2. విదురుం డుద్ధవుం గని కృష్ణాదుల వృత్తాంత బడుగుట
చ. చని చని తొంటి మత్స్య కురు జాంగల భూము లతిక్రమించి చ
య్యన యమునానదిం గదిసి యచ్చట భాగవతున్ సరోజలో
చన దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి
ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషిత దోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్. (46)
క. కను యనురాగ వికాసము, దన మనమునఁ దొంగలింపఁ దగ గాఢాలిం
గన మాచరించి నెయ్యం, బునఁ గుశలప్రశ్న సేసి ముదమునఁ బలికెన్. (47)
క. హరిభక్తులు పుణ్యాత్ములు, దురితవిదూరులు విరోధిదుర్దమబలులున్
గురుకులతిలకులు గుంతీ, వరసూనులు గుశలులే యవారిత భక్తిన్. (48)
చ. హరి దన నాభిపంక రుహమందు జనించిన యట్టి భారతీ
శ్వరుఁ డతిశక్తి వేఁడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
పరఁగ జనించె భూభరము వాపిన శూరులు రేవతీందిరా
వరు లట శూరసేనుని నివాసమునన్ సుఖమున్న వారలే? (49)
చ. కురుకుల లాదరింపఁగ సఖుండును నాప్తుఁడు నై తనర్చి సో
దర తరుణీజనంబులను దత్పతులం గడు గారవంబునన్
గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాఁడు సు
స్థిరమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్టికుల ప్రదీపకా! (50)
శా. కందర్పాంశమునం దనూజుఁ బడయం గామించి భూదేవతా
బృందంబున్ భజియించి తత్కరుణ దీపింపన్ ప్రభావంబు పెం
పొందన్ రిక్మిణి గన్న నందనుఁడు ప్రద్యుమ్నుండు భాస్వ చ్చమూ
సందోహంబులు దన్నుఁ గొల్వ మహితోత్సాహంబునన్ మించునే. (51)
క. సరసిజలోచన కరుణా, పరిలబ్ధ సమస్త ధరణిపాలన మహిమం
బరమప్రీతి సుఖించునె, చిర విభవోదారుఁ డుగ్రసేనుఁడు జగతిన్. (52)
చ. లలిత పతివ్రతామణి విలాసవతీతిలకంబు పార్వతీ
లలన గుమారుఁ గన్నటు సులక్షణ జాంబవతీ లలామ ని
ర్మల గతిఁ గన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో
త్కలిక సుఖించునో గుణకదంబుఁడు సాంబుఁడు వృష్టిపుంగవా! (53)
క. హరిపద సేవకుఁ డరి భీ, కరుఁడర్జును వలన మిగులఁ గార్ముక విద్యల్
దిరముగఁ గఱచిన సాత్యకి, వరసుఖ విభవముల నున్న వాఁడె ధరిత్రిన్. (54)
మ. జలజాతాంకుశ చక్ర చాప కులిశ చ్ఛత్రాది రేఖాంకి తో
జ్జ్వల గోవింద పదాబ్జ లక్షిత విరాజన్మార్గ ధూళిచ్ఛ టా
కలితాంగుండు విధూతకల్మషుఁడు నిష్కామైన ధన్యుండు స
త్కులజాతుం డన నొప్పు నట్టి ఘనుఁ డక్రూరుండు భద్రాత్ముఁడే. (55)
క. శ్రుతులను గ్రతు జాతము లున్, మతిఁ దాల్చిన యట్టి వేదమాత గతిన్ శ్రీ
పతిఁ దన గర్భంబున ర, క్షితుఁ జేసిన గరిత దేవకీసతి సుఖమే. (56)
వ. మఱియును, మహాత్మ! మహితోపాసకు లగు వారల కోర్కులు నిండింపంజాలిన భగవంతుండును, శబ్దశాస్ర్తంబునకుం గారణం బని తన్ను నఖిల దేవతాజనంబు లగ్గింపం గల మేటి
యగుటం జేసి మనోమయుండును, సకల జీవచతుర్విధాంతః కరణంబు లైన యే చిత్తాహంకారబుద్ధి మనంబులకుఁ గ్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నా నిరుద్ధు లధిదైవతంబు లగుదు
రట్టి చతుర్విధతత్త్వంబులలోన దుర్యం బయిన తత్త్వంబును, నైన యనిరుద్ధకుమారుండు సంతోషచిత్తుండగునే యని. (57)
మ. ఇత రారాధన బుద్ధి మాని కమలాధీశుం బయోజాస నా
ర్చితుఁ గృష్ణున్ నిజనాథుఁగా సతతమున్ సేవించు పుణ్యల్ జగ
న్నుత లధ్యాత్మవిదుల్ మహాభుజులు మాన్యుల్ ధర్మమార్గుల్ సము
న్నతి సత్యాత్మజ చారుధేష్ణ గదు లానందాత్ములే యుద్ధవా ! (58)
తే. క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు, వొలుచు నెవ్వనిసభఁ జూచి కలుషమొదవి
మనములోన నసూయా నిమగ్నుఁడయ్యె, నట్టి ధర్మజుఁ డున్నాఁడె యనఘ చరిత ! (59)
తే. ఘన గదాభ్యాస చిత్రసంగతుల మెఱసి, కురుకుమారుల భూరి సంగరములోన
హతులఁగావించి వెలసిన యట్టి జెట్టి, వాయుతనయుండు గుశలియైవఱలునయ్య ! (60)
చ. హరి కరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య వి
స్ఫురణఁ దనర్చి తన్ను నని బోయ గతిం గిరిశుం డెదిర్చినన్
బరవస మొప్పఁగా గెలిచి పాశుపతాస్ర్తము గొన్న శత్రు భీ
కరుఁడు ధనంజయుండు సుభగస్థితి మోదము నొందుచుండునే. (61)
మ. తెఱఁగొప్పన్ జననీ వియోగమునఁ గుంతీ స్తన్యపానంబు సో
దర సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్తృస్థామృతంబు ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశ శ్రేణి నిర్జించి త
ద్ధరణీరాజ్యము గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే ? యుద్ధవా ! (62)
తే. పాండు భూమీశ్వరుండు సంప్రాప్తమరణుఁ, డైన శిశువులఁ బ్రోచుటకై నిజేశుఁ
గూడి చనకున్న యట్టి యా కుంతిభోజ, తనయ జీవించునేనేఁడు ? మనుచరిత్ర ! (63)
వ. అని వెండియు. (64)
