23. పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనంబు సేయుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ. అని యిట్లు ధర్మ భూదేవతల బుజ్జగించి మహారథుండైన విజయపౌత్రుండు గ్రొక్కాఱు మెఱుంగు చక్కఁదనంబు ధిక్కరించి, దిక్కులకు వెక్కసంబైన యడిదంబు బెడిదంబు ఝళిపించి, పాపహేతువైన కలి రూపమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపం బుడిగి, వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై హస్తంబుసాఁచి తత్పాదమూల విన్యస్తమస్తకుండై ప్రణామంబు సేసి, (428)


క. కంపించె దేహమెల్లం, జంపకు మో రాజితిలక ! శరణాగతు ర

క్షింపు మని తనకు మ్రొక్కినఁ, జంపక కలిఁ జూచి నగుచు జనపతి పలికెన్ (429)


క. అర్జునకీర్తి సమేతుం డర్జునపౌత్రుండు భయరసావృతజనులన్

నిర్జతులఁ జంప నొల్లఁడు, దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా ! (430)


వ. నీవుపాపబంధుండవు. మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువ వలదు. రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచారమాయా కలహ కపట కలుషాలక్ష్మాదు లాశ్రయుంచు. ( సత్య ధర్మంబులకు ) నిహసంబగు బ్రహ్మావర్తదేశంబున యజ్ఞవిస్తారనిపుణులైనవారు యజ్ఞేశ్వరుండైన హరిం గూర్చి యాగంబు సేయుచున్నవారు. యజించువారలకు సుఖప్రదానంబు సేయుచు, సకల భూతాంతర్యామియై భగవంతుండైన జంగమస్థావరంబులకు నంతరంగ బహిరంగంబుల సంచరించు వాయువుచందంబున, నాత్మరూపంబున మనోరథంబు నిచ్చుఁ గావున నిం దుండవలవదనుచు దండహస్తుండైన జమునికైవడి మండలాగ్రంబు సాఁచిన రాజునకుం గలి యిట్లనియె . (431)


క. జగతీశ్వరా ! నీ యడిదము, ధగధగిత ప్రభలతోడఁ దఱచుగ మెఱయన్

బెగడెం జిత్తము గుండెలు, వగిలెడి నిఁక నెందుఁ జౌత్తు ధావింపఁగదే ! (432)


వ. నరేంద్రా ! నిను (నారోపిత శరశరాసునిఁగ ) సర్వప్రదేశంబులందును విలోకింపుచు నున్నవాఁడా నే నెక్కడనుండుదు నాన తిమ్మనిన రాజన్యశేఖరుండు ప్రాణివధ స్త్రీ ద్యూత పానంబు లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చు, మఱియు నడిగిన సువర్ణ మూలంబగు నసత్య మద కామ హింసా వైరంబు లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితర స్థలంబుల స్పృశియింపకుండ నియమించె. ఇట్లు కలి నిగ్రహంబుచేసి, హీనంబులైన తపశ్శౌచ దయ లనియెడు మూఁడు పాదంబులు వృషభమూర్తియైన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరంబైన సంతోషంబు సంపాదించి . (433)


క. గజనామధేయ పురమున, గజరిపుపీఠమున ఘనుఁడు గలిమర్దనుఁడున్

గజవైరి పరాక్రముఁడై, గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవరలకక్ష్మిన్ .(434)

                           "అధ్యాయము-18"


వ.ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబువలన బ్రతికి పరీక్షిన్న రేంద్రుండు బ్రాహ్మణశాప ప్రాప్త తక్షకధయంబువలనఁ బ్రాణంబులు వోవునని యెఱింగి, సర్వసంగంబులు వర్జించి, శుకునకు శిష్యుండీ, విజ్ఞానంబు గలిగి గంగాతరంగిణీ తీరంబునం గళేబరము విడిచె వినుఁడు. (435)


క. హరివార్త లెఱఁగువారికి, హరిపదములు దలఁచువారి కనవరతంబున్

హరికథలు వినెడివారికి, మరణాగత మోహసంభ్రమము లే దనఘా ! (436)


క. శుభచరితుఁడు హరి యరిగినఁ బ్రభవించి ధరిత్రినెల్లఁ బ్రబ్బియుఁ గలి దా

నభిమన్యుసుతుని వేళను, బభవింపక యణఁగియుండె భార్గవముఖ్యా ! (437)


