Jump to content

స్మృతికాలపు స్త్రీలు/ద్వితీయాధ్యాయము

వికీసోర్స్ నుండి

స్మృతికాలపు స్త్రీలు

ద్వితీయాధ్యాయము.

వివాహవయస్సు

స్త్రీల వివాహవయస్సును గూర్చి స్మృతు లిసుమంతయు సందేహము లేకుండునట్లు పరిష్కరించినవి. స్మృతుల నన్నిటిని పరిశీలించిన పిమ్మట నీక్రింది సిద్ధాన్తములను ప్రకటించుటకు వీలుగల్గుచున్నది.

(1) రజస్వల కాకుండగనే వివాహము చేయవలెనని చాల ధర్మశాస్త్రములు నొక్కి చెప్పుచున్నవి. అవి రజస్వలా వివాహమును మిక్కిలి గర్హించుచున్నవి.

(2) రజస్వల యైనంత మాత్రమున మహాదోషము లేదనియు నాపిమ్మట వివాహము చేయుట కుపేక్షించుట ఘోరదోషమనియు కొన్ని స్మృతులు చెప్పుచున్నవి.

(3) రజస్వలా వివాహము మంచిదని యేస్మృతియు చెప్పుటలేదు.

(4) ఎనిమి దేండ్లకును పండ్రెం డేండ్లకును నడుమను స్త్రీకి వివాహము చేయవలెనను నిర్దేశమును గూడ కొన్ని స్మృతులు చేయు చున్నవి. (5) వివాహము కాకుండగనే రజస్వలయైన స్త్రీయు నామె పెద్దలును నామె సంతతియుగూడ పతితులగుదురని కొన్ని ధర్మశాస్త్రములును, పెద్దలుమాత్రమే దోషవంతులగుదురని కొన్ని ధర్మశాస్త్రములును చెప్పుచున్నవి.

ఈ సిద్ధాంన్తములలో నొక్కొక్కదానిని తీసికొని యందులకుగల యాధారములను పరికింతము.

(1) వసిష్ఠధర్మశాస్త్రము, గౌతమధర్మసూత్రము, పరాశరస్మృతి, యమసంహిత, సంవర్తసంహిత, యాజ్ఞవల్క్యస్మృతియను నాఱుధర్మశాస్త్రములును నిస్పష్టముగ రజస్వలావివాహము చేయువానిని గర్హించుచున్నవి.


   పితు:ప్రమాదాత్తు యదీహకన్యా
   వయ:ప్రమాణం సమతీత్యదీయతే
   సాహన్తిదాతారము దీక్షమాణా
   కాలాతిరిక్తాగురు దక్షిణేవ (వసి 17-69)

తండ్రి పొరబాటువలన నే కన్య వివాహవయస్సు నతిక్రమించి దానముచేయబడునో యాకన్య సకాలమును దాటిన గురుదక్షిణవలె దాతను నశింపజేయును)

పైశ్లోకములో నుద్దేశింపబడిన వివాహవయస్సు నీక్రింది శ్లోకము విశదీకరించుచున్నది.


    ప్రయచ్ఛేన్నగ్నికాం కన్యామృతుకాలభ యాత్పితా
    ఋతుమత్యాంతుతిష్ఠన్త్యాం దోషం పితరమృచ్ఛతి
                                        (వసి. 17-70)

(రజస్వల కాని కన్యను రజస్వలయగునేమో యనుభయముచే తండ్రి దానము చేయవలెను. కన్య రజస్వలయైయుండుచో తండ్రిని దోషము పొందును.)

వసిష్ఠుడీ విధముగ రజస్వలయగు నప్పటికే వివాహము చేయకుండుటను నిషేధించి, యా పిమ్మటకూడ వివాహము చేయకుండుటను మఱింతతీవ్రముగ నిందించుచున్నాడు.

    యావన్తః కన్యామృతవస్స్పృశన్తి
    తుల్యైస్సకామామభి యాచ్యమానాం
    భ్రూణాని తావన్తిహతాని తాభ్యాం
    మాతాపితృభ్యామితి ధర్మవాదః

(వసి. 17-71)

(కామముతో గూడి కామింపబడుచున్న కన్య కెన్ని ఋతుకాలములు గడచునో యన్ని భ్రూణహత్యలను చేసిన పాపము తల్లిదండ్రులకు వచ్చును.)

గౌతముడుకూడ విస్పష్టముగ రజస్వలకాకపూర్వమే వివాహము చేయవలెనని శాసించుచున్నాడు.

