హంసలదీవి గోపాలశతకము

వికీసోర్స్ నుండి

హంసలదీవి గోపాలశతకము

కాసుల పురుషోత్తమకవి

విరచితము

వేమూరి చిరంజీవావధానులుచే

ప్రకటితము.

నేషనల్ ప్రెస్. బుట్టయ్యపేట.

మచిలీపట్టణము

1925

సీ.

శ్రీరుక్మిణీమనస్సారసేందిందిర
                   సత్యభామాముఖాబ్జాతమిత్ర
జాంబవతీపటుస్థనశైలజీమూత
                   ఘనసుదంతావయోవనమదేభ
లక్షణాపరిరంభలలితపంజరకీర
                   భద్రావళి తరంగ వన మరాళ
మిత్రవిందాధర మృదుపల్లవసిత
                   రవిజాద్రుగుర్పలరాజబింబ


తే.

షోడశసహస్రకామినీస్తోమకామ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

1


సీ.

లీలావినోద, కాళియఫణాంకితపాద
                   కలుషవిచ్ఛేద భక్తప్రసాద
హితవేణునాద, సంతతనుతాఖిలఖేద
                   బహుమోదగోపికాప్రణయనాద
పోషితప్రహ్లాద బుధమయూరాంబోధ
                   సవతహ్నిఖాద దానవవిభేద
శ్రితజనాశ్రిత శాశ్వతయశస్సంపాద
                   మునిజనాశీర్వాద ముక్తఖేద


తే.

కృపవహింపుము నామీద కీర్తి కాద?
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

2


సీ.

అభినవస్ఫుటసితాబ్జాయపత్రాక్ష
                   యాదవపాండవాభేదపక్ష
కౌస్తుభవనమాలికావిరాజితవక్ష
                   పరమదయార్ద్రభాసురకటాక్ష
వరచతుర్దశజగత్పరిపాలనాదక్ష
                   శరణాగతత్రాణ నిరతదీక్ష

దారుణదైతేయవారణహర్యక్ష
                   మౌనిసంతానసంతానవృక్ష


తే.

తలచె దనపేక్ష నాయడ వల దుపేక్ష
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

3


సీ.

నవనీతచోర వల్లవకామినీజార
                   నందకుమార దానవవిదూర
ఘనమేచకశరీర కౌస్థుభమణిహార
                   మానితాచార సన్మంత్రసార
ఛందోమయాకార బృందావనవిహార
                   కనకాద్రిధీర సాగరగభీర
దివిజోపకార సాత్వికగుణాలంకార
                   త్రిజగదాధార నిర్జితవికార


తే.

వినుతి జేకోర యాదవవీర రార
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

4


సీ.

చరణపద్మముల కాంచననూపురంబులు
                   గమనసంగతుల ఘల్ ఘల్లు రనగ
కటిసూత్రమణిమయాఘంటికానాదంబు
                   కరమొప్పగా ఘణంఘణ యనంగ
మేనిపై గప్పిన మించు మించినచాయఁ
                   నగు పచ్చడము తళత్తళ యనంగ
నొనర చూడాభాగమున కలంకారమౌ
                   నెమలిపింఛము నిగన్నిగ యనంగ


తే.

సుందరాకృతి రమ్ము గన్గొందు మిమ్ము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

5


సీ.

పుట్టినప్పుడె బట్టి కొట్టఁగాచిన మామ
                   గట్టిఁబాపినయట్టి దిట్టదొంగ
మెల్లమెల్లన గొల్లపల్లెలో పాల్వెన్న
                   కొల్లకొల్లగఁ గొన్న పిల్లదొంగ
జలములాడఁగఁ జూచి చానలవల్వలు
                   చెలఁగుచుఁ దెచ్చిన చిన్నదొంగ
వైరముచే వెంటనంటి బట్టఁగవచ్చు
                   యవను మాయించిన యట్టిదొంగ

తే.

దొరకితివి నాకు నిశ్శంక విడువనింక
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

6


సీ.

కుబ్జగంధ మొసంగి కొమరుఁబ్రాయంబున
                   శాతకుంభశలాక రీతి నుండె
మాలికుం డొక్కండు మాలికర్చన జేసి
                   మౌమలు గనఁగ నిర్మలతఁ గాంచె
రజకుఁడు శుభ్రవస్త్రములు గట్టఁగనిచ్చి
                   ఇహపరసౌఖ్యంబు లెనసి మించె
విదురుఁ డిష్టాన్నంపు విందులు గావించి
                   భాగవతోత్తమ ప్రతిభ గాంచె


తే.

కులము కారణమా నీకు గుణమె గాని
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

7


సీ.

మృతగురుపుత్రుని బ్రతికించుటే సాక్షి
                   బ్రాణార్థులై మిమ్ముఁ బలుకువారి
కల కుచేలున కెల్లకలుము లిచ్చుటె సాక్షి
                   సౌఖ్యార్థియై మిమ్ముఁ జదువువారి
కర్జునసారథ్య మమరఁజేయుటె సాక్షి
                   విజయార్థులై మిమ్ము వేడువారి
కోలి నుత్తరగర్భ మెలమిఁ బ్రోచుటె సాక్షి
                   పుత్రార్థులై మిమ్ముఁ బొగడువారి


తే.

కన్నికోర్కెలు గల్గు నిన్ సన్నుతింప
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

8


సీ.

నిను యశోదాదేవి పెనురోటఁ గట్టె నా
                   వనిత స్వతంత్ర మెంతని భజింతు
నిను నందుఁ డాలకుఱ్ఱల గాయనుంచె నా
                   ఘనుని సామర్థ్య మెంతని నుతింతు
నాభీరమతులు ని న్నాప్తత బెనఁగి రా
                   తనయుల భాగ్య మెంతని గణింతు
గోపకాంతలు నిన్ను కోపించితిట్టి రా
                   నవఁబోండ్ల రేఖ నెంతని వచింతు


తే.

వారి దాసానుదాసులే ధీరులైన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

9

సీ.

కురువరాకర్షితాంబరయైన ద్రౌపది
                   కాంతాభిమాన మేగతిని నిలిచె?
బలుసాకులు భుజించు పాండవు లడవిలో
                   నతిథుల కన్న మేగతి నొసంగె?
రర్జునార్థము కర్ణుఁ డమరఁదాచిన శక్తి
                   కదనరంగమున నేగతిని మఱచె?
ద్రౌణిబాణజ్వాలఁ దాకిన నుత్తరా
                   గర్భస్థపిండ మేగతిని బ్రతికె?


తే.

నీగతిని గాదె పాండవుల్ నిలిచి మనుట
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

10


సీ.

స్తనవిపదుగ్ధంబు ద్రావించు పాతకి
                   పూతన కమృతత్త్వమును ఘటించి
హింసింప కంసుండు ఇచ్చరప్పించిన
                   వారికి వైకుంఠవాస మొసగి
దుర్భాషలాడిన దుష్టాత్ము శిశుపాలు
                   నంశ మీయందె నైక్యంబు చేసి
పేర్మిని మీకథల్ వినని ఘంటాకర్ణు
                   నెలమి కైవల్యనిశ్చలునిఁ జేసి


తే.

రిపుల బ్రోచినదే వింత శ్రితుల కెంత
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

11


సీ.

భువనత్రయైకసంపూర్ణుఁడ వగు నీకు
                   నందకుటీరమా మందిరంబు
పాలమున్నీటిలో నోలలాడెడి నీకు
                   మహి యశోదాస్తన్యమా బలంబు
పదపద్మమున గంగ యుదయమందిన నీకు
                   జలకమా గోపికాకరజలంబు
అహిరాజభోగపర్యంకంబు గల నీకు
                   తల్పమా రాధికాతరుణి యంక

తే.

మహహ వారలభాగ్య మెం తనగవచ్చు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

12


సీ.

