Jump to content

4. శ్రీమన్నారాయణుని లీలావతారముల యభివర్ణనము

వికీసోర్స్ నుండి

బ్ ఉ. అన్య కథానులాపము లహర్నిశమున్ వినునట్టి సత్ర్కియా

శూన్యములైన కర్ణముల సూరిజన స్తుత సర్వలోక స

న్మాన్యములై తనర్చు హరి మంగళ దివ్యకథామృతంబు సౌ

జన్యతఁ గ్రోలుమయ్య ! బుధసత్తమ ! యే వివరించి చెప్పెదన్. ( 113)


వ. అరి పలికి నారదుం జూచి మఱియు నిట్లనియె. ( 114 )


                                             ==అధ్యాయము - ౯ == 


మ. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రముం జాఁపఁ జు

ట్టిన మాడ్కిన్ గొనిపోవ యజ్ఞమయ దంష్టృ స్వాకృతిం దాల్చియ

ద్దనుజాధీశ్వరుఁ దాఁకి యబ్ధినడుమన్ దంష్టృహతిం ద్రుంప ధా

త్రిని గూలిన్ గులిశాహతిం బడు మహాద్రిం బోలి యత్యుగ్రతన్. ( 115 )

వ. మఱియును యజ్ఞావతారంబు విను మని యిట్లనియె. ( 116 )


సీ. ప్రకట రుచిప్రజాపతికిని స్వాయంభువుని కూఁతు రాకూతి యను లతాంగి

కర్థి జన్మించి సుయజ్ఞుండు నా నొప్పు నతఁడు దక్షిణ యను నతివయందు

సుయమ నామామర స్తోమంబుఁ బుట్టించి యింద్రుఁడై వెలసి యుపేంద్రలీల

నఖిల లోకంబుల యార్తి హరించిన నతని మాతామహుఁ డైన మనువు


తే. దన మనంబునఁ దచ్చరిత్రమున కలరి, పరమ పుణ్యుండు హరి యని పలికెఁగాన

నంచిత జ్ఞాన నిధియై సుయజ్ఞుఁ డెలమి దాపసోత్తమ! హరి యవతార మయ్యె. ( 117 )


వ. అని చెప్పి కపిలుని యవతారంబు వినుమని యిట్లనియె. ( 118 )


చ. ధృతమతి దేవహూతికిని దివ్యవిభుం డగు కర్ధమ ప్రజా

పతికిఁ బ్రమోదమొప్ప నవభామలతోఁ గపిలుండు పుట్టి యే

గతి హరిఁ బొందు నట్టి సుభగంబగు సాంఖ్యము తల్లికిచ్చి దు

ష్కృతములు వాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్. ( 119 )

వ. మఱియు దత్తాత్రేయావతారంబు వినుము. ( 120 )


సీ. తాపసోత్తముఁ డత్రి దనయుని గోరి రమేశు వేఁడిన హరి యేను నీకు

ననఘ! దత్తుఁడ నైతి నని పల్కు కతమున నతఁడు దత్తాత్రేయుఁడై జనించె

న మ్మహాత్ముని చరణాబ్జ పరాగ సందోహంబుచేఁ బూతదేహు లగుచు

హైహయ యదువంశు లైహి కాముష్మిక ఫలరూప మగు యోగబలము వడసి


తే. సంచిత జ్ఞానఫల సుఖైశ్వర్యశక్తి, శౌర్యములు పొంది తమ కీర్తిచదల వెలుఁగ

నిందు నందును వాసికి నెక్కి రట్టి, దివ్యతర మూర్తి విష్ణు నుతింపఁ దరమె! ( 121 )


వ. వెండియు సనకా ద్యవతారంబు వినుము. ( 122 )


సీ. అనఘాత్మ! నేను గల్పాదిని విశ్వంబు సృజియింపఁ దలఁచి యంచిత తపంబు

నర్థిఁజేయుచు *'సన' యని పలుకుటయు నది గారణంబున సనాఖ్యలను గల స

నందన సనక సనత్కుమార సనత్సుజాతులు నల్వురు సంభవించి

మానసపుత్రులై మహి నుతికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి


తే. యట్టి యాత్మీయ తత్త్వంబు పుట్టఁజేసి, సాంప్రదాయిక భంగిని జగతినెల్ల

గలుగఁజేసిరి య వ్విష్ణుకళలఁ దనరి, నలువు రయ్యును నొక్కఁడె నయచరిత్ర! ( 123 )