మ. అను సంభూతుఁడు పాండు భూవిభుఁడు నిర్యాణంబునుం బొంద నా
తని పుత్రుల్ దనుఁ జేరవచ్చినను మధ్యస్థంబు వోఁదట్టి యె
గ్గొనరించెన్ ధృతరాష్టృ భూమివిభుఁ డ ట్లూహింపఁగా నెగ్గు సే
సిన వాఁడే యగుఁ గాక మేలు గలదే చింతింపఁగా నుద్ధవా. (65)
క. అనుజుఁ డని యనక తగ నిజ, తనయులు నను వెడల నడువ దా నూరక యుం
డిన ధృతరాష్టృఁడు నరకం, బునఁ బడు నా దైన దుఃఖమున ననఘాత్మా ! (66)
వ. అదియుం గాక పరమశాంతుండ వైన నీ మనంబున దుఃఖంబు గర్తవ్యంబు గాదం టేని. (67)
క. నరలోక విడంబనమున, హరి పరమపరుండు మానవాకృతితో ని
ద్ధరఁ బుట్టి యాత్మమాయా, స్ఫురణన్ మోహింపఁ జేయు భూజనకోటిన్. (68)
ఉ. కావున న మ్మ హాత్ముని వికార విదూరుని సర్వమోహ మా
యావిల మానసుండ నగు నప్పుడు సంస్మృతి దుఃఖి నౌదు న
ద్దేవుని సత్కృపా మహిమఁ దేలిన వేళ సుఖింతు నేన కా
దా విధి శంకర ప్రభృతు ల వ్విభు మాయఁ దరింపనేర్తురే (69)
వ. అయిన నమ్మహాత్ముని కరుణాతరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిర స్త సమ స్త దోషాంధకారుండ నగుటచే మదియచి త్తంబు హరి పదాయ త్తంబై తన్మార్గంబు సతతంబు
నిరీక్షింపుచు నుండు. మఱియును. (70)
సీ. అట్టి సరోజాక్షుఁ డాత్మీయ పదభక్తు లడవుల నిడుమలు గుడుచుచుండ
దౌత్యంబు సేయఁ గొందఱు విరోధులు పట్టి బద్ధునిఁ జేయ సన్న ద్ధులై న
బలహీను మాడ్కి మార్పడఁగ లేఁ డసమర్థుఁ డని తలంచెద వేని యచ్యుతుండు
పరుల జయింప నోపక కాదు విద్యాభిజన ధనమత్తులై జగతిఁ బెక్కు
తే. బాధలఁ గలంచు దుష్ట భూపతుల నెల్ల, సైన్య యుక్తులుగా నని సంహరించు
కొఱకు సభలోన నప్పుడా కురుకుమారు, లాడు దుర్భాషణములకు నలుగఁడయ్యె. (71)
మ. జననం బందుట లేని యీశ్వరుఁడు దా జన్మించు టెల్లన్ విరో
ధి నిరాసార్థము వీతక ర్ముఁ డగు న ద్దేవుండు గర్మ ప్రవ
ర్తనుఁ డౌ టెల్ల జరాచర ప్రకట భూతశ్రేణులన్ గర్మ వ
ర్తనులం జేయుఁ దలంచి కాక కలవే దైత్యారికిం గర్మముల్. (72)
క. హరి నరుల కెల్లఁ బూజ్యుఁడు, హరి లీలామనుజుఁడును గుణాతీతుఁదు నై
పరఁగిన భవ కర్మంబులఁ, బొరయం డఁట హరికిఁ గర్మములు లీల లగున్. (73)
క. మదిఁ దన శాసన మిడి నిజ, పదములు సేవించు లోకపాలాదుల పెం
పొదవింప యదుకులంబున, నుదయించెను భువిని బలసహోదరుఁ డగుచున్. (74)
తే. చలన మందక భూరి సంసరణ తరణ, మైన సత్కీ ర్తి దిక్కుల నతిశయిల్లి
మఱల సమమతియై యున్నవాఁడె కృష్ణుఁ, డనుచు నుద్ధవుని విదురుఁడడుగుటయును. (75)
అధ్యాయము-౨
వ. అ య్యుద్ధవుండు, (76)
క. యదుకులనిధి యగు కృష్ణుని, పద జలజ వియోగ తాప భరమున మాటల్
ప్రిదులక హృదయం బెరియఁగఁ, బెదవులు దడుపుచును వగలఁబెంపఱియుండెన్. (77)
క. అని చెప్పి బాదరాయణి మనుజేంద్రుని వలను చూచి మఱి యి ట్లనియెన్
విను మొకనాఁ డీ యుద్ధవుఁ, డనయము నై దేండ్ల బాలుఁడై యున్న తఱిన్. (78)
వ. మున్ను కృష్ణునిం గూడియాడు బాలకులలో నొక్క బాలునిఁ గృష్ణునిఁగా భావించి పరిచర్య సేయుచుండ గుణవతీమతల్లి యగు తల్లి చనుదెంచి యాఁకొంటి విదియేల రా వన్న యని పిలిచిన జననీ వాక్యంబులు గైకొనక యఖండ తేజోనిధియైన పుండరీకాక్షు పాదారవింద సేవానుర క్తిం జేసి యున్న యుద్ధవుండు నేఁడు కృష్ణవియోగ తాపంబున హరివార్త విదురునకుఁ జెప్పఁ జాలక యుండుట యేమి విచిత్రం బని వెండియు నిట్లనియె. అంత నుద్ధవుండు సరోజాక్ష పాదారవింద మకరంద సుధా జలనిధి నిమగ్న మానసుండై సముత్కంఠం జింతించి యొక్క ముహూర్త మాత్రంబునకు బాష్పజల పూరిత లోచనుండై గద్గదకంఠుం డగుచు. (79)
క. ఘనముగ నెమ్మనమున మించిన కృష్ణ వియోగ జనితశిఖి దరికొనఁగాఁ
గనుఁగవఁ బెడచే నొత్తుచుఁ, బెనుపొందిన దురిత శిఖరి భిదురున్ విదురున్. (80)
వ. కనుంగొని యిట్లనియె. (81)
క. యముఁ డను ఘన కాలభుజం, గమ పుంగవుఁ డొడిసి పట్టఁగా యదు వంశో
త్తము చారిత్రము దత్కుశ, లము లే మని చెప్పుదును గలంగెడి మనమున్. (82)
సీ. మునిజన ముఖపద్మ ములు ముకుళింపఁగ ఖలజన లోచనోత్పలము లలరఁ
జార చోరుల కోర్కి సఫలత నొందంగ దానవ దర్పాంధ తమస మడర
వర యోగి జన చక్రవాకంబు లడలంగఁ గలుషజనానురాగంబు పర్వ
భూరి దోషానల స్ఫూర్తి వాటిల్లంగ నుదిత ధర్మక్రియ లుడిగి యణఁగ
తే. మానుషాకార రుచికోటి మందపఱిచి, యనఘ యే మన నేర్తుఁ గృష్ణాభిధాన
లోక బాంధవుఁ డు త్తమశ్లోకమూర్తి, మించు తేజంబుతో న స్తమించె నయ్య. (83)
వ. మఱియును. (84)
క. హలకులిశ జలజరేఖా, లలిత శ్రీకృష్ణ పాదలక్షిత యై ని
ర్మలగతి నొప్పెడి ధరణీ, లలనామణి నేఁ డభాగ్య లక్షణ యయ్యెన్. (85)
క. యాదవుల వలన రాజ్య, శ్రీ దొలఁగెను ధర్మగతి నశించెను భువి మ
ర్యాదలు దప్పె నధ ర్మో, త్పాదనమున దైత్యభేది దప్పిన పిదపన్. (86)
