21. పరీక్షిన్మహారాజు భూ, ధర్మదేవతల సంవాదం బాలకించుట
క. భూవరరూపుఁడు శుద్రుఁడు, గోవుం దా నేల తన్నెఁ ? గోరి పరీక్షి
ద్భూవరుఁడు దిశల గెలుచుచు, నేవిధి,ఁ హలి నిగ్రహించె ? నెఱిఁగింపఁగదే. (389)
మ. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స
త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్భుద్ధిన్ విలంఘించి దు
ర్నర వాథకథన ప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి వా
సరముల్ వ్యర్థతఁ ద్రొబ్బుచుండఁ జన దీ సంసార మోహంబునన్, (390)
సీ. మనువు నిత్యముగాదు మరణంబు నిజమని యెఱిఁగి మోక్షస్థితి నిశ్చయించు
నల్పాయువులము మా కన్య దుర్జన చరిత్రము లోలిఁ గర్ణ రంధ్రములఁ బెట్టి
బంగారు వంటి యీ బ్రతికెడి కాలంబు వోనాడఁగా నేల ? పుణ్యచరిత !
మాధవ పదపద్మ మకరందపానంబు సేయింపవే ! యేము సేయునట్టి .
ఆ. సత్త్రయాగమునకు సన్మునీంద్రు సీర, వాఁడె దండధరుఁడు వచ్చెఁ జూడు
చంపఁ డొకనినైన జన్న మయ్యెడు దాఁక, వినుచునుండుఁ దగిలి విష్ణుకథలు. (391)
క. మందునకు మందబుద్ధికి, మందాయువునకు నిరర్థ మార్గునకును గో
విందు చరణారవింద మ, రందముఁ గొనఁ దెఱపిలేదు రాత్రిం బవలున్. (392)
వ. అని శౌనకుడు పలికిన సూతుం డిట్లనియె. పరీక్షిన్నరేంద్రుడు నిజవాహినీ సందోహి సంరక్షితంబగు ( కురుజాంగల) దేశంబునం (గలి ప్రవేశంబు నాకర్ణించి యుద్ధకుతూహలత) నంగీకరించి, యెక్కనాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని నీల నీరదనిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబునైన రథంబు నారోహణంబుచేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుంగ, రథకరి తురంగ సుభట సంఘటిత చక్రంబు నిర్వక్రంబునం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబులైన యిలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారత వర్షంబులు,నుత్తరకురుదేశంబులును జయించి (పుష్కల ధనప్రదాన పూర్వకలగు సపర్యల నభ్యర్చితుండై) తత్తదేశ మంగళపాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణింపుచు, పాఠకపఠత పద్యంబులందుఁ బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య సఖ్య సభాపతిత్వ సాచివ్య రచన వీరాసన దూతభావాది కర్మంబులు, నశ్వత్థామాస్త్రతేజంబు వలనఁ దను రక్షించుటయు, యాదవ పాండవుల స్నేహానుబంధబును, వారలకుం గలిగిన భగవద్భక్తివిశేషంబును విని, యాశ్చర్యంబు నొందుచు, ( వంది బృందంబులకు మహాధనంబులు, హారాంబరాభరణ సందోహంబులు నొసంగుచుఁ ) బద్మ నాభ పాదపద్మ భజన పరతంత్ర పవిత మానసుండై యొండె. అయ్యెడ వృషభ రూపంబున నేకపాదంబున సంచరించు ధర్మదేవుండు, దన సమీపంబున లేఁగ లేని లేఁగటికుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు, గోరూపయై యున్నధాత్ర కిట్లనియె . (393)
మ. నయనాంభః కణజాల మేల విడువన్ ? నాతల్లి ! మేన సా
మయమై యున్నది మోము వాడినది నీ మన్నించు చుట్టాలకున్
భయదుఃఖంబులు నేఁడు వొందవుగదా ? బంధించి శూద్రుల్ పద
త్రయహీనన్ ననుఁ బట్టవత్తు రనియో ? తాపంబు నీ కేటికిన్ (394)
సీ.మఖములులేమి నమర్త్యల కిటమీఁద మఖభాగములు లేక మాన ననియొ ?
రమణులు రమణుల రక్షింప రనియొ ? తత్పుత్రులఁ దండ్రులు ప్రోవరనియొ ?
భారతి గుజనులఁ బ్రాపించు ననియొ ? సద్విప్రుల నృపులు సేవింప రనియొ ?
కులిశహస్తుఁడువాన గురియింపకుండఁగ బ్రజలు దుఃఖంబునఁబడుదు రనియొ ?
ఆ. హీనవంశజాతు లేలెద రనియొ ? రా, జ్యముల పాడిగలిగి జరగ వనియొ ?