వ. మఱియు నరనారాయణావతారంబు వినుము. ( 124 )


క. గణుతింపఁగ నరనారా, యణులన ధర్మునకు నుదయ మందిరి దాక్షా

యణియైన మూర్తివలనం, బ్రణత గుణోత్తములు పరమ పావన మూర్తుల్. ( 125 )


క. అనఘులు బదరీ వనమున, వినుత తపోవృత్తి నుండ విబుధాధిపుఁడున్

మనమున నిజపద హానికి, ఘనముగఁ జింతించి దివిజ కాంతామణులన్. ( 126)


క. రావించి తపోవిఘ్నము, గావింపుం డనుచుఁ బలుకఁ గడువేడుకతో

భావభవానీకిను లనఁ గా వనితలు సనిరి బదరికా వనమునకున్. ( 127 )


వ. అందు ( 128 )


మ. నరనారాయణు లున్న చోటికి మరు న్నారీ సమూహంబు భా

స్వరలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ

బరిహాసోక్తుల నాట పాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్

భరిత ధ్యాన తప: ప్రభావ నిరతం బాటించి నిష్కాములై. ( 129 )


క. క్రోధము దపముల కెల్లను, బాధకమగు టెఱిఁగి దివిజభామలపై న

మ్మేధానిధు లొక యింతయుఁ, క్రోధము దేరైరి సత్త్వగుణ యుతు లగుటన్. ( 130 )


క. నారాయణుఁ డప్పుడు దన, యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను బెం

పారంగ నూర్వశీ ముఖ, నారీ జనకోటి దివిజనారులు మెచ్చన్. ( 131 )


క. ఊరువులందు జనించిన, కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్

వారల రూప విలాస వి, హారములకు నోడి రంత నమరీ జనముల్. ( 132 )


వ. అంతం దాము నరనారాయణుల తపోవిఘ్నంబు గావింపం బూని సేయు విలా సంబులు (మానసిక సంకల్ప మాత్రంబున సృష్టిస్థితి సంహారంబు లొనర్పంజాలు) న మ్మహాత్ముల దెసం బనికిరాక కృతఘ్ననకుం జేయు నుపకృతులుంబోలె నిష్ఫ లంబులైన సిగ్గునం గుందుచు నూర్వశిం దమకు ముఖ్యరాలిగాఁ గైగొని తమ వచ్చిన జాడనే మఱలి రంత. ( 133 )


క. కాముని దహించెఁ గ్రోధ మ, హామహిమను రుద్రుఁ డట్టి యతికోపము నా

ధీమతులు గెలిచి రనినం, గామము గెల్చుటలు చెప్పఁగా నేమిటికిన్. ( 134 )


వ. అట్టి నరనారాయణావతారంబు జగత్ప్రావనంబై విలసిల్లె. వెండియు ధ్రువావ తారంబు వివరించెద వినుము. ( 135 )


సీ. మానిత చరితుఁ డుత్తానపాదుం డను భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనఁగ

నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున జనకుని కడ నుండి సవతితల్లి

తను నాడు వాక్యాస్త్ర తతిఁ గుంది మహిత తపంబు గావించి కాయంబుతోడఁ

జని మింట ధ్రువపద స్థాయియై యట మీఁద నర్ధి వర్తించు బృగ్వాది మునులు


తే. చతురగతిఁ గ్రింద వర్తించు సప్తఋషులు, పెంపు దీపింపఁ దన్ను నుతింపుచుండ

ధ్రువుఁడునానొప్పి యవ్విష్ణుతుల్యుఁడగుచు, నున్నపుణ్యాత్ముఁడిప్పుడునున్న వాడు. ( 136 )


వ. పృథుని యవతారంబు వినుము. ( 137 )


ఉ. వేనుఁడు విప్రభాషణ పవి ప్రహర చ్యుత భాగ్య పౌరుషుం

డై నిరయంబునం బడిన నాత్మతనూభవుఁడై పృథుండు నా

బూని జనించి త జ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్

ధేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై. ( 138 )