బృందావనస్థలియందు గోబృందంబు
                   నందంద గాయుచు డెందమందు
గందళించిన మహానందంబుతో వేణు
                   వందిరాగామృత బిందుసమితిఁ
జిందగానము సేయఁ బొందుగ విని గోప
                   సుందరులందఱ మందగతిని
బందుగుల్, మగలు, మరందులు వలదనఁ
                   కందర్పకేళి నీయంద జెంది


తే.

మందిరంబుల కేగి నానందమునను
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

13


సీ.

గతి నీవె సుమ్ము నీ వతివేఁగ రమ్ము నా
                   మతిఁ బాదుకొమ్ము కామితము లిమ్ము
కృపశాలి వెన్న నే నపచారి నన్న నిం
                   తపరాకు నీకున్న నెపము రన్న
దీనులమాట ఎందైన నీచెవి నాట
                   పూను మచ్చోట పెంపూనుతేట
పరుల నే గోర సంసరణ పారావార
                   తరణంబు నేర దేవరదె భార


తే.

మనుచునున్నాఁడ రక్షించు మార్తి బ్రోడ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

14


సీ.

గోపకన్యలు నిన్నుఁ గోరి పూజ లొనర్పఁ
                   గోరి జేరినవారిఁ గూడినావు
వీరప్రతిజ్ఞార్థ మారూఢిగా గెల్పుఁ
                   గొని యష్టభార్యలఁ గూడినావు
నరకుని చెరఁవాప తరుణుల పదియారు
                   వేలు నిన్మోహింప నేలినావు
బహురాజశుద్ధాంతభామినుల్ గోరిన
                   హృదయ సంగమంబు నెనసినావు


తే.

గాని నిష్కాముకుండ వీవుగా రమేశ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

15

సీ.

పొత్తులఁ బసిపిల్లఁ బోషించు తల్లిని
                   బోలి సేవకకోటి బ్రోతు వెలమి
పక్షి ముక్కున దెచ్చి ఫలముఁ బిల్లల కిచ్చు
                   గతి నిచ్చెదవు భక్తకామితములు
వత్స వెన్వెంట బోవఁగ నేగు ధేనువు
                   గతి చరింతువు సదాశ్రితులవెంట
రాజకుమారాపరాధంబు కైవడి
                   భట్టులదోషముల్ బాపుచుందు


తే.

రేరి నీవంటి పోషకు లెంచిచూడ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

16


సీ.

ఆననాబ్జమున బ్రహ్మాండంబు జూపిన
                   దైవంబని తల్లి దలఁచుకొనెనె
కొండట్లు కొనగోరఁ గొడుగుగాఁ బట్టిన
                   నాభీరులెల్ల నిన్నాఢ్యుడనిరె
విశ్వరూపము జగద్విఖ్యాతిఁ జూపిన
                   కౌరవుల్ నిన్నీశుఁగా నెఱింగిరె
క్రూరత ధరణిపై వారించి బ్రోచిన
                   జనులు పరబ్రహ్మ మనుచు ననిరె


తే.

తెలిసినట్లున్న నీమాయ తెలియ దహహ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

17


సీ.

జారత్వమున బహుస్త్రీరతాసక్తిచే
                   మెలఁగెడు నిన్ను నస్ఖలితుఁ డండ్రు
చోరత్వమున ప్రజాగారాళినవనీత
                   హరుని నిన్ దానిర్వికారుఁ డండ్రు
గోపత్వమున నందగోపాలనము సేయు
                   మందుని నిన్ను శ్రీమంతుఁ డండ్రు
నద్రుత్వమున భోజనాధానువర్తన
                   గల నిన్ను సర్వాధికారుఁ డండ్రు


తే.

స్వామివని నిన్ను నిందింపజాలరింక
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

18

సీ.

అత్యంతమాన్యుఁడ వయ్యు నాదేవకి
                   గర్భాంకురంబవై గలిగితీవు
విశ్వరూపుఁడ వయ్యు వివిధలీలామయ
                   బాలకృష్ణాకృతి బ్రబలితీవు
నిర్గుణాత్ముఁడ వయ్యు నిఖిలచిత్తానంత
                   కళ్యాణగుణముల గాంచితీవు
సమదర్శనుండవయ్యు శత్రువినాశంబు
                   శిష్ట ప్రకాశతం జేసితీవు


తే.

నీకథల్ ముజ్జగంబుల నిల్పితీవు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

19


సీ.

కరిరాజు వక్రవక్త్రతచే మహార్తుం డై
                   పిలిచినమాత్రనే పలుకలేదొ?
జనకాజ్ఞమీరి రాక్షసబాలుండంతటం
                   గలవన్నచోటనే కలుగలేదొ?
పినతల్లి కోపింప వనితేగిధృవుం డాత్మ
                   దలంచిన మ్రోలనే నిలువలేదొ?
మునికోపవహ్నిముట్టిన నంబరీషుండు
                   బ్రోవవేయన్నచో బ్రోవలేదొ?


తే.

ఇంక కరుణాబ్ధివయ్యు మమ్మేలరాదో
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

20


సీ.

నిర్మించితి వనూననిశ్చలభోగార్హ
                   భువనజాలముల నద్భుతముగాగ!
నిలిపితివాత్మలో నిరాతాబ్జగర్భశం
                   కరముఖాధిపుల లోకంబులందు!
కల్పించిత వనేకకలితనానావిధ
                   జీవుల చిత్రాపచిత్రములుగ!
పోషించితి వనేకభూతకోటులనంత
                   రాత్మసైకరుణాకటాక్షములను!


తే.

నీవినోదాతిశయము వర్ణింపఁదరమె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

21

సీ.

గిరులచే సర్వదిక్కరులచేఁ గాకున్న
                   నీవు ధరించిన నిలిచె ధాత్రి
సురలచే యామినీచరులచేఁ గాకున్న
                   నీవు బూనిన సుధానిధి లభించె
హరునిచే భారతీవరునిచేఁ గాకున్న
                   నీవల్ల రాక్షసాభావమయ్యె
నరునిచే నుర్వి నెవ్వరిచేతఁ గాకున్న
                   నీవల్ల మనె ధరాదేవసుతుఁడు


తే.

నీ కసాధ్యంబు గలదె వర్ణించిచూడ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

22


సీ.

పలికినప్పుడె సర్వపాపముల్ బాయు నీ
                   నామంబు బలుకని నాలుకేల
వినినయప్పుడె మనోవిజయమౌ మీకథల్
                   విననేరకుండిన వీనులేల
జూచినప్పుడె మహాశోభనంబగుమిమ్ము
                   జూడఁగోరని యట్టి చూపులేల
సేయునప్పుడె కార్యసిద్ధియౌ మీపదా
                   ర్చన సేయలేని హస్తంబు లేల


తే.

జ్ఞానవిషయంబు లీరీతి మాననగునె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

23


సీ.

క్రతుతపోదానసువ్రతసమాచారులై
                   ప్రీతి తత్ఫలము లర్చించువారి
మృత్తికాదారునిర్మితరూపు గాంచి
                   స్థిరభక్తి మిమ్ము నర్చించువారి
సుత దాస ధేను సంతతుల నీనామాంకి
                   తుల జేసి పేరుగా బిలచువారి
శుకశారికలకు సారెకు నుక్కెరల బెట్టి
                   నీనామముల బల్క నేర్పువారి


తే.

చేరి రక్షించుదువు వారివారి కొలదిఁ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

24

సీ.

ఏభువనంబునన్ దేభయాతురుండు నీ
                   చింత సేయునొ పరాకింత తగునె
ఏదిక్కునందు నీవే దిక్కనుచు నెవ్వఁ
                   డాత్మనిల్పునొ యలక్ష్యంబు దగునె
ఏదేశమం దెవ్వఁ డెట్టి కార్యాసక్తిఁ
                   జింత సేయునొ పరాకింత తగునె
ఏయూర నాబోటి హీనమనస్కుండు
                   శరణుజొచ్చునొ యుపేక్షకును దగునె


తే.

దీనబాంధవు డంచునుఁ దెలుపవలదె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

25


సీ.

