4. బ్రహ్మదేవుఁడు నారదునకు విష్ణుతత్త్వంబు నెఱుకపఱచుట

వికీసోర్స్ నుండి

మ. అనఘా ! విశ్వమునెల్ల దీప్తముగఁ జే | యన్ నే సమర్థుండనే ?

యినచంద్రానల తారకాగ్రహగణం | బే రీతి నా రీతి నె

వ్వని దీప్తిం బ్రతిదీప్తమయ్యె భువన | వ్రాతంబు, తద్దీప్తిచే

ననుదీప్తంబగు నట్టి యీశ్వరున కే | నశ్రాంతమున్ మ్రొక్కెదన్. (82)


మ. వినుమా ! యీశ్వరు దృష్టిమార్గమున నా | వేశింప శంకించి సి

గ్గున సంకోచమునొందు మాయ వలనన్ | గుంఠీభవత్‌ప్రజ్ఞచే

నను లోకేశ్వరుఁడంచు మ్రొక్కు మతిహీ | నవ్రాతముం జూచి నే

ననిశంబు న్నగి ధిక్కరింతు హరిమా | యాకృత్యమంచున్ సుతా ! (83)


వ. మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును, జన్మనిమిత్తంబులైన కర్మంబులును, గర్మక్షోభకంబైన కాలంబును, గాలపరిణామహేతువైన

స్వభావంబును, భోక్తయైన జీవుండును వాసుదేవుండుగా నెఱుఁగుము. వాసుదేవవ్యతిరిక్తంబు లేదు. సిద్ధంబు. (నారాయణ నియమ్యంబులు లోకంబులు) దేవతలు

నారాయణ శరీరసంభూతులు. వేదయాగతపోయోగ గతివిజ్ఞానంబులు నారాయణపరంబులు. (జ్ఞానసాధ్యంబగు ఫలంబు నారాయణాధీనంబు) కూటస్థుండును,

సర్వాత్మకుండును, సర్వద్రష్టయు నైన యీశ్వరుని కటాక్షవిశేషంబున సృజియింపంబడి, ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజింపుచుండుదు. నిర్గుణుండైన యీశ్వరుని

వలన రజస్సత్త్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తిస్థితిలయంబులకుఁ బాలుపడి కార్యకారణకర్తృత్వభావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులును,

జ్ఞానమూర్తులైన దేవతలును, క్రియారూపంబులైన యింద్రియంబులును నాశ్రయంబులుగా నిత్యముక్తుండయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు. జీవులకు

నావరణంబులై యుపాధిభూతంబులైన మూఁడులింగంబులం జేసి పరులకు లక్షితంబు గాక తనకు లక్షితంబైన తత్త్వంబు గల యీశ్వరుం డివ్విధంబునఁ గ్రీడించుచుండు.

(84)


కం|| ఆ యీశుఁ డనంతుఁడు హరి, నాయకుఁ డీ భువనములకు | నాకున్ నీకున్

మాయకుఁ బ్రాణివ్రాతము, కే యెడలన్ లేదు నీశ్వ | రేతరము సుతా ! (85)


వ. వినుము. మాయావిభుండైన యీశ్వరుండు తన మాయం జేసి దైవయోగంబునం బ్రాప్తంబులైన కాలజీవాదృష్టస్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి

గైకొనియె. ఈశ్వరాధిష్ఠితంబైన మహత్తత్త్వంబు వలన (నగు కాలంబున గుణవ్యతికరంబును, స్వభావంబునఁ బరిణామంబును, జీవాదృష్టభూతంబైన కర్మంబున జన్మంబును

నయ్యె) రజస్సత్త్వంబులచే నుపబృంహితమై వికారంబు నొందిన మహత్తత్త్వంబు వలనం) దమఃప్రధానంబై ద్రవ్యజ్ఞానక్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు

రూపాంతరంబు నొందుచు ద్రవ్యశక్తియైన తామసంబు, క్రియాశక్తియైన రాజసంబు, జ్ఞానశక్తియైన సాత్త్వికంబు నన మూఁడువిధంబులయ్యె. అందు భూతాదియైన

తామసాహంకారంబు వలన నభంబు గలిగె. నభంబునకు సూక్ష్మరూపంబును, ద్రష్టృదృశ్యంబులకు బోధకంబైన శబ్దంబు గుణంబగు. నభంబు వలన వాయువు గలిగె.

