హరివంశము/పూర్వభాగము-ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - ద్వితీయాశ్వాసము

శ్రీలీలాలక్షణని
త్యాలంకృతధామ పూరితాశ్రితకామా
కేళీసుఖసుత్రామా
భూలోకసహస్రధామ ప్రోలయవేమా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు వైశంపాయనుండు వైవ
స్వతు జన్మం బెఱింగించి మఱియు జనమేజయున కి ట్లనియె.

2


క.

వైవస్వతమనువునకు ధ, రావర తొమ్మండ్రు సుతులు ప్రభవించిరి బా
హావిజితలోకు లధిక, శ్రీవిలసితు లమ్మహాత్ము చిత్తం బలరన్.

3


వ.

ఇక్ష్వాకుండు నాభాగుండును ధృష్టుండును శర్యాతియు నరిష్యుండును బ్రాంశు
వును నరిష్టుండును గరూషుండును బృషధ్రుండు నను పేళ్ళం గలవీరులు జనించిరి
వీరు జనియింపకమున్న యమ్మనువు పుత్రకామేష్టి చేసి యందు మిత్రావరుణులను
దేవతల నుద్దేశించి యొక్కయాహుతి వేల్చిన నయ్యగ్నియందు భవ్యరూపాభి
రామయు దివ్యాంబరాభరణభాసితయు నగు కన్య యుదయించినఁ దజ్జనకుం డిల
యసును నామం బొనరించి యిందు రమ్మని వాత్సల్యం బెసఁగఁ బిల్చిన నయ్యతివ
యతనిం జూచి.

4


క.

చిరపుణ్య యేను వరుణుల యంశమున [1]సంభవము నొందితి న
ప్పరమతపస్వులపాలికి, నరిగెద నిది ధర్మ మర్హ మయినది నాకున్.

5


సీ.

అని యాక్షణంబ తా నట సని వారలఁ గని కేలు మొగిడించి వినత యగుచు
నిలిచి మీయంశంబువలన నేఁ బుట్టితి ననుఁ బంపుఁ డెయ్యవి పనులు మీకు
ననుటయు మిత్రుండు నవ్వరుణుండును దరుణి నీ వెంతయు ధర్మశీల
వీబుద్ధి యీసత్య మీవినీతత కన్య లెవ్వారలకుఁ గల దివ్విధంబు


తే.

మెచ్చు గావించె మామది [2]మచ్చెకంటి
మాకుఁ గూఁతురవై తింక మనుకులంబు

వెలయఁజేయుపుత్రుఁడవు గావలయుఁ జువ్వె
యపుడు సుద్యుమ్నుఁ డను నామ మమరు నీకు.

6


వ.

అట్టి పురుషత్వంబునందుఁ బరమధర్మపరతయు [3]లోకప్రియకారితయు సర్వసమర్చ
నీయతయు [4]నిన్ను నధికయశోవిజృంభితుం గావించు నవ్వైవస్వతమనువుం గాన
నరుగు మని పనిచిన మగిడి చనునప్పు డమ్మార్గంబున.

7


తే.

సోమనందనుఁ డత్యంతసుందరుండు, బుధుఁడు గామించి పొందె నప్పువ్వుఁబోఁడి
నైలుఁ డనఁగఁ బురూరవుం డపుడు జనన, మొందె నమృతాంశువంశకరోదయుండు.

8


క.

ఇల పదపడి సుద్యుమ్నత, వెలిఁగి మహారాజ్యవిభవవిభ్రాజితతో
నిల యేలె ధర్మనీతి, స్థలన మొకింతయును లేక కడుదీర్ఘముగన్.

9


వ.

ఆసుద్యుమ్నునకు నుత్కలుండును వినతాశ్వుండును గయుండును ననువారు
వుట్టి రందు నుత్కలుం డుత్తరవిషయంబునకుఁ బతి యయ్యె వినతాశ్వుండు పశ్చిమ
ధరణీపాలనంబు పరిగ్రహించె గయుండు గయాభూమి యగుపూర్వదిగ్భాగం
బేలె వైవస్వతమనువు మనుజలోకంబున దండనీతి ప్రవర్తించి మార్తాండలోకం
బున కరిగినపిదప నిక్ష్వాకుండు మధ్యమదేశంబు శాసించె నాసుద్యుమ్నుండు
వసిష్ఠానుమతంబునఁ బ్రతిష్ఠానపురంబునం బ్రతిష్ఠితుండై యుండి.

10


క.

తనవనితాదశఁ గాంచిన, తనయునకుఁ బురూరవునకుఁ దత్పురసామ్రా
జ్యనిరూఢి యొసఁగి మోదం, బునఁ దప మొనరింప విపినభూమికిఁ జనియెన్.

11


వ.

ఇక్ష్వాకు వెనుక[5]వారైన మనుపుత్రు లెనమండ్రయందును.

12


సీ.

విను మరిష్యంతికి జనియించెఁ బుత్రశతంబు నాభాగుఁడు తనయు నొకని
నంబరీషుం గాంచె ననఘ ధృష్ణునకు దార్ష్ణికనాములై బహుక్షితిపవరులు
వుట్టిరి శర్యాతి[6]పుత్రుఁ డానర్తుఁ గన్నియ సుకన్యాఖ్యను నెమ్మిఁ గనియె
నయ్యింతి భార్గవచ్యవనుని కాదిలిభార్యయై సద్వృత్తిఁ బరఁగె నందు


తే.

వీరుఁ డానర్తుం డానర్తనిషయమునఁ గు, శస్థలీనామనగరవాసమునఁ గరము
[7]ప్రీతి నుండంగ [8]సూనుఁడు [9]రేవతుఁడనఁ, గలిగి నూర్వురుకొడుకులఁ గలుగఁజేసె.

13


రైవతుఁడు రేవతిని బలరామున కిచ్చిన ప్రకారము

వ.

[10]అందఱకు నగ్రజుం డైన రైవతుండు కకుద్మి యనుపేరు వెలయ విలసిల్లుచు
నాత్మీయకన్యయైన రేవతిం దోడ్కొని తనసుచరితంబున సిద్ధంబైన సిద్ధపదగమనం
బున బ్రహ్మలోకంబునకుం గార్యార్థియై చని.

14

క.

ఒక్క ముహూర్తము [11]వనజజుఁ, డక్కడ గాంధర్వగోష్ఠియం దుండ భువిన్
బెక్కుయుగము లిటఁ బోయిన, నక్కజముగఁ దాను నప్పు ఉప్పరమేష్ఠిన్.

15


తే.

కాంచి మగుడ నేతెంచుచో ఘనులు వృష్ణి, [12]భోజవంశజుల్ కృష్ణుండు రాజు గాఁగ
నాకుశస్థలి ద్వారక యనఁగఁ బరఁగు, దివ్యనగరిగాఁ జేసి వర్తిల్లుచుండ.

16


క.

ఆతఁడు రేవతి నతివి, ఖ్యాతబలుండైన బలున కాత్మేశ్వరిగా
బ్రీతి నొసఁగి తపమునకై , గీతయశుం డరిగె మేరుగిరితటమునకున్.

17


సీ.

ఆఁకలి నీరువ ట్టలఁత జరారోగములు కాలగుణములు మొదలు గాఁగ
దోషంబు లెవ్వియుఁ దోయజభవులోకమునం బ్రభవింపవు మనుజనాథ
కాన రైవతుఁడు దక్కన్యయు వికృతులఁ బొందరై రతఁ డటవోయి యుండ
నిట తత్సహోదరు లేకోనశతమును నుండఁ గుశస్థలి [13]నుగ్రులైన


తే.

రాక్షసులు దోఁచికొనుటయు రాజసూను, లఖిలదిశలఁ జెల్లాచెదరైరి భీతి
నాకకుద్మికి సుతులు లే రయిరి గాని, తక్కుగలయందఱకును సంతతులు గలిగె.

18


వ.

తత్కులసంభవులు సర్వదేశంబులను శర్యాతు లన మహాక్షత్రియపూజ్యు లైరి
నాభాగునికులంబువా రన్నివర్ణంబులం గలిసిపోయి రరిష్టున కిద్దఱుకొడుకులు
గలిగి వైశ్యత్వంబు నొందిరి కరూషతనూజులు కారూషు లన వేర్వేఱ వంశకర
త్వంబు నొందిరి పృషధ్రుండు గురుహోమధేనువు వధియించి తదీయశాపం
బున శూద్రభావంబు నొందె నిట్లు వైవస్వతమనునందను లెనమండ్ర తెఱం
గులుం దెలిపితి నందఱకు నగ్రజుం డైన యిక్ష్వాకుండు.

19


క.

ఆనతులై మానవపతు, లానతి యౌదలలఁ దాల్ప నఖిలోర్వియు స
త్వానందుం డగుచు నయో, థ్యానగరము తనకు రాజధానిగ [14]నేలెన్.

20


క.

అతనికిఁ బుత్రులు నూర్వురు, ప్రతాపవిభవైకనిధులు ప్రభవించిరి త
ద్వితతికి నాద్యుఁడు తేజో, యుతుండు వికుక్షి యనునాతం డుర్వీశ్వరా.

21


వ.

శకునిప్రముఖు లయిన తక్కినకొడుకులు పూర్వోత్తరాపరదేశంబులకు వేర్వేఱ
శాసకు లైరి వికుక్షియు జనకనియోగంబున నొక్కనాఁడు పితృకార్యార్థంబు
శశమాంసంబు దేర నడవికిం జని బుభుక్షితుండై శశంబు భక్షించుటం జేసి శశా
దుం డనుపేర వసిష్ఠువచనంబునఁ దండ్రిచేతఁ బరిత్యక్తుండై తత్పరోక్షంబున
గురుండ యభిషేకింప నయోధ్యాపతి యయ్యె నతనికి.

22


క.

జనియించెఁ గకుత్థ్సుం డను, జనపతి [15]కాకుత్థ్సభవ్యసంజ్ఞ నిజకులం
బునవారికెల్లఁ దేజో, జనకంబై బెరయుఁ జిరయశశ్శ్రీయుతుఁడై.

23


తే.

విను మనేనుం డనఁగ నుద్భవించె నాక, కుత్థ్సునకు నయ్యనేనుండు కొడుకుఁ బృథునిఁ
గనియె విష్టరాశ్వుండు తత్తనయుఁ డతని, కార్ద్రుఁ డుదయించె జనకసౌహార్దశాలి.

24

వ.

ఆర్ద్రునకు యువనాశ్వుండు జనియించె యువనాశ్వునకు శ్రావస్తుఁడు పుట్టి [16]శ్రావ
స్తి యనుపురంబు నిర్మించెఁ దత్తనూజుం డగుబృహదశ్వుండు కువలయాశ్వుం
గనియె నతండు పుత్రపౌత్రశతవంతుండైనపిదకు నాత్మీయవిభవంబు [17]తత్పుత్రుల
కిచ్చి తపోవనంబున కరుగ నున్న [18]నుదంకుం డను బ్రహ్మర్షి వచ్చి యిట్లనియె.

25

కువలయాశ్వుండు దుందుండను రాక్షసునిం జంపిన ప్రకారము

సీ.

మధువను నసుర కాత్మజుఁడు క్రూరుఁడు దుండుఁడను దానవుఁడు మదీయాశ్రమంబు
చేరువ నంభోధితీరవాలుక బిలమునను నిద్రించి పెల్చనను నేఁట
నొకమాటు నిడుదయూ ర్పూర్పంగ మంటయుఁ బొగలుఁ బెంధూళితో నెగసి నభము
గప్పు [19]నావనభూమి కంపంబు సప్తవాసరములు ఘోరమై పరఁగు నధిప


తే.

యోర్వరాదు [20]మా కయ్యెడ నొక్కమాక, కాదు సర్వభూతములకుఁ గరము బాధ
యట్లు గావున నవ్విబుధారిఁ దునిమి, వెండి చనుము తపంబు గావించుపనికి.

26


వ.

అమ్మహాదైత్యు వధియింపం బూనువానికి నాత్మీయతేజంబున నాప్యాయనం
బొసంగి జయంబు గావింతు నని నారాయణుండు నాతో నానతిచ్చె నీవు దక్క
నెక్కటి వానిం బరిమార్ప నమరులయందును శక్తుండు లేఁ డట్లు చేయు మనిన
నన్నరేంద్రుండు.

27


క.

విను శస్త్రసన్యాసం బే, నొనర్చి తపమునకు దీక్ష నొందితి నింకన్
జనునే [21]క్రౌర్యంబు భవ, ద్వినియుక్తియుఁ జెడక యుండువిధ మొనరింతున్.

28


వ.

అని తదాజ్ఞాకరణంబునకుఁ బుత్రసమేతుం డగునాత్మజాతు నప్పగించి యప్పరమ
తపస్విచేత ననుజ్ఞాతుండై యాతం డరిగెఁ గువలయాశ్వుండు నుదంకు
మున్నిడుకొని కొడుకులతోడ ససైన్యంబుగా రక్కసుపై నడచె నప్పుడు.

29


ఉ.

ఈతఁడు దుందునిం దునిమీ యెల్లజగంబుల దుందుమారవి
ఖ్యాత[22]పదైకభాజనత నందెడు నంచు దివంబునన్ సుర
వ్రాతము వల్కుచుం గుసుమవర్షము దుందుభిస ప్రణాదమున్
బ్రీతి ఘటించుచుండె మునిబృందము సమ్మదమందె నెంతయున్.

30


క.

వారిజనాభునితేజం, బారాజోత్తమునియాత్మ యం [23]దొలయఁగ ఘో
రారిజయహేతుభూత, స్ఫారవికాసమయి యతనిభావం బలరెన్.

31


వ.

అట్లరిగి యమ్మహాతేజుండు తనూజులం బనిచి సముద్రసికతాఖననంబు సేయించి
తన్మధ్య సుప్తుం డగుదనుజుం గదిల్చె నంత నమ్మహాసురనాసానేత్రవదనంబుల
వెలువడి యుదీర్ణదహనజ్వాలాజాలంబు భూపాలపుత్రులు మువ్వురఁదక్క ననేక
సహస్రంబుల భస్మీకరించి విస్మయావహంబై కదియ నతండు తనయోగవిద్య
వలన సప్రమేయంబగుతోయంబు నుత్పాదించి యాకృశానుం బ్రశమితుం జేసి

పైతామహం బగునస్త్రంబునం బగతుం బడవైచి తదీయకాయం బుదంకునకుం
జూపి సమ్మోదం బాపాదించిన నమ్మహాతపస్సిద్ధుండు.