ఏతండ్రి నిర్మించె భూతకపంచకగుణో
                   పేతావయవ సర్వచేతనంబు
లేదాత రక్షించు నెలమిమాత్రుదరస్థ
                   కలితశాబకుల వత్సలత మెరయ
నేసద్గురుఁడు దెల్పె హితవుగా సుజ్ఞాన
                   మెలమి గర్భస్థజీవులకు నెల్ల
నేస్వామి వెడలించె హేయదుర్భరగర్భ
                   నరకమగ్నుల బ్రాణవరదు డగుచు


తే.

నట్టిని న్నాశ్రయించెద ననవరతము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

26


సీ.

శ్రీరమాసంభోగ శృంగారతల్పాహి
                   రాజన్యునకు వాయుభోజనంబు
యుద్ధాదికార్యసన్నద్దవాహనపతం
                   గాధీశునకు భుజంగాశనంబు
సంతతధ్యాననిశ్చలయోగయోగిరా
                   ట్ప్రతతికి ఫలపర్ణపారణంబు
జగదీశునకు సర్వసంపాదిత
                   రక్షితాద్యాది సర్వావనంబు


తే.

ఘనము స్వామి సిరి గల్గి లౌభ్య మేమి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

27

సీ.

ఎన్నటికో నిశ్చలేంద్రియవ్యాపార
                   ధారణామతి నిన్ను దలఁచుభాగ్య
మెన్నటికో యవిచ్ఛిన్నదుస్తరఘోర
                   కర్మసంసారసాగరవితీర్ణ
మెన్నటికో యుష్మదీయాదిమధ్యాంత
                   నిర్ణిరోధజ్ఞాన నియతబుద్ధి
ఎన్నటికో యోగిహృస్థలినాట్యకృ
                   ర్భవదీయ పాదాబ్జభక్తి శక్తి


తే.

ఎన్నటికో మాకు నీ సుప్రసన్ననియతి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

28


సీ.

శయనించునో స్వప్నసంగతినైన మీ
                   శృంగారమూర్తి దర్శింపఁదలఁతు
దర్శించి సాష్టాంగదండప్రణామముల్
                   బెట్టి పదాబ్జముల్ బట్టఁతలంతు
పట్టి వీడక భక్తిపారవశ్యంబున
                   నిశ్చలమతిని ధ్యానింపఁదలంతు
ధ్యానించి భవవార్థితరణంబు గావింపు
                   మనుచు నిట్లు వరంబు గొనఁగఁదలఁతు


తే.

నెంత దలఁచిన సాక్షాత్కరింప వేమి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

29


సీ.

పారుజాతమరందపానబంభరరాజ
                   మాకొన్న వేముపువ్వానఁజనునె
కాంచనాబ్జమృణాలకముల మెక్కుమరాళ
                   మలసిన తుంటి తూడులకుఁ జనునె
యమృతాన్నచంద్రిక లనుభవించుచకోర
                   మేమరియైన నుమ్మెత్త దినునె
సహకారకిసలయస్వాదుగన్నపికంబు
                   కోరునే కలనైన కుటజములను


తే.

నిన్నుఁ గొలచిననరుం డేటి కెన్ను నొరుల
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

30

సీ.

శ్రీహరి స్మరణోక్తి సింహనాదము విన్న
                   బారవే యాపద్విపంబులుర్వి
అచ్యుతపాదపద్మార్చితాశనిధార
                   బడకుండునే వైరిపర్వతములు
నారాయణధ్యానమారుతాహతి జేసి
                   పాయవే పాపౌఘతోయదములు
ఖగరాజగమనకైంకర్యాదిరుచులచే
                   సమయవే యజ్ఞానతిమిరజాల


తే.

మనుచు నీ భక్తి బాయక యనఘు లండ్రు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

31


సీ.

వక్షస్థలము దివ్యవయిజయంతీకౌస్తు
                   భాంతరశ్రీదేవి యందగింప
కరచతుష్టయము విస్ఫురిత శంఖదాంగ
                   ఖడ్గకార్ముకముల గారవింప
శ్రోణీతలము స్వర్ణసూత్రసమంచిత
                   హేమదుకూలంబు నానుతింప
మూర్ధంబు రత్నజాంబూవదద్యుతినిష్క
                   శంకకోటీర మలంకరింప


తే.

దీపితంబగు నీమూర్తిఁ జూపుమయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

32


సీ.

వరదివాకరనిశాకరులు నీనేత్రంబు
                   లాననకాంతి సమాన మేది
పరమేష్టి నీనాభిబద్మనివాసుండు
                   జఠరసంపద కెన్న సామ్య మేది
కమలజాండములు నీకరకందుకంబులు
                   దోర్బలంబున తులదూగ నేది
నిఖిలతరంగిణుల్ నీసపాదకములు
                   శ్రీపారమహిమానురూప మేది


తే.

కవులు కవితల వర్ణింపఁగలరె నిన్ను
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

33

సీ.

పాయసం బాజ్యధారాయుతంబుగ జేసి
                   యోడక జుఱ్ఱినట్లుండు మదికి
విడిపంచదార మీగడతోటి పదమంచి
                   యుడుగక మెసగినట్లుండు మదికి
అరటిపండులు తేనెలందు దోగఁగముంచి
                   యొనర భక్షించి నట్లుండు మదికి
పచ్చికొబ్బరిబెల్ల మెచ్చుగా దంచి నో
                   రూరంగా మెక్కినట్లుండు మదికి


తే.

నీకథావర్ణనము మాకు నిఖిలరుచులు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

34


సీ.

కఠినాత్ము బండిఱక్కసు చకాచకలుగాఁ
                   బడదన్నుచో నొప్చిపట్టెనేమొ
తటభూజ మెక్కి చిత్రముగఁ గాళిందిలో
                   నవలీల దుముకుచో నవసెనేమొ
కాళీయఫణిణాగ్రములపై నర్తించు
                   నత్తరి పడగరా లొత్తెనేమొ
ఫల్గును నరదంబుపైనుండి భీష్ముపై
                   నలుక లఘించిన నలిగెనేమొ


తే.

చరణపద్మంబు లొత్తెద సామి రమ్ము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

35


సీ.

శయ్యాహిబహుముఖోఛ్వాసనిశ్వాససాం
                   ద్రనినాదములచేత వినగరాదొ
క్షీరపారావారసారతరోర్మికా
                   ఘననినాదములచే వినగరాదొ
సాదివ్యసాలోక్యసారూప్యసేవక
                   స్తుతిరవంబులఁ జెవి సోఁకలేదొ
సకలబృందారకజయజయవాక్యగం
                   భీరనాదమున విన్పించరాదొ


తే.

ఎంత మొరబెట్టినను బల్క వేమి తండ్రి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

36

సీ.

కన్నుల గాంతుగా కాంతుగా గోపాల
                   కాంతలు దలచు సాకారు నిన్ను
వీనులవిందుగా విందుగా మాధురీ
                   సుస్వరవేణుగీతస్వరంబు
కోరికఁ బారగా బారగాఁ గరములఁ
                   గొనియెత్తుకొందుగా కోర్కు లలర
మునుకొనియాడగాఁ గొనియాడుచుందుగా
                   దేవదేవుఁడవని తెలిసి మదిని


తే.

 నాఁడె వ్రేపల్లె జన్మింప కీడ నుంటి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

37


సీ.

ఈడుబాలుర గూడి పాడుచు చేసంతు
                   లాడుచుండఁగ నిన్నుఁ జూడఁగల్గు
వాడచేడియలచేవాడికాడని తల్లి
                   తోడనాఁడగ నిన్ను జూడఁగల్గు
దూడలఁ గాయుచో నోడక రాకాసిఁ
                   గ్రీడలఁ బడఁగూల్పఁ జూడఁగలుగు
పోకల కన్నెలు పొడఁజూడ వేఁడగా
                   జాడలం దిరుగఁగా జూడగలుగు


తే.