వాయువునకుఁ బరాన్వయంబున శబ్దంబు, స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగియుండును. అది దేహంబునందుండుటం జేసి ప్రాణరూపంబై

యింద్రియమనశ్శరీరపాటవంబులైన యోఝస్సహోబలంబులకు హేతువై వర్తించు. వాయువు వలన రూపస్పర్శశబ్దంబులనియెడి గుణంబులు మూఁటితోడఁ దేజంబు

గలిగె. తేజంబు వలన రసరూపస్పర్శశబ్దంబులనియెడు నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె. జలంబు వలన గంధరసరూపస్పర్శంబులనియెడు

గుణంబులయిదింటితోడం బృథివి గలిగె. వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్రదైవతంబైన మనంబు గలిగె. మఱియు దిక్కులు, వాయువు, అర్కుఁడు, ప్రచేతస్సు,

అశ్వినులు, వహ్ని, ఇంద్రుండు, ఉపేంద్రుండు, మిత్రుండు, ప్రజాపతియు ననియెడి దశదేవతలు గలిగిరి. తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబు,

వాయుదైవతంబైన త్వగింద్రియంబు, సూర్యదైవతంబైన నయనేంద్రియంబు, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబు, అశ్వినిదైవతంబైన ఘ్రాణేంద్రియంబు, వహ్నిదైవతంబైన

వాగింద్రియంబు, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబు, ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబు, మిత్రదైవతంబైన గుదేంద్రియంబు, ప్రజాపతిదైవతంబైన గుహ్యేందియంబు ననియెడి

దశేంద్రియంబులును, బోధజనకాంతఃకరణైకభాగంబైన బుద్ధియుఁ గ్రియాజనకాంతఃకరణంబైన ప్రాణంబును గలిగె. ఇట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ

మనోగుణంబులు వేర్వేఱుగ (బ్రహ్మాండశరీరనిర్మాణంబునం దసమర్థంబులగునపుడు భగవచ్ఛక్తిప్రేరితంబులగుచు నేకీభవించి సమష్టివ్యష్ట్యాత్మకత్వంబు నంగీకరించి)

చేతనాచేతనంబులం గల్పించె. అట్టి యండంబు వర్షాయుత సహస్రాంతంబు దనుక జలంబునందుండె. (కాలకర్మస్వభావంబులం దగులువడక సమస్తమును

జీవయుక్తముగఁ జేయు నీశ్వరుం డచేతనంబును సచేతనంబుగ నొనర్చె) అంతఁ గాలకర్మస్వభావప్రేఅకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య

స్థితంబైన బ్రహ్మాండంబులోను జొచ్చి సవిస్తరంబుఁ గావించి, (యట్టి యండంబు భేదించి నిర్గమించె నెట్లంటేని) (86)


కం|| భువనాత్మకుఁడా యీశుఁడు, భవనాకృతితోడ నుండు బ్రహ్మాండబున్

వివరముతోఁ బదునాలుగు, వివరంబులుగా నినర్చె | విశదంబులుగాన్. (87)


మ. బహుపాదోరుభుజాననేక్షణ శిరః | ఫాలశ్రవోయుక్తుఁడై

విహరించున్ బహుదేహిదేహగతుఁడై | విద్వాంసులూహించి త

ద్బహురూపావయవంబులన్ భువన సం | పత్తిన్ విచారింతురా

మహనీయాద్భుతమూర్తి యోగిజన హృ | న్మాన్యుండు మేధానిధీ ! (88)


వ. వినుము చతుర్దశలోకంబులందు మీఁది యేఁడులోకంబులు శ్రీమహావిష్ణువునకుఁ గటిప్రదేశంబున నుండి యూర్ధ్వదేహమనియును, గ్రింది యేఁడులోకంబులు

జఘనంబున నుండి యధోదేహమనియునుం బలుకుదురు. ప్రపంచశరీరకుండగు భగవంతుని ముఖంబు వలన బ్రహ్మకులంబు, బాహువుల వలన క్షత్త్రియకులంబు,

ఊరువుల వలన వైశ్యకులంబు, పాదంబు వలన శూద్రకులంబు జనియించెనని చెప్పుదురు. భూలోకంబు కటిప్రదేశంబు. భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు,

మహర్లోకంబు పక్షంబు, జనలోకంబు గ్రీవంబు. తపోలోకంబు స్తనద్వయంబు. సనాతనంబును బ్రహ్మనివాసంబును నైన సత్యలోకంబు శిరంబు. కటిప్రదేశంబతలంబు.

