స్మృతికాలపు స్త్రీలు/దశమాధ్యాయము
స్మృతికాలపు స్త్రీలు
దశమాధ్యాయము
వృత్తి విద్య
స్త్రీల వృత్తి మనుస్మృతిలో సంగ్రహముగ నిట్లు చెప్పబడినది:
ప్రజనార్థం మహాభాగాః పూజార్హాగృహదీప్తయః
- (మను. 9-26)
ఉత్పాదనమపత్యస్య జాతస్య పరిపాలనం
ప్రత్యహం లోకయాత్రాయాః ప్రత్యక్షం స్త్రీనిబంధనం
(మను. 9-27)
(స్త్రీలు సంతానముకొఱ కున్నారు. సౌభాగ్యవంతురాండ్రు గృహమునకు దీపములవంటివారు. పూజార్హులు. సంతానము కనుటయు, పోషించుటయు వారి కృత్యములు. ప్రతి దినము భర్త, యతిథి మున్నగువారి లోకయాత్రకు వారే కారణము)
స్త్రీకి సంతానము కనుట పెంచుట యంత ముఖ్యధర్మములు కావుననే సంతానములేని స్త్రీ యింట నన్నము తినరాదను నియమము మనుస్మృతిలో నున్నది. అనపత్యాతు యానారీనాశ్నీయాత్తర్గృహేపివై
స్త్రీకి పతిసేవయే గురుకులవాసము, గృహకృత్యములు చేసికొనుటయే యగ్ని కార్యమునని యిదివఱలో సూచియుంటిమి. ఆమెకుగల నైపుణ్యమును, బుద్ధిని వినియోగించి గృహమును భూలోక స్వర్గము చేయుటయే యామెవిధి. ఆమె నిత్యము కలకలలాడుచు గృహము నంతయు ప్రకాశవంతముగ చేయవలెను. అట్లు చేయునపుడే స్త్రీలకు పైన వాడబడిన 'గృహదీప్తయః' అను విశేషణము సార్థకమగును. చీకటి దుఃఖమునకు చిహ్నము. వెలుగు సుఖమునకు సంతోషమునకు చిహ్నము. కాన వెలుగుతెచ్చు దీపముతో పోల్పబడిన స్త్రీ యింటికి సంతోషమును గూర్పవలెను. తా నసంతృప్తురాలై రోజుకొనుచునుండుచో నితరులకు సంతోషమును గలుగ జేయుటకు బదులు విచారమును గలుగజేయును. కాన నామె యెల్లపుడు సంతోషముతో నుండవలెను. మనుస్మృతి యీ యంశమును స్పష్టముగ చెప్పుచున్నది.
సదాప్రహృష్టయా భావ్యం గృహకార్యేషు దక్షయా
- (మను. 5-150)
(గృహిణి యెల్లపుడు సంతోషించునదిగ నుండవలెను. గృహకృత్యముల జేయుటలో సమర్థురాలై యుండవలెను.)
ఎంత యోగ్యురాలైనను పనిచేత కానిదగుచో నింటిలోనివారిని సుఖపెట్టలేదు. కాన పనులలో నేర్పును సంపా దించుట కూడ స్త్రీకి విధియే. శిశువులను శుభ్రముగ నుంచుటయు నెవరి కేమి కావలసినదియు కనిపెట్టి చూచుచుండుటయు నందఱకు భోజనములు పెట్టుటయు నింటిలోని వస్తువులను భద్రపఱచుటయు నామె కృత్యములు.
శౌచేధర్మేన్న వఙ్త్యాంచ పారిణహ్యస్యచేక్షణే
- (మను. 9-11)
అతిథులకును నింటిలోని యితరులకును పరిచారకులకును భోజనము పెట్టి తుదను గృహిణియు గృహస్థుడును భుజింపవలెను.
శేషం దమ్పతీ భుంజీయాతాం
- (వసిష్ఠ. 10-6)
అపుడైనను గృహస్థునకు బిమ్మటనే గృహిణి భుజింప వలెను. భార్యాభర్తలిరువురును గలసి భుజింపరాదు.