 తొల్లి జన్మింపనైతి వ్రేపల్లెలోన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

38


సీ.

జలకమార్చుదు నదీజనకపాదాంభోజ
                   రవికోటితేజోవిరాజ యనుచు
జోలపాడుదు నందబాల జగత్పాల
                   స్వర్ణచేల కృపాలవాల యనుచు
మేలుకొల్పుదు రమాలోల సద్గుణజాల
                   నీలకుంతల లసత్ఫాల యనుచు
ముచ్చటాడుదు సర్వమూలకంద ముకుందఁ
                   వినుత ననంద గోవింద యనుచు


తే.

తొల్లి జన్మించనైతి వ్రేపల్లెలోన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

39

సీ.

భువనమోహనుని కాముని గన్నతండ్రి నీ
                   చెలువ మింతింతని చెప్పవశమె
పతితపావని గంగ సుతయై చెలంగునీ
                   పుణ్య మింతింతని పొగడవశమె
కలుము లొసంగు శ్రీకలవాణి నీరాణి
                   భాగ్య మింతింతని పలుకవశమె
దివ్యతేజోబలాధికులు నీభృత్యులు
                   అధికార మింతింత యనఁగవశమె


తే.

నీసమానుఁడ వన్నింట నీవెకాని
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

40


సీ.

హరిహరబ్రహ్మాది పరదైవతాంతరా
                   నేకరూపంబుల నిన్ను దెలిపి
వస్తుభేదాభేదవాదిశబ్దార్థోక్తి
                   నిగమాగమంబుల నిన్ను దెలిపి
పుణ్యతీర్ధక్షేత్రముల ధరాస్థలియందు
                   నిర్నిద్రమహిమల నిన్ను దెలిపి
దానదయానత్య మానవగోవిప్ర
                   నిజవర్తనంబుల నిన్ను దెలిపి


తే.

చేతనుల నిట్లు తరియింపఁ జేసి తీవు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

41


సీ.

నిరపరాధులకు నీశరణత్వ మెందుకు
                   నిష్ణాత్ములకు నీదునియతి యేమి
భాగ్యవంతులకు నీపరిపాలనం బేల
                   ధర్మజ్ఞులకు నీదుతత్వ మరుదె
ఘనబుద్ధులకు నీదుకార్య మేమున్నది
                   సత్యవాదులకు నీసాక్షి ఘనమె
తత్వవేత్తలకు నీదాక్షిణ్యమున నేమి
                   నిస్సంగులకు నీమనీష యేల


తే.

కిల్బిషాత్ముని నను బ్రోవ కీ ర్తినీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

42

సీ.

తనకు కళేబరంబునకు భేదజ్ఞాన
                   మతిలేనివాని నిర్మలత యెంత?
తనువు వర్ణించినంతట జీవుఁ డేమౌనొ
                   తెలియనివాని తాత్విక మదెంత?
కన్నతండ్రిని జగత్కర్తను నిన్నాత్మ
                   బోధఁ జేయనివానిబుద్ది యెంత?
భవజరామరణాదిభయనివారణమైన
                   పదముఁ జేరనివాని భాగ్య మెంత?


తే.

యేమి నేరని నను బ్రోచు టిదియె వింత
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

43


సీ.

రాసవిలాసగోపీసహస్రదృఢోప
                   గూహనంబులు గావు కూడి వీడ
జననీనిబద్ధనిస్థరిశితోలూఖల
                   తజ్జువుల్ గావు శీఘ్రత సడల్ప
బృందావనస్థలపృధులగుల్మలతాంత
                   షండముల్ గావు నిశ్శంక విడువ
గర్వితరాక్షసోత్కరకల్పితానేక
                   మాయలు గావు మర్మమున బాయ


తే.

మాటతో గట్టి నిల్పుదు మానసమున
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

44


సీ.

తల్లిదండ్రుల చెర దప్పింప గంసుని
                   హతుని గావించు టార్తావనంబొ?
బాణుబాహాగర్వభంగం బొనర్చి నీ
                   పౌత్రు దెచ్చుట జగద్భద్రకరమొ?
ధార్తరాష్ట్రులఁ జంపి ధాత్రీతలము మేన
                   బావ కిచ్చుట దీనబాంధవంబొ?
అన్నగారివిరోధులగు దానవుల నాజి
                   బొరియించు టది సర్వసోషణంబొ?


తే.

రుకణ నీవారి బ్రోచుటే బిరుదు నీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

45

సీ.

పరకాంత లనక గోపస్త్రీలనందఱిఁ
                   జేరి క్రీడించిన చిన్నతనము
వావి గాదనక రాధావధూటీమణిఁ
                   బాయక కూడిన పడుచుఁదనము
నగుబాటు లనక నింపగురాణి యలిగినఁ
                   ద్రోయక మ్రొక్కిన దుడుకుఁదనము
లాఘవం బనక మెలఁగ జరాసంధుని
                   భీతిచేఁ బారిన పిరికితనము


తే.

గుట్టు విడ రట్టొనర్తు చేపట్టనేని
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

46


సీ.

విరథుఁడై యున్నభాస్కరపుత్ర నాజిలో
                   నరునిచేఁ జంపింప న్యాయమగునె?
ధర్మజుచే నసత్యఁపుఁబల్కుఁ బల్కించి
                   గురుని ద్రుంపించుట గొప్పదనమె?
గంగాకుమారు శిఖండి యుద్ధంబునఁ
                   బడఁగూల్పఁజూచుట పౌరుషంబె?
మారుతిచే యధర్మముగా సుయోధను
                   తొడలు దున్మించుట దొడ్డతనమె?


తే.

ఇట్టి పుణ్యుండ వన్ననీగుట్టు గన్న
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

47


సీ.

అత్యున్నతాకారి వయ్యు బలీంద్రుని
                   యాచించుచో గుజ్జ వైతి వీవు
అనఘ సద్గుణశాలి వయ్యు సత్రాజిత్తు
                   వజ్ర మిమ్మని నిందఁ బడితి వీవు
అఖిలపూజార్హుఁడ వయ్యు విప్రుల నన్న
                   మడిగి యగౌరవం బంది తీవు
అసహాయశూరుఁడ వయ్యు దైవత వీటి
                   పారుజాతము గొంచు పాఱి తీవు


తే.

ఘనుల కైనను యాచ్న లాఘవమె సుమ్ము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

48

సీ.

ప్రాగ్భహిఘంబులు బరిహరింపఁగజాల
                   విహదోషములు హరియింపఁగలవె
భ్రమణమనోజకాలములు మాన్పఁగఁజాల
                   వాపద లిం కీవు బాపఁగలవె
అన్నవస్త్రముల సంపన్ను జేయగ లేవు
                   ఇష్టపదార్థంబు లీఁయగలవె
కలనైన నిపుడె సాక్షాత్కరింపఁగజాల
                   వెంచ సన్నిధికి రావించగలవె


తే.

ఇపుడు నమ్మిక దోప న న్నేలుకొనడె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

49


సీ.

కామధేనువు మహాగౌరవం బెంతురు
                   లేమి జెందినవారి కేమి బిదికె?
కల్పజవితరణఖ్యాతిఁ గీర్తింతురు
                   దారిద్ర్యునకు నేమి తాను బితికె?
చింతామణివితీర్ణపంతంబుఁ దలఁతురు
                   పేదలయిండ్ల నింపెనె ధనంబు?
నవనిధానముల వర్ణనఁ జేతు రుర్విలో
                   రికుతుల కేమి కోరిక లొసంగె?


తే.

దాత లెవ్వరు త్రిభువనత్రాత వీవె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

50


సీ.

వహ్నిచే రథ రథాశ్వముల నిప్పింపవే
                   హితునిచే ఖాండవం బేర్పజేసి
ధ్వజముపై హనుమంతు వసియింపఁజేయవే
                   బాణసేతువు కూర్మి సైభరించి
బలదేవుఁ డీకున్నఁ జెలియలి గూర్పవే
                   కపటయతీంద్రునిగా నొనర్చి
యనికిఁ దోడౌచు నీ వరుదేరవే మున్నుఁ
                   బలువయౌ రారాజు చెలిమి రోసి


తే.