తొడలు వితలంబు. జానువులు సుతలంబు. జంఘలు తలాతలంబు. గుల్ఫంబులు మహాతలంబు. పాదాగ్రంబులు రసాతలంబు. పాదతలంబు పాతాళంబు నని

(లోకమయుం గా) భావింతురు. కొందఱు మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, శిరంబు వలన స్వర్లోకంబును గలిగెనని

లోకకల్పనంబు నెన్నుదురు. (89)


అధ్యాయము-౬[మార్చు]

ఆ|| నీలకంధరునకు | నీకు నాకు సనత్కు,మార ముఖ్య సుత స | మాజమునకు

ధర్మసత్త్వబుద్ధి | తత్త్వములకు నీశ్వ, రాత్మ వినుము పరమ | మైన నెలవు. (90)


సీ|| నర సురాసుర పితృ | నాగకుంజర మృగ, గంధర్వ యక్షరా | క్షస మహీజ

సిద్ధ విద్యాధర | జీమూత చారణ, గ్రహ తారకాప్సరో | గణ విహంగ

భూత తటిద్వసు | పుంజములును నీవు, ముక్కంటియును మహా | మునులు నేను

సలిల నభః స్థల | చరములు మొదలైన, వివిధ జీవులతోడి | విశ్వమెల్ల

ఆ|| విష్ణుమయము పుత్త్ర ! వేయేల ? బ్రహ్మాండ, మతని జేనలోన | నణఁగియుండు

బుద్ధి నెఱుఁగరాదు | భూత భవద్భవ్య, లోకమెల్ల విష్ణు | లోన నుండు. (91)


కం|| మండలములోన భాస్కరుఁ డుండుచు జగములకు దీప్తి | నొసఁగెడి క్రియ బ్ర

హ్మాండము లోపల నచ్యుతుఁ డుండును బహిరంతరముల | నొగి వెలిఁగించున్. (92)


ఈ క్రింది పద్యము నుండి వెలిగందల నారయ కవిత్వము[మార్చు]

ఉ|| అట్టి యనంతశక్తి జగ | దాత్ముని నాభిసరోజమందు నేఁ

బుట్టి యజింపఁగా మనసు | పుట్టిన యజ్ఞపదార్థజాతముల్

నెట్టనఁ గానరామికిని | నిర్మలమైన తదీయరూపమున్

గట్టిగ బుద్ధిలో నిలిపి | కంటి నుపాయము నా మనంబునన్. (93)


సీ|| పశుయజ్ఞవాట యూ | ప స్థంభ పాత్ర మృ, ద్ఘట శరావ వసంత | కాలములును

స్నేహౌషధీ బహు | లోహ చాతుర్హోత్ర, మత నామధేయ స | న్మంత్రములును

సంకల్ప ఋగ్యజు | స్సామ నియుక్త వ, షట్కార మంత్రాను | సరణములును

దక్షిణల్ దేవతా | ద్యనుగత తంత్ర వ్ర,తోద్దేశ ధరణీ సు | రోత్తమాదు

తే|| లర్పణంబులు బోధాయనాది కర్మ, సరణి మొదలగు యజ్ఞోప | కరణ సమితి

యంతయును నమ్మహాత్ముని | యవయవములు, గాఁగఁ గల్పించి విధివత్‌ప్ర | కారమునను. (94)


కం|| యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞభోక్త | యగు భగవంతున్

యజ్ఞపురుషుఁ గా మానస, యజ్ఞముఁ గావించితిం ద | దర్పణబుద్ధిన్. (95)


కం|| అప్పుడు బ్రాహ్మణులెల్లం, దప్పక ననుఁ జూచి సముచి | త క్రియులగుచో

నప్పరమేశున కభిమత, మొప్పఁగ దగు సప్తతంతు | వును గావింపన్. (96)


చ|| మనువులు దేవదానవులు | మానవనాథులు మర్త్యకోటి దా

రనయము వారివారికిఁ బ్రి | యంబగు దేవతలన్ భజింపుచున్

ఘనతరనిష్ఠ యజ్ఞములు | గైకొని చేసిరి తత్ఫలంబు ల

య్యనుపమమూర్తి యజ్ఞమయుఁ | డైన రమావరునందుఁ జెందఁగన్. (97)