వ. మఱియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుషమా విశేష విడంబిత విమల సలిలంబు లందుఁ బ్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధింజేసి త జ్జల
విలోలమీనంబు లనూన స్నేహంబునం దలంచు చందంబునఁ గృష్ణానుచరులైన యదువృష్టి కుమారు ల మ్మ హనీయ మూ ర్తిందమకు నగ్రేసరుం డని కాని లీలామానుషవిగ్రహుం డై న
పరమాత్ముండనికాని యెఱుంగక హరి మాయాజనితం బగు నసద్భావంబునం జేసి భోజన శయనాస నానుగమ నంబులం జేరి సహోద రాది భావంబులం గూడి చరియింతురు. అ ద్దేవుని
మాయాపయోధి నిమగ్నులు గాకుండ నబ్జభవాదుల కైనం దీరదు. సర్వగుణ గరిష్ఠులు సత్పురుష శ్రేష్ఠులునగు పరమ భాగవతులకుం దక్కం దక్కిన వారలకుఁ జెప్పనేల. అదియునుం గాక
యభిజన విద్యా ధన బల హర్వ మదాంధీభుఉత చేతస్కులైన శిశుపా లాది భూపాలకు ల మ్మ హాత్మునిం బరత త్త్వంబని యెఱుంగక నిందించు దుర్భాషలు దలంచి మనస్తాపంబు నొందు
చుండుదును. అని వెండియు, (87)
మ. అవితృప్తేక్షణ ధీ సమాహిత తపోవ్యాసంగు లై నట్టి భా
గవత శ్రేష్ఠుల కాత్మమూ ర్తి నిఖి లై క జ్యోతిమైఁ జూపి లో
క విలోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మా
నవ రూపం బగు దేహమున్ వదలి యంతర్ధానుఁ డయ్యెం జుమీ. (88)
సీ. మర్త్యవికా సైక మానమై తనకును విస్మయ జనక మై వెలయు నట్టి
యాత్మీయ యోగ మాయాశ క్తిఁ జేపట్టి చూపుచు నత్యంత సుభగుఁ డగుచు
భూషణంబులకును భూషణంబై వివేకముల కెల్లను బరాకాష్ఠ యగుచు
సక ల కళ్యాణ సంస్థానమై తేజరిల్లెడు నట్టి దివ్యమూర్తి
తే. తాన తనమూ ర్తి నిజశ క్తిఁ దగ ధరింప, యమతనూభవు రాజసూయాధ్వరంబు
నందు నెవ్వని శుభమూ ర్తి నఖిల జనులు, నిండు వేడుకఁ జూచి వర్ణించి రెలమి. (89)
క. ప్రకటముగఁ గమలభవ సృ, ష్టికిఁ గారణ మి మ్మ హాత్ముఁడే యనుచును ను
త్సుకులై తన్మూ ర్తిని ద, ప్పక చూచిరి కాదె త త్సభా జను లెల్లన్. (90)
వ. మఱియు శాంతోగ్ర రూపధరుండైన సర్వేశ్వరుండు శాంతిరూపుండు గావునఁ బర కృతాపరాధ నిపీడ్యమాన మానసుం డయ్యు ననుకంపాయ త్త చిత్తుండై వ ర్తించు. పరాపరుండును,
ప్రకృతి కార్యం బయిన మహ త్తత్త్వ రూపుండును, జనన విరహితుం డయ్యును దారువుల వలన ననలంబు దోఁచు చందంబున జననంబు నొందుచుండు. అట్టి సరోజనాభుని హాస రాస
లీలానురాగ విలోకన ప్రతిలబ్ధమాన లై న గోపకామినులు ద న్మూ ర్తి దర్శ నానుష క్త మనీషలం గలిగి వ ర్తించిరి.అదియునుం గాక, (91)
చ. దివిజుల కోర్కిదీర్ప వసుదేవుని యింట జనించి కంస దా
నవుఁడు వధించునన్ భయమునం జని నందుని యింట నుంటకున్
యవన జరాసుతాదులకు నాజి నెదుర్పడ లేక సజ్జన
స్తవ మథురావురిన్ విడిచి దాఁగుటకున్ మదిఁ జింత నొందుదున్. (92)
వ. అదియునుంగాక, (93)
సీ. కడఁగి పెక్కిడుమలఁ గడుచుచుఁ జిత్తముల్ గలఁగఁగ బంధనాగారములను
వనరిన దేవకీ వసుదేవులను డాయఁ జనుదెంచి భక్తి వందన మొనర్చి
తలిదండ్రులార ! యేఁ గలుగంగ మీరలు గంసుచే నలజడిఁ గ్రాగుచుండఁ
గణఁగి శత్రునిఁ జంపఁగా లేక చూచుచు నున్న నా తప్పుఁ బ్రసన్ను లగుచుఁ
తే. గావుఁ డని యానతిచ్చిన దేవదేవు, నద్భుతావహ మధురవాక్యములు దలఁచి
తలఁచినాత్తమునఁ జాలఁగలఁగుచుందుఁ, బృథులపాతక భూమిబృద్భిదురవిదుర ! (94)
క. విమలమతిఁ దలఁప నెవ్వని, బొమముడి మాత్రమున నిఖిల భూదేవి భా
రము వాయు నట్టి హరిపద, కమల మరందంబు గ్రోలు ఘనుఁ డెవ్వాఁడో? (95)
క. మంద ప్రజ్ఞుఁడనై గో, విందుని మురదైత్యహరుని విష్ణునిఁ బరమా
నందుని నంద తనూజుని, మందరధరుఁ జిత్తమందు మఱుతునె యెందున్ ? (96)
చ. అదియునుఁ గాక మీరు నృపు లందఱు చూడఁగ ధర్మసూతి పెం
పొదవిన రాజసూయ సవనోత్సవ మందును జన్మ మాదిగాఁ
బదపడి యె గ్గొనర్చి శిశుపాలుఁడు యోగిజనంబు లిట్టి ద
ట్టి దని యెఱుంగ నోపని క డింది పదంబును బొందెనే కదా. (97)
చ. కురునృప పాండు నందను లకుంఠితకేళిఁ జమూ సమేతులై
యరిది రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృత మాత్మలోచనో
త్కరములఁ గ్రోలి పార్థు విశిఖ ప్రకరక్షత పూతగాత్రులై
గురుతర మోక్ష ధామమునకుం జని సౌఖ్యము నొందిరో కదా! (98)
సీ. అట్టి సరోజాక్షుఁ డాద్యంత శూన్యుండు సుభగుండు ద్రైలోక్య సుందరుండు
గమనీయ సాగర కన్యకా కుచ కుంకుమాంకిత విపుల బాహాంతరుండు
సకల దిక్పాల భాస్వత్కిరీట న్య స్త పద్మరాగారుణ పాదపీఠుఁ
డజుఁ డనంతుఁడు సమానాధిక విరహితుఁ డిద్ధ మూ ర్తిత్రయాధీశ్వరుండు
తే. నైన హరి యుగ్రసేనుని యఖిలరాజ్య, రుచిర సింహాసనమునఁ గూర్చుండఁ బెట్టి
భృత్యభావంబునొంది సంప్రీతి నతని, పనుపు సేయుట కెపుడు నా మనము గుందు, (99)
వ. అని వెండియు నిట్లనియె, అనఘా! *(పరాత్పరుండు యోగీశ్వరేశ్వరుండు నగు కృష్ణుండు) భగవద్భక్తుండు పరమ భాగవతో త్తముఁడు నైన యుగ్రసేనుని సేవించుట యాశ్చర్యంబు గాదు.
