హైందవ స్వరాజ్యము/నాలుగవ ప్రకరణము
నాలుగవ ప్రకరణము.
స్వరాజ్యమనగా నేమి?
చదువరి: దేశీయమహాసభ భారతభూమికి జాతీయ భావమును కల్గించుటయు బంగాళ విభజనము ప్రబోధమును కల్గించుటయు అసంతృప్తి అశాంతులు దేశమున ప్రబలుటయు అను నీ విషయములను గురించి నేనిప్పటికి తెలిసికొనినాను. స్వరాజ్యమును గురించి తమ యభిప్రాయము లేవియో వినగోరుచున్నాను. మన ఇరువుర యభిప్రాయములును ఈవిషయమున నేకములు గావని నాకు దోచుచున్నది.
సంపా: మనమిరువురము ఈ స్వరాజ్యమనుపదమునకొకటే యర్థము చెప్పమనుట సంభావ్యము. నేను, మీరు, హైందవులెల్లరు, స్వరాజ్యము సంపాదింపవలయునని ఆతురులమై యున్నారము. కాని స్వరాజ్యమనగా నిదమిద్ధమని యెవ్వరును నిశ్చయించలేదు. ఇంగ్లీషువారిని ఇండియానుండి వెడలగొట్టుట స్వరాజ్యమని అనేకుల ముఖగళితమై యున్నది. కాని వారు అదే స్వరాజ్యమేల కావలయునో చక్కగా నాలోచించినట్లు లేదు. మిమ్ము నొక ప్రశ్న యిప్పుడే అడుగవలెను. మనకు కావలసిన దంతయు వచ్చునెడల ఇంగ్లీషువారిని వెళ్లగొట్టుట మీకు అవసరమని తోచుచున్నదా?
చదునరి: నేను వారికి ఒక్క ప్రార్థనయేచేయుదును. “దయచేసి దేశము విడిచి వెళ్లి పొండు." ఈ ప్రార్థననంగీకరించిన తరువాత వారు వెళ్ళిపోవుట యనిన ఇచ్చట నేయుండుటయని అర్థమగునేని నాకభ్యంతరముండదు. అప్పుడు మనభాష ప్రకారము పోవుటయనగా ఉండుటయని యర్థమగునని నాకు తెలిసియుండును.
సంపా: కాని, ఇంగ్లీషువారు వెళ్లిపోయినారని యనుకొందము తరువాత మీరేమిచేయుదురు.
చదువరి: ఆప్రశ్నకు ఇప్పుడర్ధము చెప్పుటకు రాదు. వారి వెళ్లిపోవువిధమునుబట్టి వారు వెళ్లి పోయిన మిూదట నుండుస్థితి యేర్పడగలదు. నూ రనుకొనురీతిని వారు ఇచ్ఛగా వెళ్లి పోవు
నెడల వారి రాజకీయ సంస్థల నట్లే యుంచుకొందుము. పరిపాలన చేసి కొందుము. మనము అడుగుటతోనే వారు నెడలిపోవు నెడల మనకు కావలసిన సైన్యాదికములు చే జిక్కును.
పరిపాలన సాగించుట తరువాత మనకు కష్టము కాకూడదు.
సంపా: మీరట్లనుకొనవచ్చును, కాని అది నామనస్సునకు సరిపోలేదు. అయినను ఆవిషయమునుగురించి ఇప్పుడే చర్చ చేయ దలపెట్టలేదు. మీ ప్రశ్నకు నేను ప్రత్యుత్తరము చెప్ప వలసియున్నది. మిమ్మును ప్రతి ప్రశ్నలడుగుట చేత నే ఆపనిని నిర్వహింతును. ఇంగ్లీషువారిని మీరేల వెడలగొట్ట వలెననుచున్నారు.