భర్యాయాసహనాశ్నీ యాదవీర్యవదపత్యం
భవతీతివాజననేయకే విజ్ఞాయతే
(వసిష్ఠ 10-31)
(భార్యతోకూడ భుజించుచో సంతతి వీర్యరహిత మగును గాన నట్లు భుజింపరాదని వాజసనేయసంహిత చెప్పుచున్నది.)
అతిథి మున్నగువారికి భోజనమును బెట్టుటలో గూడ వారి వారి హెచ్చుతగ్గుల నాలోచించి ముందు వెనుకల వారిని భుజింపజేయవలెను. తతో తిథిం పూజయే చ్ఛ్రేయాం సంశ్రేయాం
నమాను పూర్వ్యేణ.
అత్తమామలకు స్త్రీ విశేష గౌరవము చూపుచుండవలెను. వారు భర్తద్వారమున తనకు పూజ్యులగుచున్నారు. కాన వారిని పూజించుచో భర్త కూడ పూజితు డగును. భర్తకు నిరాదరణము చూపి వారిని పూజించుట ధర్మము కానేరదు.
కుర్యాచ్ఛ్వశురయోః పాదవందనం భర్తృతత్పరా.
- (యాజ్ఞవల్క్య. 1-34)
(భర్తయందు పూర్ణభక్తికలదై యత్తమామలకు పాదాభివందనము చేయవలెను.)
గృహము నీవిధముగ చక్కబెట్టుకొనవలసిన గృహిణికి చేత కొంత ధన ముండుట యగత్యము. కాన గృహస్థుడీమెను
అర్థన్య సంగ్రహే చైనాం వ్యయే చైవనియోజియేత్
- (మను. 9-11)
(ధనము దాచుటయందును వ్యయము చేయుటయందును నియోగింపవలెను.)
ధనమును వ్యర్థముగ పాడుచేయక సక్రమమగు విధమున వ్యయము చేయుట స్త్రీకి ధర్మము.
వ్యయే చాముక్త హస్తయా
- (మను. 5-150) (స్త్రీకి వ్యయమందు చేయి వదలుగా నుండరాదు)
భర్త ప్రవాసమున కేగునపుడు తిరిగివచ్చువఱకు గృహ నిర్వహణమునకు వలయు ధనమును భార్య కిచ్చి యేగవలెనని పూర్వాధ్యాయమున చూచియుంటిమి. భర్త యట్లు ధనము నిచ్చి పోనిచో గృహిణి నింద్యములు కాని నూలు వడకుట మున్నగు శిల్పములతో ధనసంపాదనము చేసికొనవలెను.
ప్రోషితేస్వ విధాయైవ జీవేచ్ఛిల్పైర గర్హితైః
- (మను. 9-75)
భర్త ప్రవాసమున కేగినపుడే కాక యాత డింట నున్నపుడు గూడ ధనార్జనమున కర్హలగు స్త్రీలు (గొల్ల మున్నగు జాతులవారు) కొందఱు గలరని 'ధన' మను నధ్యాయమున చూచియుంటిమి. రాజాస్థానములు మున్నగు చోట్ల స్త్రీ సేవకురాండ్రుండుట కాననగుచున్నది. వారు తమ యధికారికి విసరుట, నీరిచ్చుట, ధూపము వేయుట మున్నగు పనులు చేయుచుండెడివారు. రాజున కీ పనులను చేయు స్త్రీలు రాజునకు ద్రోహము చేయకుండునట్లు పరీక్షింపవలెనని మనుస్మృతి చెప్పుచున్నది.
పరీక్షితాః స్త్రి యశ్చైనం వ్యజనోదక ధూపనైః
- మను. 7-219)
స్త్రీమ్లేచ్ఛవ్యాధితవ్యం గాన్మంత్రకాలేవ సారయేత్
భిందంత్యవమతామంత్రం తైర్యగ్యోనాస్త థైవచ
స్త్రి యశ్చైవ విశేషణ తస్మాత్తత్రాదృతో భవేత్.