వ. అని మఱియు వృషభావతఅరంబు నెఱిఁగింతు వినుము. ఆగ్నీధ్రుండను వానికి సుదేవివలన నాభి యను వాఁ డుదయించె. అతనికి మేరుదేవియందు హరి వృష భావతారంబు నొంది, జడస్వభావం బైన యోగంబు దాల్చి ప్రశాంతాంత: కరణుండును విముక్త సంగుండునై, పరమ హంసాభిగమ్యంబైన పదం బిది యని మహర్షులు పలుకుచుండం జరించె, మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము. ( 139 )


చ. అనఘచరిత్ర! మ న్మఖమునందు జనించె హయాన నాఖ్యతన్

వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డభి లాంతరాత్మకుం

డనుపమ యజ్ఞపూరుషుఁడు నై భగవంతుడు ద త్సమస్త పా

వనమగు నాసికా శ్వసన వర్గములం దుదయించె వేదముల్. ( 140 )


వ. మరియు మత్స్యావతారంబు వినుము. ( 141 )


సీ. ఘనుడు వైవస్వత మనువుకు దృష్టమై యరుదెంచినట్టి యుగాంత సమయ

మందు విచిత్ర మత్స్యావతారము దాల్చి యఖిలావనీ మయం బగుచుఁజాల

సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే కార్ణవం బైన తోయముల నడుమ

మ న్ముఖశ్లథ వేద మార్గంబులను జిక్కు వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి


తే. దివ్యు లర్ధింప నా కర్థిఁ దెచ్చియిచ్చి, మనువు నెక్కించి పెన్నా వ వనధి నడుమ

మునుఁగ కుండఁగ నరసిన యనిమిషావ, తార మేరికి నుతియింపఁదరమె? వత్స! ( 142 )


వ. మఱియుఁ గూర్మావతారంబు వినుము. ( 143 )


మ. అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్ మందరా

గము గవ్వంబుగఁ జేసి యబ్ధి దఱువంగాఁ గవ్వపుం గొండ వా

ర్ధి మునుంగన్ హరి గూర్మ రూపమున నద్రిం దాల్చెఁద త్పర్వత

భ్రమణ వ్యాజత వీఁపు తీట శమియింప జేయఁగా నారదా! ( 144 )


వ. వెండియు నృసింహావతారంబు వినుము. ( 145 )


మ. సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్య ద్గదా

ధరుఁడై వచ్చు నిశాచరుం గని కన ద్దంష్ట్రాకరాళాస్య వి

స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ

కర భాస్వ న్నఖరాజిఁ ద్రుంచెఁ ద్రిజగ త్కల్యాణ సంధాయియై. ( 146 )


వ. ఆదిమూలావతారంబు సెప్పెద వినుము. ( 147 )


మ. కరినాథుండు జలగ్రహ గ్రహణ దు:ఖాక్రాంతుఁడై వేయి వ

త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్

హరి నీవే శరణంబు నా కనిన కు య్యాలించి వేవేగ వా

శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా! ( 148 )


వ. మఱియును వామనావతారంబు వినుము. ( 149 )


సీ. యజ్ఞేశ్వరుం డగు హరి విష్ణుఁ డదితి సంతానంబునకు నెల్లఁదమ్ముఁడయ్యుఁ

బెంపారు గుణములఁ బెద్దయె వామన మూర్తితో బలిచక్రవర్తిఁ జేరి

త ద్భూమి మూఁడు పాదమ్ముల నడిగి పద త్రయంబునను జగత్త్రయంబు

వంచించి కొనియెను వాసవునకు రాజ్య మందింప నీశ్వరుఁ దయ్యు మొఱఁగి


తే. యర్థి రూపంబు గైకొని యడుగవలసె, ధార్మికుల సొమ్ము వినయోచితమునఁ గాని

వెడఁగుఁదనమున నూరక విగ్రహించి, చలన మందింపరాదు నిశ్చయము పుత్ర! ( 150 )


చ. బలి నిజమౌళి న వ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము

త్కలిక ధరించి తన్నును జగత్తృయమున్ హరి కిచ్చి కీర్తులన్

నిలిపె వసుంధరాస్థలిని నిర్భరలోక విభుత్వ హానికిన్

దలఁకక శుక్రు మాటలకుఁ దారక భూరి వదాన్య శీలుఁడై ( 151 )


వ. మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తి యోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణం బుపదేశించె. మన్వతారంబు నొంది స్వకీయ తేజ:ప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండింపుచు, శిష్ట పరిపాలనంబు సేయుచు, నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలిగించె. మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబులకు సకల రోగ నివారణము సేయుచు నాయుర్వేదంబు గల్పించె. వెండియు పరశురామావతఅరంబు వినుము. ( 152 )


