హరిలీలావిలాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హరిలీలావిలాసము

తెనాలి రామకృష్ణుఁడు

ఉ. అల ఘృతంబు వేఁడియగు నన్నము నుల్చిన ముద్దపప్పు క్రొం
    దాలిపుఁ గూర లప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్
    మేలిమి పిండివంటయును మీఁగడతోడి ధధిప్రకాండమున్
    నాలుగు మూఁడు తోయములు నంజులుఁ గంజదళాక్షి పెట్టఁగన్.

ప్రబంధరత్నాకరము 2.162ఉ. ఆ కఱివేల్పు సామి చరణాబ్జములన్ జనియించినారు మం
    దాకిని తోడునీడలయినారు నిజంబుగఁ గమ్మ [1]గట్టు దా
    మై కమనీయకీర్తిమహిమాతిశయంబున మించినారు భ
    ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రులు మాద్రులు శూద్రు లప్పురిన్.

ప్రబంధరత్నాకరము 1.205ఉ. ఆ మునిసార్వభౌముఁడు సమంచితకాం(చనపారి)జాతరా
    జీమతిఫేనభానికరజిత్వరతత్పరమాణఫేనిల
    శ్రీమతివాతధూతజలకశీరసేకపవిత్రితాంకథా
    త్రీమతి దర్పితాఖిలసుధీమతి గోమతిఁ గాంచె ముందటన్.

ప్రబంధరత్నాకరము 4.162తే. ఈఁతపంటికిఁ దాటిపం డింత కింత
    మ[శకమైనను] గొండొక శశకమైనఁ
    కాశికాసీమఁ గడనిద్రఁ గ[న్నుమొగి]చి
    మేరుధనువెత్తి కదలని తేరు నడుపు.

ప్రబంధరత్నాకరము 4.165గీ. ఉడుపథంబను ములుదోస తొడిమ యూడఁ
    దామరసబంధుఁ డను పండు తనకుఁదానె
    వికృతి గనుపింపఁ గనుపట్టు విత్తు లనఁగఁ
    దనరె నెఱసంజఁ గెంపుగఁ దారకములు.

ప్రబంధరత్నావళి 433, ప్రబంధరత్నాకరము 3.97[2]తే. [3]ఉరుతరాంబుదము[లు] వోలె [4]నొడ్డి నిలిచి
    వైణికులు వోలె సారెలు వరుస నిలిచి
    పుష్పలావికలను బోలెఁ [బుడిసిలించి]
    యెత్తు లిడియెద రార్యయు నిందుధరుఁడు.

ప్రబంధరత్నాకరము 4.121ఉ. ఎంతయు రాజు [5]తోడఁ బగయే [6]కొమరో మధుపప్రసక్తి య
    శ్రాంతము గల్గు తమ్ముల ప్రచారము గాదని [+ +] నోడి దే
    శాంతర మేఁగె నాఁగ నపరాశఁ బతంగుఁడు దాఁగె నట్టి వృ
    త్తాంత మెఱింగి సిగ్గొలసినట్టులు [7]గందె సరోరుహంబులున్.

ప్రబంధరత్నాకరము 3.67ఉ. ఏటి మహానుభావుఁ డిహిహీ జమదగ్నితనూజుఁ డేడు ము
    మ్మాటులఁ గాని శత్రుమదమర్దనదక్షుఁడు గాఁడు గోత్రమే
    తూఁటుగఁ [8]జేసి తల్లి మెడఁ ద్రుంచెగదా యని యీసడింతురౌ
    గాటపు పంతగాండ్రు కులగణ్యులు [9]క్షత్రియరాజు లప్పురిన్.

ప్రబంధరత్నాకరము 1.186ఉ. కాలధనంజయుండు తనుఁ గాచి దివాకరమత్స్యయంత్రమున్
    గీ లెడలించి సంధ్య యను కృష్ణ నుదంచిత [రూప] విభ్రమ
    శ్రీలలితాంగినిం దగ వరించి తమోమయధార్తరాష్ట్రభూ
    పాలసేన నేయు సితభల్లములో యనఁ బర్వెఁ దారకల్.