32


చ.

నృపునకుఁ బ్రాజ్యరాజ్యపదనిత్యతయున్ సుకృతైకబుద్ధియున్
రిపుజయలక్ష్మియున్ శుభగరిష్ఠముగాఁ దుది దివ్యవైభవా
భ్యుసగమము స్వరంబులుగ నొ ప్పెసఁగన్ గృపసేసి సంగర
క్షపితసుతాళి కక్షయసుఖం బగునాకము నిచ్చె నచ్చటన్.

33


వ.

కువలయాశ్వుండును మునీంద్రు, వీడ్కొని పురంబున కరుగుదెంచెఁ దత్పుత్రులు
మువ్వురయందును పెద్దవాఁడగు దృఢాశ్వుండు వంశకరుం డయ్యె నతనికి
హర్యశ్వుండు నాతనికి గుంభుండు నమ్మహీపతికి సంహితాశ్వుండును బుట్టి
రన్నరపతి యకృతాశ్వుండును గృతాశ్వుండు నన నిద్దఱం గాంచె
నృతాశ్వునకుఁ బ్రసేనజిత్తును బ్రసేనజిత్తునకు యువనాశ్వుంకును యువనాశ్వు
నకు మాంధాతయు నుద్భవించిరి.

34


సీ.

శశిబిందుఁ డను జనేశ్వరు పదికోటుల కొడుకులకును బెద్దగుణనిధాన
మగు బిందుమతి భార్య యయ్యె వయ్యువనాశ్వసుతున కమ్మాంధాత శూరవర్యుఁ
డుదయార్కనిభతేజుఁ డుదయాస్తశైలపర్యంతభూచక్ర మత్యంతమహిమ
నేల తనూజుల నిరువురఁ బురుకుత్సు ముచికుందుఁ గనియెఁ బ్రమోదలీల


తే.

నందుఁ బురుకుత్సుఁ డిందుజ యైనతటిని, యాలుగాఁ గాంచెఁ ద్రసదశ్వు నవ్విభుండు
పుత్రు సంభూతనాము సంభూతుఁ జేసెఁ, దత్తనూజుఁడు పరఁగెఁ ద్రిధన్వుఁ డనఁగ.

35


వ.

ఆత్రిధన్వునకు సూర్యారుణుండు పుట్టి యుత్తరకోసలంబులు శాసించుచు సత్య
వ్రతుం డనుసుతునిం గనిన నక్కుమారుండు కృత రపరిగ్రహుండై యంత
నిలువక.

36


తే.

[24]వరుఁడొకఁడు పెండ్లియైనయబ్బాలఁ దాను, బాల్యమున నీసుననుఁ జెల్లుబడిని బుచ్చు
కొనిన నవ్విధం బెఱిఁగి తజ్జనకుఁ డలిగి, తిట్టి వెడలిపొమ్మనుడుఁ బార్థివసుతుండు.

37


క.

ఎక్కడి కేఁగుదు ననినన్, గుక్కలఁ జంపితినుజనులఁ గూడి తిరుగు నీ
దిక్కునఁ బుత్రుఁ డనుమమత, నెక్కొన దేమియుసు నాకు నిజము దురాత్మా.

38


చ.

అనుటయుఁ దండ్రివాక్యమున నాతఁడు వెల్వడిపోయఁ బట్టణం
బనఘ పురోహితుం డయినయట్టి వసిష్ఠుఁడు నూరకుండెఁ బు
త్రుని నటు పాఱవైచి నిజధుర్యతమంతయు నుజ్జగించి కా
ననమున కేగె భూవిభుఁ డనాథయైఁ [25]1గుందె ధరిత్రి యంతయున్.

39


వ.

అయ్యధర్మంబువలనఁ దద్విషయంబునం బండ్రెండేండ్లు పర్జన్యుండు వర్షింపక
నిలిచె నమ్మెయిం గలఁగు రాష్ట్రంబును బురంబును నంతఃపురంబును శాసించి

విశ్వసనీయం బగు ప్రభుత్వంబు [26]పెంపొనర వసిష్ఠుండు గరిష్ఠం బగునాజ్ఞాబలం
బున రక్షించుచుండ నటమున్న.

40


సీ.

తనకుటుంబంబును దద్దేశమునఁ బెట్టి వినుము విశ్వామిత్రమునివరుండు
సాగ[27]రోపాంతికస్థలిఁ దీవ్రతపమున వర్తింప నప్పెనువఱపునందు
గూడులే కాతనిచేడియ మువ్వురుకొడుకులలోపుల నడిమివాని
మెడఁ ద్రాడువోసి యమ్మెద నూఱుగోవుల కెవ్వరేఁ గొనుఁ డనునెడ నెఱింగి


తే.

కరుణ సత్యవ్రతుం డిది గాదు గూడ, దేన ప్రోచెద నిందఱ నిది నిజంబు
విడువు మని గళబంధంబు విడిచె వాని, కయ్యె గాలవుఁ డనునామ మవ్విధముగ.

41


వ.

ఆరాజపుత్రుండు విశ్వామిత్రునివాఁ డయ్యెడడుకొఱకును గృపావశంబునను
విప్రకుటుంబ[28]పోషణంబు పుణ్యం బను బుద్ధివలనను [29]నిరతంబును మృగమహిష
వరాహాదివన్యసత్వంబుల నబ్బినవానిం జంపి తెచ్చి కౌశికకళత్రపుత్రసముద
యంబున కొసంగుచు నదియ మహనీయం బగు యజనంబుగా సంకల్పించి ద్వాదశ
[30]3వార్షిక యగు మానసదీక్ష వహించి పికృవాక్యకరణంబును దప్పకుండ నడపిన
వాఁడై వర్తిల్లె నవ్వర్తనంబున.

42


క.

తనుఁ దొరఁగు తండ్రి నుడుపడ మునివరుఁ డని యతనిచిత్తమున నేప్రొద్దున్
బెనుపగు కోపంబు వసి, ష్ఠునిదిక్కునఁ గలిగె నొక్కచో నట్టితఱిన్.

43


వ.

అక్కుమారుఁ డెక్కడఁ దిరిగియు మాంసంబు గానక కామదోహిని యగు వసిష్ఠు
హోమధేనువుం గని.

44


తే.

ఆఁకటను నీరువట్టున నగ్గలంపు, డప్పిఁ బులుగు[31]1ను నొకచోటఁ జొప్పడమిని
దొంటిపగను నెట్టన కిరాతుండపోలెఁ, జంపి యగ్గోవు[32]రక్తమాంసములు గొనియె.

45


సత్యవ్రతుం డను రాజు వసిష్ఠవచనంబునఁ ద్రిశంకుండైన ప్రకారము

వ.

అది యెఱింగి వసిష్ఠుండు గనలి యోరీ నీవు తండ్రిచిత్తంబునకు రామియు గురు
దోగ్ధ్రీవధంబును నప్రోక్షితమాంసోపయోగంబు ననుమూఁడుతెఱంగుల హృద
యశంకువులు గావించితి గావున త్రిశంకుండ వైతి ని న్నేమి సేయనేర్తుం బొమ్మ
నియె నిట్లు సత్యవ్రతుండు గురువాక్యంబునఁ ద్రిశంకుం డన నెందును వివం
బడియ నంత.

46


తే.

కఱవు [33]దీఱెను నాలిని గన్నప్రజల, వెదికికొని వచ్చి కౌశికుం డుదితమహిమ
నానరేంద్రనందను[34]చేత కాత్మలోన, నగ్గలము మెచ్చి వర మిత్తు నడుగు మనిన.

47


క.

తనకుఁ గ్రతుదీక్ష నుపద, ర్శన మొనరింపు మని వేఁడె సత్యవ్రతుఁ డ
మ్మునిసింహుఁడు నొడఁబడియెఁ ద, దనురూపద్రవ్యసంచయంబులు గూర్పన్.

48

వ.

సర్వగీర్వాణవరిష్ఠులు వసిష్ణుండునుం జూచుచుండ నతనిం బూజ్యరాజ్యాభిషేక
పూర్పకంబుగా నఖర్వగర్వోత్తేజం బగు యాజనంబునం బూజనార్హునిం జేసి
శరీరంబుతోడన దివంబునకుం బుచ్చె నట్టి సత్యవ్రతుభార్య కేకయకన్య సత్యవ్రత
యనునది హరిశ్చంద్రునిం గని నమ్మనుజేంద్రచంద్రుండు.

49


మత్తకోకిల.

తేజ మొప్పఁగ విస్ఫురద్బుజదీప్త[35]కేళికృపాణిచే
రాజవంశసమాజ మెల్లఁ బరా[36]జయంబున [37]మ్రగ్గఁగా
రాజసూయము సేసి సర్వధరాజనంబులఁ బ్రోచి [38]
మ్రాజనం బెనుపొందె నిందు విరాజి[39]5తామలకీర్తులన్.

50


క.

అతనికి లోహితుఁ డనియెడి, సుతుఁ డుద్భవ మయ్యె వృకుఁడు సుతుఁ డాధరణీ
పతికి వృకసుతుఁడు బాహుఁడు శ్రుతవంతుం డయ్యెం గామసుఖసక్తిమెయిన్.

51


వ.

[40]రాజ్యానుసంధానం బేమఱియుండ నయ్యడరున హైహములు శకయవనకాం
భోజ[41]పారదోపప్లవులం గూర్చుకొని యతనిపై నడతెంచి రాజ్యంబు గొనుటయు.

52


ఉ.

బాహుబలంబు మోఘముగ భామిను లిద్దఱుఁ దోడరా వెస
న్బాహుఁడు వోయి ఘోర[42]విపినంబులు దూఱి మడంగి యుండి దుః
ఖాహతచిత్తుఁడై యచటఁ బ్రాణవియోగము నొందె నంతఁ ద
ద్గేహిని [43]సారగర్భవతి తీవ్రపుశోకము సైఁపఁజాలమిన్.

53


క.

పతితోడ నగ్ని సొర ను, ద్యత యగుటయుఁ జూచి యప్పు డనుకంపాకం
పితమతియై భార్గవకుల, పతి యౌర్వుఁడు సావు మాన్చి బంధుఁడ పోలెన్.

54


వ.

నిజాశ్రమంబున నిడుకొని రక్షింప నట తొల్లి సవతి సూపోపక చూలు సెడుటకై
పెట్టిన బెట్టిదంపుగరళంబు తనయుదరంబునన యుండ నయ్యువిద ప్రసూతయయ్యె
నవ్విధంబు తనదివ్యభావంబున నెఱుంగుం గావున [44]నమ్మునిదేవుం డట్లు
జనియించిన కొడుకునకు గరంబుతోడన గర్భంబున నునికిం జేసి సగరుం డను
నామం [45]బాచరించి.

55


క.

క్రమవర్ధితుఁ డగుబాలుని, సమస్తవేదముల వివిధశాస్త్రములఁ బరి
శ్రమశాలిఁ జేసి రిపువి, క్రమ[46]మర్దనచండిమాగ్నికాండం బొసఁగెన్.

56


శా.

ఆదివ్యాస్త్రముపేర్మిఁ జేసి [47]పటుబాహాశక్తి [48]నుద్రిక్తుఁడై
యాదుర్వారబలుండు క్రోధమతి [49]వశ్యంబై చనన్ హైహయ
చ్ఛేదక్రీడ యొనర్చి వెండి వర మై జెండాడెఁ [50]4దన్మిత్రులం
చాదిం దండ్రికిఁ గీడు చేసిన యవనశకామిత్రధాత్రీశులన్.

57

వ.

ఇవ్విధంబునం బగ నిశ్శేషంబు గావింపం బ్రతిన సేసి కల్పాంతరౌద్రుం డగు
రుద్రుండు భూతజాతంబు బారిసమరుభంగిఁ గసిమసంగి శకయవనకాంభోజ
పారదపహ్లవులం బొడిసేయ వారు గెరలి యాసగరగురుం డగు వసిష్ఠమహాముని
శరణంబు సొచ్చి యభయంబు వేఁడిన.

58


క.

ధీరుఁ డొకతీరుతోడను, వారలఁ జేకొని కకుత్థ్సవంశవరేణ్యున్
వారించిన నతఁడును విని, ప్రారంభము గురునిపంపుఁ బరికించి తగన్.

59


వ.

అవ్విరోధులం బరిభవించి విడుచుటయ చంపుట యగు నని తలంచి శకులశిరంబులు
గొఱిగి ముఖరోమచయంబులు నిలిపి యవనకాంభోజుల మస్తకంబులు
సర్వముండితంబులు సేసి పారదుల ముక్తకేశులం గావించి పహ్లవుల ననవర
తశ్మశ్రుధారులుగాఁ బనిచి తత్సంబంధు లగుకోలిసర్పుల మాహీషుకులదార్వులఁ
[51]జోళులం దాదృశులుగా నాజ్ఞాపించె. వీరెల్లం దొల్లి యుత్తమక్షత్రియు
లా రాజశ్రేష్ఠుందు వసిష్ఠవచనంబున నిట్టు తదీయధర్మధ్వంసం బొనర్చుట నది
మొదలు వేదాధ్యయనయజనప్రముఖంబులకు బాహ్యులై మ్లేచ్ఛులం గలసిరి
తదనంతరంబ.

60


సీ.

ఔర్వునివశమున నాత్మీయభార్యల [52]నొకతెకుఁ దుంభీఫలోదరమున
నఱువదివేవు రుద్యతతేజులును మఱియొక్కతె కాత్మజుం డొక్కరుండ
పంచజనుఁ డనంగఁ బరఁగి యన్వయకరుఁ డగువాఁడు కలుగుట నన్నరేంద్రుఁ
డఖలదిక్కులు ప్రతాపాఢ్యుఁడై సాధించి తను ధర్మవిజ[53]యి యీతఁడ యనంగ


తే.

నతుల[54]కీర్తి నున్నతి గని యశ్వమేధ, దీక్ష గైకొని యశ్వంబుఁ ద్రిప్పి తేరఁ
బనిచె నందఱుఁ గొడుకుల వినుము వారు, వీరులై యవ్విధంబు గావించుచుండ.

61


వ.

ప్రాగ్దక్షిణజలధితీరంబున నత్తురంగంబు నింద్రుం డపహరించి రసాతలంబున డాఁచుటయు.

62


తే.

తండ్రిపనుపున నందఱు ధరణియెల్లఁ, దిరిగి రాఁ ద్రవ్వి డిగిపోయి యురగభూమి
నాదిపురుషు నవ్విష్ణుని యపరమూర్తిఁ, గనిరి సంవర్తమార్తాండకపిలుఁ గపిలు.