తన్ను హరియింపం దలంచి కుచంబుల విషంబు ధరించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతన యైన పూతనకుం, జన్నిచ్చి పెంచిన యశోదాదేవికి నైన నందరాని నిజపదంబు గారుణ్యచిత్తుండై
యొసంగె ననిన నిజపద ధ్యానపరాయణు లగు వారల ననుసరించి సేవించుట చెప్ప నేల? అనిన నుద్థవునికి విదురం డిట్లనియె. భక్తవత్సలుండును గారుణ్య జలనిధియునై భాగవత జనుల
ననుగ్రహించు పుండరీకాక్షుండు నిజదాస లోకంబున కొసంగు పరమపదంబు లుగ్రకర్ములైన రాక్షుసుల కెట్లొసంగె నత్తెఱం గెఱిగింపు మనిన విదురునకు నుద్ధవుం డిట్లనియె. (100)
మ. దనుజానీక మనేక వారములు దోర్దర్పంబు సంధిల్లఁగా
వినతాసూను భుజావరోహుఁ డగు న వ్విష్ణున్ సునాభాస్త్రుఁ దా
రనిలో మార్కొని పోకు పోకు హరి దై త్యారాతి యంచుం ద దా
ననముం జూచుచుఁ గూలి మోక్షపదమున్ బ్రాపింతు రత్యున్న తిన్. (101)
క. ధీరజనోత్తమ! నవ సిత, సారస నేత్రుఁ డగు కృష్ణు జననంబును ద
చ్చారిత్రము నెఱిఁగింతు ను, దారత నీ విపుడు వినుము తద్విధ మెల్లన్. (102)
చ. ధరణిభరంబు వాపుటకుఁ దామరసాసను ప్రార్థనన్ రమా
వరుఁ డల కంస బంధననివాసమునన్ వసుదేవ దేవకీ
వరులకు నుద్భవింప బలవంతుఁడు గంసుఁడు హింస సేయున
న్వెఱపున నర్థరాత్రి సుతునిం గొని య వ్వసుదేవుఁ డిమ్ములన్. (103)
క. నందుని మందకుఁ జని త, త్సుందరి తల్పమునఁ బరులు సూడక యుండన్
నందనుని నునిచి యానక, దుందుభి మఱలంగ నేగెఁ దొల్లిటి పురికిన్. (104)
క. హరి యేకాదశ సంవ, త్సరములు నందవ్రజమునఁ దను హరి యని యె
వ్వరు నెఱుఁగ కుండ నా హల, ధరుతోఁ గూడాడుచుండెఁ దద్దయుఁ బ్రీతిన్. (105)
క. గోపాల వరుల కైనను నాపోవఁగఁ దన సమంచితాకార మొగిన్
జూపని శ్రీపతి వేడుక, గోపాలురఁ గూడి కాచె గోవత్సములన్. (106)
వ. అ య్యవసరంబునం గృష్ణుండు లీలా వినోదంబు తోడి గోపాల బాలురకుం జూపని దలంచి, (107)
చ. వర యమునా నదీ సలిల షర్ధిత సౌరభ యుక్త పుష్ప మే
దుర మకరంద పాద పరితోషిత భృంగ సురంగ మాధవీ
కురవక కుంద చందన నికుంజము లందు మయూర శారికా
పరభృత రాజకీర మృదు భాషల భంగిఁ జెలంగి పల్కుచున్. (108)
ఉ. శ్రీ రమణీ మనోవిభుఁడు సింహ కిశోరముఁ బోలి లీలఁ గౌ
మార దశన్ రమా విమల మందిరముం బురిడించు గో తతిన్
వారక మేపుచుం దరళ వంశ రవ స్ఫుట మాధురీ సుధా
సారముచేత గోపజన సంఘములన్ ముదమందఁ జేయుచున్. (109)
వ. మఱియు, (110)
మ. చిర కేళిరతి బాలకుల్ దృణములన్ సింహాది రూపంబులన్
గర మొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునన్
గరుణాతీతులు కామరూపు లగు న క్కంస ప్రయుక్త క్షపా
చరులం గృష్ణుండు సంగర స్థలములన్ జక్కాడె లీలాగతిన్. (111)
చ. వర యమునా నదీ జల నివాస మహోరగ విస్తృ తాస్య వి
స్ఫురిత విషానల ప్రభల సోఁకునఁ గ్రాఁగిన గోప గో ధనో
త్కరముల నెల్ల గాచి భుజగప్రవరు ంవెడలంగఁ దోలి త
త్సరి దమలాంబు పానమున సంతస మందఁగఁ జేసె గో తతిన్. (112)
మ. దివిజాధీశు గుఱించి వానకొఱకై దీపింప నం దాది వ
ల్లవు లేఁటేఁట ననూన సంపదల నుల్లాసంబునం జేయు ను
త్సవముం గృష్ణుఁడు మానిప్ గోప గణముల్ సంప్రీతి నొందన్ శచీ
ధవు గర్వం బణఁపన్ ధనవ్యయముగాఁ దాఁ జేసె గో యాగమున్. (113)
చ. హరిహయుఁ డంత రోష వివశావిల మానసుఁడై సరోరుహో
దరు మహిమం బెఱుంగక మదం బడరంగ వలాహ కాది భీ
కర ఘనపం క్తిఁ బంపిన నఖండ శిలామయ భూరి వర్షముల్
గురిసె ననూన గర్జనల గోకుల మాకుల మంది కుందఁగన్. (114)
ఉ. ఆ తఱి మంద గొందలము నందఁగ వల్లవు లెల్లఁ గృష్ణ యీ
చేతను లెల్ల నిట్టి జడిఁ జిందఱి వందఱలై మనంబులన్
గాతరులైరి నీవు గృపఁ గావు మహాత్మ ! యనాథనాథ ! ని
ర్ధూత కళంక ! భక్తపరితోషణ భూషణ ! పాపశోషణా ! (115)
మ. అని యి బృంగి విపన్నులై పలుకఁ గుయ్యాలించి కృష్ణుండు స
జ్జన వర్ధిష్ణుఁడు గోప గో నివహ రక్షా దక్షుఁడై దేవతా
జను లగ్గింపఁ గరాంబుజాతమున సచ్చత్రంబుగాఁ దాల్చె బో
రన గోవర్ధన శైలమున్ దట చర ద్రమ్యామరీ జాలమున్ (116)
వ. వెండియు, (117)
సీ. శర దాగమారంభ సంపూర్ణ పూర్ణిమా సాంద్ర చంద్రాతపో జ్జ్వలిత మగుచు
వెలయు బృందాటవీ వీథి యం దొకనాఁడు రాసకేళి మహోల్లాసుఁ డగుచు
రుచిత సౌభాగ్య తారుణ్య మనోరమ స్ఫూర్తిఁ జెన్నందిన మూర్తి దనర
సలలిత ముఖచంద్ర చంద్రికా తతి గోప నయనోత్పలముల కానంద మొసఁగ.