ప్రబంధరత్నాకరము 3.96ఉ. చంగున దాఁటు ధేయనిన సప్తసముద్రములైన వేగ వా
    గెం గుదియింప నిల్చు [10]నడిగెంటనె శస్త్రనిపాతధీరతన్
    సంగరరంగవీథిఁ దమ స్వామికి గెల్పు ఘటించునట్టియు
    త్తుంగతరంగరత్నములు తొంటి హయాకృతిశార్ఙి పుట్టువుల్.

ప్రబంధరత్నాకరము 1.282చ. తెలతెలవాఱ నొయ్య నరుదెంచు నిశాంతరతాంతతాంతలౌ
    చెలువల కింపుగా మెలఁగుఁ జెక్కులఁ గూరిన చూర్ణకుంతలా
    వళి సదళంబుగా జడియు వాడిన సెజ్జలమీఁదఁ బ్రావిరుల్
    దొలఁగఁగఁజేయు నూడిగపుఁదొయ్యలులం బలె వేఁగుఁదెమ్మెరల్.

ప్రబంధరత్నాకరము 3.238సీ. నిఱుపేదకౌ నింత నిక్కింతన దళియై
           రోమాళి తన కలరూపుఁ దెలుప
    నున్నతోన్నతమూర్తిఁ జెన్నొందు కటిసీమ
           కనయంబు తొంటి పొంకంబు సడలి
    పసపుఁబయ్యెదఁ జాఱ బయలైన పాలిండ్లు
           చూపర కోర్కులు చూఱ లిడఁగ
    నవవిభాగంబు నన లవలవై యున్న
           వేణి దొల్తటి కమ్మవిరులు దొరుగఁ
ఆ. గక్షభాగరుచులు కనకంపుఁబొడి వెద
    చల్లు లాడు నొక్క చంద్రవదన
    కొసరి కుసుమబంతిఁ గోయు కైతవమున
    నత్తపస్వి మ్రోల బిత్తరించె.

ప్రబంధరత్నాకరము 4.70సీ. [11]నీ రింకఁదొడఁగె వెన్నెల మానికంబుల
           వేఁడిరాతూపుల విడిసె వహ్ని
    కలఁగె జీవంజీవముల నిండుమనములు
           జక్కవపులుఁగుల జాలి వదలెఁ
    గనుమాసెఁ గుముదకాననవిభావిభవంబు
           శ్రీలక్ష్మి నిల్చె రాజీవపీఠి
    వాజువాఱఁగఁ జొచ్చె వరుణుని దిక్కున
           [12]నేర్పడి దీపించెఁ దూర్పువలను
తే. తార లుడివోయె వికసించెఁ దరుల విరులు
    చంద్రికలు గందెఁ గొలఁకులు చాలఁ దేరె
    దీపరుచి దాఁగెఁ దలసూపె రేపటెండ
    చందురుఁడు వ్రాలెఁ [13]బొడిచె కంజాతహితుఁడు.

ప్రబంధరత్నాకరము 3.247ఉ. పున్నమచందమామఁ బొరపుచ్చు సుధారస మొయ్యఁజిల్కుచున్
    సన్నముగాఁగ నూరి ఘనసారమునన్ బ్రతిపాకమిచ్చి మీఁ
    ద న్నెఱయంగ [14]నర్కిన విధంబున వెన్నెల గాయ నప్పురిన్
    సున్నపు మేడ లభ్రపదచుంబిశిరోగృహరాజి రాజిలన్.

ప్రబంధరత్నాకరము 1.154క. పురనిధిరక్షకునై ఫణి
    పురము వెడలి [వెట్టి] వెట్టి పొంగారు ఫణా
    ధరపరివృఢు కరణి భయం
    కరమగుఁ బ్రాకారపరిథి కడు నచ్చెరువై.

ప్రబంధరత్నాకరము 1.141క. పెదవియుఁ బెదవియు నుదురును
    నుదురును [15]గేల్ గేలు పదమునుం బదము నొగిన్
    గదియించి సంధిఁ బెరుగు ప
    గిది నొదిగిరి సతులుఁ బతులు కేలిగృహములన్.