63


వ.

తత్సమీపంబునన యధ్వరహయంబు గాంచి కలుషించి.64
క. అవినీతు లై యెఱుంగక, యవనీశ్వరసుతులు [55]చోరుఁ డశ్వహరుఁడు వీఁ
డవుఁ జంపుఁడు మ్రింగుఁ డనుచుఁ, గవిసి పొదివి రసురలట్ల కఠినస్ఫూర్తిన్.

65


సగరపుత్రులు కపిలు కోపాగ్నిచేత భస్మీభూతు లగుట

వ.

అట్టియవజ్ఞత సైరింపక యమ్మహానుభావుండు.

66


క.

ఎఱమంట లుమియుచూడ్కుల, జుఱచుఱఁ జూచుటయు నపుడ చోద్యంబుగ నం
దఱు దగ్ధదేహులై రూ, పఱి తఱుచుగ భస్మరాసు లయిరి నరేంద్రా.

67

వ.

ఇట్లు బర్హికేతు సుకేతు శూర పంచజను లనునలువురు దక్క నఖిలసుతసముద
యంబు పొలిసిన నవ్విధం బెఱింగి సగరుండు సనుదెంచి యమ్మునిదేవుం [56]దెల
చినం బ్రీతుండై యతం డారాజునకుం గీర్తిస్వర్గంబు లక్షయంబులుగా నొసంగి
సముద్రుం బుత్రుంగా నిచ్చె సరిత్పతియు సాగరుండై సగరునకుం బ్రణామంబు
సేసి యశ్వమేధీయం బగునశ్వంబు సమర్పించినం గైకొని వచ్చి క్రమంబున.

68


క.

రాజన్యమౌళిమణి నీ, రాజనరాజితపదాబ్జరమ్యుం డగునా
రా జొనరించెను దివిజస, మాజ మలర నశ్వమేధయాగశతంబున్.

69


వ.

అమ్మహాబాహుండు నిజబాహుబలంబునఁ బాలించినపురంబులకొలఁది యఱువది
వేలని విందు మట్టి సగరునకుం బుత్రుం డైనపంచజనునకు నంశుమంతుండు వుట్టె.
[57]నతనికి ఖట్వాంగుం డతని దిలీపుఁడుం బుట్టి రాదిలీపమహీపతికి భగీరథుండు జని
యించి యేకథంబునన వసుంధరయంతయు జయించి సార్వభౌమపదంబు నొంది.

70


చ.

గిరిశజటాటవీనియతఖేలనలోలతరంగ యై సురా
సురనరసేవనీయజలశోభితయై యసమానపావన
స్థిరమహిమాఢ్యయై పరగు దేవతరంగిణిఁ దెచ్చి యుర్విపైఁ
బరపి నిజప్రసూత యనుప్రస్తుతి నొందఁగఁజేసె నెల్లెడన్.

71


తే.

ఆభగీరథజనపతి యనఘుఁ గాంచె, శ్రుతుఁడు నాఁగఁ ద్రిలోకవిశ్రుతుని సుతుని
నతఁడు గనియె నాభాగుఁ బుణ్యైకభాగు, నంబరీషుఁడు నిర్దోషుఁ డతనిపట్టి.

72


సీ.

ఆయంబరీషున కఖిలాన్వయప్రదీ[58]పుండు సింధుద్వీపుఁడు పుట్టె నధిప
ననపాయుఁ డగు [59]నయుతాయువు తత్పుత్రుం డారాజు నలసఖు నక్షహృదయ
విద్యా[60]విదునిఁ గాంచె వినయపూర్ణుని ఋతపర్ణునిఁ గల్మాషపాదు నతఁడు
గనియె నాతఁడు సర్వకరునిఁ బుట్టించె ననరణ్యభూపతి యతనిసుతుఁడు


తే.

తత్తనూజుఁడు నిఘ్నుఁ డాతనికి సూను, లిద్ద ఱనమిత్ర రఘువు లుదీర్ణతేజు
లందుఁ బెద్దవాఁ డడవికి నరిగెఁ దపము, సేయ రెండవువాఁడు శాసించె నుర్వి.

73


క.

భూమి[61]సమున్నతుఁ డగునా, భూమీశుఁడు గాంచెఁ బుత్రుఁ బుణ్యచరిత్రున్
రామప్రపితామహు ను, ద్దామబలు దిలీపుఁ గ్రతుశతప్రవిధాయిన్.

74


క.

విఘటితరిపుదర్పోదయుఁ డఘవిరహితుఁ డాదిలీపుఁ డాత్మజుఁ బడసెన్
రఘు [62]ననఘుని భువనవన, ప్రఘణోజ్జ్వలరత్నదీపభాస్వరతేజున్.

75


మ.

అజుఁ డారాజతనూజుఁ డూర్జితవివేకాలోకవిస్ఫూర్తి [63]యం
దజుఁ డాభూపతికిం దనూభవుఁడు నిత్యౌదార్యసత్యక్షమా
భజనోద్యన్మతి పఙ్క్తి పఙ్క్తిరథభూపాలుండు భూపాలక
వ్రజగోపాలకకేళితత్పరభుజవ్యాపారభవ్యుం డనిన్.

76

చ.

అతనికి నగ్రనందనుఁడు హారిపితృప్రియకారి దారుణ
వ్రతవహనైకసంపదభిరాముఁడు రాముఁడు భూమికన్యకా
స్మితయుతవీక్షణప్రసరసిద్ధమనోరథుఁ డిద్ధ[64]చాపుఁ డు
ద్ధతదశకంధరోన్మథనదర్పధురంధరుఁ డివ్వసుంధరన్.

77


క.

ఆరామున కనుపమధ, ర్మారాముఁడు కుశుఁడు వుట్టె నతిధి యను మహా
వీరుఁడు జనించెఁ గుశునకు, నారాజోత్తముఁడు నిషధుఁ డనుసుతుఁ గాంచెన్.

78


వ.

ఆనిషధునకు నలుండు జన్మించె. వినుము. రఘుకులజాతుం డైన యన్నలుండును
వీరసేనసంభవుం డగు నలుండునుం గా నుర్వీశ్వరులలోనం బ్రసిద్ధు లిద్దఱు నలు.
లింతియ యట్టి నలునకు నభుండును నభునకు బుండరీకుండును బుండరీకునకు
క్షేమధన్వుండును క్షేమధన్వునకు దేవానీకుండును దేవానీకునకు [65]నహీనగుం
డును నహీనగునకు సుధన్వుండును బ్రభవించిరి. ఇది వైవస్వతమను ప్రసూతి
యైన యిశ్వాకువంశంబు.

79


చ.

త్రిభువనదీపమై వెలుఁగు దేవుఁడు భానునియన్వయంబు భ
క్తిభరితబుద్ధియై వినినఁ గీర్తన సేసినఁ బాయుఁ దీవ్రపా
పభయము లిష్టసంపదయు భవ్యయశంబును బొందు నెందు దు
ర్లభ మనఁ గల్గు దివ్యపదలక్ష్మియుఁ జేకుఱు మర్త్యకోటికిన్.

80


వ.

అనిన విని జనమేజయుండు మునీంద్రా సూర్యదేవుండు పితృగణంబులకు
బ్రభుం డని విందుము. పితృగణంబు లనువా రెవ్వరు [66]తత్సమారాధనంబున
నయ్యెడి ఫలం బెట్టిది యెఱింగింపవలయు ననిన వైశంపాయనుం డిట్లనియె. నీ
వడిగిన పితృకల్పంబు మార్కండేయుండు సనత్కుమారువలన విని పిదప భీష్ముం
డడుగ వివరించె. నాగాంగేయుండు కౌంతేయాగ్రజునకు శరతల్పశాయియై
యుండి చెప్పినయది యప్పరిపాటిన యుపన్యసించెద.

81


జనమేజయునకు వైశంపాయనుఁడు పితృదేవతలతెఱఁ గెఱిఁగించుట

క.

విను ధర్మనందనుఁడు భీ, మున కి ట్లనుఁ బితృగణంబు [67]మునిసురతతిచే
తనుఁ బూజ గొనఁగఁ జాలిన, దని పెద్దలు సెప్ప విందు మనఘవివేకా.

82


చ.

తమతమకర్మముల్ దిగువఁ దప్పకపోదురు వేఱువేఱ లో
కములకుఁ దండ్రితాత లనఁగాఁ గలపెద్దలు పుత్రు లిచ్చటన్
గొమరుగఁ బెట్టుపిండములు గుడ్చుట యెట్లొడఁగూడు వారి కే
క్రమమునఁ దత్ఫలంబు నొసఁగంగ [68]సమర్థులు వారు కర్తకున్.

83


ఆ.

[69]ఇట్లు గాక పితరు లెవ్వరేఁ గొందఱు, గలరొ యివ్విధంబు గనము చోద్య
మెఱుఁగవలయుఁ దెలుపవే యన్న ని ట్లని, చెప్పె నతని కవ్విశేషవిదుఁడు.

84

సీ.

అనఘ మాతండ్రి శంతనుఁడు లోకాంతరంబున కేఁగినను నేను వినయ మొప్ప
నౌర్ధ్వదైహికములయందుఁ బ్రశస్తిమై నెసఁగుపిండము దగ నిడ దొడంగఁ
గంకణకేయూరకమనీయమును నరుణాంగుళీదళమును నైన హస్త
ముర్వి భేదించి సముత్థితం బగుటయుఁ గని యన్నరేంద్రునికరము గాఁగ


ఆ.

నిశ్చయించి యధికనిపుణంబుగా విచా, రించి శాస్త్రనియమరీతి [70]యొకఁడు
నాదరించి భువిఁ గుశాస్తరణంబు సే, సితిని [71]శాస్త్రవిధిఁ బ్రసిద్ధబుద్ధి.

85


వ.

అవ్విశిష్టకర్మంబునకుం బ్రీతుం డై మాతండ్రి నిజరూపంబుతోనిలిచి నా కిట్లనియె.

86


చ.

అనుపమధర్మవేదివి మహాపురుషుండవు నీవు వేదవా
క్యనియతి పాటిగా నిలిపి తాత్మ భవన్మతిచొ ప్పెఱుంగఁ గో
రి [72]నిరుక్తమంపుఁ గేలు ప్రసరించితిఁ బుత్రులఁ గన్నపుణ్యకీ
ర్తనులకు నెక్కుడై నెగడు ధన్యత నొందితి నేఁడు నందనా.

87


క.

విను రాజు లెట్టి ధర్మము, గొనియాడుదు రట్ల నడుచు గుఱుకొని ధాత్రీ
జనము భవన్మత మింకిట, వినుతింపక యున్నె సకలవిద్వత్తతియున్.

88


వ.

కావున వరం బిచ్చెద సకలప్రాణిసంహర్త యగు మృత్యువు నీ చెప్పినట్ల చేయం
గలయది యింకను నీ కెయ్యది యభిమతం బనిన నతనికి నభివాదనంబు సేసి నీ
ప్రసాదంబున నాకు సర్వంబును సంపన్నంబ యిదియొక్కటి యానతీవలయు నని
నీవు న న్నడిగినయర్థంబ యడిగిన నమ్మహామతి యవ్విధం బభినందించి యి ట్లనియె.

89


తే.

ఆదిసర్గసముద్భవు లమరులకును, బూజనీయులు పితరులు పుణ్యమూర్తు
లనఘ దివమునఁ దేజోమయంబులైన, దేహముల నొప్పుదురు సిద్ధదివ్యబలులు.

90


క.

మము గుఱిచి నామగోత్ర, క్రమమున మీ రర్చ సేయఁగా నే మేలో
కమునం దున్నను మా క, య్యమితకృపానిధు లొనర్తు రానందంబున్.

91


వ.

ఇది సంక్షేపరూపంబునం జెప్పితి వీఁడె మార్కండేయుండు నీచేత నేఁడు నిమం
త్రితుం డై యస్మదనుగ్రహంబు చేసి యున్నవాఁ డిమ్మునీంద్రుండు నిఖిలార్థవేది
యితని నడుగుము తాను బితృభక్తుండు పైతృకవిధివిశేషంబులు వివరించు నని
యానతిచ్చి యంతర్హితుం డయ్యె నంత నేను వినయంబునం బూర్వ[73]ప్రశంసనం
బొనర్చిన నప్పరమతపస్వి యి ట్లనియె.

92


సీ.

విను పితృపూజనం బొనరించి తత్ప్రసాదంబున నేను మోదంబు నెరయ
దీర్ఘాయువును [74]యశోదీప్తతయును గాంచి పరఁగుదు నిట్లుండి బహుసహస్ర
యుగకాల మేఁగుటయును మేరుతటమునఁ బ్రకటితనిష్ఠఁ దపంబుసేయ
నొకనాడు భానుబింబోజ్జ్వలం బగువిమానము నాకుఁ జేరువ నభమునందుఁ


తే.

[75]దోఁచు నంగుష్ఠ త్రగాత్రుని నుదగ్ర, తేజు నగ్నియం దగ్ని ప్రదీప్యమాన
మగుతెఱంగున నొప్పారి యందు వెలుఁగు, పురుషు నొకరునిఁ [76]గంటి నద్భుత మెలర్ప.

93

మ.

కని యత్యంతము సంభ్రమంబు బెలయంగా భక్తిఁ బ్రత్యుద్గమం
బును బాదగ్రహణంబుఁ జేసి యెలమిన్ బూజించి [77]ప్రీతుండనై
నిను నాద్యం బగు దైవతంబుగ మదిన్ దేవా వితర్కించెద
న్నను ధన్యాత్తునిఁ జేయవే కృప భవన్మాహాత్మ్యముం దెల్పుటన్.

94


వ.

అనవుఁడు నప్పురుషుండు నామీఁద ననుగ్రహంబుతోడి పరిగ్రహదృష్టి దీపింప
నాపూర్ణస్వరం బగువాక్యంబున నిట్లనియె.

95


చ.

వనరుహగర్భుమానసభవప్రకరంబున కెల్లఁ బెద్ద నే
ననఘ సనత్కుమారుఁ డని యాగమకోటియు నన్ను సంప్రరీ
ర్తన మొనరించుఁ బుట్టువు మొద ల్దగ నిట్ల కుమారతాదశం
దనరుటఁ గీర్తితంబు నభిధానము నాకుఁ జగత్త్రయంబునన్.

96


వ.

