటుందోనని నా వంక చూచింది!

ఆ సాయంత్రం "సురతీర్ధ"లో ఒంటరిగా వున్న నా వద్దకు ఆమె వచ్చి "ఉదయం ఉపేంద్రగారు అన్నమాటలపై మీ అభిప్రాయం ఏమిటి?" అని ఒక్కసారిగా, సూటిగా అడిగే సరికి నాకు నోట మాట రాలేదు! అప్పటికి నా వయస్సు 27 ఏళ్లు. అప్పటికి 23 మంది అమ్మాయిలను పెద్దల సమక్షంలో పెళ్లిచూపులు చూశాను. కాని, ఎవ్వరూ నచ్చలేదు! నాకు అలా పెద్దలు కుదిర్చే పెళ్లి ఇష్టం లేదు. నేను స్వయంగా నిర్ణయించాలన్నది నా వుద్దేశం. నిజానికి, ఆ ఉదయం నుంచే ఉపేంద్ర గారి మాటలు నా మనోవీధిలో నాట్యమాడుతున్నాయి! అయితే, కలకత్తా రైలు విజయవాడలో ఎక్కినప్పటి నుంచి రైలులో ఆమె భావగర్భితమైన పాటలు, చూపులు చూశాక, ఆమెతో మాట్లాడాక, ఆమె అభిప్రాయాలు, ఆత్మాభిమానం చూశాక ఇక పెళ్లి ఈమెతోనే అనే నిశ్చయానికి వచ్చాను!

ఊహించని, ఆమె నుంచి వచ్చిన ప్రశ్నకు జవాబు దొరక్క కొంత కలవర పడ్డాను! కాని, సర్దుకుని "సరే! నాకేం అభ్యంతరం లే" దన్నాను.

"అయితే, ఒక్కమాట. పెళ్లయిన తరువాత నన్ను నాట్యం చేయనిస్తారా?" అని మళ్లీ అడిగింది. "చేయించకపోతే?" అని ఎదురు ప్రశ్న వేశాను.

"చేయించకపోయినా, మిమ్మల్నే వివాహం చేసుకుంటాను. కాని, నాట్యం చేయలేకపోయినందుకు జీవితాంతం బాధపడతాను" అంది. "అయితే, సరే! చేయిస్తాను" అన్నాను. ఆనందంతో ఆమె ముఖం విప్పారింది!

ఆ తర్వాత దాదాపు ఆర్నెల్లు మా వివాహం విషయంలో వాళ్ల పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆమెను సినీతారను చేయాలని ఆమె తాతగారి వుద్దేశం. అయితే, ఆమె నాన్నగారికి ఆమె ఇష్టమే ఇష్టం! అందువల్ల, చివరకు ఆమె తల్లిదండ్రులు రంగంలోకి వచ్చి, 1959 జూన్‌ 12న మా వివాహం చేశారు. ఈలోగా ఆమె మనస్సు మార్చాలని ఆమె తాత గారు ఎంత ప్రయత్నించినా, ఆమె ససేమిరా అన్నది. "నేను చేసుకుంటే, ఆయన్నే చేసుకుంటాను. లేకపోతే, పెళ్లే చేసుకో"నని ఆమె జవాబు! "క్షణ క్షణముల్‌ జనరాండ్ర చిత్తముల్‌" అని అంటారు. కాని, ప్రేమ, పెళ్లి విషయంలో ఆడపిల్ల పట్టు పట్టిందంటే, ఇక దానికి తిరుగువుండదు. ఈ విషయం చాలా మంది తల్లిదండ్రులు తెలుసుకోలేక, కుమార్తె అభీష్టానికి అడ్డం తిరిగి, ఎన్నో తిప్పలు తెచ్చుకుంటారు! చివరికి ప్రేమకోసం ఆత్మ బలిదానం చేసిన వారెందరు లేరు!

పరిణయానికి దారితీసిన ప్రయాణం

Naa Kalam - Naa Galam Page 31 Image 0001
Naa Kalam - Naa Galam Page 31 Image 0001

అలా మా కలకత్తా ప్రయాణం ప్రణయంగా, ఒక దశలో మాకు ప్రళయంగా, చివరికి పరిణయంగా పరిణమించి, సుఖాంతమైనది! మాకు ఇద్దరు పిల్లలు - ప్రేమ జ్యోతి, జవహర్‌లాల్‌ నెహ్రూ. ముందు పుట్టిన అమ్మాయికి ప్రేమజ్యోతి అని పేరు పెట్టనికి కారణం - మా ప్రేమ వివాహానికి ఆమె తొలి ఫలం. అందువల్ల, ప్రేమ; నేను "ఆంధ్రజ్యోతి" దినపత్రికలో చేరిన రాత్రే - 1960 మే 21 - మాకు అమ్మాయి జన్మించింది. అందువల్ల,

"ప్రేమజ్యోతి" అని పేరు పెట్టాము.

ప్రధాని నెహ్రూ సందేశం

ఇక, మా అబ్బాయికి "జవహర్‌లాల్‌ నెహ్రూ" అన్న పేరు పెట్టడం వెనక ఆసక్తికరమైన కథనమే వుంది. మా వివాహానికి భారత ప్రథమ ప్రధాని పండిట్‌ నెహ్రూ ఒక సందేశం పంపిస్తూ "ఒక నాటికి భారత ప్రధాని కాగలిగిన పుత్రుడు త్వరలో మీకు కలుగు గాక!" అనే అర్థం వచ్చే శుభ సందేశ లేఖ రాశారు! అది ఆయన చమత్కృతి! ఆ లేఖ, వివాహమైన నాలుగైదు రోజులకు కాని మాకు చేరలేదు. అప్పుడు మేమిద్దరం అనుకున్నాము - మనకు కుమారుడు కలిగితే, "జవహర్‌లాల్‌ నెహ్రూ" అని పేరు పెడదామని. అయితే, మొదటిసారి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి మా జీవితానికి అర్ధవంతమైన "ప్రేమజ్యోతి" అని పేరు పెట్టాము. తరువాత కుమారుడు కలగగానే జవహర్‌లాల్‌ నెహ్రూ అని పేరు పెట్టాము.

రాజీవ్‌గాంధి సందేహం

అయితే, మా అబ్బాయికి జవహర్‌లాల్‌ నెహ్రూ అని పేరు పెట్టడం రాజీవ్‌గాంధీకే ఆశ్చర్యం కలిగించింది! 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారానికి శ్రీ రాజీవ్‌గాంధి విజయవాడ వచ్చారు. ఆ రోజు రాత్రి మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్‌ ఆఫీసు సమీపంలో జరిగిన సభలో రాజీవ్‌గాంధి ఉపన్యాసాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేశాను. ఆ మరునాడు విజయవాడ కెనాల్‌ గెస్ట్‌హౌస్‌లో తనతో బ్రేక్‌ఫాస్ట్‌కు రాజీవ్‌ నన్ను ఆహ్వానించారు. నాతోపాటు జవహర్‌లాల్‌ను కూడా తీసుకువెళ్లాను. రాజీవ్‌కు అతనిని పరిచయం చేశాను. "పూర్తి పేరు పెట్టారా?" అని ఆయన ఆశ్చర్యంగా నన్ను ప్రశ్నించారు. "నెహ్రూ" అంటే వారి ఇంటి పేరు. ఉత్తర భారతదేశంలో చాలా మందికి ఇంటి పేర్లు- నెహ్రూ, పటేల్‌, గాంధి - పేరు చివరవుంటాయి. అలాంటప్పుడు, మీ ఇంటి పేరు వుండగా, "నెహ్రూ" అనే ఇంటి పేరును కూడా మీ జవహర్‌లాల్‌ పేరు చివర ఎలా చేర్చారని రాజీవ్‌ సందేహం!

"నిజమే! కాని, పూర్తి పేరు - జవహర్‌లాల్‌ నెహ్రూ - అన్నది పెట్టకపోతే, ఆ మహనీయుడు జవహర్‌లాల్‌ ఎలా జ్ఞాపకం వస్తారు? మహాత్మాగాంధి పేరు పెట్టదలచుకున్నవారు "గాంధి" వదిలిపెట్టి వట్టి "మోహన్‌దాస్‌" అని మాత్రమే (గాంధీజీ అసలు పేరు) పెట్టుకుంటే, ఆ మహనీయుడు ఎలా జ్ఞాపకం వస్తాడు?" అని నేను వివరణ ఇచ్చాను. రాజీవ్‌గాంధి చిరునవ్వు నవ్వారు!

ముగ్గురు వివాహాలకు ముగ్గురు ప్రధానుల సందేశాలు

మా ఇంటిలో వివాహాలకు ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పండిట్‌ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ రాజీవ్‌గాంధి ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మహా నాయకులు; ప్రధాన మంత్రులు కూడా.

కాగా, నా వివాహానికి ప్రధాని నెహ్రూ, నా కుమార్తె ప్రేమజ్యోతి పెళ్లికి శ్రీమతి ఇందిరాగాంధి, నా కుమారుడు వివాహానికి శ్రీ రాజీవ్‌గాంధి శుభసందేశాలు పంపడం పెద్ద విశేషమే.

నా వివాహ సమయంలో నేను "ప్రజాసేవ" పత్రికకు ఎడిటర్‌గా వున్నాను. అప్పటికి ఆ పత్రిక ప్రారంభించి, నాలుగేళ్లు. వివాహానంతరం కూడా ఆ పత్రిక సంవత్సరం పాటు నిరాటంకంగానే నడిచింది. ఎప్పుడైనా పెద్ద పెట్టుబడి లేకుండ పత్రిక నడపడం కష్టమే. అయినా, డాక్టర్ చలపతిరావు గారు చేతులు కాల్చుకుని అయినా, పట్టుదలతో పత్రికను అంతకాలం నడిపారు. అంతవరకు ప్రజా పార్టీలో వున్న ఆయన 1960లో కాంగ్రెస్‌లో చేరారు. అందువల్ల, పత్రిక విధానం మార్చక తప్పదు. ఇది డాక్టర్‌గారికి, నాకు కూడా ఇష్టం లేదు! అందువల్ల, అంతవరకు ఒక విధానంతో నడిచిన పత్రికను మూసివేయవలసిన సమయం వచ్చినట్టు కనిపించింది.

అప్పుడే శ్రీ కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌, శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు కలిసి "ఆంధ్రజ్యోతి" దినపత్రికను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నన్ను ఆ పత్రికలోకి సహాయ సంపాదకుడుగా పంపాలని డాక్టర్‌గారి వుద్దేశం. "రోగి కోరిందే వైద్యుడూ పెట్టమన్నాడు" అన్నట్టుగా, నా కోర్కె కూడా అదే. ఎందువల్లనంటే, "ఆంధ్రజ్యోతి" ఎడిటర్‌ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన నా పాత్రికేయ జీవితానికి గురుద్రోణాచార్యుడు. నా దృష్టిలో తెలుగులో ఆయనవలె సంపాదకీయాలు రాయగలిగిన వారు, రాయగలవారు ఆయనకు ముందు కాని, ఆయన తరువాత కాని ఎవ్వరూలేరు. ఆ పదాల పొందిక, ఆ వాక్య నిర్మాణ చాతుర్యం, ఆ విభిన్న విజ్ఞాన విభవం అనితరసాధ్యం. అట్టి పాత్రికేయ ద్రోణాచార్యుని వద్ద పనిచేసే అవకాశం కంటె నా వంటి ఏకలవ్య శిష్యుడు కోరేది ఏముంటుంది?

అప్పటి లెజిస్లేటిన్‌ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ శ్రీ జి.ఎస్‌. రాజు గారు "ఆంధ్రజ్యోతి"ని ప్రచురించే ఆంధ్ర ప్రింటర్స్‌ లిమిటెడ్ లో డైరెక్టర్‌. శ్రీ రాజు గారు నాకు కూడా పరిచితులే. ఆయన అంతకు పూర్వం జరిగిన నా వివాహానికి వచ్చి, నన్ను ఆశీర్వదించారు. ఆయన విజయవాడలో "సిరీస్‌" అనే ప్రఖ్యాత ఔషధోత్పత్తి సంస్థ అధినేత. సంస్కార సంపన్నులు. ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. నాకు అడుగడుగునా అండ.

ఆయన ఆంధ్ర ప్రింటర్స్‌ చైర్మన్‌ కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌ గారికి నన్ను గురించి చెప్పారు. వారు వెంటనే వచ్చి పత్రికలో చేరవలసిందిగా సూచించారు. ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు, నేను 1960 మే 21వ తేదీన "ఆంధ్రజ్యోతి"లో చేరాను. ఎడిటర్‌ నార్ల గారికి నా వచన రచనా రీతి నచ్చింది. నేను అంతకు పూర్వం "ప్రజాసేవ"లో రాసిన సంపాదకీయాలను చూచి, హర్షించి, మొదట నా చేత కూడా ఎప్పుడైనా సంపాదకీయాలు రాయించేవారు. విద్వాన్‌ విశ్వం, ప్రఖ్యాత రచయిత, సంపాదకుడు శ్రీ నండూరి రామమోహనరావు గార్లు ఆ పత్రికకు మొదట సహాయ సంపాదకులు. నార్ల గారి అనంతరం శ్రీ నండూరి "ఆంధ్రజ్యోతి" సంపాదకులైనారు.

మొదటి విడత "ఆంధ్రజ్యోతి"లో 1960 మే నుంచి 1963 జూన్‌ వరకు వున్నాను. ఆ పత్రిక డైరెక్టర్లలో ఒకరైన శ్రీ జి.ఎస్‌. రాజు నన్ను తమకు రాజకీయ కార్యదర్శిగా పనిచేయాలని కోరారు. దాదాపు రెండేళ్లు ఆయనకు కార్యదర్శిగా పని చేసిన కాలంలో నాకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత నా ప్రజా జీవితానికి రాజు గారి కార్యదర్శి బాధ్యత నాకు ఎంతగానో తోడ్పడింది. అప్పుడే నాకు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి వంటి రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

పాత్రికేయ జీవితం వదలిపెట్టి, ప్రయివేటు ఉద్యోగమేమిటని ఆ రోజులలో నన్ను కొందరు మిత్రులు, అభిమానులు ప్రశ్నించేవారు. "ప్రఖ్యాత జర్నలిస్టు, పత్రికా సంపాదకులు శ్రీ ఖాసా సుబ్బారావు అమవాన్‌ రాజాకు కార్యదర్శిగా పనిచేశారు. మరో ప్రసిద్ధ జర్నలిస్టు శ్రీ వేలూరి సహజానంద బెజవాడ గోపాలరెడ్డి గారికి కార్యదర్శిగా పనిచేశారు. అలా చాలా మంది జర్నలిస్టులు ప్రముఖులకు సహాయకులుగా పనిచేశారు. అందువల్ల, వారికి ఆ తరువాతి పాత్రికేయ జీవితాలకు ఆ ఉద్యోగాల అనుభవం ఎంతగానో తోడ్పడింది" అని నేను చెప్పేవాడిని.

రెండేళ్ల తరువాత "ఆంధ్రజ్యోతి" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు నన్ను తిరిగి పత్రికలోకి రావలసిందిగా కబురు పంపారు. నా దృష్టి కూడా పాత్రికేయ జీవితం వైపు మళ్లి నందున, శ్రీ జి.ఎస్‌.రాజు గారికి చెప్పి, నేను తిరిగి "ఆంధ్రజ్యోతి"లో మరిన్ని బాధ్యతలతో, ముఖ్యంగా సంపాదకీయ రచయితగా చేరాను. ఆ తరువాత 1991 చివరి వరకు "ఆంధ్రజ్యోతి"లో సహాయ సంపాదకుడుగా, సంపాదక హోదాలోను పనిచేశాను. శ్రీ నార్ల "ఆంధ్రజ్యోతి" ఎడిటర్‌గా వున్నంత వరకు ఆయనతోపాటు శ్రీ నండూరి, నేను సంపాదకీయాలు రాసేవారం. శ్రీ నార్ల 1971 చివరలో "ఆంధ్రజ్యోతి" నుంచి విశ్రాంతి కోసం హైదరాబాద్‌లో స్వగృహం "లుంబిని"కి వెళ్లిపోయారు. ఆయన "ఆంధ్రజ్యోతి" నుంచి పూర్తిగా విరమించుకున్న తరువాత ఆ పత్రికలో దాదాపు 20 సంవత్సరాల వరకు శ్రీ నండూరి, నేను తప్ప ఆ పత్రిక సంపాదకీయ కాలంలో మరొక కలానికి చోటు లభించలేదంటే ఆశ్చర్యమే, మరి!

"వార్తలలోని వ్యక్తి"

"ఆంధ్రజ్యోతి" దినపత్రికలో నేను 1991 చివరి వరకు పని చేశాను. ఆ పత్రిక సంపాదకీయ రచయితగా, సండే ఎడిషన్‌ ఇన్‌చార్జిగా, సినిమా ఎడిటర్‌గా, చివరికి చీఫ్‌ రిపోర్టర్‌గా - వివిధ బాధ్యతలను నిర్వహించాను. 1960లో "వార్తలలోని వ్యక్తి" శీర్షికను ప్రారంభించాను. ఆ శీర్షికను "ఆంధ్రజ్యోతి"లో దాదాపు మూడు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి, రాశాను. ఆ తరువాత నేను ఆకస్మికంగా ఒక "యాక్సిడెంట్‌"కులోనై, ఆ పత్రికకు రాజీనామా చేశాను. ఆ తరువాత "వార్త" దినపత్రికలో జనరంజకమైన ఆ శీర్షికతో ఆయా ప్రముఖుల రేఖా చిత్రాలను రాయవలసిందిగా ఆ పత్రిక సంపాదకవర్గం కోరగా, ఈ శీర్షికను ఆ పత్రికకు మళ్లించాను. మొత్తం మీద 2010 నాటికి ఈ శీర్షికను దాదాపు 50 సంవత్సరాలు నిర్వహించాను. ఇంత కాలం ఒకే శీర్షికను ఒకే వ్యక్తి నిర్వహించం కూడా అరుదైన రికార్డే. అయితే, "వార్త" దినపత్రికలో ఈ శీర్షికను ప్రారంభించినప్పుడు నేను దానికి ఇంత ప్రాచుర్యం, ప్రాముఖ్యం లభిస్తుందని భావించలేదు. ఆ శీర్షిక వచ్చే రోజున "వార్త" దినపత్రికను దాని కోసమే కొనేవారున్నట్టు నాకు తెలిసి, ఆ శీర్షికను ఒక్క వారం కూడా మాని వేయకుండ నిర్వహిస్తూ వచ్చాను. ఆ శీర్షికకు ముఖ్యమంత్రులు, మంత్రులు, మేధావులు, రాజకీయ పార్టీల ప్రముఖులు, పత్రికా పఠనం పట్ల ఆసక్తిగల వారు ప్రత్యేక పాఠకులు. చివరకు, 1988లో నాకు జరిగిన ఒక సన్మాన సభలో ఆ తరువాత కేంద్రమంత్రి అయిన డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి నన్నే "వార్తలలోని వ్యక్తి"గా అభివర్ణించారు! ఒక్క మాటలో చెప్పవలెనంటే, ప్రజా జీవితంలో కాని, రాజకీయ రంగంలో కాని నాకు కొంత ప్రాచుర్యం లభించిందంటే, నా ఉపన్యాసాల తరువాత "వార్తలలోని వ్యక్తే" కారణ మనడంలో అత్యుక్తి లేదు!

1992 ప్రారంభంలో నేను "ఆంధ్రజ్యోతి" నుంచి రాజీనామా చేసిన తరువాత ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, సభలలో సమావేశాలలో ఉపన్యాసకుడుగా మరింత ప్రాచుర్యం సాధించాను. ఇక్కడి నుంచి రాయబోయే సంఘటనలు క్రమబద్ధంగా వుండవు. ముందుది వెనుక, వెనుకది ముందు పునరుక్తులు వుండవచ్చు! ఎందువల్లనంటే, ఇది ఇక్కడి నుంచి కేవలం "నా కథ" కాదు కనుక!

నేను యువదశలో ప్రవేశించే సమయంలో, అంటే 1946లో, దేశంలో ప్రధానమైన ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే.

"చెంప ఛెళ్లు"

ఆ జాతీయతా భావమే ఒకసారి మా అన్న గారి చేత నా చెంప ఛెళ్లు మనిపించింది! అది 1940వ దశకం. అప్పటికి నా వయస్సు సుమారు పది సంవత్సరాలు. అప్పుడు కృష్ణాజిల్లా బోర్డు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు జస్టిస్‌ పార్టీ అనే పార్టీ ఎక్కువగా జమిందార్లు, రాజాలు, సంపన్నులతో వుండేది. అప్పటి జిల్లా బోర్డులు అంటే ఇప్పటి జిల్లా పరిషత్తులే. అప్పటిలో జస్టిస్‌ పార్టీకి, కాంగ్రెసుకు తీవ్రమైన పోటీ. జస్టిస్‌ పార్టీ బ్రిటిష్‌ ప్రభుత్వం అనుకూల పార్టీ. కాంగ్రెస్‌ బ్రిటిష్‌ సామ్రాజ్య వాద ప్రభుత్వాన్ని దేశం నుంచి వెడలనంపడానికి పోరాడుతున్న జాతీయ సంస్థ. అందువల్ల, నాకు కాంగ్రెస్‌ పట్లనే ఆసక్తి, అభిమానం. ఎవరో నా చేతికి కాంగ్రెస్‌ త్రివర్ణాంచిత జాతీయపతాకాన్ని ఇస్తే, నేను ఎన్నికల రోజున "కాంగ్రెస్‌కు జై, జస్టిస్‌కు తొయ్" అంటూ కేకలు వేస్తూ తిరుగుతున్నాను. ఇది పామర్రు గ్రామంలో మేము వున్నప్పటి మాట. నా కేకల సంగతి ఎక్కడో వున్న మా అన్న సుందరరామారావు గారికి ఎవరో చెప్పినట్టున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి "చెంప ఛెళ్ళు"మనిపించారు! గూబగుయ్యి మన్నది! "జస్టిస్‌ పార్టీకి తొయ్ అంటే ఎంత ప్రమాదమో తెలుసా? వాళ్లే అధికారంలోకి వస్తారు!" అని ఆయన అన్నారు. ఒక ప్రక్క చెంపదెబ్బకు కన్నీరు తిరుగుతున్నా, నేను కూడా రెట్టించిన ఉక్రోషంతో "జస్టిస్‌ పార్టీకి కాక, కాంగ్రెస్‌కు తొయ్ అనమంటావా? జస్టిస్‌ పార్టీ వాళ్లు దేశద్రోహులు. కాంగ్రెస్‌ వాళ్లు దేశభక్తులు!" అన్నాను. ఇంతలో అక్కడికి నలుగురూ చేరేసరికి మా అన్న గారు నన్ను తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు!

"కాంగ్రెసు గెలిచిందా?"

కాంగ్రెసు గాంధీజీ, నెహ్రూ, రాజెన్‌బాబు ప్రభృతుల నాయకత్వంలో దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేస్తున్నది. 1946లో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు గన్నవరంలో వున్న నేను కూడా ఓటర్లను చేర్పించడానికి కృషి చేశాను. ఎన్నికలకు ముందే నాకు తీవ్ర రుగ్మత చేసి, దాదాపు మూడు నెలలకు పైగా, మంచంలోను, "కోమా"లోను వున్నానని ఇది వరకే పేర్కొన్నాను. ఆ రుగ్మత తగ్గి నేను కళ్లు తెరవగానే వేసిన మొదటి ప్రశ్న "కాంగ్రెస్‌ గెలిచిందా?" అని! ఈ విషయాన్ని ఆ వూరిలో చాలాకాలం వరకు వింతగా చెప్పుకునేవారు! "ఆయనకు ఎంత జాతీయ స్ఫూర్తి!" అని!

నా పై ముగ్గురు మహనీయుల ప్రభావం పడింది. ఆ ప్రభావమే నా వ్యక్తిత్వాన్ని రూపొందించింది. గాంధీజీ, నెహ్రూజీ, "ఆంధ్రకేసరి" ప్రకాశం. అయితే, ఆచార్య ఎన్‌.జి. రంగా కొన్ని విషయాలలో నన్ను ప్రభావితం చేశారు. ముఖ్యంగా ఎదుటి వారిని గౌరవించండంలోను, మహిళలను, ముఖ్యంగా భార్యను గౌరవించండంలోను! గాంధీజీ అహింస, సత్యనిరతి, నెహ్రూ భావుకత్వం, ప్రకాశం ధైర్య సాహస త్యాగ ప్రవృత్తి - నాపై ప్రభావం చూపాయి. అప్పటిలో ప్రకాశం గారిని పెద్ద గురువు అని, రంగాగారిని చిన్న గురువు అని అనేవాడిని.

బ్రిటిష్‌ మాజీ ప్రధాని, కరుడుకట్టిన భారత స్వాతంత్య్రోద్యమ వ్యతిరేకి విన్‌స్టన్‌ చర్చిల్‌ ఒకసారి కెనడలోని భారతీయ హై కమిషనర్‌తో మాట్లాడుతూ "మీ ప్రధాని నెహ్రూ ద్వేషాన్ని, అసూయను జయించాడు. ఇవి మహా పురుషుని లక్షణాలు. ఈ విషయంలో ఆయనకు నా అభినందనలు తెలియజేయండి" అన్నాడు.

ఆ విషయం ఎక్కడో చదివిన తరువాత నేను కూడా ఆ రెండు దుర్గుణాలను జయించాలన్న ఆసక్తి కలిగింది. ఆ విషయంలో నేను చాలా వరకు విజయం సాధించానని వినమ్రతకు భంగం లేకుండా చెప్పగలను!

నెహ్రూ వ్యక్తిత్వం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయనతో మాట్లాడాలనే తహ తహ కూడా ప్రారంభమైనది. 1952లో నవ భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన మొదటి జనరల్‌ ఎన్నికల ముందు నేను ప్రధాని నెహ్రూకు లేఖ రాస్తూ ఆంధ్ర రాజకీయాలను గురించి ఒక జర్నలిస్టుగా ఆయనకు వివరించ గోరుతున్నానని, అందువల్ల నాకు అయిదు నిమిషాలు ఢిల్లీలో ఇంటర్‌వ్యూ ఇవ్వాలని రాశాను. అయితే, అది ఎన్నికల సమయమైనందున, పండిట్‌ నెహ్రూ ఏ రోజున ఎక్కడ వుంటారో చెప్పలేమని, అందువల్ల ఆయనకు చెప్పదలచుకున్నది ఒక లేఖ ద్వారా తెలియజేస్తే, పరిశీలిస్తామని ఆయన తరఫున కార్యదర్శి శ్రీ ఎస్‌.పి. ఖన్నా నాకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

నెహ్రూతో సమావేశం

Naa Kalam - Naa Galam Page 40 Image 0001
Naa Kalam - Naa Galam Page 40 Image 0001

ఇలా వుండగా, 1951 డిసెంబర్‌ 27న ప్రధాని నెహ్రూ ఎన్నికల ప్రచారానికి విజయవాడ వచ్చారు. విజయవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లో జరిగిన బ్రహ్మాండమైన సభలో ఆయన ప్రసంగించారు. నేను ఆ సభకు హాజరైనాను. సభానంతరం ఆయన స్పెషల్‌ రైలులో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి మొదలైన చోట్ల ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించవలసివున్నది. అందువల్ల, నేను నెహ్రూ ఉపన్యాసం పూర్తికాకుండనే ఆ సభ నుంచి బయటికి వచ్చి, రైలు స్టేషన్‌కు వెళ్లే ప్రయత్నంలో వున్నాను.

సంజీవరెడ్డి పై చెయ్యి చేసుకున్న నెహ్రూ!

ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది! నెహ్రూ తన ఉపన్యాసం ముగించి, అప్పటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రభృతులతో టాపులేని జీపులో రైలుస్టేషన్‌ వైపు వెడుతున్నారు. ఆయన చేతిలోని గులాబీదండకోసం ఒక బాలుడు జీపు వెంట పరుగెత్తుతున్నాడు. అతడి చేతికి ఆ దండను అందించుదామని నెహ్రూ ఎంత ప్రయత్నించినా, అతడు అందుకోలేకపోతున్నాడు. చివరికి ఆ కుర్రవాడు జీపును సమీపించేసరికి శ్రీ సంజీవరెడ్డి అతడిని చేతితో నెట్టి వేసే సరికి అతడు కింద పడి పోయాడు! ఆ బాలుడి పట్ల జరిగిన దౌర్జన్యాన్ని సహించలేని "చాచా నెహ్రూ" శ్రీ సంజీవరెడ్డి పట్ల ఆగ్రహంతో ఆయన వీపు పై ఒక్క చరుపు చరిచారు! అది నేను స్వయంగా చూశాను! ఇదంతా నేను కూడా జీపు వెంట కొంచెం దూరంగా పరుగెత్తుతూనే చూశాను! ఆ జన సముద్రంలో రిక్షాలు ఎక్కడ వుంటాయి? అప్పటికి నాకు కూడా 18, 19 సంవత్సరాలు!

నెహ్రూతో

పండిట్‌ నెహ్రూ రైలు స్టేషన్‌కు చేరుకున్న కొద్ది సేపటికే నేను కూడా చేరుకున్నాను - రిక్షాలో. అక్కడ పండిట్‌ నెహ్రూతోపాటు చాలా మంది ప్రముఖులు, కేంద్ర ఆహారశాఖ ఉపమంత్రి, ఆ తరువాత వింధ్యప్రదేశ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అయిన శ్రీ మొసలికంటి తిరుమలరావు వున్నారు. శ్రీ తిరుమలరావు నాకు కొంచెం తెలుసు. నన్ను ప్రధాని నెహ్రూకు పరిచయం చేయవలసిందిగా కోరాను. ఇప్పటివలె అప్పుడు భద్రతా పోలీసుల కట్టడి వుండేది కాదు. సాక్షాత్తు దేశ ప్రధానిని సయితం సులభంగా కలుసుకునే అవకాశం వుండేది!

"ఇతను తుర్లపాటి కుటుంబరావు అనే యువ పాత్రికేయుడు" అని శ్రీ తిరుమలరావు నన్ను ప్రధానికి పరిచయం చేశారు.

"రాష్ట్ర రాజకీయాలను గురించి మీకు వివరించడానికి ఢిల్లీకి వస్తానని, నాకు ఇంటర్‌వ్యూ ఇవ్వాలని మీకు లేఖ రాశాను" అని నేను కొంచెం బెరుకుగానే, అయినా, ధైర్యాన్ని చిక్కపట్టుకుని అన్నాను. ఔను, మరి! ఆయన ఈ మహా దేశానికి ప్రథమ ప్రధాని. చరిత్ర పుటలలోకి ఎక్కిన మహోన్నత నాయకుడు. నేను ఇంకా నూనూగుమీసాల యువ జర్నలిస్టును. అయినా, జర్నలిస్టునన్న ధీమా కల్పించే గుండె నిబ్బరంతో ఆయనతో నేను ముందు మాట్లాడాను.