ప్రదానం ప్రాగృతో:

(గౌ.ధ.సూ.18-21)

(ఋతుమతి యగుటకుపూర్వమే కన్యను దానము చేయవలెను.) ఎంతబాల్యములో కన్యను దానముచేసిన నంత మంచిదనియే కొందఱి యభిప్రాయమని గౌతముడు చెప్పుచున్నాడు.

ప్రాగ్వాసన: ప్రతిప త్తిరి త్యేకే

(గౌ. 18-28)

(గుడ్డ కట్టుకొను వయస్సునకు పూర్వమే దానముచేయుట మంచిదని కొందఱు ఋషులు చెప్పుచున్నారు)

గౌతముడు అరజస్వలావివాహమును శాసించుటతో నూరకుండక రజస్వలావివాహమును నిషేధించుచు నిట్లు చెప్పుచున్నాడు.

అప్రయచ్ఛన్దోషీ.

(గౌ. 18-22)

(ఋతుకాలమునకు పూర్వమే దానము చేయనివాడు దోషవంతుడగుచున్నాడు.)

పరాశరస్మృతి రజస్వలావివాహమును సర్వవిధముల నీక్రిందివిధముగ నిందించుచున్నది.

 
    మాతాచైవ పితాచైవ జ్యేష్ఠాభ్రాతాతదైవచ
    త్రయన్తేనదకంయాంతి దృష్ట్వాకన్యాం రజస్వలాం
    యస్తాం సముద్వహేత్కన్యాం బ్రాహ్మణోమనమోహిత:
    అసంభాష్యోహ్య పాజ్త్కేయస్స విప్రోవృషలీపతి:
    యఃకరోత్యేకరాత్రేణ వృషలీసేవనంద్విజ:
    సభైక్షభుగ్జపన్నిత్యంత్రిభిర్వర్షైర్విశుద్ధ్యతి

(పరా. 8-6, 7, 8.) (తల్లి, తండ్రి, జ్యేష్ఠ సోదరుడు-ఈమువ్వురు నవివాహితయగు రజస్వలను చూచి నరకమును పొందుదురు. అట్టి కన్యను వివాహము చేసికొను మదమోహితుడైన బ్రాహ్మణుడు సంభాషింప తగినవాడు; పజ్త్కిబాహ్యుడు. వానికి వృషలీపతి యనిపేరు. ఒక్కరాత్రి వృషలిని సేవించిన దోషము మూడేండ్లు భిక్షచర్య చేయుచు జపించుచుండినచో హరించును.)

యమసంహితకూడ పరాశరుని వాక్యములతోనే

(యమ 11-23) రజస్వలావివాహమును గర్హించుచున్నది. సంవర్త సంహితకూడ నట్లే గర్హించి (67 శ్లో) యిట్లు ముగించుచున్నది

తస్మాద్వివాహయేత్కన్యాంయాపన్నర్తుమతీభవేత్

(సంవర్త. 08)

(ఆహేతువువలన కన్య రజస్వలయగు లోపలనే వివాహము చేయవలెను.)

యాజ్ఞ వల్క్యుడీ క్రిందివిధముగ రజస్వలా వివాహమును గర్హించుచున్నాడు.

అప్రయచ్ఛన్‌సమాప్నోతిభ్రూణహత్యామృతావృతౌ

(యాజ్ఞ 1-05)

(ఋతుమతి కాకుండనే కన్యను దానము చేయనివాడామె ఋతుకాలమునందెల్ల భ్రూణహత్యాదోషము నొందును) ఆపస్తంబుని మతములోగూడ నరజస్వలకే వివాహము చేయవలెనని తేలుచున్నది, ఎట్లన: ఆపస్తంభ గృహ్యసూత్రములో తురీయ పటలములో నష్టమఖండములో పదవసూత్రములో 'తిస్రోజసిత్వా' యను మాటలతో వివాహ ప్రయోగము ముగింపబడినది. 'యద్దామల వద్వాసాఃస్యాత్‌' అను పండ్రెండవ సూత్రములో రజస్వలా విషయము చెప్పబడినది. కాన వివాహమునకు పిమ్మటనే రజస్వల యగుటయే క్రమమని తేలుచున్నది.