తే.భవ్య చాతుర్య భంగిఁ ద్రిభంగి యగుచు, నబ్జనాభుండు సమ్మోద మతిశయిల్ల
లీలఁ బూరించు వర మురళీ నినాద, మర్థి వీతేర విని మోహితాత్మలగుచు (118)
చ. పతులు మఱందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సము
న్నతి వలదన్న మానక మనంబులఁ గృష్ణ పదాబ్జ సేవనా
నివతరతి గోప కామినులు వే చనుదేర దయాపయోధి శో
భితగతి రాసకేళి సలిపెం దరుణీ నవ పుష్పచాపుఁడై (119)
అధ్యాఅము - ౩
ఉ. రాముఁడు దాను గూడి మథురా పురికిం జని యందు వైభవో
ద్దామ నృపాసనంబుంన ముదంబున నున్న దురాత్ముఁ గంసు దు
ష్టామరశత్రుఁ ద్రుంచి ముదమారఁగఁ దల్లిని దండ్రి నంచిత
శ్రీమహితాత్ముఁడై తనరఁ జేసె సరోరుహనాభుఁ డున్నతిన్. (120)
మ. నలు వొప్పంగ షడంగయుక్త మహితామ్నాయంబు చౌషష్టి వి
ద్యలు సాందీపనిచే నెఱింగెఁ జెలువొందని విన్న మాత్రంబు లో
పలనే లోకగురుండు దాన తనకున్ భావింప నన్యుల్ గురు
ల్గలరే లోక విడంబనార్ధ మగు లీలల్ గావె యమ్మేటికిన్. (121)
ఉ. మించి ప్రభాస తీర్ధమున మృత్యువశంబును బొంది పోయి యా
పంచజనోదరస్థుఁ డగు బాలుని దేశికనందనుం బ్రభో
దంచిత లీలఁ దెచ్చి గురుదక్షిణగా నతిభక్తి యుక్తి న
ర్పించె గురుండు చిత్తమునఁ బెంపెసలార మురారి వెండియున్ (122)
సీ. ఘనుండు విదర్భేశుఁ డన నొప్పు భీష్మకు వర సుతామణి నవ వారి జాక్షిఁ
బద్మా సమాన రూపశ్రీ విభాసితఁ గమనీయ భూషణఁ గంబుకంఠిఁ
జతుర స్వయంవరోత్సవ సమాగత చైద్య సాల్వ మాగధ ముఖ జనవరేణ్య
నికర సమావృతఁ బ్రకట సచ్చారిత్ర రుక్మిణి నసమాన రుక్మకాంతి
తే. నమర గుప్తామృతము విహగాధి విభుండు, గొనిన కైవడి మనుజేంద్ర కోటిఁ దోలి
కమలనాభుండు నిజభుజాగర్వమలరఁ, దెచ్చి వరియించె నతని నుతింపవశమె! (123)
చ. పరువడి పట్టి సప్త వృషభంబుల ముక్కులు గుట్టఁ దద్బల
స్ఫురణ సహింపఁ జాలక నృపుల్ దలపడ్డ జయించి నగ్నజి
ద్ధరణిపు నందనన్ వికచ తామరసాక్షిఁ బ్రమోదియై స్వయం
వరమునఁ బెండ్లి యాడె గుణవంతుఁ డనంతుఁ డనంత శక్తితోన్. (124)
మ. ప్రతివీర క్షయకారి నా నెగడి సత్రాజి త్తనూజా హృదీ
ప్సితముం దీర్పఁ దలంచి నాకమునకున్ బెంపారఁగా నేగి వ
ర్ణిత శౌర్యోన్నతిఁ బారిజాత మిలకున్ లీలగతిం దెచ్చె ను
ద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుఁ డన నేతన్మాత్రుఁడే చూడఁగన్. (125)
సీ. మానితాఖిల జగన్మయ దేహమునఁ బొల్చు ధరణి దేవికిఁ బ్రియతనయుఁడైన
నరక దానవుని సునాభాఖ్యఁ జెన్నొందు ఘన చక్రధారా విఖండితోత్త
మాంగునిఁ జేయ న య్యవనీ లలామంబు వేఁడినఁ ద త్పౌత్రు విపుల రాజ్య
పదమున నిల్పి లోపలి మందిరంబులఁ జిరముగ నరకుండు చెఱలఁ బెట్టి
తే. నట్టి కన్యలు నూటఁ బదాఱు వేలు, నార్త బంధువుఁ డైన పద్మాక్షుఁ జూచి
హర్ష బాష్పాంబు ధారా ప్రవర్ష మొదవఁ, బంచశర బాణ నిర్భిన్న భావలగుచు. (126)
చ. లలిత తదీయ సుందర విలాస విమోహిత లైన వారి నిం
పొలసిన కోర్కెఁ దీర్చుటకు నొక్క ముహూర్తమునన్ వరించి క
న్యల లలితావరోధ భవనంబుల నందఱ కన్ని రూపులై
కలిసి సుఖస్థితిం దనిపెఁ గాంతల భక్తి నితాంత చిత్తలన్ (127)
క. చతురతతో నం దొక్కొక, యతివకుఁ బదురేసి సుతుల నాత్మసముల ను
న్నత భుజశక్తులఁ గాంచెను, వితతంబై కీ ర్తి దిశల వినుతికి నెక్కన్. (128)
సీ. మథురాపురము చతు ర్విద బలౌఘములతో నావరించిన కాలయవన సాల్వ
మగధ భూపాలాది మనుజేంద్ర లోకంబు సైన్య యుక్తముగాఁగ సంహరించి
తన బాహు శక్తిఁ జిత్తముల నర్ధించిన భీమ పార్ధులకు నుద్దామ విజయ
మొసఁగి తద్వైరుల నుక్కణంగఁగఁ ద్రుంచి బాణ, శంబర, ముర, పల్వలాది
తే. దనుజ నాయక సేనా వితానములను, హలధరాది సమేతుఁడై హతులఁ జేసె
దంతవక్త్రాది దైత్యులు దన్ను నెదుర, భండనములోనఁద్రుంచె దోర్బలము మెఱసి. (129)
వ. వెండియుం గృష్ణుండు గౌరవ పాండవ భండనమునకుం దోడ్పడి రాజన్యు లన్యోన్య మాత్స ర్యోత్సాహ సమేతులై సైనిక పాదఘట్టనంబుల ధరాచక్రంబు గంపింప ననన్య సామాన్యంబులైన శంఖ భేరీ ప్రముఖ తూర్య ఘోషంబులు నింగి ంరింగ దురంగమ రింఖా
సముద్ధూత ధూళి పటల పరిచ్చన్న భాను మండలంబుగాఁ జనుదెంచి కురుక్షేత్రంబున మోహరించిన నుభయ పక్షబలంబులందునుమాడి, నిఖిల రాజ్యవైభవ మదోన్ముత్తుం డైన సుయోధనుండు కర్ణశకుని దుశ్శాస నాదుల దుర్మంత్రంబున నిరంతరంబు గుంతీనందనుల