"ఆ లేఖకు నేనేమి జవాబు రాశాను?" అని ఆయన తన మృదు, గంభీర కంఠంతో ప్రశ్నించారు. "ఎన్నికల సమయం కాబట్టి, తీరా ఢిల్లీకి వస్తే, నేను వుండకపోవచ్చు. మీరు చెప్పదలచుకున్నది లిఖిత పూర్వకంగా పంపించండి. పరిశీలిస్తానని సమాధానం రాశారు" అన్నాను.

"ఔను! అలా చేయండి" అని ఆయన మృదువుగా ప్రత్యుత్తరమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 27వ తేదీ రాగానే ప్రథమ ప్రధాని నెహ్రూతో నా సమావేశం విషయం తప్పని సరిగా జ్ఞాపకం వస్తుంది. నేను గర్వంగా ఆ సన్నివేశాన్ని మననం చేసుకుంటాను.

పండిట్‌ నెహ్రూ ప్రశ్న :

"ఎవరీ తుర్లపాటి?"

ఆ తరువాత నేను ప్రధాని నెహ్రూకు ఇంగ్లీషులో రెండు లేఖలు రాసి, వాటిలో ఆ నాటి ఆంధ్ర రాజకీయ పరిస్థితులను, 1952 జనరల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలను వివరించాను. వాటిని తెలుగులోకి తర్జుమా చేసి, శ్రీ ఖాసా సుబ్బారావు సంపాదకత్వాన మద్రాసు నుంచి వెలువడే "తెలుగు స్వతంత్ర" వార పత్రికలో ప్రచురింపజేశాను.

ఆ రెండు వ్యాసాలు ఆంధ్రదేశంలో సంచలనం కలిగించాయి. ఆ పత్రికకు రాజకీయ, మేధావి వర్గాలలో అనన్య ప్రచారం వుండేది. నా రెండు లేఖలను చూచిన ప్రధాని నెహ్రూ ఆంధ్ర నాయకుడు, ఆ నాటి కేంద్ర మంత్రి, ఆ తరువాత భారతదేశానికి నాల్గవ రాష్ట్రపతి అయిన శ్రీ వి.వి. గిరిని "ఎవరీ తుర్లపాటి?" అని ప్రశ్నించారట! అంతకు పూర్వం విజయవాడ రైలు స్టేషన్‌లో నేను ఆయనను కలుసుకున్న విషయం ఆయన మరిచిపోయి వుంటారు. ఆ తరువాత ఆయన ఎన్నివేల మందిని కలుసుకున్నారో? అందరిలో నేను

ఆయనకు ఏమి గుర్తు?

పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షలో....

1952 అక్టోబర్‌ 19న శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని ఆయన దీక్ష లక్ష్యం. రోజులు గడచి పోతున్నాయి. ఎందరు నాయకులు ఎన్ని విధాల చెప్పినా, ఆయన దీక్ష విరమించడం లేదు. ప్రధాని నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని స్పష్టంగా హామీ ఇచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని ఆయన పట్టుదల. నిరాహారదీక్ష 50వ రోజు వచ్చింది. ఆయన బాగా నీరసించి పోయారు. ఇక జీవించడం కష్టమని వైద్యులు చెబుతున్నారు.

అది డిసెంబరు 7వ తేదీ. శ్రీరాములు గారి నిరాహార దీక్ష 50 వ రోజు. ఆయన చేత దీక్ష విరమింపజేయడానికి మద్రాసులో అఖిలపక్ష ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ సభకు నేను కూడా ఒక పత్రికా సంపాదకుడుగా హాజరైనాను. సభ మద్రాసు మౌంట్‌రోడ్‌లోని కర్లపాటి అప్పారావు గారి భవన ప్రాంగణంలో జరిగింది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, ప్రజా పార్టీ, కృషి కార్‌ లోక్‌ పార్టీల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ రోజున జోరున వర్షం. సభ కోసం వేసిన షామియానాలు తడిసిపోయాయి. కింద కూర్చున్న మా పైన వర్షపు నీళ్లు పడుతున్నాయి. తడవ కుండా మేము వెంట తీసుకువెళ్లిన వార్తాపత్రికలను తలపై పెట్టుకున్నాము. కాని, అవి ఏమి ఆగుతాయి? సభకు "ఆంధ్రకేసరి" ప్రకాశం గారు అధ్యక్షులు. మద్రాసు నగరంతో కూడిన ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని ఆయన పట్టుదల. అలా అయితే, కేంద్రం ఆంధ్రరాష్ట్రాన్ని ఇవ్వదని, రాష్ట్రం వస్తే కాని శ్రీరాములు గారు దీక్ష విరమించరని, అందువల్ల మద్రాసు నగరం లేకుండా ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని మనం కేంద్రాన్ని కోరాలని కమ్యూనిస్టుల వాదం. ఈ సమస్యపై ఓటింగ్‌ తీసుకోవాలని కమ్యూనిస్టేతర ప్రతినిధులు ప్రతిపాదించారు. అప్పుడు ఓటింగ్‌ జరిగితే, కమ్యూనిస్టుల వాదం వీగి పోతుంది. అందువల్ల, సభను వాయిదా వేయాలని, భోజనా నంతరం సభను కొనసాగించ వచ్చునని కమ్యూనిస్టులు వాదించారు.

మైకు కోసం ఆంధ్రకేసరి, చండ్ర పెనగులాట

ఇక సభ కొనసాగడానికి వీలులేదని కమ్యూనిస్టు అగ్రనాయకుడు శ్రీ చండ్ర రాజేశ్వరరావు ప్రకాశంగారి చేతులలోని మైక్‌ లాక్కోబోయారు! అయితే, ప్రకాశం గారు మైకు ఆయనకు అందకుండా పెనుగులాడారు! ఇంతలో విజయవాడ ప్రతినిధి, ఆ పట్టణ మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్ టి.వి.ఎస్‌. చలపతిరావు గారు లేచి "పొట్టి శ్రీరాములుగారు రాష్ట్రం కోసం 50 రోజులుగా కఠోర నిరాహారదీక్ష చేస్తుండగా, మనం ఒక్క గంట సేపు భోజనాన్ని వాయిదా వేయలేమా?" అంటూ ఆవేశ పూరితంగా మహోపన్యాసం చేసే సరికి సభికులందరు ఆయన వాదంతో ఏకీభవిస్తూ కరతాళధ్వనులు చేశారు! చివరికి మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్ర నిర్మాణాన్నే కోరుతూ సభ తీర్మానించినట్టు ప్రకాశం గారు ప్రకటించారు!

వెంటనే ప్రకాశం గారు, బులుసు సాంబమూర్తి గారు, మోతే నారాయణరావు గారు, మరి కొందరు ప్రముఖులు పొట్టి శ్రీరాములుగారు నిరాహారదీక్ష చేస్తున్న శ్రీ బులుసు సాంబమూర్తి గారి నివాస గృహానికి చేరుకున్నారు. నేను కూడా వారితోపాటు వెళ్లాను.

నెహ్రూను నమ్మని శ్రీరాములు!

"మద్రాసు నగరంతో కూడిన ఆంధ్రరాష్ట్రం నిర్మించాలని అఖిలాంధ్ర మహాసభ తీర్మానించింది. తీర్మానాన్ని ప్రధాని నెహ్రూకు పంపాము. ఇక మీరు దీక్ష విరమించండి". అని బహుశా బులుసు సాంబమూర్తి గారు అప్పుడే స్పృహలోకి వచ్చిన శ్రీరాములుగారి చెవిలో గట్టిగా చెప్పడం వినిపిస్తున్నది. ఆయన గద్గద స్వరంతో "నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఇస్తానన్నాడా?" అని ఎదురు ప్రశ్న వేశారు. "ఇంకా ఏ ప్రకటనా రాలేదు. ఏదో క్షణంలో వస్తుంది. మీరు దీక్ష విరమించండి". అని ప్రకాశం గారు చెప్పారు. కాని, శ్రీరాములు గారు ఏమీ మాట్లాకుండ విరమించనన్నట్టు చెయ్యి వూపి, ఆ గోడవైపు తిరిగి పడుకున్నారు. అదీ ఆయన పట్టుదల!

అంతకు పూర్వం బహుశా 1952 మే నెలలో అనుకుంటాను, విజయవాడ నాస్తిక కేంద్రంలో జరిగిన సర్వోదయ మహాసభలో శ్రీరాములు గారిని చూశాను. అప్పుడు ఆయన నల్లగా, దృఢంగా వున్నారు. కాని, నిరాహార దీక్ష 50వ రోజున చూచినప్పుడు ముఖం తెల్లగా పాలి పోయింది రక్తహీనతతో. కళ్లు ఎక్కడో లోతుకుపోయాయి. చిక్కి శల్యావశిష్టంగా వున్నారు.

ఆ మరునాడు - డిసెంబరు 8వ తేదీన కూడా - మద్రాసులో వున్నాము. నెహ్రూ నుంచి టెలిగ్రామ్‌ వచ్చింది. ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని కాదు - ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలిస్తున్నామని! ఆ టెలిగ్రామ్‌ తీసుకుని, ప్రకాశం, బులుసు సాంబమూర్తి ప్రభృతులు శ్రీరాములు గారి వద్దకు వెళ్లారు. సాంబమూర్తి గారు శ్రీరాములు గారి చెవిలో నెహ్రూ టెలిగ్రామ్‌ విషయం గట్టిగా చెప్పారు.

"నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఇస్తానన్నాడా?" అని ఆయన గద్గద స్వరంతో ప్రశ్నించారు. "పరిశీలిస్తున్నారట!" అని సాంబమూర్తి గారు చెప్పారు. "అబ్బే!" అని శ్రీరాములు గారు దీక్ష విరమించనన్నట్టు చేతులు వూపి, గోడ వైపు తిరిగి పడుకున్నారు! అంతే! 1952 డిసెంబరు 15వ తేదీ రాత్రి ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన అయిదవ రోజున కాని - 19వ తేదీన - ప్రధాని నెహ్రూ ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించలేదు. ఈ లోగా ఆంధ్రజిల్లాలలో ప్రజలు ప్రభుత్వాన్నే స్తంభింపజేశారు!

రాజాజీ రహస్య నివేదిక

ప్రజాస్వామిక వాది అయిన నెహ్రూ ఆంధ్ర ప్రజాభిప్రాయాన్ని మన్నించడంలో అంత ఆలస్యం చేయడనికి కారణం లేకపోలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు పగలు నిరాహారదీక్ష అంటూనే రాత్రి అయ్యేసరికి మర్రి వూడల రసాన్ని త్రాగుతున్నారని, దానిలో ఎన్నో పోషక విలువలు వున్నాయని, అందువల్ల ఆయన మృతి చెందరని, కాబట్టి ఆయన దీక్షను ఖాతరు చేయనక్కరలేదని ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ప్రధాని నెహ్రూకు రహస్యంగా నివేదిక పంపారట! అందువల్లనే, ప్రధాని నెహ్రూ పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్షను గురించి పట్టించుకోలేదని ప్రతీతి!

"ఆంధ్రకేసరి" సభకు అధ్యక్షత....

ఆ సందర్భంగానే నాకు ఆంధ్రకేసరి ప్రకాశం గారి సభకు అధ్యక్షత వహించే అవకాశం కలిగింది. పొట్టి శ్రీరాములు గారి నిరాహారదీక్ష జరుగుతుండగా, డిసెంబర్‌ 14వ తేదీన ఆయన పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. దానితో యావదాంధ్ర దేశంలో నిరాహార వ్రతాలు, హర్తాళ్లు జరిగాయి. కృష్ణాజిల్లా గన్నవరంలో నా ఆధ్వర్యాన హర్తాళ్‌ జరుగుతున్నది. అది అన్ని రాజకీయ పార్టీలు - కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, ప్రజా పార్టీ (ప్రకాశం గారిది), కృషి కార్‌ లోక్‌పార్టీ (ఆచార్య రంగాగారిది) పాల్గొంటున్నాయి.

పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యస్థితి విషమంగా వుందన్న వార్త రావడంతో రాజమండ్రి పర్యటనలో వున్న ప్రకాశం గారు ఆ రాత్రి విజయవాడలో మద్రాసు మెయిల్‌ను అందుకోడానికి హుటా హుటిని కారులో బయలుదేరారు. మేము ఆ రోజున అటు విజయవాడ నుంచి ఏలూరు వైపు, ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే కారులను, బస్సులను, లారీలను ఆపి, వాటిలో ఎవరున్నా "నెహ్రూ వెంటనే ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలి", "పొట్టి శ్రీరాములు గారి ప్రాణాలు కాపాడలి" అంటూ నినాదాలు చేస్తే కాని, ఆ వాహనాలను కదలనివ్వడం లేదు!

అంతకు పూర్వం కొద్ది కాలం క్రితమే కొత్తగా వివాహమైన యువ సబ్‌ కలెక్టర్‌ శ్రీ టి. వేదాంతం (నూజివీడు) విజయవాడ నుంచి నూజివీడు వైపు కారులో సతీ సమేతంగా మెతున్నారు. మేము ఆయన కారు ఆపి, ముందు చెప్పిన నినాదాలు చేయవలసిందిగా కోరాము. మా మాట వినడం కొత్త భార్య ముందు తన అధికారానికి నామోషీగా తోచింది కాబోలు, ఆ యువ సబ్‌ కలెక్టర్‌ నినాదాలు చేయడానికి నిరాకరించారు! దానితో మేము కారు మరి ముందుకు వెళ్లడానికి వీలులేదని అడ్డంగా నిలబడ్డాము.

కోపోద్రిక్తుడైన ఆయన గన్నవరం విమానాశ్రయంలోని ఫోన్‌ వద్దకు వెళ్లి, మాపై ఫైరింగ్‌ ఉత్తరువు తీసుకువస్తానని బెదిరించారు! అయితే, మేమూ బెదరలేదు. ఫైరింగ్‌ ఆర్డర్‌ తెచ్చుకోమన్నాము! దానితో ఆయన మరింత ఆగ్రహంతో వచ్చిన దారినే వెనక్కి మళ్లీ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.

ఈ లోగా నా వెంట వున్న అన్ని పార్టీల మిత్రులు ఆయన నిజంగా తుపాకీ కాల్పుల ఉత్తరువు తీసుకు వస్తారేమోనని ఆందోళన పడ్డారు! అందులోను మధ్యాహ్న భోజనాల వేళ మించిపోతున్నది. భోజనాలు చేసి వద్దామని, నన్ను కూడా రమ్మన్నారు. తీరా సబ్‌ కలెక్టర్‌గారు ఫైరింగ్‌ ఆర్డర్‌ తీసుకువచ్చేసరికి, మేము భయపడి, పలాయనం చిత్తగించామని నవ్వుకోరూ! అందులోను నేను సైమన్‌ కమీషన్‌ రాక సందర్భంలో మద్రాసులో తెల్లవారి తుపాకీ గుండుకు గుండె చూపించిన తెలుగు వీరుడు "ఆంధ్రకేసరి" ప్రకాశంగారి శిష్యుడనయ్యె! నేను కూడా వెళ్లిపోతే ఎలా? ఆయన స్పూర్తి, సైమన్‌ కమిషన్‌ నాటి ఉదంతం ఆ క్షణాన నామదిలో మెరిశాయి. నేను మొండికేసి (అప్పటికి ఇంకా వివాహం కాలేదు లెండి!) ఆ గాంధి విగ్రహం వద్దనే నిలబడ్డాను - ఒక్కడినే! నా మిత్రుడు, నా వలెనే "ఆంధ్రకేసరి" వీరాభిమాని అయిన శ్రీ దాసరి పాపారావు మాత్రం నన్ను ఒంటరిగా వదల లేక, తాను నాతో వుండలేక, అక్కడికి కొంచెం దూరంలో వున్న మామిడి చెట్టు నీడలో నిలబడి, "కుటుంబరావు గారూ! రండి! వెదాం!" అంటూ కేకలు వేస్తున్నారు!

ఇంతలో సబ్‌ కలెక్టర్‌ శ్రీ తాడేపల్లి వేదాంతం కారులో రానేవచ్చారు. అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూచి, కారును వేగంగా నూజివీడు పోనిద్దామనుకున్నారు. నేను కారు నెంబరు చూసి, అడ్డంగా నిలబడ్డాను. ఆ పక్క పక్కలనే వున్నవారు తక్కిన వారు కూడా నాకు బాసటగా వచ్చారు.

ఇంతచేస్తే, జిల్లా కలెక్టర్‌ గారు సబ్‌ కలెక్టర్‌ గారికి కాల్పుల ఉత్తరువులు ఇవ్వలేదట! "ఇప్పటికే తాడేపల్లిగూడెం, ఏలూరు మొదలైన చోట్ల కాల్పులు జరిగాయి. ఇక, కాల్పులు వద్దని ముఖ్యమంత్రి గారు ఉత్తరువు చేశారు". అని కలెక్టర్‌ గారు సబ్‌ కలెక్టర్‌కు చెప్పారని మాకు తరువాత తెలిసింది! అందువల్ల, సబ్‌ కలెక్టర్‌గారే స్వయంగా కారు దిగి, మేము చెప్పిన నినాదాలు చేసే సరికి మేమందరం ఆయనతో సంతోషంగా కరచాలనం చేశాము!

'ఆంధ్రకేసరి! ప్రత్యక్షం!

మేము అలా కార్లను ఆపుతూ వుండగా, ఏలూరు వైపు నుంచి ఒక కారు వస్తున్నది. మేము ముందుగానే దానికి అడ్డంగా నిలబడ్డము. తీరా కారు దగ్గరకు వచ్చి ఆగేసరికి, దానిలో ఎవరున్నారు? సాక్షాత్తు "ఆంధ్రకేసరి" ప్రకాశం గారు! మేమందరం ఆశ్చర్యానందాలతో "ఆంధ్రకేసరి" జిందాబాద్‌! "ఆంధ్రకేసరి" జిందాబాద్‌! అంటూ నినాదాలు చేశాము. ఆయన కారులోనే కూర్చుని, "నేనిప్పుడు అర్జంటుగా మద్రాసు వెడుతున్నాను. పొట్టి శ్రీరాములు గారి పరిస్థితి విషమంగా వుందట" అన్నారు.

"ఔనండీ! ఆ సమస్యపైనే మేము అన్ని పార్టీలు కలిసి హర్తాళ్‌ చేస్తున్నాము. మీరు దయచేసి, కిందకు దిగి, ఇక్కడ వున్న అన్ని పార్టీల సభ్యులను వుద్దేశించి, రెండు మాటలు చెబితే సంతోషిస్తాము" అన్నాను.

ఆయన నెమ్మదిగా కారు దిగి వచ్చారు. ప్రక్కనే వున్న పందిరి కింద అప్పటికప్పుడు రెండు, మూడు కుర్చీలు వేశాము. కమ్యూనిస్టు సభ్యుడొకరు నా పేరు సభకు అధ్యక్షుడుగా ప్రతిపాదించారు. నేను ఎక్కువ మాట్లాకుండా ప్రకాశంగారిని సందేశమివ్వవలసిందిగా కోరాను. ఆయన కూర్చుని మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి నిరాహారవ్రత వుద్దేశాన్ని వివరించారు. ఆయన పరిస్థితి ఎలా వుంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఇలా అన్నారు.

"కుటుంబరావు పత్రికా నిర్వహణలో దిట్ట. సభా నిర్వహణలో దక్షుడు. జంకూ గొంకూ లేకుండ మాట్లాడే ఉపన్యాసకుడు" అని నన్ను ప్రశంసించం నా జీవితంలో మరపురాని సన్నివేశం. అప్పటికే "తెలుగు స్వతంత్ర"లోను, "ప్రతిభ" పత్రికలోను నేను ఆయనను గురించి వ్రాసిన వ్యాసాలను చదివినట్టు నాకు కొందరు ప్రముఖులు చెప్పారు. 1951 ఏప్రిల్‌ 27వ తేదీన విజయవాడలో ఆయన స్థాపించిన ప్రజాపార్టీ ఆవిర్భావ సభలో నా ఉపన్యాసాలు విన్నారు. ఆనాడు ఆయన అన్నమాటలను నా మానస పేటికలో భద్రంగా దాచుకున్నాను. ఆ తరువాత ఆయన కారులో విజయవాడ మీదుగా మద్రాసు వెళ్లారు.

అసెంబ్లీకి పోటీ!

1952లో నవ భారత రాజ్యాంగం ప్రకారం మద్రాసు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటికే నేను ప్రకాశం గారి దృష్టిలో పడ్డాను. నా కలం, గళం ఆయన దృష్టిలో పడినవని ఇంతకు పూర్వమే పేర్కొన్నాను. అప్పటిలో నేను వుంటున్న కృష్ణాజిల్లా గన్నవరం - గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వుండేది. ప్రకాశం గారు గుడివాడ నియోజకవర్గానికి తమ ప్రజా పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా నియమించదలచి, నన్ను మద్రాసు రమ్మని కబురంపారు. గన్నవరంలో ప్రజా పార్టీ నాయకుడు శ్రీ నండూరి సీతాపతి నన్ను మద్రాసు మెయిల్‌లో ప్రకాశంగారి వద్దకు తీసుకువెళ్లారు. ఆయన నన్ను చూచి, "గుడివాడ నియోజక వర్గానికి చురుకైన యువకుడిని నిలబెట్టాలనుకుంటున్నాను. నీ కిష్టమైతే చెప్పు" అన్నారు. "నాకు అంత కంటె అదృష్టం ఏ ముంటుంది పంతులు గారూ! ఇంత చిన్న వయస్సులో మీ వాత్సల్యానికి పాత్రుణ్ణి కావడం నా అదృష్టం" అన్నాను. తీరా నా వయస్సు ప్రసక్తి వచ్చేసరికి 20 ఏళ్లు! అసెంబ్లీ అభ్యర్ధికి కనీసం 25 సంవత్సరాలుండాలి. దానితో నేను "తిరుగు టపా"లో ఆ రాత్రే గన్నవరం తిరిగి వచ్చి వేశాను!

ఆ తరువాత అప్పటిలో మద్రాసు నుంచి వెలువడే "తెలుగు స్వతంత్ర" వారపత్రికలో నేను ప్రతివారం ఒక రాజకీయ వ్యాసం వ్రాసేవాడిని. ఆ పత్రికలోనే నేను అప్పటి ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితిని గురించి, కాంగ్రెస్‌ నాయకులను గురించి ప్రధాని నెహ్రూకు రాసిన రెండు ఇంగ్లీషు లేఖలను నేనే తెలుగులోకి తర్జుమా చేసి, బహిరంగ లేఖలుగా ప్రచురించేసరికి వాటికి ఎనలేని ప్రాచుర్యం, నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ పత్రికకు ప్రకాశం గారి "స్వరాజ్య"పత్రికలో సంపాదకుడుగా పనిచేసిన శ్రీ ఖాసా సుబ్బారావు ఎడిటర్‌ కాగా, శ్రీ గోరా శాస్త్రి సహాయ సంపాదకుడు. శ్రీ గోరా శాస్త్రి తెలుగులో ప్రసిద్ధ సంపాదకులలో ఒకరు. ఆయన ఆ తరువాత చాలాకాలం"ఆంధ్రభూమి" తెలుగు దినపత్రికకు ఎడిటర్‌గా వున్నారు. మేమిద్దరం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల కమిటీలో ఒక పర్యాయం సభ్యులుగా పనిచేశాము. ఆ కమిటీకి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి చైర్మన్‌.

ఫిలిం పరిశ్రమతో సంబంధం

నేను మొత్తం ఏడు సార్లు నంది అవార్డుల కమిటీ సభ్యుణ్ణి. శ్రీ గోపాలరెడ్డి తరువాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ పి. జగన్మోహనరెడ్డి, ఆ పిమ్మట మాజీ ఆర్ధిక మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ఆ కమిటీలకు చైర్మన్‌లుగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా దాదాపు 20 సంవత్సరాలు పని చేయడం వల్ల ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం వగైరాల ఎంపికలో కమిటీ చైర్మన్‌లు సహజంగా నా అభిప్రాయాలకు హెచ్చు ప్రాధాన్యమిచ్చే వారు. నేను నంది అవార్డుల కమిటీలతో పాటు ఒక సారి నంది టి.వి. ఫిలిం అవార్డుల కమిటీలో కూడా వున్నాను. ఈ కమిటీలకు ఒకసారి హైకోర్టు జడ్జిగాను, యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గాను పనిచేసిన జస్టిస్‌ రామానుజులు నాయుడు చైర్మన్‌గా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఫాన్స్‌ అసోసియేషన్‌తో నా సంబంధం వల్ల ఫిలిం పరిశ్రమకు నేను సన్నిహితుణ్ణి అయ్యాను.

ఆ అసోసియేషన్‌కు మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శిని. ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో 42 శాఖలుండేవి. ప్రతి సంవత్సరం ఫిలిం బ్యాలట్‌ పెట్టి, రాష్ట్రంలో ఏదో ఒక పట్టణంలో ఫిలిం అవార్డుల సభలను మహా వైభవంగా జరిపేవారం. విజయవాడలోను, మరికొన్ని నగరాలలోను జరిగిన సినిమా సభలన్నింటికి నన్ను అధ్యక్షుడుగా ఆహ్వానించేవారు. ముఖ్యంగా విజయవాడలో అయితే, ఇప్పటికీ - అంటే ఈ "స్వీయ కథ" రాస్తున్న 2010 వరకు అంటే అర్ధ శతాబ్దికి పైగా - విజయవాడలో జరిగిన సినిమా సభలన్నింటికీ నేనే అధ్యక్షుణ్ణి అనడంలో అత్యుక్తి కాని, ఆత్మస్తుతి కాని లేవు.

సినీ రంగంతో ఇంతగా, సంబంధాలు వుండడం వల్లనే "ఆంధ్రజ్యోతి" గ్రూప్‌కు చెందిన "జ్యోతిచిత్ర" సినీ వారపత్రికకు ఎడిటర్‌గా నన్నే నియోగించి, ఆ పత్రిక పై ఎడిటర్‌గా నా పేరు ముద్రించేవారు. అయితే, నేను "జ్యోతిచిత్ర" పనికాక, "ఆంధ్రజ్యోతి" దినపత్రిక పనే చూచేవాడిని. దినపత్రికలో ప్రత్యామ్నాయ సంపాదకీయ రచయితగాను, రెండవ పేజీలో ఫీచర్స్‌ ఎడిటర్‌గాను, సినిమా పేజి ఎడిటర్‌గాను పనిచేశాను. "జ్యోతిచిత్ర" పనిమాత్రం శ్రీ వివేకానంద మూర్తి, శ్రీ తోటకూర రఘు ప్రభృత సినీపాత్రికేయ ప్రముఖులు చూచేవారు. ఆ సమయంలోనే "జ్యోతిచిత్ర" సర్‌క్యులేషన్‌ లక్షకుపైగా దాటి, అప్పటిలో సమకాలిక సినీ వారపత్రికలలో అగ్రేసరంగా నిలిచింది. కృషి వారిది, పేరు నాకు! "జ్యోతిచిత్ర" ఆ స్థాయికి వెళ్లడానికి శ్రీ తోటకూర రఘు కృషి కారణం.

సినీ రంగంలో అంత సన్నిహితంగా వుండడం వల్ల నాకు ఇండియా ప్రభుత్వం ఫిలిం సలహా సంఘం, కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యత్వం లభించాయి. అంతేకాక, ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఫాన్స్‌ అసోసియేషన్‌ వార్షిక ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాలను భారీ యొత్తున సంవత్సరానికి ఒక్కొక్క పట్టణంలో నిర్వహించాము. ఆ సభలకు అగ్రశ్రేణి సినీ నటి నటులు, సాంకేతిక నిపుణులు, మంత్రులు వచ్చే వారు. ఆ సభలకు నేను వ్యాఖ్యాతగా వ్యవహరించే వాడిని. అందువల్ల నా వాగ్ధాటి పెరిగింది! దానికి విపరీతమైన ప్రాచుర్యమే వచ్చిందని చెప్పవచ్చు. అప్పటిలో నాకు "ఉపన్యాసకేసరి" అన్న బిరుదు రావడానికి ఆ సభలే కొంతవరకు కారణమని చెప్పాలి.

అక్కినేనికి "నట సామ్రాట్‌" బిరుదు

కాగా, 1957లో నేను "ప్రజా సేవ" తెలుగు వారపత్రిక ఎడిటర్‌గా వున్నప్పుడు ప్రఖ్యాత నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర జీవిత వజ్రోత్సవం మద్రాసులో అత్యంత వైభంగా జరిగింది. ఆ మహోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ ఎస్‌. నిజలింగప్ప - పాల్గొన్నారు.

Naa Kalam - Naa Galam Page 53 Image 0001
Naa Kalam - Naa Galam Page 53 Image 0001

కాగా, శ్రీ అక్కినేని నట జీవితానికి పునాదులు పరిచిన కృష్ణాజిల్లాలో, ముఖ్యంగా తెలుగు సినీ రాజధాని విజయవాడలో ఆయన నట జీవిత వజ్రోత్సవం జరపాలన్న ఆలోచన ఆ నగరంలోని తెలుగు సినీ పరిశ్రమకు వచ్చింది. తెలుగు చలనచిత్ర నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులు ఆ ప్రాంతం నుంచే వెళ్లాలి. మద్రాసులో నిర్మించే తెలుగు చిత్రాలను పంపిణీ చేసే ముఖ్యమైన డిస్ట్రిబ్యూటింగ్‌ సంస్థలకు కేంద్రం విజయవాడే. అక్కినేని స్వస్థలం వెంకట రాఘవాపురం విజయవాడకు దాదాపు 30 మైళ్ల దూరం.

అందువల్ల, విజయవాడలో వజ్రోత్సవం జరపడానికి సన్నాహ సంఘం ఏర్పాటుకు చిత్రరంగ ప్రముఖులు, నగర పెద్దలు సమావేశమైనారు. అప్పటికి - 1957 నాటికి - నా వయస్సు 24 సంవత్సరాలు. అయినా, అప్పటికే నేను పత్రికా సంపాదకుణ్ణి కావడం వల్ల నన్ను కూడా ఆహ్వానించారు. అక్కినేనికి సన్మానంలో భాగంగా గజారోహణ, పురవీథులలో ఊరేగింపు మొదలైన సూచనలు వచ్చాయి. వాటిని అందరూ అంగీకరించారు. "గజారోహణం, పురవీథులలో ఊరేగింపు, శాలువాలు, పూలదండలతో సత్కారం, జ్ఞాపిక బహూకృతి - ఇవి ఆ రోజుతోనే మరచిపోయేవి. వాటితోపాటు వజ్రోత్సవ సందర్భంగా శ్రీ నాగేశ్వరరావుకు ఒక బిరుదు ప్రదానం చేస్తే, అది కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది." అని నేను ప్రతిపాదించాను.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడు శ్రీ పోతిన బెనర్జీ కొంచెం వెటకారంగా మాట్లాడుతారు. ఆయన సామాన్యుడు కాడు. ఆంధ్రప్రాంతంలో ప్రప్రథమ సినిమా థియేటర్‌ మారుతి సినిమా హాలు యజమాని. ఆయన తండ్రి శ్రీ పోతిన శ్రీనివాసరావు ఆ థియేటర్‌ను 1921లో నిర్మించారు.