మ. ధరణీకంటకు లైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి వి

స్ఫురి తోదార కుఠార ధారఁ గలనన్ ముయ్యేడుమాఱుల్ పొరిం

బొరి మర్ధించి సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ

జిరకీర్తిన్ జమదగ్ని రాముఁ డన మించెన్ దాపసేంద్రోత్తమా ! ( 153 )


వ. మఱియు శ్రీరామావతారంబు సెప్పెద వినుము. ( 154 )


సీ. తోయజహిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు

గమనీయ కోసల క్ష్మాభృ త్సుతాగర్భ శుక్తి సంపుట లస న్మౌక్తికంబు

నిజపాద సేవక వ్రజ దు:ఖ నిబిడాంధకార విస్ఫురిత పంక రుహ సఖుఁడు

దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగ ణాకర దేవతానోకహంబు


తే. చటుల దానవ గహన వైశ్వానరుండు, రావణాటోప శైల పురందరుండు

నగచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు ( 155 )


క. చిత్రముగ భరత లక్ష్మణ, శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్

ధాత్రిన్ రాముఁడు వెలసెఁబ, విత్రుఁడు దుర్భవలతా లవిత్రుండగుచున్ ( 156 )


వ. అంత ( 157 )


సీ. కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ పద ఫాల భుజరద పాణి నేత్రఁ

గాహళ కరభ చక్ర వియ త్పులిన శంఖ జంఘేరు కుచ మధ్య జఘన కంఠ

ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గండ గంధోష్ఠ వా గ్గమన కర్ణఁ

జంప కేందు స్వర్ణ శంపా ధను ర్నీల నాసికాస్యాంగ దృక్ భ్రూ శిరోజ


తే. నలి సుధావర్త కుంతల హాసనాభి, కలిత జనకావనీపాల కన్యకా ల

లామఁ బరిణయమయ్యె లలాటనేత్ర, కార్ముక ధ్వంస ముంకువ గాఁగ నతఁడు. ( 158 )


వ. అంత ( 159 )


క. రామున్ మేచక జలద, శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు

త్రామున్ దుష్ట నిశాట వి, రాముం బొమ్మనియెఁ బం క్తిరథుఁ డడవులకున్. ( 160 )


వ. ఇట్లు పంచిన, ( 161 )


చ. అరుదుగ లక్ష్మణుండు జనకాత్మ జయుం దనతోడ నేగుదే

నరిగి రఘూత్తముండు ముద మారఁగఁ జొచ్చెఁ దరక్షు సింహ సూ

కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా

సర ముఖ వస్యసత్వచయ చండతరాటవి దండకాటవిన్. ( 162 )


క. ఆ వనమున వసియించి నృ, పావన నయశాలి యిచ్చెనభయములు జగ

త్పావన మునిసంతతికిఁ గృ, పావన నిధియైన రామభద్రుం డెలమిన్. ( 163 )


క. ఖర కర కుల జలనిధి హిమ, కరుఁడగు రఘురామ విభుఁడు గఱకఱితోడన్

ఖరుని వధించెను ఘన భీ, కర శరముల నిఖిల జనులు గర మరు దనఁగాన్. ( 164 )


క. హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని, హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్

హరి విభునకు హరిమధ్యను, హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై ( 165 )


ప. అంత సీతానిమిత్తంబునం ద్రిలోకకంటకుఁడగు దశకంఠుం దునుమాడుటకునై

కపిసేనా సమేతుండై చని దుర్గమంబైన సముద్రంబు తెరువు సూపకున్న నలిగి. ( 166 )


మ. వికట భ్రూకుటి ఫాలభాగుఁ డగుచున్ వీరుండు గ్రోధారుణాం

బకుఁడై చూచినయంత మాత్రమున న ప్పాథోధి సంతప్త తో

యకణ గ్రాహ తిమింగిల ప్లవ ఢులీ వ్యాళ ప్రవాళోర్మి కా

బక కారండవ చక్రముఖ్య జలసత్వ శ్రేణితో నింకినన్. ( 167 )


వ. అ య్యవసరంబున సముద్రుండు గరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటియట్లు నిలిపి, నలునిచే సేతువు బంధింపించి, త న్మార్గంబునం జని. ( 168 )


