7. విష్ణుమాయా మహిమము మఱియు విష్ణుపారమ్యము

వికీసోర్స్ నుండి

చ|| అమరఁ ద్రివిక్రమస్ఫురణ | నందిన యమ్మహితాత్ము పాద వే

గమున హతంబులైన త్రిజగంబుల కావల నొప్పు సత్యలో

కము చలియించినన్ గరుణఁ | గైకొని కాఁచి ధరించు పాదప

ద్మము తుది నున్న యప్రతిహ | తం బగు శక్తి గణింప శక్యమే ? (200)


మ|| హరి మాయాబల మే నెఱుంగ నఁట శ | క్యంబే ? సనందాది స

త్పురుష వ్రాతముకైన బుద్ధి నితర | బున్ మాని సేవాధిక

స్ఫురణం దచ్చరితానురాగ గుణ వి | స్ఫూర్తిన్ సహస్రాస్య సుం

దరతన్ బొల్పగు శేషుఁడు న్నెఱుఁగఁ డ | న్నన్ జెప్పలే రింకొరుల్. (201)


చ|| ఇతరము మాని తన్ను మది | నెంతయు నమ్మి భజించువారి నా

శ్రిత జన సేవితాంఘ్రి సర | సీ రుహుఁడైన సరోజనాభుఁ డం

చిత దయతోడ నిష్కపట | చిత్తమునం గరుణించునట్టి వా

రతుల దురంతమై తనరు | నవ్విభు మాయఁ దరింతు రెప్పుడున్. (202)


వ. మఱియును సంసారమగ్నులై దివంసబులు ద్రొబ్బి యంతంబున శునక సృగాల భక్ష్యంబులైన కాయంబులందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన

పుణ్యాత్ములు కొందఱు కలరు. ఎఱింగింతు, వినుము. ఏను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి యమ్మహాత్ము పాదారవిందంబుల భక్తినిష్ఠుండనై,

శరణాగతత్వంబున భజించునప్పుడు తెలియదు. రాజస గుణుండనై తెలియఁజాల. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తిజ్ఞాన యోగంబున సేవింతు. మఱియు (సనకాదులగు

మీరును), భగవంతుండైన రుద్రుండును దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువ మనువును. అతని పత్నియగు శతరూపయు, దత్పుత్త్రులగు

(ప్రియవ్రతోత్తానపాదులను) వారలును, దత్పుత్త్రికలును, బ్రాచీనబర్హియు, ఋభువును, వేనజనకుండగు నంగుండును, ధ్రువుండును గడవంజాలుదురు. వెండియు. (203)


సీ|| గాధి గయాదు లి | క్ష్వాకు దిలీప మాం, ధాతలు భీష్మ య | యాతి సగర

ఘు ముచికుందైళ | రంతిదేవోద్ధవ, సారస్వతోదంత | భూరిషేణ

శ్రుతదేవ మారుతి | శతధన్వ పిప్పల, బలి విభీషణ శిబి | పార్థ విదురు

లంబరీష పరాశ | రాలర్క దేవళ, సౌభరి మిథిలేశ్వ | రాభిమన్యు


తే|| లాష్ణి౯షేణాదులైన మహాత్ములెలమిఁ , దవిలి యద్దేవు భక్తిఁ జి | త్తముల నిలిపి

తత్పరాయణ భక్తి దు | ర్దాంతమైన, విష్ణుమాయఁ దరింతురు | విమలమతులు. (204)


మ|| అనఘా ! వీరల నెన్న నేమిటికి ? ది | ర్యగ్జంతు సంతాన ప

క్షి నిశాటాటవికాఘజీవ నివహ | స్త్రీ శూద్ర హూణాదులై

నను నారాయణ భక్తియోగ మహితా | నందాత్ము లైరేని వా

రనయంబున్ దరియింతు రవ్విభుని మా | యా వైభవాంభోనిధిన్. (205)


వ. కావున. (206)


కం|| శశ్వత్‌ప్రశాంతు, నభయుని, విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు | విభు, సంశుద్ధున్

శాశ్వతు, సము, సదసత్పరు, నీశ్వరుఁ జిత్తమున నిలుపు | మెపుడు మునీంద్రా ! (207)


వ. అట్లైన నప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జవనత వదనయై పొందం జాలక వైముఖ్యంబునన్ దవ్వుదవ్వులఁ దలంగిపోవు. మఱియు. (208)


చ|| హరిఁ బరమాత్ము నచ్యుతు న | నంతునిఁ జిత్తములోఁ దలంచి సు

స్థిరత విశోకసౌఖ్యములఁ | జెందిన ధీనిధు లన్యకృత్యముల్

మఱచియుఁజేయ నొల్లరు త | లంచిన నట్టిద యౌ సురేంద్రుఁడున్

బరువిడి నుయ్యిఁ ద్రవ్వుచు ని | పాన ఖనిత్రము మాను కైవడిన్.(209)


ఉ|| సర్వఫల ప్రదాతయును | సర్వశరణ్యుడు సర్వశక్తుఁడున్

సర్వ జగత్ప్రసిద్ధుఁడును | సర్వగతుండగు చక్రపాణి యీ

సర్వశరీరులున్ విగమ | సంగతిఁ జెంది విశీర్యమాణులై

పర్వినచో నభ్ంబు గతి | బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్. (210)


ఉ|| కారణ కార్య హేతువగు | కంజదళాక్షుని కంటె నన్యు లె

వ్వారును లేరు తండ్రి ! భగ | వంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లు | దాత్తమతిన్ గొనియాడకుండినన్

జేఱవు చిత్తముల్ ప్రకృతిఁ | జెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (211)


మ|| నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై | నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవత క | ల్ప క్ష్మాజమై శాస్త్ర రా

జి గరిష్ఠం బగు నీ పురాణ కథ సం | క్షేపంబుగాఁ జెప్పితిన్

జగతి న్నీవు రచింపు దీని నతి వి | స్తారంబుగాఁ బుత్త్రకా ! (212)


చ|| పురుష భవంబు నొందుట య | పూర్వము జన్మములందు ; నందు భూ

సురకులమందుఁ బుట్టుట టతి | చోద్యమ ; యిట్లగుటన్ మనుష్యు ల

స్థిరమగు కార్యదుర్దశల చేత నశింపక విష్ణుసేవనా

పరతఁ దనర్చి నిత్యమగు | భవ్యపదంబును నొందుటొప్పదే ? (213)


మ|| ఉపవాస వ్రత శౌచ శీల మఖ సం | ధ్యోపాసనాగ్నిక్రియా

జప దానాధ్యయనాది కర్మముల మో | క్ష ప్రాప్తి సేకూర ద

చ్చపు భక్తిన్ హరిఁ బుండరీక నయనున్ | సర్వాతిశాయిన్ రమా

ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని న | ర్థిం గొల్వలేకుండిననన్. (214)


కం|| వనజాక్షు మహిమ నిత్యము, వినుతింపుచు నొరులు వొగడ | వినుచున్ మదిలో

ననుమోదింపుచు నుండెడి, జనములు తన్మోహవశతఁ | జనరు మునీంద్రా ! (215)


కం|| అని వాణీశుఁడు నారద, మునివరునకుఁ జెప్పినట్టి | ముఖ్యకథా సూ

చన మతిభక్తిఁ బరీక్షి, జ్జనపాలునితోడ యోగి | చంద్రుఁడు సెప్పెన్. (216)