9. నారదుని పూర్వజన్మవృత్తాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ. మహాత్మా ! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటి దాసికిం బుట్టి పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి యొక వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు, (1-101)


కం. ఓటమితో నెల్లప్పుడుఁ , బాటవమునఁ బనులు సేసి బాలురతో నే

యాటలకుఁ బోక నొక జం,జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా ! (1-102)


కం. మంగళమనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్

ముంగల నిలతును నియతిని, వెంగలి క్రియఁ జనుదు నే వివేకము తోడన్. (1-103)


వ. ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితిని. వారును నా యందుఁ గృప సేసిరంత. (1-104)


శా. వారల్ కృష్ణచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగాఁ బాడఁగా

నా రావంబు సుధాప్రతిమమై యశ్రాంతమున్ వీనులం

దోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్

బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభదూరుండనై. (1-105)


వ. ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మరూపకుండనైన నా యందు స్థూలసూక్ష్మంబైన యీ శరీరంబు నిజమాయా కల్పితంబని యమ్మహాత్ములగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణియైన భక్తి సంభవించె. అంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువారలై యివ్విధంబున. (1-106)


మ. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై

చపలత్వంబును మాని నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని

ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై

యుపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానమున్. (1-107)


వ. ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబుఁ దెలిసితి. ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబుఁ దాపత్రయంబు మాన్ప నౌషధంబగు. ఏ ద్రవ్యంబు వలన నే రోగంబు జనియించె నా ద్రవ్య మా రోగంబును మానుప నేఱదు. ద్రవ్యాంతరంబు చేతనైన చికిత్స మానుపనోపు. ఇవ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబులయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపియుండు. ఈశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై ఈశ్వర సంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు. ఈశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణగుణనామవర్ణన స్మరణంబులు సేయుదురు. ప్రణవ పూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణానిరుద్ధమూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి మంత్రమూర్తియు శూన్యుండు నైన యజ్ఞపురుషునిం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు. (1-108)


కం. ఏ నివ్విధమునఁ జేయఁగ, దానవ కులవైరి నాకుఁ దనయందలి వి

జ్ఞానము నిచ్చెను మదను,ష్ఠానము నతఁ డెఱుఁగు నీవు సలుపుము దీనిన్. (1-109)


కం. మునికులములోన మిక్కిలి, వినుకులు గలవాఁడ వీవు విభు కీర్తులు నీ

వనుదినముఁ బొగడ వినియెడి, జనములకును దు:ఖమెల్ల శాంతిం బొందున్. (1-110)


అధ్యాయము - 6


వ. ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె. (1-111)


మ. విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో

యిన బాల్యంబున వృద్ధభావమున నీకీ రీతి సంచారముల్

చనె నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ ద

త్తనువుం బాసిన చందమెట్లు చెపుమా దాసీసుతత్వంబుతోన్. (1-112)


వ. అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె. దాసీపుత్త్రుండ నైన యేను భిక్షుల వలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత. (1-113)


సీ. మమ్ము నేలినవారి మందిరంబునఁ గల, పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి

తన పరాధీనతఁ దలఁపదు సొలసితి, నలసితి నాకొంటి ననుచు వచ్చు

మాపును రేపును మా తల్లి మోహంబు, సొంపార ముద్దాడుఁ జుంచు దువ్వు

దేహంబు నివురు మోదించుఁ గౌఁగిటఁ జేర్చు, నర్మిలితో నిట్లు నన్ను మనుప

ఆ.వె. నేను విడిచి పోక యింత నుండితి నయ్య, మోహి గాక యెఱుక మోసపోక

మాఱు చింత లేక మౌనియై యేనేండ్ల, వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు. (1-114)


వ. అంత. (1-115)


కం. సదనము వెలువడి తెఱువునఁ , జెదరక మా తల్లి రాత్రిఁ జీఁకటి వేళన్

మొదవుం బిదుకఁగ నొక ఫణి, పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా ! (1-116)


కం. నీలాయత భోగఫణా, వ్యాళానల విష మహోగ్ర వహ్నిజ్వాలా

మాలా వినిపాతితయై, వ్రాలెన్ ననుఁ గన్న తల్లి వసుమతి మీఁదన్. (1-117)


ఉ. తల్లి ధరిత్రిపై నొఱఁగి తల్లడపాటును జెంది చిత్తమున్

బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా

యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసె మేలు రా

జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధి సేయుచున్. (1-118)


వ. ఉత్తరాభిముంఖుండనై యేను వెడలి జనపదంబులును బురంబులును బట్టణంబులును గ్రామంబులును బల్లెలును మందలును మహోద్యానంబులును గిరాత పుళింద నివాసంబులును వనంబులును జిత్రధాతు విచిత్రితంబులైన పర్వతంబులును సమద కరి కర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథిక జన క్రమాతిరేకంబులైన తటాకంబులును, బహువిధ విహంగ నినద మనోహరంబులై వికచారవింద మకరంద పాన పరవశ పరిభ్రమద్ భ్రమర సుందరంబులైన సరోవరంబులును దాఁటి చనుచు క్షుత్‌పిపాసా సమేతుండనై నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై నీరుద్రావి గతశ్రముండనై, (1-119)


కం. సాలావృక కపి భల్లుక, కోలేభ లులాయ శల్య ఘూక శరభ శ

ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాది భయద వన మధ్యమునన్. (1-120)


వ. దుస్తరంబైన నలవేణు కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక రావిమ్రాను డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మస్వరూపు హరిం జింతించితి. (1-121)


