10. బ్రహ్మకు శ్రీమన్నారాయణుని వరప్రదానము

వికీసోర్స్ నుండి

చ|| ప్రియుఁడగు బొడ్డుతమ్మి తొలి | బిడ్డని, వేలుపుపెద్ద, భూత సం

చయములఁ బుట్టఁజేయు నిజ | శాసనపాత్రు, నుపస్థితున్ , మదిన్

దయ తళుకొత్తఁ బల్కెఁ బ్రమ | ద స్మిత చారు ముఖారవిందుఁడై

నయమునఁ బాణిపంకజము | నన్ హరి యాతని దేహమంటుచున్. (240)


ఆ|| కపట మునుల కెంత | కాలంబునకు నైన, సంతసింప నేను | జలజగర్భ !

చిర తపస్సమాధిఁ | జెంది విసర్గేచ్ఛ, మెలఁగు నిన్నుఁ బరిణ | మింతుఁ గాని. (241)


తే|| భద్రమగుఁ గాక నీకు నో | పద్మగర్భ ! వరము నిపుడిత్తు నెఱిఁగింపు | వాంఛితంబు

దేవదేవుఁడనగు నస్మ | దీయ పాద, దర్శనం బవధి విపత్తి | దశల కనఘ ! (242)


చ|| సరసిజగర్భ ! నీయెడఁ బ్ర | సన్నత నొంది మదీయ లోక మే

నిరవుగఁ జూపుటెల్లను స | హేతుక భూరి దయాకటాక్ష వి

స్ఫురణను గాని నీదగు త | పో విభవంబునఁ గాదు నీ తప

శ్చరణము నాదు వాక్యముల | సంగతి గాదె ? పయోరుహాననా ! (243)


కం|| తపమనఁగ నాదు హృదయము, దపమను తరువుఅకు ఫల వి | తానము నే నా

తపముననే జనన స్థి, త్యుపసంహరణము లొనర్చు | చుండుదుఁ దనయా ! (244)


కం|| కావున మద్భక్తికిఁ దప, మే విధమున మూలధనమొ | యిది నీ మది రా

జీవభవ ! యెఱిఁగి తపమిటు, కావించుట విగత మోహ | కర్ముఁడ వింకన్. (245)


కం|| అని యానతిచ్చి కమలజ, యెనయఁగ భవదీయ మాన | సేప్సిత మేమై

నను నిత్తు వేఁడుమనినను, వనరుహ సంభవుఁడు వికచ | వదనుం డగుచున్. (246)


చ|| హరివచనంబు లాత్మకుఁ బ్రి | యం బొనరింపఁ బయోజగర్భుఁ డో

పరమపదేశ ! యోగిజన | భావన ! యీ నిఖిలోర్వియందు నీ

వరయనియట్టి యర్థమొక | టైనను గల్గునె ? యైన నా మదిన్

బెరసిన కోర్కె దేవ ! విని | పింతు దయామతిఁ జిత్తగింపవే ? (247)


వ|| దేవా ! సర్వభూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెద నవధరింపుము. అవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూల

సూక్ష్మ రూపంబులును, నానా శక్త్యుపబృంహితంబులైన బ్రహ్మాదిరూపంబులును, నీయంత నీవే ధరియించి జగదుత్పత్తిస్థితిలయంబులం దంతుకీటంబునుం బోలెం

గావింపుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృప సేయుము. భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు

గావించునపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహదహంకారంబులు నా మదిం బొడముం గావునం దత్పరిహారార్థంబు వేఁడెద. నన్నుం గృపాదృష్టి విలోకించి

దయసేయుమని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె. (248)


కం|| వారిజభవ ! శాస్త్రార్థ వి, చార జ్ఞానమును భక్తి | సమధిక సాక్షా

త్కారములను నీ మూఁడును ను, దారత నీ మనమునందు | ధరియింప నగున్. (249)


సీ|| పరికింప మత్స్వరూ | ప స్వభావములును, మహితావతార క | ర్మములుఁ దెలియు

తత్త్వవిజ్ఞానంబుఁ దలకొని | మత్ప్రసా, దమునఁ గల్గెడి నీకుఁ | గమలగర్భ !

సృష్టిపూర్వమున జ | ర్చింప నే నొకఱుండఁ , గలిగియుండుదు వీత | కర్మి నగుచు

సమధిక స్థూల సూ | క్ష్మ స్వరూపములుఁ ద, త్కారణ ప్రకృతియుఁ | దగ మదంశ


ఆ|| మందు లీనమైన | నద్వితీయుండనై, యుండు నాకు నన్య | మొకటి లేదు

సృష్టికాలమందు | సృష్టినాశంబున, జగము మత్స్వరూప | మగును వత్స ! (250)


కం|| అరయఁగఁ గల్పప్రళయాం, తరము ననాద్యంత విరహి | త క్రియ తోడన్

బరిపూర్ణ నిత్యమహిమం, బరమాత్ముఁడనై సరోజ | భవ ! యేనుందున్. (251)


వ. అదియునుం గాక నీవు నన్నడిగిన యీ జగన్నిర్మాణ మాయాప్రకారం బెఱిఁగింతు. లేని యర్థంబు శుక్తిరజతభ్రాంతియుం బోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱం దోఁపక

మాను నిదియె నా మాయావిశేషం బని యెఱుఁగుము. ఇదియునుం గాక లేని యర్థము దృశ్యం బగుటకుం, గల యర్థం బు దృశ్యంబు గాకుండుటకును,

ద్విచంద్రాదికంబును, దమఃప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియుము. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందుం బ్రవేశించి యుండు నా

ప్రకారంబున నేను నీ భూత భౌతికంబులైన సర్వకార్యంబులందు , సత్త్వాదిరూపంబులం బ్రవేశించియుండుదు. భౌతికంబులు భూతంబులయందుఁ గారణావస్థం బొందు

చందంబున భూతభౌతికంబులు కారణావస్థం బొందిన నాయందు నభివ్యక్తంబులై యుండవు. సర్వదేశంబులయందును, సర్వకాలంబులయందును నేది బోధితంబై

యుండునట్టిదే పరబ్రహ్మస్వరూపంబు. తత్త్వం బెఱుంగ నిచ్ఛయించిన మినుఁ బోటివారలీ చెప్పినది మదీయ తత్త్వాత్మకంబైన యర్థం బని యెఱుంగుదురు. ఈ యర్థం

బుత్కృష్టంబైనయది. ఏకాగ్ర చిత్తుండవై యాకర్ణించి భవదీయ చిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు సెందకుండెడి నని భగవంతుండైన

పరమేశ్వరుండు చతుర్ముఖున కాజ్ఞాపించి నిజలోకంబుతో నంతర్ధానంబు నొందె నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె. (252)


సీ|| అవనీశ ! బ్రహ్మ యి | ట్లంతర్హితుండైనఁ , బుండరీకాక్షుని | బుద్ధి నిలిపి

యానందమును బొంది | యంజలిఁ గావించి, తత్పరిగ్రహమునఁ | దనదు బుద్ధిఁ

గైకొని పూర్వ ప్ర | కారంబునను సమ, స్త ప్రపంచం బెల్లఁ | దగ సృజించి

మఱియొకనాఁడు ధ | ర్మ ప్రవర్తకుఁడౌచు, నఖిల ప్రజాపతి | యైన కమల


తే|| గర్బుఁ డాత్మహితార్థమై | కాక సకల, భువనహిత బుద్ధి నున్నత | స్ఫురణ మెఱసి

మానితంబైన యమ నియ | మముల రెంటి, నాచరించెను సమ్మోది | తాత్ముఁడగుచు. (253)