మ. పురముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం

కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధ గో

పుర శాలాంగంణ హర్మ్య రాజభవన ప్రోద్య త్ప్రతోళీ కవా

ట రథాశ్వ ద్విప శస్త్రమందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్. ( 169 )


క. రావణు నఖిలజగ ద్వి, ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁ గా

రావణు ననుజన్ముని నై, రావణ సితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్. ( 170 )


సీ. ధర్మసంరక్షకత్వ ప్రభావుం డయ్యు ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి

ఖర దండ నాభిముఖ్యము పొంద కుండియు ఖరదండ నాభిముఖ్యమున మెఱసి

పుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ బుణ్యజనాంతక స్ఫురణఁ దనరి

సంత తాశ్రిత విభీషణుఁడు గాకుండియు సంతతాశ్రిత విభీషణత నొప్పి


తే. మించి తనకీర్తిచేత వాసించె దిశలు, తరమె? నుతియింప రాము నెవ్వరికినైనఁ

జారుతరమూర్తినవనీశ చక్రవర్తిఁ, బ్రకట గుణసాంద్రు దశరధ రామచంద్రు. ( 171 )


వ. అట్టి రామావతారంబు జగత్పావనంబు నస్మ త్ప్రసాదకారణంబునై నుతికెక్కె. ఇంక కృష్ణావతారంబు వివరించెద వినుము. ( 172 )


సీ. తాపసోత్తమ! విను దైత్యాంసములఁ బుట్టి నరనాథు లతుల సేనాసమేతు

లగుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కు బాధల నలంచుటఁ జేసి! ధరణి వగలఁ

బొందుచు వాపోవ భూభార ముడుపుటకై హరి పరుఁడు నారాయణుండు

చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున బలరామ కృష్ణ రూపములఁ దనరి


తే. యదుకులంబున లీనమై నుదయ మయ్యె, భవ్యయశుఁడగు వసుదేవు ధార్యలైన

రోహిణియు దేవకియునను రూపవతుల, యందు నున్మ త్త దైత్యసంహారియగుచు. ( 173 )


వ. ఇట్లు పుండరీకాక్షుం డగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయందన మేని కేశద్వయంబు చాలునని యాత్మప్రభావంబు దెలుపు కొఱకు నిజకళా సంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేత కృష్ణంబు లని నిర్దేశించు కొఱకు సితాసిత కేశద్వయ వ్యాజంబున రామ కృష్ణాఖ్యల నవతరించె. అందు భగవంతుడును సాక్షా ద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యు నతిమానుష కర్మంబు లాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె. అ మ్మహాత్ముండాచరించు కార్యంబులు లెక్కవెట్ట నెవ్వరికి నలవిగాదు. అయినను నాకు గోచరించి నంతయు నెఱింగించెద వినుము. ( 174 )


క. నూతన గరళ స్తని యగు, పూతనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై

చేతనముల హరియించి ప, రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్. ( 175 )


క. వికటముగ నిజపదాహతిఁ, బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా

శకట నిశాటుని నంతక, నికటస్థునిఁ జేసెభక్త నికరావనుఁడై. ( 176 )


క. ముద్దుల కొమరుని వ్రేతల, రద్దులకై తల్లి ఱోల రజ్జునఁ గట్టన్

బద్దులకు మిన్ను ముట్టిన, మద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్. ( 177 )


మ. మదిఁ గృష్ణుండు యశోద బిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర ! త

ద్వదనాంభోజములోఁ జరాచర సమస్త ప్రాణిజా తాటవీ

నది నద్యద్రి పయోధి యుక్తమగు నానాలోక జాలంబు భా

స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగఁన్. ( 178 )


చ. వర యమునానది హ్రద నివాసకుఁడై నిజవక్తృ నిర్గత

స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁజేయు భీ

కర గరళ ద్విజిహ్వుఁ డగు కాళీయ పన్నగు నా హ్రదంబుఁ జె

చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపక గోగణంబులన్. ( 179 )


మ. తనయా! గోపకు లొక్కరాతిరిని నిద్రంజెందఁ గార్చిచ్చు వ

చ్చినఁ గృష్ణా! మము నగ్ని పీడితుల రక్షింపం దగు గావవే!

