14. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట

వికీసోర్స్ నుండి

శా. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ

గ్జాలంబులు హరి మోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని

ర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం

శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీహరిన్ శ్రీహరిన్. (1-215)


వ. ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతియైన బుద్ధిని సమర్పించి పరమానందంబు నొంది ప్రకృతి వలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలంపున మందాకినీనందనుం డిట్లనియె. (1-216)


మ. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ

రజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్. (1-217)


మ. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చు వేడ్క నని నా శస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్. (1-218)


మ. నరు మాటల్ విని నవ్వుతో నుభయసేనా మధ్యమ క్షోణిలోఁ

బరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం

బరభూపాయువులెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడు మన:పద్మాసనాసీనుఁడై. (1-219)


కం. తనవారిఁ జంపఁజాలక, వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్

ఘన యోగవిద్యఁ బాపిన, మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్. (2-220)


సీ. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి, గగన భాగం బెల్లఁ గప్పికొనఁగ

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న, జగముల వ్రేఁగున జగతి గదలఁ

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ , బై నున్న పచ్చని పటము జాఱ

నమ్మితి నా లావు నగుబాటు సేయక, మన్నింపుమని కిరీటి మఱలఁ దిగువఁ

తే.గీ.గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాఁతు

విడువు మర్జున ! యంచు మద్విశిఖ వృష్టిఁ , దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. (2-221)


మ.తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న

ర్జున సారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్

మునికోలన్ వడిఁజూపి ఘోటకములన్ మోదించి తాటింపుచున్

జనులన్ మోహము నొందఁజేయు పరమోహాత్సాహుం బ్రశంసించెదన్. (1-222)


కం. పలుకుల నగవుల నడపుల, నలుకల నవలోకనముల నాభీర వధూ

కులముల మనముల తాలిమి, కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్. (1-223)


ఆ.వె. మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా, మందిరమున యాగమండపమునఁ

జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది, దేవుఁడమరు నాదు దృష్టియందు. (1-224)


మ. ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో

లిక నే దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ

న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ

పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై. (1-225)


వ. అని యిట్లు మనో వాగ్దర్శనంబులం బరమాత్మ యగు కృష్ణుని హృదయంబున నిలిపికొని ని:శ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి. దేవమానవ వాదితంబులై దుందుభి నినదంబులు మొరసె. సాధుజన కీర్తనంబులు మెఱసె. కుసుమ వర్షంబులు గుఱిసె. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి (ముహూర్తమాత్రంబు దు:ఖితుండయ్యె. అంత నచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగులగుచుఁ దదీయ దివ్యనామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుఁ జనిరి. పిదప నయ్యుధిష్ఠిరుండు) కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీసహితుండైన ధృతరాష్ట్రు నొడంబఱచి వారి సమ్మతంబున వాసుదేవానుమోదితుండై, పితృపైతామహంబైన రాజ్యంబుఁ గైకొని ధర్మమార్గంబునఁ బాలనంబు సేయుచుండె నని సూతుండు సెప్పిన విని శౌనకుం డిట్లనియె. (1-226)


అధ్యాయము - ౧౦


ఆ.వె. ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయి జనుల నని వధించి

బంధుమరణ దు:ఖ భరమున ధర్మజుఁ , డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె. (1-227)


వ. అనిన సూతుం డిట్లనియె. (1-228)


కం. కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ

ధరణీ రాజ్యమునకు నీ,శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. (1-229)


వ. (ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబు గా దనునది మొదలగు భీష్ముని వచనంబుల) హరిసంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తిత శంకాకళంకుండు నై నారాయణాశ్రయుండైన యింద్రుండును బోలెఁ జతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలంబు సహోదర సహాయుండై యేలుచుండె. (1-230)


సీ. సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గుఱియించు, నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు

గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు, ఫలవంతములు లతాపాదపములు

పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల, ధర్మమెల్లెడలను దనరి యుండు

దైవభూతాత్మతంత్రములగు రోగాది, భయములు సెందవు ప్రజలకెందు

ఆ.వె. గురుకులోత్తముండు కుంతీతనూజుండు, దానమానఘనుఁడు ధర్మజుండు

సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య, విభవభాజియైన వేళయందు. (1-231)