వ. ఇవ్వధంబునఁ జతుస్సముద్ర ముద్రితాల్హిల ,అహీమండల సామ్రాజ్యంబు పుజ్యంబుగాఁ జేయుచు నభిమన్యుపుత్రుండు. (438)


ఉ. చేసినఁగాని పాపములు సెందవు చేయఁదలచి  ! నంతటన్

జేసెద నన్నమాత్రమునఁ జెండుఁగదా ! కలివేళ పుణ్యముల్

మోసము లేదటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్ మరంద ము

ల్లాసముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటి కైవడిన్. (439)


వ. మఱియుం బ్రమత్తులై యధీరులగు వారలయంచు వృకంబుచందంబున నొదిగి లాచుకొనియుండి చేష్టించుఁ గాని, ధీరులైనవారికిం గలివలని భయమ్బులేదని కలి నంతంబు నొందింపఁడయ్యె. అనిన విని సూతున కిట్లనిరి. (440)


సీ. పౌరాణికోత్తమ ! బ్రదుకుము పెక్కేండ్లు తామరసాక్షుని ధవళయశము

మరణశీలురమమైన మా కెఱింగించితి కల్పతంబగు క్రతుకర్మమందు

బొగలచే బొగలి యబుద్ధచిత్తులమైన మము హరిపదపద్మ మధురసంబు

ద్రావించితివి నీవు ధన్యుల మైతిమి స్వర్గమేనియు నపసర్గమేని

తే. భాగవత సంగలవభఅగ్య ఫలముకిఇడె ? ప్రకృతిగుణహీనుఁడగు చక్రిభద్రగుణము

లీశ కమలాసనాదులు నెఱుఁగలేరు, వినియు వినఁజాలననియెడి వెఱ్ఱిగలఁడె ? (441)


క. శ్రీపంబులు ఖండిత సం, తాపంబులు గల్మషాంధతమస మహూద్య

ద్దీపంబులు పాషండ దు, రాపంబులు విష్ణువందనాలాపంబుల్ . (442)


క. పాపనములు దిరితలతా, లావనములు నిత్యమంగళ ప్రాభవ సం

జీవనములు లక్ష్మీసం, భావనములు వాసుదేవ పదసేవనముల్. (443)


ఆ. పరమభాగవతుఁడు పాండవపౌత్రుండు, శుకుని భాషణముల శుద్ధబుద్ధి

యై విరాజమనుఁడై మిక్తియగు విష్ణు పాదమూల మెట్ల పడసె ? ననఘ ! (444)


వ. మహీత్మా ! విశిష్టయోగనిష్ఠాకలితంబు, విష్ణుచరిత లలితంబు, పరమపున్యాంబు, సకలకల్యాణగుణ గణ్యంబు, భాగవతజనా పేక్షితంబు నైన పారీక్షితంబగు భాగవతాఖ్యానంబు వినిపింపు మనిన సూతుం డిట్లనియె .(445)


క. మిముబోఁటీ పెద్దవారలి, కమలాక్షుని చరిత మడుగఁగా జెప్పెడి భా

గ్యము గలిగె నేఁడు మా జ, న్మము సఫలంబయ్యె వృద్ధమాన్యుల మగుటన్. (446)


క. కులహీనుడు నారాయణ, విలస త్కథనములు దగిలి వినిపించినఁ ద

త్కులహీనతఁ బాసి మహో, జ్జ్వల కులజత్వమున బొందు సన్మునులారా ! (447)


సీ. ఎవ్వని గుణజాల మెన్న జుహ్వలులేక నళినగర్భదు లనంతుఁ డుండ్రు

కోరెడు విబుధేంద్రకోతి నొల్లక లక్ష్మి ప్రార్థంచె నెవ్వని పాదరజము

బ్రమ్హ యెవ్వని పాదపద్మంబు గడిగిన జలము ధన్యత నిచ్చె నుల కెల్ల

భగవంతుఁ డనియెడి భద్రశబ్దమునకు నెవ్వఁ డర్థకతి నేపుమిగులు

ఆ. నే మహాత్ము నాశ్రయించి శరీరాది, సంగకోటినెల్ల సంహరించి

ప్రాభవమున మునుల పారమహంస్యంబు, నొంది తిరిగి రాకయుందు రెలమి. (448)


చ. క్రమమున మింటికై యెగయుఁ గాక విహంగము మింటిదైన పా

రము గననేర్చునే ? హరిపరాక్రమ మోపినయంత గాఁగ స

ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁ డర్యములార ! నారు చి

త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్. (449)


                                "సమాప్తము"