6. శ్రీమన్నారాయణుని లీలావతారముల అభివర్ణనము-2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీకృష్ణావతారము[మార్చు]

ఇంకఁ గృష్ణావతారంబు వివరించెద, వినుము. (172)


సీ|| తాపసోత్తమ ! విను | దైత్యాంశములఁ బుట్టి, నరనాథు లతుల సే | నా సమేతు

లగుచు ధర్మేతరు | లై ధాత్రిఁ బెక్కు బా,ధల నలంచుటఁ జేసి | ధరణి వగలఁ

బొందుచు వాపోవ | భూభార ముడుపుట, కై హరి పరుఁడు నా | రాయణుండు

సెచ్చెరఁ దన సితా | సిత కేశయుగమున, బలరామ కృష్ణ రూ | పములఁ దనరి

తే|| యదుకులంబున లీనమై | యుదయమయ్యె, భవ్యయశుఁడగు వసుదేవు | భార్యలైన

రోహిణియు దేవకియు నను | రూపవతుల,యందు నున్మత్త దైత్య సం | హారియగుచు. (173)


వ. ఇట్లు పుండరీకాక్షుండగు నారాయణుండు సమస్తభూభార నివారణంబు సేయం దన మేని కేశద్వయంబు సాలునని యాత్మప్రభావంబుఁ దెలుపు కొఱకు

నిజకళాసంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేతకృష్ణంబులని నిర్దేశించు కొఱకు సితాసిత కేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల నవతరించె. అందు

భగవంతుండును సాక్షాద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యు నతిమానుష కర్మంబు లాచరించుటం జేసి కేవల పరమేశ్వరుండయ్యె. అమ్మహాత్ముం

డాచరించు కార్యంబులు లెక్కవెట్ట నెవ్వనికి నలవి గాదు. అయినను నాకు గోచరించినంతయు నెఱింగించెద, వినుము. (174)


కం|| నూతన గరళస్తని యగు, పూతనఁ బురుటింటిలోనఁ | బొత్తుల శిశువై

చేతనముల హర్యించి ప, రేట నగరమునకు ననిచెఁ | గృష్ణుఁడు వెలుచన్. (175)


కం|| వికటముగ నిజపదాహతిఁ , బ్రకటముగా మూఁడు నెలల | బాలకుఁడై యా

శకట నిశాటుని నంతక, నికటస్థునిఁ జేసె భక్త | నికరావనుఁడై. (176)


కం|| ముద్దుల కొమరుని వ్రేఁతల, రద్దులకై తల్లి ఱోల | రజ్జునఁ గట్టన్

బద్దులకు మిన్నుముట్టిన, మద్దుల వడిఁ గూల్చె జన స | మాజము వొగడన్. (177)


మ|| మదిఁ గృష్ణుండు యశోద బిడ్డఁ డని న | మ్మంజాల యోగీంద్ర ! త

ద్వదనాంభోఝములోఁ జరాచర సమ | స్త ప్రాణిజాతాటవీ

నద నద్యద్రి పయోధియుక్తమగు నా | నా లోక జాలంబు భా

స్వదనూనక్రియఁ జూపెఁ దల్లికి మహా | శ్చర్యంబు వాటిల్లఁగన్. (178)


చ|| వర యమునానదీ హ్రద ని | వాసకుఁడై నిజవక్త్ర నిర్గత

స్ఫురిత విషాంబుపానమున | భూఝనులన్ మృతిఁ బొందఁజేయు భీ

కర గరళ ద్విజిహ్వుఁ డగు | కాళియ పన్నగు నా హ్రదంబుఁ జెం

చ్చెర వెడలించి కాఁచె యదు | సింహుఁడు గోపక గోగణంబులన్. (179)


మ|| తనయా ! గోపకులొక్క రాతిరిని ని | ద్రం జెందఁ గార్చిచ్చు వ

చ్చినం గృష్ణా! మము నగ్నిపీడితుల ర | క్షింపం దగున్ గావవే !