అందువల్ల, పోతిన వారి కుటుంబానికి సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలుండేవి. నా ప్రతిపాదన వినగానే శ్రీ బెనర్జీ "బిరుదులు భుజకీర్తులూ దేనికి?" అని తన సహజ ధోరణిలో వ్యాఖ్యానించారు. కాని, నా ప్రతిపాదనను కమిటీలోని తక్కిన వారందరూ సమర్ధించారు. వెంటనే శ్రీ బెనర్జీ "తుర్లపాటి గారూ! బిరుదు ఇవ్వాలంటున్నారు కాబట్టి, ఆ బిరుదు ఏమిటో మీరే చెప్పండి" అన్నారు. నేను "నట సామ్రాట్‌!" అన్నాను! "తెలుగు చలనచిత్ర నట ప్రపంచానికి అక్కినేని సామ్రాట్‌. ఆయనకు సాటి ఆయనే. అందరిలో ఆయన సీనియర్‌. పైగా, ఇప్పటికి 60 చిత్రాలలో హీరోగా నటించి, "హీరో నాగేశ్వరరావు" అన్న ఖ్యాతి సంపాదించారు. ఆయన ఆ బిరుదుకు ఎంతైనా అర్హులు" అని నేను వివరించాను. నిజానికి, ఆ బిరుదు "నట సామ్రాట్‌"ను ఆ తరువాత శ్రీ అక్కినేని సభలలో ఊపుకోసం, ప్రేక్షకులలో ఉద్వేగం కలిగించడానికి "నటసామ్రాట్‌" అని ఒత్తి పలికేవాడిని! ప్రేక్షకులు ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేసే వారు!

ఆ బిరుదును సన్మానం రోజున శ్రీ అక్కినేనికి యిచ్చే సన్మాన పత్రంలో చేర్చి ప్రదానం చేయాలని, సన్మానపత్రం కూడా నేనే రాయాలని, ఆ నాటి సభకు ముఖ్య అతిధిగా వచ్చే డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ద్వారా శ్రీ నాగేశ్వరరావుకు ప్రదానం చేయాలని నిర్ణయించారు.

విజయవాడ గాంధీజీ మునిసిపల్‌ హైస్కూలులో బ్రహ్మాండమైన సన్మాన సభ. డాక్టర్ గోపాలరెడ్డి, ఆంధ్ర ఆంధ్రేతర చలనచిత్రరంగాల ప్రముఖులు, వేలాది ప్రజలు పాల్గొన్నారు. తీరా అక్కినేనికి బిరుదు ప్రదాన సన్మానపత్రాన్ని నేను చదివే సమయానికి సభను చెల్లా చెదురు చేసే గాలివాన! షామియానాలు కూలిపోకముందే అందరం తలొక చోటకు తలదాచుకోడానికి చెదిరిపోయాము. అందరితోపాటు నాకు తీవ్రమైన ఆశాభంగం! అలాంటి "దబాటువానలు" ఎక్కువ సేపు వుండవు. అందులోను అది ఆగస్టు నెల. శ్రావణ మాసం. వర్షాలకేమి లోటు! ఇప్పటివలె అప్పట్లో వర్షాలకోసం వరుణ పూజలు, యజ్ఞయాగాదులు చేయవలసిన అవసరం వుండేది కాదు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలలో ఇట్టే వర్షంపడి, అట్టే తెరపియిచ్చేది. ఒక్క రోజులోనే వచ్చే వాన, వెలిసేవాన! ఎన్ని సార్లో!

మరి, అక్కినేని సన్మానసభను అర్ధంతరంగా ముగించవలసి వచ్చింది కదా! ఆ రోజు రాత్రి ఆంధ్ర ఫిలిం చాంబర్‌ వారు శ్రీ అక్కినేని గౌరవార్ధం గాంధినగర్‌లోని ఎస్‌.కె.పి.వి.వి. హిందూ హైస్కూల్‌ హాలులో విందు ఏర్పాటు చేశారు. ఆ విందు సభలోనే సన్మాన పత్రాన్ని నేనే చదివి, శ్రీ గోపాలరెడ్డి ద్వారా శ్రీ నాగేశ్వరరావుకు సమర్పించాలని ఆహ్వాన సంఘం వారు నిర్ణయించారు.

అందరూ భోజనం చేస్తున్నారు. తీరా నేను సన్మానపత్రం చదవడం ప్రారంభించేసరికి కరెంట్‌ పోయింది! అయినా, నేను బెంబేలు పడలేదు. సన్మానపత్రం రాసింది నేనే కాబట్టి, చీకట్లో అయినా దానిలో ఏమున్నదో చూడకుండానే చెప్పగలను. అందువల్ల, "చేతికి, నోటికి మధ్య అడ్డం లేదంటారు. మీరు చేతితో భోజనం చేస్తూ చెవులు మాత్రం నాకివ్వండి" అని సన్మానపత్రం ఆ సాంతం చదివినట్టు నటించి, శ్రీ గోపాలరెడ్డి ద్వారా శ్రీ నాగేశ్వరరావుకు సమర్పించాము.

ఇదీ అక్కినేనికి "నటసామ్రాట్‌" బిరుదు ప్రదానగాథ. ఆ బిరుదు "ప్రసవం" అన్ని అవాంతరాల మధ్యా జరిగింది! అయితే నేమి, "నట సామ్రాట్‌" అంటే నాగేశ్వరరావు, నాగేశ్వరరావు అంటే "నట సామ్రాట్‌" - రెండూ పర్యాయ పదాలైపోయినాయి!

శ్రీ అక్కినేని రెండు, మూడు సభలలో ఏమన్నారంటే, "ఆరోజులలో సినీ నటులకు పిల్ల నివ్వడానికి చాలా మంది ముందుకు వచ్చే వారు కాదు. సినిమాలలో వేషాలు వేసే వారికి అప్పటిలో ఇప్పటి అంతగా "గ్లామర్‌", విలువ వుండేవి కావు. అలాంటి పరిస్థితులలో ఈ "నటసామ్రాట్‌" బిరుదు సినీనటుల విలువను పెంచింది. సినీ కళాకారులు కూడా గౌరవనీయులు అన్న భావన విస్తరించింది". అన్నారు.

శ్రీ అక్కినేనికి "పద్మభూషణ్‌" అవార్డు వచ్చినప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. "ఈ పద్మభూషణ్‌" కంటె నాకు ఎప్పుడో ఈ విజయవాడ ప్రజలు ప్రదానం చేసిన "నట సామ్రాట్‌" బిరుదుకే నా దృష్టిలో విలువ ఎక్కువ" అని ఆ సభలో అక్కినేని అన్నారు. ఢిల్లీలో శ్రీ అక్కినేని పాల్గొన్న ఒక సభలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి "నట సామ్రాట్‌" బిరుదును గురించి ప్రస్తావించారు. బహుశా ఏ నటునికి వున్న బిరుదైనా, నాగేశ్వరరావుకు "నట సామ్రాట్‌"వలె వారి పేరులో భాగం కాలేదు!

ఆ బిరుదుకు శ్రీ అక్కినేని ఎంత విలువ ఇచ్చారంటే, ఆయనకు ఆ బిరుదు ప్రదానం జరిగి 2007 ఆగస్టుకు 50 సంవత్సరాలు పూర్తి అయినాయి. అంటే "నటసామ్రాట్‌" బిరుదుకు అది స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సందర్భంగా శ్రీ అక్కినేని నన్ను హైదరాబాద్‌ ఆహ్వానించి, పాత్రికేయులు, సినీ ప్రముఖుల సమక్షంలో సన్మానం చేశారు.

ఆ సభకు ముఖ్య అతిధిగా ప్రఖ్యాత సినీ దర్శకులు "కళా తపస్వి" శ్రీ కె. విశ్వనాథ్‌ హాజరైనారు.

మూడు "పి" లు

సినీ ప్రపంచంతో నాకు గల ఈ సంబంధం, అనుబంధాలను గమనించి, 1978లో నేను అధికార భాషా సంఘం సభ్యుడుగా నియమించబడిన సందర్భంగా విజయవాడలో జరిగిన అభినందన సభలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆ సంఘం అధ్యక్షులు శ్రీ వందేమాతరం రామచంద్రరావు -

"తుర్లపాటి ఇంత ఉన్నతికి రావడనికి మూడు "పి"లు కారణమని నా అభిప్రాయం - ప్రెస్‌ (పత్రికలు), పిక్చర్‌ (సినిమారంగం), ప్లాట్‌ ఫామ్‌ (వేదిక పై ఉపన్యాసాలు) అన్నారు.

శ్రీ తెన్నేటి షష్టిపూర్తి

శ్రీ తెన్నేటి విశ్వనాథం ప్రముఖ పార్లమెంటేరియన్‌, మహా మేధావి. కవి, గ్రంథ రచయిత. నీతి నిజాయితీలకు ఆయన మరో పేరు. "మర్యాద మన్ననలు, సంస్కృతి సభ్యతలు ఆయనలో మూర్తీభవించిన"వని ఒకసారి ఇంగ్లీషు దినపత్రిక 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' వ్రాసింది. శ్రీ తెన్నేటి ఆంధ్రరాష్ట్ర ప్రథమ మంత్రివర్గంలో ఆర్ధిక, న్యాయశాఖలమంత్రి.

మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం మంత్రివర్గంలో (1946 - 47) చీఫ్‌ పార్లమెంటరీ సెక్రటరీ. విశాఖపట్నం నుంచి ఆయన రెండు, మూడు సార్లు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైనారు. "ఆంధ్రకేసరి" ప్రకాశం గారికి ఆయన అత్యంత సన్నిహిత సహచరుడు. ప్రకాశం గారు రోమన్‌ హీరో జూలియస్‌ సీజర్‌ అయితే, తెన్నేటిని మార్క్‌ ఆంటోనితో పోల్చవచ్చు. అలాంటి ఆయన షష్టిపూర్తి మహోత్సవాన్ని ఆయన అభిమానులు విశాఖపట్నంలో జరపదలచినప్పుడు అక్కడి పాత్రికేయులు అందుకు సంబంధించిన వార్తలకు తగినంత ప్రచారమివ్వడంలేదని ఆ షష్టిపూర్తిని తలపెట్టిన పెద్దలు భావించారు. ఎంత గొప్పవాడైనా, తన స్వగృహంలోను, తన స్వస్థలంలోను ఆయన గొప్పతనాన్ని అంతగా గుర్తించరు. అందు వల్లనే "ఏ గతి రచియించితేని సమకాలము వారలు మెచ్చరేకదా!" అంటూ చేమకూర వెంకట కవి వాపోయాడు. బహుశా ఆ గొప్పవాడి గోత్రాలు, బలహీనతలు, లోపాలు స్థానికులకు బాగా తెలిసి వుండం ఇందుకు ఒక కారణం కావచ్చు. అయితే, తెన్నేటి వారి చరిత్ర "తెరిచిన పుస్తకం". స్వచ్ఛమైన ధవళ వస్త్రం వంటిది. రాజకీయరంగంలో ఎన్నో ఉత్తమ సంప్రదాయాలకు ఆంధ్రలో ఆయన ఆద్యులు, ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికై, మరో పార్టీలో చేరిన వారు వెంటనే తమ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి ఇండి పెండెంట్‌గానో, కొత్త పార్టీ టిక్కెట్టు పైనో పోటీ చేసి గెలవాలన్న సంప్రదాయాన్ని 1951లో తాను కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసినప్పుడు నెలకొల్పారు.

అలాంటి మహనీయుని షష్టిపూర్తి మహోత్సవానికి తగినంత ప్రచారం అక్కడి పాత్రికేయు లివ్వడంలేదని, విశాఖపట్నానికి ఎక్కడో సుదూరాన గన్నవరంలో వుంటున్న నన్ను షష్టిపూర్తి కమిటికి ఒక ప్రధానకార్యదర్శిగా నియమించి, ప్రచార బాధ్యతను నాకు అప్పగించారు. నాకు అప్పగించిన బాధ్యతకు తగినంత న్యాయంచేశాననే నేను భావించాను. శ్రీ తెన్నేటి, ఆయన విశిష్ట రాజకీయ, పార్లమెంటరీ జీవితాన్ని గురించి వివిధ దిన, వార, పత్రికలలో వార్తలు, వ్యాసాలు ప్రచురింపజేశాను. ఈ విషయాన్ని శ్రీ తెన్నేటి కూడా తన షష్టిపూర్తి ఉత్సవంలో ప్రస్తావించి, నన్ను అభినందించారు. అప్పటికి నా వయస్సు 23 సంవత్సరాలు!

విశాఖ పెద్దలు శ్రీ తెన్నేటి జీవిత చరిత్ర గ్రంథాన్ని వ్రాయించి ప్రచురించాలని నిర్ణయించినప్పుడు ఆ గ్రంథ రచన బాధ్యతను నాకే అప్పగించారు. ఆ కమిటికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆ సమయంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం వైస్‌- ఛాన్సలర్‌ అయిన శ్రీ ఆవుల సాంబశివరావు చైర్మన్‌. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, ఆ తరువాత ఉపరాష్ట్రపతి అయిన శ్రీ కృష్ణకాంత్‌ విశాఖపట్నంలో జరిగిన సభలో ఆ గ్రంథావిష్కరణ చేశారు.

నాపై అరెస్టు వారెంట్‌!

1956లో నేను "ప్రజా సేవ" పత్రిక ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం కాలేదు. "విశాలాంధ్ర" (ఆంధ్రప్రదేశ్‌) ఏర్పాటు చేయాలని తీవ్రమైన ఆందోళనోద్యమం సాగుతున్నది. "విశాలాంధ్ర" నిర్మించాలంటే, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించాలి. హైదరాబాద్‌ రాష్ట్రం తెలంగాణా (తొమ్మిది జిల్లాలు) మరాఠ్వాడ (మరాఠి మాట్లాడే అయిదు జిల్లాలు), కన్నడం మాట్లాడే రెండు జిల్లాల కలగాపులగం. అప్పటి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు. ఆయన కూడా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల ఏకీకరణతో "విశాలాంధ్ర"కు అనుకూలుడు.

"విశాలాంధ్ర" నిర్మాణ ఉద్యమానికి అనుకూలంగా తెలంగాణా ప్రాంతంలో ప్రచారం చేయడానికి వెళ్లిన ప్రముఖ ఆంధ్రనాయకుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంపై అక్కడి ప్రత్యేక తెలంగాణావాదులు దౌర్జన్యం జరిపి, చొక్కా చింపి వేశారు. ఆ సంఘటనలో వారు పాల్గొనలేదుకాని, అప్పటి హైదరాబాద్‌ మంత్రి వర్గంలో మంత్రులైన మామా అల్లుళ్లు శ్రీ యుతులు కొండా వెంకటరంగారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారలు 'విశాలాంధ్ర' నిర్మాణానికి వ్యతిరేకులు. అలాగే "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అనే పేరుతో పుస్తకం రాసి, ఆ ఉద్యమానికి ఊపు, ఉత్సాహం కల్పించిన "మార్క్సిస్టు గాంధి" శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యపై కూడా అప్పటిలో తెలంగాణా ప్రాంతంలో దౌర్జన్యం జరిగింది.

ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని పేర్కొనాలి. 'విశాలాంధ్ర' నిర్మాణానికి అప్పటి ప్రధాని పండిట్‌ నెహ్రూ, కేంద్ర విద్యామంత్రి, జాతీయ ముస్లిం మహానాయకుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వ్యతిరేకులు. కారణం మరేమీ లేదు. మూడు భాషా ప్రాంతాల (తెలుగు, మరాఠి, కన్నడం) సమ్మేళనమైన హైదరాబాద్‌ ఉర్దూ భాషా ప్రాచుర్యంతో "దక్కన్‌ సంస్కృతి"కి నిలయం. ఆ "దక్కన్‌ సంస్కృతి"ని విచ్ఛిన్నం చేయరాదని నెహ్రూ, ఆజాద్‌ల పట్టుదల. అప్పటిలో హైదరాబాద్‌ రాష్ట్రం విభజనకు ఆనాటి ముస్లిం ప్రముఖులు కొందరు ప్రతికూలం. వారికి సహజంగానే మౌలానా ఆజాద్‌ వత్తాసు. ఆయన ఉర్దూభాషలో మహాపండితుడు. నెహ్రూకు కుడిభుజం. ఇక చెప్పేదేమున్నది? వారిద్దరి వ్యతిరేకత "విశాలాంధ్ర" నిర్మాణానికి అవరోధం.

ఆ పరిస్థితులలో నేను ఎడిటర్‌గా వున్న "ప్రజా సేవ"లో "తెలుగువాడా!" అన్న శీర్షికతో తీవ్రపదజాలంతో "విశాలాంధ్ర" నిర్మాణానికి అవరోధాలు కల్పిస్తున్న వారిని విమర్శిస్తూ సంపాదకీయం రాశాను. దానిలో నెహ్రూ - ఆజాద్‌ల ప్రతికూలతను కూడా ఖండించాను. ఆ ప్రతి కూలతను ప్రతిఘటించడానికి తెలుగు వారందరు ఏకత్రాటిపై నడవాలని "విశాలాంధ్ర" ఉద్యమాన్ని మహోధృతం చేయాలని రాశాను. దానిపై నాకు ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేయనున్నట్టు నాకు రహస్య సమాచారం అందింది. ఈ సమాచారాన్ని నా చెవిలో వూదింది - శ్రీ శ్రీపతి కూనారావు అనే సి.ఐ.డి. పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌. ఆయన మా స్వగ్రామం పామర్రు వాసి.

"మీరు రాసిన ఉద్రేక పూరితమైన సంపాదకీయం ప్రజలను రెచ్చగొట్టేదిగా వున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల, మీరు అలాంటి సంపాదకీయం రాసినందుకు విచారిస్తున్నట్టు మీ పత్రికలోనే ఒక ప్రకటన వేస్తే, మీ పై అరెస్టు వారెంట్‌ అమలు కాకుండా నేను చూస్తాను" అంటూ ఆయన నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అందుకు కారణం కేవలం ఆయన, నేను ఒకే గ్రామవాసులం కావడం వల్ల నా పట్ల ఆయనకు గల అభిమాన వాత్సల్యాల వల్లనే. ఆయన వయస్సులో నా కంటె చాలా పెద్దవాడు.

"నేను వ్రాసిన సంపాదకీయానికి క్షమాపణ ప్రకటన చేయడం ఏ పరిస్థితిలోను జరగదు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనే అవకాశం, అందువల్ల జైలుకు వెళ్లే అవకాశం నాకు ఎటూ లభించలేదు. ఇది మంచి అవకాశం. ఇప్పుడైనా ఈ "విశాలాంధ్ర" ఉద్యమం పేరుతో జైలుకు వెళ్లే అవకాశం లభిస్తుంది" అని నేను ఆ పోలీసు మిత్రునికి చెప్పాను. నా పత్రికా స్వేచ్ఛా ప్రవృత్తికి ఆయన సంతోషించాడు.

ఇంతలో ప్రజాస్వామికవాది అయిన ప్రధాని నెహ్రూ ప్రజాభిప్రాయానికి తలవొగ్గి, హైదరాబాద్‌ రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నదని, అందువల్ల తెలంగాణా, ఆంధ్రప్రాంతాల ఏకీకరణ జరుగుతుందని 1956 ప్రారంభంలో నిజామాబాద్‌ సభలో ప్రకటించారు. అందువల్ల, నాపై అరెస్టు వారెంట్‌ జారీ కాలేదు! "స్వరాజ్య" సాధనోద్యమంలో జైలుకు వెళ్లే అవకాశం లభించకపోయినా, "స్వరాష్ట్ర" సాధనోద్యమంలో జైలు ముఖం చూచే అవకాశం

తప్పిపోయినందుకు కొంత ఆశాభంగం చెందాను!

డాక్టర్ అంబేద్కర్‌తో ఇంటర్‌వ్యూ

Naa Kalam - Naa Galam Page 62 Image 0001
Naa Kalam - Naa Galam Page 62 Image 0001

1951 చివరలో నా జీవితంలో మరపురాని గర్వకారణమైన సంఘటన జరిగింది. అది నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌తో ఇంటర్‌వ్యూ. అప్పటికి రాజ్యాంగ రచన పూర్తి అయింది. స్వతంత్ర భారత తొలిప్రభుత్వంలోని తన న్యాయశాఖ మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో నిమ్న జాతుల మహాసభలో పాల్గొనడానికి వెడుతూ మార్గం మధ్యలో గన్నవరం ట్రావెలర్స్‌ బంగాళాలో ఆగారు. అప్పుడు నేను "ఆంధ్రపత్రిక" దినపత్రికకు గన్నవరంలో విలేకరిని.

నవ భారత రాజ్యాంగ నిర్మాత గన్నవరం వస్తున్నారంటే, ఎక్కడలేని సంచలనం. ఇప్పటివలె అప్పట్లో తీవ్రమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసుల హడవుడి ఏమీ వుండేవి కావు. అందువల్లనే, 1951 చివరలో నేను సాక్షాత్తూ దేశ ప్రధాని నెహ్రూను విజయవాడ రైలు స్టేషన్‌లో సులభంగా కలుసుకుని స్వయంగా మాట్లాగలిగాను.

బాబా సాహెబ్‌ను గన్నవరం టి.బిలో కలుసుకుని, నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

నవ భారత రాజ్యాంగం ముసాయిదాను దాదాపు ఒంటరిగా రూపొందించినందుకు ఆయనను అభినందించాను. ఆయన చిరునవ్వు నవ్వారు.

"మీరు రచించిన రాజ్యాంగం ప్రకారం జరిగే తొలి ఎన్నికల వరకైనా (1952) మీరు కేంద్రంలో న్యాయశాఖమంత్రిగా వుంటే బాగుండేదని" నేను అనగా, కేంద్ర ప్రభుత్వం హిందూకోడ్‌ బిల్లులో తనకు నచ్చని అంశాలు అనేకం వున్నాయని, ఆ విషయంలో ప్రధాని నెహ్రూతో తనకు అభిప్రాయాలు ఏర్పడ్డాయని, అందువల్లనే రాజీనామా చేయవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

"నవభారత రాజ్యాంగ రచనా బాధ్యతను మీకు అప్పగించాలని ప్రధాని నెహ్రూకు సూచించిన మహాత్మాగాంధికి భారతజాతి కృతజ్ఞత చెప్పాలి" అని నేను అనగా, ఆయన చిరునవ్వుతో....

"రాజ్యాంగ రచన పూర్తి కాకుండనే గాంధీజీ మృతి చెందడం దురదృష్టం (స్వాతంత్య్రం వచ్చిన అయిదున్నర నెలలకే గాంధీజీ హత్య జరిగింది). ఆయన జీవితాంతం పోరాడిన అస్పృశ్యతను మన రాజ్యాంగంలో శిక్షార్హమని పేర్కొనడం, దాన్ని ఆదేశిక సూత్రాలలో చేర్చడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు". అని డాక్టర్ అంబేద్కర్‌ అన్నారు. (భారత రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశం 1946 డిసెంబర్‌లో జరిగింది. 1947లో ఒక ప్రక్క రాజ్యాంగ రచన జరుగుతుండగానే స్వాతంత్య్ర ప్రదానం కూడా జరిగింది).

ఆయన అప్పుడు రాజోలు వెళ్లవలసివుంది. అందువల్ల, ఆయనకు "థాంక్స్‌" చెప్పి నేను వచ్చి వేశాను. ఈ ఇంటర్‌వ్యూను "ఆంధ్రపత్రిక" ప్రముఖంగా ప్రచురించింది.

రాజాజీతో ఇంటర్‌వ్యూ

నేను 1952-53లో విజయవాడ నుంచి వెలువడిన "ప్రతిభ" తెలుగువారపత్రికకు ఎడిటర్‌గా పని చేశాను. అప్పటిలో ఆంధ్రప్రాంతం మద్రాసు రాష్ట్రంలో వుండేది. దానికి రాజాజీ ముఖ్యమంత్రి. ఆయన పూర్తి పేరు శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆయన సాధారణ రాజకీయవేత్తకాడు. మహారాజ నీతిజ్ఞుడు. 1937-39లో మొదటిసారి మద్రాసు ముఖ్యమంత్రి. 1948 జూన్‌లో ఇండియా గవర్నర్‌ - జనరల్‌ అయిన ప్రథమ భారతీయుడు. అంతకు పూర్వం సర్‌ సత్యేంద్ర ప్రసన్న సిన్హా కొద్ది కాలంపాటు తాత్కాలిక గవర్నర్‌ జనరల్‌గా పనిచేశారు. అది 1914 ప్రాంతం. రాజాజీ ఇండియాకు ఆఖరి గవర్నర్‌ - జనరల్‌ కూడ. ఆ తరువాత 1950 జనవరిలో భారతదేశం సర్వతంత్ర స్వతంత్ర ప్రజాస్వామిక రిపబ్లిక్‌ అయింది. రిపబ్లిక్‌కు అధ్యక్షుడు వుంటాడు. రాజాజీతో గవర్నర్‌ - జనరల్‌ పదవి రద్దు అయింది.

రాజాజీ కుమార్తె లక్ష్మిని గాంధీజీ కుమారుడు దేవదాస్‌ గాంధి వివాహం చేసుకున్నాడు గాంధీజీ, రాజాజీ వియ్యంకులైనారు.

1952-1953లో రాజాజీ ముఖ్యమంత్రిగా వుండగా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని, నాగార్జున, పులి చింతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను, ఆయన విధానాలను నా పత్రిక "ప్రతిభ"లో అంతకంటె తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాదాపు ప్రతి సంచికలోను ఒక వ్యాసం రాసేవాడిని - తీవ్రపదజాలంతో.

"ప్రతిభ" నుంచి నేను టంగుటూరి ప్రకాశం గారి "ప్రజాపత్రిక" దినపత్రికకు సహాయ సంపాదకుడుగా వెళ్లాను కదా! అప్పుడొకసారి నేను రాజాజీని ఇంటర్‌వ్యూ చేయడానికి వెళ్లాను. నేను "ప్రతిభ" లో రాసిన తెలుగు వ్యాసాల అనువాదాలు ఆయన దృష్టికి వెళ్లాయి! అందువల్ల, నా పేరు ఆయనకు బాగా గుర్తు. నేను వెళ్లగానే ఆయన చిరునవ్వుతో కూర్చోమన్నారు. అప్పటికి నా వయస్సు 21 సంవత్సరాలు.

"మీరు తెలుగుపత్రికలో రాసిన వ్యాసాలన్ని చూశాను. చాలా బాగున్నాయి" అన్నారు చిరునవ్వుతో. ఆయన మహామేధావి. ఆయనతో పోల్చదగిన రాజకీయ వేత్తలేరని చెప్పవచ్చు. ఒకసారి ఒక డచ్‌ దినపత్రిక "తెగ బారెడు పేరుగల ఈ మద్రాసు గుంటనక్క" అని ఆయనను గురించి రాస్తూ అభివర్ణించింది. అంటే, ఎత్తులు, జిత్తులమారి అని అర్థం. ఆ పద ప్రయోగాన్ని నేను అంగీకరించనుకాని, దాని అంతరార్ధంతో ఏకీభవిస్తాను.

ఎప్పుడైతే ఆయన నా వ్యాసాలు చాలా బాగున్నాయని కితాబు ఇచ్చారో అప్పుడే నాకు అనిపించింది - ఆయనతో మాటల "ఎన్‌ కౌంటర్‌"కు సిద్ధంగా వుండాలని!

"అంత తీవ్రమైన భాషలో రాయవలసిన అవసరం వుందా?" అని ఆయన ప్రశ్నించారు.

"మీరు వ్యతిరేకిస్తున్న ఆంధ్ర ప్రాజెక్టులు, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తెలుగు వారికి ప్రాణప్రదమైనవి. వారి భవిష్యత్తు వాటిపై ఆధారపడి వుంది. అందువల్ల, మా ఆందోళన తీవ్రతను వ్యక్తంచేయడానికి అంతతీవ్రమైన భాష ప్రయోగించక తప్పలేదు. క్షమించండి". అన్నాను. అప్పటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఆయన మళ్లీ చిరునవ్వు నవ్వారు.

"మీకు పెళ్లి అయిందా?"

"మీకు పెళ్లి అయిందా?" ఆయన ప్రశ్న

"ఇంకా కాలేదండీ! అదెందుకు?" అని నేను కొంచెం బిడియంగానే అడిగాను.

"పెళ్లి అయితే, మీ కలంలో ఈ "వేడి" వుండదు" అంటూ చిరునవ్వు నవ్వారు.

"ఆంధ్రకేసరి" ప్రకాశం గారు ఎలా వున్నారని ప్రశ్నించారు. "మీరు రోజూ శాసనమండలిలో చూస్తున్నారు కదండీ! బాగానే వున్నారు" అన్నాను. ఆయన నాపట్ల వాత్సల్యభావంతోనే వున్నారు.

"ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గురించి మీ అభిప్రాయమేమిటి?" అని అడిగాను.

"నెహ్రూ ఇస్తున్నాడుగా! ఇంకా నా అభిప్రాయమెందుకు?" అన్నారు. ఈ సారి ఆయన కంఠధ్వనిలో కొంత విరుపు కనిపించింది! మరి, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నది కదా!

నేను సెలవు తీసుకుని వస్తూ వుంటే, "యు విల్‌ కమ్‌ అప్‌ ఇన్‌ లైఫ్‌" అన్న మాటలు వినిపించాయి. నేను వెనుదిరిగి, ఆయన వద్దకు వెళ్లి "ధాంక్యూ, సార్‌!" అని వచ్చి వేశాను.

ప్రకాశంపై రాజాజీ వ్యాఖ్య

ఆ తరువాత చాలా కాలానికి 1972లో "ఆంధ్రకేసరి" శతజయంతి సందర్భంగా నేను రాసిన "ఆంధ్రకేసరి జీవితంలో కొన్ని అద్భుత ఘట్టాలు" అన్న పుస్తకంపై రాజాజీ అభిప్రాయాన్ని కోరగా, "ప్రకాశం సింహ హృదయుడైన దేశభక్తుడు. మనం కోల్పోయిన మహామహులలో ఆయన ఒకరు. "ఆంధ్రకేసరి" అన్న బిరుదుకు ఆయన అక్షరాలా తగినవారు" అని రాశారు.