శా. ఆనందాశ్రులు కన్నులన్వెడల రోమాంచంబుతోఁ దత్పద

ధ్యానారూఢుఁడనైన నాతలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే

నానందాబ్ధి గతుండనై యెఱుఁగలేనైతిన్ నను న్నీశ్వరున్

నానాశోకహమైన యత్తనువు గానన్నేఱ కట్లంతటన్. (1-121)


వ. లేచి నిలుచుండి క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుం బోలె చూచియుం గానక నిర్మనుష్యంబైన వనంబునం జరియించుచున్న నను నుద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపఁజేయు చందంబున నిట్లనియె. (1-122)


ఉ. ఏల కుమార ! శోషిలఁగ ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ

జాలవు నీవు ; కామముఖ షట్కము నిర్దళితంబు సేసి ని

ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగిఁ గానఁగాఁ

జాలఁడు ; నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్. (1-123)


కం. నా వలనఁ గోర్కి యూరక, పోవదు విడిపించు దోషపుంజములను మ త్సేవం బుట్టును వైళమ, భావింపఁగ నాదు భక్తి బాలక ! వింటే ? (1-125)


కం. నా యందుఁ గలుగు నీ మది, పాయదు జన్మాంతరముల బాలక ! నీ వీ

కాయంబు విడిచి మీఁదట, మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై. (1-126)


మ. వినుమీ సృష్టి లయంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా

మినియై పోయెడిఁ బోవఁగాఁ గలుగుఁ జూ మీఁదం బున: సృష్టి యం

దు నిరూఢ స్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్

ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా ! (1-127)


వ. అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు ని:శ్వాసంబునుగా నొప్పి సర్వ నియామకంబైన మహాభూతంబు వలికి యూరకున్న, నేనును మస్తకంబు వంచి మ్రొక్కి, తత్‌కరుణకు సంతసించి, మదంబు దిగనాడి, మత్సరంబు విడిచి, కామంబు జయించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబులు వెడలనడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠియింపుచుఁ బరమభద్రంబులైన తచ్చరిత్రంబులఁ జింతింపుచు, నిరంతర సంతుష్టుండనై (కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంత:కరణంబు తోడ విషయ విరక్తుండనై) కాలమున కెదురుసూచుచు, భూమిం దిరుగుచు నుండ నంతఁ గొంత కాలంబునకు మెఱుము మెఱసిన తెఱంగున మృత్యువు తోఁచినం బంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి, హరికృపావశంబున శుద్ధసత్త్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితిని. అంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున (శయనించు) నారాయణమూర్తియందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మని:శ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితిని. అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు చనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మ ప్రాణంబుల వలన మరీచిముఖ్యులగు మునులు, నేనును జనియించితిమి. అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబులయందు మహావిష్ణుని యనిగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తయై బ్రహ్మాభిరంజకంబులైన సప్తస్వరంబులును దమయంతన మ్రోయుచున్న యీ వీణాలాప రతిం జేసి నారాయణ కథాగానంబు సేయుచుఁ జరియింపుచుండుదు. (1-128)


ఆ.వె. తీర్థపాదుఁడైన దేవుండు విష్ణుండు, తన చరిత్ర మేను దవిలి పాడఁ

జీరఁబడ్డవాని చెలువున నేతెంచి, ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు.(1-129)


కం. వినుమీ సంసారంబను, వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే

దనఁ బొందెడువానికి వి, ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా ! (1-130)


చం. యమనియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యుఁ గామ రో

షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ

గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క

ర్మముల రహస్యమెల్ల మునిమండన ! చెప్పితి నీవు కోరినన్. (1-131)


వ. ఇట్లు భగవంతుండగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు యదృచ్ఛామార్గంబున జనియె నని సూతుండిట్లనియె.(1-132)


వ. వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుందగీతములు జగములకున్

జేయించుఁ జెవుల పండువు, మాయించు నఘాళి ; నిట్టి మతి మఱి గలఁడే ! (1-133)


అధ్యాయము-7


వ. అని నారదుం గొనియాడిన సూతుం జూచి "నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుండేమి సేసె" నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె. బ్రహ్మనదియైన సరస్వతి పశ్చిమ తీరంబున ఋషులకు సత్రకర్మ వర్ధనంబై బదరీ తరుషండ మండితంబై (శమ్యాప్రాసంబని) ప్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు. అందు జలంబులు వార్చి కూర్చుండి వ్యాసుండు తన మదిం దిరంబు చేసికొని భక్తియుక్తంబైన చిత్తంబునం బరిపూర్ణుండైన యీశ్వరుం గాంచి యీశ్వరాధీన మాయావృతంబైన జీవుని సంసారంబు గని జీవుండు మాయచేత మోహితుండై గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచుం ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు నయ్యనర్థంబునకు నారాయణ భక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియును నిశ్చయించి, (1-134)


మ. అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా

ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ

క్తి విశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరంబైన భా

గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగన్. (1-135)


వ. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె నని చెప్పిన విని శౌనకుండు, "నిర్వాణ తత్పరుండును సర్వోపేక్షకుండు నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె ?"ననవుడు సూతుం డిట్లనియె. (1-136)


కం. ధీరులు నిరపేక్షులు నా, త్మారాములు నైన మునులు హరిభజనము ని

ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టివాఁడు నవ్యచరిత్రా ! (1-137)


కం. హరిగుణ వర్ణన రతుఁడై, హరితత్పరుఁడైన బాదరాయణి శుభ త

త్పరతం బఠించెఁ ద్రిజగద్, వరమంగళమైన భాగవత నిగమంబున్. (1-138)


కం. నిగమంబులు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను, నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా ! (1-139)