8. వ్యాసుని కడకు నారదుండు వచ్చి యూఱడించి యుపదేశించిన ప్రకారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయము-5


ఉ. ధాతవు భారత శ్రుతి విధాతవు వేద పరార్థ జాత వి

జ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్త్వ ని

ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే !

కాతరు కైవడిన్ వగవఁ గారణమేమి పరాశరాత్మజా ! (1-87)


వ. అనినఁ బారాశర్యుం డిట్లనియె. (1-88)


కం. పుట్టితి వజు తనువునఁ జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్

మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రబోధమున మునినాథా !


వ. అదియునుం గాక నీవు సూర్యుని భంగి మూఁడు లోకములం జరింతువు. వాయువు పగిది నఖిల జనులలోన మెలంగుదువు.సర్వజ్ఞుండ వగుటం జేసి,


కం. నీ కెఱుఁగరాని ధర్మము, లోకములను లేదు బహువిలోకివి నీవున్

నా కొఱఁత యెట్టిదంతయు, నాకున్ వివరింపుమయ్య నారద ! కరుణన్. (1-91)


వ. అనిన నారదుం డిట్లనియె. (1-92)


ఉ. అంచితమైన ధర్మచయమంతయుఁ జెప్పితి వందులోన నిం

చించుక గాని విష్ణుకథ లేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం

చించిన మెచ్చునే గుణ విశేషము లెన్నినఁ గాక నీకు నీ

కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా ! (1-93)


మ. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరస్ స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ

హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమై యుండ దయోగ్య దుర్మద నదత్ కాకోల గర్తాకృతిన్. (1-94)


మ. అపశబ్దంబులఁ గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పా

ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచున్ బాడుచున్

జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబుఁ గీర్తించుచున్

దపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ ! చింతింపుమా ! (1-95)


వ. మునీంద్రా ! నిర్గత కర్మంబైన నిరుపాధికంబైన జ్ఞానంబు గలిగినను హరిభక్తి లేకున్న శోభితంబు గాదు. కర్మ మీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు. భక్తిహీనంబులైన జ్ఞానవాచా కర్మకౌశలంబులు నిరర్థంబులు. కావున మహానుభావుండవు, యథార్థ దర్శనుండవు. సకల దిగంత ధవళ కీర్తివి. సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబు కొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము. హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులం జేసి పృథగ్దర్శనుండైనవాని మతి పెనుగాలి త్రిప్పునం బడి తప్పంజను నావ చందంబున నెలవు సేరనేఱదు. కామ్యకర్మంబులందు రాగంబు గల ప్రాకృత జనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండవగు నీవు వగచుట తగదు. అది యెట్లనిన, వార లదియే ధర్మంబని కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు. అది గావున తత్వజ్ఞుండవై వ్యథావియోగంబు సేయుమని మఱియు నిట్లనియె. (1-96)


చం. ఎఱిఁగెడు వాఁడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపమున్

నెఱయ నెఱింగి యవ్వలన నేఱుపు సూపు గుణానురక్తుఁడై

తెఱకువ లేక క్రుమ్మరుచు దేహ ధనాద్యభిలాష యుక్తుఁడై

యెఱుఁగని వానికి దెలియ నీశ్వరు లీల లెఱుంగఁ జెప్పవే. (1-97)


చం. తన కుల ధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్

పనివడి సేవ సేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ

చ్చిన మఱుమేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా

సినఁ గులధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్. (1-98)


వ. అది గావున నెఱుక గలవాఁడు హరిసేవకు యత్నంబు సేయందగు. కాలక్రమంబున సుఖ దు:ఖంబులు ప్రాప్తంబులైనను హరిసేవ విడువం దగదు. దానం జేసి బ్రహ్మస్థావర పర్యంతంబు తిరుగుచున్న జనులకు నెయ్యది పొందరా దట్టి మేలు సిద్ధించు (కొఱకు) హరిసేవ సేయవలయు. హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కఁడు. క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తిరస వశీకృతుండై విడువ నిచ్చగింపఁడు. మఱియును, (1-99)


సీ. విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను, వేఱేమియును లేదు విశ్వమునకు

భవవృద్ధి లయములా పరమేశుచే నగు, నీ వెఱుంగుదు కాదె నీ ముఖమున

నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ, భువన భద్రమునకై పుట్టినట్టి

హరికళాజాతుండ వని విచారింపుము, కావున హరిపరాక్రమము లెల్ల

ఆ.వె. వినుతి సేయుమీవు వినికియుఁ జదువును, దాన మతుల నయముఁ దపము ధృతియుఁ

గలిమి కెల్ల ఫలము కాదె పుణ్యశ్లోకుఁ , గమలనాభుఁ బొగడఁ గలిగెనేని. (1-100)