17. గాంధారీ ధృతరాష్ట్రులు దేహత్యాగము సేయుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మ. కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం

గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నేకాలంబు దుర్లంఘ్యమై

యనివర్యస్థితిఁ జంపు నట్టి నిరుపాయం బైన కాలంబు వ

చ్చె నుపాంతంబున మాఱు దీనికి మదిన్ జింతింపు ధాత్రీశ్వరా! (1-308)


శా. పుట్టంధుండువు, పెద్దవాఁడవు, మహాభోగంబులూ లేవు, నీ

పట్టెల్లంజెడిపోయె, దుస్సహ, జరాభారంబు పైఁ గప్పె, నీ

చుట్టా లెల్లను బోయి రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై

కట్టా! దాయలపంచ నుండఁ దగవే, కౌరవ్యవంశాగ్రణీ! (1-309)


క. పెట్టితిరి చిచ్చు గృహమునఁ, బట్టితిరి తదీయభార్యఁ, బాడడవులకుం

గొట్టితిరి, వారు మనుపఁగ, నెట్టైన భరింపవలెనే? యీ ప్రాణములన్. (1-310)


క. బిడ్డ లకు బుద్ధిసెప్పని, గ్రుడ్డికిఁ బిండింబు వండికొని పొం డిదె పైఁ

బడ్డాఁ డని భీముం డొఱ, గొడ్డెము లాడంగఁ గూడుఁ గుడిచెద వధిపా. (1-311)


క. కనియెదవో బిడ్డల నిఁక, మనియెదవో తొంటికంటె మనుమలమాటల్

వినియెదవో యిచ్చెద ర, మ్మనియెదవో దానములకు నవనీసురులన్. (1-312)


క.దేహము నిత్యము గాదని, మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై

గేహము వెలువడు నరుడు, త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా! (1-313)


వ. అని విదురుండు ధృతరాష్ట్రునకు విర క్తిమార్గం బుపదేశించిన నతండు, ప్రజ్ఞాచక్షుండై సంపారంబు దిగనాడి, మోహపాశంబులవలన నూడి, విజ్ఞసమార్గంబునం గూడి, దుర్గమంబుగు హిమవన్నగంబునకు నిర్గమించిన. (1-314)


శా. అంధుడైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ

బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమ ప్రఖ్యాతయై యున్న త

ద్గాంధార ఝితినాథు కూఁతురును యోగప్రీతి చిత్తంబులో

సంధిల్లం బతివెంట నేఁగె నుదయ త్సాధ్వీగూణారుఢయై. (1-315)


చ. వెనుకకు రాక చుచ్చు రణవీరునఇకైవడి రాజదండనం

బునకు భయంబులేక వడిఁ బోయెడు ధీరునిభంగి నప్పు డా

వనిత దురంతమైన హిమవంతముపొంత వనాంతభూమికిం

బెనిమిటితోడ నించుకయు భీతివహింపక యేగెఁ బ్రీతితోన్. (1-316)


వ. ఇట్లు విదురసహితులై గాధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన, మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి, నిత్యహోమంబులు గావించి,బ్రహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబు లిచ్చి, నమస్కరించి, గురువందనంబు కొఱకుఁ బూర్వప్రకారంబునం దండ్రి మందిరంబునకుం జని యందు విదురసహితులైన తల్లిదండ్రులం గానక మంజు పీఠంబునం గూర్చున్న సంజయున కిట్లనియె.(1-317)


సీ. మా తల్లిదండ్రులు మందిరంబున లేరు సంజయ! వా రెందుఁ జనిరొ నేఁడు

ముందఱ గానఁడు ముసలి మా పెదతండ్రి, పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి

సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి, మందబుద్ధులమైన మమ్ము విడిచి

యెందుఁబోయిరొ? మువ్వరెఱిఁగింపు గంగలోఁ దన యపరాధంబుఁదడవికొనుచు

ఆ. భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ గపట మింత లేదు,కరుణగలదు

పాండు భూవిభుండు పరలోకగతుఁడైన, మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు. (1-318)


వ. అనిన సంజయుండు (దయాస్నేహంబులనతికర్శితుండగుచు తన ప్రభువు పోయిన తెఱం గెఱుంగక కొంతదడ పూరకుండి) త ద్వియోగదుఃఖంబునఁ గన్నీరు కరతలంబునఁ దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి (తన భర్తృపాదంబుల మనంబున నెన్నుచు) ధర్మజున కిట్లనియె. (1-319)


తే. అఖిలవార్తలు మున్ను నన్నురుగుచుండు, నడుగఁ దీరేయి మీతండ్రి యవనినాథ!

మందిరములోన విదురుతో మంతనంబు, నిన్న యాడుచునుండెను నేఁడు లేఁడు. (1-320)


వ. విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁ బోయిరో? (వారల నిశ్చయంబు లెట్టివో?) యెఱుంగనని సంజయుండు దుఃఖించు సమయంబునఁ దుంబురుసహితుండై నారదుండు వచ్చిన లేచి, నమస్కరించి, తమ్ములుందానును నారదుం బూజించి కొంతెయాగ్రజుం డిట్లనియె. (1-321)


ఉ. అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు, మహాత్మ! వారు నేఁ

డెక్కడ బోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డ పేరు గ్రుచ్చి తాఁ

బుక్కచునుండుఁ దల్లి: యెటు వోయె నొకో! విపదంబురాశికిన్

నిక్కము గర్ణధారుఁడవు నీవు జగజ్జన పారదర్శనా! (1-322)


