హైందవ స్వరాజ్యము/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పందొమ్మిదవ ప్రకరణము.

యంత్రసామగ్రి.

చదువరి: పాశ్చాత్యనాగరకము వల దందురే. ఆ యంత్ర సామగ్రియు వల దనియేనా ?

సంపా: ఈ ప్రశ్న వేసి నాకు తగిలినగాయమును చిదుక పొడిచితిరి. దత్తుకృత హైందవార్థిక చరిత్రను చదివినప్పుడు నేను కన్నీరునించితిని. మరల నా కది జ్ఞాపకమునకురా నా మానసము పీడిత మగుచున్నది. యంత్రములే భారతభూమిని బీదవడ జేసినవి. మాం చెస్టరు మనకుచేసిన యపచారము గణించుటకు రానిది. మాంచెస్టరువలననే మన చేతిపనులన్నియు మృతకల్పము లైనవి.

మరచితి నేనే పొరవడుచున్నాను. మాంచెస్టరు నెట్లు నిందింపవచ్చును. మనము మాంచెస్టరు వస్త్రముల ధరించితిమి. కాబట్టి మాంచెస్టరు వానిని మనకు నేసియిచ్చినది. బంగాళమువారి ధైర్యమును విని సంతసించితిని. అచ్చట వస్త్ర యంత్రాలయములు లేవు. కాబట్టి పూర్వపు చేతినేతను వారు పునరుద్ధరింప గలిగిరి. బొంబయి వస్త్రయంత్రములకు బంగాళమునుండియు ప్రోత్సాహము కలుగుచుండుమాట నిజమే. బంగాళము యంత్రసహాయమున సిద్ధమయిన యెల్లవస్త్రములను బహిష్కరించియుండిన బాగుండును.

యంత్రములు యూరోపును నశింపజేయ నారంభించినవి. ఆనాశము ఇంగ్లండుతలుపు దట్టుచున్నది. ఇప్పటి నాగరకమునకు యంత్రములు ముఖ్యచిహ్నములు. ఇవి పాప కారణములు.

బొంబయి వస్త్రయంత్రములలో పనిచేయువారలు దాసులైనారు. అచ్చట పనిచేయుస్త్రీలస్థితి మహా విషాదకరము. యంత్రశాలలు పుట్టకముందు ఈస్త్రీలు ఆకలికి మాడుచుండ లేదు. యంత్రములపిచ్చి మనదేశములో ప్రబలినయెడల ఇది యభాగ్యదేశము కాక మానదు. విపరీతముగా దోచవచ్చు నేమో కాని మనదేశములో యంత్రాగారములు పెంచుటకన్న మాంచెస్టరుకు ద్రవ్యముపంపి అచ్చటినుండి దిగుమతియగు పనికిరానిగడ్డలను ధరించుటే మేలు. మాంచెస్టరుగుడ్డ లుపయోగించుటవలన మనకు ద్రవ్యనష్టముమాత్ర మగుచున్న ది. మాంచెస్టరు నిచ్చట రూపుదాల్ప చేసితిమేని మన జాతీయ వంశమునకే ముప్పు వాటిల్లి మన నైతికజీవనమే నశింపగలదు. ఇందుకు తార్కాణము వలయునేని యంత్రాగారములలోని పనివారలనే సాక్ష్యమునకు కోరుచున్నాను. యంత్రాగారములమూలకముగా ధనము గడించినవారు ఇతర ధనవంతుల కంటె నెక్కువ మంచివారుగ నుండపోరు. రాక్కు ఫెల్లరు భారతభూమిలో పుట్టినంతమాత్రముచేత అమెరికాలో పుట్టిన వానికంటె మెరుగుగా నుండునని నమ్ముటకు రాదు. బీదభారతభూమి స్వతంత్రము కావచ్చును. కాని అవినీతిచే ఈ భూమి భాగ్యవంత మగునేని తరువాత స్వతంత్ర మగుట కష్టము. డబ్బుగలవారు బ్రిటిషుపరిపాలనను బలపరతురు. వారి లాభా లాభములు ఆ పరిపాలన లాభాలాభములతో మేళవమై యుస్నవి. డబ్బు మానవుని బలహీను నొనర్చును. స్త్రీలోలతయు తత్సమానము. రెండును విషమే. విష సర్పదష్టుడు ఈ రెంటి దాసునకంటె మేలు. ఏలయన, విషస్పర్శదేహమును మాత్రము నశింపజేయును. ఇయ్యవి దేహమును, మానసమును, ఆత్మను అన్నిటిని నశింపజేయును. కాబట్టి యంత్రాగారాభివృద్ధి యేదో లాభ మని మనము సంతసింప బనిలేదు.

చదువరి: అయిన యంత్రాగారములు మూయవలసిన దేనా?

సంపా: అది కష్టము. ఏర్పడినదానిని ఎత్తివైచుట సుకరము కాదు. కాబట్టి ప్రారంభింపకుండుటయే పరమవివేకము. యంత్రాగారాధిపుల ఖండింపరాదు. వారియెడ కరుణచూపనగు. యంత్రాగారములను వారు వదలవలె ననుట విపరీతము. వానిని పెంచకు డనిమాత్రము ప్రాధేయపడవచ్చును. వారు మంచివా రగుదు రేని తమ వ్యాపారమును కురుచచేయుచు వత్తురు. వేన వేలయిండ్లలో ప్రాచీనమగు నేతమగ్గమును నెలకొల్పి అందగు నుత్పత్తినంతయు వారు కొననగును. యం త్రాగారాధీశు లిదిచేసినను చేయకున్నను ప్రజ యంత్రాగారములలో చేసిన నస్త్రములను ధరించుట మానివేయవచ్చును.