మఱి మరీచ్యాదు లగు మదీయభ్రాత లేడ్వురు తపోవీర్యజ్ఞానంబులందు నన్ను
మన్నింతురు వారు ప్రజావంతులై నిజవంశంబు లెందును బ్రతిష్ఠించి లోకఛా
రణంబు సేయుచు సర్వసములై వర్తిల్లుదు రేము యతిధర్మపరాయణులము
నారాయణధ్యానతత్పరం బగుభావంబున నస్మద్భావనాపరులకు బ్రజాధర్మ
కామంబులు వర్ధిల్లం జేయుచు విహరింతుము నీవు భృగువంశపావనుండవు
నాదర్శనంబు గోరి తపంబు సేయుటవలనం బ్రసన్నుండ నైతి నెయ్యది యభీష్టం
బది వేఁడు మనిన నేను బితృగణంబుల ప్రథమసృష్టియుఁ దత్పూజాఫలంబులు
నీ యడిగినయట్ల యడిగిన నమ్మహాయోగీశ్వరుండు నా కిట్లనియె.

97

సనత్కుమారుఁడు మార్కండేయునకుం జెప్పిన పితృదేవతాప్రభావము

సీ.

అబ్జాననుఁడు తన్ను నర్థితో గుఱిచి యజించుట గోరి సృజించె సురల
నాతని విడిచి వా రాత్మఫలార్థులై యన్యముఖంబుల యజనవిధులు
[78]నడపఁగఁ గోపించి నలువ [79]తత్త్వజ్ఞాన మెడలునట్లుగ శపియించుటయును
భ్రష్టవిజ్ఞానులై వారలందఱుఁ గూడి త్రిదశులచేటునఁ ద్రిభువనములు


ఆ.

మోహవార్ధిలోన [80]మునిఁగిన నార్తులై, వార లాసమస్తవరదు శరణు
సొచ్చి రతఁడు గరుణ హెచ్చుగ [81]సర్వలోకాహితైకబుద్ధి నాదరించి.

98


క.

మీ రక్కట కష్టవ్యభి, చారము చేసితిరి దీని సైఁచితి నింకన్
బోరనఁ బ్రాయశ్చిత్త, ప్రారంభుల రగుఁడు బోధపరిణతి యొదవన్.

99


వ.

ప్రాయశ్చిత్తవిధియును మీతనయుల నడిగి [82]తెలిసికొని తదుక్తమార్గంబున నడువుం
డనిన నిర్జరులు నిజ[83]తనూజులపాలికిం [84]జని ప్రబోధం బభ్యర్థించిన వారు వాఙ్మనః
కర్మంబు లగుదుష్కృతులకుఁ గర్తవ్యంబు లగుమంగళాచరణంబులు దెలుపం
దెలుపఁ గర్మకాండతత్త్వంబు విశదం బగుటయు లబ్ధసంజ్ఞులై తదనంతరంబ.

100

ఆ.

పుత్రులార యింకఁ బొండు విజ్ఞానుల, రైతి రనుచుఁ దమ్ము నాత్మసుతులు
పలుకుటయు నిలింపు లలఘుసంతాపంబు, గదురఁ జనిరి బ్రహ్మకడకు మగుడ.

101


వ.

చని తద్వాక్యంబులు విన్నవించిన విని విరించి నవ్వుచు నది యట్టివవారలు
ప్రజ్ఞాప్రదాతలు గావునఁ దండ్రులై మిమ్ముఁ బుత్రుల రని పలికిరి శరీరకకర్తల
గుటం జేసి మీయందును బితృత్వంబు సిద్ధంబ యి ట్లన్యోన్యసంభావితులై మీ
రిరుదెఱంగులవారును దేవతలును బితరులు నై త్రైలోక్యసంభావితుల రగుఁ
డనినం గ్రమ్మఱ వచ్చి సురలు సురజ్యేష్ఠువలన సంశయచ్చేదం బైనవిధంబు
కొడుకులకుం జెప్పి.

102


క.

పితృభావము మీ కిట్ల, ప్రతిహతమై చెల్లె నింకఁ బ్రఖ్యాతులరై
సతతంబును సకలసమ, ర్చితుల రగుడు మముఁ బురస్కరించి ముదమునన్.

103


వ.

పితృసమారాధనతత్పరు లగువారికిఁ బుత్రపౌత్రధనధాన్యాదు లగునైహికవిభ
వంబులు నక్షయంబు లగు నాముష్మికసుఖంబులును సిద్ధించు నస్మదాప్యాయ
నంబు సోమునకు నాప్యాయనం బగు ననుండు సచరాచరం బగులోకంబున కాప్యా
యనం బొనర్చు నని పలికి రిది పితృగణంబునకుం గలిగిన యాదిసర్గంబును
దత్పూజాఫలంబును జెప్పిన విని మార్కండేయుండు మహాత్మా పితరు లెన్ని గణం
బులై వర్తిల్లుదు రేలోకంబున నుండుదు రానతీవే యనిన సనత్కుమారుం
డిట్లనియె.

104


తే.

ఏడుగణములై వెలుఁగుదు రెలమిఁ బితరు
లమరలోకంబునందు సంయమివరేణ్య
యందులో [85]సమూర్తులు నాలు గరయ మూర్తి
విరహితంబులు మూఁ డయ్యె విను గణములు.

105


సీ.

ఘనుఁడు విరాజునాఁ జనుప్రజాపతి తనూభవులు నై రాజులన్ పరమసంజ్ఞఁ
బరఁగెడుపితరులు భవ్యు లమూర్తులు మూఁడుగణంబులు మోదమాను
లగుచు సనాతనం బగులోకమునఁ జరింతురు వారి మానసోద్భూత యొక్క
కన్నియ మేనాఖ్య గలిగి నీహారశైలేంద్రునిభార్యయై యిష్టలీల


తే.

సుతుల మైనాకుఁ డనఁగఁ గ్రౌంచుం డనఁగఁ, బడసి నిద్దఱ మఱియు నపర్ణ యేక
పర్ణ యేకపాటల యనుపడఁతుకలను, గనియె నమ్మువ్వురును దపంబునకుఁ దొడఁగి.

106


వ.

స్థావరజంగమాత్మకం బగుజగంబులంతటికి భరం బగువ్రతభారంబుఁ బూని
రం దేకపర్ణ యొక్కవటపర్ణంబును నేకపాటల యొక్కపాటల[86]దళంబును దమకు
నాహారంబుగాఁ గొనుచు నదియు నొక్కసహస్రవర్షంబులు నిండిన నొక్కమాఱు
నియతంబుగాఁ జేసి పదివేలసంవత్సరంబులు నడప నపర్ణ యెయ్యదియు నొల్లక
నిరాహారయై యుండె నవ్విధంబునకుఁ దల్లి సస్నేహదుఃఖాకులయై యుమా యని

నివారణార్థం బగువాక్యం బుగ్గడించుట కారణంబుగా నుమాభిధానం బాయ
మకుఁ ద్రైలోక్యవిదితం బయ్యె నివ్విధంబునఁ దపస్సిద్ధి వడసి కన్యారత్నంబులు.

107


చ.

అతులితనిత్యయావనము నద్భుతయోగబలోదయంబు శా
శ్వత మగుబ్రహ్మచర్యము నవంధ్యము లై తముఁ జెంద సజ్జన
ప్రతతులు [87]లోకపూజ్య లని ప్రస్తుతి సేయఁగఁ దత్త్వబోధవి
చ్యుతభవబంధనం బగుయశోవిభవంబునఁ బేర్చి రందఱున్.

108


తే.

వారిలోనఁ బెద్దాయమ భూరిపుణ్య, యయ్యుమాదేవి సర్వలోకైకజనకు
నమ్మహాదేవుఁ జెంది యర్ధాంగభాగ, [88]యై యనన్యమాహాత్మ్యధన్యత వహించె.

109


వ.

అప్పరమేశ్వరికిఁ గృత్రిమపుత్రుం డైనశుక్రుండు [89]యోగాశ్రయుండై పరఁగె
రెండవయాయమ యేకపర్ణ [90]యసితునకు భార్యయై దేవలుం గనియెఁ దృతీయయైన
యేకపాటల [91]జైగీషుం డనుభవ్యమునిం బొంది శంఖ[92]4లిఖితులం గాంచె శుక్ర
ప్రముఖు లయిన వీరందఱు [93]యోగవిద్యాప్రవర్తకులు మఱియును.

110


సీ.

అనఘ యగ్నిష్వాత్తు లనఁ మరీచిపుత్రులు దేవగణసేవితులు పితరులు
సోమమయా[94]ఖ్యవిశ్రుతలోకనిత్యవాసులు వారిమానససూతి యైన
కన్య యచ్ఛోద నాఁ గలిగి యచ్ఛోదసరస్సుఁ బుట్టించె నారమణియొక్క
తఱి నాత్మజనకుఁ డంతర్ధానమునఁ బొంది యుండంగఁ గానక యుదితతేజుఁ


ఆ.

డద్రికాభిధాన యగునచ్చరయుఁ దాను, వరవిమానమున దివంబునందుఁ
గరము వెలుఁగునుపరిచరు నింద్రతుల్యునిఁ, గాంచి వాంఛితంబు గడలుకొనఁగ.

111


క.

ఈతనికిం గూఁతు రగుట, యేతపముఫలంబొ యనుచు నిచ్చఁ దలఁచి తా
నాతప్పున యోగచ్యుత, యై తూలి యధోముఖిత్వ మంది యడలఁగన్.

112


తే.

భాను[95]బింబంబుతో నుపమాన మగువి, మానములఁ ద్రసరేణుప్రమాణదేహు
లై [96]వెలుంగుచుఁ దోచి రాయమపితరులు, కావరే యని పలికె నక్కన్యకయును.

113


క.

వా రోడకు మని దానిని, ధారిణిపైఁ బడకయుండఁ దగ నిల్పుటయున్
గోరి యది ప్రస్తుతించినఁ, గారుణ్య మెలర్ప నయ్యఖండితతేజుల్.

114


వ.

అవశ్యభావి యైనయయ్యర్థంబు తమయోగదృష్టిం జూచి యక్కన్నియతో
నమ్మా నీ కొక్కటి సెప్పెదము దేవదానవమానవలోకంబులం దెవ్వరికిం దమ
చేసినకర్మఫలం బనుభవింపక పొలియదు నీవు వసువుం దండ్రిగాఁ గోరితివి గావున
నతని కూతురువై యష్టావింశతితమం బగు ద్వాపరయుగంబున నీయద్రిక మత్స్య
రూపధారిణియై యుండఁ దదీయోదరంబున జన్మింపంగలదాన [97]వప్పుడు.

115

మ.

మునివంద్యుండు వసిష్ఠపౌత్రుఁడు వినిర్ముద్రప్రభావాభివ
ర్ధనధరుండు పరాశరుండు నినుఁ బుత్రశ్రీసముద్దీప్తఁగా
నొనరించున్ భవదాత్మజుండును మహాయోగాఢ్యుం డేకాకృతిన్
జనువేదంబు చతుర్విభాగములుగా శాసించు ధీసంపదన్.

116


వ.

మఱియు మహాభిషుండను రాజు శంతనుండయి పుట్టిన నతనికిం బత్నివై చిత్రాంగద
విచిత్రవీర్యు లనుపుత్రులం గనియెదవు నీకన్యాత్వం బేమిటను వైకల్యంబు
నొందక యుండు నట్టిశుద్ధితోడన క్రమ్మఱ నెప్పటియోగస్థితిన పొందంగలదాన
వని యనుగ్రహించి రక్కన్యకయు నట్టిద యయ్యె నిట్లు చెప్పంబడిన రెండు
దెఱంగులపితృగణంబులు నమరులకుఁ బూజనీయు లని వెండియు.

117

పితృగణంబులలో మూ ర్తిసహితుల మూర్తిరహితుల వివరించుట

సీ.

వినుము దివంబున విభ్రాజములు నాఁగ వెలుఁగులోకంబులు గలుగువారు
బర్హిషదాఖ్యులై పరగినపితరులు సుతులు పులస్త్యున కతులధర్మ
మూర్తులు గణములు మూఁడయి వసియించే యక్షగంధర్వరక్షోహివిహగ
పతులచేఁ బూజలు సతతంబుఁ గాంతురు వారిమానస యైనవరతనూజ


తే.

యలఘుయోగాఢ్యపీవరి యనఁగ నొప్పు
నింక నప్పరాశరసుతుఁ డిద్ధతేజుఁ
[98]డరణిఁ గనియెడుపుత్రు నుదాత్తయోగ
ధరుని శుకుని భర్తగఁ బ్రమోదమునఁ జెందు.

118


వ.

అమ్మహాభాగుం డయ్యోగినియందుఁ [99]గృష్ణుండు గౌరుండు ప్రభుండు శంభుండు
ఋతుండు జయుండు భూరియు నన నేడ్వురు కొడుకులను [100]గీర్తిమతి యనుకన్య
కను గనంగలవాఁ డాకన్నియ యణుహుం డను రాజునకుం బత్నియై యోగ
సిద్ధుం డగు బ్రహ్మదత్తుం గనియెడు నిట్లు క్రమంబునఁ గీర్తింపఁబడిన వైరాజులు
నగ్నిష్వాత్తులు బర్హిషదులు ననుమూఁడుదెఱఁగులపితరులు మూర్తిరహితు లింక
మూర్తిసహితు లగువారిం జెప్పెద.

119


క.

జ్యోతిర్భాసము లనఁ బ్ర, ఖ్యాతంబులు సురపదములు గల వందుఁ [101]గడున్
బ్రీతి వసింతురు పితరులు, శ్రీతోడం బూరు లన వసిష్ఠతనూజుల్.

120


తే.

వారు పూజనీయులు విప్రవర్ణములకు, వారిమానస యగుకన్య వారిజాక్షి
గోసమాహ్వయ శుక్రునికూర్మిపత్ని, యయి వెలింగించె భార్గవాన్వయము నెల్ల.

121


క.

తనరును మరీచిగర్భము, లనులోకము లధికశుభము లంగిరసునినం
దను లగుపితరులు భాస్వరు, లనువారు వసింతు రచట నతులవిభూతిన్.

122

క.

భూవరులు వారి నెప్పుడు, భావింతురు తన్మనఃప్రభవ యైనయశో
దావినుతాహ్వయ గన్నియ, యావిశ్వమహత్తుపత్నియై కడుఁబేర్మిన్.

123


వ.

