13. ధర్మరాజు శ్రీకృష్ణ సహితుండై అంపశయ్య నున్న భీష్ముని కడకేఁగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ. అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతి మాటలకు నియ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులన్ వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచె. అంత బంధువధ శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబున నిట్లనియె. (1-200)


మ. తన దేహంబునకై యనేక మృగ సంతానంబుఁ జంపించు దు

ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ని

ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా

యన లక్షావధికైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే ? (1-201)


వ. మఱియుఁ బ్రజాపరిపాలనపరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువులఁ జంపించినఁ బాపంబు లేదని శాస్త్రవచనంబు కలదు. అయిన నిది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు. చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి. హతబంధులైన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబుల చేతం బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబునఁ బంకిల స్థలంబునకును, మద్యంబున మద్యభాండమునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాప నిర్ముక్తి లేదని శంకించెద. (1-202)


అధ్యాయము-9


కం. అని యిట్లు ధర్మసూనుఁడు, మొనసి నిరాహార భావమున దేవనదీ

తనయుఁడు కూలిన చోటికిఁ, జనియెఁ బ్రజాద్రోహ పాప చలితాత్ముండై. (1-203)


వ. అయ్యవసరమునం దక్కిన పాండవులును, ఫల్గున సహితుండైన పద్మలోచనుండును గాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజుం గూడి చన నతండు గుహ్యక సహితుండైన కుబేరుని భంగి నొప్పె. ఇట్లు పాండవులు పరిజనులు కొలువఁ బద్మనాభ సహితులై కురుక్షేత్రమున కేఁగి దివంబు నుండి నేలం గూలిన దేవత తెఱంగున సంగ్రామ పతితుండైన గంగానందనునకు నమస్కరించిరి. అంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వశిష్ఠాద్యనేక రాజర్షి దేవర్షి బ్రహ్మర్షులు శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశకాలవిభాగవేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి, (1-204)


కం. మాయాంగీకృత దేహుం,డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాడని ప్ర

జ్ఞాయుత చిత్తంబున గాం,గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్. (1-205)


వ. మఱియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనులం గూర్చుండ నియోగించి, మహానురాగ బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె. (1-206)


ఆ.వె. ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగాఁ , బ్రదుకఁదలఁచి మీరు బహువిధముల

నన్నలార ! పడితి రాపత్పరంపర, లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదె ? (1-207)


ఉ. సంతసమింత లేదు ; మృగశాప వశంబునఁ బాండు భూవిభుం

డంతము నొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో

నింతటివారుగాఁ బెనిచె ; నెన్నడు సౌఖ్యము పట్టు గానదీ

కుంతి ; యనేక దు:ఖములఁ గుందుచునున్నది ; భాగ్యమెట్టిదో ! (1-208)


ఉ. వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం

బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై

పాయుచుఁ గూడుచుండు ; నొక భంగిఁ జరింపదు ; కాల మన్నియుం

జేయుచునుండుఁ ; గాలము విచిత్రము ; దుస్తర మెట్టివారికిన్. (1-209)


ఉ. రాజఁట ధర్మజుండు ; సురరాజ సుతుండఁట ధన్వి ; శాత్రవో

ద్వేజకమైన గాండివము విల్లఁట ; సారథి సర్వభద్ర సం

యోజకుఁడైన చక్రి యఁట ; యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ

య్యాజికిఁ దోడు వచ్చునఁట ; యాపద కల్గుట యేమి చోద్యమో ! (1-210)


ఆ.వె. ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని, నేమి సేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు ?

నతని మాయలకు మహాత్ములు విద్వాంసు, లణఁగి మెలగుచుందు రంధులగుచు. (1-211)


వ. కావున దైవతంత్రంబైన పనికి వగవం బనిలేదు. రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు తేజో నిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబులన్ మోహాతిరేకంబు నొందించు. అతని రహస్యప్రకారంబులు భగవంతుండైన శివుండెఱుంగు. మఱియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిలమునియు నెఱుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుండని మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధుమిత్త్ర ప్రయోజనంబుల నియమించుదు రన్నిటం గొఱంత లేదు. రాగాది శూన్యుండు, నిరహంకారుం డద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండైన యీశ్వరునకు నతోన్నత భావ మతివైషమ్యంబు లెక్కడివి ? అయిన భక్తవత్సలుండు గావున నేకాంత భక్తులకు సులభుండై యుండు. (1-212)


సీ. అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి, యెవ్వని నామ మూహించి పొగడి

కాయంబు విడచుచుఁ గామకర్మాది నిర్,మూలనుండై యోగి ముక్తినొందు

నట్టి సర్వేశ్వరుం డఖిల దేవోత్తంసుఁ, డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు

నందాక నిదె మందహాసుఁడై వికసిత, వదనారవిందుఁడై వచ్చి నేఁడు

తే.గీ. నాల్గు భుజములుఁ గమలాభ నయనయుగము, నొప్పుఁ గన్నుల ముంగట నున్నవాఁడు

మానవేశ్వర ! నా భాగ్యమహిమఁ జూడు, మేమి సేసితినో పుణ్య మితనిఁ గూర్చి. (1-213)


వ. అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులు వినయంబున నాకర్ణించి మునులందఱు వినుచునుండ మందాకినీనందను వలన (నరజాతి సాధారణంబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును) రాగ వైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును. దానధర్మంబులును, రాజధర్మంబులును, స్త్రీధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థ కామ మోక్షంబులును (నానావిధేతిహాసోపాఖ్యానంబులును ) సంక్షేప విస్తార రూపంబుల నెఱింగె. అంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన నది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి, (1-214)