అలనాటి నాయకుల హుందాతనం, ఉదాత్తత అలాంటివి. వారిలో వ్యక్తిగత ద్వేషాలు వుండేవి కావు. అభిప్రాయ భేదాలు, సిద్ధాంత వైరుధ్యాలు, కార్యాచరణలో వైవిధ్యాలు మాత్రమే కానవచ్చేవి.

"నేను అస్తమిస్తున్న సూర్యుడిని నాకెందుకు పదవులు?"

డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తెలుగువారిలో మహా మేధావి. ఆయన జ్ఞాపకశక్తి అసాధారణమైనది. అంతటి జ్ఞాపకశక్తివున్న వారు మరెవరు? నేను ఇప్పటికీ జ్ఞాపకశక్తిలో ఆయనకు దీటు ఎవరా? అని అన్వేషిస్తూనే వున్నాను.

డాక్టర్ పట్టాభి మచిలీపట్నంలో ఒకప్పుడు పేరెన్నికగన్న డాక్టర్. ఆయన ఎమ్‌.బి.సి.ఎమ్‌. (ఎమ్‌.బి.బి.ఎస్‌. వంటి అల్లోపతి వైద్య డిగ్రీ). ఆయన మహాత్మాగాంధికి అగ్రశ్రేణి శిష్యుడు. 1939లో త్రిపుర కాంగ్రెస్‌ మహాసభ అధ్యక్ష పదవికి శ్రీ సుభాష్‌చంద్రబోస్‌తో పోటీకి గాంధీజీ డాక్టర్ పట్టాభిని తన అహింసా సిద్ధాంత భాష్య కారుడుగా నిలబెట్టారు. బోసుది బ్రిటీష్‌ సామ్రాజ్యవాద ప్రభుత్వంపై సాయుధపోరాటపథం. ఆ పోటీలో పట్టాభి ఓటమిచెందినప్పుడు గాంధీజీ "పట్టాభి ఓటమి నా ఓటమి" అన్నారు. ఎందువల్లనంటే, ఆయన తన అభ్యర్ధి కాబట్టి! అంతేకాదు - "అహింసా సిద్ధాంతానికి వైశ్యుడనైన నేను సూత్రకారుడినైతే, బ్రాహ్మణుడైన పట్టాభి భాష్యకారు"డని కూడా గాంధీజీ ఒకసారి అన్నారు. గాంధీజీకి ఆయన అంతగా సన్నిహితుడు.

అయితే, ఆంధ్ర రాజకీయాలలో మాత్రం ఆయన "ఆంధ్రకేసరి" ప్రకాశం గారికి ప్రతికూలుడు. వారిద్దరి మధ్య వైషమ్యాలంటూ ఏమీలేవు. ఆయన జయపూర్‌ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికైనారు. గాంధేయ ఆర్ధిక విధానాలను గురించి ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అందువల్ల, స్వతంత్ర భారత ప్రథమ ప్రభుత్వంలో డాక్టర్ పట్టాభి ఆర్ధికమంత్రి కాగలరని చాలా మంది భావించారు. కాని, ప్రధాని నెహ్రూకు, ఆయనకు విధాన వైరుధ్యం వుండేది. అందువల్ల, పట్టాభికి బదులుగా సర్‌ ఆర్‌.కె. షణ్ముగం చెట్టియార్‌ను ఆర్ధిక మంత్రిగా నెహ్రూ నియమించారు. స్వతంత్ర భారత ప్రభుత్వంలో పట్టాభిని మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు.

ఆ రోజులలో నేను టంగుటూరి ప్రకాశం నాయకత్వ వైశిష్ట్యాన్ని గురించి ఎన్నో వ్యాసాలు రాశాను. ఆయన పై రాసిన పుస్తకం కాపీని డాక్టర్ పట్టాభికి పంపాను. ఆయన వెంటనే "చాలా బాగుంది" అంటూ నాకు కార్డు రాశారు. దానిలో పట్టాభి గారిని గురించి కొన్ని విమర్శలు వున్నాయి. అయినా, ఇంతకు పూర్వమే రాసినట్టు, అప్పటి నాయకుల హుందాతనం అలాంటిది! ఇప్పుడైతే, ఆ పుస్తకం కాపీని బుట్ట దాఖలు చేస్తారు!

1958లో కాబోలు, విజయవాడలో శ్రీ అయ్య దేవర కాళేశ్వరరావు జన్మదినోత్సవం జరుగుతున్నది. ఆ సభకు డాక్టర్ పట్టాభి ముఖ్య అతిథి. నేను ఒక ఉపన్యాసకుణ్ణి. నా ఉపన్యాసానికి ముందు అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి "ముంద్రా కుంభకోణం"లో ఇరుక్కున్నందున, తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు రేడియో వార్తలలో అప్పుడే చెప్పారు.

ఇదే అదను అనుకుని, నేను ఆ అవకాశాన్ని వుపయోగించుకుని, ఆ తరువాత ఉపన్యాసానికి నావంతు రాగానే "కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి గారు రాజీనామాచేసినట్టు ఇప్పుడే వార్త వచ్చింది. నిజానికి, డాక్టర్ పట్టాభిగారు స్వతంత్ర భారత ప్రథమ మంత్రివర్గంలోనే ఆర్ధిక మంత్రి కావలసింది. ఆయన గాంధేయ ఆర్ధిక వేత్త. స్వతంత్ర భారత ప్రభుత్వం గాంధేయ ఆర్ధిక విధానాలను అమలు పరచాలంటే, గాంధీజీకి అనుంగు శిష్యుడైన పట్టాభిగారే ఆర్ధిక మంత్రి కావాలి. కాబట్టి, ఇప్పుడైనా ప్రధాని నెహ్రూ మన పట్టాభిగారిని ఆర్ధికమంత్రిగా నియమించా"లని నేను అనే సరికి సభ యావత్తు హర్షధ్వానాలతో దద్దరిల్లింది!

ఆ తరువాత సభలో ముఖ్య అతిథిగా పట్టాభిగారు ప్రసంగించాలి. ఆయన లేచి, ముందుగా నా సూచన గురించే ప్రస్తావించారు. "మిత్రుడు కుటుంబరావు గారు (అప్పటి నాయకులు ఎంత గొప్పవారైనా, తమ కంటె చాలా చిన్నవారిని కూడా గౌరవంగా సంబోధించేవారని ఇది వరకే రాశాను) నాకు కేంద్ర ఆర్ధిక మంత్రి పదవి ఇవ్వాలని నెహ్రూకు "సిఫారసు" చేశారు! (కొంచెం వ్యంగ్యంగా మాట్లాడ్డం ఆయనకు అలవాటు. లేకపోతే, ప్రధాని నెహ్రూకు నేను సిఫారసు చేయడమేమిటి?) కాని, నేనిప్పుడు అస్తమిస్తున్న సూర్యుణ్ణి. నాకిప్పుడు పదవులెందుకు?" అని ఆయన చమత్కరించారు. దాన్ని ఆ మరునాడు పత్రికలు ప్రముఖంగా "బాక్స్‌" కట్టి ప్రచురించాయి!

మొరార్జీ ఉపన్యాసానికి పక్కతాళం

1964 నవంబర్‌లో గుంటూరులో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ సభలకు అనేక మంది కాంగ్రెస్‌ ప్రముఖులతోపాటు ఆ తరువాత 1977లో జనతాపార్టీ తరఫున దేశ ప్రధాని పదవిని అలంకరించిన శ్రీ మొరార్జీ దేశాయ్ కూడా హాజరైనారు. అప్పటికి ఆయన కామరాజ్‌ పథకం కింద కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించబడ్డారు! ఆయన గుంటూరు నుంచి విజయవాడ వచ్చి, అక్కడి నుంచి మరునాడు గన్నవరం నుంచి (విజయవాడకు 20 కిలో మీటర్లు) విమానంలో వెళ్లవలసి వుంది. ఆ నవంబర్‌లో - బహుశా 9వ తేదీ కావచ్చు - ఆయనను గుంటూరు నుంచి విజయవాడ తీసుకువచ్చే బాధ్యత నాపై పడింది. విజయవాడలో సిటి కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జి.ఎస్‌. రాజుకు ఆయన అతిథి.

శ్రీ మొరార్జీ విజయవాడ వచ్చిన తరువాత సిటి కాంగ్రెస్‌ తరఫున ఒక సభలో మాట్లాడాలి. ఆ రోజు సాయంత్రం గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌లో సభ ఏర్పాటు చేశారు.

సభ మరో గంటలో ప్రారంభమౌతుందనగా, ఏ.ఐ.సి.సి. ప్రధానకార్యదర్శి శ్రీ జి. రాజగోపాలన్‌కు ఏదో సుస్తీ చేసి, గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో ఆకస్మికంగా మృతిచెందినట్టు వార్త వచ్చింది. నేను వెంటనే ఈ వార్తను శ్రీ మొరార్జీకి చెప్పి, "మృతి చెందింది అఖిల భారత కాంగ్రెస్‌ కార్యదర్శి. సభను ఆయన మృతిపట్ల సంతాప సూచకంగా వాయిదా వేయడం సముచిత మేమో!" అన్నాను. శ్రీ మొరార్జీ చిరునవ్వుతోనే కొంచెం నిర్మొగ మాటంగా, కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడుతారు.

"సభను రద్దు చేయడమెందుకు? సభకు ముందు ఒక సంతాప తీర్మానం చేద్దా"మని చెప్పారు. ఆయన సూచన ప్రకారం ఆరోజు సాయంత్రం సభ ఏర్పాటు చేశాము. శ్రీ జి.ఎస్‌. రాజు అధ్యక్షత వహించారు. నేను శ్రీ మొరార్జీ ఇంగ్లీషు ఉపన్యాసాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలి.

ఆయన మాట్లాడుతుండగా, నేను రెండు, మూడు సార్లు "ప్లీజ్‌ రిపీట్‌" ("మళ్లీ చెప్పండి") అంటూ వచ్చాను. శ్రీ మొరార్జీకి చిరాకు వేసి, "నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు!" అంటూ కొంచెం వెటకారంగానే అన్నారు!

ఒక సభలో కాని, నలుగురి సమక్షంలో కాని నన్ను వెటకారంగా మాట్లాడినా, అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసినా సహించే స్వభావం కాదు నాది. అవతలి వారు ఎంత గొప్ప వారైనా, నన్ను నలుగురిలో తక్కువ చేస్తే, నా లోని ఆత్మగౌరవం పెల్లుబుకుతుంది!

నేను వెంటనే "మీ ఉపన్యాసం నాకు అర్థం కాక కాదండీ! మీరు మాట్లాడుతుంటే, నా ప్రక్కనే కూర్చున్న పాత్రికేయ మిత్రుడు శ్రీ మల్లెల శ్రీ రామమూర్తి మీ ఉపన్యాసానికి తెలుగు తర్జుమా తానే ముందుగా నాకు అందిస్తున్నాడు. మరి, నేను మీ ఉపన్యాసాన్నే వినాలా? ఆయన పక్క తాళాన్ని ఆలకించాలా? రెండు ఉపన్యాసాలను ఒకే సారి వినడం సాధ్యంకాదు కదా!" అనేసరికి మొరార్జీ నవ్వారు; సభాసదులు హర్షధ్వానాలు చేశారు!

అలాగే ఒక సారి అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన రైతాంగనేత ఆచార్యరంగాతో నేను మాట్లాడుతుండగా, ఆ రోజు "ఆంధ్రపత్రిక"లో పులిచింతల ప్రాజెక్టు గురించి రంగా గారి అభిప్రాయానికి భిన్నంగా ఆ పత్రిక సంపాదకుడు శ్రీ శివలెంక శంభు ప్రసాద్‌ రాసిన సంపాదకీయం ప్రసక్తి వచ్చింది. సంభాషణక్రమంలో రంగా గారు "మీ శంభు ప్రసాద్‌....." అన్నారు. నేను వెంటనే "మా శంభు ప్రసాద్‌ అంటే?" అని చటుక్కున, అప్రయత్నంగా ఎదురుప్రశ్న వేశాను! రంగాగారు కొంచెం చిన్నబోయి "అబ్బే, మన ఆంధ్రుడన్న అభిప్రాయంతో అన్నాను" అని సమాధానమిచ్చారు.

"మీ శంభు ప్రసాద్‌" అంటే "మీ సామాజిక వర్గానికి చెందిన" అనే అభిప్రాయాన్ని నేను తీసుకున్నాను. ఎందువల్లనంటే, నా జర్నలిస్టు జీవిత ప్రారంభంలోనే భవిష్యత్తులో నా వ్యక్తిత్వం ఎలా వుండాలి? నేను ఏ సిద్ధాంతాలకు కట్టుబడి వుండాలి? అని కొన్ని నీతి నియమాలను, కట్టుబాట్లను నా జీవితానికి నిర్దేశించుకున్నాను. వాటిలో "జాతి, మత, కుల, వర్ణ, వర్గ స్త్రీ పురుష విభేదాలకు అతీతమైన, మానవుడు మానవునిపట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించే మానవీయ వ్యవస్థ ఆవిర్భవించాలన్నది నా అభిమతం; అదే నా మతం కూడా. అందువల్ల నన్ను ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి చెందినవాడుగా ఇతరులు పరిగణించడం కాని, నన్ను నేను పరిగణించడం కాని నేను సహించలేను! నేను "విశ్వమానవుణ్ణి" అన్న భావన నా శరీరంలో అణువణువునా జీర్ణించి పోయింది! 1997లో నాకు ఇంగ్లాండ్‌లోని ఇంటర్నేషనల్‌ బయాగ్రఫికల్‌ సెంటర్‌ "ఇంటర్నేషనల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు" యిచ్చినప్పుడు నేను ఎంతో సంతోషించాను!

అందువల్ల, నన్ను ఎవరైనా కుల భావనతో చూస్తే, నేను సహించలేను. రంగా గారు "మీ శంభు ప్రసాద్‌" అని కుల భావనతో అని వుండకపోవచ్చు. బహుశా నేనే తొందరపడి వుండవచ్చు. ప్రకాశం గారిని నా గురువుగా, రంగా గారిని నా చిన్న గురువుగా భావించేవాడిని. ఎందువల్లనంటే, ప్రకాశంగారి కంటె రంగా గారు దాదాపు మూడు దశాబ్దాలు చిన్న వారు. ఒకసారి రంగాగారే అన్నారు - ప్రకాశంతో తన సంబంధం "తండ్రీ కొడుకుల సంబంధం వంటి"దని! రంగా గారు కూడా నన్ను తన కుమారుని వలెనే ఎంతో వాత్సల్యంతో, గౌరవంగా చూచేవారు.

1988లో జరిగిన నా జర్నలిస్టు జీవితం 40వ వార్షికోత్సవ సభకు 89 సంవత్సరాల వయస్సులో ఆచార్య రంగాగారు ఢిల్లీ నుంచి వచ్చి అధ్యక్షత వహించారు.

అంతేకాదు - ఆ సభలోనే నాకు "పద్మశ్రీ" అవార్డు ఇవ్వాలని తీర్మానించారు. సభాధ్యక్షులుగా రంగాజీ ఆ తీర్మానంపై సంతకం చేసి, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధికి పంపించారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి రాజీవ్‌గాంధి లీడర్‌ అయితే, ఆచార్య రంగా డిప్యూటీ లీడర్‌.

ఇక్కడ మరొక విశేషం కూడా చెప్పాలి. ఆ తరువాత ఆచార్య రంగా స్నానాలగదిలో జారిపడి, వెన్నెముక దెబ్బతినడంతో మంచంపై వున్నప్పుడు అప్పటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు ఆయనను పరామర్శించడానికి వెడితే, ప్రధాని తన వద్ద వున్న కొద్ది నిమిషాలలోనే రంగా గారు నాకు "పద్మశ్రీ" ఇంకా రాని విషయం జ్ఞాపకం చేసి, వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవంనాడైనా ఇవ్వాలని కోరారు! అంతేకాదు - ఆ విషయం నాకు తెలియజేస్తూ అప్పటికి 90 సంవత్సరాలు దాటిన ముదిమి వయస్సులో నాకు స్వయంగా కార్డు రాశారు! ఏమి నాయకులు వారు! ఏమి నీతి నిజాయితీలు వారివి! ఇప్పుడు అలాంటి నాయకులను చూడగలమా?

"ఎన్‌.టి.ఆర్‌. ను కొట్టగలిగేవాడెవరు?"

1980 జూలైలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ నెలలో నెల్లూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ తరువాత పార్లమెంటు సభ్యులైన శ్రీ మాగంటి సుబ్బరామిరెడ్డి "కృష్ణ, కావేరి, కళ్యాణి" అన్న పేర్లతో మూడు సినీ థియేటర్లు నిర్మించారు. ఆ థియేటర్ల సముదాయానికి ప్రఖ్యాత సినీ నటుడు శ్రీ ఎన్‌.టి. రామారావు చేత ప్రారంభోత్సవం చేయించాలని ఆయన నిర్ణయించారు. సభకు నన్ను అధ్యక్షునిగా ఆహ్వానించాలని నిర్ణయించి, నన్ను పిలవడానికి శ్రీ సుబ్బరామిరెడ్డి, ప్రఖ్యాత సినీ నిర్మాత, కవీంద్రులు, రచయిత శ్రీమల్లెమాల విజయవాడ మా ఇంటికి వచ్చారు. శ్రీ మల్లెమాల (డాక్టర్ మల్లె మాల సుందరరామిరెడ్డి) స్వస్థలం కూడా నెల్లూరే.

అంతకు పూర్వం విజయవాడలో 1975 డిసెంబర్‌ 12,13,14 తేదీలలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఫాన్స్‌ అసోసియేషన్‌ రజతోత్సవాలలో నా వ్యాఖ్యానాలను, వాటికి వచ్చిన ప్రజా ప్రతిస్పందనలను స్వయంగా చూచిన శ్రీ సుబ్బరామిరెడ్డి తమ మూడు థియేటర్ల ప్రారంభోత్సవ సభకు నేను అధ్యక్షతవహిస్తే బాగుంటుందని భావించారట. విజయవాడ సభలకు మూడు రోజులూ డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారే అధ్యక్షులు. ఆయన శ్రీ సుబ్బరామిరెడ్డికి పినమామగారు!

నెల్లూరు సభకు హేమా హేమీలు విచ్చేశారు. డాక్టర్ గోపాలరెడ్డి, శ్రీ మల్లెమాల, నాటి రాష్ట్రమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డి, మద్రాసు నుంచి ఎందరో సినీ ప్రముఖులు, తారలు వచ్చారు. సరే, శ్రీ ఎన్‌.టి. రామారావు థియేటర్‌ సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు.

ఏమి జనం! ఏమి ప్రజా సందోహం! ఏమా ఆనందోత్సాహాలు! అంతకు పూర్వం 20 సంవత్సరాల క్రితంగాని ఎన్‌.టి.ఆర్‌. ఆ సినీ నగరానికి రాలేదట! మరి, రెండు దశాబ్దాల తరువాత వచ్చిన ఆ అందాల "నటరత్నాన్ని" తిలకించడానికి ఒక్క నెల్లూరు నుంచే కాక, ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా జనం వచ్చారని అంచనా. బహుశా రాష్ట్రంలోని పట్టణాలన్నింటికంటె ఆ రోజులలో "సినిమా మోజు" హెచ్చుగా వున్న పట్టణం సింహపురి (నెల్లూరు అసలు పేరు) అని చెప్పవచ్చు. చివరికి థియేటర్ల సముదాయానికి ఎదురుగా వున్న రైలు పట్టాలపై కూడా జనం కూర్చున్నందున, నెల్లూరుకు వచ్చిపోయే రైళ్లను కూడా ఆపి వేశారు!

సభాధ్యక్షుడుగా నేను అంత మహా జన సందోహానికి ఒక్కసారి "కుదుపు" యిద్దామనుకున్నాను! ఆ మహా జన సందోహంలో అందరి కళ్లు ఎన్‌.టి.ఆర్‌ పైనే, ఆయనే ప్రధాన ఆకర్షణ!

నేను ఎన్‌.టి.ఆర్‌.ను పరిచయం చేస్తూ, ఒక్కసారిగా మహోచ్చ స్వరంతో "ఎన్‌.టి.ఆర్‌.ను కొట్టగలిగినవాడు చిత్రసీమలో ఒకే ఒక్కడు వున్నా"డనే సరికి ఒక్కసారిగా అంత జన సందోహం మ్రాన్పడిపోయారు! ఇదేమి? ఎన్‌.టి.ఆర్‌.ను కొట్టగలిగిన వాడు ఒక్కడే వున్నాడని ఎన్‌.టి.ఆర్‌. సమక్షంలో, ఆయన వీరాభిమానులైన తమ ముందు అనడమా? యావత్తు జనం నాపైకి వురకడానికి సిద్ధంగా వున్నట్టు అనిపించింది! ఎన్‌.టి.ఆర్‌. తెల్లని ముఖం ఎర్రబడింది! ఈ సన్నివేశానికి ఆందోళన పడిపోతున్న శ్రీ మల్లెమాల నా దగ్గరకు గబగబావచ్చి, "ఇదేమిటి కుటుంబరావు గారూ! మీకేమైనా మతి పోయిందా? ఏమిటా మాటలు! జనం మీ మీదకు వురికేట్టున్నారు. చూడండి!" అన్నారు ఆందోళనతో! నేను చిరు నవ్వుతో "రెడ్డి గారూ! మీరు చూస్తూ వుండండి. ఏమి జరుగుతుందో!" అని నేను వెంటనే "ఎన్‌.టి.ఆర్‌.ను కొట్ట గలిగినవాడు - ఎన్‌.టి.ఆర్‌. ఒక్కడే!" అని ఆ ముడి విప్పేసరికి ఒక్క నిమిషం పాటు ప్రశాంత నిశ్శబ్ద గంభీర వాతావరణంలో వున్న సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయింది! ఎర్రబడిన ఎన్‌.టి.ఆర్‌. ముఖం తిరిగి చిరునవ్వుతో వెలిగిపోయింది! తరువాత మాట్లాడిన ఎన్‌.టి.ఆర్‌. "తుర్లపాటి గారి మాటలు విన్న తరువాత మాట్లాడాలంటే, నాకు బిడియంగా వుంది. ఆయన మాట్లాడిన తరువాత మాట్లాడాలంటే కష్టం" అన్నారు. ఆ తరువాత ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మరి రెండు సభలకు నేనే అధ్యక్షుణ్ణి. ప్రతి సభలోను ఆయన నాతో "కుటుంబరావు గారూ! ఏదీ? నెల్లూరు సభలో చెప్పిన డైలాగ్‌ చెప్పండి" అని సభా ముఖంగా తిరిగి "నెల్లూరు సీను" లాంటి సీను సృష్టించుకునేవారు!

జగ్‌ జీవన్‌ రామ్‌ పై చరణ్‌సింగ్‌ చులకన

1979లో శ్రీ చరణ్‌సింగ్‌ భారతదేశానికి తాత్కాలిక ప్రధానిగా వున్నారు. ఆయన 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 13 వరకు ఆ పదవిలో వున్నారు. 1979 ఆగస్టు 20వ తేదీన ఆయన లోక్‌సభలో తన ప్రభుత్వం పట్ల సభ విశ్వాసాన్ని కోరవలసివుంది. అయితే, లోక్‌సభలో తనకు విశ్వాసం లేదని ఆ ఉదయమే తేలిపోవడంతో ఆయన విశ్వాస ప్రకటన కోరకుండానే లోక్‌సభనే రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరారు! రాష్ట్రాలలోవలె కేంద్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు. అప్పటికి వున్న కేంద్ర మంత్రివర్గమే లోక్‌ సభకు కొత్తగా ఎన్నికలు జరిగే వరకు "ఆపద్ధర్మ ప్రభుత్వం"గా వ్యవహరిస్తుంది.

అందువల్ల, పార్లమెంటు ముఖం ఒక్కసారైనా చూడని ప్రధానిగా శ్రీ చరణ్‌ సింగ్‌ కొనసాగుతున్నారు. అప్పటిలో ఒక విశేషం జరిగింది. అంతకు పూర్వం 1979 జూలైలో శ్రీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పతనమైన తరువాత ప్రధాని పదవికి చరణ్‌సింగ్‌, జగ్‌జీవన్‌రామ్‌ల మధ్య పోటీ వచ్చింది. చివరకు చరణ్‌సింగ్‌కే ప్రధాని పదవి దక్కింది. అప్పటిలో చరణ్‌సింగ్‌ "చమర్‌ దేశ్‌కే ప్రధాన్‌ కైసే బనేగా?" ("పాదరక్షలు కుట్టుకునేవాడు దేశ ప్రధాని ఎలా అవుతాడు?") అని, శ్రీ జగ్‌జీవన్‌రామ్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించినట్టు తంటాల మారి న్యాయవాది శ్రీ రామ్‌ జెత్మలాని అన్నట్టు, ఒక పత్రికలో వార్త వచ్చింది!

నేను వెంటనే శ్రీ చరణ్‌సింగ్‌కు లేఖరాస్తూ శ్రీ జగ్‌జీవన్‌ను అలా అనడాన్ని ఖండించాను. ప్రధాని చరణ్‌సింగ్‌ నాకు జవాబు రాస్తూ తాను అలా ఎప్పుడూ అనలేదని, అనబోనని, తాను యు.పి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దళితులకు మంత్రివర్గంలో వారికి లభించవలసిన స్థానాల కంటె ఎక్కువే యిచ్చానని పేర్కొన్నారు.

అంతేకాక, నా లేఖను గురించి, తన జవాబును గురించి ఆకాశ వాణి స్వదేశ, విదేశ వార్తలలో కూడా ప్రచారం చేయించారు!

ఇందిరాగాంధితో ఇంటర్‌వ్యూ

Naa Kalam - Naa Galam Page 76 Image 0001
Naa Kalam - Naa Galam Page 76 Image 0001

నెహ్రూ - గాంధి కుటుంబ సభ్యులతో నాకు మానసిక సాన్నిహిత్యం హెచ్చు. నేను 1946లో పునర్జన్మ ఎత్తి నప్పటి నుంచి జాతీయ వాదిగా పాత్రికేయ కలం చేపట్టాను. అందువల్ల, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన నెహ్రూ కుటుంబం పట్ల ఎందరో వలెనే నాకు కూడా అత్యంత ఆసక్తి, గౌరవం.

కాగా, 1982లో శ్రీ ఎన్‌.టి. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి నప్పుడు ఆ తరువాతి సంవత్సరంలో జరిగే జనరల్‌ ఎన్నికలలో కాంగ్రెసుపై టి.డి.పి. ప్రభావం ఎలా వుంటుందన్న విషయంలో రాష్ట్ర మంతటా ఎక్కడ ఇద్దరు కలుసుకున్నా చర్చలు జరుగుతున్నాయి. అప్పటిలో కొందరు మిత్రులు "ఇందిరా గాంధితో మీరు సన్నిహితంగా వుంటారు కదా! మీ లేఖలన్నింటికి ఆమె ప్రతి స్పందిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని గురించి మీరైతే ఆమెకు యథార్థ చిత్రాన్ని చూపిస్తారు. మీరు ఆమెను కలుసుకుని, రాష్ట్ర రాజకీయ పరిస్థితిని గురించి ఎందుకు వివరించకూడదు?" అని ప్రశ్నించేవారు.

నిజమే! శ్రీమతి ఇందిరాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాల రీత్యా నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో శ్రీమతి ఇందిరాగాంధికి, ఆయనకు ఏవో కొన్ని సమస్యలపై విభేదాలు ఏర్పడినవని అప్పుడప్పుడు తెలుగు పత్రికలలో కథనాలు వెలువడుతూ వుండేవి. వాటిని నేను ఆమె దృష్టికి తీసుకురాగానే, మూడవనాటి కల్లా "అలాంటి విభేదాలు లే"వని ఆమె నుంచి పత్రికలలో ఖండన వచ్చేది! ఆ రీత్యాను, ఆంధ్ర ప్రాంతానికి ఆమె రాజకీయ ఉపన్యాసాలకు వచ్చినప్పుడు ఆమెకు అనువాదకుడుగాను నేను సన్నిహితుణ్ణి అయ్యాను.

నా మిత్రుల సలహా నాకు నచ్చింది. 1982 మే నెలలో ప్రధాని ఇందిరాగాంధీతో ఇంటర్‌వ్యూ కోరుతూ ఆమెకు లేఖ రాశాను. మే 25వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలుసుకొనడానికి రావలసిందిగా నాకు వారం, పది రోజులలో జవాబు వచ్చింది! అప్పటి ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రుల వ్యవహారశైలి అలా వుండేది! మరి, ఇప్పుడో? చూస్తూనే వున్నాముగా!

మే 25వ తేదీన ఢిల్లీ చేరుకున్నాను. ప్రధాని నివాస భవనానికి వెళ్లగానే ఆమె స్పెషల్‌ అసిస్టెంట్‌ శ్రీ ఆర్‌.కె. ధావన్‌ స్వాగతించి, లోపల ప్రముఖు లెవరో వున్నారని, కొంచెం సేపు కూర్చోవలసిందిగా కోరాడు. శ్రీ ధావన్‌ సమర్ధుడైన ఆంతరంగిక కార్యదర్శి. అప్పటిలో ప్రధాని ఇందిరా గాంధి తరఫున యావద్భారతంలో చక్రం తిప్పేవాడు. ధావన్‌ దగ్గర నుంచి ఫోన్‌ వచ్చిందంటే చాలు, రాజకీయులకు కొందరికి పండుగ, అధికారంలో వున్న వారికి గుండె దడ! అలా అధికారాన్ని వెలగపెట్టాడు ధావన్‌. ఆయన మొదట ఇందిరాగాంధి ఏషియాడ్‌ నిర్వాహక కమిటి అధ్యక్షురాలుగా వున్నప్పుడు ఆమెకు స్టెనో గ్రాఫర్‌! తరువాత ఆమెకు స్పెషల్‌ అసిస్టెంట్‌! ఆ తరువాత రాజీవ్‌గాంధి ప్రధానిగా వున్నప్పుడు కేంద్రమంత్రి. కేంద్రంలోకానివ్వండి, రాష్ట్రాలలో కానివ్వండి. అప్పుడైనా, ఇప్పుడైనా చక్రం తిప్పేది వారి ప్రయివేట్‌ సెక్రటరీలే!

ఇంతలో ప్రధాని దగ్గర నుంచి కాలింగ్‌ బెల్‌ మోగింది. శ్రీ ధావన్‌ వెంటనే నన్ను ప్రధాని చాంబర్‌లోకి తీసుకువెళ్లి, "మిస్టర్‌ కుటుంబరావ్‌!" అంటూ నన్ను పరిచయం చేశారు. బహుశా నా లేఖలను బట్టి ఆమె వూహాపథంలో చిత్రించుకున్నట్టులేనేమో, ప్రధాని నన్ను కూర్చోమనలేదు! ముందున్న రౌండ్‌ టేబుల్‌ ప్రక్కనే నేను నిలబడి వున్నాను. సహజ సిద్ధమైన పాత్రికేయ ఆత్మ గౌరవం పొటమరించగా, ఆమె చెప్పకుండనే నేను నా ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాను! ఆమె నా వంక తేరిపార చూచారు! "చెప్పండి!" అన్నట్టు సంజ్ఞ చేశారు.