దిలీపాభిధానుం డయినమానవపతిం గనియె నతని తురంగమేధంబునం దృప్తులైన
భూదేవత లితండు లోకపావనుం డీయజమానుం జూచినవారికి నిమ్మహాత్ముతోడ
నవబృధస్నాతులైనవారికి నక్షయస్వర్గం బగు ననువాక్యంబు లుగ్గడింతురు.

124


సీ.

పులహనందనుఁ డగుభూరిపుణ్యుఁడు కర్దమప్రజాపతికి నాత్మజులు వసువు
లనుపేరిపితరు లుదాత్తతేజులు గామదము లనఁబరఁగు లోకములయందు
వెలుఁగొందుదురు వైశ్యకులమున కర్చనీయులు వారి మనసున నుద్భవించి
కన్నియ నహుషునిగాదిలిదేవియై [102]వైధాత్రి యనునది వసుమతీశు


ఆ.

నయ్యయాతిఁ గాంచె ననఘ హిరణ్యగ, ర్భాత్మజాతుఁ డైన యవ్వసిష్ఠ
సుతులు వేఱె కలరు [103]సుకలాఖ్యపితరులు, వారు శూద్రవర్ణవంద్యు లెందు.

125


క.

మానసము లనం బరఁగిన, మానితలోకములు వారిమహితపదంబుల్
మానససుత వారికి రే, వానది పురుకుత్సధరణివరుభార్య మహిన్.

126


వ.

పితృగణంబుల రూపంబులు లోకంబులు వినియోగంబులు వేర్వేఱ వివరించితిఁ
బితృసమారాధనంబు సర్వయుగసాధారణంబు.

127


క.

పితృవిధి యెక్కుడు విను దై, వతకార్యముకంటె దివిజవరదానవసి
ద్ధతపస్వితతికిఁ బూజ్యులు, పితరు లనుచుఁ జెప్పు శ్రుతు లభిన్నప్రతిభన్.

128


మ.

 సుతసౌభాగ్యజయాయురర్థసుఖితాశుద్ధిక్షమావైభవ
స్మృతివిద్యావినయాదిసర్వశుభమున్ జెందించు వైరాగ్యసం
యుతవిజ్ఞానము మృత్యుమోచనమహాయోగంబుఁ గైవల్యక
ల్యతయుం జేయుఁ బితృప్రయోజనఫలం బల్పంబె యూహింపఁగన్.

129

పితృదేవతాసమారాధనఫలవిశేషప్రభావము

సీ.

స్వర్గకాములు పితృవర్గంబు గొనియాడి యిహలోకసుఖలీల లెల్లఁ గాంచి
మౌక్తికమాణిక్యమరకతమయములై యమరుకాంచనవిమానములు వచ్చి
హంససారసమయూరాభియుక్తంబులై తముఁ గొనిపోవ గంధర్వగీత
లప్సరోలాస్యంబు లనిమిషసిద్ధచారణకీర్తనంబులు రమ్యములుగఁ


తే.

జని యనేకమనోరథసంప్రణీత, వివిధవిషయానుభవములఁ దవిలి పెక్కు
యుగసహస్రము ల్విహరింతు రూర్ధ్వలోక,పదము లెన్ని యన్నింట నొప్పిద మెలర్ప.

130

[104][తే.

గ్రహణతిథు లమావాస్యసంక్రమము లధిక
ముఖ్యకాలముల్ పితృకార్యములకు ననఘ
యపరపక్షంబు మేలు మూఁడష్టకలును
నాగ్రహాయణసమయంబు లగ్రిమములు.

131


క.

అనురూపదినముల గృహ, స్థునిగృహమును గుఱిచి వాంఛతోఁ బితృగణముల్
సనుదెంచు నివాసస్థల, ము[105]నకుం జనుదెంచు గోసమూహములక్రియన్.]

132


తే.

అష్టకలఁ బితృకోటియభ్యర్చనంబు, గాన కరిగిన నుభయలోకములుఁ దప్పు
నరున కవ్విధియం దొందు నాస్తికత్వ, మొప్ప దనుపమశ్రద్ధ యత్యు త్తమంబు.

133


సీ.

పాడ్యమిఁ బితృపూజ పాటింపఁ గాంచనాగమము భాసురపశూత్కరము విదియ
దదియ శాత్రవగణధ్వంసంబు చవుతిఁ బరచ్ఛిద్రదర్శనప్రాప్తి ప్రకట
లక్ష్మి పంచమి[106]ఁ గీర్తి లాభంబు షష్టి సప్తమి మహిపర్వప్రధానశక్తి
యష్టమి నవమి నుత్కృష్టతయును బ్రభుత్వము బ్రహవర్చసవ్యాప్తి దశమి


తే.

వేదసమ్మతైశ్వర్యంబు వినుతవేద, వాదితయును నేకాదశి వసుమతీశ
పదము జయమును బారసిఁ బ్రజల పెంపు, పుష్టతయును [107] ద్రయోదశిఁ బొందు [108]జనుల.

134


క.

తరుణవయస్సున సమసిన, పురుషులకును శస్త్రనిహతిఁ బొరసి తెగినయ
న్నరులకుఁ గర్తవ్యము పితృ, పరిచరణము భూతతిథిఁ దపస్పివరేణ్యా.

135


క.

అమవసఁ బితృనియతి ప్రయ, త్నమున నొనర్పంగ వలయు దత్క్రియ సోమున్
బ్రముదితుఁ జేయును సోమ, ప్రమదంబునఁ బ్రీతినొందు ద్రైలోక్యంబున్.

136


వ.

శశిబిందుఁ డడుగఁ బితృపతి పితృవిధానంబునందు నక్షత్రఫలం బెఱింగించెఁ
దత్ప్రకారంబు వినుము.

137


సీ.

కృత్తికఁ బైతృకక్రియ [109]జేసి విపులతేజంబు రోహిణిఁ బ్రజాసంప్రవృద్ధి
యోజస్సు మృగశిర నుగ్రక్రియాశుద్ధి యార్ద్రబుత్రప్రీతి యదితితారఁ
బుష్టి పుష్యంబున భుజగ[110]తారను బ్రభ సుతలబ్ధి పితృతార నతులబంధు
గణవరిష్ఠత పుబ్బఁ గమనీయసౌభాగ్య ముత్తరఁ బ్రచురదానోత్సవంబు


తే.

హస్తమున సంపదలు చిత్ర నధికరూప, వంత మగునపత్యము వణిగ్వైభవంబు
పవనుతార విశాఖ సత్పాత్రయుక్తి, మైత్రమునఁ జక్రవర్తిత్వమహిమ నొందు.

138


క.

శతమఖతార జనాధీ, శత యారోగ్యంబు విను నిశాచరతారన్
సితకీర్తి సలిలతారను, గతశోకత విశ్వతారఁ గలుగు జనులకున్.

139

ఆ.

[111]అభిజిదానికంబు లగుమూఁట నాగమా, ఢ్యతయు సద్గతియును నర్థచయముఁ
[112]జెందు వెండి రెంటఁ జేకుఱు [113]నౌషధ, సిద్ధియును సమృద్ధజీవనంబు.

140


క.

గోవుల[114]పేర్మియు రౌప్యధ, నావాప్తియు హయవిభవము నాయువు పెనుపున్
గావించు నహిర్భుధ్నుఁడు, దైవత మగు తార దొడఁగి తక్కిననాల్గున్.

141


తే.

రజతదానంబు రజకపాత్రంబు రజత, కథయుఁ బితరుల కానందకరము తొల్లి
యంచితాస్పదరాజతమైన పాత్రఁ, బితరు లమ్మహీ[115]1దేవిని బితికికొనుట.

142


క.

రజతంబుభంగిన మహా, రజతంబును బితృహితమ్ము రమ్యతిలలు మే
షజకంబళమును దుహితృత, నుజుఁడుఁ గుతపమును బితృప్రణుతకారణముల్.

143


క.

ఆజ్యంబు నవూపంబులు, యోజ్యంబులు ముద్గమాషయుక్తము మాంస
ప్రాజ్యమునై [116]పితృగణముల, యిజ్యాతంత్రంబు నడచు (డి)టిచ్చు శుభంబుల్.

144


క.

విను కృష్ణమృగాజిన మి, చ్చినఁ జూపిన సన్నిహితము సేసినఁ బితృమో
దన మగుఁ ద్రిదండియగుయతి,యును యోగియుఁ బాత్రములు తదుత్తమపూజన్.

145


తే.

అనఘ పితృసమారాధన మాచరించు, నపుడు తత్క్రియ నాదిమధ్యాంతవేళ
లందు నియతిగ దేవతాభ్యః పితృభ్య, యనుమహాసూక్తి జపియించు డధికశుభము.

146


క.

విను పిండదానసమయం, బున యందును భక్తిపూర్వముగ దీనిఁ బఠిం
చిన నయ్యన్నం బమృతము, నెనయుఁ దురగమేధఫలము నిచ్చుఁ గృతాత్మా.

147


క.

రాక్షసులు దొలఁగుదురు ప్ర, త్యక్షత నొందుదురు పితరు లప్పుడు సుకృతం
బక్షయ మగు నీసూక్తి య, ఘక్షయకారిణిగఁ జదువు కళ్యాణులకున్.

148


సీ.

మూ ర్తివియుక్తులు మూర్తిమంతులుఁ బరిజ్ఞానులు యోగవీక్షణులు నైన
ప్రభు లింద్రముఖ్యనిర్జరులకు దక్షకశ్యపమరీచ్యాదిప్రజాపతులకు
సప్తమహామునీశ్వరులకు మున్వాదు[117]లకును సరిత్పతులకును శేష
నక్షత్రతారాగ్రహక్షోణీగగనంబులకుఁ [118]దండ్రు లిందుపావకమయాత్ము


తే.

లఖిలలోకైకదాతలు నఖిలవంద్యు, లాఢ్యు లధ్వరంబులును బ్రహ్మంబుఁ దార
యనఁగఁ బరఁగి సప్తనిధంబు లగుగణముల, నమరు పితరులఁ బ్రాంజలి నై భజింతు.

149


తే.

ఏడు[119]దీవులయం దర్చ్య మీస్తవంబు, పరఁగు సప్తర్చ మనుపేరఁ బరమపుణ్య
మజ్జభవుఁడు చెప్పినయది యధికసిద్ధి, కరము పితృగణసమ్మోదకారణంబు.

150


వ.

నీవు పితృభక్తుండవు కావున నుపదేశించితి విశ్లేషించి నాయందు సభక్తితాత్ప
ర్యం బగుచిత్తంబుతో వర్తిల్లుదు నీకుం బరమజ్ఞానసమేతం బగుదివ్యచక్షువు

ప్రసాదించెద దానం జేసి యోగసిద్ధుండవై సిద్ధమూర్తులకు [120]పితరులం బ్రత్య
క్షంబుగాఁ గనియెద వని చెప్పి సనత్కుమారుండు మఱియు నిట్లనియె.

151


సీ.

పూర్వయుగంబునఁ బుణ్యశీలుఁడు భరద్వాజమునీంద్రుని[121]తనయు లేడ్వు
రుత్తమయోగధర్మోపేతులై యుండి దుశ్చరిత్రము కొంత దొడరుటయును
భ్రంశంబుఁ బొంది తపము మున్నుసేసియు సిద్ధి గానక కడుఁ [122]జేవ దక్కి
తోయనిమగ్నవస్తువు రోయుభంగిఁ బశ్చాత్తాపమునఁ దత్ప్రసన్నగతియ


తే.

తలఁచి తలఁచి యెందును దరిదాఁక లేక, కాలధర్మము నొంది నాకమున కరిగి
యందు దివ్యసుఖంబుల నధికదీర్ఘ, మైనకాలంబు సలిపి మర్త్యమున వెలసి.

152


వ.

ఇప్పుడు వారు కౌశికుం డనుమునికిం బుత్రులై జన్మించియున్నవారు వా రింకఁ బితృ
ప్రీతికై ఘోరహింస యొకటి యొనర్చెదరు దానం జేసి కుత్సితయోనులం
బెక్కింటం బుట్టవలసియుండుఁ బితృప్రసాదంబు కలిమివలన నన్నిభవంబులందును
జాతిస్మరత్వం బనుబంధంబై వచ్చుటం బ్రకృష్టం బగుధర్మచరితంబునఁ జిత్తంబులు
వొలయం గలయవి పిదప బ్రాహణజన్మంబు వడసి మొదలఁ [123]బ్రారబ్ధం బైన
యోగధర్మం బెప్పటియట్ల [124]కని పరమసిద్ధియుం బ్రాపింతు రట్ లుగావున.

153


మ.

సకలక్లేశనిబర్హణంబును మహాసారంబు సర్వార్థర
ర్శకమున్ సిద్ధనిషేవితంబు నగు సూక్ష్మజ్ఞానయోగంబు నీ
వకలంకస్థిరబుద్ధిఁ దాల్చి నియతాహారుండవై [125]యింద్రియ
ప్రకరోచ్ఛేద మొనర్చియుండుము పరబ్రహ్మంబు ప్రాప్తం బగున్.

154


తే.

యోగ[126]ధర్మంబునకు నెక్కు డొక్కటియును, నిఖిల[127]మందును లేదిది నిశ్చయంబు
నీమనమునందు నిక్కంబు నిలిపితేనిఁ, జేరుఁ గాలక్రమంబున సిద్ధపదము.

155


వ.

అని యానతిచ్చి నన్నుం బరమానుగ్రహదృష్టిం బరిగ్రహించి యయ్యగ్రిమ
బోధనిధి యచ్చోటన యంతర్ధానంబునొందె నట్లద్దేవమునితోడి సంభాషణతత్పర
త్వంబున నున్న [128]నాకు సంవత్సరంబులు పదునెనిమిదియు నొక్కదివసంబపోలెఁ
గడచె నాఁకలి నీరువట్టు డప్పి నిద్ర యనునవి మొదలయిన మానుషధర్మంబు
లెవ్వియునుం బొంద కతిక్రాంతం బైనకాలంబును బిదప శిష్యులవలన నెఱింగితిఁ
దదనంతరంబ.

156


క.