యనినం గన్నులు మీరు మోడ్పుఁ డిదె దా | వాగ్నిన్ వెసన్నార్తు నే

నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ | బద్మాక్షుండు లీలాగతిన్. (180)


కం|| నందుని గతి యమునాంబువు, లందు నిసిం గ్రుంకి బద్ధుఁ | డై చిక్కిన యా

నందుని వరుణుని బంధన, మందు నివృత్తునిగఁ జేసె | హరి సదయుండై. (181)


మ|| మయసూనుండు నిజానువర్తుల మహా | మాయన్ మహీభృద్గుహా

శ్రయులన్ గా నొనరించి తత్పథము నీ | రంధ్రంబుఁ గావించినన్

రయమొప్పన్ గుటిలాసురాధముని బో | రన్ ద్రుంచి గోపావళిన్

దయతోఁ గాఁచిన కృష్ణు సన్మహిమ మే | తన్మాత్రమే తాపసా ! (182)


కం|| దివిజేంద్రప్రీతిగ వ,ల్లవజను లేఁటేఁటఁ జేయు | లాలిత సవనో

త్సవమున్ హరి మాన్చిన గో,పవరులు గావింపకున్న | బలరిపుఁ డలుకన్. (183)


తే|| మంద కొందలమంద న | మందవృష్టి, గ్రందుకొనుఁ డంచు నింద్రుఁడు | మంద కంపెఁ

జండపవన సముద్ధూత | చటుల విలయ, సమయ సంవర్తకాభీల | జలధరములు. (184)


శా|| సప్తస్కంధ శిఖాకలాప రుచిమ | త్సౌదామినీ వల్లికా

దీప్తోదగ్ర ముహుర్ముహుఃస్తనిత ధా | త్రీ భాగ నీరంధ్రమై

సప్తాశ్వ స్ఫురదిందుమండల నభ | స్సంఛాదితాశాంతర

వ్యాప్తాంభోద నిరర్గళ స్ఫుటశిలా | వాఃపూర ధారాళమై. (185)


వ. కుఱియు వానజల్లు పెల్లున రిమ్మలుగొని సొమ్ములువోయి గోప గోకులం బాకులంబు నొంది "కృష్ణ ! కృష్ణ ! రక్షింపు రక్షింపు" మని యార్తిన్ బొంది కుయ్యిడ నయ్యఖండ

కరుణారస సముద్రుండు భక్తజన సురద్రుముండు నగు పుండరీకాక్షుండు. (186)


శా|| సప్తాబ్దంబుల బాలుఁడై నిజ భుజా | స్తంభంబునన్ లీలతో

సప్తాహంబులు శైలరాజ మచల | చ్ఛత్రంబుగాఁ దాల్చి సం

గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గో | గోపాలక వ్రాతమున్

సప్తాంభోధి పరీత భూధరున కా | శ్చర్యంబె ? చింతింపఁగన్. (187)


సీ|| సాంద్ర శరచ్చంద్ర | చంద్రికా ధవళిత, విమల బృందావన | వీథియందు

రాసకేళీ మహో | ల్లాసుఁడై యుత్ఫుల్ల, జలజాక్షుఁ డొక నిశా | సమయమునను

దనరారు మంద్ర మ | ధ్యమ తారముల నింపు, దళుకొత్త త్రాగ భే | దములఁ దనరి

ధైవత ఋషభ గాం | ధార నిషాద పం,చమ షడ్జ మధ్యమ | స్వరములోలిఁ

తే|| గళలు జాతులు మూర్ఛనల్ | గలుగ వేణు, నాళ వివరాంగుళీ న్యాస | లాలసమున

మహితగతిఁ బాడె నవ్యక్త | మధురముగను, బంకజాక్షుండు దారువు | లంకురింప. (188)


మ|| హరివంశోద్గత మంజుల స్వర నినా | దాహూతలై గోప సుం

దరు లేతేఱ ధనాధిపానుచర గం | ధర్వుండు గొంపోవఁ ద

త్తరుణుల్ కుయ్యిడ శంఖచూడుని భుజా | దర్పంబు మాయించి తాఁ

బరిరక్షించినయట్టి కృష్ణుని నుతిం | పన్ శక్యమే యేరికిన్. (189)


చ|| నరక ముర ప్రలంబ యవ | న ద్విప ముష్టిప మల్ల కంస శం

బర శిశుపాల పంచజన | పౌండ్రక పల్వల దంతవక్త్ర వా

నర ఖర సాళ్వ వత్స బక | నాగ విడూరథ రుక్మి కేశి ద

ర్దుర వృషధేనుక ప్రముఖ | దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. (190)


వ. మఱియును. (191)

మ|| బలభీమార్జున ముఖ్య చాపధర రూ | ప వ్యాజతన్ గ్రూరులన్

ఖలులన్ దుష్ట ధరాతలేశ్వరుల సం | గ్రామైక పారీణ దో

ర్బల కేళిన్ దునుమాడి సర్వధరణీ | భారంబు మాయించి సా

ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననం | తున్ గొల్తు నెల్లప్పుడున్. (192)


వ. అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని యవతార మాహాత్మ్యం బెఱింగించితి.


