26. శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట మఱియు స్కంధాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సీ. ప్రతినిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిఁ జుక్క వెలుపల మఱుచువాఁడు

కమలంబుమీఁది భృంగములకైవడి మోముపైన నెఱపిన కేశపటలివాఁడు

గిఱివ్రాసి మాయ నంగీకరించనిభంగి వసనంబు గట్టక వచ్చువాఁడు

సంగిగాఁడని వెంటఁ జాటు భూతములు నా బాలుర హాసశబ్దములవాఁడు

తే. మహిత పద జాన జంఘోరు మధ్య హస్త, బాహు వక్షో హళానన ఫాల కర్ణ

నాసిగా గండమస్తక నయనయుగళుఁడైన యవధూతమూర్తి వాఁడరుగుదెంచె. ( 514)


ఉ. ఈరసలోకులం గినిసి యెగ్గులు వల్కనివాఁడు గోరికల్

గోరనివాఁడు గూటువలఁ గూడనివాఁడు వృథాప్రపంచమున్

జేఱనివాఁడు దైవగతఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై

నేఱనివాని చందమున నేర్పులు సూపెడువాఁడు వెండియున్. (515)


ఆ. అమ్మహాత్ము షోడశాబ్ద వయో రూప, గమన గుణ విలాస కౌశలములు

ముక్తికాంత సూచి మోహిత యగు నన, నితర కాంతలెల్ల నేమి చెప్ప ! (516)


ఆ. వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై, బ్రహ్మభావమునను బర్యటింప

వెఱ్ఱియనుచు శుకుని వెంట నేతెంతురు, వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు . (517)


వ. ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లా మహానుభావుని ప్రభావంబు తెఱం గెఱుంగుదురు గావున నిజాసనంబులు విడిచి ప్రత్యుత్థానంబు సేసిరి. పాండవపౌత్రుండు నా యోగిజన శిఖామణికి నతిథిత్కారంబు గావించి దండప్రణామంబు సేసి పూజించె. మఱియు గ్రహ నక్షత్రతారకా మధ్యంబునం దేజఱిల్లు రాకాసుధాకరుండునుం బోలె బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి మధ్యంబునం గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రం గనుంగొని. (518)


ఉ. ఫాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూ

పాలకులోత్తముండు కరపద్మములన్ ముకళించి నేఁడు నా

పాలిటి భాగ్య మెట్టిదియొ ! పావనమూర్తివి పుణ్యకీర్తి వీ

వేళకు నీవువచ్చితి వివేక విభూషణ ! దివ్యభాషణా ! (519)


మ. అవనిభూతోత్తమ ! మంటి నేఁడు నిను డాయం గంటి నీవంటి వి

ప్రవరున్ బేర్కొను నంతటన్ భసితమౌ పాపంబు నా బోఁటికిన్

భవదాలోకన భాషణార్చన పద ప్రక్షాళన స్పర్శనా

ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపగ నాశ్చర్యమే ? (520)


క. హరిచేతను దనుజేంద్రులు, ధర మ్రగ్గెడుభంగి నీ పదస్పర్శముచే

గురు పాతకసంఘంబులు, పొఱిమాలుఁగదయ్య యోగిభూషణ ! వింటే . (521)


మ. ఎలమిన్ మేనమఱందియై సచిపుఁడై యే మేటి మా తాతలన్

బలిమిన్ గావి సముద్రముద్రిత ధరం బట్టంబు గట్టించె న

య్యలఘం డీశుఁడు చక్రి రక్షకుఁడు నా కన్యుల్ విపద్రక్షకుల్

గలరే ? వేఁడెదా భక్తి నా గుణనిధిం గారుణ్య వారాన్నిధిన్. (522)


సీ. అవ్యక్త మార్గుఁడు వైన నీ దర్శన మాఱడిఁ బోనేర దభిమతార్థ

సిద్ధి గావించుట సిద్ధంబు నేఁడెల్లి దేహంబు వర్జించు నేమి వినిన

కేమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన

నేమి సేవించిన నెన్నఁడు సంసార పద్ధతిఁ దాసిన పదవి గలుగు

తే. నుండుమనరాదు గురుఁడవు యోగివిభుఁడ, వరయ మొదవున బిదికిన యంత

తడవుగాని దెస నుండవు కరణతోఁడ, జెప్పవే తండ్రి ముక్తికిఁజేరుతెరువు. (523)


వ. అని పరీక్షిన్న రేంద్రుండు బాదరాయణి నడిగె నని చెప్పి. (524)


క. రాజీవపత్ర లోచన ! రాజేంద్ర కిరీటఘటిత రత్న మరీచి

భాజిత పాదాంభోరుహ ! భూజనమందార ! నిత్య పుణ్యవిచారా ! (525)


మాలిని. అనుపమ గుణహారా ! హన్యమానారివీరా !

జన వినుత విహారా ! జానకిఇ చిత్త చోరా !

దనుజ ఘనసమీరా ! దానవ శ్రీ విదారా !

ఘన కలుషకఠోరా ! కంధి గర్వాపహారా ! (526)


గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర, కేసనమంత్రి పుత్త్ర, సహజపాండిత్య, పోతనామాత్య ప్రణీతంబైన, శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు, నైమిశారణ్య వర్ణనంబున, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణావతార సూచనంబు సేయుటయు, వ్యాసచింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృత్తాంతంబును, పుత్రశోకాతురయైన ద్రుపద రాజనందన కర్ణునుం డశ్వత్థామను దెచ్చి యొప్పగించి విడిపించుటయు, భీష్మ నిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాటకన్యకాగర్భ పీడ్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబువలనం బాసి విష్ణుండు రక్షించుటయు, పరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదుర నిర్గమంబును, నారదుండు ధర్మజునికిఁ గాలసూచనంబు సేయుటయు, కృష్ణావతార విసార్జనంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, దిగ్విజయంబు సేయుచు నభిమన్యుపుత్రుండు శూద్రరాజ లక్షణుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గో వృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగిశాపభీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకదర్శనంబు సేసి మోక్షోపాయం బడుగుట నను కథలగల ప్రథమస్కంధము సంపూర్ణము. (527)


                        "ప్రథమస్కంధము సమాప్తము"
                            హరిః ఓమ్ తత్సత్