విజ్ఞానము మునుపుగ భ, వ్యజ్ఞానము దివ్యచక్షురన్వితముగ స
ర్వజ్ఞుం డగునమ్మహాత్ముని, యాజ్ఞన్ బ్రాదుర్భవించి నప్పుడు నాకున్.157
వ. అట్టి దివ్యదృష్టివలన నే నున్నచోటన యుండి కురుక్షేత్రనివాసులైన కౌశిక
పుత్రు లయ్యేడ్వురం గంటి నందులో నేడవువాఁడు శుకపుత్రి యైనకీర్తిమతికి[129]
నణుహుం డను రాజువలన బ్రహ్మదత్తుం [130]డనువాఁడై పుట్టి కాంపిల్యపురాధి

పతియై పిదప యోగసిద్ధి వడసి నని మార్కండేయుండు సెప్పె నని చెప్పుటయు
భీష్ముతో ధర్మజుం డిట్లనియె.

158


క.

అనఘ యణుహుఁ డేవంశ, మ్మునవాఁ డేకాల మతనిపుట్టువు తన్నం
దనుఁ డయ్యె నెట్లు కౌశిక, తనయుఁడు సప్తముఁడు బ్రహ్మదత్తుఁ డనంగన్.

159

భీష్ముఁడు ధర్మరాజునకుఁ గౌళికపుత్రులచరిత్రంబు చెప్పినప్రకారము

క.

అతినిందితజన్మము లే, గతిఁ జెందిరి వరుసఁ గౌశికప్రభవులు స
ద్గతి యెమ్మెయిఁ గలిగెఁ బిదప, నతులయశా దీనిఁ దెలుపు మంతయుఁ గరుణన్.

160


వ.

అనిన భీష్ముం డిట్లనుఁ బూరువంశంబునం బురుమిత్రుం డను రాజు గలిగె నతనికి
బృహద్ధిషుండును నాతనికి బృహద్ధన్వుండును నన్నరనాథునకు సత్యకర్ముండును
సత్యజిత్తునుం బుట్టిరి.

I61


తే.

విశ్వజి త్తనఁగాఁ బుట్టె వినుము సత్య, జిత్తునకుఁ దత్తనూజుండు సేనజిత్తు
వాని కాత్మజుల్ నలువు రవార్యబలులు, పుట్టి రందులో రుచిరుండు భూరిబలుఁడు.

162


వ.

పాంచాలేశ్వరుండై తేజరిల్లి పృథుసేనుం డను రాజుం గనియెఁ బృథుసేనునకుఁ
బారుండు పుట్టెఁ బారునకు [131]నిశాభిధానుం డుద్భవించె.

163


క.

సుతశతముఁ గాంచె నాతం, డతిరథులై [132]నిపుణు లనుసమాఖ్య బడసి రం
దతిశూరుఁడు సమరుం డన, నతఁ డభిమతసమరుఁ డెందు నభినుతిఁ బొందెన్.

164


వ.

సమరునకుఁ బృథుండును బృథునకు విభ్రాజుండును జనియించిరి. విభ్రాజున
కణుహుండు పుట్టె నతనికి [133]శుకదుహితయైన కీర్తిమతి బ్రహ్మదత్తుం గనియె
నయ్యణుహుండు మత్పితామహుం డగు ప్రతీపభూపాలునాఁటివాఁడు తత్సు
తుం డగు బ్రహదత్తునకు విష్వక్సేనుండును నతనికి [134]దండసేనుండును జనియించిరి.
దండసేనుండు కాంపిల్యంబునకు రాజై తక్కిననృపుల నందఱం బరిపాలించు
చుండు ద్రుపదపితామహుండును బృషతజనకుండును నగు[135]దండసేనునిపై నజా
మీఢవంశోద్భవుం డగునుగ్రాయుధుండు వచ్చి వరదానలబ్ధం బగుచక్రంబుకలిమి
నతిదుర్జయుండు గావున.

165


క.

సమరంబు చేసి యతనిని, సమయించి తదీయవంశజాతులనెల్లన్
గ్రమమునఁ బెక్కండ్రఁ దునిమె, సమదభుజాటోపచటుల[136]సంభరితమతిన్.

166


వ.

ఇవ్విధంబున [137]దండసేనుం దొట్టి నృపాలాన్వయులం బెక్కండ్ర మడియించి.

167

భీష్ముఁ డుగ్రాయుధుం డనురాజుం జంపినప్రకారము

ఉ.

ఎందును మాఱు లేక ధరణీశులఁ బల్వుర నాజిఁ జెండియున్
మ్రందఁగఁ జేసి కైకొనక నన్ను జయించుతలంపుతోడ నా

మందవిచారుఁ డుద్యమసమగ్రతమైఁ జనుదెంచెఁ గుంజర
స్యందనఘోటక[138]ప్రకటసైన్యసమూహవిజృంభణంబునన్.

168


వ.

ఆ సమయంబున నేను శంతనుండు లోకాంతరగతుం డైన నతనికి బితృమేధంబు
నడపుచు [139]ధరణీశయనప్రముఖవ్రతంబు లవలంబించియుండ నమాత్యులు సేనా
పతులు నుత్సాహులై శోకింప దద్దురాత్ముండు దూతం బుత్తించిన వాఁడు
తద్వాక్యంబులుగా నాయెదుర ని ట్లనియె.

169


క.

నీమాఱుదల్లి త్రిభువన, భామారత్నంబు గంధవతిపై నాకున్
గామంబు గలదు భీషుఁడ, యేమియు నన లేదు వేగ యి మ్మావెలఁదిన్.

170


ఆ.

ఇట్లు సేసితేని యిలయును రాజ్యంబు, [140]ధనము నిపుడు నీకుఁ దక్కు వేఱ
దుర్విమోహపరత గర్వంబు సూపిన, బ్రతుకు డరిడి యొండు పలుకు లేల.

171


క.

నాచక్రముపేరు వినిన, రాచకొడుకు లెల్లఁ దమదురాచఱికంబుల్
వే చెడిపోవఁగఁ బాఱుదు, లేచి నిలిచిరేనిఁ జత్తు రెఱుఁగవె దీనిన్.

172


మ.

అని యి ట్లగ్నివిషోపమంబు లగు దుష్టాలాపముల్ వీను లొం
దినఁ జిత్తం బెరియంగఁ గ్రోధము సముద్దీప్తంబుగా సైఁప[141]లే
క నిరోధోద్దతబుద్ధి నక్షణమ సేనాధ్యక్షులున్ సర్వవా
హినుల సన్నహనంబు సేయుఁ డని యుద్ధైకాగ్రహవ్యగ్రతన్.

173


వ.

విచిత్రవీర్యసమేతంబుగా [142]వెలువడునెడ మంత్రకోవిదు లగుమంత్రులు, క్రియా
వేదు లగుఋత్విక్కులును నిత్యహితకాము లగుసుహృదులుం గూడి నన్నుఁ
బరివేష్టించి.

174


సీ.

శాత్రవుఁ డత్యుగ్రచక్రహస్తుండు నీవు సూతకి వై కాయశుద్ధి లేక
యున్నాఁడ వకట యాయుధము [143]లంటగఁరాదు దివ్యాస్త్రములఁ బ్రవర్తింపరాదు
తొలుతఁ గయ్యమునకుఁ దొడఁగుటయును నీతిబాహ్యంబు ప్రస్ఫుటోపాయవిధుల
సామభేదాదినిశ్చయమునఁ జరియించి పోరామియైనప్డు పోరు డొప్పుఁ


తే.

గాన యిప్పటి కొకభంగిఁ గాలయాప, నంబు గావింపఁ జతురజనంబుఁ బుచ్చు
[144]మవులఁ బితృకార్య మేదిన నతులశుభము, లెల్లఁ గైకొని వెడలి జయింపు పగతు.

175


క.

తగువార లిట్లు చెప్పిన, తగవులు వినకునికి సాలఁ దగ దని నన్నున్
మగుడించి చనిరి చెచ్చెరఁ బగతుకడకు దూతవృత్తిఁ బండితజనముల్.

176


వ.

చని యనేకవిధంబుల ననునయించియు భేదించియు వివిధవస్తునిరూపణంబులఁ
బ్రబోధించియు నద్దురాత్ము సుముఖుం జేయనేరక చిక్కువడియుండ నుక్కు
మీఱి యక్కుటిలుండు చటులసంచారనిర్వక్రం బగు చక్రంబు మాపై
బ్రయోగించిన.

177

మ.

పరిణద్ధోగ్రయుగాంతభానుపరిధి ప్రస్ఫారమయ్యున్ వెసం
బరదారైకపరాత్మకుం డయిన యప్పాపాత్ముపాపంబునం
[145]బరిహీణాత్మమహత్త్వమై తృణకణప్రాయస్వరూపంబుతోఁ
దిరిగెన్ మాదెస రాక యంతటన తద్దివ్యాయుధం బత్తఱిన్.

178


వ.

దాని కమ్మూఢుండు విస్మితుం డయ్యును దనయహంకారంబున నిశ్శంకవృత్తి
నుండె నే నది యెయ్యదియు నెఱుంగ నాలోనన యాశౌచదినంబులు గడచిన
నుర్వీసురోత్తములచేతం గృతస్వస్త్యయనుండనై ససైన్యంబుగాఁ బురంబు వెలు
వడిన నవ్విరోధియు నా కెదురై నడిచె నివ్విధంబునం దలపడి.

179


క.

మూఁడుదినంబులు తద్దయు, వాఁడి యగురణంబు సేసి వరబాణాగ్నిన్
[146]మాడించితి నయ్యధమునిఁ, బోఁడిమి చెడి తద్బలౌఘములు వెస విచ్చెన్.

180


వ.

ఇ ట్లాయుగ్రాయుధుండు నిహతుం డయిన నటమున్ను వానిచేత రాజ్యభ్రష్టుం
డయి పోయిన పృషతుండు నాపనుపునఁ గాంపిల్యనగరంబు గైకొని యహి
చ్ఛత్రసహితంబుగా నేలెఁ బిదప ద్రుపదు గెలిచి యర్జునుండు ద్రోణున కప్పురం
బులు రెండు నొసంగినం బరిగ్రహించి గురుండు కాంపిల్యనగరంబు ద్రుపదున
కిచ్చి యహిచ్ఛత్రంబు తాను గొనియెఁ [147] బ్రసంగంబున నే నుగ్రాయుధునిగీ టణం
గించినచందంబునుం జెప్పితి నింకఁ బితృసమారాధనఫలానురూపం బగుకౌశికా
త్మజులచరితంబు మార్కండేయుండు నాకు నుపన్యసించినది నీకు నెఱింగించెద
విను మవ్విప్రు లేడ్వురపేళ్ళును వరుస వాగ్దుష్టుండును గ్రోధనుండును హింస్రుం
డును బిశునుండును గవియు ఘస్మరుండును బితృవర్తియు నన నిట్లు క్రియాను
రూపంబులై యొడఁగూడె నీదృశనామకరు లయిన వారు.

181


తే.

తండ్రి సచ్చినపిమ్మటఁ దమతమంత, వారలయి గర్గుఁ డనుమునివరునిఁ జేరి
శిష్యవృత్తిమైఁ బరిచర్య చేయుచును స, మంచితాధ్యయనంబు గావించి రర్థి.

182


క.

న్యాయాగత మగు గురుసొ, మ్మాయతకపిలాంగి యైనయావొకటి సమ
చ్ఛాయగలక్రేపుతోడిది, యాయేడ్వురుఁ గూడి కాతు రాతనియాజ్ఞన్.

183


సీ.

ఒక్కనాఁ డాఁకలియును నీరువట్టును నధికమై యోర్వలే కడవిలోన
నందఱు బాల్యంబునందలి చాపలంబును విమోహంబును నెనయుబుద్ధి
నగ్గోవుఁ జంపి యాహారంబు గొనుట గర్జంబుగాఁ గోరి నిశ్చయము సేసి
రందులోఁ గవియును నాఘస్మరుండును దగ దని పెక్కువిధములఁ జెప్పి


తే.

రెంత చెప్పిన మానరై రితరు లప్పు, డాత్మఁ దలపోసె పితృవర్తి యనునతండు
మనకు నెబ్భంగులను దీనిమాంస మిష్ట మేనిఁ బిత్రర్థముగ వధియించుడొప్పు.

184


వ.

అ ట్లయిన నిమ్మొదవుఁ బుణ్యగతి పడయు మనల నధర్మంబుం బొంద దనిన నట్ల

కాక యని యందఱు నగ్గోవు విశసించి విధివిహితంబుగాఁ బితృతర్పణంబు సేసి
తచ్ఛేషోపయోగంబునం బ్రీతులై నిజనివాసంబులకుం జనుదెంచి.

185


క.

పులి వచ్చి తినియె ధేనువు, నలఘుమతీ క్రేపు దప్పె నదె కైకొనుఁ డి
రలుగకుఁ డని గురుముందటఁ, బలికి రతండును ఋజుస్వభావుం డగుటన్.

186


తే.

అది నిజంబుగాఁ గొనియె న ట్లధమకర్మ, కుశలు లగువారు తుదిఁ గాలగోచరత్వ
మొంది యందఱు లుబ్ధకయోనియందు, జాతు లైరి దశార్ణదేశమున ననఘ.

167

కౌశికపుత్రులు గురువరువంచనంబున హీనజన్ములై పుట్టినప్రకారము

వ.

ఇత్తెఱంగున నేకోదరులై పుట్టి తొలుపుట్టువునం జేసినహింసయు గురువంచనయుఁ
గారణంబులుగా నట్టిదుర్జన్మంబు సంభవించినను బితృపూజనంబు కతంబున
జాతిస్మరత్వంబును ధర్మరుచియును వర్ధిల్ల నేడ్వురు నిర్వైరుండును [148]నివృత్తియు
క్షాంతుండును నిర్మన్యుండును గృతియు [149]వైపరియసుండును మాతృవర్తియు
ననుపేళ్ళు గలిగి.

188


చ.

అనృతము లేక లోభరహితాత్మకులై నిజజాతియోగ్యతం
దనరిన హింస ప్రాణచయధారణమాత్రయకాఁ జరించుచున్
వినయము విస్తరిల్ల జననీజనకుల్ గడువృద్ధు లిష్టభో
జనశయనాదులం గరము సంతసిలం బరిచర్యసేయుచున్.

189


వ.

కొంతకాలంబు వర్తిల్లి తల్లిదండ్రులు కాలధర్మంబు నొందినపిమ్మటఁ గార్ముకంబులు
పరిత్యజించి వనంబున నిరాహారులై ప్రాణంబులు విడిచి రిట్లపరగతిం బొంది
[150]కాలాంజనపర్వతంబున నున్ముఖుండు [151]నిత్యవ్రతస్థుండు స్తబ్ధకర్ముండు విరోచనుండు
[152]వేదితుండు ఘస్మరుండు [153]నంది యను సంజ్ఞలు గల మృగంబులై జన్మించి.