(2) కన్య రజస్వలయైన వెంటనే వివాహము చేయుట దోషము లేదనియు నటుపిమ్మట నుపేక్షించుట దోషమనియు చెప్పుచున్న వారు నారద గోభిలులు . ప్రథమ రజస్వలయైన వెంటనే కన్యను దానము చేయవలెననియు ప్రథమర్తుకాల మతిక్రమించినను దాతకు భ్రూణహత్యా దోషము వచ్చుననియు వారి యభిప్రాయము.

     కన్యావర్తుముపేక్షతబాంధవేభ్యోనివేదయేత్
     తేచేన్నదద్యుస్తాంభర్త్రే తేన్యుర్భ్రూణహభిస్సమాః

(నారద. స్త్రీపుంసయోగమను ద్వాదశవ్యవహారపదము 24)

(కన్య ఋతువు నుపేక్షింపక బంధువులకు తెలుపవలెను. వారామెను భర్తకు దానముచేయరేని భ్రూణహత్యచేసినవా రగుచున్నారు.)

ఈయభిప్రాయమే మఱింత స్పష్టముగ నీక్రింది శ్లోకములో చెప్పబడినది.

     యాపస్తశ్చర్తవస్తస్యా: సమతీయు: పతింవినా
     తావత్యో భ్రూణహత్యన్స్యు స్తస్య యోన దదాతితా (25 శ్లో)

(పతిలేకుండ కన్య కెన్ని ఋతుకాలములు నడుచునో యన్ని భ్రూణహత్యల పాపమును నామె నీయనివారికి వచ్చును.)

కావున ప్రథమర్తుకాల మతిక్రమించునేని యొక భ్రూణహత్యచేసిన పాపము దాతకు వచ్చుచున్నది. అందువలననే ప్రథమర్తుకాల మతిక్రమింపకుండ రజోదర్శనమైన వెంటనే వివాహము చేయవలెనని యీ క్రింది శ్లోకము చెప్పుచున్నది.

    అత: ప్రవృత్తేరజసి కన్యాందద్యా త్పితాసకృత్
    మహదేన: స్పృశేదేనమన్య ధైవంవిధి:సతాం

(నారద 12-27)

(అందువల్న రజ:ప్రవృత్తి యగుచుండగనే తండ్రి కన్యనిచ్చి వేయవలెను. అట్లుకానిచో నాతనికి గొప్ప పాపము వచ్చును. ఇది సత్పురుషుల విధి.)

నారదునినుండి పైన నుదహరింపబడిన వాక్యములను బట్టి చూడగా కన్యకు ప్రథమర్తు కాలములో వివాహము చేయవలెనని తేలుచున్నది.

ఋతుస్స్వాభావిక స్త్రీణాం రాత్రయష్షోడశస్మృతా:

(స్త్రీలకు పదునాఱురాత్రులు స్వాభావికమగు ఋతుకాలము) అని మన్వాదు లాదేశించుటచేత రజోదర్శనమైనది మొదలు పదునాఱురాత్రులు దాటకుండ వివాహము చేయవలెనని తేలుచున్నది. ఈగ్రంథములో మున్ముందు ఇవ్వబడబోవునట్టి రజస్వలా నియమములను బట్టి మొదటి మూడు దినములలోను వివాహము చేయుటకు వీలుండదు. మిగిలిన పదమూడుదినములలో చేయవలసి యుండును. మఱియు 'వధూవరార్హతలు'అను శీర్షికగల యధ్యాయములలో తెలుపబడనున్న నారదాది ప్రోక్త వరపరీక్షా విధానమును బట్టి చూతుమేని పదునాఱు దినములలో వరుని నిశ్చయించి యాతని కీమెను దానముచేయుట కష్టమని తెలియగలదు. మఱికొంతకాల మాలస్యము కారాదాయన దానికి సామాన్య దోషము చెప్పబడలేదు. భ్రూణహత్యదోషము చెప్పబడినది. కావున నెట్లైనను పదునాఱుదినములలో తప్పక వివాహము చేయవలసి వచ్చుచున్నది. అది సాధ్యము కావలెనన్నచో రజస్వలావయస్సునకు పూర్వమే వరుని నిశ్చయించి యుంచుకొని ఋతుస్నాతయైన పిమ్మట వివాహము జరుపవలెనని నారదుని యభిప్రాయమైనట్లు తేలుచున్నది.

(3) రజస్వలా వివాహమే మంచిదని చెప్పు ధర్మశాస్త్రమొక్కటియు గానరాదు.

