1. విదురుండు తీర్థయాత్ర సేయుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క. శ్రీ మహిత వినుత దివిజ స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు

స్థేమ, వినిర్జిత భార్గవరామ! దశానన విరామ! రఘుకులరామా! (1)


                                 అధ్యాయము-౧

వ. మహనీయగుణగరిష్ఠు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతం డి ట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్న రేంద్రునకు శుక యోగీంద్రుం డిట్లనియె. (2)


                              విదురుండు తీర్థయాత్ర సేయుట


ఉ. పాండునృపాల నందనుల బాహుబలంబున ధార్తరాష్టృలన్

భండనభూమిలో గెలిచి పాండుర శారద చంద్ర చంద్రికా

ఖండయశః ప్రసూన కలికావళిఁ గౌరవ రాజ్యలక్ష్మి నొం

డొండ యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండఁగన్. (3)


క. మనుజేంద్ర విదురుఁ డంతకు, మును వసమున కేఁగి యచట మునిజన గేయున్

వినుత తపో ధౌరేయున్, ఘను ననుపమ గుణవిధేయుఁ గనె మైత్రేయున్. (4)


క. కనుఁగొని తత్పాదంబులు, దన ఫాలము సోక మ్రొక్కి తగ ని ట్లనియెన్

మునివర్య! సకల జగత్పా, వనచరితుఁడు గృష్ణుఁ డఖిల వంద్యుం డెలమిన్. (5)


క. మండిత తేజోనిధి యై, పాండవహితమతిని దూతభావంబున వే

దండపురి కేగి కురుకుల, మండనుఁ డగు ధార్త రాష్టృ మందిరమునకున్. (6)


తే. చనఁగ నొల్లక మద్గృహంబునకు భక్త, వత్సలుం డగు కృష్ణుండు వచ్చు టేమి

కతము? నాకది యెఱిఁగింపు కరుణతోడ, ననుచు విదురుండు మైత్రేయునడిగె ననిన (7)


క. విని వెఱఁగది పరీక్షి, న్మ నుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రున్

మునికుల జలనిధి చంద్రున్, సునిశిత హరిభక్తిసాంద్రు శుక యోగీంద్రున్. (8)


క. కని యిట్లనె మైత్రేయుని, ననఘుం డగు విదురుఁ డే రహస్యము లడిగెన్

ముని యేమి చెప్పె నే పగి, దిని దీర్థము లాడె నెచటఁ దిరుగుచు నుండెన్. (9)


తే. ఇన్ని దెలియంగ నానతి యిచ్చి నన్ను, నర్థి రక్షింపవే విమలాంతరంగ!

ఘనదయాపాంగ! హరిపాదకమలభృంగ!, మహితగుణసంగ! పాపతమఃపతంగ! (10)


చ. అనవుఁడు బాదరాయణి ధరాధిపుతో ననుఁ బూరువంశవ

ర్ధన! విను కష్టుఁడైన ధృతరాష్టృ నృపాలుఁడు పెంపుతో సుయో

ధన ముఖ పుత్రులం గడు ముదంబునఁ బెంపుచుఁ బాండురాజు ద

ప్పిన పిదపన్ దదాత్మజులు పెల్కుఱి త న్నని చేర వచ్చినన్. (11)


వ. ఇట్లు వచ్చిన పాండవుల యెడ నసూయా నిమగ్నులై సుయోధనాదులు, (12)


క. పెట్టిరి విషాన్న మంటం, గట్టిరి ఘనపాశములను గంగానదిలో

నెట్టిరి, రాజ్యము వెడలం, గొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. (13)


క. క్రూరాత్ము లగుచు లాక్షా, గారంబున వారు నిద్రఁ గైకొని యుండన్

దారుణ శిఖి దరికొలిపిరి, మారణ కర్మముల కప్రమత్తులు నగుచున్. (14)


తే. సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ, విలస దవభృథ స్నాన పవిత్ర మైన

ద్రౌపదీ చారు వేణీభరంబు వట్టి, కొలువు లోపల నీడ్చిరి కుత్సితమున. (15)


క. కావున వారల కపకృతిఁ, గావింపని దొక దినంబు గలుగదు తమ జ

న్మావధి నిజనందనులను, వావిఠి న య్యంధ నృపతి వలదనఁ డయ్యెన్. (16)


తే. మాయజూదంబువన్ని దుర్మార్గవృత్తిఁ, బుడమిఁగొని యడవులకుఁబో నడువనచటఁ

దిగిరి వారలు సమయంబు దీర్చి యేఁగు, దెంచి తమ యంశ మడిగినఁ బంచి యిడక. (17)