ప్రబంధరత్నాకరము 4.46సీ. మదభిన్నకటగళన్మౌక్తికంబులు తొట
           తొట రాల మస్తవిధూననముల
    నానమత్కుతలంబులగు పదక్రమముల
           ఘణఘణంకృతి నాభిఘంట లులియఁ
    గీర్తిచంద్రికల యాకృతి దట్టమై ధళ
           ధళఁ బర్వ దంతకుంతముల రుచులు
    పుష్కరపూత్కారములన కాలపు వాన
           కారు లెల్లెడఁ [16]దము తారఁ గురియఁ
తే. దమకుఁ బరవాహినులలోను దఱియఁజొచ్చి
    క్రీడ లాడుట యుచితంపు జాడ యనఁగఁ
    బెరిఁగి సరయూజలంబుల సరసలీలఁ
    గ్రాలఁ జనుచుండు నప్పురి గంధకరులు.

ప్రబంధరత్నాకరము 1.271తే. భానుశశిమండలంబుల లో నడంచి
    యిరులు పెనువానఁ గురియుచు నేపు చూపు
    రాత్రి వర్షర్తువునఁ బుట్టె బ్రతి గృహాక
    రములఁ బటుదీపవైడూర్యరత్నసమితి.

ప్రబంధరత్నాకరము 3.88సీ. ముదురుఁ జీకఁటి మన్నెమూఁకకుఁగైజీత
           మొసఁగు కుంతలముల యొప్పు వెలయఁ
    బండువెన్నెల రాజు బంటుగా నేలు చ
           క్కని మొగముల నిక్కు గని భజింపఁ
    బసిఁడి గట్రేనిఁ జేపట్టు కుంచము సేయు
           జిగి మించి చన్నుల బిగువు నిగుడ
    గబ్బి యేనికదొర గారాము గాఁగ మ
           న్నించు లేనడపుల నేర్పు మెఱయ
తే. నూరువులె గాదు రంభ మైయొఱపుఁ దమ వ
    శంబు గావింపఁ బదనఖచయమె కాదు
    విలసనముఁ దార పాటింప వీటఁ బద్మ
    పత్రనేత్రలు చాలఁ [17]జూపట్టియుండ్రు.

ప్రబంధరత్నాకరము 1.230చ. యుగములు వేయి వోవు నొక [18]యుద్ధరవుల్ గణుతించు[19]నంతకే
    యుగములు లక్ష చెల్లుఁ [20]బొదినున్న ధనంబు మితింప నమ్మహా
    యుగశతకోటు లేఁగు నితరోన్నతవస్తువు లెన్నఁ గీన వె
    ల్తిగ నలకాధినాథులు గదే పురిలో మను వైశ్యపుంగవుల్.

ప్రబంధరత్నాకరము 1.199ఉ. [21]రాసి సహస్రభానుఫణిరత్నము [22]నెల్లను పోవఁదన్నుచున్
    వాసరభోగిఁ గాలఫణివైరి గడున్ వడి నొక్కి [23]నక్కుగాఁ
    జేసినఁ గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజృంభణం బనం
    గా సముదగ్రతం బొలిచెఁ గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్.

ప్రబంధరత్నాకరము 3.78సీ. వలమానచంపకోత్పలమాలికాదిసం
           గ్రథనచాతురి నెఱ[24]కవులఁ బోలి
    దళము [25]గెలిచిన సూత్రమున నూల్కొల్పు నే
           ర్పున యోధవీరుల పొలుపుఁ దెలిపి
    ఖండితత్వమున రాగము గల పల్లవా
           వళిఁ [26]గోయుటల వేశ్య [27]వలపు నెఱపి
    పలుతావు లరసి యెత్తులు పచరించు పెం
           పున జూదరుల ఠేవ వొడమఁ జేసి
తే తమ నిజాంగమరీచులు తత్తదన్య
    పుష్పముల సావి నిక్కంపుఁ బువ్వు లమరు
    పేరఁ బేర్కొను పౌరులఁ [28]గేరి కేరి
    నవ్వుదురు పుష్పలావికానళినముఖులు.