వ. అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె. (ఈశ్వరవశంబు విశ్వంబు. ఈశ్వరుండె భూతంబుల నొకటితో నొకటిఁ జేర్చుఁ , నెడఁబాపు. సూచీభీన్న నాసికలందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టంబడిన బలీవర్దంబులబోలెఁ గర్తవ్యాకర్తవ్య విధాయక వేదలక్షణ యగు వాక్తంత్రియందు వర్ణాశ్రమలక్షణంబులు గల నామంబులచే బద్ధులైన) లొకపాల సహింబులైలొకంబులీశ్వరాదేశంబు వహించు. క్రీడాసాధనంబులగు (నక్షకందుకాదుల) కెట్లు సంయోగవియోగంబు లట్లు క్రీడించు నీశ్వరునికిం గ్రీడాసాధనంబులైన జంతువులకు సంయోగవియోగంబులు గలుగుచుండు. సమస్తజనంబును జీవరూపంబున ధ్రువంబున, దేహరూపంబున నధ్రువంబునై యుండు.మఱియు నోక్కపక్షంబున ధ్రవంబు నధ్రువంబు గాకయుండు. శుద్ధబ్రహ్మరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై యుండు. అజగతరంబుచేత మ్రింగబడిన పురుషుఁడన్యుల రక్షింపలేని తెఱంగునఁ బంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరులరక్షింప సమర్థంబుగాదు. కరంబులుగల జంతువులకుఁ గరంబులు లేని చతుష్పదాదు లాహారంబులగు. చరణంబులు గల ప్రాణులకు జరణంబులులేని తృణాదులు భక్షణీయంబులగు. అధిక జన్మంబులుగల (వ్యాఘ్రాదులకు) నల్పజన్మంబుగల మృగాదులు భోజ్యంబులగు. సకల దేహిదేహంబులందు జీవుండు గలుగుటంజేసి జీవునికి జీవుండ జీవికియగు. అహస్త సహస్తాది రూపమ్బైన విశ్వమంతయు నీశ్వరుండుగాఁ దెలియుము. ఆతనికి వేఱు లేదు. నిజమాయా విశేషంబున మాయావియై జాతి భేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగి భోగ్య రూపంబుల నంతరంగ బహిరంగబుల దీపించు. (కాన యనాథులు దీనులునగు నామ తల్లిదండ్రులు నమం బాసి యే మయ్యెదరొ? యెట్లు వర్తించుదురొ? యని వగవం బనిలేదు. అజ్ఞానములం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మని మఱియు నిట్లనియె).(1-323)


ఆ. అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ , డసురనాశమునకు నవతరించి

దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కినపని, కెదురు సూచుచుండు నిప్పు డధిప! (1-324)


మత్తకోకిల. ఎంతకాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు,మీ

రంతకాలము నుండుఁ డందఱు, నవ్వలం బనిలేదు, వి

భ్రాంతి మానుము, కాలముం గడవంగ నెవ్వరు నోప, రీ

తించయేల? నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్ . (1-325)


వ. ధృతరాష్ట్రుడు గాంధారీ విదురు సహితుండై హిమవత్పర్వత దక్షినభాగంబున నొక్క మునివనంబున జని, తొల్లి సప్తఋషులకు సంతోషంబు సేయుకోఱుచు, నాకాశగంగ యేడు ప్రవాహంబులై పాఱిన పున్యతీర్థంబున గృత స్నానుండై యథావిది హోమ మెనరించి, జలభక్షనంబు గావించి, సకల కర్మంబులువిసర్జించి, విఘ్నంబుఁ జెందక, నిరాహారుండై, యుపశాతాత్ముఁ డగుచు, పుత్రార్ధదారైషణంబులు వర్జించి, విన్యస్తాసనుండై, ప్రాణంబులు నియమించి, మనస్సహితంబులైన చక్షు రాదీంద్రియంబులు నాఱింటిని విషయంబులం ప్రవర్తింపనీక నివర్తించి, హరిభావనారూపంబగు ధారణా యోగంబుచే రజ స్సత్త్వతమో రూపంబులగు మలంబుల మూఁటిని హరించి, మనంబు నహంకారస్పదంబైన స్థూలదేహంబువలనం బాపి, బుద్ధియందు నేకీకరణంబుచేసి, యట్టి విజ్ఞానాత్మను దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞుని యందుఁ బొందింది ద్రష్ట్రంశంబువలన క్షేత్రజ్ఞునిం బాసి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు కైవడి నాధారభూతంబైన బ్రహ్మమందుఁ గలిపి, లోపలి గుణక్షోధంబును, వెలుపలి యింద్రియ విక్షేపంబును లేక నిర్మూలిత మాయాగుణ వాసనుండగుచు, నిరుద్ధంబులగు మనశ్చక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలహారంబులను వర్జించి, కొఱడు చందంబున. (1-326)


మ. ఉటజాంతస్థల వేదికన్ నియతుఁడై యునాఁడు నేఁ డాదిగా

నిటపై నేనవనాఁడు మేన్ విడువఁగా నిజ్యాగ్ని యోగాగ్నిత

త్పట దేహంబు దహింపఁ జూచి, నియమ ప్రఖ్యాత గాంధారి యి

ట్టటు వో నొల్లక, ప్రాణనవల్లభునితో నగ్నిం బడుం భూవరా ! (1-327)


క. అంతట వారల మరణము, వింతయగుచుఁ జూడఁబడిన విడురుఁడు చింతా

సంతాప మొదవఁ బ్రీత, స్వాంతుడై తీర్థములకుఁ జనియెడు నధిపా ! (1-328)


వ. అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనున కెఱింగించి తుంబురు సహితుండై నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక, ధర్మజుండు, భీమునిం జూచి యిట్లనియె. (1-329)

                             "సమాప్తము"