25. పరీక్షి న్మహారాజు విప్రళాపంబు నెఱింగి ప్రాయోపవిష్ణుం డగుట
ఉ. ఏటికి వేఁటఁ బోయితి ? మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి ? నే
డేటికిఁ బాపసాహసము లీక్రియఁ జేసితి ? దైవయోగమున్
దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై. (487)
ఉ. పాము విషాగ్ని కీలలను లేఁగిన నేఁగుఁ గాక యీ
భూమియు రాజ్యమున్ సతులు లోగముఁ బోయినఁ బోపుఁ గాక సౌ
దామినిఁ బోలు జీవనముఁ తథ్యముఁ దలపోసి యింక నే
నేమని మాఱు దిట్టుదు ? మునీంద్రకుమారకు దుర్నివారకున్ . (488)
ఆ. రాజు ననుచుఁ బోయి రాజ్యగర్వంబున, వనము కొఱకు వారి వనము సొచ్చి
దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ, బొలియఁ దిట్ట కేల పోవు ? సుతుఁడు. (489)
క. గోవులకున్ బ్రాహ్మణులకు, దేవతలకు నెల్లప్రొద్దుఁ దెంపునఁ గీడుం
గావించు పాప మానస, మే విధమునఁ, బుట్టకుండ నే వారింతున్. (490)
వ. అని వితర్కించె. (491)
క. దామోదర పదభక్తిం, గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్
భూమీశుఁ డలుగఁ డయ్యెను, సామర్థ్యము గలిగి దోషసంగిన్ శృంగిన్ (492)
వ. అంత మునికుమారుండు శపించిన వృత్తాంత మంతయు నిట్లు వితర్కించి, తక్షక వ్యాళ విషానల జ్వాలా జాలంబునం దనక సప్తమ దినంబున మరణం బమి యెఱింగి, భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబు లని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించికొని. (493)
మ. తులసీ సంయుత దైత్యజి త్పదరజ స్త్సోమంబు సంటెన్ మహో
జ్జ్వలమై దిక్పతిసంఘ సంయుత జన త్సౌభాగ్య సంధాయియై
కలిదోషావళి నెల్లఁ బాపు దివిష ద్గంగా ప్రవాహంబు లో
పలికిం బోయి మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్ . (494)
క. చిత్తము గోవింద పదా, యత్తముఁ గావించి మౌనియై తనలో నే
తత్తఱము లేక భావర, సత్తముఁడు వసించె ముక్త సంగత్వమునన్ . (495)
వ. ఇట్లు పాండవ పౌత్రుండు ముకుంద చరణారవింద వందనానంద సందాయమాన మానసుండై విష్ణుపదీ తీరంబునం బ్రాయోపవేశంబున నుండుట విని ( సకలలోక పావన మూర్తులు మహానుభావిలు నగుచుఁ దీర్థంబునకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులై యత్రి, విశ్వామిత్ర , భృగు , వసిష్ఠ , పరాశర , (వ్యాస) భరద్వాజ , పరశురామ , దేవల , గౌతమ , మైత్రేయ , కణ్వ , కలశసంభవ , నారద , పర్వతాదు లైన బ్రహ్మర్షి , దేవర్షి , రాజర్షి , పుంగవులు , కాండఋషులైన యరుణాదులు, మఱియు నానాగోత్ర సంజాతులైన ఋషులును * ( శిష్య ప్రశిష్యసమేతులై ) యేతెంచిన వారలకు దండ ప్రణామంముల సేసి కూర్చుండ నియోగించి . (496)
క. క్రమ్మఱ నమ్మునివరులకు, నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతుల్
గ్రమ్మఁగ ముకుళితకరుఁడై, సమ్మతముగఁ జెప్పె నాత్మ సంచారంబున్ . (497)
ఉ. ఓపిక లేక చచ్చిన మహోరగముం గొనివచ్చి కోపినై
తాపసు మూఁపుపై నిడిన దారుణచిత్తుఁడ మత్తుఁడన్ మహా
పాపుఁడ మీరు పాపతృణ పావకు లుత్తము లయ్యలార ! నా
పాపము వాయు మార్గముఁ గృపాపరులార ! విధించి 1చెప్పరే ! (498)
ఉ. భూసురపాద దేణువులు పుణ్యులఁ నరేంద్రులన్ భరి
త్రీసురులార ! మీ చరణరేణు కణంబులు మేనుసోక నా
చేసిన పాప పంతయు నశించెఁ గృతార్థుఁడనైతి నెద్ది నేఁ
