Jump to content

హలో...డాక్టర్/కర్కట వ్రణములు (Cancers)

వికీసోర్స్ నుండి

26. కర్కట వ్రణములు ( Cancers ) శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు (Growths) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైన బోళా గడ్డలు (Benign tumors) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలముల లోనికి మూలములతో ఎండ్రకాయలవలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కటవ్రణములు (Malignant tumors) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టలవలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులు అని కూడా అంటారు.

కణముల జన్యువులలో ( genes ) మార్పు జరుగుటవలన (Genetic Mutations) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు కలుగుతాయి. కర్కటవ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణములవలె పరిపక్వత చెందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు. ఈ కణ బీజములు రసినాళముల (lymphatics) ద్వారా రసిగ్రంథులకు (lymph glands), రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కటవ్రణాలు త్వరగా పెరుగుతూ పోషకపదార్థాలను విరివిగా సంగ్రహించుట వలనను, ఈ వ్రణముల నుంచి విడుదల అయ్యే రసాయనపదార్థముల వలనను, ఆకలి క్షీణించుట చేతను  బరువు తగ్గి దేహక్షయము కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ వ్యాపారములకు ప్రతిబంధకము కూడా కలుగజేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీర వ్యాధి నిరోధక

288 :: శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును

కర్కటవ్రణములు కలుగుటకు కారణాలు :

కర్కటవ్రణములు కలుగుటకు  కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యు వ్యత్యాసము తొంబయి శాతము, కణములపై పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పదిశాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి. వృద్ధాప్యములో శరీర వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడవు. ఆ కణాలు వృద్ధిచెందుట వలన పెరుగుదలలు పొడచూపుతాయి. పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామలోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతావరణ కాలుష్యము, రేడియో ధార్మికకిరణాల వంటి  భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.

పొగత్రాగుట, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబైశాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు (Lung Cancers) పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయ కర్కటవ్రణములు (Urinary bladder cancers), మూత్రాంగముల కర్కటవ్రణములు (Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు (Laryngeal cancers) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము (Stomach), క్లోమము (Pancreas), కంఠము, అన్ననాళములలో (esophageal cancers) పుట్టే  పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు (Nitrosamines), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు (Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు (Carcinogens) ఉంటాయి.

    పొగాకు నమిలేవారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలేవారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చేవారిలో (విశాఖ, శ్రీకాకుళపు ప్రాంతాలలో యీ  అడ్డపొగ అలవాటు ఉన్నది.) అంగుట్లో కర్కటవ్రణములు (palatal cancers)

289 :: రావచ్చును. జపానుదేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు (gastric

carcinomas) ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు (colon cancers) ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో  అంతా అనుకునేకంటె ఎక్కువమందికే  బృహదంత్ర కర్కటవ్రణములు (Colon Cancers) కలుగవచ్చునేమో అనే సందిగ్ధము నాకు కలుగుతున్నది.

అతినీలలోహిత కిరణాల (Ultraviolet rays) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు (Melanomas) కలుగుతాయి. రేడియో ధార్మికకిరణాలకు (Radio active rays) లోనైతే పుట్టకురుపులు రావచ్చు. ఱాతినార  (Asbestos) వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో (Pleura) మీసోథీలియోమా (Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశము ఎక్కువ.

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (Human Papilloma Virus) అనే విషజీవాంశముల వలన  గర్భాశయముఖములలో పుట్టకురుపులు (Uterine Cervical Cancers) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధుల వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై (Heliocobacter pylori) అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయ కర్కటవ్రణములు (Gastric)  కలుగుతాయి.

వంశపారంపర్యము వలన మూడు నుంచి పదిశాతపు కర్కటవ్రణములు సంభవిస్తాయి. జన్యు వైపరీత్యములతో  బి ఆర్ సి ఎ 1 , 2 (BRCA 1 BRCA 2) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము పుట్టకురుపులు (breast cancers) వచ్చే  అవకాశములు ఎక్కువ.

కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి ఇతర అవయవాలకు బహుళముగా వ్యాపించకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశములు ఉంటాయి. వివిధ అవయవాలకు వ్యాప్తిచెందిన పుట్టకురుపులను పూర్తిగా నయముచేయుట కుదరక

290 :: పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు  ఉపశమన చికిత్సలే  (palliative

care) చేయగలుగుతారు. శస్త్రచికిత్స, వికిరణచికిత్సలు (Radiation therapy), రసాయన (ఔషధ) చికిత్సలు (Chemotherapy), ప్రతిరక్షిత చికిత్సలు (Immunotherapy) వ్యాధినివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.