సహజంగా శ్రీమతి గాంధి గంభీరమూర్తి. రాజకీయులు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడ్డానికి వెనుకంజ వేసేవారు. నేను ఆమె "మూడ్‌" మార్చాలని భీమవరంలో శ్రీ రాజీవ్‌గాంధి ఉపన్యాసాన్ని నేను అనువదిస్తున్నప్పటి ఫొటో యిచ్చాను. కనిపించీ కనిపించని చిరునవ్వుతో ఆమె ఆ ఫొటోను తీసుకుని, పరీక్షగా చూసి, ప్రక్కనే వున్న తన రాజకీయ కార్యదర్శి శ్రీ ఎమ్‌.ఎల్‌. ఫోతేదార్‌కు యిచ్చారు.

మొరార్జీ పై ఇందిరాగాంధి ఆగ్రహం

ఆ తరువాత, ఆమెను ఏదో సమస్యపై మాజీ ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ తీవ్రంగా విమర్శించగా, ఆయనను ఖండిస్తూ నేను రాసిన లేఖకు మొరార్జీ రాసిన జవాబును నేను శ్రీమతి గాంధికి చూపించబోగా, ఆమె చిరు కోపంతో "ఐ డోంట్‌ సీ యిట్‌" ("ఆ వుత్తరం నేను చూడను") అన్నారు! మొరార్జీ అంటే ఆమెకు ఎంత కోపం!

ఆ తరువాత తెలుగుదేశం ప్రస్తావన ఎత్తుకున్నాను. ఆమె వెంటనే ఆసక్తిగా, ఆతురతతో నా వైపు తేరిపార చూశారు. "శ్రీ ఎన్‌.టి.ఆర్‌.కు అపారమైన ప్రజాబలం వున్నది. అదంతా ఆయన పౌరాణిక, జానపద చిత్రాలలో హీరోగా నటించి సంపాదించిన గ్లామర్‌. ఆయన ప్రజలలోకి వచ్చి, "నా పార్టీకి ఓటెయ్యండి" అని అడిగితే, ఓట్ల వర్షమే కురవవచ్చు" అన్నాను.

ఆమె ఆసక్తిగా వింటున్నారు. "టి.డి.పి. ఏర్పడి, రెండు నెలలే. ఇంకా ప్రాంభ దశలోనే వుంది. ఎన్‌.టి.ఆర్‌. గ్లామర్‌ దానికి కొండంత బలం" అన్నాను. ఆమె తల పంకించారు. ఏదో గట్టి చర్య తీసుకోకపోతే, ఆయనను నిలవరించడం కష్టమే" అని ముగించాను. ఆమె తిరిగి చూశారు. నా వంక సాలోచనగా చూశారు.

అప్పటికే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులను - చెన్నారెడ్డి, టి. ఆంజయ్యలను - మార్చి వేసింది. అప్పటికి ముఖ్యమంత్రిత్వంలో భవనం వెంకట్రామ్‌ వున్నారు. ఆయన బహు బలహీన ముఖ్యమంత్రి. ఇందిరా గాంధికి వరుసకు మేనత్త షీలా కౌల్‌ సిఫారసుతో ఆయన ముఖ్యమంత్రి అయినారని ప్రతీతి! నేను ప్రధానిని కలుసుకునే నాటికి ఆయన ముఖ్య మంత్రిత్వంలోకి వచ్చి మూడు నెలలే. ఆ తరువాత నాలుగు నెలలకు ఆయన ఉద్వాసన! ఆయన తరువాత మూడు మాసాల ముచ్చటగా శ్రీ కోట్ల విజయ భాస్కరరెడ్డి! 1983 జనవరి 6వ తేదీన జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జన్మించిన తొమ్మిది నెలలకే టి.డి.పి.కి మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం లభించింది!

భగ్నమయ్యే రాజీవ్‌ సభ!

భీమవరంలో శ్రీ రాజీవ్‌గాంధి ఉపన్యాసాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పటి ఫొటోను శ్రీమతి ఇందిరా గాంధికి యిచ్చినట్టు ఇంతకు పూర్వమే పేర్కొన్నాను. అది 1982 ఫిబ్రవరి. పశ్చిమ గోదావరిజిల్లా భీమవరంలో అప్పటి నర్సాపురం ఎమ్‌.పి. శ్రీ అల్లూరి సుభాష్‌ చంద్రబోస్‌ "రైతు - కూలీ మహాసభ" ఏర్పాటు చేశారు. శ్రీ బోసు అఖిల భారత కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు కుమారుడు. శ్రీ రాజు మొదట కమ్యూనిస్టు. తరువాత "క్విట్‌ ఇండియా" ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్‌లో చేరి, శ్రీమతి ఇందిరాగాంధికి రాజకీయంగా అత్యంత సన్నిహితుడైనారు.

శ్రీ బోసు ఆ సభను భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కళాశాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. శ్రీ రాజీవ్‌ ఉపన్యాసాన్ని ఎవరు తర్జుమా చేయాలి? అప్పటికి శ్రీ రాజీవ్‌ ఏ.ఐ.సి.సి. కార్యదర్శి. 1980 జూన్‌ 23వ తేదీన ఇందిరాగాంధి రెండవసారి ప్రధాని అయిన అయిదు నెలలకే ఆమె రెండవ కుమారుడు, కొద్దికాలంలోనే తన కొక చరిత్ర సృష్టించుకున్న ఎమ్‌.పి. శ్రీ సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం దురదృష్టం. ఆయన స్థానంలో ఇందిరాగాంధి పెద్ద కుమారుడు శ్రీ రాజీవ్‌గాంధి ఎమ్‌.పి.గా ఎన్నికైనారు.

ఆ నేపథ్యంలో బహుశా అప్పటికి తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న శ్రీ రాజీవ్‌గాంధి సందర్శనార్థం దాదాపు రెండు లక్షల మంది రైతు, కూలీలు అత్యుత్సాహంతో పాల్గొన్నారు. అంతకు పూర్వం విజయవాడలో శ్రీ సంజయ్ గాంధికి అత్యంత సన్నిహితుడైన శ్రీ రాజేష్‌ పైలట్‌ ఇంగ్లీషు ఉపన్యాసాన్ని, ఆయనతోపాటు అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీ బి. శంకరానంద్‌ ప్రసంగాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేశాను. అప్పుడే శ్రీ రాజేష్‌ పైలట్‌ అన్నారు. "మేడం ఇందిరాగాంధి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె ఉపన్యాసాన్ని శ్రీ తుర్లపాటి తర్జుమా చేస్తే ఆమె చాలా సంతోషిస్తారు" అని.

రాజేష్‌ పైలట్‌ రాజీవ్‌గాంధికి అనువాదకుడుగా నా పేరును శ్రీ సుభాష్‌ చంద్రబోసుకు సూచించారట! అందువల్ల, భీమవరం సభలో శ్రీ రాజీవ్‌ ఉపన్యాసాన్ని తర్జుమా చేయాలని శ్రీ సుభాష్‌ బోసు నన్ను ఆహ్వానించారు. నేను సభకు ముందు రాత్రే భీమవరం వెళ్లాను.

మరునాడు ఉదయం పది గంటలకు సభకు శ్రీ రాజీవ్‌గాంధి హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చారు. సభకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య కూడా వేదిక పై వున్నారు. శ్రీ సుభాష్‌ ప్రారంభ వచనాల తరువాత శ్రీ రాజీవ్‌ గాంధి ఉపన్యాసం ప్రారంభించారు. అప్పటికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎక్కువ కాలం కాలేదు. రాజకీయాలన్నా, బహిరంగ ఉపన్యాసమన్నా ఆయనకు కొత్తే! అందులోను అప్పటిలో ఆయన గొంతు పీలగా, మంద్రస్వరంలో వుండేది. ఆయన మాట మైక్‌లో నుంచి పెద్దగా దూరానికి వినిపించంలేదు. దాదాపు ఫర్లాంగు దూరం వరకు జనం వున్నారు!

శ్రీ రాజీవ్‌ ఉపన్యాసాన్ని నేను తర్జుమా చేయడం ప్రారంభించాను. అయితే, ప్రక్కనే మరో స్టాండింగ్‌ మైక్‌ వద్ద వున్న నాకు కూడా ఆ మహాజన సంరంభంలో ఆయన ఉపన్యాసం వినిపించడం లేదు. ఉపన్యాసం వినకపోతే మానె, తమ ప్రియతమ నేత ఇందిరాగాంధి కుమారుణ్ణి దగ్గర నుంచి అయినా చూద్దామని జనం ఒక్కసారిగా వేదికవైపు దూసుకురాసాగారు!

ఇంకేమున్నది? సభ భగ్నమయ్యేట్టు కనిపించింది! ఆందోళనతో శ్రీ సుభాష్‌ చంద్రబోసు నా వద్దకు వచ్చి "కుటుంబరావు గారూ! ఇంత శ్రమపడి సభ ఏర్పాటు చేస్తే, ఇది కాస్తా భగ్నమైపోయింది! ఇక లాభం లేదు. ఆయన చెప్పేది ఎవ్వరికీ వినిపించదు, అర్ధం కాదు. మీరు తర్జుమా చేయడం ఆపి వేయండి, ఏమి జరిగితే అదే జరుగుతుంది" అన్నారు.

"బోసుగారూ! మీరు ఆందోళన పడకండి. ఈ సభ భగ్నమైతే, నేనెందుకు? మీరు అనువాదకుడుగా నన్ను తీసుకువచ్చింది సభ భగ్నం కావడానికా? చూస్తూ వుండండి - ఏమి జరుగుతుందో!" అన్నాను!

Naa Kalam - Naa Galam Page 82 Image 0001
Naa Kalam - Naa Galam Page 82 Image 0001

శ్రీ రాజీవ్‌గాంధి యథా ప్రకారంగా ఉపన్యసిస్తున్నారు. నేనిక ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒక మాటను పట్టుకుని, దానికి కొన్ని చిలవలు, పలవలతో, మాటల గారడీతో, నా సహజ సిద్ధమైన శైలిలో గంభీరస్వరంతో, రాజీవ్‌ అన్నవీ, అనని వాటిని నేను కలిపి, నాదే ఒక ఉపన్యాసంగా చేశాను! ఇక, ఆ జన సందోహం ముందుకు రావడం మానివేశారు! నా ఉపన్యాసాన్నే రాజీవ్‌గాంధి ఉపన్యాసంగా ప్రశాంత నిశ్శబ్దంగా విన్నారు. సభ జయప్రదమైంది. సభాంతంలో శ్రీ రాజీవ్‌గాంధి "రావ్‌! యు హావ్‌ డన్‌ వెల్‌!" అంటూ అభినందించారు. శ్రీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆయన బావ - రాష్ట్ర మంత్రి శ్రీ ఇందుకూరి రామకృష్ణంరాజు ఎంతో సంతోషించారు.

ఆ రోజు నా అనువాద ఉపన్యాస ఫలితం - ఆ తరువాత నన్ను రాష్ట్ర ప్రభుత్వం "గౌరవ సాంస్కృతిక మహావక్త" (ఒక విధంగా "ఆస్థాన ఉపన్యాసకుడు")గా నియమించింది!

గాంధీజీకి నోబెల్‌ బహుమతి?

1990 దశకం ప్రారంభంలో నాకొక ఆలోచన వచ్చింది. యుద్ధోన్మాదులు అమెరికా విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్‌ ప్రధాని వంటి వారికి నోబెల్‌ శాంతి బహుమతి యిచ్చారు. కాని, ప్రపంచ శాంతి దూత, శాంతియుతంగా, అహింసాత్మకంగా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధికి నోబెల్‌ శాంతి బహుమతి యివ్వకపోవడమేమిటి? అన్న ఆలోచన వచ్చింది.

వెంటనే స్వీడన్‌లోని నోబెల్‌ శాంతి కమిటీకి ఆ ప్రశ్ననే వేస్తూ లేఖ రాశాను.

వెంటనే నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ డైరెక్టర్‌ నాకు లేఖ రాస్తూ "మరణించిన వారికి నోబెల్‌ శాంతి బహుమతి యివ్వడం లేదు. అందువల్ల, గాంధీజీకి యివ్వలేదు" అని జవాబు రాశారు!

ఇంకేమున్నది? నాకు దొరికి పోయారు! నేను తిరిగి ఆ డైరెక్టర్‌కు లేఖ వ్రాస్తూ "అలా అయితే, 1981లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దాగ్‌ హమర్షెల్డ్‌ మృతి చెందగానే మీరు ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతిని ఎలా ప్రకటించారు? గాంధీ కొక న్యాయం, హామర్షెల్డ్‌కు ఒక న్యాయమా? నోబెల్‌ బహుమతుల వ్యవస్థాపకుడు ఆల్‌ ఫ్రెడ్ నోబెల్‌, హామర్షెల్డ్‌ - ఇద్దరూ స్వీడన్‌ దేశీయులైనందున, మీరు ఆయనకిచ్చారా?" అని ప్రశ్నించాను.

ఆ లేఖకు ఇప్పటికీ సమాధానం లేదు, అది ఎప్పటికీ రాదు కూడా! కాకపోతే, ఆ తరువాత వేరే సందర్భంగా నోబెల్‌ కమిటీ వారు గాంధీకి శాంతి బహుమతి ఎందుకు యివ్వలేదో సంజాయిషీ యిచ్చుకున్నారు. మొదటిది - ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలోనే (1939-45) నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ పేరు ప్రతిపాదించబడిందట. అప్పటిలో రెండు, మూడు సార్లు ఆయన పేరు పరిశీలనకు వచ్చిందట. అయితే, అప్పటిలో మహాత్మాగాంధి భారత స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ సామ్రాజ్య వాద ప్రభుత్వంతో పోరాడుతున్నందున, అప్పుడు ఆయనకు శాంతి బహుమతి యిస్తే, బ్రిటీష్‌ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని శాంతి బహుమతి మహాత్మాగాంధీకి యివ్వలేదట! రెండవది-ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత గాంధీజీ మరణించారట. అందువల్ల, ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి యివ్వలేదట!

ఇదీ నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ కథనం! ఇందులో మొదటి సాకు - ఆ కమిటీ పిరికితనానికి, రాజకీయ ఒత్తిడికి సంబంధించినది. రెండవది - ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు - సర్వా బద్ధం. హమర్షెల్డ్‌కు ఎలాయిచ్చారు?

గాంధీకి నోబెల్‌ శాంతి బహుమతి విషయం అప్పటి రాష్ట్రపతి శ్రీ కె.ఆర్‌. నారాయణన్‌ దృష్టికి తీసుకురాగా, "ఎవ్వరూ లేవనెత్తని విషయాన్ని నోబెల్‌ కమిటీ దృష్టికి తీసుకువచ్చినందుకు" నన్ను అభినందిస్తూ లేఖ రాశారు! అప్పటిలో ఈ విషయాన్ని నేను పత్రికలకు విడుదలచేసినందున, అది అంతర్జాతీయ సమస్యగా పరిణమించి, మరెవరో దీన్ని ప్రస్తావించినందున, నోబెల్‌ కమిటీ తన నిజాయితీని, నిక్కచ్చి తనాన్ని ప్రశ్నించడానికి వీలైన అవివేక సమాధాన మిచ్చింది!

భారత రాష్ట్రపతికి ఫ్రాన్స్‌లో అవమానం

శ్రీ కె.ఆర్‌. నారాయణన్‌ రాష్ట్రపతిగా వున్నప్పుడు ఆయన అధికార పూర్వకంగా ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడకు చేరిన మరునాడు ఫ్రెంచి అధ్యక్షుని మర్యాదకోసం కలుసుకోవలసివుంది. పారిస్‌లో "లె మాండ్‌" అనే ప్రముఖ దినపత్రిక - బహుశా నూరు సంవత్సరాలకు పైగా వెలువడుతున్నది. అది ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి దినపత్రిక.

ఆ పత్రిక "యాన్‌ అన్‌ టచబుల్‌ ప్రెసిడెంట్‌ ఫ్రమ్‌ ఇండియా మీట్స్‌ అవర్‌ ప్రెసిడెంట్‌ టు డే" ("భారతీయ "దళిత" అధ్యక్షుడు నేడు మన అధ్యక్షునితో సమావేశం") అన్న శీర్షికతో ఒక వార్త ప్రచురించింది. ఇది నిస్సందేహంగా భారత రాష్ట్రపతికి అవమానకరమైన సంబోధన. ఆ పత్రికకు భారత విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ ద్వారా ఇందుకు నిరసన తెలియజేసింది.

ఈ వార్త ఇక్కడి పత్రికలలో ప్రచురితం కాగానే నేను ఆ పత్రికకు ఘాటుగా ఒక లేఖ రాశాను. కేవలం దళితుడన్న కారణాన శ్రీ నారాయణన్‌ను భారత రాష్ట్రపతిగా ఎన్నుకోలేదని, ఆయన జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి దౌత్య ప్రతినిధిగా, కేంద్రంలో మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, చివరికి రాష్ట్రపతి పదవి ఆయనను వరించిందని, ఆయన అత్యున్నత చరిత్రను సృష్టించుకున్న మహా మేధావి అని పేర్కొన్నాను.

అంతేకాక, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న మహదాశయాలకు ప్రాణం పోసిన "లె మాండ్‌" ఇలాంటి రాతలు రాయడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ, భారతదేశంలో అస్పృశ్యతను భారత రాజ్యాంగం నిషేధించిందని, ఏ భారతీయ పత్రిక అయినా ఒక దేశాధినేతను కించపరిచే ఇలాంటి పద ప్రయోగం చేస్తే, భారత ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఆ లేఖలో పేర్కొంటూ, నా లేఖను ప్రచురించాలని సవాల్‌ చేశాను. ఉత్తమ పత్రికా సంప్రదాయాలను పాటించే "లెమాండ్‌" నా లేఖను యథాతథంగా ప్రకటించిందట. ఆ లేఖ కటింగ్‌ను పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయం వారు రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌కు పంపించారు.

ఆ తరువాత కొంత కాలానికి సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయానికి కొన్ని రోజులపాటు దక్షిణ భారతంలో గడపడానికి వచ్చిన రాష్ట్రపతి నారాయణన్‌ కార్యాలయం నుంచి ఒక రోజు మధ్యాహ్నం నాకు ఫోన్‌ వచ్చింది.

"రాష్ట్రపతిని రేపు కాని, ఎల్లుండి కాని ఉదయం 11 గంటలకు కలుసుకొనడం మీకు వీలవుతుందా?" అని రాష్ట్రపతి కార్యాలయాధికారి ప్రశ్నించే సరికి నాకు ఆశ్చర్యం కలిగింది! ఎందుకు? ఏమై వుంటుంది?

"నేను ఎల్లుండి సంతోషంగా కలుస్తా"నని సమాధానమిచ్చాను. ఆ మరునాడే హైదరాబాద్‌ చేరుకోవాలంటే కొన్ని యిబ్బందులున్నాయి. అందువల్ల, "ఎల్లుండి" అని చెప్పాను.

ఆ "ఎల్లుండి" రోజున ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో శ్రీ కె.ఆర్‌. నారాయణన్‌ను కలుసుకున్నాను. ఆయన సాదరంగా పలకరించి, "లెమాండ్‌"తో నా ఉత్తర ప్రత్యుత్తరాలను గురించి ప్రస్తావించి, నాకు ధన్యవాదాలు చెప్పేసరికి నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి! అంతేకాక, "ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశంపై డాక్యుమెంటరీ తీస్తున్నామని చెప్పి, భారత ప్రభుత్వం నా వద్ద వున్న ప్రకాశం గారి ఫొటోలు, ఉత్తరాలను సేకరించిందని, కాని ఏళ్లా పూళ్లా గడిచినా ఏమీ కాలేదని, నేను తనకు రాసిన లేఖ విషయం ప్రస్తావించగా, ఆ విషయంలో తాను తీవ్రమైన చర్య తీసుకుంటున్నానని శ్రీ నారాయణన్‌ నాకు చెప్పారు. "మీకు "పద్మశ్రీ" అవార్డు వచ్చిందా?" అని ఆయన అడిగారు. లేదు. 13 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో వుందని చెప్పాను. రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాతో పాటు తీసుకువెళ్లిన "పద్మశ్రీ"కి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆయనకు చూపించాను. ఆయన వాటిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు!

నాకు ఆయన చేతుల మీదుగా ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో 2002 మార్చిలో "పద్మశ్రీ" అవార్డు ప్రదానం చేసిన తరువాత కేంద్రమంతివర్గం కార్యదర్శి శ్రీ టి.ఆర్‌. ప్రసాద్‌ రాష్ట్రపతికి నన్ను పరిచయం చేస్తూ "శ్రీ తుర్లపాటి ప్రఖ్యాత పాత్రికేయుడు. తెలుగు పాత్రికేయులలో మొట్ట మొదటి "పద్మశ్రీ" అవార్డు గ్రహీత" అని పేర్కొన్నారు. గతంలో జరిగిన "లెమాండ్‌" ఉదంతం, "ఆంధ్రకేసరి" డాక్యుమెంటరీ విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నారు కాబోలు, "తుర్లపాటి ప్రసిద్ధ పాత్రికేయుడేకాడు, ఆయనలో ఇతర ప్రజ్ఞా విశేషాలు చాలా వున్నాయి" అని రాష్ట్రపతి నారాయణన్‌ వ్యాఖ్యానించారు!

అక్కడే వున్న ఉపరాష్ట్రపతి శ్రీ కృష్ణకాంత్‌తో "నేను రాసిన ప్రఖ్యాత పార్లమెంటేరియన్‌ శ్రీ తెన్నేటి విశ్వనాథం జీవిత చరిత్రను విశాఖపట్నంలో మీరు ఆవిష్కరించా"రని జ్ఞాపకం చేయగా, "ఆయనెక్కడ? మహామహుడు! అలాంటి వారు ఇప్పుడెక్కడ వున్నారు? అని వ్యాఖ్యానించారు!

చంద్రబాబు - చిరంజీవి

1998 అక్టోబర్‌ 2వ తేదీన అప్పటి మెగా స్టార్‌ చిరంజీవి హైదరాబాద్‌లో "బ్లడ్ బ్యాంక్‌"ని ప్రారంభించారు. దాని ప్రారంభోత్సవానికి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఇంకా హోమ్‌ మంత్రి శ్రీ ఎ. మాధవరెడ్డి, ప్రసిద్ధ నటుడు శ్రీ మురళీమోహన్‌, ప్రముఖ నేత్రవైద్యుడు డాక్టర్ శివారెడ్డి ప్రభృతులు హాజరైనారు. నన్ను సభాధ్యక్షుడుగా శ్రీ చిరంజీవి ఆహ్వానించారు.

నేను రక్తదానం, నేత్ర దానాల ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగిస్తుండగా, శ్రీ చంద్రబాబునాయుడు, శ్రీ చిరంజీవి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నేను శ్రీ చంద్రబాబును గురించి సభలో ప్రసంగిస్తున్నాను. నా కొక అలవాటు వుంది. వేదికపై వున్న వారిలో నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నానో వారే నా మాటలు వినకపోతే, నేను - వారిని వుద్దేశించి, "నేను మాట్లాడేది మిమ్మల్ని గురించే, మీరే వినకపోతే ఎలా?" అని వారి దృష్టిని వినమ్రంగానే ఆకర్షిస్తాను. ఆ రోజు కూడా అలాగే ముఖ్యమంత్రిని, మెగాస్టార్‌ను నా వైపు తిప్పుకున్నాను!

సభ ముగిసిన తరువాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ లేబరేటరీని నాకు చూపించారు. ఇద్దరం కూర్చుని మాట్లాడుతుండగా, శ్రీ చిరంజీవే చంద్రబాబుతో తన సంభాషణ తీసుకువచ్చారు.

"మరేమీ లేదు. మీరు ఈ రోజు (అక్టోబర్‌ 2) మహాత్మాగాంధి జయంతి మాత్రమే కాక, మరో మహామహుని జయంతి కూడ. ఆయన పేరు చెప్పండి!" అంటూ సభికులపై ప్రశ్నాస్త్రం సంధించారు. ఆ లక్ష మంది ప్రేక్షకులలో ఎవ్వరూ చెప్పలేకపోయారు! మీరు వెంటనే "మన ద్వితీయ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి" అన్నారు.

వెంటనే శ్రీ చంద్రబాబు "ఇదేమిటి? లాల్‌ బహదూర్‌ జయంతి కూడ ఈ రోజేనని ఈయన అంటున్నాడు. వాస్తవమేనా?" అని నన్ను ప్రశ్నించారు.

"మీరు ముఖ్యమంత్రి, గొప్ప రాజకీయ వేత్త. ఈ రోజు లాల్‌ బహదూర్‌ జయంతి అవునో, కాదో మీకు తెలియనిదే సినీ నటుణ్ణి నాకేమి తెలుస్తుంది?" అన్నాను. మా సంభాషణ అంతకంటె మరేమీ లేదు. దానికే మీరు మమ్మల్ని కోప్పడ్డారు!" అని శ్రీ చిరంజీవి నవ్వుతూ అన్నారు!

అంతకు పూర్వం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.టి. రామారావు తన స్వగ్రామమైన నిమ్మకూరులో ఒక సభలో ప్రసంగిస్తూ "మహాత్మాగాంధి జయంతి అయిన అక్టోబర్‌ 4వ తేదీన" అని అన్నారు. "అక్టోబర్‌ 4 కాదు, 2వ తేదీ" అని సభలోని విద్యార్ధులు సవరించారు! "ప్రమాదోధీమతామపి" అన్నట్టు, పొరపాటు ఎవరికైనా తప్పదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు, కాలేరు కూడా. అయితే, రాజకీయ రంగంలో వున్న వారు, ప్రజల మధ్యకు వచ్చే వారు కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకొని వుండడం అవసరం. లేకపోతే, నలుగురిలో నగుబాటుకు గురికావలసి వస్తుంది కదా!

"ఆంధ్రకేసరి"జన్మదినోత్సవం : గ్రామ స్వరాజ్య దినోత్సవం

"ఆంధ్రకేసరి" శ్రీ టంగుటూరి ప్రకాశం ఆంధ్రదేశంలో గ్రామ పంచాయతీ రాజ్యాన్ని నెలకొల్పడానికి ఎనలేని కృషి చేశారు. ఒక విధంగా మహాత్మాగాంధి లక్ష్యమైన "రామరాజ్యా"నికి ఇది మరో పేరు అని చెప్పవచ్చు. గ్రామీణ సౌభాగ్యం పెంపుదలకు, పల్లెసీమలు పాడి పంటలతో కళకళలాడ్డానికి ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, ఆయన కృషి మధ్యదళారీలకు, మిల్లర్లకు, పెట్టుబడిదార్లకు కన్నెర్ర అయింది. ఆయనను అందరూ కలిసి కట్టుగా 1946లో మద్రాసు ముఖ్యమంత్రిత్వం నుంచి తొలగించారు! అంతే కాదు 1953లో ఆయన తిరిగి ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అయినప్పుడు మద్య నిషేధాన్ని తొలగించడానికి ఒప్పకోనందున, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి, ఒక్క వోటు తేడాతో ఆయనను ముఖ్యమంత్రిత్వం నుంచి తప్పించారు!

గ్రామ స్వరాజ్యం కోసం ఎంతగానో కృషి చేసిన ఆ మహనీయుని జన్మదినమైన ఆగస్టు 23వ తేదీనాడు "గ్రామ స్వరాజ్య దినోత్సవం"గా రాష్ట్ర మంతటా పాటించాలని 1981లో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్యకు లేఖ రాయగా, ఆయన వెంటనే అంగీకరించి, జి.వో. విడుదల చేశారు. అంతే కాదు - ఆ ఏడాది ఆగస్టు 23వ తేదీన "ఆంధ్రకేసరి" ప్రకాశం గారితో సన్నిహితంగా పని చేసి, అప్పటికి సజీవులై వున్న ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తూ, నన్ను కూడా సన్మానించింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన మొదటి గ్రామ స్వరాజ్య దినోత్సవం! ఆ తరువాత గ్రామ స్వరాజ్య దినోత్సవాలను ఎక్కడ జరిపినట్టు కనిపించదు. ఆంధ్రులు ఆరంభ శూరులు కదా! ఒక్క ఉత్తరం రాస్తే, ఆనాటి ముఖ్యమంత్రి నా సూచనను గౌరవించి, దానిలోని ప్రాధాన్యాన్ని గుర్తించి, వెంటనే జి.ఓ. జారీ చేయించారు. పరిపాలకులు అలా వుండాలి!

బిల్‌ క్లింటన్‌ ప్రతిస్పందన

కొన్ని ముఖ్య విషయాలపై వెంటనే ప్రతిస్పందించి, చర్య తీసుకొనడంలో మన పరిపాలకులు చాలా వెనుకబడి వున్నారని చెప్పక తప్పదు. అప్పటిలో ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధి, రాజీవ్‌ గాంధి, మొరార్జీ దేశాయ్ , చరణ్‌సింగ్‌, డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు ఒక్క ఉత్తరం రాస్తే చాలు, వెంటనే స్పందించి, చర్య తీసుకునేవారు. ఇప్పుడు ఆ "లేఖా సంస్కృతి" క్రమేణా సన్నగిల్లుతున్నది. నేను రాసిన లేఖలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటిష్‌ ప్రధాని టోని బ్లెయిర్‌, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చార్లెస్‌, మన రాష్ట్రపతులు, శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్ష మొదలైన వారందరు వెంటనే ప్రతిస్పందించేవారు. గుజరాత్‌లో భూకంపం వచ్చినప్పుడు విపరీతమైన జన నష్టం సంభవించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ గుజరాత్‌ వచ్చి, భూకంప బాధితులను పరామర్శించి, వారికి వస్తు సహాయం చేశారు.

నేను ఆయనకు గుజరాత్‌ భూకంప బాధితుల తరఫున ధన్యవాదాలు చెబుతూ, వారికి ఇంకా సహాయం చేయాలని అభ్యర్ధిస్తూ లేఖ రాయగా, ఆయన వెంటనే స్పందిస్తూ, తాను త్వరలో తిరిగి గుజరాత్‌ను సందర్శించి, బాధితులకు మరింత సహాయం చేయగలనని సమాధానమిచ్చారు! ఇలాంటివి చూసి, ఇప్పటి మన పరిపాలకులు ఎంతో నేర్చుకోవలసి వుంది! బాధ్యతగల ఒక సామాన్య పౌరుడు లేఖ రాసినా, వెంటనే ప్రతిస్పందించడం ఉత్తమ పరిపాలకుని సంస్కృతి!