(మను. 7-149, 150)
(రాజితరులతో రాజకీయముల నాలోచించునపుడు స్త్రీలను, మ్లేచ్ఛులను, రోగులను, వికలాంగులను బయటకు పారద్రోలవలెను. ఏలన: వీరవమానితులై యా యాలోచనలు బయట పెట్టెదరు. ముఖ్యముగ స్త్రీలను, తిర్యగ్యోనులను బయటకు పంపివేయుటలో శ్రద్ధ బూనవలెను.)
స్త్రీలకిట్టి నైతిక స్థైర్యము లేకపోవుటచేతనే వారు న్యాయస్థానములలో సాక్షులుగ నుండుటకు గూడ నర్హులుగారు.
ఏకోలుబ్ధస్తు సాక్షీస్యాద్బహ్వ్యశ్శుచ్యో పినస్త్రియః
స్త్రీబుద్ధే రస్థిరత్వాత్తుదో షైశ్చాన్యేపియేవృతాః
(మను. 8-77)
(శుద్ధవర్తనముగల యనేక స్త్రీలకంటె లుబ్ధుడైన యొకపురుషుడైనను సాక్షిగనుండుట కెక్కుడుగ నర్హుడు. స్త్రీలబుద్ధి యస్థిరమైనదగుటచే వారును దోషయుక్తులగు పురుషులును సాక్ష్యమున కనర్హులు)
స్త్రీ లనృత స్వరూపిణులని కూడ చెప్పబడినది.
స్త్రియోనృతమితిస్థితిః
- (మను. 9-17) ద్రోహభావంకుచర్యాం చస్త్రీభ్యో మనురకల్పయత్
- (మను. 9-17)
- (మను. 9-17) ద్రోహభావంకుచర్యాం చస్త్రీభ్యో మనురకల్పయత్
(ద్రోహభావమును, చెడ్డపనులను మనువు స్త్రీలకొఱకు కల్పించెను.)
కాని స్త్రీల విషయములో మాత్రము స్త్రీలే సాక్షులుగ నుండవలెను.
స్త్రీణాం సాక్షిణః స్త్రియః
- (యాజ్ఞ 2-30)
స్త్రీలు గృహమును కనిపెట్టుకొని యుండవలసిన వారగుటచే వారిని న్యాయస్థానములకు త్రిప్పుటవలన నష్టముండునను నూహ కూడ వారు సాక్షులుగ నుండుటకు తగరని చెప్పుట కొక కారణమై యుండవచ్చును. స్త్రీల యభియోగములను న్యాయాధికారి త్వరలో పరిష్కరింప వలెననుటకు కూడ నిదియే కారణము కావచ్చును.
ధేన్వనడుత్ స్త్రీ ప్రజనన సయుక్తేన
- (గౌ. 13-29)
(ఆవులు, ఎద్దులు, స్త్రీలు, పిల్లలు-వీరితో కూడిన యభియోగములను త్వరలో పరిష్కరింపవలెను.)
బాహ్యప్రపంచముతో కొంచెము సంబంధ మున్నను మొత్తముమీద స్త్రీకి గృహమే ముఖ్యస్థానమనుట స్పష్టము. బాహ్యప్రపంచములోని కెన్నడును రాక కేవలము గృహము లోపలనే యుండు స్త్రీలు కొంద ఱుండిరి. అట్టివారు ముఖ్యముగ ధనికులై యుందురు. అంతఃపురముల ప్రశంసస్మృతులలో కొన్నిచోట్లవచ్చును.
అంతఃపురప్రచారం చ
- (మను. 7-153)
(రాజు చారులవలన నంతఃపురములోని యంశములను గూడ తెలిసికొనవలెను.)