జేసిన ముక్తి పద్ధతికిఁ జెచ్చెర బోవఁగవచ్చుఁ జెప్పరే . (499)
క. భీకరతర సంసార, వ్యాకులతన్ విసిగి దేహవర్ణనగతి నా
లోకించు నాకుఁ దక్షక, కాకోదర విషము ముక్తికారణ మయ్యెన్ . (500)
క. ఏపార నహంకార, వ్యాపారమునందు మునిఁగి వర్తింపంగా
నాపాలిటి హరి భూసుర, శాప వ్యాజమున ముక్తిసంగునిఁ జేసెన్ . (501)
మ. ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ
శ్వర సంకల్పము నేఁడు మానదు భవిష్య జ్జన్మ జన్మంబులన్
హరి చింతా రతియున్ హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్
హరి పాదాంబుజ సేవయున్ గలుగ మీ రర్థిన్ బ్రసాదింపరే . (502)
క. చూడఁడు నా కల్యాణము, పాడుఁడు గూవిందు మీఁది పాటలు దయతో
నాడుఁడు హరి భక్తిల కథ, లే డహములలోన ముక్తి కేఁగఁగ నిచటన్. (503)
క. అమ్మా ! నినుఁ జూచిన నరుఁ , బొమ్మాయని ముక్తికడకుఁ బుత్తువఁట కృపన్
లెమ్మా నీ రూపముతో, రమ్మా నా సెదురు గంగ ! రమ్యతరంగా ! (504)
వ. అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరబులందైన సర్వజంతు సౌజన్యంబు సంధిల్లుంగాక యని, గంగా తరంగిణీ దక్షిణ కూలంబునన్ బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి రాజ్యధారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునకుఁ దప్పించి, చిత్తంబు హరికి నిప్పించి, పరమ భాగవతుండైన పాండవ పౌత్రుండు ప్రాయోపవిష్ణుండైయున్న సమయంబున. (505)
క. ఒత్తిలి పొగడుచు సురలు వి, యత్తలమున నుండి మెచ్చి యలరుల వానల్
మొత్తములై కురిసిరి నృప, సత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్ . (506)
వ. ఆ సమయంబున సభాసీనులైన ఋషు లిట్లనిరి. (507)
మ. క్షితినాథోత్తమ ! నీ చరిత్రము మహాచిత్రంబు మీ తాత లు
గ్ర తపోధన్యులు విష్ణూపార్శ్వ పదవిన్ గావించి రాజన్య శో
భిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రు
న్నతులై నీపు మహోన్నతుండవుగదా ! నారాయణధ్యాయివై. (508)
మ. వసుధాధీశ్వర ! నీవు మర్త్యతనువున్ వెర్జించి నిశ్శోకమై
వ్యసన చ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు స
ర్వసమత్వంబునఁ జేరు నంతకు భవద్వాక్యంబులన్ వించు నే
దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్. (509)
వ. అని యిట్లు పక్షపాత శూన్యంబులును మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు మూఁడులోకంబులకు నవ్వలి దైన సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునన్ దేజరిల్లుచున్న ఋషులం జూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూహలుండై నమస్కరించి యిట్లనియె . (510)
క. ఏడుదినంబుల ముక్తిం, గూడఁగ నేరీతి వచ్చు గురు సంసార
క్రీడన మేక్రియ నెడతెగుఁ జూడుఁడు మా తండ్రులార ! శ్రుతివచనములన్. (511)
శా. ప్రాప్తానందులు బ్రహ్మబోభన కళాపారీణు లాత్మప్రభా
లిప్తాజ్ఞానులు మీరు లార్యులు దయాశుత్వాభిరాముల్ మనో
గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా !
సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిన్ జర్చించి భాషింపరే. (512)
వ. అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ ప్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున. (513)
"సమాప్తము"