మనుజ లన్నపాన మైథున శయనాస, నాది కర్మసక్తు లగుదు రనియొ ? (395)
మ. జననీ ! నీ భరమెల్ల డింపుటకినై చక్రయుధం డిన్ని హా
యనముల్ గేళి నరాకృతిన్ మెలఁగి నిత్యానందముం జేసి పో
యిన నే ననాథనైతిఁ గుజనుం డెవ్వాఁడు శాసించునో ?
పెనుదుఃఖంబులు పొంచు ననియో ? భీతిల్లి చింతించుటల్ .(396)
క. దెప్పరమగు కాలముచే, నెప్పుడు దేనతలసెల్ల నష్టంబగు నీ
యొప్పిదముఁ గృష్ణుఁ డరిగినఁ , దెప్పఁగదా ! తల్లి ! నీవు తల్లడపదఁగన్ .(397)
వ. అనిన భూదేవి యిట్లనియె .(398)
క. ఈ లోకంబునఁ బూర్వము, నాలుగుపాదముల నీవు నడతువు నేఁ డా
శ్రీలలనేశుఁడు లేమిని, గాలముచే నీకు నొటికా లయ్యెఁగదే ! (399)
వ. మఱియు సత్య శాచ దయా క్షాంతి త్యాగ సంతోషార్జవంబును, శమ దమ తపంబులును, సామ్యంబును, పరాపరాధసహనంబును, లాభంబుగలయెడ నుదాసీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, విజ్ఞానవిరక్తులును, ఐశ్వర్య శౌర్యప్రభా దక్షత్వంబులును, స్మృతియు స్వతంత్ర్యమును, కౌశల కాంత ధైర్యమార్దవ ప్రతిభతిశయ ప్రశ్రయ శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును, సౌభాగ్య గాంభీర్యంబులును, స్థైర్య శ్రద్థా కీర్తిమాన గర్వాభావంబులు ననియెడి ముప్పదితొమ్మిది గుణంబులు నవియునుగాక బహ్మణ్యతాశరణ్యతాది మహాగుణ సమూహంబును, కృష్ణదేవుని యందు వర్తించుఁ గావున. (400)
క.గణనాతీతములగు స, ద్గుణములు గల చక్రి సనిన ఘోరకలి ప్రే
రణమునఁ బాపసమూహ, వ్రణయుతులగు జనులఁ జూచి వగచెదఁ దండ్రీ ! (401)
క. దేవతలకు ఋషులకువ్ బితృ, దేవతలకు నాకు నీకు ధీయుతులకు నా
నా వర్ణాశ్రమములకును, గోవులకును బాధ యనుచుఁ గుందెద ననఘా ! (402)
సీ. బహ్మాదు లెవ్వని భద్రకటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపములఁ
గమలాలయను మాని కమల యెవ్వని పాదకమలంబు సేవించుఁ గౌతుకమున
భవ్యచిత్తంబునఁ బరమయోగీంద్రులు నిలుపుదు రెవ్వని నియతితోడ
వేదంబు లెవ్వని విమలచారిత్రముల్ వినుతింపఁగా లేక వెగడు వడియె
ఆ. నట్టి వాసుదేవు నబ్జ వజ్రాంకుశ, చక్ర మీన శంఖ చాప కేతు
చిహ్నతంబులైన శ్రీచరణము లింక, సోఁకవనుచు వగపు సోఁకెనయ్య ! (403)
క. హరిపాదంబులు సోఁకెడి, సిరికతమున నిఖిలభవన సేవ్యత్వముతో
స్థిరనైతి నిన్నిదినములు, హరి నా గ్ర్వంబు మాన్పి యరిగె మహాత్మా ! (404)
క. లీలకారము దాల్చెను, శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవో
న్మాలనము సేయుకొఱకును, నాలుగుపాదముల నిన్ను నడిపించుటకున్. (405)
ఉ. ఆ మధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం
బా మురిపెంబు లా తగవు లా హమనక్రియ లా మనోహర
ప్రేమకరావలోకనము బ్రీతిఁ గనుంగొనలేమి మాధవున్
గామిను లేల ? నిర్దశితకర్ములు యోగులు వాయనేర్తు రే ? (406)
క. మెల్లన నాపై యాదవ, వల్లభుఁ డడుగిడఁగ మోహవశనై నె రం
జిల్లఁ గ రోమాంచముక్రియ, మొల్ల ములై మొలచు సస్యములు మార్గములన్. (407)
వ. అని యిట్లు పూర్వవాహినియైన సరస్వతితీరంబున ధర్మదేవుండును భూమియు వృషభ ధేను రూపంబుల భాషింప రాజఋషియైన పరీక్షి ద్భూవరుండు డగ్గఱియె, ఆ సమయంబున, (408)
"సమాప్తము"