యనినం గన్నులు మీరు మోడ్పుఁ డిదె దావాగ్నిన్ వెస న్నార్తు నే

నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలాగతిన్. ( 180 )


క. మందుని గతి యమునాంబువు, లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా

నందుని వరుణుని బంధన, మందు నివృత్తునిఁగఁ జేసె హరి సదయుండై. ( 181 )


మ. మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృ ద్గుహ

శ్రయులంగా నొనరించి తత్ఫథము నీరంధ్రంబు గావించినన్

రయ మొప్పన్ గుటిలాసురాధమునిఁ బోరన్ ద్రుంచి గోపావళిన్

దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేత న్మాత్రమే? తాపసా! ( 182 )


క. దివిజేంద్ర ప్రీతిగ వ, ల్లవజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో

త్సవమున్ హరి మాన్చిన గో, పవరులు గావింపకున్నబలరిపుఁడలుకన్. ( 183 )


తే. మంద గొందలమంద నమందవృష్టి, గ్రందుకొనుఁడంచు నింద్రుండు మంద కంపె

జండ పవన సముద్ధూత చటులవిలయ, సమయ సంవర్తకాభీల జలధరములు. ( 184 )


శా. సప్తస్కంధ శిఖాకలాప రుచిమ త్సౌదామినీ వల్లికా

దీప్తదగ్ర ముహు ర్ముహుస్స్తనిత ధాత్రీభాగ నీరంధ్రమై

సప్తాశ్వస్ఫుర దిందుమండల నభ స్సంఛాది తాశాంతర

వ్యాప్తాంభోద నిరర్గళ స్ఫుట శిలా వా:పూర ధారాళమై. ( 185 )


వ. కురియు వానజల్లు పెల్లున రిమ్మలుగొని సొమ్మలువోయి గోప గోకులం బాకులంబు నొంది కృష్ణ! కృష్ణ! రక్షింపు; రక్షింపు మని యార్తిం బొందికుయ్యిడన య్యఖండ కరుణారస సముద్రుండు భక్తజన సురద్రుముండు నగు పుండరీ కాక్షుండు. ( 186 )


శా. సప్తాబ్దంబుల బాలుఁడై నిజ భుజా స్తంభంబునన్ లీలతో

సప్తాహంబులు శైల రాజ మచల చ్చత్రంబుగాఁదాల్చి సం

గుప్త ప్రాణులఁ జేసె మాధవుఁడు గో గోపాలక వ్రాతమున్

సప్తాంభోధి పరీత భూధరున కాశ్చర్యంబె! చింతింపఁగన్. ( 187 )


సీ. సాంద్ర శరచ్చంద్ర చంద్రికా ధవళిత విమల బృందావన వీథియందు

రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల జలజాక్షుఁ డొక నిశాసమయమునను

దనరారు మంద్ర మధ్యమ తారముల నింపు దళుకొత్త రాగ భేదములఁ దనరి

ధైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జ మధ్యమస్వరము లోలిఁ


తే. గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు, నాళ వివరాంగుళీ న్యాస లాలనమున

మహితగతిఁ బాడె నవ్యక్త మధురముగను, బంక జాక్షుండు దారువు లంకురింప. ( 188 )


మ. హరి వంశోద్గత మంజుల స్వర నినా దాహూతలై గోపసుం

దరు లేతేర ధనాధిపానుచర గంధర్వుండు గొంపోవఁ ద

త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ

బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్. ( 189 )


చ. నరక ముర ప్రలంబ యవన ద్విప ముష్టిక మల్ల కంస శం

బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్తృ వా

నర ఖర సాల్వ వత్స బక నాగ విడూరథ రుక్మి కేశి ద

ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. ( 190 )


వ. మఱియును, ( 191 )


మ. బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజతం గ్రూరులన్

ఖలులన్ దుష్ట ధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో

ర్బల కేళీం దునుమాడి సర్వధరణీ భారంబు మాయించి సా

ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్. ( 192 )


వ. అట్టి లోకోత్కష్డుం డైన కృష్ణుని యవతార మహాత్మ్యం బెఱింగించితి. ఇంక వ్యాసావతారంబు వినుము. ( 193 )


ఉ. ప్రత్యుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదౌ

ర్గత్యగులైన మర్త్యుల కగమ్యములై స్వకృతంబు నిత్యముల్

సత్యము నైన వేద తరుశాఖల దా విభజించి నట్టి యా

సాత్యవతేయ మూర్తియయిజాతము నొందె హరి ప్రసన్నుఁడై. ( 194 )


