5. శ్రీమన్నారాయణుని లీలావతారముల అభివర్ణనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉ. అన్య కథానులాపము ల | హర్నిశమున్ వినునట్టి సత్క్రియా

శూన్యములైన కర్ణముల | సూరిజన స్తుత సర్వలోక స

న్మాన్యములై తనర్చు హరి | మంగళ దివ్యకథామృతంబు సౌ

జన్యతఁ గ్రోలుమయ్య ! బుధ | సత్తమ ! యే వివరించి చెప్పెదన్. (113)


వ. అని పలికి నారదుం జూచి మఱియు నిట్లనియె. (114)


వరాహావతారము[మార్చు]

మ. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ | క్ష్మాచక్రముం జాఁపఁ జు

ట్టిన మాడ్కిన్ గొనిపోవ యజ్ఞమయ దం | ష్ట్రి స్వాకృతిం దాల్చియ

ద్దనుజాధీశ్వరుఁ దాఁకి యబ్ధినడుమన్ | దంష్ట్రాహతిం ద్రుంప ధా

త్రిని గూలెన్ గులిశాహతిం బడు మహా | ద్రిం బోలి యత్యుగ్రతన్. (115)


యజ్ఞావతారము[మార్చు]

వ. మఱియును యజ్ఞావతారంబు వినుమని యిట్లనియె. (116)


సీ. ప్రకట రుచిప్రజా | పతికిని స్వాయంభు, వుని కూఁతు రాకూతి | యను లతాంగి

కర్థి జన్మించి సు | యజ్ఞుండు నా నొప్పు, నతఁడు దక్షిణ యను | నతివయందు

సుయమ నామామర | స్తోమంబుఁ బుట్టించి, యింద్రుఁడై వెలసి యు | పేంద్రలీల

నఖిల లోకంబుల | యార్తి హరించిన, నతని మాతామహుఁ | డైన మనువు


తే. దన మనంబునఁ దచ్చరి | త్రమున కలరి, పరమ పుణ్యుండు హరి యని | పలికెఁగాన

నంచిత జ్ఞాన నిధియై సు | యజ్ఞుఁ డెలమి దాపసోత్తమ ! హరి యవ | తార మయ్యె. (117)


కపిలావతారము[మార్చు]

వ. అని చెప్పి కపిలుని యవతారంబు వినుమని యిట్లనియె. (118)


చ. ధృతమతి దేవహూతికిని | దివ్యవిభుం డగు కర్ధమ ప్రజా

పతికిఁ బ్రమోదమొప్ప నవ | భామలతోఁ గపిలుండు పుట్టి యే

గతి హరిఁ బొందు నట్టి సుభ | గంబగు సాంఖ్యము తల్లికిచ్చి దు

ష్కృతములు వాపి చూపె ముని | సేవితమై తనరారు మోక్షమున్. (119)


దత్తావతారము[మార్చు]

వ. మఱియు దత్తాత్రేయావతారంబు వినుము. (120)


సీ. తాపసోత్తముఁ డత్రి | తనయుని గోరి ర,మేశు వేఁడిన హరి | యేను నీకు

ననఘ ! దత్తుఁడ నైతి | నని పల్కు కతమున, నతఁడు దత్తాత్రేయుఁ | డై జనించె

న మ్మహాత్ముని చర | ణాబ్జ పరాగ సం,దోహంబుచేఁ బూత | దేహు లగుచు

హైహయ యదువంశు | లైహికాముష్మిక, ఫలరూప మగు యోగ | బలము వడసి


తే. సంచిత జ్ఞానఫల సుఖై | శ్వర్యశక్తి, శౌర్యములు పొంది తమ కీర్తి | చదల వెలుఁగ

నిందు నందును వాసికి | నెక్కి రట్టి, దివ్యతర మూర్తి విష్ణు ను | తింపఁ దరమె ! (121)


సనకాద్యవతారము[మార్చు]

వ. వెండియు సనకాద్యవతారంబు వినుము. (122)


సీ. అనఘాత్మ ! నేను గ | ల్పాదిని విశ్వంబు, సృజియింపఁ దలఁచి యం | చిత తపంబు

నర్థిఁ జేయుచు 'సన' | యని పలుకుట నది, గారణంబున సనా | ఖ్యలను గల స

నందన సనక స | నత్కుమార సనత్సు,జాతులు నల్వుఱు | సంభవించి

మానసపుత్రులై | మహి నుతికెక్కిరి, పోయిన కల్పాంత | మున నశించి


తే. యట్టి యాత్మీయ తత్త్వంబు పుట్టఁజేసి, సాంప్రదాయిక భంగిని | జగతినెల్ల

గలుగఁజేసిరి య వ్విష్ణు | కళలఁ దనరి, నలువు ఱయ్యును నొక్కఁడె | నయచరిత్ర ! (123)


నర-నారాయణావతారము[మార్చు]

వ. మఱియు నరనారాయణావతారంబు వినుము.