(4) కన్యకు వివాహమెనిమిదవయేట చేయుట మంచిదని సంవర్త సంహిత చెప్పుచున్నది. వివాహోష్టపర్షాయాః కన్యాయా ప్రశస్యతే

(సంవ. 10 శ్లో.)

(ఎనిమిదేండ్ల పిల్లకు వివాహము చేయుట ప్రశస్తము)

పండ్రెండవయేడు వచ్చునప్పటికి కన్యకు వివాహము చేయవలెనని యమస్మృతియు పరాశరస్మృతియు చెప్పుచున్నవి.

    ప్రాప్తేతుద్వాదశేవర్షేయః కన్యాంసప్రయచ్ఛతి
    మాసిమాసి రజస్తస్యా:పితాపిబతిశోణితం

(యమ. 11-22)

(పండ్రెండవయేడు వచ్చినదగుచుండగా నెవడు కన్యను దానము చేయడో యాతండ్రి యామె రజస్సును ప్రతిమాసమునను త్రాగుచున్నాడు.)

ఈశ్లోకమే పరాశరస్మృతిలో (8-5) నున్నది.

(5) అవివాహితయై యుండగా రజస్వలయైన స్త్రీయు, నామెతండ్రియు, తల్లియు, సోదరుడును, నామెను వివాహమాడినవాడును పతితులని తెల్పుకొన్ని శ్లోకములు పై సనీయబడినవి. గౌతమ వసిష్ఠులు రజస్వలా దాతను మాత్రమే నిందించినట్లుకూడ పైన చూచియున్నాము. తండ్రి ధర్మలోపము చేతను బుద్ధిహీనతచేతను సకాలములో వివాహితకాని కన్యగతి యేమికావలెనను ప్రశ్ననువేసికొని దానికి సమాధానములను గూడ గౌతమ వసిష్ఠులిచ్చియున్నారు. అట్టికన్య మూడు ఋతుకాలములు వేచియుండి యప్పటికిని తండ్రి దానముచేయనిచో తానే స్వయముగ మఱొకనిని వివాహమాడవలెనని గౌతముడు చెప్పుచున్నాడు.

   త్రీన్కుమార్యృతూనత్యత్యస్వ యంయుజ్యే
   తానిందితేనోత్సృజ్యపిత్య్రానలంకారాన్

(గౌ.4-70)

(అవివాహిత మూడు ఋతుకాలములు వేచియుండి తండ్రిపెట్టిన యలంకారములు నాతనికిచ్చివైచి తానే యనిందితుడగు వరుని సంపాదించి వివాహమాడవలెను.)

ఇచటి మూడు ఋతుకాలములకు బదులుగ వసిష్ఠ స్మృతిలో మూడు సంవత్సరములు చెప్పబడినది.

    కుమార్యృతుమతీత్రీణి వర్షాణ్యుపాసీత
    త్రిభ్యోవర్షేభ్య: పతింవిదేత్తుల్యం

(వసి 6-67)

(ఋతుమతియైన యవివాహిత మూడు సంవత్సరములు వేచియుండి తగిన భర్తను పెండ్లాడవలెను.)

సకాలములో దానము చేయువాడు లేనిచో కన్య స్వయముగనే పెండ్లిచేసికొనవలెనని యాజ్ఞవల్క్యుడుకూడ చెప్పుచున్నాడు.

గమ్యంత్వభావే దాతౄణాం కన్యాకుర్యాత్స్వయంవరం.

(యాజ్ఞ 1-65) (దాతలులేనిచో కన్య తగినవరుని స్వయంవరము చేసికొనవలెను.)

మనువుకూడ వసిష్ఠునివలెనే మూడు సంవత్సరములు చూచి స్వయంవరము చేసికొనవలెనని చెప్పినాడు.

    త్రీణివర్షాణ్యుదీక్షేత కుమార్యృతుమతీసతీ
    ఊర్థ్వంతుకాలాదేత స్మాద్వింజేత సదృశంపతిం

(మను 9-88)

(కన్య ఋతుమతియై మూడు సంవత్సరములు వేచియుండి పిమ్మట తగిన వరుని పొందవలెను.)

ఇట్లు సకాలములో తండ్రిచేత నీయబడనిదై స్వయముగ వివాహమాడిన స్త్రీగాని యామెభర్తగాని యెంత మాత్రము దోషమును పొందరని మనుస్మృతి చెప్పుచున్నది.