వ. మఱియు బుద్ధావతారంబు వినుము. ( 195 )


మ. అతిలోలాత్ము ల సూనృతోక్తులును వేదాచార సంశీలు రు

ద్థత పాషాండ మతౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా

దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం దదాచార సం

హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్దాకృతిన్ ( 196 )


వ. మఱియుం గల్క్యవతారంబు వినుము. ( 197 )


మ. వనజాక్ష స్తవ శూన్యులున్ వషడితి స్వాహాస్వధా వాక్య శో

భన రాహిత్యులు సూనృ తేతరులునుం బాషండులు న్నైన వి

ప్రనికాయంబును శూద్ర భూవిభులున్ బాటిల్లినన్ గల్కియై

జననం బంది యధర్మము న్నడఁచి సంస్థాపించు ధర్మం బిలన్. ( 198 )

వ. అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె. మునీంద్ర! పుండరీకాక్షుండంగీకరించు లీలావతార కథావృత్తాంతంబులు నే నీకు నెఱింగించు నింతకు మున్న హరి వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులు దీర్చె. మన్వంతరావతారంబులు నంగీకరించినవియు, నంగీకరింపం గలయవియునై యున్నవి. వర్తమానంబున ధన్వంతరి పరుశరామావతారంబులు దాల్చి యున్నవాఁడు. భావికాలంబున శ్రీరామా ద్యవతారంబుల నంగీకరింపం గలవాఁడు. అ మ్మహాత్ముండు సృష్ట్యాది కార్య భేదంబుల కొఱకు మాయా గుణావతారంబు నొందు. బహుశక్తి ధారణుండైన భగవంతుడు సర్గంబునం దపంబును, ఏనును, ఋషి గణంబులును, నవప్రజాపతులును నై యవతరించి విశ్వోత్పాదనంబు గావించు. ధర్మంబును , విష్ణుడును, యజ్ఞంబులును, మనువులును, ఇంద్రాది దేవగణంబును ధాత్రీపతులునై యవతరించి జగంబుల రక్షింపుచుండు. అధర్మంబును రుద్రుండును, మహోరగంబులును, రాక్షాసానీకంబులు నై విలయంబు నొందించు. ఇత్తెఱంగునం బరమేశ్వరుండును, సర్వాత్మకుండు నైన హరి విశ్వోత్పత్తిస్థితిలయ హేతుభూతుండై విలసిల్లు. ధరణీరేణువులైన గణుతింప నలవియగుం గాని యమ్మహాత్ముని లీలావతారాద్భుత కర్మంబులు లెక్క వెట్ట నెవ్వనికి నశక్యంబై యుండు. నీకు సంక్షేపరూపంబున నుపన్యసించితి. సవిస్తరంబుగా నెఱింగింప నాకుం దరంబు గాదు. అన్యులం జెప్పనేల? వినుము. 199


చ. అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన య మ్మహితాత్ము పాద వే

గమున హతంబులైన త్రిజగంబుల కావల నొప్పు సత్యలో

కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప

ద్మము తుదినున్న యప్రతిహతంబగు శక్తి గణింప శక్యమే! ( 200 )


మ. హరి మాయాబల మే నెఱుంగ నఁట శక్యంబే! సనందాది స

త్పురుష వ్రాతము కైన బుద్ధి నిరతంబున్ మాని సేవాధిక

స్ఫురణం ద చ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుం

దరతన్ బొల్పగు శేషుఁడు న్నెఱుఁగ డన్నన్ జెప్పలే రొండొరుల్. ( 201 )


చ. ఇతరము మాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా

శ్రిత జన సేవితాంఘ్ర సరసీరుహుఁ డైన సరోజనాభుఁ డం

చిత దయతోడ నిష్కపట చిత్తమునం గరుణించు నట్టి వా

రతుల దురంతమై తనరు న వ్విభు మాయఁ దరింతు రెప్పుడున్. (202 )