నరునిభక్తి భవన్మైత్రి దరమె పొగడ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

51

సీ.

దితిపుత్రకరగతమృతపాత్ర హరియించి
                   దయివతకోటికిఁ ద్రావ నీవె
ధృతరాష్ట్రసుతవశీకృతరాష్ట్రదశ బాపి
                   యవనిరాజ్యంబు పాండవుల కీవె
బలి విక్రమించి స్వర్గస్థలి యాక్రమించిన
                   వాని ద్రొక్కి దివంబు వజ్రి కీవె
శృతిచోరుఁడై పాఱి వితాబ్ధిఁ జొరఁ జీరి
                   పావనామ్నాయంబు బ్రహ్మ కీవె


తే.

క్షితిని నీవారి నొరులు వంచింపగలఁరె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

52


సీ.

శ్రీరంగమున విప్రనారాయణున కేల
                   నాతికై కుంటెన నడపినావు
పతితురా లొకతె నీపావనత్వ మెఱుంగ
                   నీలాద్రి రాఁ గరుణించినావు
కాకుళనగరివైఖానసోక్తినిజంబు
                   జూప శిరోజముల్ జూపినావు
గూనిగోవిందు సాక్షులఁ బెట్టుటకుఁ గాశి
                   వెడలిన పొన్నూర వెలసినావు


తే.

పామరుని నన్ను నిచటఁ జేపట్టినావు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

53


సీ.

శబ్దలక్షణవిచక్షణతజాలకు నీకు
                   కృతిఁ గూర్చు టపరాధకృతము గాదె
కరణత్రయము నన్యగతుల వర్తిలఁజేసి
                   వినుతు లొనర్ప తప్పిదము గాదె
ఏనొనర్పెడు పాప మే భరింపఁగఁజాల
                   కెపుడు ని న్దూరుట యెగ్గు గాదె
అస్థిరదేహసుఖార్ధసంపన్మనో
                   రథత బేర్కొందు నేరమియ గాదె


తే.

తప్పు లొప్పులు గాగనుఁ దలఁపవలయు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

54

సీ.

ఆశాపిశాచంబు నదలింపనేర్తునే
                   తగినమీరక్షకత్వంబు లేక
కామాదివైరుల గదుపంగనేర్తునే
                   నిలనీయ నుగ్రహబలిమి లేక
సంసారదుఃఖంబు సడలింపనేర్తునే
                   తథ్యంబు నీప్రసాదంబు లేక
యజ్ఞానపంకంబు నడగింపనేర్తునే
                   పొసగిన మీదయారసము లేక


తే.

యన్నిటికి మీరె ప్రాపకు లయ్య మాకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

55


సీ.

ఒకమారు మీనామ ముచ్చరించినఁ జాలు
                   ఖలుఁ డజామీళుసంగతిని విన్న
శరణాగతుండైనఁ జాలు హంతవ్యుని
                   కాకాసురుని గాచు గాథ విన్న
విశ్వసించినఁ జాలు వెలయ విభీషణు
                   రాజ్యాభిషేకధర్మంబు విన్న
నిముషమాత్రమే జాలు నిను బ్రసన్నునిఁ జేయ
                   ఖట్వాంగుమోక్షణజధను విన్న


తే.

మనసు దృఢమైన నీకృపఁ గనుట యెంత
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

56


సీ.

భర్మగోపురమంటపాస్థానములు గలుగు
                   వేంకటేశ్వరుఁ డిలవేల్పు మాకు
నిజనాభియందు మాణిక్యంబు గల్గిన
                   వరదరా జిష్టదేవతయె మాకు
సప్తసాలావృతసద్విమానారూఢ
                   రంగేశుఁ డఖిలభారకుఁడు మాకు
శ్రీకరభధ్రాద్రిశిఖరనిత్యావాస
                   రామచంద్రుం డేలురాజు మాకు


తే.

కలవు మహదాశ్రయము లట్ల తలతు నిన్ను
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

57

సీ.

ఆర్తరక్షాపరాయణ పౌరుషము నీకు
                   రూఢి గాదిక మమ్ము బ్రోవవేని
శరణాగతత్రాణ వరబిరుదాంక మిం
                   కె ట్లుబూదెదవు మ మ్మేలవేని
పతితపావన మహాభద్రాభిధానంబు
                   గర్హితంబగు తిమ్ము గావనేని
శ్రితపరిపాలనాధృతనిరంతరదీక్ష
                   మానంగదగు మమ్ము మనుపవేని


తే.

చిరయశం బెంచుకొమ్ము రక్షించు మమ్ము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

58


సీ.

నవకాదిమౌనిహృత్సరసిజేందిందిర
                   ఇందిరానయనోత్పలేందుబుంజ
బింబఫలద్యుతివిమలరదాంశుక
                   శుకయోగిపఠితమంజుప్రబంధ
బంధకిల్బిషమేఘపటలప్రభంజన
                   జనలోకసేవితసదవతార
తారకాచంద్రికాధవళయశస్సార
                   సారసపత్రవిశాలనయన


తే.

నయనరాధిపకులపోషభప్రభావ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

59


సీ.

వందనం బాశ్రితబృందారకానంద
                   కారికి నాపదోద్ధారి కెపుడు
సాష్టాంగ మధికనిష్ఠాష్టాంగయోగాను
                   సారికి భువనానుసారి కెపుడు
దండ ముద్దంబారిమండలఖండన
                   క్రోధికి నిత్యప్రబోధి కెపుడు
జోహారు తారకానీహారకరసార
                   కీర్తిశాలికి విష్ణుమూర్తి కెపుడు


తే.

ననుచు నీభక్తి బాయక యనఘు లండ్రు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

60

సీ.

మునియైన సుందరీముఖపద్మ మీక్షించు
                   వేళ నీనాభి భావించఁగలఁడె
తత్వజ్ఞుడైన కాంతాకచాభ్రము జూసు
                   తఱి నీవపుష్కాంతి దఁలపఁగలఁడె
యార్యుండైనఁ బరాంగనాధరమ్మును గాంచు
                   నెడ నీదుకౌస్తుభం బెంచగలఁడె
మతిమంతుఁడైన స్త్రీచతురవాక్యప్రౌఢి
                   వినుచో భవత్కథల్ వినగఁగలఁడె


తే.

మారు యుష్మత్కుమారు నేధీరుఁ డోర్పు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

61


సీ.

పరభీషణాయుధపంక్తిలోఁ జొచ్చిన
                   నీయనుగ్రహ మున్న నిర్భయంబు
దావపావకశిఖారితరముల దూరిన
                   నీయనుగ్రహ మున్న నిర్భయంబు
మత్తేభశార్ధూలమధ్యమం దుండిన
                   నీయనుగ్రహ మున్న నిర్భయంబు
భూరినక్రాభీలనీరధిఁ జేరిన
                   నీయనుగ్రహ మున్న నిర్భయంబు


తే.

భయనివారణ మయ్య నీప్రాపకంబు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

62


సీ.

చిత్రగుప్తులు లిఖించినయట్టి కలుషంబుఁ
                   దుడుపుఁ బెట్టుట కీవె దొర వటంచు
ధర్మరాజు విధించు కర్మానుభవములఁ
                   బరిహరింపఁగ నీవె ప్రభుఁడ వనుచు
యమభటుల్ కినుకన హంకరించినవారి
                   గదిమివేయఁగ నీవె కర్త వనుచు
ప్రకృతివీకారముల్ బాపి చిత్తము భవ
                   త్పరము జేయఁగ నీవె గురుఁడ వనుచు


తే.

నాశ్రయించితి న న్నిపు డాదుకొనవె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

63

సీ.