కం|| సువ్యక్త తంత్రరూపకుఁ డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ | డచ్యుతుఁ డీశుం

డవ్యయుఁడగు హరి సురగణ, సేవ్యుఁడుఁ గ్రతుఫలదుఁడగుటఁ | జేసిరి మఖముల్. (98)


కం|| అగుణుండగు పరమేశుఁడు, జగములు గల్పించుకొఱకుఁ | జతురత మాయా

సగుణుండగుఁ గావున హరి, భగవంతుండనఁగఁ బరఁగె | భవ్యచరిత్రా | (99)


కం|| విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు, విశ్వమయుం డఖిలనేత | విష్ణుం డజుఁడీ

విశ్వములోఁ దా నుండును, విశ్వము తనలోనఁ జాల | వెలుఁగుచు నుండన్. (100)


చ|| అతని నియుక్తిఁ జెంది సచ | రాచర భూతసమేత సృష్టి నే

వితతముగా సృజింతుఁ బ్రభ | విష్ణుఁడు విష్ణుఁడు ప్రోఁచుఁ బార్వతీ

పతి లయమొందఁజేయు హరి | పంకరుహోదరుఁ డాదిమూర్తి య

చ్యుతుఁడు త్రిశక్తియుతుఁ డగు | చుండు నిటింతకుఁ దాన మూలమై. (101)


కం|| విను వత్స ! నీవు నన్నడి, గిన ప్రశ్నకు నుత్తరంబు | కేవల పరమం

బును బ్రహ్మంబీ యఖిలం, బునకగు నాధారహేతు | భూతము సుమ్మీ. (102)


కం|| హరి భగవంతుఁ డనంతుఁడు, కరుణాంబుధి సృష్టికార్య | కారణహేతు

స్ఫురణుం డవ్విభు కంటెం, బరుఁ డన్యుఁడు లేఁడు తండ్రి | పరికింపంగన్. (103)


సీ|| ఇది యంతయును నిక్కమే బొంక నుత్కంఠ, మతిఁ దద్గుణధ్యాన | మహిమఁ జేసి

పలికింప నేనేమి పలికిన | నది యెల్ల సత్యంబ యగు బుధ | స్తుత్య ! వినుము

ధీయుక్త ! మామకేం | ద్రియములు మఱచియుఁ బొరయ వసత్య వి | స్ఫురణమొందు

నది గాక మత్తను | వామ్నాయ తుల్యంబు, నమరేంద్ర వందనీ | యంబు నయ్యె

తే|| దవిలి యద్దేవదేవుని | భవ మహాబ్ది, తారణంబును మంగళ | కారణంబు

నఖిల సంపత్కరంబునై | యలరు పాద, వనజమున కే నొనర్చెద | వందనములు. (104)


ఉ|| ఆ నలినాక్షు నందనుఁడ | నయ్యు, సమస్త విరాగయోగ వి

ద్యానిపుణుండ నయ్యును బ | దంపడి మజ్జననప్రకారమే

యేను నెఱుంగ నవ్విభుని | యిద్ధమహత్త్వమెఱుంగనేర్తునే ?

కానఁబడున్ రమేశ పరి | కల్పితవిశ్వము కొంతకొంతయున్. (105)


మ|| విను వేయేటికిఁ ? దాపసప్రవర ! య | వ్విశ్వామిత్రుఁ డీశుండు తాఁ

దన మాయామహిమాంతముం దెలియఁగాఁ | దథ్యంబు తాఁ జాలఁ డ

న్నను నేనైనను మీరలైన సురలై | నన్ వామదేవుండు నై

నను నిక్కం బెఱుగంగఁ జాలుదుమె వి | జ్ఞాన క్రియాయుక్తులన్ ? (106)


వ. అమ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండంటేని, (107)


కం|| గగనము తన కడపలఁ దాఁ దగ నెఱుఁగని కరణి విభుఁడు | దా నెఱుఁగఁడనన్

గగన ప్రసవము లేదన, నగునే సర్వజ్ఞతకును | హాని దలంపన్. (108)