వ. మఱియును సంసారమగ్నులై దివసంబులు ద్రొబ్బి యంతంబున శునక సృగాల భక్ష్యంబు లైన కాయంబులందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన పుణ్యాత్ములు గొందఱు గలరు, ఎఱింగింతు వినుము. ఏను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి య మ్మహాత్ము పారారవిందంబుల భక్తి నిష్ఠుండనై, శరణాగతత్వంబున భజించు నప్పుడు దెలియదు. రాజసగుణుండనై తెలియఁజాల. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తి జ్ఞానయోగంబున సేవింతు. మఱియు (సనకాదులగు) మీరును, భగవంతుడైన రుద్రుండును, దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువ మనువును, అతని పత్ని యగు శతరూపయు, దత్పుత్రులగు (ప్రియవ్రతోత్తానపాదులను) వారలును, దత్పుత్రికలు, ప్రాచీనబర్హియు ఋభువును, వేనజనకుండగు నంగుండును, ధ్రువుండును గడవం జాలుదురు వెండియు. ( 203)


సీ. గాధి గయాదు లిక్ష్వాకు దిలీప మాం ధాతలు భీష్మ యయాతి సగర

రము ముచుకుం దైళ రంతిదే వోద్ధవ సారస్వ తోదంక భూరిషేణ

శ్రుతదేవ మారుతి శతధన్వ పిప్పల బలి విభీషణ శిబి పార్ధ విదురు

లంబరీష పరాశ రాలర్క దేవల సౌభరి మిథిలేశ్వ రాభిమన్యు


తే. లాష్ణిషేణాదు లైన మహాత్ము లెలమిఁ, దవిలి య ద్దేవు భక్తిఁ జిత్తముల నిలిపి

తత్పరాయణ భక్తి దుర్దాంతమైన, విష్ణుమాయఁ దరింతురు విమలమతులు. ( 204 )


మ. అనఘా వీరల నెన్న నేమిటికిఁ? దిర్య గ్జంతు సంతాన ప

క్షి నిశాటాటవి కాఘజీవ నివహ స్త్రీ శూద్ర హూణాదులై

నను నారాయణ భక్తియోగ మహితానందాత్ములై రేని వా

రనయంబున్ దరియింతు రవ్విభుని మాయావైభ వాంభోనిధిన్. ( 205 )


వ. కావున. ( 206 )


క. శశ్వ త్ప్రశాంతు నభయుని, విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్

శాశ్వతుసము సదసత్పరు, నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్ర! ( 207 )


వ. అట్లైన న ప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందం

జాలక వైముఖ్యంబునం దవ్వుదవ్వులఁ దలంగిపోవు మఱియు. ( 208 )


చ. హరిఁబరమాత్ము న చ్యుతు ననంతునిఁ జిత్తములోఁ దలంచి సు

స్థిరత విశోక సౌఖ్యముల జెందిన ధీనిధు లన్య కృత్యముల్

మఱచియుఁ జేయ నొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుఁడుం

బరువడి నుయ్యి ద్రవ్వుచు నిపాన ఖనిత్రము మానుకై వడిన్. ( 209 )


ఉ. సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుఁడు సర్వశక్తుఁడున్

సర్వ జగ త్పృసిద్ధుఁడును సర్వగతుం డగు చక్రపాణి యీ

సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై

పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్. (210)


ఉ. కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె

వ్వారును లేరు తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్

జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (211)


మ.నిగమార్ధ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్ర్తరా

జి గరిష్ఠంబగు నీ పురాణకధ సంక్షేపంబుగాఁ జెప్పితిన్

జగతి న్నీవు రచించు దీని నతివిస్తారంబుగాఁ బుత్రకా! (212)


చ.పురుషభవంబు నొందుట యపూర్వము జన్మములందు నందు భూ

సురకులమందుఁ బుట్టు టతిచోద్యమ యి ట్లగుటన్ మనుష్యుల

స్థిరమగు కార్యదుర్ధశల చేత నశింపక విష్ణుసేవనా

పరతఁ దనర్ఛి నిత్యమగు భవ్యపదంబును నొందు టొప్పదే! (213)


మ.ఉపవాస వ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా

జప దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర ద

చ్చపు భక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా

ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతని నర్ధిం గొల్వలేకుండినన్ (214)


క.వనజాక్షు మహిమ నిత్యము, వినుతింపుచు నొరులు వొగడ వినుచు న్మదిలో

ననుమోదింపుచు నుండెడి, జనములు ద న్మోహవశతఁ జనరు మునీంద్రా! (215)


క.అని వాణీశుఁడు నారద, మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకధా సూ

చన మతి భక్తిఁ బరీక్షి, జ్జనపాలునితోడ యోగిచంద్రుఁడు సెప్పెన్. (216)