తనువు నమ్మెద బుద్బుదప్రాయముగఁ బుట్టి
                   లొల్లి గిట్టినవారితోవ లెరిగి
కలిమి నమ్మెద చలచ్చలసంపదల నిక్కి
                   పిదపఁ జిక్కినవారిబెఁడద యేఱిగి
ప్రాయ మెన్నెద మదాక్రాంతవైఖరి లొంగి
                   ముదిసి యీల్గెడివారివిధ మెఱింగి
పరుల నమ్మెద దేహబంధుత్వముల నంటి
                   తుదివృథ జనువారిదూ రెఱింగి


తే.

తెలివి లేదాయెఁ గప్పె నీదివ్యమాయ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

64


సీ.

వసుదేవదేవకీవరగర్భరత్నాక
                   రామృతమూర్తి భక్తానువర్తి
నారదవ్యాసశౌనగపరాశరదివ్య
                   తాపసధ్యేయ సద్మాసహాయ
జగదేకనిర్మాణసంత్రాణసంహార
                   త్రిగుణప్రధాన పన్నగశయన
ఘనవరరత్నకాంచనదివ్యభూషణ
                   శృంగారదేహ విహంగవాహ


తే.

భువనమోహనవేష సంపూర్ణతోష
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

65


సీ.

సర్వలక్షణములఁ జక్కనినిరుమేను
                   హృద్పుటంబున లిఖియింపుమయ్య
బ్రభుజనానుగ్రహపాత్రుని గావించి
                   యెంచి లోకముల మెప్పించుమయ్య
తాపత్రయంబునఁ దపియింపకుండ నీ
                   వే నను నరసి రక్షింపుమయ్య
నేర్చినేర్వనిపను ల్పేర్చి నేరము గూర్ప
                   కోర్చి సద్గతి నన్నుఁ జేర్చుమయ్య


తే.

ఏమి సేయుదువో మీద టెఱుఁగనయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

66

సీ.

శ్రీకరంబులు భద్రసింహాంకితంబులు
                   పావనంబులు జగత్పావనములు
దేవతార్చితములు దృక్శోభనంబులు
                   బలిశిరోమణు లార్తబంధనములు
పద్మానుసరములు పద్మసన్నిభములు
                   శ్రుతిసిద్ధములు నీతిసుందరములు
మునినిధానంబులు మూలమంత్రంబులు
                   తారకంబులు ముక్తిదాయకములు


తే.

మీపదాంబుజములె మాకు ప్రాపకములు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

67


సీ.

సూక్ష్మంబుకన్నను సూక్ష్మమై చెల్వొంది
                   యధికంబుకంటె ణత్యధికుఁ డనఁగ
గుణలోకమునను నిర్గుణుఁ డనఁ బెంపొంది
                   సద్గుణంబుల మహాశరధి యనఁగ
సద్ర్బహ్మచర్యనస్థలితమూర్తి యనంగ
                   గార్హసస్థ్యమున మహాఘనుఁ డనంగ
అజ్ఞానహృత్పంకజాంధకారంబవై
                   ప్రాజ్ఞసద్హృదయదీపంబ వనఁగఁ


తే.

దేజరిల్లెడు నిన్ను నుతింపఁదరమె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

68


సీ.

పతి వయోరూపసంపత్కళాన్వితుఁ డైన
                   సతిమనంబునకు వాంఛిత మికెద్ది?
జనకుండు శాశ్వతసామ్రాజ్యుఁడై యున్న
                   సుతుఁడు చెందఁగరాని సుఖ మికెద్ది?
గురుఁడు బ్రహ్మానందపరుఁడు బోధకుఁ డైనఁ
                   దగ శిష్యుఁ డెఱుఁగని తత్వ మెద్ది?
ప్రభుఁడు దయామయనిభవోన్నతుఁ డైవ
                   భడుఁడు గోరిక సేయు ఫల మికెద్ది?


తే.

ప్రాపకుఁడ వీవు మా కికలోప మెద్ది
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

69

సీ.

అఖిలధర్మస్థాపనాచార్యుఁడౌ యుధి
                   ష్టిరుఁడు వైవస్వతపురము గాంచె
గోకోటిదానముల్ ప్రాకటంబుగఁ జేసి
                   యూసరవెల్లియై పుట్టె నృగుఁడు
క్రతుశతావబృథంబు గన్న యానహుషుండు
                   పెనుచిల్వయై బిలంబున జనించె
ఘనతపోనియతిచే ననఘుఁడైన యయాతి
                   సద్గతిఁ బాసి భూస్థలికి నొరిగె


తే.

వేషమున దాసుఁడను మహాదోషినయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

70


సీ.

తిమితిమింగలము లాదిగ చెంతలకు జేర
                   నంతయు గొందులయందు దూర
బాతాళఫణులు నవ్వల నివ్వలను బార
                   జలరాసులన్నియు గలకబార
సోమకాసుర మహాచోరునిగ పోర
                   బ్రాణముల్ బాప కోపంబు దీర
బ్రహ్మతారకమంత్రపఠనసన్నిధి జేర
                   శ్రుతు లొసంగితి మహోన్నతులు మీర


తే.

వీరాధివీర మత్స్యావతార
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

71


సీ.

పాలసంద్రము పెద్దపాలగూననున్న
                   తరి భంగమయ్యె గోత్రములమిన్న
దానికి ఫణిరాజు త్రాడు గావలనగొన్న
                   సొరిది ద్రచ్చిరి సురాసురులు మున్న
జిగి దప్పి నీటిలో సగము గ్రుంకుచు నున్న
                   వేడ్క నెత్తితివి నీవేల్పు లెన్న
పొలుపొంద నంతట బుట్టె మేలగు వెన్న
                   వేల్పుల కిచ్నితి వెన్న వెన్న


తే.

సిరిని జేకొన్న దామేటిదొరవు రన్న
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

72

సీ.

వివిధలోకావృతోర్వీచక్ర మొకనావ
                   కణి వారధి ముంచి గర్వభావ
మడర హిరణాక్షుఁ డుడుగక మీత్రోవ
                   కడ్డగించిన దైత్యు లదరిపోవ
ధగధగ మనుచక్రధారచే తద్గ్రీవ
                   మెడయక ఖండించి డుప్రభావ
మున రసాతలగతావనికన్య నొకఠేవ
                   కొమ్మునఁ దగిలించుకొనుచు నీస


తే.

రమణఁ దోతేవ యజ్ఞవరాహదేవ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

73


సీ.

హరి నిందు జూపరా యని పుత్రు నడుగంగ
                   కలఁడన్న మాటను కల డనంగ
పటుసభాస్తంభంబు పెటపెట చిటలంద
                   కువలయ మెల్లను ఘూర్ణిలంగ
దృఙ్నఖదంష్ట్రాగ్నిదీప్తి భగ్గురనంగ
                   సునుదయించి వసుకశిపూత్తమాంగ
మఱికిపట్టి యురంబు పఱియలు వారంగ
                   బగిలించి దైత్యులు భళి యనంగ


తే.

నరహరీ దైత్యబాలు మన్పవె పొసంగ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

74


సీ.

అదితికశ్యపుల భాగ్యాయత్తమున బుట్టి
                   సిరి గల్గి యాచింప మురువు దొట్టి
బలిచేఁ బదత్రయస్థలము దానముఁ బట్టి
                   పిన్నవంతులలోన మిన్ను ముట్టి
పదయుగం బుర్వినభంబు లంటబట్టి
                   దనుజేశుఁ బాతాళమునకు నెట్టి
బలువేల్పుమూకలు వడుచెరల్ విడఁగొట్టి
                   ఘనత వజ్రికి సిరి గట్టిపెట్టి


తే.

గుట్టుతో నుంటి వీవెకా పొట్టిదిట్ట
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

75

సీ.