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిత్వం

1972లో "జై ఆంధ్ర" ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ముల్కీ నిబంధనలను అమలు పరచవలసిందేనని సుప్రీంకోర్టు తీర్పు యిచ్చింది. అంటే, తెలంగాణాలో జన్మించిన వారికి, లేదా ఒక నిర్ణీత కాలంపాటు అక్కడ నివసించిన వారు మాత్రమే ఆ ప్రాంతంలో ఉద్యోగాలకు అర్హులని దీని తాత్పర్యం. ఇది ఆంధ్రప్రాంతీయులకు చాలా ఆందోళన కలిగించింది.

దీనికితోడు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు "ఇదే ముల్కీ నిబంధనలపై తుది తీర్పు" అని వ్యాఖ్యానించడం అగ్ని పై ఆజ్యం పోసినట్టయింది. ఇందుకు నిరసనగా ఆంధ్ర ప్రాంతంలోని మంత్రులు, శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న "జై ఆంధ్ర" ఉద్యమం తీవ్రరూపం ధరించింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎక్కడ చూచినా, "జై ఆంధ్ర" నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శాంతి భద్రతలు విఫలమైనాయి. దాదాపు ఆంధ్ర ప్రాంతంలోని అనేక పట్టణాలలో కర్‌ఫ్యూ విధించారు. 1973 జనవరిలో పి.వి. నరసింహారావు మంత్రి వర్గాన్ని కేంద్రం రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించింది. అసెంబ్లీని రద్దు చేయకుండా "సుప్త చేత నావస్థ"లో వుంచారు. అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు అసెంబ్లీని "నిద్ర" మేల్కొల్పవచ్చు! కాని, జై ఆంధ్ర ఉద్యమం మాత్రం ఎంతకాలం వుంటుంది? ఉద్యమం చప్పబడ్డం ప్రారంభించగానే మంత్రివర్గ పునరుద్ధరణ ఆలోచనలు ప్రారంభమైనాయి. ముఖ్యమంత్రి ఎవరు? తిరిగి పి.వి. నరసింహారావునే ప్రతిష్ఠిస్తే, ఆంధ్ర ప్రాంతీయులు అంగీకరించరు; ఆంధ్ర ప్రాంతీయులనే నియమిస్తే, తెలంగాణా వారు ఒప్పకోరు.

ముఖ్యమంత్రిత్వానికి అయిదారు పేర్లు నలగడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి కావడనికి ఆయా అభ్యర్ధులకు అనుకూల, ప్రతికూల అంశా లున్నాయి.

నేను ఇదంతా చూచి, ప్రధాని ఇందిరా గాంధికి సుదీర్ఘమైన లేఖ రాశాను. ముఖ్య మంత్రిత్వాన్ని కోరుతున్నట్టుగా పత్రికలలో పేర్లు వినవస్తున్న వారిని గురించి, వారి అనుకూల, ప్రతికూల అంశాలను వివరిస్తూ, చివరికి రెండు ప్రాంతాలకు ఆమోద యోగ్యుడు శ్రీ జలగం వెంగళరావు అని తేల్చాను!

ఎందువల్లనంటే, ఆయన ఆంధ్రప్రాంతంలో జన్మించి, తెలంగాణా ప్రాంతంలో స్థిరపడి, అక్కడి వారి చేత "మావాడే" అనిపించుకుంటున్నాడు. పైగా, తెలంగాణాలోని ఖమ్మంజిల్లా పరిషత్తు చైర్మన్‌గా ఎన్నికై, ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తెలంగాణా నుంచే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక అవుతున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో హోమ్‌మంత్రిగా తీవ్రవాదులను అణచి వేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పారు. ఆయన ముఖ్యమంత్రిత్వానికి ఉభయ ప్రాంతాలవారు అంగీకరిస్తారని స్పష్టీకరించాను.

నా లేఖను ప్రధాని ఇందిరా గాంధి చూచి ఊరుకోలేదు. అప్పటిలో రాష్ట్రపతి పరిపాలన అమలులో ఉంది కాబట్టి, నా లేఖను అప్పటి గవర్నర్‌ సలహాదారు శ్రీ హెచ్‌.సి. సరీన్‌కు పంపి, ఆ లేఖలో పేర్కొన్న రాజకీయ నాయకులను గురించి మరింత వివరంగా నా అభిప్రాయాలను తెలుసు కోవలసిందిగా అయనను ప్రధాని ఆదేశించారు.

లేఖ తనకు చేరిన వెంటనే శ్రీ సరీన్‌ నాకు కబురంపారు. నేను హుటాహుటిని వెళ్లి, హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌లో ఉన్న గవర్నర్‌ సలహాదారును కలుసుకున్నాను. గవర్నర్‌కు సలహాదారుగా సరీన్‌ హైదరాబాద్‌ వస్తూ తనకు కార్యదర్శిగా ఆకాశవాణి డిప్యూటి డైరెక్టర్‌-జనరల్‌గా ఉన్న శ్రీ అమృతలాల్‌ మెహతాను తీసుకువచ్చారు.

నేను వెళ్ళగానే శ్రీ సరీన్‌ నన్ను సాదరంగా రాజ్‌ భవన్‌లోని పచ్చిక బయలులోకి తీసుకు వెళ్లి అక్కడ కూర్చోపెట్టారు. అది 1973 ఏప్రిల్‌లోని ఒక సాయం సమయం. అక్కడ శ్రీ సరీన్‌, నేను, శ్రీమెహతా మాత్రమే ఉన్నాము. నాతో వచ్చిన నా శ్రీమతి కృష్ణ కుమారిని రాజ్‌ భవన్‌ వరండాలోనే కూర్చోపెట్టారు.

శ్రీ సరీన్‌ నా లేఖ చేతపుచ్చుకుని, దానిలో నేను పేర్కొన్న అంశాలన్నింటి పై నన్ను గుచ్చి గుచ్చి అడుగుతుండగా, శ్రీ మెహతా నా జవాబులను రాసుకుంటున్నారు. చివరికి శ్రీ వెంగళ రావు వంతు వచ్చింది. ఆయన అనుకూల అంశాలను నేను వివరించాను. ఆయన కార్యదక్షుడైన, చురుకైన రాజకీయ వేత్త అని, రెండు ప్రాంతాలవారు ఆయనను "తమ వాడు"గా పరిగణిస్తారని పేర్కొన్నాను.

"అయితే, వెంగళరావుకు పార్టీ ఎమ్‌.ఎల్‌.ఎల మద్దతు ఉన్నట్టు లేదు కదా! ఆయన సామాజిక వర్గానికి చెందిన శాసన సభ్యులను వ్రేళ్లపై లెక్కపెట్టవచ్చునేమో! మరి, అలాంటప్పుడు ఆయనను కాంగ్రెసుపార్టీ ఎలా అంగీకరిస్తుంది?" అని శ్రీ సరీన్‌ ప్రశ్నించారు. "మేడం గాంధి కనుక, వెంగళరావ్‌ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే, కాంగ్రెస్‌పార్టీ మొత్తం మళ్లీ ఎదురుచెప్పదు" అని నేను సమాధానం చెప్పాను! శ్రీ సరీన్‌ చిరునవ్వుతో నన్ను సాదరంగా సాగనంపారు. శ్రీ సరీన్‌ నన్ను 75 నిమిషాల సేపు ప్రశ్నించారు.

వెంగళరావు ఆదుర్దా

మరో విశేషాన్ని ఇక్కడ పేర్కొనవలసివుంది. శ్రీ సరీన్‌ను కలుసు కొనడానికి వెడుతూ మార్గం మధ్యలో శ్రీ పిడతల రంగారెడ్డి ఇంటిలో తేనీరు తీసుకోడానికి ఆగాము. శ్రీ రంగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గాను, ఆర్థిక, సమాచార శాఖల మంత్రిగాను పనిచేశారు.

మేము వెళ్లేసరికే శ్రీ రంగారెడ్డి గృహంలోపల అంతకు పూర్వం రద్దయిన పి.వి.నరసింహారావు మంత్రి వర్గంలోని సగం మందికి పైగా సభ్యులున్నారు. వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ బి.వి. సుబ్బారెడ్డి, మంత్రులు శ్రీ మూర్తిరాజు, శ్రీ జలగం వెంగళరావు ప్రభృతులున్నారు. వారికి శ్రీ పిడతల రంగారెడ్డి నన్ను పరిచయం చేస్తూ, "కాబోయే ముఖ్యమంత్రిని గురించి తుర్లపాటి రాసిన లేఖను మరింత వివరణ కోసం మేడం గాంధి గవర్నర్‌ సలహాదారు సరీన్‌కు పంపారట ! సరీన్‌ ఆహ్వానం పై తుర్లపాటి రాజ్‌ భవన్‌కు వెడుతూ ఇక్కడికి వచ్చా"రని పేర్కొన్నారు.

వెంటనే ముఖ్యమంత్రిత్వం కోసం ప్రయత్నిస్తున్న శ్రీ జలగం వెంగళ రావు నన్ను పక్కకు పిలిచి, "శ్రీ సరీన్‌ మీతో ఏమంటాడో నాకు వెంటనే తెలియజేయండి" అని అన్నారు. నేను అలాగేనన్నాను.

సరీన్‌తో సమావేశమైన మరునాడు శ్రీ వెంగళరావు నివాసానికి వెళ్లి జరిగినదంతా చెప్పి "మీకు శాసన సభ్యుల మద్దతు లేదని వారు భావిస్తున్నారు. ఎమ్‌.ఎల్‌.ఎ ల మద్దతును మీరు కూడగట్టుకుంటే, మీ అభ్యర్ధిత్వానికి వాళ్లు సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా" రని చెబుతూ, మేడం గాంధి మీ పేరు ప్రకటిస్తే, అంతా మిమ్మల్నే అంగీకరిస్తారని నేను సరీన్‌తో చెప్పాననగానే, శ్రీ జలగం సంతోషంతో నన్ను అభినందించారు !

హోమ్‌మంత్రిగా ఉన్నప్పుడు శ్రీ జలగం కార్యదక్షత గురించి తెలుసుకున్న ప్రధాని ఇందిరా గాంధి 1973 డిశంబర్‌లో ఆయన పేరునే ప్రకటించారు. 1973 డిశంబర్‌ 10న శ్రీ జలగం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను సరీన్‌తో నడిపిన రాయబారానికి నన్ను అభినందిస్తూ శ్రీ జలగం నాకు లేఖ రాశారు. అంతేకాక, ఈ విషయంలో నా పాత్రను అభినందిస్తూ శ్రీ సరీన్‌ కూడా ఢిల్లీ వెళ్లిన తరువాత నాకు లేఖ రాశారు. ఆ లేఖను నేను శ్రీ వెంగళరావుకు చూపించగా, ఆయన దాన్ని తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. దక్షులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులలో ఒకరుగా శ్రీ వెంగళరావు పేరు తెచ్చుకున్నారు. ఆయన 1973 డిశంబర్‌ నుంచి 1978 మార్చి వరకు ముఖ్యమంత్రిత్వంలో ఉండి, రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషిచేశారు. రాష్ట్ర చరిత్రలో తనకొక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు.

నెహ్రు - గాంధి కుటుంబంతో నా అనుబంధం

దురదృష్టవశాత్తు, శ్రీ రాజీవ్‌ గాంధి 1991 మే 21వ తేదీ అర్థ రాత్రి తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో అనూహ్యంగా, ఘోరంగా హత్యకు గురైనారు. శ్రీలంకలోని తమిళులపై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న హింసాకాండకు అవరోధంగా ఉంటుందన్న ఉద్దేశంతో "లిబరేషన్‌ టైగర్స్‌ తమిళ్‌ ఈలం" అధినేత వేలుపిళ్లె ప్రభాకరన్‌ అభ్యర్ధనపై ప్రధాని రాజీవ్‌ గాంధి అక్కడికి భారతీయ శాంతి పరిరక్షక దళాన్ని పంపారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు, తరువాత కొన్ని కారణాల వల్ల భారతీయ శాంతి సైనికుల వునికి ప్రభాకరన్‌కు నచ్చలేదు. ఆయన రాజీవ్‌ పై పగపెంచుకున్నాడు. థాను అనే మానవ బాంబును రాజీవ్‌ హత్యకు వినియోగించాడు. 1991 మేలో ఎన్నికల ప్రచారానికి శ్రీ రాజీవ్‌ గాంధి విశాఖపట్నం నుంచి శ్రీ పెరంబుదూర్‌రాగా, ఆ మానవ బాంబు రాజీవ్‌గాంధికి నమస్కరిస్తున్నట్టు వంగే సరికి నడుంకు కట్టుకున్న బాంబుపేలి, ఆ యువ మహనాయకుని పొట్టను పెట్టుకున్నది! భవిష్యద్భారత ఆశాజ్యోతి ఆరిపోయింది. రాజీవ్‌తో పాటు ఆయన ప్రధాన అంగరక్షకుడు, ఆయన సమీపంలో ఉన్న కాంగ్రెసు కార్యకర్తలు గుర్తుపట్టడానికి వీలులేకుండ ఛిన్నా భిన్నమైపోయారు. ఆ మనోహర సుందర శరీరం గుర్తు పట్టడానికి వీలులేకుండా ఖండ ఖండాలైనది.

ఆ నిశి రాత్రి ఈ భయంకర వార్త తెలియగానే నేను మ్రాన్పడిపోయాను ! ఆ "షాక్‌"కు నాకు గుండె నొప్పి వచ్చింది ! రాజీవ్‌ గాంధికి నేను సన్నిహితుణ్ణి; ఆయన ఉపన్యాసాలను అనువదించాను; ఆయన రాసిన లేఖలు నా వద్ద దాదాపు 40 వరకు ఉన్నాయి. ముఖ్యంగా మృతిచెందడానికి నెల రోజుల ముందు ఆయన నాకు రాసిన లేఖలలో ఆఖరుదానిలో ఆయన తాను కలలుకంటున్న భవిష్యద్భారతాన్ని చిత్రించారు!

ఆ లేఖను నేను పత్రికలకు విడుదల చేశాను. భారత దేశంలోని ప్రధాన ఇంగ్లీషు పత్రికలన్నీ రాజీవ్‌ గాంధి లేఖను ప్రచురిస్తూ, నెహ్రు - గాంధి కుటుంబంతో నాకు అప్పటికి 40 సంవత్సరాల నుంచి సన్నిహిత సంబంధాలున్నవని, పండిట్‌ నెహ్రు, శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ రాజీవ్‌గాంధి రాసిన దాదాపు నూరు లేఖలు నావద్ద ఉన్నవని ఢిల్లీ పత్రికలు పేర్కొన్నాయి.

రాజీవ్‌ గాంధి పై జపాన్‌ టి.వి. వార్తా చిత్రం

శ్రీ రాజీవ్‌ గాంధి అంత్యక్రియల వార్తా విశేషాలను చిత్రించడానికి జపాన్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఆ దేశపు టి.వి. బృందం ఈ వార్తను ఢిల్లీ ఇంగ్లీషు పత్రికలలో చూశారు. నెహ్రు - గాంధి కుటుంబంతో నాకు గల సన్నిహిత సంబంధాల పై ఒక వార్తా చిత్రాన్ని నిర్మించదలచామని, అందుకు "ఢిల్లీకి రాగలరా?" అంటూ జపాన్‌ టి.వి. వారు నాకు ఫోన్‌ చేశారు. అది 1991 మే నెలాఖరు. మండుటెండలు, ఢిల్లీలో మరీ తీవ్రమైన ఎండలుంటాయి. నాకు అప్పటిలో వంట్లో బాగా లేదు కూడా. వారికి అదేమాట చెప్పాను. వారు కూడా "సారీ" అని ఫోన్‌ పెట్టేశారు. నేను కూడా ఆ విషయం మరచిపోయాను.

కాని, వారు నా వద్ద ఉన్న నూరు లేఖల మాట మరచిపోలేదు ! 1991 మే 31వ తేదీన నాకు ఢిల్లీ నుండి తిరిగి ఫోన్‌ ! తామే జూన్‌ 2వ తేదీన విజయవాడలోని మా గృహానికి వచ్చి, అక్కడే నాతో ఇంటర్‌వ్యూ జరుపుతామని పేర్కొన్నారు. నేను "సరే" అన్నాను.

అన్న మాట ప్రకారం 1991 జూన్‌ 2వ తేదీ మిట్ట మధ్యాహ్నం జపాన్‌ టి.వి. బృందం రెండు కెమెరాలతో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ విమానంలో వచ్చి, అక్కడి నుంచి రెండు కార్లలో విజయవాడలో మా ఇంటికి వచ్చారు. మా వీథి, గృహం, నా అలమారాలో నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల ఉత్తరాలున్న ఫైలు - ఇవన్నీ తమ కెమెరాలతో చిత్రించారు. తరువాత నన్ను ఆ టి.వి. బృందం ఇంటర్‌వ్యూ చేశారు.

"రాజీవ్‌ గాంధి గతించారు కాదా! భారత దేశం భవిష్యత్‌ ఎమిటి? ఇక నాయకు డెవరు?" అని ప్రశ్న.

"ప్రజాస్వామ్యంలో నాయకుణ్ణి ప్రజలే సృష్టించుకుంటారు. నెహ్రు తరువాత లాల్‌ బహదూర్‌, ఆయన వెనువెంటనే ఇందిరా గాంధి, ఆమె తరువాత రాజీవ్‌ గాంధి - వీరిని ఎవరు సృష్టించారు? ఇప్పుడు కూడా త్వరలోనే కొత్త నాయకుడు ప్రజలనుంచే ప్రభవిస్తాడు"

అప్పటికి ఇంకా ప్రధానిగా శ్రీ పి.వి నరసింహారావు ఎంపిక కాలేదు. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్‌ కొనసాగుతున్నారు. పి.వి. జాన్‌ 21న కాని ప్రధాని కాలేదు.

"నెహ్రూ-గాంధి కుటుంబం పట్ల భారతీయులకు ఇంతగా గౌరవాభిమానాలకు కారణ మేమిటి?" అని మరో ప్రశ్న.

"భారత స్వాతంత్య్రోద్యమంలో ఆ కుటుంబం చేసిన త్యాగం, ఆ కుటుంబ సభ్యుల దేశభక్తి, వారి నాయకత్వ వైశిష్ట్యం - ఈ దేశ ప్రజలను ఎప్పటికప్పడు నడిపిస్తూనే ఉన్నాయి. వారే కాదు-నిష్కళంక దేశ భక్తులను, త్యాగధనులను ఏ దేశంలోనైనా గౌరవిస్తారు. నెహ్రూ - గాంధి కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రజాభీష్టం ప్రకారం నాయకత్వ పగ్గాలను చేబూనుతున్నారు. ప్రజాస్వామ్యంలో వంశపారంపర్య పాలనకు అవకాశంలేదు. ప్రజలు ఎన్నుకుంటేనే ఎవరైనా పాలనా పగ్గాలను పుచ్చుకోగలరు. 1977లో ఇందిరా గాంధిని కూడా భారత ప్రజాస్వామ్యం ఓడించింది!" అని చెప్పాను.

ఇదంతా కలిపి, జపాన్‌ టి.వి. వారు ఒక ఆరు నిమిషాల డాక్యుమెంటరీగా నిర్మించి,అమెరికా, జపాన్‌లలో ప్రసారం చేశారు!

జపాన్‌ టి.వి. ప్రయివేటు సంస్థ వారు ఎంతో వ్యయ ప్రయాసలతో మండుటెండలో విజయవాడ వచ్చి, నాతో ఇంటర్‌వ్యూ జరిపి డాక్యుమెంటరీని నిర్మించి, దాన్ని అమెరికా, జపాన్‌లలో ప్రదర్శిస్తే, అక్కడి ప్రభుత్వాలు వారికి "రాయల్టీ" చెల్లించాయి. మన దేశంలో ఢిల్లీలోని దూర దర్శన్‌ వారిని "శ్రీ రాజీవ్‌ గాంధి పై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారం చేస్తారా?" అని అడిగితే, మన దూర దర్శన్‌ వారు "మాకెంతయిస్తారని" అడిగారట! జపాన్‌ టి.వి. వారు నిర్మించింది ఈ దేశ యువ ప్రధాని రాజీవ్‌ గాంధి డాక్యుమెంటరీ ! మన దూర దర్శన్‌ ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాని-దివంగత రాజీవ్‌ గాంధి.

మన దూర దర్శన్‌ వైఖరి జపాన్‌ టి.వి. వారికి వింతగా, బాధాకరంగా కనిపించి, వారు మన దూర దర్శన్‌కు డాక్యుమెంటరీని ఉచితంగా యివ్వలేక పోయారట. ఈ విషయాన్ని ఆ తరువాత నేను ఢిల్లీ వెళ్లినప్పుడు జపాన్‌ రాయబార కార్యాలయం వారే నాకు చెప్పారు. నాకు వారు ఒక పార్కర్‌ పెన్నును బహూకరించారు.

కాగా, ఏతావాతా రాజీవ్‌ గాంధి డాక్యుమెంటరీని భారత దేశంలో ప్రసారం చేసే అవకాశం కలగలేదు ! అయినా, అది నెహ్రు - గాంధి కుటుంబంతో నా "లేఖా బాంధవ్యా"నికి సాక్షీ భూతంగా విదేశాలలో నిలిచిపోయింది !

గిన్నిస్‌ బుక్‌ ఎడిటర్‌ అభినందనలు

"తుర్లపాటి కలానికి, గళానికి పోటీ పెడితే, ఏది గెలుస్తుందో చెప్పడం కష్ట"మని మహా కవి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆఖరు ఆస్థానకవి శ్రీదాశరధి ఒకసారి నా సన్మాన సభలో అన్నారు.

" తుర్లపాటికి ఇంత పేరు రావడనికి మూడు "పి"లు కారణం - పిక్చర్‌, పెన్‌, ప్లాట్‌ ఫామ్‌" అని మరో సారి నా సన్మాన సభలోనే అప్పటి అధికార భాషా కమిషన్‌ చైర్మన్‌, ప్రపంచ ఆర్య మహాసభ అధ్యక్షుడు శ్రీ వందేమాతరం రామచంద్ర రావు అన్నారు.

"పిక్చర్‌" అంటే సినిమాలు, "పెన్‌" అంటే రచనలు, "ప్లాట్‌ఫామ్‌" అంటే ఉపన్యాసాలు అని వేరే చెప్పనక్కరలేదు. నేను పత్రికా రచన ప్రారంభించింది 1947 మార్చి అని, ప్రథమ ఉపన్యాసం చేసింది 1947 అక్టోబర్‌ అని ఈ కథ ప్రారంభంలోనే పేర్కొన్నాను. మహాకవి దాశరధి అన్నట్టు, అప్పుడు ప్రారంభమైన నా కలం, గళాల ప్రస్థానం ఇప్పటికీ కొన సాగుతూనే వున్నది. నేను సభలలో చమత్కృతిగా అంటూవుంటాను - అప్పుడు తెరిచిన నా పెన్‌ "క్యాప్‌" ఇప్పటి వరకు మూయలేదు; అప్పుడు విప్పిన గళం ఇంకా వినిపిస్తూనే ఉన్నది. నా కలం, గళాల వయస్సు నాకు 78 సంవత్సరాలు పూర్తి అయ్యేనాటికి (2011 ఆగష్టు 10) 65 సంవత్సరాలు ! ఇంతకాలంగా ఆయురారోగ్యంతో ఉండి, కలం, గళాల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండడం కేవలం భగవత్కృప అని నేను భావిస్తూ ఉంటాను. ఆరోగ్యం మన చేతిలో కొంత వరకు ఉన్నప్పటికీ, ఆయుర్దాయం మన చేతిలో లేదు!

నా ఉపన్యాసాల సంఖ్య, ముఖ్యంగా నేను అధ్యక్షత వహించిన సభల సంఖ్య 1993 నాటికి పదివేలు కాగా, అది "గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్"కు వెళ్లగా, దాదాపు అర్థ శతాబ్ది కాలంలో ఏ పదవీ లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా అన్ని సభలకు అధ్యక్షత వహించిన రికార్డు ఇంత వరకు తమకు ఎక్కడా లభించలేదని, అది అపూర్వమని, ఇందుకు నన్ను అభినందిస్తున్నట్టు "గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ఠ్" ఎడిటర్‌ ఆల్మండ్‌ బ్రూక్స్ 1993లో నాకు లేఖ రాశారు.

ఈ వార్త దేశ విదేశాలలో రేడియోలలోను, టి.వి.లలోను ప్రసారమైనది. ఇది తెలిసిన అప్పటి భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు నన్ను అభినందించారు. విజయవాడలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్న సభలో నాకు "దశసహస్ర సభాకేసరి" అనే బిరుదు ప్రదానం చేశారు.

అంతేకాదు - విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వారు నన్ను అభినందిస్తూ ఒక ప్రత్యేక తీర్మానం చేసి, విజయవాడలో నేను నివసించే వీథికి నా పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ వీథి నామకరణోత్సవ సభ కూడా పెద్దయెత్తున జరిగింది. అప్పటి రాష్ట్రమంత్రి శ్రీ ఎమ్‌.కె.బేగ్‌, ఉడా చైర్మన్‌ శ్రీ కంచి రామారావు ప్రభృతులు పాల్గొన్నారు. అయితే, ఆ వీథిలో కాని, ఏ వీథిలో కాని నా కొక సొంత ఇల్లు లేక పోవడం విశేషం; నాకు ఆ వీథిలో ఇల్లు లేక పోయినా, ఆ వీథికి నా పేరు పెట్టడం ఇంకా విశేషం!

స్విస్‌ ఆర్థిక మంత్రి : చంద్రబాబునాయుడు ఉపాఖ్యానం

Naa Kalam - Naa Galam Page 101 Image 0002
Naa Kalam - Naa Galam Page 101 Image 0002

2000లో స్పిట్జర్లెండ్‌ ఆర్థిక మంత్రి పాస్కల్‌ భారత దేశం వచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర అభివృద్ధి రేటును పదిశాతం పెంచగలమని పేర్కొన్నారు. అది సాధ్యంకాదని స్విస్‌ ఆర్థిక మంత్రి అనగా, సాధ్యమేనని శ్రీచంద్రబాబు నాయుడు పేర్కొంటూ, అందుకు ఉదాహరణగా డాక్టర్ రెడ్డి లేబరేటరీస్‌ మొదలైన కొన్ని సంస్థలు సాధించిన అభివృద్ధి రేట్లను పేర్కొన్నారు.

దీనిపై స్విస్‌ ఆర్థిక మంత్రి తిరిగి మాట్లాడుతూ "ఇలా ఎవరైనా మాట్లాడితే, మా దేశంలో జెయిలుకైనా పంపిస్తారు, లేదా పిచ్చి ఆసుపత్రికైనా పంపిస్తా"రనేసరికి శ్రీ చంద్రబాబు ఆ విదేశ ఆర్థిక మంత్రి తెంపరితనానికి, అసభ్యకరమైన వ్యవహార శైలికి ఖిన్నుడు కావడం తప్ప, మరి మాట్లాలేకపోయారు!

ఈ ఉదంతాన్ని గురించి పత్రికలలో చదివిన నాకు చాలా బాధ కలిగింది. పార్టీ ఏదైనప్పటికీ, శ్రీ చంద్రబాబు నా స్వరాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడో స్విట్జర్లెండ్‌ నుంచి వచ్చిన ఒక మంత్రి నా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించమా? ఒక విదేశీయుడు మరొక దేశానికి వచ్చి, అక్కడ ఒక ప్రముఖుని, విశేషించి, ఒక ముఖ్యమంత్రిని గురించి అలా అవమానకరంగా ఎద్దేవా చేయడమా? ఇది కేవలం ఒక వ్యక్తికి అవమానం కాదు-మొత్తం తెలుగు వారికే అవమానం, దౌత్యమర్యాదకే అపచారం" అని నేను భావించి, ఆ స్విస్‌ ఆర్థిక మంత్రికి తీవ్రంగా ఒక లేఖ రాశాను. "మీరు ఎద్దేవా చేసింది ఒక ముఖ్యమంత్రిని కాదు-ఆయన ప్రాతినిధ్య వహించే మొత్తం రాష్ట్రాన్ని. మీ వ్యాఖ్యలను ఆంధ్ర ప్రదేశ్‌ పౌరులు తీవ్రంగా పరిగణస్తున్నారు. మీరు మీ వ్యాఖ్యలను ఉపహరించుకోండి, లేదా మా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి" అని రాశాను.

ఆ ఆర్థిక మంత్రి ఏ "మూడ్‌"లో ఉండి, హైదరాబాద్‌ సభలో అలా మాట్లాడాడోకాని, నా లేఖ తో ఆయన తన తప్పిదాన్ని తెలుసుకున్నట్టు కనిపించింది. ఆయన నాకు వెంటనే బెర్న్‌ (స్విట్జర్లెండ్‌) నుంచి సమాధానం రాస్తూ "నా వ్యాఖ్యలు మిమ్మల్ని, రాష్ట్ర ప్రజలను బాధ పెట్టినందుకు నేను బాధపడుతున్నాను. నా ఉద్దేశం మీ ముఖ్య మంత్రిని కాని, మీ రాష్ట్ర ప్రజలను కాని కించపరచడం కాదు. మా స్విట్జర్లెండ్‌లో అయితే, కొద్ది కాలంలో అంత అభివృద్ధి సాధించడం అసాధ్యమని, అలా సాధిస్తామని అక్కడ మేము ఎవరైనా అంటే మమ్మల్ని జెయిలుకో, పిచ్చి ఆసుపత్రికో పంపిస్తారన్న ఉద్దేశంతో నేను అన్నాను. మీ ముఖ్యమంత్రి స్వల్పకాలంలో అనల్పమైన అభివృద్ధి సాధించ గల సమర్ధునడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని, మీ రాష్ట్ర ప్రజలను బాధపెడితే నన్ను మన్నించండి. ఈ లేఖను మీరు పత్రికలకు విడుదల చేయండి " అని అనునయంగా, సంజాయిషీ ధ్వనిస్తున్నట్టుగా రాశారు.

ఆయన కోరినట్టుగానే నేను ఆ లేఖను అన్ని పత్రికలకు విడుదల చేశాను. ఈ లేఖ రాష్ట్రంలో కొంత సంచలనమే కలిగించిందని చెప్పవచ్చు. స్విస్‌ ఆర్థిక మంత్రి లేఖ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా పంపాను. ఆ కాపీ తనకు చేరినట్టు ఆయన నాకు తెలియజేయలేదుకాని, దాన్ని ఆ తరువాత రాష్ట్ర అసెంబ్లీలో ఒక సన్నివేశంలో తన "ఆత్మ రక్షణ"కు ఉపయోగించుకున్నారు. అందులో తప్పేమీ లేదు !