చ|| తలకొని యమ్మహాత్మకుఁడు | తాల్చిన యయ్యవతార కర్మముల్

వెలయఁగ నస్మదాదులము | వేయి విధంబుల సన్నుతింతు మ

య్యలఘు ననంతునిం జిదజి | దాత్మకు నాద్యు ననీశు నీశ్వరున్

దెలియఁగ నేర్తుమే ? తవిలి | దివ్యచరిత్రునకేను మ్రొక్కెదన్. (109)


మ|| పరమాత్ముం డజుఁ డీ జగంబు ప్రతి క | ల్పంబందుఁ గల్పించుఁ దా

బరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ | బ్రహ్మాత్ము నిత్యున్ జగ

ద్భరితున్ గేవలు నద్వితీయుని విశు | ద్ధజ్ఞాను సర్వాత్ము నీ

శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శ | శ్వన్మూర్తిఁ జింతించెదన్. (110)


చ|| సరసగతిన్ మునీంద్రులు ప్ర | సన్న శరీర హృషీకమానస

స్ఫురణ గలపు డవ్విభుని | భూరికళా కలిత స్వరూపముం

దరమిడి చూతురెప్పుడు కు | తర్క తమోహతి చేత నజ్ఞతన్

బొరసిన యప్పు డవ్విభుని | మూర్తిఁ గనుంగొనలేరు నారదా ! (111)


వ. అని వెండియు నిట్లనును. "అనఘా ! ఇమ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతిప్రవర్తకంబగు నాదిపురుషు రూపంబగు.

అందుఁ గాలస్వభావంబులను శక్తులుదయించె. అందుఁ గార్యకారణ రూపంబైన ప్రకృతి జనించె. ప్రకృతి వలన మహత్తత్త్వంబును దాని వలన నహంకార త్రయంబునుం బుట్టె.

అందు రాజసాహంకారంబు వలన నింద్రియంబులును, సాత్త్వికాహంకారంబు వలన నింద్రియగుణ ప్రధానంబులైన యధిదేవతలును, దామసాహంకారంబు వలన

భూతకారణంబులైన శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రంబులును బొడమె. పంచతన్మాత్రంబుల వలన గగనానిల వహ్నిసలిల ధరాదికమైన భూతపంచకంబు గలిగె. అందు

జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణంబులును, గర్మేంద్రియంబులైన వాక్పాణి పాయూపస్థలును, మనంబును జనించె. అన్నింటి సంఘాతంబున

విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె. ఆతని వలన స్వయంప్రకాశుండైన స్వరాట్టు సంభవించె. అందుఁ జరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు గలిగె.

అందు సత్త్వ రజస్తమో (గుణాత్మకులమైన విష్ణుండును హిరణ్యగర్భుండనైన యేనును రుద్రుండును గలిగితిమి) అందు సృష్టిజననకారణుండయిన చతుర్ముఖుండు పుట్ట,

వాని వలన దక్షాదులగు ప్రజాపతులు తొమ్మండ్రు కలిగిరి. అందు భవత్‌ప్రముఖులైన సనక సనందనాది యోగీంద్రులును, నాకలోక నివాసులైన వాసవాదులును,

ఖగలోకపాలకులగు గరుడాదులును, నృలోకపాలకులగు మాంధాతృప్రభృతులును, రసాతల లోకపాలకులగు ననంతవాసుకి ప్రభృతులును, గంధర్వ సిద్ధ విద్యాధర చారణ

సాధ్య రక్షో యక్షోరగ నాగలోకపాలురును, మఱియు ఋషులును, బితృదేవతలును, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూశ్మాండ పశు మృగాదులు నుద్భవించిరి. ఇట్టి

జగత్ప్రథమోద్భవంబు మహత్తత్త్వసృష్టి యనంబడు. ద్వితీయం బండసంస్థితం బనందగు. తృతీయంబు సర్వభూతస్థం బన నొప్పు. అం దైశ్వర్య తేజో బల సంపన్నులైన

పురుషులు సర్వాత్ముండైన నారాయణుని యంశసంభవులుగా నెఱుంగుము. అప్పుండరీకాక్షుని లీలావతారంబు లనంతంబులు. తత్కర్మంబులు లెక్కవెట్ట నెవ్వఱికి నలవి

గాదు. ఐనను నాకుఁ దోచినంత నీ కెఱింగించెద, వినుము. (112)