    అదీయమానాభర్తా రమధిగచ్చేద్యదిస్వయం
    నైనః కించిదవాప్నోతినచయంసాధి గచ్ఛతి

(మను 9-91)

రజస్వలయైనపిమ్మట మూడేండ్లు కన్య వేచియుండవలెనని మనువు చెప్పుటచే రజస్వల కాకుండనే కన్యను దానము చేయుట తండ్రి కర్తవ్యమని యాతని యభిప్రాయమైనట్లు తేలుచున్నది. అయినను తండ్రి నేరముచే కూతురు దోషవంతురాలు కాదని యాతడు భావించుచున్నట్లుకూడ పైశ్లోకమువలన తెలియుచున్నది. అంతేకాక మొత్తముపైన మనువు దృష్టిలో రజస్వలా వివాహము పరాశరాదుల దృష్టిలోవలె నత్యంతము గర్హ్యమైనట్లు కాన్పింపదు. ఏమన:

    కామమారణాత్తిష్ఠేద్గృహే కన్యర్తు మత్యపి
    నచైవైనాం ప్రయచ్ఛేత్తుగుణహీనాయ కర్హిచిత్

(మను 9-89)

(కన్యామరణాన్తము పితృగృహములో నుంచుకొనవచ్చును కాని యామెను గుణహీనునకీయ కూడదు) అని మనుస్మృతి చెప్పుచున్నది. గుణహీనునకు కన్యనీయరాదనుటకు యీశ్లోకము చెప్పబడియున్నను గుణ హీనుడే కాని లభింపనపుడు కన్య ఋతుమతియైనను తండ్రిది దోషముకాదని దీనినిబట్టి యూహించుటకు వీలున్నది. ఋతుమతియైన మూడేండ్ల వఱకును కన్య వేచియుండవచ్చుననుట యిట్టి పరిస్థితులలోనే యని యన్వయించు కొనవచ్చును. ఎదియెట్లున్నను సామాన్యముగ వివాహముచేయవలసిన వయస్సు మనువు నభిప్రాయములో కూడ రజస్వల కాకపూర్వమే. మనువు స్త్రీ పురుష సంతతులకు చేయవలసిన కర్మలను జెప్పుచు పురుషుని యుపనయనమునకు బదులుగ స్త్రీ వివాహమును చెప్పుటచేతనే స్త్రీ కెనిమిదవయేట వివాహము చేయవలసినదని మనువు భావించినట్లు తెలియుచున్నది.

వైవాహికీ విధిః స్త్రీణాం సంస్కారోవైదికస్మృత:

(మను 2-67) పురుషుని యుపనయన వయస్సునుగూర్చి ముందు వివరింపబడనున్న గౌ. 1-5,8 చూడుడు.

వివాహవయస్సు కాకపోయినను తగినవరుడు లభించినచో కన్యకు వివాహము చేయవలెనని మనువు చెప్పుచున్నాడు.

    ఉత్కృష్టాయాభిరూపాయ వరాయసదృశాయచ
    అప్రాప్తామపితాం తస్మై కన్యాందద్యాద్యథావిధి.

(మను 9-88)

(వయస్సురాని కన్యనుగూడ సుత్కృష్టుడును మంచి రూపముగలవాడును, సమానవర్ణుడును నగువరునకు యథావిధిగ నీయవలెను.)

ఇచట 'అప్రాప్తాం' అని చెప్పుటచేతనే స్త్రీకి నిర్ణీతమగు వివాహ వయస్సొకటి మనువు నభిప్రాయములో గలదని తేలుచున్నది.

కాలే౽దాతా పితావాచ్యః

(మను 9-4)

(సకాలములో దానముచేయని తండ్రి దోషి)

అనుటచే గూడ నీయంశమే తేలుచున్నది. ఆనిర్ణీత వయస్సు ఎనిమిదేండ్లు మొదలు పండ్రెండేండ్ల లోపునని 2-67 వలనను ముందు వివరింపబడనున్న 9-94 వలనను తేలుచున్నది. ఇక పురుషుని వివాహవయస్సునుగూడ నించుక పరికింతము. పురుషుడు సుమారిరువదియైదవయేట వివాహము చేసికొనవలెనని స్మృతుల యభిప్రాయమైనట్లు తోచుచున్నది. ఎట్లన: ఆయుస్సులోని రెండవభాగము గృహస్థాశ్రమములో నడుపవలెనని చెప్పబడినది.

ద్వితీయమాయుషోభాగం కృతదారోగృహేవనేత్.