అసెంబ్లీలో స్విస్‌ మంత్రి లేఖ :

ఆ తరువాత ఒకసారి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక విషయాల పై చర్చజరుగుతున్నది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికాభివృద్ధిని సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని, అది అంత సులభం కాదని పేర్కొంటూ, స్విస్‌ ఆర్థిక మంత్రి పాస్కల్‌ "జెయిలు, పిచ్చాసుపత్రి" వ్యాఖ్యలను ఉదహరించారు.

వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేచి, స్విస్‌ ఆర్థిక మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ ఒక ప్రముఖ జర్నలిస్టుకు లేఖ రాశారని వివరిస్తూ తన వద్ద ఉన్న స్విస్‌ ఆర్థిక మంత్రి లేఖ కాపీలను (అంతకు పూర్వమే వాటిని సిద్ధం చేయించి ఉంటారు) శాసన సభ్యులందరికీ పంచిపెట్టించారు. అక్కడితో ఆయనను విమర్శిస్తున్న వారు మారు మాట్లా లేకపోయారు !

ఇక్కడ ధర్మ "రాజనీతి"ని జ్ఞాపకంచేసుకోవాలి. వనవాసంలో ఉన్న తమను అవమానించడానికి చతురంగ బలాలతో వచ్చిన కౌరవులను గంధర్వ రాజు బంధించాడు. ఈ వార్త తెలిసిన ధర్మరాజు కౌరవులను విడిపించవలసిందిగా భీమార్జునులను ఆదేశించగా, వారు "కాగల కార్యం గంధర్వులే తీర్చారు. మన శత్రువులను గంధర్వులే బంధించి, మనం చేద్దామనుకున్న పని వారే చేసిపెట్టారు. మనం కౌరవులను ఎందుకు విడిపించా"లని ప్రశ్నించగా, "మనలో మనకు తగాదా వస్తే, వారు నూరుగురు, మనం అయిదుగురం. కాని, చంద్ర వంశీకులమైన మనపై ఎవరు దాడి చేసినా, మనం 105 మందీ వారిని ఎదిరిస్తా"మని ధర్మరాజు చెప్పిన నీతి ఎప్పడైనా, ఎవరికైనా అనుసరణీయమే.

అమెరికాలో చర్చిల్‌ ప్రవచనం

1946లో ఒకసారి బ్రిటిష్‌ మాజీ ప్రధాని చర్చిల్‌ అమెరికా వెళ్లగా, అక్కడి విలేకరులు ఆయనను అప్పటి బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ ప్రభుత్వం పై ఆయన అభిప్రాయమేమిటని అడుగగా, " స్వదేశంలో మేము ప్రత్యర్థులమే. కాని విదేశాలకు వచ్చినప్పుడు మేమందరం ఒక్కటే, మేమందరం బ్రిటిష్‌ పౌరులమే, మా దేశ ప్రభుత్వాన్ని విదేశంలో ఎలా విమర్శిస్తాము ? మా దేశంలో లేబర్‌ పార్టీ ప్రభుత్వం మా కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం కంటే బాగానే పని చేస్తున్నది" అని చర్చిల్‌ సమాధాన మిచ్చాడు.! బ్రిటిష్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థనే పాటిస్తున్న మన దేశంలో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, వారికైనా చర్చిల్‌ జవాబు పాటించదగిందని నా అభిప్రాయం.

రాజీవ్‌ గాంధిపై ఎన్‌.టి.ఆర్‌. వ్యాఖ్య

Naa Kalam - Naa Galam Page 105 Image 0001
Naa Kalam - Naa Galam Page 105 Image 0001

ఒక సారి అప్పటి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.టి.రామారావు ప్రధాని రాజీవ్‌ గాంధిని " దేశ ద్రోహి " అని నిందించారు. అది నాకు బాధకలిగించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు దేశ ప్రధానిని విమర్శించవచ్చుకాని, "దేశ ద్రోహి" అని ఎలా దూషిస్తారు? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? శ్రీ ఎన్‌.టి.ఆర్‌. వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? " అంటూ నేను ఆనాడు దేశంలోని కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశాను. వారిలో ఎవ్వరూ స్పందించలేదు. ఒక్క కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ హెగ్డే మాత్రం తాను ఆవ్యాఖ్యతో ఏకీభవించడంలేదని సమాధానం రాశారు.

పార్టీ మార్పిడులు

మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో అవి నీతి, పార్టీల మార్పిడి సమస్యలు తీవ్రమైనవి. వీటిలో పార్టీల మార్పిడి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వాలను అశాంతి, అస్థిరత్వాలతో కదిపి, కుదిపి వేస్తున్నాయి. ఒక పార్టీ పట్ల అభిమానంతో, విశ్వాసంతో ఆ పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపిస్తే, వారిలో కొందరు తమ సభ్యత్వ కాలపరిమితి పూర్తిఅయ్యేలోగా రెండు మూడు పార్టీలు మారడం కద్దు. ఈ వ్యాధి పార్టీల మార్పిడి చట్టం రాకముందు మరీ ఉధృతంగా ఉండేది! ఈ ప్లేటు ఫిరాయింపుల వల్ల ఎన్నో ప్రభుత్వాలు కూలిపోతూ వచ్చాయి. ఈ ఫిరాయింపుల నిరోధానికి చట్టంతీసుకు రావాలని చాలా కాలాంగా ఆలోచనలు, ప్రయత్నాలు జరుగుతూ వచ్చినా, ఏవో కారణాల వల్ల అవి కార్య రూపం ధరించలేదు. ఒకసారి సోషలిస్టు నాయకుడు శ్రీ మధు లిమాయే అలాంటి చట్టం "వ్యక్తి స్వేచ్ఛ"కు భంగమనే కారణంతో ఆ బిల్లును అడ్డుకున్నారు. అక్కడితో ఆ బిల్లు అటక ఎక్కింది - లోక్‌ పాల్‌ బిల్లువలెనే.

1970 దశకంలో నేను ఆనాటి ప్రముఖ జాతీయ నాయకులు లోక్‌ నాయక్‌ శ్రీ జయప్రకాష్‌ నారాయణ్‌, "కాశ్మీర్‌ కేసరి" షేక్‌ అబ్దుల్లా, జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్ర శేఖర్‌ ప్రభృతులకు పార్టీల మార్పిడి బిల్లుపై వారి అభిప్రాయాలు ఏమిటని ప్రశ్నించగా, వారందరు కూడా ఆ బిల్లు కోసం తాము ఎదురు చూస్తున్నామని, అలాంటి బిల్లును తాము తప్పక స్వాగతిస్తామని సమాధానమిచ్చారు.

తరువాత ఆ లేఖలను 1985లో ప్రధాని రాజీవ్‌ గాంధికి పంపాను. శ్రీ రాజీవ్‌ గాంధి పార్టీల మార్పిడి బిల్లు కోసం గట్టిగా ప్రయత్నించి, ఎట్టకేలకు 1986లో పార్టీల మార్పిడి చట్టాన్ని తీసుకు వచ్చారు. అయితే, ఆ బిల్లులో కొన్ని లొసుగులు లేకపోలేదు. మరి, అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సమన్వయ పరచడానికి జరిగిన ప్రయత్నం వల్ల ఆ చట్టం ఇప్పటి రూపం ధరించింది! ఈ చట్టాన్ని ఇంకా కఠిన తరం చేస్తే కాని, దాని నుంచి ఆశించిన సమగ్ర ఫలితం లభించదు.

నా మనుమడు రాసిన నా జీవిత చరిత్ర :

నా కుమారుడు జవహర్‌లాల్‌ పుత్రుడు కృష్ణ కుమార్‌ ఇంగ్లీషు కాన్వెంట్‌లో చదివాడు. అయితే, అతను మేధావి. నా ప్రభావం అతని పై ఎక్కువ పడింది. నా సభలు, సమావేశాలు, నన్ను కలుసుకొనడానికి వచ్చే వారితో నేను జరిపే చర్చలు - ఇవన్నీ అతడిని కొంతవరకు ప్రభావితుని చేశాయి. జాగ్రత్త పరుడు, వస్తుతః తెలివిగలవాడు కావడం వల్ల తెలుగు భాషను కొంత వరకు పట్టుకున్నాడు.

అతను తన 14, 15 సంవత్సరాల వయస్సులోనే తన పెన్నును మైకు వలె నా నోటివద్ద పెట్టి, నన్ను మాక్‌ ఇంటర్‌వ్యూ చేసేవాడు!

అతనికి ఇంటర్‌ పూర్తి చేసి, ఇంజనీరింగ్‌ సీటు వచ్చేలోగా ఎందుకు కలిగిందోకాని, నా జీవిత చరిత్ర రాయాలన్న కోర్కె కలిగింది. ఒక రోజున అకస్మాత్తుగా నా వద్దకు వచ్చి, "మీ జీవిత చరిత్ర రాశాను, తాతగారూ! అది ప్రింటు చేసి పెట్టాలి", అని అడిగాడు.

నాకు ఆశ్చర్యం కలిగింది. నా జీవిత చరిత్ర ఏమిటి ? తను రాయడమేమిటి? వెంటనే నేను స్క్రిప్టు చూసి, ఒక చోట దిద్దబోయాను.

"తాతగారూ! మీరు ఇందులో ఒక్క అక్షరం మార్చినా, మీరు దాన్ని ప్రింటు చేయనక్కర్లేదు" అంటూ స్క్రిప్టు తీసుకు వెళ్లాడు. అతని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి నాకు సంతోషం కలిగింది. ఆ స్క్రిప్టులో తప్పులు లేవు. కాకపోతే, కొన్నిచోట్ల నా భావాలకు భిన్నంగా ఉన్నట్టు కనిపించింది. అలాంటి చోట్ల చిన్న చిన్న సవరణలు చేయాలని నాకు అనిపించింది. తాను ఒప్పుకుంటేగా? అతను పెట్టిన షరతులకు అంగీకరించి, ఎలాంటి మార్పులు చేయకుండా నా జీవిత చరిత్రను నేనే ప్రింటు చేయించాను !

అప్పుడు నామనుమనికి 17 సంవత్సారాలు. ఆ స్క్రిప్టును విజయవాడ విశ్వటైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ యజమాని శ్రీ రాఘవ రెడ్డికి యిచ్చి, ముద్రించాలని కోరాను. అంత చిన్నవయస్సులో నా జీవిత చరిత్ర రాయడానికి సాహసించిన అతని చొరవకు ముచ్చటపడిన ఆయన ఉచితంగానే ముద్రించి యిచ్చారు !

నా మిత్రత్రయం

ఎవరైనా ముందుకు వెళ్ళడానికి సాధారణంగా బంధువుల కంటె మిత్రులే కారకులు. అందువల్లనే, "స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం" అన్నాడొక కవీంద్రుడు. నాకు మొదటి నుంచి మిత్రులు తక్కువ. అభిమానులే ఎక్కువ. వారిలో కొందరు వీరాభిమానులు ! మరి కొందరు మూఢాభిమానులు! ఇది ఆత్మస్తుతి కాదు - వినమ్రతతో చెప్పే మాట; ఆ నామిత్రుల పట్ల గౌరవాభిమానాలతో, కృతజ్ఞతతో చెప్పేమాట!

Naa Kalam - Naa Galam Page 108 Image 0001
Naa Kalam - Naa Galam Page 108 Image 0001

వారిలో ముగ్గురు అగ్రగణ్యులు - వల్లభనేని లక్ష్మీదాసు, జె.ఎస్‌.టి.శాయి, మల్లాది రామకృష్ణ ! వీరు నా చిన్న నాటి నుంచి ఇప్పటి వరకు నాకు హితులుగా, స్నేహితులుగా, వీరాభిమానులుగా ఉన్నారు. మా అనుబంధం అనిర్వచనీయం. వీరి ముగ్గురివీ మూడు విభిన్నమైన వ్యక్తిత్వాలు. నిజానికి, ఒక ఇంగ్లీషు సూక్తి పేర్కొంటున్నట్టు, ఏ మనిషికి ఆ మనిషి ఒక టైప్‌. వీరిలో లక్ష్మీదాసు ఆవేశపరుడు. నన్ను గురించి నా సన్నిహిత బంధువులైనా పల్లెత్తు మాట అంటే, తానే రేచుకుక్కవలె వారిపై విరుచుకుపడేవాడు! దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్‌ ఫిలింఫాన్స్‌ అసోసియేషన్‌ నిర్వహణలో నాకు తోడుగా, నీడగా ఉండేవాడు. ఆయన 2010 లో దీర్ఘ వ్యాధితో దివంగతుడైనాడు ! అతడు లేని లోటు నాకు మానసికంగా తీరని లోటు. తన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ధీరోదాత్తంగా ఎదుర్కొన్నాడు. అరుదైన ఆప్తమిత్రుడు లక్ష్మీదాసు ! అతనిది విలక్షణ వ్యక్తిత్వం.

ఇక, జె.ఎస్‌.టి.శాయి. ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికి ఆయనది మరోపేరు. నాకు వీరాభిమాని. ఆయనను మా అమ్మగారు అంటూఉండేది, రామన్నకు లక్ష్మణుడులాంటివాడని! అంతకంటే ఏమి చెప్పాలి ? ఏ పని అప్పగించినా, దాన్ని సాధించుకు వచ్చేవాడు. నిజాయితీకి నిలువెత్తు చిరునామా. కారణాంతరాలవల్ల ఆయన హైదరాబాద్‌కు మకాం మార్చవలసి రావడం వల్ల నాకు ఒక చెయ్యి విరిగినట్టయింది. హైదరాబాద్‌లో ఉన్నా, ఎప్పుడూ నా యోగ క్షేమాలను గురించి తెలుసుకుంటానే వుంటాడు.

మల్లాది రామకృష్ణ నాకు "మౌనభక్తుడు". ఎక్కువగా మాట్లాడడు. కార్యవాది. నాకు కొండంత అండగా నిలబడినవాడు. లోకం దృష్టిలో ఆయనపేరు "తుర్లపాటి శిష్యుడు" అంటే, ఇక వేరే చెప్పేదేమున్నది? నా దివంగత శ్రీమతి "నాట్యరాణి" తుర్లపాటి కృష్ణకుమారి పేరిట "కృష్ణ కళాభారతి" అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పి, ఇప్పటికి మూడు దశాబ్దాలుగా ఆమె జయంత్యుత్సవాలను ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా నిర్వహిస్తూ, విజయవాడలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన కళాభిమాని.

ఈ ముగ్గురూ నా ఉన్నతికి ఎంతగానో దోహదం చేసిన "ముగ్గురు మిత్రులు". నా జీవితం పై వారి ప్రభావం ఎంతటిదో వారి జీవితాలపై నా ప్రభావం కూడా అంతటిదేనని వేరే చెప్పనక్కరలేదు. అయితే, నా పురోగతికి అనుక్షణం నాతోనే ఉండి, నన్ను ముందుకు నడిపించిన వారిలో వీరు అగ్రగణ్యులైతే, విజయవాడలో నేమి, ఇతర పట్టణాలలో నేమి నాకు అండదండలు అందించిన శ్రీ చెట్లపల్లి మారుతి ప్రసన్న వంటి ఆత్మీయ మిత్రులు ఎందరో, ఎందరెందరో ! అందరికీ నావందనాలు. బహుశా ఇంతటి ఆత్మీయ, అభిమాన "మిత్ర సంపద" లభించడం నా మహా భాగ్యమేనని చెప్పాలి. వారితో ఏ ఒక్కరితో కాని నాకు పొరపొచ్చాలు కాని, అభిప్రాయ భేదాలు కాని రాలేదని చెప్పవచ్చు. వారే నన్ను "అజాత శత్రువు " అని ఆప్యాయంగా పిలుస్తుండగా, ఇక ఏ ఒక్కరినైనా దూరం చేసుకునే అవకాశం వారు నాకెలా యిస్తారు?

"వార్తలలోని వ్యక్తి"

ఇందరు మిత్రులను గురించి ప్రస్తావించి నా సాహితీ జీవితంలో నాకు అత్యంత ఆప్తమిత్రుడు, కడచిన 50 సంవత్సరాలుగా నాకు పేరు ప్రఖ్యాతులు, పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు సాధించిన వ్యక్తిని గురించి ఇక్కడ ప్రస్తావించకపోతే, అది నాకు నేనే అన్యాయం చేసుకోవడమే కాగలదు! నాకు తోడుగా, నీడగా వెన్నంటి నిలిచిన ఆ వ్యక్తి పేరు "వార్తలలోని వ్యక్తి"!

1960లో నేను "ఆంధ్ర జ్యోతి"లో చేరగానే దాని ఎడిటర్‌, జర్నలిజంలో నా ద్రోణాచార్యుడు శ్రీ నార్ల వెంకటేశ్వర రావు నన్ను పిలిచి, "ఇంతకు పూర్వం "హిందూ" పత్రికలో "మ్యాన్‌ ఇన్‌ ది న్యూస్‌" అన్న శీర్షికలో ఆ వారం ప్రముఖ వ్యక్తిని పరిచయం చేసేవారు. ఇప్పుడు వారు ఆ శీర్షికను ప్రచురించం లేదు. మనం "ఆంధ్ర జ్యోతి"లో "వార్తలలోని వ్యక్తి " అన్న శీర్షికతో ప్రతిరోజు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేద్దాం. ఆ పనిని నేను మీకే అప్పగిస్తున్నాను. బాగా చేయండి. మంచి పేరుతెచ్చుకోండి". అని చెప్పారు.

"అది ఎలా ఉండాలో మీరొకటి రాసి చూపించండి" అని నేను ఆయననను కోరాను. ఆయన శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్యను గురించి మొట్టమొదటి "వార్తలలోని వ్యక్తి" గా రాసి నాకు చూపించారు. అక్కడి నుంచి నేను శీర్షికను ప్రారంభించి, " ఆంధ్రజ్యోతి"లో నాలుగు సంవత్సరాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా రాశాను. ప్రతిరోజు ఒక ప్రముఖుని జీవిత విశేషాలను సేకరించి రాయడం ఎంత కష్టం ! కాని, వాగ్దేవి ఆశీస్సులు. గురువరేణ్యుని ప్రోత్సాహంతో క్రమం తప్పకుండా రాశాను. అయితే, మధ్యలో నాకు అస్వస్థత ఏర్పడినందున, కొంతకాలం సెలవుపై వెళ్లాను. అప్పుడు మాత్రం రాయలేదు. అయితే, నేను తిరిగి "ఆంధ్ర జ్యోతి"కి రాగానే నార్లగారు నన్ను పిలిచి, "వార్తలలోని వ్యక్తి"ని వదిలి పెట్టవద్దు. అది మీకే సాధ్యం. అందువల్ల, ప్రతి రోజూ వద్దు కాని, ప్రతి వారం రాయండి, చాలు" అన్నారు. అక్కడి నుంచి ఆ శీర్షికను అలాగే కొనసాగించాను. నేను "ఆంధ్ర జ్యోతి" నుంచి 1992లో రాజీనామా చేసిన తరువాత కూడా రాశాను.

"ఆంధ్రజ్యోతి" 1999లో ఆగిపోయినప్పుడు "వార్తలలోని వ్యక్తి" కూడా కనిపించ లేదు! అదే సమయంలో "వార్త" దిన పత్రిక సంపాదకులు శ్రీ కె.రామచంద్రమూర్తి నన్ను తమ పత్రికలో ఆ శీర్షికను రాయవలసిందిగా కోరారు. "వార్త" దిన పత్రిక ఆవిర్భవించినప్పటి నుంచి "వార్తలలోని వ్యక్తి" ఇప్పుడు ప్రతి సోమవారం సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు. ఎవరైనా "వార్తలలోని వ్యక్తి" ఎప్పుడు వస్తాడు? అని అడిగినప్పుడు, నేను చమత్కారంగా అంటూవుంటాను. "సోమవారం అనేవారం ఆ రోజున వస్తుందో, లేదో కాని ఆ రోజున "వార్తలలోని వ్యక్తి" వస్తాడని అంటూవుంటాను! అలా, 1960 లో జన్మించిన "వార్తలలోని వ్యక్తి" వయస్సు ఇప్పుడు 50 సంవత్సరాలు దాటినాయి! ఇన్ని సంవత్సరాలు ఒక శీర్షికను ఒకే పాత్రికేయుడు నిర్వహించడం బహుశా జర్నలిజం చరిత్రలో అరుదేమో!

ఈ శీర్షికలో సాక్షాత్కరించాలని ముఖ్యమంత్రులైన వారే కోరిన సందర్భాలు లేకపోలేదు! ఇక, ప్రముఖ వ్యక్తుల సంగతి చెప్పేదేమున్నది ? అయితే, కొన్ని స్వయం నిర్ణీత సంప్రదాయాలకు లోబడి ఆయా వ్యక్తులను గురించి రాస్తూవుంటాను. ఈ సందర్భంగానా పై ఒత్తిడి వచ్చినా, నేను దాన్ని పరిగణించను.

1960లో ఆవిర్భవించినప్పటికంటె ఇప్పుడు "వార్తలలోని వ్యక్తి" రూపురేఖలు మారిపోయాయి. ఔను ! ఇప్పుడు "వార్తలలోని వ్యక్తి" వయస్సు అర్థశతాబ్ది దాటింది! మరి, పరిణత వయస్సు వచ్చింది కదా! అప్పుడది ఆయా వ్యక్తుల పరిచయాల శీర్షిక మాత్రమే! ఇప్పుడో? అదొక రాజకీయ వ్యాఖ్యగా పరిణతి చెందింది. ఆ శీర్షిక అభిమానులలో సామాన్యుల దగ్గరి నుంచి అసామాన్యులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార ప్రముఖులు, ఐ.ఏ.ఎస్‌. అధికారులు ఉన్నారు. నాకు తెలిసి, చాలా మందికి తెలియని కొత్త విశేషాన్ని ఆ శీర్షిక చెప్పడమే దాని ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పవలెనంటే, నాకు "పద్మశ్రీ" అవార్డు రావడానికి కూడా ఆ శీర్షిక చేసిన దోహదం లేక పోలేదు. రాష్ట్రపతి "పద్మశ్రీ" అవార్డు ప్రదానం సమయంలో నాకు ప్రసాదించిన ప్రశంసా పత్రంలో ఆశీర్షిక పేరు లేక పోయినా, పరోక్షంగా దాని ప్రస్తావన ఉండడమే ఆ శీర్షిక విశిష్టతకు నిదర్శనం !

తెలుగు భాషతో నా తాదాత్మ్యం

నా పాత్రికేయ జీవిత ప్రారంభమే తెలుగు భాష, తెలుగు రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతలతో ఆరంభమైనది. ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు, నా తొలి వ్యాసం "స్వరాజ్యంలో స్వరాష్ట్రం". ముక్కోటి ఆంధ్రులు ఒక్క రాష్ట్రంలో ఉంటే, తెలుగు జాతికి, తెలుగు భాషకు జవం, జీవం వికసించగలవని నా విశ్వాసం. అప్పటి నుంచి తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎక్కడ ఎవరి నుంచి ఏపాటి అపచారం జరిగినా, నా కలం, గళాలు విప్పారేవి. "రాజాజీ - తెలుగు భాషకు గార్డియన్‌" బిరుదుల ఉదంతం ఇది వరకే పేర్కొన్నాను. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు, అంతకు పూర్వం సమష్టి మద్రాసు రాష్ట్రంలో తక్కిన ఆంధ్ర జిల్లాలతో పాటు ఉన్న బళ్లారి జిల్లా, బళ్లారి భవితవ్యాన్ని గురించి, ముఖ్యంగా ఆ నగరం ఏరాష్ట్రంలో ఉండాలన్న విషయంలో రెఫరెండం తీసుకోవాలని నిర్ణయించారు.

బళ్లారి పట్టణంలో తెలుగు మాట్లాడే వారే అధిక సంఖ్యాకులనడం నిర్వివాదం. అప్పటిలో బళ్లారి మునిసిపల్‌ చైర్మన్‌ ఆంధ్రుడైన శ్రీ ముండ్లూరి గంగప్ప ! ఆ రెఫరెండంలో బళ్లారిని ఆంధ్ర రాష్ట్రంలో కలపాలన్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న శ్రీ గంగప్పకు తోడ్పాటుగా నేను అప్పుడు ఉంటున్న గన్నవరంలో కొంత మొత్తాన్ని విరాళాల ద్వారా వసూలు చేసి పంపాను.

కింగ్‌ మేకర్‌ కామరాజ్‌ :

అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుత్తణిని (డాక్టర్ సర్వేపలి రాధాకృష్ణన్‌ స్వస్థలం), తిరుపతిని తమిళనాడులో కలుపుకోవాలని తమిళులు ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్న తమిళ నాయకుడు శ్రీ కామరాజ్‌ నాడార్‌ను, ఆయన వాదాన్ని విమర్శిస్తూ తెలుగు పత్రికలలో కొన్ని వ్యాసాలు, "హిందూ", "ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌" పత్రికలలో సంపాదక లేఖలు రాశాను.

తిరుపతి, తిరుత్తణిల పేర్లలో "తిరు" అన్నది తమిళనామమని, తిరుచినా పల్లి, తిరుచెంగోడ్‌, తిరువాయూర్‌ మొదలైన తమిళప్రాంతాలవలెనే తిరుపతి, తిరుత్తణి కూడా తమిళ ప్రాంతాలని కామరాజ్‌గారి కుతర్కం! "అలా అయితే, కృష్ణాజిల్లా మధ్యలో ఉన్న "తిరు"వూరు కూడా మీదే కాబట్టి, దాన్ని పెల్లగించుకుపోతారా?" అని ఒకలేఖలో శ్రీ కామరాజ్‌ను ప్రశ్నించాను ! ఆయన నుంచి ఏమి సమాధానం వస్తుంది.? ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తరువాత 1964లో భువనేశ్వర్‌ కాంగ్రెసు మహాసభకు అధ్యక్షత వహించడానికి విజయవాడ మీదుగా వెడుతున్న శ్రీ కామరాజ్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ విజయవాడలో ఆగినప్పుడు ఒక ప్రముఖుడు నన్ను ఆయనకు పరిచయం చేశారు. నేను "తిరు" ఉదాహరణలను, నా లేఖను ఆయనకు జ్ఞాపకం చేశాను.

శ్రీ కామరాజ్‌ జ్ఞాపక శక్తి గొప్పది. అయిదవ తరగతి వరకే చదివినా, ఆయన మద్రాసు ముఖ్యమంత్రి పదవిని అలంకరించి, పండిట్‌ నెహ్రూ హయాంలోనే ఆయన కోర్కెపై అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడై, రెండు సార్లు కేంద్రంలో ప్రధాన మంత్రి పదవి ఖాళీ అయినప్పడు రెండు సార్లూ ప్రధానులను నిర్ణయించి, "కింగ్‌ మేకర్‌"గా పేరుపొందాడు.

నేను "తిరు"పట్టణాల వుదంతాన్ని పేర్కొనగానే ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన ముఖంలో చిరునవ్వు తొంగి చూచింది. "ఔను! జ్ఞాపకముంది!" అంటూ ఆయన నా భుజం తట్టారు. కన్నడిగుల అన్యాయాల మధ్య జరిగిన రెఫరెండాన్ని బళ్లారి తెలుగువారు బహిష్కరించగా, ఆ పట్టణం కర్నాటకలో కలిసిపోయింది. కాగా, కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పనిచేసిన శ్రీ హెచ్‌.వి. పటాస్కర్‌ అవార్డు ప్రకారం తిరుత్తణిని తమిళనాడులో కలిపారు. ఆ ఏడుకొండలవాడి దయవల్ల తిరుపతి మాత్రం తెలుగువారికి దక్కింది!

రాధాకృష్ణన్‌ ఔదార్యం

"మీ జన్మ స్థలమైన తిరుత్తణిని తమిళులు కలిపివేసుకుంటే, మీరెందుకు వూరుకున్నా"రని అప్పటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ప్రశ్నించగా, "తిరుత్తణి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా, తమిళనాడులో

ఉన్నా భారతదేశంలోనే ఉంది కదా!" అని ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చారు!

తెలుగుకు ప్రాచీన అధికార భాషా ప్రతిపత్తి :

2003 మే 9వ తేదీన తమిళనాయకులు మూకుమ్మడిగా, ఉన్నట్టుండి ఒక బాంబుపేల్చారు! తమిళ భాష భారతీయ భాషలలో అతిప్రాచీనమైనదట! కావచ్చు, అందువల్ల, ఆ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వవలెనట ! అంతవరకైతే ఫర్వాలేదు. తమ తమిళ భాషను దేశ స్థాయిలో హిందీ తరువాత రెండవ అధికార భాష చేయాలట! అందుకు అన్ని విధాల అర్హతలు తమ భాషకే ఉన్నవట!

ఈ కోర్కెలతో 2003 మే 9వ తేదీన తమిళ రాజకీయ పక్షాల నాయకులందరు అప్పటి కేంద్రమంత్రి శ్రీటి.ఆర్‌. బాలు నాయకత్వాన ఆనాటి భారత ప్రధాని శ్రీ వాజ్‌ పేయిని కలిసి ఒక మెమోరాండం సమర్పించారు.

ఈ వార్త 2003 మే 10వ తేదీన "హిందూ" దినపత్రికలో ప్రచురించబడింది. ఈ వార్త చూచిన వెంటనే నేను తీవ్రంగా ప్రతిస్పందించాను. వెంటనే ప్రధాని వాజ్‌పేయికి సుదీర్ఘమైన టెలిగ్రామ్‌ పంపించాను. తమిళానికి ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వడానికి ఎవ్వరికీ అభ్యంతరం ఉండనక్కరలేదని, అయితే, ఆ అర్హతకు తగిన ప్రాచీనత, భాషాపరిపుష్టి, చరిత్ర తెలుగు భాషకు కలవని, వీటిలో తెలుగు ఏ భాషకు తీసిపోదని పేర్కొన్నాను.

అంతేకాదు, హిందీ తరువాత దేశస్థాయిలో రెండవ అధికార భాష కాదగిన అర్హత ఒక్క తెలుగుకు మాత్రమే ఉన్నదని, ఈ విషయంలో తెలుగును పక్కన పెట్టడం అక్రమం, అన్యాయం కాగలవని కూడా ఆ టెలిగ్రామ్‌లో హెచ్చరించాను.

ఈ విషయాలన్నింటిని ఒక లేఖ ద్వారా విపులీకరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకువచ్చాను. దేశ, విదేశ ప్రముఖులు నికొలాయ్ కోంటి (ఇటలీ), శ్రీసుబ్రహ్మణ్య భారతి (తమిళనాడు), ప్రొఫెసర్‌ జె.బి.ఎస్‌. హాల్డేన్‌ (బ్రిటన్‌) ప్రభృతులు తెలుగు భాషా మాధుర్యం, విస్తరణ సౌలభ్యం, శబ్ద పరిపుష్టి గురించి చేసిన ప్రశంసలను పేర్కొన్నాను.