190


క.

ఎప్పటి జాతిస్మరణము, దప్పక తముఁ జెంద నెందుఁ దగులనిమతులం
దొప్పెడువివేక మలవడ, నప్పుట్టువు నీఁగి రంచితాత్మసమాధిన్.

191


తే.

అవ్విశిష్టధర్మంబున నంతవట్టు, వారు నొక[154]యేటినీట నొప్పారునిసుక
తిప్ప జక్కవలయి పుట్టి దెలివిఁ దొంటి, బాములన్నియుఁ గానంగఁ బ్రకటనియతి.

192


వ.

సహచరీపరిగ్రహం బొల్లక తపస్విసేవితంబు లగుబ్రహ్మమౌనాధ్యయనాదుల
నంగీకరించి [155][156]సుమనుండును మునియును శుచివాక్కుండును [157]శుధ్ధుండును చిత్ర
దర్శనుండును సునేత్రుండును స్వతంత్రుండును ననునామంబులఁ బూర్వజన్మా

చరితంబు లగు గురుశుశ్రూషణంబు తపంబు నివృత్తిధర్మంబు నను నివి [158]విఫలం
బులు గా కునికి నందఱు బ్రహ్మవాదులు యోగనిరతులు నై యుండునెడ.

193


ఉ.

భ్రాజితతేజుఁ డుత్తముఁడు పౌరవవంశవివర్ధనుండు వి
భ్రాజుఁగు కామినీజనపరంపర గొల్వగఁ గేళికౌతుకో
ద్యోజితచిత్తుఁ డై ప్రమదదోహల మొప్పఁగ నేఁగుదెంచె న
వ్యాజవిభూతిఁ దత్సరిదుపాంతవనాంకమనోజ్ఞభూమికిన్.

194


వ.

ఇతనిం జూచి స్వతంత్రుం డను[159]విహంగమంబు తన మనంబునఁ గోర్కి మిక్కుటం
బై యి ట్లనియె.

195


క.

భరపడి యుపవాసంబులు, జిరతపమునఁ బొరలి పొరలి [160]చివికితి నే ని
న్నరపతిక్రియ నఖిలసుఖోత్తర మగు జన్మంబుఁ [161]బొందెదను బ్రియ మెసఁగన్.

196


తే.

నాకు నింతటి సుచరిత్రపాక మొకటి, గలిగె నే నిట్టిదయ యగుఁగాత యనఁగ
మఱియు రెండుఖగంబు లమ్మాటవలని, యాదరం బగ్గలింపంగ నతనిఁ జూచి.

197


క.

భూపతిపై యటు పుట్టిన, నీ[162]ప్రెగడల మగుట మాకు నిక్కము వాంఛా
రూపం బని వలుకఁ దదా, లాపము లాపక్షి సముపలాలన చేసెన్.

198


వ.

తక్కిన చక్రవాకంబులు నాలుగు నప్పులుఁగుతో నీవు యోగధర్మనిష్ఠుండ వై
కామప్రధానం బగుచరితం బపేక్షించితి గావున నీకోర్కి దప్పకయుండఁ గాంపిల్య
నగరేశ్వరుండ వయ్యెదవు వీరు నీకు సఖులు గాఁగలవా రనిన నది నిజం బగు
టకుం దలంకి [163]యమ్మువ్వురు నమ్మహాతులం బ్రార్థించిన వారియందు సుమనసుం
డి ట్లనియె.

199


సీ.

ఇంకను ఖగజన్మ మీయేడ్వురకుఁ గల దటమీఁద నీ స్వతంత్రాహ్వయుండు
సర్వజంతువులభాషలు నెఱింగెడినట్టి రాజతనూభవుఁ డై జనించు
నితనికారణమునఁ బితృహితార్థంబుగ నగ్గోవు వధియించి యందఱమును
దారుణం బైన యథర్మంబు ధర్మంబుగా నొందఁ గంటిమి గాన యితఁడు


తే.

మనకు సద్గతిహేతువు వినుఁడు మీర, లట్లు జన్మించియుండ నే మన్యముఖము
నందు వినుతింప నొక్కవాక్యంబు వినిన, యపుడ సిద్ధించు బరమబోధాప్తి మీకు.

200


వ.

ఇది నిక్కం బనియె వార లమ్మేనులు విడిచి మానససరస్సున హంసయోనిం
బుట్టి పూర్వనామంబులన పరఁగి పవనాంబుభోజను లై శరీరశోషణంబులు సేయు
చుండ నక్కడ విభ్రాజుండును నణుహుం గనియె నతనికి శుకుండు తనకూతుఁ
బత్నిగా నిచ్చె నంత.

201


మ.

తనయుం బట్టముగట్టి పౌరులు నమాత్యశ్రేణియున్ విప్రులున్
దనుఁ బూజించి ముదంబుతో ననుప నాధాత్రీశ్వరుం డర్థిమై

జనియె న్మానసతీరభూమీఁ దప మాశ్చర్యంబుగాఁ జేసెఁ బే
ర్చిన కోర్కుల్ గదియంగనీని హృదయస్థేమంబు సంధిల్లఁగన్.

202


వ.

ఆ రాజతపస్వి య ట్లుండియు నప్పుణ్యపతత్రుల యోగనిష్ఠ నాలోకించి జన్మాంత
రంబున దీనిలో నొక్కటికిఁ బుత్రుండ నై యోగసిద్ధి వడయుదు నని సంకల్పంబు
నేసెఁ బరమతపోవిభ్రాజుం డైన యా విభ్రాజువలన భ్రాజిల్లుటం జేసి యక్కాన
నంబు వైభ్రాజంబు నాఁ బరఁగె నక్కొలనికి వైభ్రాజం బను నామాంతరంబు
గలిగె నయ్యేడ్వురుపక్షులయందు మున్ను యోగభ్రష్టుం డైన స్వతంత్రుం
డణుహునకు బ్రహదత్తుండై పుట్టె జిత్రదర్శనసునేత్రులు విప్రులై జనియించి
బాభ్రవ్యకండరీకు లనుపేళ్ల నతనికి మిత్రత్వంబు నొంది నమ్మువ్వురుఁ గృతాధ్య
యనులును నఖిలకళాధికులు నయ్యును బూర్వజన్మంబు లెఱుంగనీని యజ్ఞానం
బులు మనంబునం బొదువ వర్తిల్లుచుండి రందు.

203


సీ.

బ్రహ్మదత్తునకు బాభ్రవ్యుఁ డా[164]దార్యకం బొనరించు నధ్వర్యుఁడును సమస్త
కర్మసఖుండు నై కండరీకుఁడు శ్రుతిద్వయపారగుఁడు ప్రసిద్ధతఁ జరించు
నెమ్మెయి నెనసి యనేకవాంఛానురూపము లగు దివ్యభోగములు దమకుఁ
జుబ్బనచూఱ లై సొగయింపఁ వా రుండ నణుహుండు గొడుకు రాజ్యాభిషిక్తుఁ


తే.

జేసి యోగాత్ముఁ డై నిత్యసిద్ధి వడసె, రాజసుతుఁడును దేవలప్రభవ యైన
చెలువ సన్మతిఁ బెండ్లి యై చిరగృహస్థ, ధర్మ మొప్పంగ రాజ్యతంత్రంబు నడపె.

204


వ.

తక్కిన నలువురు పక్షులు గాంపిల్య[165]నగరంబునంద యొక్కశ్రోత్రియునకుఁ బుత్రు
లై పుట్టి జాతిస్మరత్వం బెడత్రెవ్వక వేదవేదాంగవిజ్ఞానంబును బరమార్థవేదతియు
ననవరతపరమయోగధ్యానాసక్తియుం గలిగి ధృతిమంతుండు సుమనుండు
విద్వాంసుండును తత్వదర్శియు నను నభిధానంబులం బ్రసిద్ధు లై యందఱు
[166]నేకమతం బగు సంకేతంబున.

205


మ.

భవనంబుం బెడఁబాసి సిద్ధపదవీప్రస్థానముం జేయుపొం
టె వినమ్రాంగకు లై మహాత్ముఁ డగు తండ్రిన్ వీడ్కొనిం బోవ న
య్యవనీదేవుఁడు వారిఁ జూచి యకటా యాత్మోద్భవుల్ నల్వురం
బ్రవరాచారులఁ గంటి మంటి నని హర్షం బొంది యే నున్నెడన్.

206


ఉ.

పుట్టినఁ గోలె నావలనఁ బొందిన పేదఱికంబు మాన్ప కీ
పుట్టువు మీకు ధన్యముగఁ బూజితుఁగా ననుఁ జేయ కెంతయున్
దిట్ట లనంగ విద్యయు వినీతతయున్ వెలయింప కిమ్మెయిన్
గట్టిడిపూన్కి నిల్లు దొరుగం దగునే సుతులార యిత్తఱిన్.

207


క.

అనుటయు వా రిట్లని రిం, తననేటికి నేము నీకు నఖిలంబు నొన
ర్చినవారమ యొక్కవెరవు, విను నీదారిద్ర్యదోషవిభరంబునకున్.

208

క.

శ్లోకంబులు రెం డివె య, స్తోకగభీరార్థవచనశోభితములు నీ
వా[167]కాంపిల్యాధీశ్వరుఁ, డాకర్ణింపంగఁ జదువు మనుఁగులు నుండన్.

209


ఆ.

వినిన యపుడ ధరణివిభుఁ డగ్రహారంబు, లును ప్రభూతవస్తుధనచయములు
నిచ్చు నీకు దీనఁ బొచ్చెంబు లేదు మో, దంబుఁ బొందు మధికధర్మనిరత.

210


వ.

అని యతని కవ్వాక్యద్వయంబు విదిశంబు సేసి యాశ్వాసించి యామంత్రబాణం
బొనర్చి వెడలి చని.

211


క.

రాగాదిదుర్లభంబు [168]ను, పాగతసత్యాద్వయోదితానంద నిరు
ద్వేగము నగు యోగం బా, యోగీశ్వరు లొంది చెంది రుత్తమసిద్ధిన్.

212


వ.

ఇక్కడ బ్రహ్మదత్తునకుం దత్పితామహుం డగు విభ్రాజుండు తొంటి తపస్సమయ
సంకల్పంబువలనం బుత్రుం డై విష్వక్సేనుం డనం బ్రభవించె నట్లు లబ్ధసంతా
నుం డై యతండు దేవీసమేతంబుగా నగరబహిరుద్యానంబున విహరించుచు
నొక్కనాఁ డేకాంతంబున.

213


క.

ఒకచీమ తనప్రియుడు కా, ముకుఁ డై యర్థిఁ దెలుపంగ మును బూనిన కిం
కకుఁ బాయక భంగించు ప, లుకు లాకర్ణించి తగఁ బెలుచ నవ్వుటయున్.

214


క.

మానిని యెంతయు సిగ్గును, దీనతయును గదిరి పెక్కుదినము లనశన
ధ్యానపరిమ్లానత[169]మెయిఁ, దానూరక యున్నఁ బ్రభుఁడు తద్దయు వంతన్.

215


వ.

నిత్యంబునుం దలంచి యవ్విధంబునకు నిమిత్తం బడిగిన నవ్వెలంది నీవు నవ్వుట
నన్ను గేలిగొనినచందంబ యందు సందియంబు లే దట్లు గావున జీవితం బింక
నేమిటి కనిన నతం డానవ్వునకుం గారణంబు సెప్పె నెంత సెప్పిన నయ్యింతి
నమ్మని నెమ్మనంబుతోడ.

216


చ.

పురుషవరేణ్య యేల యిటు పొచ్చెపుమాటల న న్మొఱంగె దె
వ్వరు జనకోటియం దెఱుఁగువారు పిపీలికపల్కు దేవతా
వరమున నొండెఁ దొల్లిటిభవంబు తపంబున నొండె నద్భుతా
ధ్వరవిధి నొండెఁ గాక గరువం బగు తత్పరిబోధ మబ్బునే.

217


క.

నీ నగవునకుం గారణ, మే నమ్మం దెల్లఁగాఁగ నెఱుఁగఁగ నది యె
ట్లైన నొనర్పక యుండిన, నే నిదె నీయానఁ బ్రాణ మింతట విడుతున్.

218


వ.

అనిన నతం డెయ్యదియునుం జేయనేరక యయ్యాపదకుం బ్రతీకారంబు చింతించి
యార్తశరణ్యుం డగు నారాయణు నుద్దేశించి యుపవాసంబుతో నాఱుదినంబులు
పడియుండ నాఱవనాఁటి వేకువనుం గలలోన వచ్చి యద్దేవుండు.

219


క.

వినుమీ [170]రేపకడయ ని, న్ననుపమశోభనము వొందు ననుమానము లే
దనఘా విడువు విషాదం, బనియె నతఁడు మేలుకనియె నక్షణమ తగన్.

220

క.

హరిచేత వరము వడసితిఁ, జరితార్థుఁడ నైతి ననుచు జనపతి ప్రాతః
కరణీయము దీర్చి యలం, కరణంబుల నుల్లసిల్లి కాంతయుఁ దానున్.

221


వ.

మాణిక్యఖచితం బగు కనకరథం బెక్కి కండరీకుండు సారథ్యం బొనరింప బాభ్ర
వ్యుండు వెల్లసీవిరి వట్ట నిట్టలం బగు విభవంబునం బురంబు సొచ్చునెడం గొడు
కులు నలువురుం గఱపిన పద్యంబులు పాఠంబులు గొని బ్రాహ్మణుం డిది నాకు
నవసరం బని సువ్య క్తవర్ణోచ్చారణం బగు నెలుంగున రాజులును మంత్రులును
వినఁ దద్వాక్యార్థం బి ట్లని పఠించె.

222


సీ.

అమలదశార్ణదేశమునయం దేడ్వురుబోయ లై తొలితొలిఁ బుట్టి పిదపఁ
[171]గాలాంజనం బను శైలోత్తమంబునఁ బెనుపార మృగము లై జనన మొంది
తనరుశరద్వీపతలమునఁ జక్రవాకంబు లై ప్రభవించి క్రమ్మఱంగ
మానసాహ్వయ మగు మహితసరోరుహాకరమున హంసతాగరిమ నొంది


తే.

[172]పరఁగి రెవ్వారు మును వేదసార[173]దృశ్వ, లా కురుక్షేత్రసంజాతు లైన విప్రు
లట్టివా రదె కడుదూర మైన తెరువు, చనిరి వారలఁబడి దప్పఁ జనునె మీకు.