కెగ్గు చేసిన దోషంబునం జేసి సంగరంబున భీమ గదాఘాతంబునం దొడలు విఱిగి పుడమింబడి గతాయుశ్శ్రీ విభవుండై యుండుం జూచి పరితుష్ట చిత్తుండై, యపరిమిత బాహుబలోత్సాహు లైన భీష్మ ద్రోణ భీమార్జునులచేత నిఖిల ధరాపతుల నష్టాద శాక్షౌహిణి
బలంబుల తోడం దునిమించి, మఱియు స్వసమాన బలులయిన యదువీరుల జయింప నెంత వారల కైనం దీర (కాన) మధుపాన మద విఘూర్ణిత తామర విలోచనులై వర్తించు యాదవుల కన్యోన్య వైరంబు గల్పించి పోరించి యితరేతర కరాఘాతంబుల హతులై
(వారు) దనుఁ గలసినం గాని భూ భారం బుడుగ దని చిత్తంబునం దలంచి, యంత ధర్మనందనుచే నిస్సపత్యం బగు రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయింపు చుండి, మర్తులకుం గర్తవ్యంబులైన ధర్మపథంబులు సూపుచు, బంధు మిత్రుల నెల్లం బరితోషంబు నొందింపుచుం,
దత్పరోక్షంబున వారి వంశం బుద్ధరింపం దలచి యభిమన్యు వలన ను త్తరయందు గర్భంబు నిలిపి, గురుతనయ ప్రయుక్త మహిత బ్రహ్మస్త్ర పాతంబునఁ ద ద్గర్భ దళనంబు గాకుండ నర్భకుని రక్షించి, నిజ పదారవింద సేవా రతుం డైన ధర్మజుచేఁ గీర్తి ప్రతాపంబులు
నివ్వటిల్లం దురంగమేధంబులు మూఁడు సేయించి, వెండియు, (130)
సీ. వలనొప్ప లౌకిక వైదిక మార్గముల్ నడుపుచు ద్వారకానగర మందు
నవిదితాత్మీయ మాయా ప్రభావమున ని స్సంగుఁ డై యుండి సంసారి పగిదిఁ
జెంది కామంబుల చేత విమోహితుం డై సుఖింపుచు ముదితాత్ముఁ డగుచు
నంచిత స్నిగ్ధ స్మితావలోకముల సుధా పరిపూర్ణ సల్లాపములను
తే. శ్రీ నికేతన మైన శరీరమునను, పాండునందన యదుకుల ప్రకరములను
తీలఁ గారుణ్య మొలయఁ బాలింపు చుండె, నార్త రక్షణ పరుఁడు నారాయణుండు. (131)
సీ. సంపూర్ణ పూర్ణిమా చంద్ర చంద్రిక నొప్పు రమణీయ శారద రాత్రు లందు
సలలిత కాంచన స్తంభ సౌ ధోపరి చంద్రకాం తోపల స్థలము లందు
మహిత కరేణుకా మధ్య దిగ్గజముల గతిని సౌదామినీ లతల నడిమి
లీల మేఘంబుల లీల ముక్తా మధ్య లాలిత శక్ర నీలముల భాతి
తే. సతత యౌవన సుందరీయుత విహారుఁ, డగుచు సతు లెంద ఱందఱ కన్ని రూప
ములను గ్రీడించెఁ బెక్కబ్దములు సెలంగి, నందనందనుఁ డభినవానంద లీల. (132)
వ. అంత నొక్కనాఁడు, (133)
చ. మునివరు లేగుదేర యదు బోజ వరేణ్యులు గూడి ముట్ట బ
ల్కినఁ గన లొంది వారు దమకించి శపించినఁ గొన్ని మాసముల్
చను నెడ దైవ యోగముగ జాతరఁ బో సమకట్టి వేడుకల్
మనములఁ దొంగలింప గరిమన్ నిజ యానము లెక్కి యాదవుల్, (134)
ఉ. కోరి ప్రభాస తీర్థమునకుం జని త న్నదిఁ గ్రుంకి నిర్మ లో
దారత నందు దేవ ముని తర్పణముల్ పితృ తర్పణంబులున్
వారని భక్తిఁ జేసి నవ వత్సలతోఁ బొలుపారు గోవులన్
భూరి సదక్షిణాకముగ భూసుర కోటికి నిచ్చి వెండియున్ (135)
క. అజిన పట రత్న కంబళ, రజత మహారజత తిల ధరా వర కన్యా
గజ తురగ రథములను స, ద్ద్విజ కోటికి నిచ్చి పెంపు దీపింపంగన్. (136)
వ. ఇట్లు సఫలంబు లైన భూ దానంబు మొదలుగాఁ గల దానంబు లనూనంబుగా భగవదర్పణ బుద్ధిం జేసి యనంతరంబు. (137)
అధ్యాయము - ౪
తే. ఎసఁగు మోదంబు సంధిల్ల నిష్టమైన, రసిక మృదులాన్న మర్ధిఁ బారణలు సేసి
మంజులాసవ రసపానమత్తులగుచుఁ, గణఁగి యన్యోన్య హాస్యవాక్యములఁ గలఁగి. (138)
వ. తమలోన మదిరాపాన మద విఘూర్ణిత తాంర లోచనులై మత్సరంబుల నొండొరులఁ బొడిచి సమస్త యాదవులు వేణుజాతానలంబునఁ దద్వంశ పరంపరలు దహనంబు నొందు చందంబునం బొలిసిరి, అంతయునుం గనుంగొని కృష్ణుండప్పుడు, (139)
క. చతురతతో నిజమాయా, గతిఁ జూచిఁ లసద్విలోల కల్లోల సమం
చిత విమల కమల సార, స్వత జలముల విహిత విధులు సలిపిన వాఁడై. (140)
క. ఒక వృక్షమూల తలమున, నక లంక, గుణాభిరాముఁ డాసీనుండై
యకుటిలమతి బదరీ వన, ముకు ననుఁ బొమ్మనుచు మొఱఁగి పోయిన నేనున్. (141)
క. క్రమమున నిజ కుల సంహా, రము సేయఁ గణంగు టెఱిఁగి రమణీయ శ్రీ
రమణు చరణాబ్జ యుగ విర, హమునకు మది నోర్వ లేక యనుగమనుఁడనై. (142)
క. హరి నరయుచుఁ జనిచని యొక, తరుమూల తలంబు నందుఁ దన దేహరుచుల్
గిఱికొన నున్న మహాత్మునిఁ, బరునిఁ బ్రపన్నార్తి హరుని భక్తవిధేయున్. (143)
వ. మఱియును, (144)
సీ. అస్మ త్ప్రియస్వామి నచ్యుతుఁ బరు సత్త్వగుణ గరిష్టుని రజోగుణ విహీను
సురుచిర ద్వారకాపుర సమాశ్రయ ననాశ్రయు నీల నీరద శ్యామవర్ణు