కర్కటవ్రణములను (cancers) పూర్తిగా నయము చెయ్యాలంటే తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి. కర్కటవ్రణముల నివారణ :

పొగత్రాగుట, పొగాకు నములుట, హెచ్చుగా పోకచెక్కలు నమలుట, జర్దాకిళ్ళీ వంటి  వాడుకలు లేకుండా చూసుకోవాలి. మద్యవినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము తీసుకొనుట, శరీరపు బరువును అదుపులో ఉంచుకొనుట, శారీరకవ్యాయామము, కాయగూరలు, పళ్ళు, పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా  తగిన జాగ్రత్తలలో ఉండుట, రేడియో ధార్మికకిరణాలకు గుఱి కాకుండా జాగ్రత్తపడుట కర్కటవ్రణములను వారించుటకు తోడ్పడుతాయి.

పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వరచికిత్స చేయుట వలన వాటిని నయము చేసే అవకాశము ఉన్నది. ఎవరికి వారు వారి శరీరమును పరీక్ష చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించవచ్చును. దేహమును, చర్మమును పరీక్షించుకుంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా, ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా, లేక వాటి వలన  దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే యితర మార్పులు కలిగినా వైద్యులను

291 :: సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణ పరీక్ష (Biopsy) చేయించుకోవాలి.  స్త్రీలు కనీసము నెలకు ఒకసారైనా  వారి రొమ్ములను

స్వయముగా పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు (Mammograms) రొమ్ములోని కర్కటవ్రణములను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభైనుంచి డెబ్భై సంవత్సరముల వయస్సులో ఉన్న స్త్రీలకు ఈ పరీక్షలు  ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకు ఒక పర్యాయము వైద్యులు సూచిస్తారు. పురుషులు వారి వృషణములను నెలకు ఒకసారైనా పరీక్షించుకోవాలి.

గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ విషజీవాంశములు (Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి (HPV Vaccine) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించవచ్చు. ఇరవై సంవత్సరాల నుంచి అరవైయైదు సంవత్సరముల వయస్సు గల స్త్రీలలో గర్భాశయముఖము నుంచి పాప్ స్మియర్ తో (Pap smear) గ్రహించిన కణముల పరీక్షలను ( Pap Smears ) సంవత్సరమునకు ఒకసారి వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు  కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి. ఉత్తర అమెరికాఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర (పెద్దప్రేవుల) అంతర్దర్శన పరీక్షలను (Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ (Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహన చికిత్సతో (Electro cauterization) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో  నిరపాయకరమైన బోళాగడ్డలైనా (benign tumors) తరువాత అపాయకరమైన కర్కటవ్రణములుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించగలుగుతారు. తొలిదశలలో కనుక్కోబడిన పెద్దప్రేవుల కర్కటవ్రణములు (Colon cancers) చికిత్సలకు సాధారణముగా

292 :: లొంగుతాయి. భారతదేశములో యీ పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్షలు (కొలొనోస్కోపులు) శోధన పరీక్షలుగా

(screening tests) ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.

పొగత్రాగేవారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు  తీస్తే శ్వాసకోశ కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి ఊపిరితిత్తులకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు (Low dose Computerized Axial Tomography Scan) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలామందిలో శ్వాసకోశ  కర్కటవ్రణాలు (Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తిచెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశ కర్కటవ్రణములు చాలా తక్కువ ఉంటాయి.

రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్  ఏంటిజెన్ (Prostate Specific Antigen) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే  ప్రాష్టేట్ కర్కటవ్రణములను (Prostatic Cancers) సకాలములో గుర్తించవచ్చును. చాలా మందిలో ప్రాష్టేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతముమంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశము ఉన్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూరవచ్చును.

కర్కటవ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్నకొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట, బరువు తగ్గుట, కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధిలక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుటము అవవచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము (computerized axial tomography), శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ (ultrasonogra:: 293 :: phy), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము (magnetic resonance imaging), పెట్స్కానులు, పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్ష (colonoscopy), అన్నవాహిక జఠర అంతర్దర్శన (esophago gastroscopy), పుపుసనాళ అంతర్దర్శన పరీక్ష (bronchoscopy),  కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి. వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు (Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కటవ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.

మిగిలిన వైజ్ఞానికశాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచము అంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభదశలో కనుగొన బడిన  కర్కటవ్రణములు చికిత్సకు లొంగే అవకాశము ఉన్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కటవ్రణములకు సంపూర్ణ చికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశము ఉంటుంది.

294 ::