వ. ఉన్న యెడ, (18)


చ. సకల నియంత యైన హరి సర్వశరణ్యుఁడు మాధవుండు సే

వకనవకల్పకంబు భగవంతుఁ డనంతుఁ డనంతశక్తి నం

దకధరుఁ డబ్జలోచనుఁడు ధర్మతనూభవుచే నియుక్తుఁడై

యకుటిల భక్తి యోగమహితాత్మకుఁడై ధృతరాష్టృ పాలికిన్. (19)


క. చని యచట భీష్మ గురు త, త్తనయ కృపాచార్య నిఖిలి ధాత్రీపతులున్

విని యనుమోదింపఁగ ని, ట్లనియెన్ ధృతరాష్టృ తోడ నవనీనాథా! (20)


క. కౌరవ పాండవు లిరువురుఁ నారయ నీ కొక్క సమమ యవనీవర ! నీ

వేరీతి నైనఁ బాండుకు, మారుల పా లొసఁగి తేని మను నుభయంబున్ (21)


క. అని ధర్మబోధమునఁ బలి, కిన మాటలు చెవుల నిడమి గృష్ణుఁడు విదురున్

ఘననీతిమంతుఁ బిలువం, బనిచినఁ జనుదెంచెఁ గురుసభాస్థలమునకున్. (22)


వ. చనుదెంచి యచటి జనంబులచేత నుపస్థితం బైన కార్యంబు దెలుపఁబడిన వాఁడై ధృతరాష్ర్టు నుద్దేశించి యి ట్లనియె. (23)


మ. ధరణీనాయక! పాండు భూవిభుఁడు నీ తమ్ముండు, దత్పుత్తృలన్

బరిరక్షించిన ధర్మముం దగవునుం బాటిల్లు, వంశంబు సు

స్థిర సౌఖ్యోన్నతిఁ జెందు, శత్రుజయమున్ జేకూరు, గోపాల శే

ఖరు చిత్తంబును వచ్చు, నట్లగుట యోఁ గౌరవ్యవంశాగ్రణీ ! (24)


ఆ. వారి తండ్రి పాలు వారికి నొసగి నీ, పాలు సుతుల కెల్ల బంచియిచ్చి

చలము విడిచి ధర్మమలవడ నీ బుద్ధిఁ, జొనుపవయ్య కులము మనుపవయ్య! (25)


చ. వినుము నృపాల ! నా పలుకు వేయును నేల సమీరసూతి నీ

తనయుల పేరు విన్నఁ బదతాడితదుష్టభుజంగమంబు చా

డ్పునఁ గనలొందు నింతయును మున్ను నుఁ జెప్పితిఁ గాదె వానిచే

తన భవదీయ పుత్రులకుఁ దప్పదు మృత్యు వ దెన్ని భంగులన్. (26)


వ. అదియునుం గాక, (27)


క. నీ పుత్రుల శార్యంబును, చాపాచా ర్యాపగాత్మజాత కృపభుజా

టోపంబును గర్ణుదురా, లాపంబును నిజముగాఁ దలంతె మనమునన్. (28)


వ. అ ట్లేని వినుము, (29)


ఉ. ఏ పరమేశుచె జగము లీ సచారాచరకోటితో సము

ద్దీపిత మయ్యె నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ

రీపతి ముఖ్య దేవముని బృందము లెవ్వఁ డనంతుఁ డచ్యుతు

డా పురుషోత్తముండు గరుణాంబుధి గృష్ణుఁడు వో నరేశ్వరా ! (30)


ఉ. అట్టి జగన్నివాసుఁడు మురాసురభేది పరాపరుండు చే

పట్టి సఖుండు వియ్యమును భాంధవుఁడున్ గురుఁడున్ విభుండు నై

యిట్టల మైన ప్రేమమున నెప్పుడుఁ దోడ్పడుచుండు వారలన్

జుట్టన వ్రేల నెవ్వరికిఁ జూపగ వచ్చును బార్థివోత్తమా ! (31)


ఉ. కావునఁ బాండునందనులఁ గాఱియపెట్టక రాజ్యభాగమున్

వావిరి నిచ్చి రాజ్యమును వంశముఁ బుత్తృల బంధువర్గమున్

గావుము కాక లోభియగు కష్ట సుయోధను మాట వింటివే

భూవర! నీయుపేక్ష నగుఁ బో కులనాశము బంధునాశమున్. (32)


తే. ఒకనికై యిట్లు కుల మెల్ల నుక్కణంప, నెత్తుకొనఁ జూచె దిది నీతియేనృపాల !