దళదరవింద సుందర పత్రనేత్రు లక్ష్మీయుతుఁ బీత కౌశేయ వాసు
విలసిత వామాంక విన్యస్త దక్షిణ చరణారవిందు శశ్వ త్ప్రకాశు
తే. ఘన చతుర్భాహు సుందరకారు ధీరుఁ, జెన్నుగల లేఁత రావి పై వెన్నుమోపి
యున్న వీరాసనాసీనుఁ గన్న, తండ్రి నానంద పరిపూర్ణ దనుజ హరుని. (145)
మత్తకోకిల. కంటిఁ గంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి నాశ్రిత రక్షకున్
గంటి యోగిజనంబు డెందముఁ గంటిఁ జుట్టముఁ గంటి ము
క్కంటికిం గనరాని యొక్కటిఁ గంటిఁ దామర కంటిఁ జే
కొంటి ముక్తి నిధానముం దలకొంటి సౌఖ్యము లందఁగన్. (146)
వ. అయ్యవసరంబునం బరమ భాగవతో త్తముండు, మునిజన సత్తముండు, ద్వైపాయన సఖుండు, పరమ తపోధనుండు, నఘశూన్యుండు, నఖిలజన మాన్యుండు. బుధజన విధేయుండు నగు మైత్రేయుండు దీర్థాచరణంబు సేయుచుం జని చని, (147)
మ. కనియెం దాపన పుంగవుం డఖిల లోకఖ్యాత వర్ధిష్ణు శో
భన భాస్వత్పరిపూర్ణ యౌవన కళా భ్రాజిష్ణు యోగీంద్ర హృ
ద్వన జాతైక చరిష్ణుఁ గౌస్తుభ ముఖోద్య ద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహిత జిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్. (148)
క. తదనంతరంబ హరిఁదన, హృదయాబ్జము నందు ముకుళితేక్షణముల స
మ్మదమునఁ జూచుచు నానత, వదనుండై యుండె ముదము వఱలఁగ ననఘా! (149)
వ. అంత డగ్గఱ నేతించి యున్న మైత్రేయుండు వినుచుండ దరహాస చంద్రికా సుందర వదనారవిందుండును, నానంద సుదానిష్యంద కందళిత హృదయుండును, భక్తానురక్త దయాసక్త విలోకనుండును నగు పుండరీకాక్షుండు నన్ను నిరీక్షించి యిట్లని యాన తిచ్చె. పూర్వ భవంబున వసుబ్రహ్మలు సేయు సత్తృయాగంబున వసువై భవదీయ హృదయంబున నితర పదార్ధంబులు గోరక మదీయ పాదార వింద సేవఁ గావించితివి. కావునఁ ద న్నిమిత్తంబున నేను నీ హృదయంబున వసియించి సమస్తంబునుం గనుగొందు, ఆత్మారాముండు నైన నన్ను నెవ్వ రేని సద సద్వివేకులై యెఱుంగం జాలరు; వారలకు నేను నగోచరుఁడనై యుందు. మత్పరిగ్రహంబు గల నీకు నీ జన్మంబె కాని పునర్భవంబు నొందకుండుటకు భవదీయ పూర్వజన్మ సుకృత విశేషంబు కతన నీ యాశ్రమంబున మత్పదార వింద సందర్శనంబు గలిగె. అదియునుం గాక పద్మకల్పంబునందు మ న్నాభి పద్మ మధ్య నిషణ్ణుండైన పద్మసంభవునకు (జన్మ మర ణాది సంసృతి నివర్తకంబు నవిరతానశ్వర సౌఖ్య ప్రవర్తకంబు నగు) మన్మహత్త్వంబు దెలియం జేసి నట్టి దివ్యజ్ఞానంబు నీకు నెఱింగింతు నని య మ్మహనీయ తేజోనిధి యానతిచ్చిన సుధాసమాన సరసాలాపంబులు గర్ణ కలాపంబులై మనస్తాపంబులం బాపిన రోమాంచ కంచుకిత శరీరుండను, నానందబాష్పధారా సిక్త కపోలుండను, పరితోష సాగరంత ర్నిమగ్న మానసుండనునై యంజలి పుటంబు నిటల తటంబున ఘటియించి యి ట్లంటి. (150)
జ. పురుషోత్తమ! నీ పద సర, సిరుహ ధానామృ తాభిషేక స్ఫురణన్
గర మొప్పిన నా చిత్తమి, తర వస్తువు లందు వాంచఁ దగులునె యెందున్. (151)
చ. జననము లేని నీవు భవసంగతి నొందుట కేమి కారణం
బనియును గాల సంహరుఁడవై జగముల్ విలయించు నీవు పా
యని రిపుభీతికై సరిదుదంచిత దుర్గము నాశ్రయించు టె
ట్లనియుని దేవ నామనము నందుఁ దలంతు సరోజలోచనా! (152)
వ. అదియునుం గాక, (153)
క. శ్రీ రమణీశ్వర! నీ వా, త్మారాముఁడ వయ్యు లీలఁ దరుణీ కోటిం
గోరి రమించితి వనియును, వారక యేఁ దలఁతు భక్తవత్సల! కృష్ణా! (154)
క. పరతత్త్వజ్ఞులు గరుణా, కర! నీలోకావనైక ఘనతఁ దలఁపఁగాఅ
నరసి ననుఁ గాచు టెం తది, కరమరుదే దలఁచి చూడఁ గమలాధీశా ! (155)
వ. దేవా? వీ వఖండిత విజ్ఞాన రూపాంతః కరణుండ వయ్యును ముగ్ధ భావంబునం బ్రమత్తుని చందంబున విమోహి కైవడిం బ్రవర్తింపుచు నెందేనియు నొదిగి యుండుట దలంచి నా డెందంబు గుందుచుండు. అరవిందలోచన! సురవందిత! ముకుంద! ఇందిరాసుందరీ రమణ! సరస్వతీరమణునకుం గరుణించిన విజ్ఞానంబు ధరియించు శక్తి నాకుం గల దేనిఁ గృపసేయుము. భవదీయ శాసనంబు ధరియించి భూరి సంసార పారావారో త్తరణంబు సేయుదు నని విన్నవించి బహు భంగులం బ్రస్తుతించిన భగవంతుడును, ప్రసన్న పారిజాతంబును నైనకృష్ణుండు పరతత్వ నిర్ణయంబు నెఱింగించిన, (156)
క. సరసిజలోచన కరుణా, పరిలబ్ధ జ్ఞాన కలిత భావుఁడ నగుటన్
బరతత్త్వ వేదినై త, చ్చరణ సరోజముల కెఱఁగి సమ్మతి తోడన్ (157)