కృష్ణద్వైపాయనావతారము[మార్చు]

ఇంక వ్యాసావతారంబు వినుము. (193)


ఉ|| ప్రత్యుగమందు సంకుచిత | భావులు నల్పతరాయువుల్ సుదౌ

ర్గత్యగులైన మర్త్యుల క | గమ్యములై స్వకృతంబు నిత్యముల్

సత్యమునైన వేదతరు | శాఖలఁ దా విభజించినట్టి యా

సాత్యవతేయ మూర్తి యయి | జాతమునొందె హరి ప్రసన్నుఁడై. (194)


బుద్ధావతారము[మార్చు]

వ. మఱియు బుద్ధావతారంబు వినుము. (195)


మ|| అతిలోలాత్ము లసూనృతోక్తులును భే | దాచార సంశీలు రు

ద్ధత పాషండ మతోపధర్మ్యులు జ | గత్సంగారులైనట్టి యా

దితిసంజాతు లధర్మవాసనల వ | ర్తింపం దదాచార సం

హతి మాయించి హరించె దానవులఁ బ | ద్మాక్షుండు బుద్ధాకృతిన్. (196)


కల్క్యవతారము[మార్చు]

వ. మఱియుం గల్క్యవతారంబు వినుము. (197)


మ|| వనజాక్ష స్తవశూన్యులున్ వషడితి | స్వాహా స్వధా వాక్య శో

భనరాహిత్యులు సూనృతేతరులునుం | బాషండులు న్నైన వి

ప్ర నికాయంబును శూద్ర భూవిభులునున్ | బాటిల్లినన్ గల్కియై

జననం బంది యధర్మము న్నడఁచి సం | స్థాపించు ధర్మం బిలన్. (198)


వ. అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె. "మునీంద్రా ! పుండరీకాక్షుం డంగీకరించు లీలావతార కథావృత్తాంతంబు నే నీకు నెఱింగించు నింతకుమున్న హరి

వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులు దీర్చె. మన్వంతరావతారంబులు నంగీకరించినవియు, నంగీకరింపం గలయవియు నై యున్నవి. వర్తమానంబున

ధన్వంతరి-పరశురామావతారంబులు దాల్చియున్నవాఁడు. భావికాలంబున శ్రీరామాద్యవతారంబుల నంగీకరింపం గలవాఁడు. అమ్మహాత్ముందు సృష్ట్యాదికార్యభేదంబుల

కొఱకు మాయా గుణావతారంబు నొందు. బహుశక్తిధారణుండైన భగవంతుండు సర్గంబునం దపంబును , ఏనును, ఋషిగణంబులును, నవప్రజాపతులు నై యవతరించి

విశ్వోత్పాదనంబు గావించు. ధర్మంబును, విష్ణుండును, యజ్ఞంబులును, మనువులును, ఇంద్రాది దేవగణంబును ధాత్రీపతులునై యవతరించి జగంబుల రక్షింపుచుండు.

అధర్మంబును, రుద్రుండును, మహోరగంబులును, రాక్షసానీకంబులు నై విలయంబు నొందించు. ఇత్తెఱంగునం బరమేశ్వరుండును, సర్వాత్మకుండు నైన హరి విశ్వోత్పత్తి

స్థితిలయహేతుభూతుండై విలసిల్లు. ధరణీరేణువులైన గణుతింప నలవి యగుం గాని యమ్మహాత్ముని లీలావతారాద్భుత కర్మంబులు లెక్కవెట్ట నెవ్వనికి నశక్యంబై

యుండు. నీకు సంక్షేప రూపంబున నుపన్యసించితి. సవిస్తరంబుగా నెఱింగింప నాకుం దరంబు గాదు. అన్యులం జెప్పనేల ? వినుము. (199)