కం|| గణుతింపఁగ నర నారా, యణులన ధర్మునకు నుదయ | మందిరి దాక్షా

యణియైన మూర్తివలనం, బ్రణుత గుణోత్తములు పరమ | పావనమూర్తుల్. (124)


కం|| అనఘులు బదరీవనమున, వినుత తపోవృత్తి నుండ | విబుధాధిపుడున్

మనమున నిజపద హానికి, ఘనముగఁ జింతించి దివిజ | కాంతామణులన్. (125)


కం|| రావించి తపోవిఘ్నముఁ గావింపుం డనుచుఁ బలుకఁ | గడువేఁడుకతో

భావభవానీకినులనఁ , గా వనితలు సనిరి బదరి | కావనమునకున్. (126)


వ. అందు. (127)


మ|| నరనారాయణులున్న చోటికి మరు | న్నారీ సమూహంబు భా

స్వరలీలం జని రూపవిభ్రమకళా | చాతుర్యమేపారఁగాఁ

బరిహాసోక్తుల నాటపాటలఁ జరిం | పం జూచి నిశ్చింతతన్

భరితధ్యాన తపఃప్రభావ నిరతిం | బాటించి నిష్కాములై. (129)


కం|| క్రోధము తపముల కెల్లను, బాధకమగు టెఱిఁగి దివిజ | భామలపై న

మ్మేధానిధులొక యింతయుఁ , గ్రోధముఁ దేరైరి సత్త్వ | గుణయుతులగుటన్. (130)


కం|| నారాయణుఁ డప్పుడు తన, యూరువు వెసఁ జీఱ నందు | నుదయించెను బెం

పారంగ నూర్వశీముఖ, నారీజనకోటి దివిజ | నారులు మెచ్చన్. (131)


కం|| ఊరువులందు జనించిన కారణమున నూర్వశి యన | ఘనతకు నెక్కెన్

వారల రూప విలాస వి, హారములకు నోడిరంత | నమరీజనముల్. (132)


వ. అంతం దాము నరనారాయణుల తపోవిఘ్నంబుఁ గావింపం బూని సేయు విలాసంబులు (మానసిక సంకల్పమాత్రంబున సృష్టిస్థితిసంహారంబు లొనర్పం జాలు)

అమ్మహాత్ముల దెసం బనికిరాక కృతఘ్నునకుఁ జేయు నుపకృతులుం బోలె నిష్ఫలంబులైన సిగ్గునం గుందుచు నూర్వశిం దమకు ముఖ్యురాలిగాఁ గైకొని తమ వచ్చిన

జాడనే మఱలిరంత. (133)


కం|| కాముని దహించెఁ గ్రోధ మ, హా మహిమను రుద్రుఁ డట్టి | యతికోపము నా

ధీమతులు గెలిచి రనినం, గామము గెల్చుటలు సెప్పఁ | గా నేమిటికిన్. (134)


వ. అట్టి నరనారాయణావతారంబు జగత్పావనంబై విలసిల్లె.


ధ్రువావతారము[మార్చు]

వెండియు ధ్రువావతారంబు వివరించెద, వినుము. (135)


సీ|| మానిత చరితుఁ డు | త్తానపాదుండను, భూవరేణ్యునకు స | త్పుత్త్రుఁ డనఁగ

నుదయించి మహిమఁ బెం | పొంది బాల్యంబున, జనకుని కడనుండి | సవతితల్లి

తను నాడు వాక్యాస్త్ర | తతిఁ గుంది మహిత త, పంబుఁ గావించి కా | యంబు తోడ

జని మింట ధ్రువపద | స్థాయియై యట మీఁద, నర్థి వర్తించు భృ | గ్వాదిమునులు

తే. చతురగతిఁ గ్రింద వర్తించు | సప్తఋషులు, పెంపు దీపింపఁ దన్ను ను | తింపుచుండ

ధ్రువుఁడు నా నొప్పి యవ్విష్ణు | తుల్యుఁ డగుచు, నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు | నున్నవాఁడు. (136)


పృథ్వవతారము[మార్చు]

వ. పృథుని యవతారంబు వినుము. (137)