(మ 5-169)
'శతమానంభవతి' మున్నగు ప్రాచీనాభిప్రాయములను బట్టి నూరేండ్లు మానవుని యాయుఃప్రమాణమగుచో నందు నాల్గాశ్రమములకు (బ్రహ్మచారీగృహస్థోభిక్షు వైఖానసః.గౌ.) నాల్గుభాగములగుచో నొక్కొకభాగమున కిరువదియైదేండ్లు వచ్చును. ఈ యూహ సరియైనదే యనుటకు మఱొక యాధారము చూపవచ్చును. అదియేదన: ఈ లెక్క ననుసరించియే బదవయేట వానప్రస్థములో చేరవలసియుండును. వివాహమైన కొలదికాలమునకే కుమారుడు కల్గుచో నాకుమారునకు పాతికేండ్లువచ్చి యాతనికి వివాహమై కుమారుడు కల్గునప్పటికి తనకేబదేండ్లువచ్చును. అంత నాయువుయొక్క మూడవభాగమువచ్చును. అదియే వానప్రస్థములో ప్రవేశింపవలసిన కాలము గదా! అప్పటికి మనుమడు కల్గియుండవలెనని స్మృతులలో నున్నది.

   గృహస్థస్తుయదాపశ్యేద్వలీ పలిత మాత్మన:
   అపత్యస్యైవచాపత్యంతదారణ్యం సమాశ్రయేత్

(మ 6-2)

(గృహస్థెప్పుడు తన ముడతలను, తలనెఱపును, మనుమని చూచునో యపుడరణ్యమునకు పోవలెను.)

ఇట్లు వానప్రస్థములో చేరునప్పటికి ననగా నాయువులో మూడవభాగము (ఏబదియొకటవయేడు) ప్రవేశించునప్పటికి మనుమడు కలుగవలెననిచో నాతడు సుమారిరువది యారేండ్లపుడు కుమారుని కనవలెను. ఈ విధముగా సుమారిరువదియైదవయేట పురుషునకు వివాహమగుట స్మృతి సమ్మతమని తేలుచున్నది. దీని ననుసరించియే మనువు ముప్పదేండ్ల వాడు పండ్రెండేండ్ల దానిని నిరువదినాల్గేండ్లవా డెనిమిదేండ్ల దానిని వివాహమాడవచ్చునని చెప్పినాడు.

   త్రింశద్వర్షోద్వహేత్కన్యాం హృద్యాం ద్వాదశవార్షికీం
   త్య్రష్టవర్షోష్టవర్షాంవా ధర్మేసీదతిసత్వర:

(మ 9-94)

(ముప్పడేండ్లవాడు మనోహారిణియైన పండ్రెండేండ్ల కన్యను వివాహమాడవలెను. ముందుగ వేదాధ్యయనము పూర్తిచేసి గార్హస్థ్యధర్మమును నిర్వహించుటకు వ్యర్థముగ కాలయాపనము చేయుట కిష్టములేనివాడు ఇరువదినాల్గవయేట నెనిమిదేండ్ల దానిని వివాహ మాడవచ్చును.) పురుషుని వివాహవయస్సును నిర్ణయించుటకు మఱొక మార్గము కలదుగాని యది యింత విశదమైనది కాదు. ఎట్లన బ్రాహ్మణున కెనిమిదవయేటను, క్షత్రియునకు పదునొకండవ యేటను, వైశ్యునకు పండ్రెండవయేటను నుపనయనము చేయవలెనని యన్నిధర్మశాస్త్రములును చెప్పుచున్నవి.

ఉపనయనం బ్రాహ్మణస్యాష్టమే

(గౌ. 1-5)

ఏకాదశద్వాదశయోః క్షత్రియవైశ్యయోః

(గౌ. 1-8)

పిమ్మట పండ్రెండు కాని యిరువదినాల్గు కాని ముప్పదియాఱు కాని సంవత్సరములు బ్రహ్మచర్యముచేసి వివాహము చేసికొనవలెనని యున్నది.

    ద్వాదశవర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యంచరేత్
    ప్రతిద్వాదశవర్షంవా సర్వేషు.

(గౌ.ధ.సూ.2-51, 52)

దీనిని బట్టి పురుషుడిరువదేండ్లకు లోపున వివాహమాడరాదని మాత్రమే తేలుచున్నది. కావున నిది పైనవేయబడిన లెక్కకు విరుద్ధముకాదు.

__________