అన్నింటినిమించి, భారతదేశానికి అధికార భాష కాదగిన భాష తెలుగు మాత్రమేనని ప్రఖ్యాత బ్రిటిష్‌ జీవశాస్త్రవేత్త, భాషావేత్త అయిన ప్రొఫెసర్‌ హాల్డెన్‌ 1950 ప్రాంతాలలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించాను. భారత దేశంలో హిందీ తరువాత హెచ్చు మంది మాట్లాడేది తెలుగేనని పేర్కొంటూ ఆయా రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వారి సంఖ్యలను కూడా యిచ్చాను. ఈ సమస్యపై నేను పత్రికలలో రాసిన వ్యాసాన్ని చిన్నపుస్తక రూపంలో తీసుకువచ్చాను. ఆ పుస్తకాన్ని దేశంలోని ప్రముఖ తెలుగు వారందరికీ పంపించాను. అప్పటి తమిళనాడు గవర్నర్‌ శ్రీ పి.ఎస్‌. రామమోహన రావు, బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎమ్‌. వెంకయ్య నాయుడు ప్రభృతులు నా కృషిని అభినందిస్తూ లేఖలు రాశారు.

నా వ్యాసాలను చూచిన అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ పరుచూరి గోపాల కృష్ణ 2003 మే 28న తిరుపతిలో జరుగుతున్న అధికార భాషా దినోత్సవంలో పాల్గొన వలసిందిగాను, "తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి: దేశంలో రెండవ అధికార భాష హోదా" అనేవిషయంపై ప్రసంగించ వలసిందిగాను ఆహ్వానించారు.

తిరుపతిలోని సువిశాలమైన "మహతి" అడిటోరియంలో జరిగిన ఆ మహాసభకు ముఖ్య అతిధి - అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. రాష్ట్ర హోమ్‌మంత్రి శ్రీ దేవేందర్‌గౌడ్‌, మరెందరో తెలుగు భాషావికాసానికి కృషిచేసిన పెద్దలు హాజరైనారు.

ముఖ్యమంత్రిపై ఒత్తిడి :

నా ఉపన్యాసంలో నేను తెలుగు భాషోన్న తిని ఉగ్గడించి, తమ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి, రెండవ జాతీయ అధికార భాష హోదా సాధించడానికి తమిళులు చేస్తున్న కృషిని వివరించి, "మనం చూస్తూవుంటే, వారు మేస్తూపోతా"రని అన్నట్టు, మనరాష్ట్ర ప్రభుత్వం మిన్నకుంటే, ప్రాచీన, భాషాప్రతిపత్తి, రెండవ జాతీయ అధికార భాష ప్రతిపత్తి న్యాయంగా రావలసిన తెలుగు భాషకు లభించకుండా పోతాయని, అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ త్వరపడాలని, ఈ విషయంలో కేంద్రంపై ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలని, ఆయన ఆ సభా ముఖంగా హామీ యివ్వాలని గట్టిగా అభ్యర్థించాను.

ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ "శ్రీ తుర్లపాటి చెప్పిన ఈ విషయాలు ఇప్పడే తమకు తెలిశాయని, ఆయన చెప్పినట్టు, అవసరమైతే కేంద్రంతో పోరాడి అయినా,తెలుగు భాషకు రావలసిన ప్రతిపత్తి, అధికార హోదా సాధించగల"నని సభాసదుల హర్ష ధ్యానాల మధ్య హామీయిచ్చారు.

అంతటితో నేను ఆ విషయాన్ని వదిలి పెట్టలేదు. తిరుపతి నుంచి విజయవాడ వచ్చిన తరువాత నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిగారికి ఆయన హామీ గురించి జ్ఞాపకంచేశాను. చివరికి నేనిచ్చిన సమాచారం ఆధారంగా ఆయన తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి, ద్వితీయ అధికార భాష హోదా యివ్వాలని కోరుతూ ప్రధాని వాజ్‌పేయికి లేఖ రాసి, దాన్ని పత్రికలకు విడుదల చేసే బాధ్యత నాకే అప్పగించారు. నేను విజయవాడలో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖను విడుదల చేశాను. అన్ని పత్రికలు ఆ లేఖకు విస్తృతంగా ప్రచారమిచ్చాయి.

పార్లమెంటులో ప్రశ్న

దానితో నేను సంతృప్తి పడలేదు. కొంత కాలమైన తరువాత అప్పటి రాజ్యసభ సభ్యుడు శ్రీ రామ మోహనరావు చేత పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై ప్రశ్న వేయించాను. తమకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాసిన లేఖ చేరిందని, తెలుగుకు రెండు హోదాలు యిచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి ప్రత్యుత్తరమిచ్చారు.

2004లో ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డికి ఈ సమస్యను నివేదించగా, దాన్ని తప్పక పరిశీలిస్తామని ఆయన తరపున ఆయన సలహాదారు డాక్టర్ కె.వి.పి.రామచంద్ర రావు నాకు ప్రత్యుత్తరమిచ్చారు.

ఆ తరువాత 2005-2006లో తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వవలసిందిగా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించాలని ఒక టి.వి. చానల్‌లో రెండు నెలలపాటు ప్రతిరోజు "ప్రజానాడి"లో నా పేరుతో స్క్రోలింగ్‌ లైన్‌ వచ్చేట్టు చూశాను!

ప్రసాద్‌త్రయం :

కాగా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వాలని కేంద్రాన్ని కోరుతూ 2006 ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తరువాత "ప్రసాద్‌త్రయం" (శ్రీమండలి బుద్ధ ప్రసాద్‌, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, శ్రీ ఎ.బి.కె ప్రసాద్‌) ఎంతో శ్రమతోఎట్టకేలకు తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వడానికి కేంద్రాన్ని ఒప్పించారు. ఈ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగాను,పరోక్షంగాను చేసిన కృషి ఎంతైనా అభినందనీయం. అలా ఎన్నో సమస్యలు అడ్డుపడి, ఎందరో శ్రమపడి, కృషి చేస్తేకాని తెలుగు భాషామ తల్లికి ప్రాచీన భాషా ప్రతిపత్తిరాలేదు.

మూడుసార్లు తప్పిన శాసన మండలి సభ్యత్వం :

1978లో నేను విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి ఆ క్లబ్‌ సమావేశంలో ప్రసంగించారు. నా పట్ల ఆయనకు ఎంతో గౌరవాభిమానాలుండేవి. ప్రెస్‌క్లబ్‌లో ఆయన సమావేశాన్ని నేను నిర్వహించిన తీరును హర్షించిన మఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో శాసన సభావ్యవహారాల మంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావుతో కలిసి విమానంలో హైదరాబాద్‌ వెడుతూ నన్ను శాసన మండలికి సభ్యుడుగా గవర్నర్‌ నామినీగా పంపితే బాగుంటుందని అన్నట్టు, ఆ తరువాత శ్రీ నాదెండ్ల నాతో చెప్పారు. 1978లో ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి - శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, డాక్టర్ బోయి భీమన్న, శ్రీమతి సంయుక్త బుల్లయ్య, నా పేరు శాసన మండలికి గవర్నర్‌ నామినీలుగా పంపాలని నిర్ణయించి, ప్రధాని ఇందిరా గాంధికి జాబితా పంపగా, అక్కడ మరో రాజకీయ ప్రముఖడు చేసిన "చాణక్యం" ఫలితంగా శ్రీ అక్కినేని, నా పేర్లకు బదులు వేరే అభ్యర్ధులిద్దరి పేర్లు గవర్నర్‌ నామినీల జాబితాలో చోటు చేసుకున్నాయి! అలా 1978లో ఆ అవకాశం తప్పిపోయింది.

డాక్టర్ చెన్నారెడ్డి పట్టుదలకు, మాట నిలకడకు పెట్టింది పేరు. ఆయన పట్టు విడవని విక్రమార్కునివలె నన్ను ఏవిధంగానైనా శాసనమండలికి పంపాలని పట్టుదలతో తిరిగి 1980లో నా పేరును ఆమోదానికి ప్రధాని ఇందిరా గాంధికి పంపారు. అయితే, అక్కడ ఈ సారి అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ పి.వి నరసింహారావు సన్నిహిత బంధువుకు ఆ అవకాశం దక్కింది. రెండవసారి కూడా ఇలా జరిగినందుకు నాకంటె తాను ఎక్కువగా బాధపడుతున్నట్టు డాక్టర్ చెన్నారెడ్డి నాకు లేఖ రాశారు.

తరువాత శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి 1982లో ముఖ్యమంత్రిగా ఉన్న మూడు నెలలలో నన్ను శాసన మండలికి నామినేట్‌ చేయించాలన్న ఆలోచన వచ్చింది కాని, అది కూడా కార్యరూపం ధరించలేదు. 1983లో తెలుగు దేశం ప్రభుత్వం రావడంతో అది శాసన మండలికే స్వస్తి చెప్పదలచింది.

అటు పిమ్మట 2004లో డాక్టర్ రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో శాసన మండలి పునరుద్ధరణ జరిగినప్పుడు ఆయన నాకు తెలియకుండనే శాసన మండలికి నన్ను జర్నలిస్టుల తరపున నామినేట్‌ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆయన ప్రెస్‌ సెక్రెటరీ ద్వారా నాకు తెలియవచ్చింది. ఆ నిర్ణయం జరిగి నప్పుడు నేను తీవ్రమైన వ్యాధితో హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఉన్నాను. 1985లో శ్రీ ఎన్‌.టి. రామారావు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత రద్దయిన శాసనమండలి రాజశేఖర రెడ్డి - రోశయ్యల పుణ్యమా అని పునరుద్ధరించబడింది.

ఈ సారి కూడా ఢిల్లీలో కాంగ్రెసు అధిష్ఠానం ఆమోదానికి వెళ్లిన 12 మంది గవర్నర్‌ నామినీల పేర్లలో నా పేరు ప్రముఖంగానే ఉన్నది. కాంగ్రెసు అధిష్ఠానం ఆమోదం పొంది వచ్చిన తరువాత 2007 మార్చి 29వ తేదీ రాత్రి నా పేరుతో సహా 12 పేర్లను రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది! ఆమరునాడు ఉదయం ఆ జాబితా గవర్నర్‌ సంతకానికి వెళ్ళడమే తరువాయి. ఆ రాత్రి 9,10 గంటల మధ్య ఢిల్లీలో రాజకీయ చదరంగంలో "పావులు" చకచకా కదిలాయి ! ఈ సారి శ్రీ పి.వి.నరసింహారావు లేరు కాని, ఆయన కుమారునికి నాకు దక్కవలసిన స్థానం లభించింది. 1978లో మొదటి సారి "బస్సు తప్పినప్పుడు" నేను కొంచెం వ్యాకులత చెందకపోలేదు. అయితే, ఈ మూడవ సారి కూడా "బస్సు తప్పిపోయినప్పుడు" నేను చిద్విలాసంగానే దాన్ని తీసుకున్నాను. ఎందువల్లనంటే, అది కూడా ఒక "యోగ"మని మొదటిసారి "బస్సు" తప్పినప్పుడు తెలిసి వచ్చింది. ఒకప్పుడు యోగ్యత ఉన్నా, యోగం లేనిదే కలిసిరాదు; మరి కొన్ని సందర్భాలలో యోగ్యతలేక పోయినా, యోగం వుంటేచాలు!

ఆరున్నర దశాబ్దాల నా రాజకీయ సాగర మథనంలో ఈ నగ్నసత్యం నాకు అనుభవైక వేద్యమైనది. ఆ యోగం ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రిత్వం మూడు సార్లు వచ్చినట్టే వచ్చి, శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డికి నాల్గవసారి కాని అది చేజిక్కలేదు! మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ సుశీల్‌ కుమార్‌ షిండేకు ఆ పదవి ఆరు సార్లు వరించి నట్టే వచ్చి, ఆఖరి నిమిషంలో పూదండ మరొకరి మెడలో పడుతూ వచ్చింది. ఏడవసారి కాని షిండే మెడలో పూలమాలపడలేదు! "నాఆరోగ్యం సరిలేదు. వచ్చే ఎన్నికలలో కూడా పోటీచేయలేను. మా వూరువెళ్లనివ్వండి "అన్న శ్రీ పి.వి. నరసింహారావును ప్రధాని పదవి వెతుక్కుంటూ రాలేదా? అనారోగ్యమన్న ఆయన ఆరోగ్యం అయిదేళ్లపాటు ఆయన చేత అద్వితీయంగా పరిపాలన చేయించలేదా? బ్రిటిష్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విక్టోరియా రాణి ఆహ్వానంపై బకింగ్‌ హామ్‌ రాజభవనానికి మెతున్న లార్డ్‌ హాలిఫాక్స్‌కు ఆకస్మికంగా మార్గం మధ్యలో భయంకరమైన కడుపు నొప్పి వచ్చి, ఆసుపత్రి పాలుకాకపోతే, సమర్థులైన బ్రిటిష్‌ ప్రధానుల జాబితాలో ఆయన పేరు చేరి వుండేదికాదా? ఆ తరువాత జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసినా, ఆయన ప్రధాని పదవి పొందగలిగాడా?

స్థిత ప్రజ్ఞ :

ఈ చరిత్ర అంతా నాలో "స్థిత ప్రజ్ఞ" భావాన్ని పాదుకొల్పింది. నాకు వచ్చిన కష్టాలు, నష్టాలు, తీవ్రరుగ్మతలతో పోలిస్తే, శాసనమండలి సభ్యత్వం మూడుసార్లు వచ్చినట్టే, వచ్చి ఆఖరు నిమిషంలో చేజారిపోవడం నా దృష్టిలో అతి స్వల్ప విషయం! నా పేరును శాసన మండలికి 1978, 1980 సంవత్సరాలలో నాకు తెలియకుండానే ప్రతిపాదించింది - డాక్టర్ చెన్నారెడ్డి; తిరిగి 2007 లో నా నామినేషన్‌ కోసం పట్టుబట్టింది నేను కాదు, డాక్టర్ రాజశేఖరరెడ్డి గారే! మరి ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలని కోరినా, ఎందుకు జరగలేదు? దీనిలో ఎన్నో జీవిత సత్యాలున్నాయి! అలాగే ఆ ముగ్గురు ముఖ్య మంత్రులు శాసనమండలి సభ్యత్వం తప్పిపోయినప్పుడల్లా, ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌ బాధ్యతను అప్పగిద్దామనుకుంటూ వచ్చారు! కాని, ముగ్గురి హయాంలోను అది పొసగలేదు!

చివరికి, నాల్గవ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య హయంలో నేను దాదాపు ప్రయత్నమంటూ చేయకుండానే ఆ బాధ్యత నాకు లభించడం మరో విశేషం కాదా? శ్రీ రోశయ్య ముఖ్యమంత్రి పదవి మాత్రం? శ్రీ పి.వి. వలెనే, తాను కూడా ఇక ఎన్నికలలో పాల్గొననని ఆయన 2008 లో ప్రకటించారు. కాని, శాసనమండలి సభ్యత్వం ఆయనను వెతుక్కుంటూ వస్తే, కలలో కూడా అనుకోని ముఖ్యమంత్రిత్వం స్వయంగా వరించింది! ఆ పిమ్మట కొద్ది కాలానికి కీలకమైన తమిళనాడు గవర్నర్‌ పదవి రావడం మరింత విశేషం! యోగ్యత, యోగం రోశయ్యగారి కవలపిల్లలు!

నా పరోక్షంలో నాకు గవర్నర్‌ సన్మానం :

నేను పాత్రికేయ జీవితంలో ప్రవేశించి 2007 మార్చికి సరిగా 60 సంవత్సరాలు ! అది నా జర్నలిస్టు జీవిత వజ్రోత్సవ సంవత్సరం. నా జర్నలిస్టు జీవితంలో ప్రతి పది సంవత్సరాలకు మిత్రులు సన్మానాలు చేస్తూనే ఉన్నారు. పెరల్‌ జుబిలీ (30), 40 సంవత్సరాలు, గోల్డెన్‌ జుబిలీ (50) జరిగాయి. డైమండ్‌ జుబిలీ (60) జరపాలని "సృజనప్రియ" పత్రికా సంపాదకుడు శ్రీ నీలం దయానందరాజు, తదితర మిత్ర బృందం నిర్ణయించారు. ఎట్టకేలకు 2008 ఏప్రిల్‌ 15వ తేదీన జరపడానికి ఏర్పాట్లు జరిగాయి. అసాధారణమైన విషయం - హైదరాబాద్‌లో రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ శ్రీ ఎన్‌.డి.తివారి ముఖ్య అతిధిగా వుండడానికి సమ్మతించారు. సాధారణంగా ఒక పాత్రికేయునికి, లేదా మరో ప్రముఖునికి రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ సన్మానంచేయడం జరగదు. కాని, ఒక జర్నలిస్టు 60 సంవత్సరాలు నిర్విరామంగా పాత్రికేయ జీవితంలో కొనసాగడం, ఇంకా రచనలు చేస్తూనే ఉండడం శ్రీ తివారికి విశేషంగా కనిపించిందట! అందువల్లనే, రాజ్‌ భవన్‌లోనే అధికార పూర్వకంగా చేయాలని ఆయన భావించారట!

అయితే, ఎల్లుండి సన్మానం అనగా ఆ రోజు రాత్రి నాకు ఆకస్మికంగా అస్వస్థత కలిగింది. రాత్రికి రాత్రి నా కుమారుడు జవహర్లాల్‌, కోడలు లక్ష్మిశ్రీ విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్చారు. ఏదో తీవ్ర రుగ్మత అనుకున్నాముకాని, అన్ని పరీక్షలు చేస్తే, రక్తపుపోటు హెచ్చుగావున్నట్టు తేలింది. అందు వల్ల ప్రమాదం లేకపోయినా, హైదరాబాద్‌ వెళ్లడం, ఆ మరునాడు రెండు సన్మాన సభలలో పాల్గొనడం - ఇదంతా "రిస్క్‌" తీసుకోవడం కాగలదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

డాక్టర్ల అభిప్రాయంవల్ల నా కుమారుడు ఆందోళనపడ్డాడు. అక్కడ ఏదైనా జరిగితే, తమ బాధ్యత లేనట్టుగా డాక్టర్లు చెప్పారట! దానితో హైదరాబాద్‌ వెళ్లరాదని నిర్ణయించుకుని, ఆ విషయం రాజ్‌ భవన్‌కు తెలియజేశాము.

గవర్నర్‌ కార్యదర్శి ఈవిషయం ఆయనకు తెలియజెప్పి, సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని సూచించారట. "ఇది శ్రీ తుర్లపాటికి వ్యకిగతంగా చేసే సన్మానం కాదు. సుదీర్ఘమైన ఆయన జర్నలిస్టు చరిత్రకు, ఆయన కృషికి చేసే సన్మానం. అందువల్ల, సన్మాన కార్యక్రమం జరగవలసిందే. ఆయనను గురించి నేను చెప్పదలచుకున్నది చెబుతాను "అని గవర్నర్‌ శ్రీ తివారి యథావిధిగా సన్మానం జరిపించారు. పాత్రికేయులు, తదితరులు హాజరైనారు.

గవర్నర్‌ శ్రీ తివారి ప్రసంగిస్తూ "శ్రీ తుర్లపాటి ఉన్నత వ్యక్తిత్వం, దేశభక్తి, జాతీయ దృక్పథం గల ఉత్తమ జర్నలిస్టుగా ప్రఖ్యాతి గడించారు. అతి చిన్నవయస్సులో 14 ఏళ్ల ప్రాయంలోనే జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రథమ ముఖ్యమంత్రి "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశంగారి వద్ద కార్యదర్శిగా పనిచేయడంతోపాటు ఆయన వద్ద ఎన్నో విషయాలు, మెలకువలు తెలుసుకుని, ఆయన లక్షణాలను పుణికి పుచ్చుకుని ముందుకు సాగారు. తరువాత అనేక పత్రికలలో పనిచేసి ఎడిటర్‌ స్థాయికి ఎదిగి, ఉత్తమ జర్నలిస్టుగా, "సభా కేసరి"గా అనేక అవార్డులు, ప్రశంసలు పొందారు. అంతేకాక "పద్మశ్రీ" అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్టుగా ప్రసిద్ధి చెందా"రని గవర్నర్‌ వక్కాణించారు.

"శ్రీ తుర్లపాటి భారత దేశానికి గర్వకారకుడైన జర్నలిస్టు" అని గవర్నర్‌ అభినందించారు. శ్రీనీలం దయానందరాజు వందన సమర్పణ చేశారు. ఈ సన్మానసభ జరిపించడంలో శ్రీ దయానందరాజు పడిన శ్రమను నేను ఎన్నటికీ మరచిపోలేను.

కొడుకు - కోడలు :

ఇక్కడ నా కుమారుడు జవహర్లాల్‌, కోడలు లక్ష్మిశ్రీ లను గురించి ప్రస్తావించ వలసివుంది. జవహర్‌ కొందరు కుమారులవలె కాదు. పెద్దలపట్ల గౌరవం, చిన్నవారి పట్ల ప్రేమ అతడిని బంధుమిత్రులందరికీ ప్రేమ పాత్రుని చేశాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల అతడికి ఎనలేని భక్తి గౌరవాలు. తన 16వ యేటనే మాతృమూర్తి కృష్ణకుమారిని కోల్పోయినందున, ఒంటరిగా మిగిలిన నన్ను కంటికి రెప్పవలె చూచుకుంటూ వచ్చాడు. కుమారుడు తండ్రిని భక్తి గౌరవాలతో చూడ్డం కంటె అతడి భార్య మామగారిని అతడికంటె భక్తి ప్రపత్తులతో చూడ్డం విశేషం. లక్ష్మిశ్రీ క్రమశిక్షణలోను, కుటుంబ నిర్వహణలోను పెట్టింది పేరు. ముఖ్యంగా నేను తీవ్రమైన రుగ్మతతో మూడునెలలపాటు హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె అహోరాత్రులు నన్ను కనిపెట్టుకుని ఉండి, సేవచేయడం నన్ను పరామర్శించడానికి వచ్చిన ప్రముఖ నాయకులెందరో ప్రశంసలు పొందింది. ఆదర్శప్రాయురాలైన కోడలని పేరు గాంచింది. భార్యా వియోగంలో ఉన్న నన్ను నా కుమారుడు, కోడలు, మనుమడు కృష్ణ కుమార్‌, మనుమరాలు కృష్ణ సుప్రియ ఆప్యాయంగా చూడ్డంవలెనే నేను కడచిన మూడు దశాబ్దాలుగా నా జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తూ వచ్చానని చెప్పక తప్పదు.

Naa Kalam - Naa Galam Page 125 Image 0001
Naa Kalam - Naa Galam Page 125 Image 0001

"గాంధీజీకి నేను అయిదు రూపాయిలు బాకీ" :

అది 1946. మహాత్మాగాంధి మద్రాసులో జరుగుతున్న దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాలకు రైలులో వెడుతూ మార్గం మధ్యలో విజయవాడలో కొంచెంసేపు ఆగారు. అంతకు పూర్వం గాంధీజీ విజయవాడ నాలుగు సార్లు వచ్చినా, ఆయనను సందర్శించడానికి నాకు అవకాశమే లేదు. అప్పటికి నేను జన్మించలేదు. నేను ఉంటున్న గన్నవరంలోని కొందరు పెద్దలు గాంధీజీ సందర్శనార్థం విజయవాడ వెడుతుంటే, వారితో పాటు నేను కూడా వెళ్లాను.

మహాత్ముడు ప్రయాణిస్తున్న రైలు విజయవాడలో కొద్దిసేపే ఆగింది.

Naa Kalam - Naa Galam Page 126 Image 0002
Naa Kalam - Naa Galam Page 126 Image 0002

ఆ రైలును చూడగానే జనసందోహం "మహాత్మా గాంధికి జై" అంటూ దిక్కులు పిక్కటిల్లేట్టు నినాదాలు చేశారు. ఆ నినాదాలకు గాంధీజీ బోసినోటితో చిరునవ్వులు కురిపిస్తూ రైలు దిగి అక్కడవున్న ఆసనంలో కూర్చున్నారు. చాలామంది ఆయన ఆటోగ్రాఫ్‌ల కోసం విరగదొక్కుకోసాగారు. ఆ తొక్కిసలాటను చూచి, గాంధీజీ "తప్పు!" అన్నట్టుగా ముక్కుపై వేలు వేసుకున్నారు. ఎక్కడివారక్కడ గప్‌ చుప్‌! అక్కడ ప్రశాంత నిశ్శబ్ద గంభీర వాతావరణం !

సోమవారం గాంధీజీకి మౌనవ్రతం. అందువల్లనేకాబోలు, ఆయన ఆ రోజు మాట్లాలేదు. కాని, ఆటోగ్రాఫ్‌లు కోరిన వారి నుంచి అయిదేసి రూపాయలు తీసుకుని గాంధీజీ సంతకాలు చేస్తున్నారు. అందరినీ తోసుకుని, నేను కూడా ముందుకు వెళ్లి జాతి పితకు నమస్కరించి, ఆటోగ్రాఫ్‌ కోరగా, ఆయన అయిదురూపాయలు ఏవీ అన్నట్టు, నావంక ప్రశ్నార్థకంగా చూశారు.

అయిదు రూపాయలా ? అవి అప్పటిలో నావంటి వారికి లభించడం గగనం! నేను అయిదురూపాయలు లేవని దీనవదనంతో, ఆత్రంగా ఆయనకు నమస్కరించాను. ఆయన చిరునవ్వుతో నాకు ఆటోగ్రాఫ్‌ యిచ్చారు! ఎంత మహద్భాగ్యం! కాగా, గాంధీజీకి నా అయిదు రూపాయల బాకీ తీర్చడానికి 2012 జనవరి 22న నాకు అవకాశం లభించింది! ఆ రోజున నేను తెనాలిలోని గాంధి శాంతి సేవాశ్రమాన్ని అనుకోకుండా సందర్శించాను. అక్కడ పెద్ద గాంధీ విగ్రహం వున్నది. ఆ విగ్రహాన్ని చూడగానే నామదిలో ఏదో మెరుపు మెరిసింది! మహాత్మునికి నా బాకీ తీర్చడానికి ఇదే అవకాశం! వెంటనే 1946 నాటి నా బాకీ కథను అక్కడ వున్న పాత్రికేయులు, ప్రముఖులకు చెప్పి, వారి సమక్షంలో అయిదు రూపాయల బాకీకి వడ్డీని కలిపి, వంద రూపాయల నోటు పై నా సంతకంతో గాంధీ విగ్రహం చేతికి సమర్పించాను! ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించింది! "65 సంవత్సరాల తరువాత వడ్డీతో సహా గాంధీజికి తుర్లపాటి తీర్చిన బాకీ" అంటూ పత్రికలలో వార్తా శీర్షిక ప్రత్యక్షమైనది!

నా జీవితంలో మహాత్మాగాంధి ఆటోగ్రాఫ్‌ సేకరించడం, నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఇంటర్‌వ్యూ చేయడం, "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశంగారికి కార్యదర్శిగా పనిచేయడం - అరుదైన మహత్తర అవకాశాలు!

అతిసామాన్యుడనైన నేను ఇవన్నీ సాధించడానికి ఆ భగవచ్ఛక్తి నాకు ప్రసాదించిన ఆయురారోగ్యాలే ప్రధాన కారణం ! మరి, దాదాపు ఏడు దశాబ్దాలు ప్రజా జీవితంలో అవిచ్ఛిన్నంగా, నిరంతర ప్రజల సాన్నిహిత్యంతో, ఇంతకాలం జోడుగుర్రాలవలె కలం, గళం పోటీపడి సాగడం నా వంటి సామాన్యుడికి సాధ్యమా?

నాకు వేరే ఆశలు లేవు, ఏమీకాని నాకు ఎన్నో లభించాయి! అన్నింటినిమించి నిరంతర అఖండప్రజాభిమానం నేను సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తి! ఈ ప్రజాభిమానం నాపట్ల ఏనాడూ తరగలేదు, కించిత్తు చెరగలేదు. నేను నా 14వ యేట ప్రజాజీవితంలో అడుగిడినప్పుడు ఒకటే అనుకున్నాను. "ఇలాంటి వ్యక్తి అరుదుగాకాని ఉండ"డన్న పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. అది సాధించానని నాకు సంపూర్ణ సంతృప్తి.

నేను రాసే ప్రముఖుల జీవిత చరిత్రలలో ఇద్దరు, ముగ్గురికి "వీరికి పుట్టుమచ్చంత అవినీతి మచ్చకూడా లేద"ని రాశాను. నన్ను గురించి ఎవరైనా రాస్తే, ఆపద ప్రయోగం నాకు కూడా ఉపయోగించగల స్థాయిని సంపాదించాను. నేను మంచితనం తప్ప మరేమీ ఎరుగను. మంచిని పెంచడానికే నేను ఇన్ని దశాబ్దాలుగా కృషి చేశాను.

పూర్వజన్మ, పునర్జన్మ ఉన్నవో, లేవో నాకుతెలియదు. అవి వున్నా మనకు తెలియదు. పూర్వజన్మలో మీరెవ్వరు? చెప్పగలరా ? చెప్పలేరు. అలాగే స్వర్గ నరకాలు, పరలోకం ఉన్నయా ? ఎవరికి తెలుసు? ఎవరైనా ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయి, ఆ లోకాలకు వెళ్లి, తిరిగివచ్చినవారు ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరు, ఒక్కరు, ఒక్కరు కూడా రెండు వందల కోట్ల సంవత్సరాల మానవేతిహాసంలో కనిపించరు ! అయినప్పుడు, ఆ లోకాలను గురించి ఆలోచన దేనికి ? వున్నదీ, కనిపించేదీ, మనం అనుభవించేదీ ఈ లోకమే. మన మంచి చెడ్డల "జడ్జి" ఈలోకమే. ఇదే మన లోకం. మరోలోకం ఉన్నా, లేకపోయినా మనకొద్దు.

"మరల ఈ దారిని వస్తానో, రానో" !

అందువల్లనే, ఒక గజల్‌ నాకు ఎంతగానో నచ్చింది! "అందరినీ ప్రేమించు! అందరినీ పలకరించు! మరల ఈ దారిని వస్తానో, రానో!" రాము, రాబోము. ఈ మహత్తర మానవ జీవిత సందేశాన్ని పాటించమే మానవ జీవిత ప్రస్థానానికి సాఫల్యం. చివరగా ఒక మాట. నేను ఎప్పుడూ చేప్పే మాటే. "జాతి, మత, కుల, వర్ణ, వర్గ, స్త్రీ, పురుష విభేదాలకు అతీతమైన, మానవుడు మానవునిపట్ల మానవుడుగా వ్యవహరించే మానవీయ వ్యవస్థ మన లక్ష్యం కావాలి".