ఉ|| వేనుఁడు విప్రభాషణ ప | వి ప్రహర చ్యుత భాగ్య పౌరుషుం

డై నిరయంబునం బడిన | నాత్మతనూభవుఁడై పృథుండు నాఁ

బూని జనించి తజ్జనకుఁ | బున్నరకంబును బాపె ; మేదినిన్

ధేనువుఁ జేసి వస్తువిత | తిం బితికెన్ హరిసత్కళాంశుఁడై. (138)


ఋషభావతారము[మార్చు]

వ. అని మఱియు ఋషభావతారంబు నెఱిఁగింతు, వినుము. అగ్నీధ్రుండనువానికి సుదేవి వలన నాభియనువాఁ డుదయించె. అతనికి మేరుదేవియందు హరి

ఋషభావతారంబు నొంది, జడస్వభావంబైన యోగంబుఁ దాల్చి ప్రశాంతాంతఃకరణుండును, విముక్తసంగుడును నై, "పరమహంసాభిగమ్యంబైన పదంబిది" యని మహర్షులు

పలుకుచుండం జరించె.


హయగ్రీవావతారము[మార్చు]

మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద, వినుము. (139)


చ|| అనఘచరిత్ర ! మన్ముఖము | నందు జనించె హయాననాఖ్యతన్

వినుత సువర్ణవర్ణుఁడును | వేదమయుం డఖిలాంతరాత్మకుం

డనుపమ యజ్ఞపూరుషుఁడు | నై భగవంతుఁడు ; తత్సమస్త పా

వనమగు నాసికా శ్వసన | వర్గములం దుదయించె వేదముల్. (140)'


మత్స్యావతారము[మార్చు]

వ. మఱియు మత్స్యావతారంబు వినుము. (141)


సీ|| ఘనుఁడు వైవస్వత | మనువుకు దృష్టమై, యరుదెంచినట్టి యు | గాంతసమయ

మందు విచిత్ర మ | త్స్యావతారంబుఁ దాల్చి, యఖిలావనీమయం | బగుచుఁ జాల

సర్వజీవులకు నా | శ్రయభూతుఁ డగుచు నే, కార్ణవం బైన తో | యముల నడుమ

మన్ముఖశ్లథ వేద | మార్గంబులను జిక్కు,వడకుండ శాఖ లే | ర్పడఁగఁ జేసి

తే|| దివ్యు లర్థింప నా కర్థిఁ | దెచ్చియిచ్చి, మనువు నెక్కించి పెన్నావ | వనధి నడుమ

మునుఁగకుండఁగ నరసిన | యనిమిషావ, తార, మేరికి నుతియింపఁ | దరమె వత్స ! (142)


కమఠావతారము[మార్చు]

వ. మఱియుఁ గూర్మావతారంబు వినుము. (143)


మ|| అమృతోత్పాదనయత్నులై విబుధ దై | త్యానీఖముల్ మందరా

గముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిఁ దఱువం | గా గవ్వఁపుం గొండ వా

ర్ధి మునుంగన్ హరి కూర్మరూపమున న | ద్రిం దాల్చెఁ దత్పర్వత

భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియిం | పం జేయఁగా నారదా ! (144)


నృసింహావతారము[మార్చు]

వ. వెండియు నృసింహావతారంబు వినుము. (145)


మ|| సురలోకంముఁ గలంచి దేవసమితిన్ | స్రుక్కించి యుద్యద్గదా

ధరుఁడై వచ్చు నిశాచరుం గని కనద్ | దంష్ట్రాకరాళాస్య వి

స్ఫురితభ్రూకుటితో నృసింహగతి ర | క్షోరాజవక్షంబు భీ

కర భాస్వన్నఖరాజిఁ ద్రుంచెఁ ద్రిజగ | త్కల్యాణసంధాయియై. (146)


ఆదిమూలావతారము[మార్చు]

వ. ఆదిమూలావతారంబు సెప్పెద, వినుము. (147)


మ|| కరినాథుండు జలగ్రహగ్రహణ దుః | క్రాంతుఁడై వేయి వ

త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు వి | శ్వవ్యాప్తి లేకుండుటన్

హరి ! నీవే శరణంబు నా కనినఁ గు | య్యాలించి వేవేగ వా

శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాఁచె మహితో | త్సాహంబునం దాపసా !