వినుము నామాట నీ సుయోధనుని విడిచి, కులము రాజ్యంబుఁదేజంబు నిలుపవయ్య. (33)


క. అని యిట్ల దఱిమి చెప్పిన, విని దుర్యోధనుఁడు రోషవివశుం డయి తా

నినతనయ శకుని దుశ్శా, సనుల నిరీక్షించి తామసంబునఁ బలికిన్. (34)


క. దాసీపుత్తృని మీర లు, దాసీనుం జేయ కిటకుఁ దగునె పిలువఁగా

నాసీనుండై ప్రేలెడు, గాసిలి చెడిపోవ వెడలఁగా నడువ రనా. (35)


వ. అని యిట్లు దుర్యోధనుం డాడిన దురాలాపంబులు దనకు మనస్తాపంబు సేయం గార్యంబు విచారించి ధైర్యం బవలంబించి యొండు పలుక నొల్లక శరశరాస నంబులు విడిచి క్రోధంబు

నడఁచి వనంబునకుం జని యందు, (36)


సీ. విష్ణు స్వయంవ్యక్తవిమల భూములను బవిత్రంబు లగు హరిక్షేత్రములను

నెలకొని దేవతానిర్మిత హరిదివ్య భూముల గంగాది పుణ్యనదుల

సిద్ధ పురాణ ప్రసిద్ధ పుణ్యాశ్రమ స్థలముల నుపవన స్థలము లందు

గంధమాదన ముఖ క్ష్మాభృత్తటంబుల మంజుల గిరికుంజ పుంజములను


తే. వికచకైరవ పద్మహల్లక మరంద, పానపరవశ మధుకర గానబద్ధ

రాజహంస విలోల విరాజమాన, మగుచుఁ జెలువొందు పంకేరుహాకరముల. (37)


క. నరవర ఋష్యాశ్రమవన, సరి దుపవన నద పుళిందజనపద గిరి గ

హ్వర గోష్ఠ యజ్ఞశాలా, పురదేవాయతన పుణ్య భూముల యందున్. (38)


క. కూరలు గాయలు నీళ్లా, హారముగాఁ గొనుచు నియమ మలవడఁగ ససం

స్కారశరీరుం డగుచు ను, దారత నవధూతవేషధరుఁడై వరుసన్. (39)


క. హర్షము గదురఁగ భారత, వర్షమునం గలుగు పుణ్య వరతీర్థము లు

త్కర్షం జూచుచు విగతా, మర్షుండై సంచరించె మనుజవరేణ్యా ! (40)


వ. ఇట్లు సంచరించుచుం బ్రభాసతీర్థమునకు వచ్చు నప్పుడు, (41)

చ. అరుగుచు దైత్యభేదన దయా పరిలబ్ధ సమ స్తమేదినీ

భరణధురంధరుం డగుచుఁ బాండుసుతాగ్రజుఁ డొప్పుచుండ న

త్తఱి విదురుండు తత్సరి దుదంచితసాలరసాల మాధవీ

కురువక మాలతీ వకుళ కుంజ లస త్తట మందు నున్నెడన్. (42)


చ. నరవర వేణు జానలవినష్ట మహాటవి మాడ్కిఁ బాండు భూ

వర ధృతరాష్టృ సూను లనివార్య నిరూఢ విరోధ మె త్తి యొం

డొరుల జయింపఁగోరి కదనోర్విఁ గురు క్షితిపాలముఖ్యు లం

దఱు మృతు లౌటయున్ విని ఘనంబుగ శోకనిమగ్న చిత్తుఁడై. (43)


ఉ. ఆ యెడఁ గాలు దన్నక రయంబున నేగి సరస్వతీనదీ

తోయములందుఁ గ్రుంకి మునితుల్యుఁడు వే చనియెం దనూనపా

త్తోయరుహాప్త భార్గవ పృథుత్రిత సోమసుదాసగోగ్ని భూ

వాయు యమాభిధానయుత వాహినులం దనుర క్తిఁ గ్రుంకుచున్. (44)


ఉ. వెండియుఁ బుణ్యభూములఁ బవిత్రసరిత్తులఁ జూచుచున్ రమా

మండనుఁ డుండు దివ్యరుచిమన్మణి చారుక వాట గేవాళీ

మండిత సౌధగోపుర విమానము లున్నత భక్తిఁ జూచుచున్

నిండిన వేడ్కఁ గృష్ట పద నీరజ చింతనుఁడై క్రమంబునన్. (45)