చదువరి: ఇంతకాలమును మీరు యంత్రవినిర్మితవస్త్రములసంగతియే చెప్పుచువచ్చితిరి. ఇంక నెన్ని యోవస్తువులు యంత్రనిర్మితము లున్నవి. వానిని దిగుమతియైన జేయవలెను. లేదా వానికై మనదేశమున యంత్రముల నైనను స్థాపించవలెను.

సంపా: నిజము. మన దేవతలనుగూడ - విగ్రహములను కూడ నని యర్థము. జర్మనీవారు చేయుచున్నారు. నిప్పుపుల్లలు, గాజు, గుండుసూదులు ఇత్యాదులమాట చెప్ప నేల ? నాయుత్తరము మీ కిది. ఈ వస్తువులు రాకముందు భారత భూమి ఏమి చేసినది ? అదియే నేడును చేయవలెను. యంత్ర సహాయము లేక గుండుసూదులు చేయ లేనంతకాలము మనము వానిని ఉపయోగింపవలదు. గాజు జాజ్వల్యమానము మన కక్కర లేదు. ఎప్పటివలె ప్రమిదలుచేసి వత్తిచేసి దీపము ముట్టించుచుందుము. అట్లు చేసినచో కండ్లకు రక్ష, కర్చు తక్కువ. స్వదేశిసంరక్షితము. స్వరాజ్యము చేరువ .

అందరు ఇన్ని ఒకేపర్యాయము చేయుదు రనికాని కొందరైనను అన్ని యంత్రనిర్మితనస్తువుల వదలుదు రనిగాని నా యర్థము కాదు. భావము సరియైన దయినయెడల ఏదియేది వదలవచ్చునో కనిపెట్టి వదలుచు పోదురు. కొందరు చేయు నది అంద రనుకరింతురు. విత్తు వృక్షమై మఱ్ఱివలె వ్యాపించును. నాయకులు చేయునది ప్రజ తప్పక యనుకరింతురు. కష్టము కాదు. చిక్కు ను లేదు. ఇతరులు మనతోడంగూడ నడచువరకును నేను మీరు నిలువ నక్కరలేదు. పనిబూనని వారే నష్టులు. తెలిసియు ప్రారంభింపనివారు పిరికివారు.

చదువరి: ట్రాంబండ్లను గురించియు విద్యుచ్ఛక్తిని గురించియు మీ రేమందరు ?

సంపా: ఈ ప్రశ్న యప్రస్తుతము. దీని కర్థమే లేదు. రైళ్లే అక్కరలే దన్నప్పుడు ట్రాంబండ్లును అక్కర లేదే. యంత్రములు పాములపుట్టలు. అందులో నొకపా ముండవచ్చును. నూరుపాము లుండవచ్చును. యంత్రములవృద్ధి యున్న చోట నగరములవృద్ధియుం గలదు. నగరములుకలచోట ట్రాంబండ్లు, రైళ్లు తప్పవు. విద్యుచ్ఛక్తియు నటనే తాండవమాడును. ఇంగ్లీషు గ్రామముల కీదంభములు ప్రాక లేదు. యంత్రా ధారమగు రాకపోకలు ప్రబలినచోట ప్రజల ఆరోగ్యము చెడిపోయిన దని ధర్మమెరుంగు వైద్యులు చెప్పుదురు. యూరోపు నగరములలో నొక్కట నొకప్పుడు ద్రవ్యము లేకపోయెను. ట్రాములకు వకీళ్లకు, వైద్యులకు ఆదాయము తగ్గిపోయెను. ప్రజలకు ఆరోగ్యము అలవడెను. ఇది నేనెరిగిన సంగతి. యంత్రములవలన ఒక్క మేలు కలదని నాకు దోచదు. వానివలన నష్టములను గురించి గ్రంథములు వ్రాయవచ్చును. చదువరి: మీరు చెప్పుచుండున దంతయు యంత్రమూలకముగా అ చ్చగునుకదా? ఇది మంచిదా చెడుపా ?

సంపా: విషమును జంపుటకు విష ముపయోగించుట కలదు. ఇది అట్టిది. దీనివలన యంత్రములపక్షమున కేమియు సహాయము కాదు. యంత్రము మము వీడిపోవుచు ఇట్లనును. “ననుగురించి జాగ్రత్తపడుడు. నన్ను వీడి దూరముపొండు. నావలన మీకు లాభములేదు. అచ్చువలన కలుగులాభము యంత్రములపిచ్చి పట్టినవారికే మాత్ర మనుట నెరుంగుడు. " కాబట్టి, ముఖ్యవిషయమును మరువకుడు. యంత్రసంస్థలు కీడు. ఇది జ్ఞాపకమున్న యంత్రములను మనము దప్పించు కొనవచ్చును. మనయుద్దేశము సద్యఃఫలముగా నెరవేరుటకు దైవము మార్గము లేర్పరచియుండలేదు. యంత్రసామగ్రి వరదాన మని యంగీకరించుట మాని చెఱుపనుట గురితింతు మేని అది క్రమముగా నశింపగలదు.


__________