వామనావతారము[మార్చు]

వ. మఱియును వామనావతారంబు వినుము. (149)


సీ|| యజ్ఞేశ్వరుం డగు | హరి విష్ణుఁ డదితి సం,తానమునకు నెల్లఁ | దమ్ముఁ డయ్యుఁ

బెంపారు గుణములఁ | బెద్దయై వామన, మూర్తితో బలిచక్ర | వర్తిఁ జేఱి

తద్భూమి మూఁడు పా | దమ్ముల నడిగి ప,దత్రయంబునను జ | గత్త్రయంబు

వంచించె కొనియెను | వాసవునకు రాజ్య, మందింప నీశ్వరుఁ | డయ్యు మొఱఁగి

తే|| యర్థిరూపంబుఁ గైకొని | యడుగవలసె, ధార్మికుల సొమ్ము వినయోచి | తమునఁ గాని

వెడఁగుఁదనమున నూరక | విగ్రహిచి, చలనమొందింపరాదు ని | శ్చయము పుత్త్ర ! (150)


మ|| బలి నిజమౌళి నవ్వటుని | పాద సరోరుహ భవ్యతీర్థ ము

త్కలిక ధరించి తన్నును జ | గత్త్రయమున్ హరికిచ్చి కీర్తులన్

నిలిపె వసుంధరాస్థలిని | నిర్జరలోక విభుత్వహానికిన్

దలఁకక శుక్రు మాటలకుఁ | దారక భూరివదాన్యశీలుఁడై. (151)


వ. మఱియు నప్పరమేశ్వరుండు "నారదా ! హంసావతారంబు నొంది యతిశయభక్తియోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వప్రదీపకంబగు భాగవత

మహాపురాణం బుపదేశించె. మన్వవతారంబు నొంది స్వకీయ తేజః ప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండింపుచు

శిష్టపరిపాలనంబు సేయుచు, నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలింగించె. మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబులకు

సకలరోగ నివారణము సేయుచు నాయుర్వేదంబు గల్పించె.


భార్గవ రామావతారము[మార్చు]

వెండియు పరశురామావతారంబు వినుము. (152)


మ|| ధరణీకంటకులైన హైహయ నరేం | ద్ర వ్రాతమున్ భూరి వి

స్ఫురితోదార కుఠారధారఁ గలనన్ | ముయ్యేఁడుమాఱుల్ పొరిం

బొరి మర్దించి సమస్తభూతలము వి | ప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ

జిరకీర్తిన్ జమదగ్నిరాముఁ డన మిం | చెన్ దాపసేంద్రోత్తమా ! (158)


శ్రీరామచంద్రావతారము[మార్చు]

సీ|| తోయజహితవంశ | దుగ్ధపారావార, రాకా విహార కై | రవ హితుండు

గమనీయ కోసల | క్ష్మాభృత్సుతాగర్భ, శుక్తిసంపుట లస | న్మౌక్తికంబు

నిజపాదసేవక | వ్రజ దుఃఖ నిబిడాంధ, కార విస్ఫురిత పంక | రుహ సఖుండు

దశరథేశ్వర కృతా | ధ్వర వాటికాప్రాంగ,ణాకర దేవతా | నోకహంబు

తే|| చటుల దానవ గహన వై | శ్వానరుండు, రావణాటోప శైల పు | రందరుండు

నగుచు లోకోపకారార్థ | మవతరించె, రాముఁ డై చక్రి లోకాభి | రాముఁ డగుచు. (155)


కం|| చిత్రముగ భరత లక్ష్మణ, శత్రుఘ్నుల కర్థి నగ్ర | జన్ముం డగుచున్

ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ, విత్రుఁదు దుర్భవ లతా ల | విత్రుం డగుచున్. (156)


వ. అంత. (157)


సీ|| కిసలయ ఖండేందు | బిసలయ పద్మాబ్జ, పద ఫాల భుజపద | పాణినేత్రఁ

గాహళ కరభ చ | క్ర వియత్పులిన శంఖ, జంఘోరు కుచమధ్య | జఘనకంఠ

ముకురచందనబింబ | శుక గజ శ్రీకార గండ గంధోష్ఠ వా | గ్గమన కర్ణఁ

జంపకేందుస్వర్ణ | శంపా ధనుర్నీల, నాసికాస్యాంగ దృగ్ | భ్రూ శిరోజ


తే|| నలి సుధావర్త కుంతల | హాసనాభి, కలిత జనకావనీపాల | కన్యకా ల

లామఁ బరిణయమయ్యె ల | లాటనేత్ర, కార్ముకధ్వంస ముంకువ | కాఁగ నతఁడు. (158)


వ. అంత. (159)


కం|| రామున్ మేచక జలద, శ్యామున్ సుగుణాభిరాము | సద్వైభవ సు

త్రామున్ దుష్ట నిశాట వి, రామున్ బొమ్మనియెఁ బంక్తి | రథుఁ దడవులకున్. (160)