చదువరి: వారి పరిపాలనవలన భారతభూమి దరిద్ర దేవత పాలైనందుచేతనే. వారు సంవత్సరము సంవత్సరము మన ద్రవ్యము తీసికొనిపోవుచున్నారు. దేశములోని ఉత్తమోద్యోగములు తామే యనుభవించుచున్నారు. మనల బానిసలుగా పెట్టిపెట్టినారు. మనయెడల వారు తృణీకార భావముతో ప్రవర్తింతురు. మనమాట వారికి లక్ష్యమే లేదు.
సంపా: వారు మనద్రవ్యమును తీసికొనిపోక నయముగా ప్రవర్తించుచు మనకు గొప్ప యుద్యోగములిచ్చి పరిపాలన చేయు నెడల వారిక్కడనుండుట చెరుపని మీరు తలంచెదరా?
చదువరి: ఈ ప్రశ్నలకు అర్థము లేదు. పులి స్వభావమును మాన్చుకొనునెడల దానితో సహవాసము చేయుటలో దోషముండునా? అని యడిగినట్లున్నది. ఇది వృధా ప్రశ్న. పులి నైజము మారునట్లైన ఇంగ్లీషువారి నైజమును మారవచ్చును. ఇది సాధ్యము కాజాలదు. సాధ్యమని నమ్ముదుమేని అది యనుభవ వ్యతిరేకము.
సంపా: కనడావారికి దక్షిణాఫ్రికావారికి కలయట్టి స్వరాజ్య పద్ధతి మనకు సిద్ధించునట్లైన చాలునా?
చదువరి: ఈ ప్రశ్నయు వ్యర్థమే. సంపూర్ణ స్వరాజ్యమునకు కావలసిన శక్తులు మనకున్నప్పుడే ఇది సాధ్యము. అప్పుడు మన పతాకమునే యెత్తవచ్చును. జపాను ఎట్లున్నదో భారతభూమి అట్లుండవలెను. నౌకాసైన్యము భూసైన్యము అన్ని మనవిగా నుండవలెను. మన తేజోవికాసము మనకుండి ననే భారతభూమిపేరు లోకమున మ్రోగ గలదు.
సంపా: మీరు విషయము బాగుగనే చిత్రించినారు. మీ యర్థమిది. మనకు ఇంగ్లీషువా రక్కర లేదు. పరిపాలన పద్ధతి కావలెను. వ్యాఘ్రస్వభావము కావలెను. వ్యాఘ్ర మక్కర లేదు. భారతభూమిని ఇంగ్లీషు చేయుదురు. అప్పుడు ఇది హిందూస్థానము కాదు. ఇంగ్లీషు స్థానమగును. నేను కోరు స్యరాజ్యము అది కానేరదు.
చదువరి: నాయభిప్రాయమున స్వరాజ్య మెట్లుండవలెనో చెప్పినాను. మనము చదివే చదువు ఉపయోగకరమేని, మిల్లు, స్పెన్సరు ఇతర ఇంగ్లీషుగ్రంథకర్తలు అనుకరణీయులేని, ఆంగ్ల
రాజ్యాంగసభ అట్టి సభలన్నిటికిని మాతృక యేని, మనము ఇంగ్లీషు వారిని బాగా అనుకరింపవలసినదే. వారు తమభూమిలో నెట్లు ఇతరులను కాలూన నీయరో మనము వారినిగాని మరి యితరులనుగాని మనభూమిలో కాలూన నీయరాదు. వారు వారి దేశములో చేసినంత పని. ఇతర దేశములలో ఎక్కడను జరు గలేదు. కాబట్టి వారి సంస్థలు తెచ్చుకొనుట మనకు చేయతగిన పని. మీ యభిప్రాయ మేమి?
సంపా: ఓపిక పట్టియుండవలెను. సంభాషణవృద్ధి కాగా నా యభిప్రాయములు వెల్లడియగును. స్వరాజ్య మనగా అర్థము చేసికొనుట మీకెంత సులభముగా తోచుచున్నదో నాకంత కష్టముగానున్నది. కాబట్టి ప్రస్తుతము మీరేది స్యరాజ్యమని భ్రమపడుచున్నారో అది నిజముగా స్వరాజ్యము కాదని ఋజువు చేసెదను.