ధాత్రిలో క్షత్రియుల్ దలఁపఁగ నన్యాయ
                   గతుల వర్తింపంగఁ గడు నసూయ
ద్విజుఁడవై వేదశదిక్కులనసహాయ
                   శూరుఁడ వనుచు సంస్తుతులు మ్రోయ
గండ్రగొడ్డలియనుకైదువ కెఱసేయ
                   నిరువదియొకమారు నరులమాయ
చెండాడి సర్వభూమండల మామ్నాయ
                   విదుల కిచ్చి దయటి వేల్పురాయ


తే.

రాజరాజనిధన్యేయ రైణికేయ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

76


సీ.

హరి! నీవు మనుజుఁడ వౌ టెంతయాశ్చర్య
                   మెదిరి తాటక నేయు టెంతధైర్య
మవనిజాపరిణయోత్సవ మెంతయాశ్చర్య
                   మెచ్చి భార్గవు గెల్చు టెంతశౌర్య
మటవీగుహలు జేరు టది యెంతయాశ్చర్య
                   మెలమి వారధి గట్టు టెంతవీక్య
మఖిలాసురధ్వంస మది యెంతహత్సర్య
                   మిల నిజశ్రీ గాంచు టెంతశౌర్య


తే.

మౌర! శ్రీరామచంద్రాఖ్యవీరవర
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

77


సీ.

యాదవవంశనిధూదయేందుఁడ వౌచు
                   వెన్నెలకన్నమై వన్నదేల
కప్పుపచ్చడము మై గట్టుక యిరుగేల
                   ముసలహలంబులు బూని లీల
ముష్టికాదినిశాటముఖ్యుల నిల గూర్చి
                   పెకలించి కరిపురస్థలి సమూల
మెత్తిన నీబలం బింతింత యనజాల
                   తెలిసినకొలఁది గీర్తింతుఁ జాల


తే.

కరము కన్పట్ట వ్రేమోలఁ గాలపాల
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

78

సీ.

త్రిభువనకంటరి త్రిపురదానవయోష
                   కులపతివ్రతల కక్కులటదోష
మత్తించి తత్పురియందు గల్గున శష
                   కుటిలాసురుల నుగ్రచటులరోష
దహనుచేత హరించి దైవతాస్థవఘోష
                   లాకసంబున మ్రోయ నధికరోష
గరిమ నందితి వీవె కౌస్తుభమణిభూష
                   యజ్ఞభుక్సంరక్షణాభిలాష


తే.

బుధమనః ప్రియసంభాష బుద్ధవేష
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

79


సీ.

వర్ణాశ్రమాచారనిర్ణయంబులు దక్కి
                   కామిరోహాదిదుర్గతులఁ ద్రొక్కి
సత్యధర్మజ్ఞానశమదమాదులఁ దక్కి
                   కలి నరుల్ విషయభోగముల సొక్కి
ని న్నెఱుంగకయున్న నెఱతేజిపై నెక్కి
                   కరఖడ్గధార నాఖలులఁ జెక్కి
సాధుసజ్జనముల సద్భావములఁ జొక్కి
                   యిచ్చట వెలయు నీ కేను మ్రొక్కి


తే.

ధన్యమతి నైతి మీప్రసాధంబు మెక్కి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

80


సీ.

సప్తసముద్రముల్ సరవి నీదుట గాదు
                   దిటముగా గట్టు మ్రోయుటయు గాదు
నిఖిలభూచక్రంటు నిర్వహించుట గాదు
                   బలుగంబమున నుద్భవిలుట గాదు
పదయుగంబున బూనభంబు లంటుట గాదు
                   ద్విజుఁడవై నృపత వర్తిలుట గాదు
శైలముల్ నీటిలో దేలగట్టుట గాదు
                   భుజమాని యెరుని నిల్పుటయు గాదు


తే.

సులభమున నేలు నన్ బుద్ధ కల్కిరూప
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

81

సీ.

తిరుమలగురువరచరణాంబురుహతీర్థ
                   సేవనంబే తీర్థసేవనముగ
సతతోర్ధ్వపుండ్రలాంచితవైష్ణవానన
                   దర్శనంబే భవద్దరిశనముగ
రామగోవింద నారాయణాచ్యుతనామ
                   పఠనమే వేదాంతపఠనములుగ
అర్చావతార త్వదర్పితదివ్యప్ర
                   సాదసిద్ధి భవత్ప్రసాదసిద్ధి


తే.

గాఁ దలఁతు నింక మా కేల గల్గు శంక
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

82


సీ.

ఎప్పుడు విషయభోగేచ్ఛ బాయక యుండు
                   నెప్పుడ సద్గోష్ఠి నెనసియుండు
ఎప్పు డంతశ్శత్రుహితకారియై యుండు
                   నెప్పు డీషణవాంఛ దప్పకుండు
నెప్డు తపస్సున నెనసి వర్తిలకుండు
                   నెప్పుడు నీసేవ నెనయకుండు
నెప్పు డీహార్ధమోహితవృత్తిచే నుండు
                   నెప్పు డాత్మజ్ఞాన మొప్పకుండు


తే.

ఇట్టినామది ని న్నాశ్రయించు టెపుడొ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

83


సీ.

ఇంతకాఠిన్య మాయంతరంగము? నాఁడు
                   చింతించువారి రక్షింపలేదె
బుద్ధి నెంచక నింతబుద్ధత్వమా? నాఁడు
                   శాంతపూజాటనశక్తి లేదె
భావింప నింత పైఫైమాటలా? నాఁడు
                   లోపలిభువనముల్ చూపలేదె
యొక్కకోవెల నింత యొదిగియుంటివె? నాఁడు
                   బహుహేమమయహర్మ్యపంక్తి లేదె


తే.

కలదె ద్వారకఁ గలనాటి బలిమి నీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

84

సీ.

నెరనమ్మియుంటి దేవరచిత్తమున కించు
                   కెరుకలేదొ మది కరుగఁలేదొ
నారాయణా జగన్నాథ కృష్ణా యని
                   పిలువగాఁ వినరాదొ బలుకరాదొ
యాపదుద్ధారకా యనుచు దీనత వేడ
                   జాలిలేదో యిపు డేలరాదొ
బంటుబంటనటంచుఁ బ్రార్థించి కొలిచిన
                   బ్రీతి లేదో ప్రభుఖ్యాతి గాదొ


తే.

లోకనాయక నీకు పరాకు దగునె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

85


సీ.

వసుమతి దేవకీవసుదేవసుతుఁడవై
                   నందఘోషమునఁ జెల్వొంద నిలచి
జారచోరాదిచేష్టల వేడ్క విహరించి
                   గోగోపకుల బ్రోవ గోత్ర మెత్తి
కంససాల్వమురాది కస్టుల దునుమూడి
                   ద్వారకాపురము వింతగ రచించి
శ్రీరుక్మిణీస్త్రీల వివాహమై
                   పాండవవంశంబు బ్రబలఁజేయ


తే.

వేఁ నుతించెదగాని ని న్నెఱుఁగగలనె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

86


సీ.

ఋణపాతకంబు దారుణ మేమి సేయనో
                   పూని యిందుల కీవె పూటఁబడుము
సంసారజంది యెచ్చట ముంచివేయునో
                   గట్టిగా నీవు చేపట్టియుండు
మేమరింపున మృత్యు వెట్లు భంగించునో
                   గరుణ నిప్పుడె మమ్ము గట్టుకొనుము
కర్మంబు లెట్టిదుర్గతుల నొప్పించునో
                   లొలగక వేవేళ తోడు రమ్ము


తే.

విఘ్నములఁ బాసి మిమ్ము సేవింపవలయు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

87

సీ

ఒకవేళ చీఁకటింటికి దీప మిడినట్లు
                   తేటగా సర్వంబు దెలిసియుండు
నొకవేళ నీహార మెనసిన పద్మంబు
                   గతిఁ బోల్పఁదగి మందమతిగ నుండు
నొకవేళ ద్విరద మూరక త్రొక్కిన కొలంకు
                   పగిది నెంతయుఁ గల్కబారియుండు
నొకవేళ క్రొత్తనీటికి మీను బ్రాకిన
                   కరణి మహాశలఁ దిరుగుచుండు


తే.