వ. ఇట్లు పంచిన. (161)


చ|| అఱుదుగ లక్ష్మణుండు జన | కాత్మజయుం దన తోడ నేఁగుఁదే

నరిగి రఘూత్తముండు ముద | మారఁగఁ జొచ్చెఁ దరక్షు సింహ సూ

కర కరిపుండరీక కపి | ఖడ్గ కురంగవృకాహి భల్ల కా

నర ముఖ వన్యసత్త్వచయ | చండతరాటవి దండకాటవిన్. (162)


కం|| ఆ వనమున వసియించి నృ,పావన నయశాలి యిచ్చె | నభయంబు జగ

త్పావన మునిసంతతికిఁ గృ, పావననిధియైన రామ | భద్రుం డెలమిన్. (163)


కం|| ఖరకర కుల జలనిధి హిమ, కరుఁడగు రఘురామ విభుఁడు | గఱకఱితోడన్

ఖరుని వధించెను ఘన భీ, కర శరముల నఖిలజనులు | గరమఱుదనఁగాన్. (164)


(మ|| అనుజున్ మోహముతోడ డాసిన దశా | స్యానూజ ముక్కాతఁ డ

ల్లనఁ గోయన్నది గోలుగోలున వెసన్ | లంకాపురిం జేఱి తా

వినతించెన్ దన యన్న రావణునకున్ | స్వీయావమానక్రియన్

జనకాపత్యతనూవిలాసమును వా | క్చాతుర్యమేపారఁగన్.)


(శా||కం|| హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని, హరిసుతుఁ దునుమాడి పనిచె | హరిపురమునకున్

హరివిభునకు హరిమధ్యను, హరిరాజ్యపదంబు నిచ్చె | హరివిక్రముఁడై. (165)


వ. అంత సీతానిమిత్తంబునం ద్రిలోకకంటకుండగు దశకంఠుం దునుమాడుటకునై కపిసేనాసమేతుండై చని దుర్గమంబైన సముద్రంబు తెఱువుసూపకున్న నలిగి. (166)


మ|| వికటభ్రూకుటిఫాలభాగుఁడగుచున్ | వీరుండు క్రోధారుణాం

బకుఁడై చూచినయంత మాత్రమున న | ప్పాథోధి సంతప్త త్ఫ్

య కణగ్రాణ తిమింగల ప్లవ ఢులీ | వ్యాళ ప్రవాళోర్మికా

బక కారండవ చక్రముఖ్య జల స | త్త్వ శ్రేణితో నింకినన్. (167)


వ. అయ్యవసరంబున సముద్రుండు కరుణాసముద్రుండగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటియట్ల నిలిపి, నలునిచే సేతువు బంధించి తన్మార్గంబునం జని. (168)


మ|| పురముల్ మూఁడును నొక్క బాణమున ని | ర్మూలంబుఁ గావించు శం

కరు చందంబున నేర్చె రాఘవుఁడు లం | కా పట్టణం బిద్ధ గో

పుర శాలాంగణ హర్మ్య రాజభవన | ప్రోద్యత్‌ప్రతోళీ కవా

ట రథాశ్వ ద్విప శస్త్ర మందిర నిశా | ట శ్రేణితో వ్రేల్మిడిన్. (169)


కం||| రావణు నఖిల జగద్వి,ద్రావణుఁ బరిమార్చి నిలిపె | రక్షోవిభుఁ గా

రావణు ననుజన్ముని నై, రావణ సితకీర్తి మెఱసి | రాఘవుఁ డెలమిన్. (170)


సీ|| ధర్మసంరక్షక | త్వ ప్రభావుండయ్యు, ధర్మ విధ్వంసక | త్వమునఁ బొదలి

ఖరదండనాభిము | ఖ్యముఁ బొందకుండియు ఖరదండనాభిము | ఖ్యమున మెఱసి

పుణ్యజనావన | స్ఫూర్తిఁ బెంపొందియు, బుణ్యజనాంతక | స్ఫురణఁ దనరి

సంతతాశ్రిత విభీ | షణుఁడు కాకుండియు, సంతతాశ్రిత విభీ | షణత నొప్పి

తే|| మించి తన కీర్తి చేట వా | సించె దిశలు, తరమె ? నుతియింప రాము నె | వ్వఱికినైనఁ

జారుతరమూర్తి నవనీశ | చక్రవర్తిఁ , బ్రకటగుణసాంద్రు దశరథ | రామచంద్రు. (171)


వ. అట్టి రామావతారంబు జగత్పావనంబు నస్మత్ప్రసాదకారణంబునై నుతికెక్కె.