223

బ్రహ్మదత్తుఁడు దేవీసహితంబుగా బరమసిద్ధి వడయుట

వ.

అని [174]పఠియించిన విని బ్రహదత్తుండు విచేతనుం డైనయట్లు చేష్టలు దక్కెఁ గండరీ
కుండు కేలనున్న [175]యమ్ములుకోలయుం బగ్గంబులు విడిచి సంధులు ప్రిదిలి యుండె
బాభ్రవ్యుండు నిపతితచామరం బగు కరంబుతో నస్వస్థచిత్తుం డయ్యె వారిం
జూచి పరివారంబును పౌరులు నాగంతుకులును భయవిస్మయంబుల మునింగి
[176]కలంగిరి కొంతవడికిం దెలిసి యమ్మువ్వురు.

224


క.

చెఱిచినది గన్న తెఱఁగున, మఱచిన తొలిబాము లెల్ల మదిఁ గని నిష్ఠన్
[177]దఱిగొల్పెడు యోగస్థితి, తెఱఁ గంతయు బుద్ధికిం బ్రతీతం బైనన్.

225


వ.

ఆనందరసతన్మయు లైరి తదనంతరంబ.226
ఉ. నిండుమనంబుతోడ ధరణీపతి యాధరణీసురోత్తమున్
బండితపూజితున్ మధురభాషల నెంతయుఁ [178]దేల్చి కోరికల్
నిండ నఖండవస్తుశతనిర్భరసంపద లిచ్చి తృప్తి యొం
డొండ యొనర్చి వీడ్కొలిపె [179]నుత్సుకతం ద్వరమాణచిత్తుఁ డై.

227


మ.

సమదారాతితమిస్రభానుఁ డగు విష్వక్సేను నాత్మీయసూ
ను మహారాజ్యపదంబున న్నిలిపి తానున్ దేవియు మంత్రియు
గ్మముతోడన్ జనుదేర నిర్భరవిరాగస్వాంతతన్ గాననాం
తమునం దర్థి వసింప నేఁగె విగళత్పాశ ప్రభావోద్ధతిన్.

228


వ.

అప్పుడు మహాయోగతత్పర యగు తత్పత్ని యతని కి ట్లనియె.

229

తే.

అఖిలజంతుభాషావేది వైన నిన్ను, నధిప యే నెఱుఁగనె విషయానుభూతిఁ
దగిలి పూర్వజాతిస్మృతి దప్పియున్నఁ, దెలుపుటకు నిట్లు చేసితిఁ దెఱఁ గొకండు.

230


క.

మును [180]చెడిపోయినయోగము, మునికృప యిటుచేరె నింక ముద మెసఁగ నిరం
జనసిద్ధమార్గ మారసి, చనువార మనన్యసులభసంపత్తిమెయిన్.

231


వ.

అని యి ట్లన్యోన్యధన్యతాకథనం బొనర్చుచు నరిగి కండరీకుండును శ్రుతికిం
గ్రమప్రణయం బొనర్చి కృతార్థతం జెందె బాభ్రవ్యుండు శిక్ష యుత్పాదించి
యోగాచార్యగతిం బ్రాపించె నివ్విధంబు మార్కండేయుండు సనత్కుమారు
వలన భవిష్యద్రూపంబుగా విని పిదపం దానుం బ్రత్యక్షంబుగాఁ గని నా కెఱిం
గించి యిట్లనియె.

232


క.

శంతనుతనూజ యీకథ, యంతయు విని ధన్యతముఁడ వైతి మనసునం
జింతింపుము దీనిన య, త్యంతశుభావాప్తి యగు ననంతనిరూఢిన్.

233


శా.

ఈయాఖ్యాన మెఱింగి చిత్తమునయం దేప్రొద్దు మోదించువాఁ
దాయుష్మంతుడు శ్రీసమేతుండునుఁ బుత్రానేకపౌత్రోదయ
శ్రేయోనిత్యుఁడు నై సుఖోన్నతి గనుం జెందండు తిర్యగ్జనిన్
ధీయోగంబున నొయ్యనొయ్యన విముక్తిం గాంచు సిద్ధుం డగున్.

234


వ.

అని చెప్పి యమ్మునీంద్రుండు నిజేచ్ఛం జనియె నిది పితృకల్పప్రకారంబు చిత్తా
యత్తంబుగా నొనర్పు మనిన భీష్మభాషితంబులకుం బరితోషంబు నొంది ధర్మనం
దనుం డతని నభినందించె నని వైశంపాయనసూక్తం బైన కథావిధానంబు మధు
రంబుగా.

235


ఉ.

చంచనచంద్రచంద్రధరశారదనీరదనారదామృత
స్యందిముకుందపూర్వభవహారహరీభహరాద్రిహంసహీ
రేందువినిందకస్ఫురదుదీర్ణయశోర్ణవపూర్ణసర్వది
క్కందర నంద దిందిర జగజ్జనసుందర ధైర్యమందరా.

236


క.

సర్వధురీణగుణోదయ, సర్వజ్ఞోదాత్తవృత్తసంసిద్ధియశో
గర్విత మల్లచమూవర, నిర్వంచకసోదరత్వనిత్యారాధ్యా.

237


మాలిని.

కదనదళదమిత్రక్షత్ర [181]గోత్రప్రతానో
త్సదననివహభూరిచ్ఛత్రభవ్యోపధాత్రీ
పదపరి తదృప్యద్భార్గవాభీలఖేలా
భ్యుదిత[182]పరమసామ్యస్ఫూర్తిమత్తీవ్రఖడ్గా.

238


గద్యము.

ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసదోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షుణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునందుఁ బూర్వభాగంబున ద్వితీయాశ్వాసము.

  1. సంభవంబొందితి
  2. మచ్చకంటి
  3. లోకోప
  4. నీతనువు నధికశృంగారంబు, నీతను వధికయశోవిశ్రమంబు
  5. వారగు
  6. పుత్రకుఁ డానర్తుఁ డనువాని సుతనుకన్యాఖ్య నెమ్మి, గనియె నయ్యింతి భార్గవునకు గాదిలి.
  7. తృప్తి
  8. సూనుఁడై ఋషభుఁ డనఁగ; సూనుఁడు రేవుఁ డనఁగ.
  9. సంస్కృతహరివంశమునందు, 'రేవోనామమహాద్యుతిః, ఆనర్తవిషయశ్చాసీ త్పురీచాస్య కుశస్థలీ, రేవస్య రైవతః పుత్రః కకుద్మీ నామ ధార్మికః.’ 1-10-33
  10. అందఱికి; అందున.
  11. కమలజు
  12. భోజవరులునుఁ గృ
  13. క్రూరులైన
  14. మెలఁగెన్
  15. కాకుత్థ్సు లనఁగ
  16. శ్రాబస్తి
  17. తద్వంశంబున నునిచి
  18. నుత్తంకుం
  19. ఁగానన
  20. మా కయ్యెడు నొప్పు మాత్ర
  21. కార్యంబు
  22. విధైక
  23. దెలియఁగ
  24. సౌరుఁ డొక్కండు పెండ్లైన బాల (పూ. ము.) యైన నబ్బాల
  25. నుండె
  26. పెంపున సొంపార వసిష్ఠునియాజ్ఞాబలంబున వర్తిల్లె నయ్యఖిలంబుమ సురక్షితం బయ్యె
  27. రానూపక
  28. పోషణంబను
  29. నిత్యంబును
  30. పర్షి
  31. మృసంబులు: మృగంబొండు
  32. మేనిమాంసంబు
  33. దేలిన; దేరిన
  34. సేగి
  35. కౢప్త, లుప్త.
  36. క్రమంబున.
  37. ద్రుంగఁగా.
  38. సాంమ్రాజతం.
  39. తంబగు
  40. రాజ్యసంధానం బమరియుండ.
  41. పారదపహ్లవులం.
  42. గహనంబులు
  43. చారు
  44. నమ్మునీంద్రుం.
  45. బొనరించి.
  46. విదుఁడుగవస్త్రమగ్నిరాంతం.
  47. తన
  48. యుద్రిక్తమై
  49. ధైర్య; ధన్య.
  50. దన్మిత్రులన్ ఆదిన్
  51. జోళకేరళులం దాదృశులనకా; ధాత్రీశుల.
  52. నొకరికి
  53. యుఁడీ
  54. కాంతి
  55. పాఱు
  56. దలంచినం
  57. నతఁడు ఖట్వాంగదిలీపుం గనియె నా
  58. ‘వంబరీషస్తు నాభాగిః సింధుద్వీపపితా౽ భవత్', 'అయుతాజిత్తు దాయాదః సింధు ద్వీపస్య వీర్యవాన్' అని పూనా ప్రతి ‘సింధుదీపపితా' అనియు 1-15-18. 'సింధుదీపస్య' అనియు ఎఱ్ఱాప్రెగడ ప్రతి కానోపు.
  59. అయుతాజిత్ - అని మూలము
  60. నిధుని
  61. సమన్వితుఁ.
  62. నలఘుభువనభరణ
  63. మద్భుజు
  64. సంపదు
  65. అహస్వతుఁడు
  66. తత్సమారాధన
  67. సురసంతతిచే
  68. లవారలు
  69. అట్లు గాక పితరు లన వేఱఁ గొందఱు
  70. యకడు
  71. నిగమ
  72. నిరత మేను గేలు పచరించితి (ప్రసరించితి.)
  73. ప్రశ్నం
  74. నేక
  75. దోఁచె
  76. గాంచిత
  77. ప్రహ్వుండనై; బృహ్వుఁడనై.
  78. నడుపంగ
  79. తత్పరిబోధ
  80. మునుఁగఁగ
  81. లోకహితైకబుద్ధి వారి
  82. తెలుసుకొని
  83. తనయుల
  84. బోయి
  85. మూర్తములు
  86. పుష్పంబును
  87. లోకమాత
  88. మయ్యె నన్యమహితత, మహత్త్వ
  89. యోగభావ్యుండై; చారుండై
  90. యసీత్తునకు
  91. జైగీషవ్యుండను
  92. కలికులం
  93. ఒక ప్రతిలో యోగవిద్యాప్రవర్తులని స్త్రీలకే చెప్పియున్నది గాని వారిపుత్త్రులకుఁ గాదు. మఱియొకప్రతిలో వీరిద్దరే యాచార్యు లని గలదు.
  94. ఖ్యాతసుర
  95. బింబంబునకు
  96. యెలమితోడఁ
  97. వందు
  98. ధరణి
  99. ఒకప్రతిలో నలుగు రని మొదటి నలుగురు వేఱొకప్రతిలో ఋతుండు జయుండు అనుటకు ఋరుంజయుం డని యార్వురని యున్నది.
  100. గృతి
  101. లసం ప్రీతి
  102. వైరాజి యన నది; వీరాజి యమనది వీరవర్యు.
  103. సకలాఖ్యపితరు లనునది సంస్కృతమున లేదు.
  104. 131, 132 పద్యములు కొన్ని వ్రాత ప్రతులలో లేవు. ఈభావము మూల మగు సంస్కృతగ్రంథమున లేదు.
  105. మునకు నరుగు
  106. యశో
  107. ఁబుష్కలంబు
  108. ఁబ్రబల
  109. సేయ
  110. తారతిథిగ
  111. కొన్ని ప్రతులలో ఇది గీతము.
    అభిజిదాధికంబులు మూఁట నాగమాఢ్య, తయును సద్గతియును నర్థచయముఁ జేయు
    వెండి రెంటను జేకుఱు భేషజంబు, సిద్ధియును ద్విసమృద్ధ మాజీవనంబు.
  112. జేయు
  113. భేషజ
  114. పెంపునుఁగు
  115. ధేనువు
  116. పితరులకును, నిజ్యత
  117. లకు సరిత్పాశోధులకు నశేష
  118. లింద్రు
  119. దీవులందుల యర్థ
  120. పితృవరులం
  121. తనూజు
  122. జేష్ట
  123. బ్రారంభం బైన
  124. కనియెదరు
  125. యీ క్రియం బ్రకరోచ్ఛేద
  126. ధర్మంబు కెక్కు డొండొక్కటియును
  127. మునయందు
  128. యా
  129. 'కృత్వి' అని ప్రకృతముద్రితమూలపాఠము.
  130. డనఁ బుట్టి
  131. నీపాభి
  132. ననృపుల సమరాఖ్యుఁ బడసె నం
  133. శుకునకు జామాత
  134. నుదక్సేనుండు (సం. ప్రతిలో దండసేనుండు.)
  135. నీలు; నీపు
  136. సంరంభ
  137. నుదక్సేను. (సం. ప్ర. దండసేనుం.)
  138. ప్రకర
  139. ధరణీవ్రతంబు
  140. ధనము నీకుఁ దక్కు
  141. లే కనిలో నుద్ధత
  142. వడలు
  143. పట్టఁగరాదు
  144. మెలమిఁ బితృకార్య మే దన నతులవిభవ, మెల్ల
  145. బరిహీనాత్మ
  146. మూఁడించితి
  147. బవరంబున
  148. నివృతియు
  149. విఘంసుండును
  150. కాలాంజర
  151. నిత్యవిత్రస్తుండు
  152. పండితుండు
  153. నాదిసోమాభిధానయు నను
  154. యేటిదండ
  155. సంస్కృతప్రతిలో సుమనసుండు, శుచిపాకి, శుద్ధి, పంచమ, చిత్రదర్శన, సునేత్ర, స్వతంత్రులు అను పేరులు.
  156. సుమనస్కుండును. (సం. ప్ర.) సుమనసుండును
  157. బండితుండును; భద్రదర్శనుండును.
  158. వివిధంబులు
  159. విహంగంబు
  160. చిక్కితి
  161. బొందఁగాఁ
  162. పెగడల ప్రగడల; పెగడల.
  163. యప్పు డమ్మహాత్ములం
  164. చార్యక మొనరించు
  165. పురంబు
  166. నేకసమయం బగు
  167. కాంపిల్యపురీశ్వరుఁ
  168. న, నాగతనిత్యా
  169. యై; తో.
  170. రేకడపల
  171. కాలంజరం
  172. పెరిగి
  173. సదృశు
  174. వివరించిన
  175. యమ్మునికోల
  176. యడంగిరి
  177. [చూ. ఆరణ్య. 7-36]
  178. దెల్చి
  179. నుత్సుకతత్పర
  180. పడి
  181. గాత్ర స్రుతాసృగ్ ఘ్రదనినహకురుక్షే త్రాయితానేక
  182. పరశుసార