గాని నిశ్చలపడదు నామానసంబు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

88


సీ.

సర్వజ్ఞుఁడవు నీవ చతురావనుఁడ వీవ
                   శతమఖముఖసర్సితతులు నీవ
పద్మినీబాంధవప్రముఖగ్రహము నీవ
                   వసుధాదిపంచతత్వములు నీవ
సురసిద్ధచారణగరుడోరగులునీవ
                   వడినిభకల్పకగిరులు నీవ
వరునతోడుతను దివారాత్రములు నీవ
                   వేదాధ్వరతదంగవిధులు నీవ


తే.

నీవ సర్వంబు సర్వంబు నీవ కావె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

89


సీ.

బహుజన్మకృతతపఃఫలముగా నిను గన్న
                   తల్లిదండ్రుల చెఱఁ దగులజేసి
చిరమోహితల గోపతరుణుల విడనాడి
                   పంశరవ్యధపాలు జేసి
విశ్వసించిన పాండవేయుల నడవుల
                   నెడలేని యిడుముల గుడువజేసి
ధాత్రీసురుని సహాధ్యాపకు భవధంఘ్రి
                   చింతనాపరుని కుచేలుఁ జేసి


తే.

శ్రితజనావన బిరుదు గట్టితివి భళిర
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

90

సీ.

అక్రూర, విదుర, భీష్మాంబరీషులయందు
                   గల దయారస మింత జిలుకుమయ్య
ప్రహ్లాద, ముచికుంద, పార్ధముఖ్యుల మున్ను
                   గన్న చల్లనిచూడ్కిఁ గనఁగదయ్య
శబరి, నహల్య, పాంచాలి, నుత్తర నెట్లు
                   బ్రోచితివో యట్లు బ్రోవుమయ్య
ధృవ, విభీషణ, గృహోద్ధలపైగల కూర్మి
                   నించుక నాయెడ నుంచుమయ్య


తే.

నమ్మినాడను పోషించ న్యాయమయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

91


సీ.

జాంబవధ్భలుకేశ్వరముష్టిహతులకు
                   బ్రీతి తప్పని నాటిప్రేమ యున్న
బ్రహ్మర్షిరాట్భ్రుగుపాదప్రహారంబు
                   సైచిననాఁటివాత్సల్య మున్న
గంగాసుతాస్త్రసంఘట్టన కాజిలో
                   కోప మొందనినాటిఁకూర్మి యున్న
పారుజాతాసక్తపాకశాసనవజ్ర
                   ఘాత కోర్చిననాటికరుణ యున్న


తే.

నస్మదపచారములు గారు టరుదె నీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

92


సీ.

రవికోటితేజోవిరాజితసాహస్ర
                   కిరణచక్రమున కంజలి ఘటించి
పరభయదాశ్రితాభయదస్యనాంచిత
                   పాంచజన్యం బాత్మ బ్రస్తుతించి
స్వర్ణప్రభామేరుసారాత్యుదారకౌ
                   మోదకీగదకు కేల్మోడ్పు జేసి
యసుజీవాభీలహతపరాయణశుభ
                   నందకం బనిశంబు నతు లొనర్చి


తే.

శార్ఙ్గము భజించి యంత మీశరణు జెంది
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

93

సీ.

భువనముల్ గన్నదండ్రివి నిజంబుగ నీడ
                   నీ బిడ్డనని నే గణియింపవలెనె
లోకరక్షాజాగరూకుండ వెన్నంగ
                   దెలిసి బ్రోవ పరాకుఁ దెల్పవలెనె
సకలాంతరాత్మకస్వామి వీ వరయంగ
                   మన్మనోవ్యథ దెల్ప మనవివలెనె
సకలశరీరచేష్టావిలాసుఁడవు నా
                   నడువడి నీతోడ తెలుపవలెనె


తే.

ఎద్ది భవదిచ్చ నారీతి నేలుమయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

94


సీ.

కలశాంబునిధితరంగముల నెన్నఁగవచ్చు
                   నీచరిత్రములు వర్ణింపఁదరమె
గంగానదీపయఃకణసంఖ్యఁ గనవచ్చు
                   నీగుణావళులు వర్ణింపఁదరమె
జలధరపుష్టిధారలు గణింపఁగవచ్చు
                   నీలీల లరసి వర్ణింపఁదరమె
గగనతారకలు లెక్కలు బెట్టఁగావచ్చు
                   నీవినోదములు వర్ణింపఁదరమె


తే.

తరముగా దైన తోచినంతయె నుతించి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

95


సీ.

ప్రాచేతస, మురారి, కవిపదనఖదాంశ
                   కోటిభాగాంశకు సాటిజాల
కాళిదాస, మురారి, కవిపదనఖదాంశ
                   లక్షభాగాంశ బోలఁగనుజాల
శబ్దశాసన, మూర్తి, చరణాంగుళపదాంశ
                   శతళతాంశకునైన సమముజాల
క్షితిసర్వకభాగవతపదాంభోజాంశ
                   దశదశాంశకునైనఁ దగులఁజాల


తే.

భక్తి, కవితాంశములు రెండు బట్టుబంట
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

96

సీ.

గ్రహము లెప్పుడు ననుగ్రహదృష్టి వీక్షించు
                   నాపదల్ కడుపలాయనము నొందు
వైరివర్గములెల్ల వాకట్లు బడియుండు
                   తొలఁగి దుర్దోషముల్ దూరమగును
ధర్మాదు లప్రయత్నమునఁ జేకూరును
                   మనసు మహానందమయత నుండు
జగతిజీవుఁడు పునర్జన్మదుఃఖముఁ బాయు
                   భద్రమౌ శాశ్వతపదము దొరకు


తే.

దాసులకు నీదు నామకీర్తనలవలన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

97


సీ.

ఎచ్చటఁ బూర్వవాహినిగ కృష్ణానది
                   సరసవీచీపరంపరలఁ బొలుచు
నెచ్చోట లవణాబ్ధి హీతతరంగములచే
                   దక్షిణదిశను సందడులు సేయు
నెచ్చోట కంకణహేలాగతుల వేణి
                   పశ్చిమతటమున బాయకుండు
నెచ్చోట భోగవతీగంగ బుద్బుదా
                   కృతుల నుత్తరదిశ నెగయుచుండు


తే.

నచ్చట వినోదగోపురం బమరె నీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

98


సీ.

నీకథాకావ్యంబు నిర్మించి బమ్మెర
                   పోతరా జుర్విపై బోవువాఁడె
నీ కర్పణంబుగా నిరతాన్నదుండై న
                   కోట శింగనమాట పాటిరాదె
నీదయ కర్థుల కేది లే దన కిచ్చు
                   భాస్కరుఁ డిద్ధర బాయువాఁడె
నీకు కోవెలఁ గట్టి నిజభక్తి కృత్వెంటి
                   వెంకటాచల ముర్వి వెలయలేఁడె


తే.

క్షితిని మృతు లయ్యు కీర్తిసుస్థిరులు గారె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

99

సీ.

కాశ్యపగోత్రుఁడ కాసులవంశచం
                    ద్రముఁడ నప్పలరాజు రమణమాంబ
కూర్మితనూజుండ గురువులౌ అద్దంకి
                    తిరుమలాచార్య శ్రీ చరణపద్మ
భవ్యతీర్థమరందపానద్విరేఫాయ
                    మానమానసుఁడను మాన్యహితుఁడ
పురుషోత్తమాఖ్యుండ పూల్దండవలె నీకు
                    శతకంబు గూర్చితి శాశ్వతముగ


గీ.

చిత్తగింపుము మీపాదసేవకుఁడను
భావజవిలాస హంసలదీవివాస
లలితకృష్ణాబ్దిసంగమస్ధలవిహార
పరమకరుణాస్వభావ గోపాలదేవ.

100

సంపూర్ణము