క. హరిపద జలరుహ విరహ, తుర ఘన దుర్ధాంత దుఃఖ తోయధిఁ గడవన్
వెర వేది తిరుగ వలసెను, సరసిజభవ కల్ప విలయ సమయము దాఁకన్. (158)
వ. ఇట్లు దిరుగుచు, (159)
మ. నర నారాయణ తాపసాశ్రమ పదౌన్నత్యంబునం బొల్చు భా
సుర మందార రసాల సాల వకుళా శో కామ్ల పున్నాగ కే
సర జంబీర కదంబ నింబ కుట జాశ్వత్థ స్ఫుర న్మల్లికా
కరవీర క్షితి జాభిరామ బదరీ కాంతార సేవారతిన్. (160)
క. చనుచున్న వాఁడ నని ప, ల్కిన పలుకుల కులికి కళ వళించు విదురుం
డనుపమ శోకార్ణవమున, మునిఁగియు నిజ యోగ సత్వమునఁ దరియించెన్. (161)
వ. ఇట్లు విదురుండు శోకపావకునిం దన వివేక జలంబుల నార్పి యుద్ధవున కిట్లనియె. (162)
మ. అనఘా ? యుద్ధవ ! నీకుఁ గృష్ణుఁ డసురేంద్రారాతి మన్నించి చె
ప్పిన యధ్యాత్మ రహస్య తత్త్వ విమలాభిజ్ఞా సారంబు బో
రన నన్నుం గరుణించి చెప్పినఁ గృతార్ధత్వంబునుం బొందెదన్
విను పుణ్యాత్ములు శిష్యసంఘముల నుర్విం బ్రోవరే వెండియున్. (163)
క. భగవద్భక్తులు సుజనులు, దగ వెఱిఁగి పరోపకార తాత్పర్య వివే
క గరిష్ఠు లై చరింతురు, జగతిం బెంపొంది వృష్టి సత్తమ యెందున్. (164)
క. ఆనవుడు నుద్ధవుఁడ వ్విదు, రున కిట్లను ననఘ మునివరుఁడు సాక్షా ద్వి
ష్ణు నిభుం డగు మైత్రేయుఁడు, దన మనమున మను జగతి వదలఁ దలఁచి తగన్ (165)
క. హరి మురభేదిఁ బరాపరుఁ, గరుణాకరుఁ దలఁచు నట్టి ఘనుఁ డ మ్ముని కుం
జరు కడ కేగిన నాతఁడు, గర మర్ధిం దెలుపు సాత్త్విక జ్ఞానంబున్ (166)
వ. అని యుద్ధవుండు విదురం గూడి చని చని. (167)
ఉ. ముందటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు హల్లక పుల్ల పద్మ ని
ష్యంద మరంద పాన విలస న్మద భృంగఁ, జల త్తరంగ, మా
కంద లవంగ లుంగ లతికాచయ సంగ, సురాంగ నాశ్రితా
నందిత పుణ్య సంగ, యమునన్, భవ భంగ, శుభాంగ నర్మిలిన్. (168)
క. కని డాయ నేగి మోదం, బునఁ దత్సరి దమల పులిన భూములఁ దగ నా
దినశేషము నివసించెను, వనజోదర పాదపద్మ వశమానసుఁడై. (169)
క. మఱునాడు రేపకడ భా, సుర పుణ్యుఁడు ఘనుఁడు మధు నిషూదన చరణ
స్మరణ క్రీడా కలితుఁడు, దరియించెన్ గలుష గహనదమునన్ యమునన్. (170)
వ. ఇట్లుద్ధవుండు యమునానది ను త్తరించి బదరికాశ్రమంబునకుం జనియె. అనిన విని రాజేంద్రుండు యోగీంద్రున కిట్లనియె, (171)
క. శౌరియు నతిరథ వరులు మ, హారథ సమరథులు యదు బలాధిపు లెల్లన్
పోరి మృతిఁ బొంద నుద్ధవుఁ, డే రీతిన్ బ్రతికె నాకు నెఱిఁగింపు తగన్. (172)
సీ. నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుఁ డిట్లను మును పరమేష్టిచేత
సంప్రార్థితుండైన జలరుహనాభుండు వసుమతిపై యదువంశ మందు
నుదయించి తనుఁ దాన మదిలోనఁ జింతించి తెలివొంది యాత్మీయ కుల వినాశ
మొనరించి తాను బంచోపనిషణ్మయ మగు దివ్య దేహంబు నందుఁ జెందఁ
తే. దలఁచి విజ్ఞాన తత్వంబు ధరణిమీఁద, దాల్చి జనకోటి కెఱిఁగింపఁ దగిన ధీరుఁ
డుద్ధవుఁడు దక్క నితరు లే నోపరితఁడు, నిర్జితేంద్రియుఁ డాత్మసన్నిభుఁ డటంచు. (173)
క. క్షితిపై నిలిపిన కతమున నతనికి మృతి దొరక దయ్యె నవనీశ! రమా
పతి యభిమానము గల్గిన, యతిపుణ్యుఁడు చనియె బదరీకాశ్రమమునకున్ (174)
వ. అంత, (175)
క. ఉద్ధవుఁ డరిగినఁ బిదప స, మిద్ధ పరిజ్ఞాను సుజనహితు మైత్రేయున్
వృద్ధజన సేవ్యుఁ దాపస వృద్ధశ్రవుఁ జూడఁగోరి విదురుఁడు గణఁకన్. (176)
వ. యమునా నది దాఁటి కతిపయ ప్రయాణంబులఁ బుణ్యనదులు హరిక్షేత్రంబులు దర్శింపుచు నతి త్వరిత గమనంబున. (177)
క. చని చని ముందటఁ గనుగొనె, ఘనపాప తమః పతంగఁ గరుణాపాంగన్
గనదుత్తంగ తరంగన్, జనవరనుత బహుళపుణ్య సంగన్ గంగన్. (178)
క. అందు నరవింద సౌరభ, నందిత పవమాన ధూత నట దూర్మి పరి
స్పందిత కందళశీకర, సందోహ లసత్ప్రవాహ జల మజ్జనుఁడై. (179)
సీ. ఘనసార రుచి వాలుకా సముదంచిత సైకత వేదికా స్థలము నందు
యమ నియమాది యోగాంగ క్రియా నిష్ఠఁ బూని పద్మాసనాసీమఁ డగుచు
హరిపాద సరసీరుహ న్యస్త చిత్తుఁడై బాహ్యేంద్రియ వ్యాప్తిఁ బాఱఁ దోలి
సకల విద్వజ్జన స్తవనీయ సముచితాచార వ్రతోపవాసములఁ గ్రుస్సి
తే. యున్న పుణ్యాత్ము విగతవయోవికారు, వినుతసంచారు భువనపావనవిహారు
యోగిజనగేయు సత్తతి భాగధేయు నాశ్రితవిధేయు మైత్రేయు నపుడు గాంచె (180)