ప్రబంధరత్నాకరము 1.212సీ. వినుతమాణిక్యవందనమాలికాకాండ
           కల్పితరోహితాకారరేఖ
    జాలకానననిర్యదాలోలవాసనా
           గరుధూపపోషితకంధరాళి
    చంద్రశాలాతిగర్జన్మృదంగధ్వాన
           విరచితపవిఘోషవిభవలహరి
    సంభోగసంరంభసమయవిచ్ఛిన్నము
           క్తాహారమణికృతకనకనికర
తే. మదనమదభారమంథరమత్తకాశి
    నీ దృగంచలసంచితనిబిడచంచ
    లాలతాతల్లజయు [29]నై యిలావివిక్త
    వర్ష యన నొప్పు కాకుత్స్థవంశనగరి.

ప్రబంధరత్నాకరము 1.129ఉ. వేదపురాణశాస్త్రములు వేడుక విద్యలు సర్వయజ్ఞసం
    పాదనశక్తినిత్య నిరపాయ విధిప్రతిపాలనంబు దా
    రాదిమతత్వముం గనుట హస్త[30]గతామలకంబుఁ గంట ధా
    త్రీదివిజావతంసుల కరిందమ [31]మన్పురిఁ గల్గు వారికిన్.

ప్రబంధరత్నాకరము 1.180చ. సరళదలత్సరోజఘనసారపరాగపరంపరా పరి
    స్ఫురితసువర్ణవర్ణమును బూరితదిఙ్ముఖహంసనాదమే
    దురమునునై యగడ్త కనుదోయికిఁ బండువు సేయ మ్రోయుఁ ద
    త్పురవరలక్ష్మి యెప్పుడును బూనెడు కాంచనకాంచియో యనన్.

ప్రబంధరత్నాకరము 1.144చ. సరసుల పొందు [32]లందొసఁగఁజాలి బహూన్నతచారుశాఖలన్
    బెరిఁగి మహాద్విజావనమె [33]పేర్చి నిజాయతిగాఁ [34]దనర్చి ని
    ర్భరజనతాపసంహరణపాత్రములయ్యు మహీజవాటికల్
    పురి వెలి నిల్చె [35]మేటియు నపూజ్యుఁడగున్ మధుపానుకూలతన్.

ప్రబంధరత్నాకరము 1.246సీ. సింధుపూరితముగాఁ జిప్ప నివాళింపు
           జేవెలుంగిడి చూచుఁ జేతి మదిర
    యించుక చవిగొను నించుఁ జేరువనున్న
           బోటికిఁ బొలముట్టి తేట లించు
    నొక యేలపదము మిన్నక పాడి తోడన
           నేమంటినే యేను నేరికైన
    సవరని మొగమెత్తు జాబిల్లినీక్షించుఁ
           గడు రహస్యములైన కడల నాడు
తే. మెచ్చుఁ దలయూఁచు నగుఁ దోన[వచ్చుఁ జెంత]
    నలరు లోఁబడు జాతులఁ గలియఁ దరుల
    నొఱగు [తొలఁ]గు నేర్పెఱుఁగు నలరు[లు దాల్చు]
    మగువ యొక్కతె మధుపాన[మత్త యగు]చు.

ప్రబంధరత్నాకరము 4.113

 1. కట్టి
 2. ప్రబంధరత్నాకరమునందు దీని కర్తృత్వము అజ్ఞాతము.
 3. వురు
 4. వొద్ది
 5. తోడిపగయే
 6. కొమలో/కొదవో
 7. గంటె
 8. జేత
 9. అగణ్యులు పుణ్యు లప్పురిన్
 10. నడు
 11. నిక్కదొణంగె
 12. నేర్పున
 13. హెచ్చె
 14. నల్కిన
 15. కెంగేలు
 16. దిమదిమగురియగ
 17. జూపట్టుచుంద్రు
 18. యూధరవుల్
 19. శాంతికే
 20. బొరి
 21. రాశి
 22. నెల్లటు
 23. చక్కుగా
 24. కౌల
 25. నే
 26. దో
 27. లఠివి
 28. గేలికే
 29. నయ్యి
 30. లతా
 31. మప్పురి
 32. గల్దనఁగ
 33. పేర్మి
 34. లడర్చి
 35. మేటియనఁబూజ్యడగున్