పైన వివరింపబడినట్లు స్త్రీలు గృహముకొఱకే పుట్టి యుండుటచేతను బాహ్య ప్రపంచములో పనిచేయుటకు వారనర్హలు కావునను సమస్త విషయములలోను వారు భర్తననుసరింపవలసినవారే యగుటచేతను వారికి విద్య యక్కరలేదనియే స్మృతికారు లభిప్రాయపడిరి. బాలునకు వేదము చదువుటయను విధియుండగా బాలిక కట్టివిధి లేకపోవుటయే కాక యామెకు భర్తృశుశ్రూషయే గురుకుల వాసము గృహకృత్యమే యగ్ని కార్యమునని చెప్పబడినట్లు చూచియున్నాము. వారికి సక్రమమైన విద్య లేదేకాని విజ్ఞానము లేక పోలేదు. పారంపర్యముగ వచ్చుచుండు ననేకాచారములును ధర్మములును, పురుషులెఱుగని వానిని కూడ, స్త్రీ లెఱుగుదురని యాపస్తంబుడు చెప్పుచున్నాడు. ఆతడు ధర్మములను చెప్పి చెప్పి తుదకా ధర్మశాస్త్రము పూర్ణముకాదనియు స్త్రీల యందును శూద్రుల యందును కొంత విద్య యున్నదనియు నుడివినాడు. సానిష్ఠా విద్యాస్త్రీషు శూద్రేషుచ
- (ఆ.ధ.సూ.2-29-11)
ఆవిద్య యాధర్వణ వేదముయొక్క శేషమని చెప్పుదురట.
ఆథర్వణస్య వేదస్య శేషఇత్యుపదిశంతి
- (ఆ.ధ.సూ. 2-29-11)
కావున
స్త్రీభ్యస్సర్వవర్ణేభ్యశ్చ ధర్మశేషాన్ ప్రతీయా
దిత్యేక ఇత్యేవే
(ఆ.ధ.సూ. 2-29-15)
సమస్తవర్ణ స్త్రీలనుండియు మిగిలిన ధర్మములను తెలిసి కొనవలెనని కొందఱు చెప్పుచున్నారు.
కొన్ని కర్మలను కూడ స్త్రీలనుండి తెలిసికొనవలెను. ఆపస్తంబుడు గృహసూత్రములో వివాహసంస్కారమును వర్ణించుచు తాను చెప్పుదానినే కాక స్త్రీలుచెప్పు మఱికొన్నిటిని గూడ చేయవలెనని యాదేశించుచున్నాడు.
ఆవృతశ్చాస్త్రీభ్యః ప్రతీయేరన్
- (ఆ.గృ.సూ. 1-2-15)
(వివాహసంబంధములైన కర్మలను స్త్రీలనుండి తెలిసికొని చేయవలెను.)
ఇచట 'కర్మ'లనగా గృహసూత్రములో చెప్పబడిని యంకురారోవణము మున్నగు నమంత్రక కర్మలును, నాకబలి మున్నగు నమంత్రక కర్మలును నని వ్యాఖ్యాతలు చెప్పుచున్నారు.
భార్య మున్నగువారు మరణించునపుడు చేయవలసిన కర్మకలాపమును వివరించుచు నాపస్తంబు డిట్లు చెప్పుచున్నాడు.
తత్ప్రత్యయముదక ముత్సిచ్యాప్రతీక్షాగ్రామ
మేత్యయత్ స్త్రియ ఆహుస్తత్కుర్వన్తి
(ఆ.ధ.సూ. 2-15-19)
(ఈ యుదకము తమకే విడువబడినదని నమ్మకము గల్గు విధమున నుదకదానము చేసి వెనుకకు చూడకుండ గ్రామములోనికి వచ్చి స్త్రీ లేదిచెప్పిన దానిని చేయవలెను.)
ప్రస్తుత మలభ్యములై యున్న శ్రుతిస్మృతులలోని ధర్మములను కొన్నిటిని స్త్రీసంఘ ముపదేశింపగలదని యీ విధముగ తేలుచున్నది. ఇంతేకాక శ్రుతిస్మృతులలో స్త్రీల కొఱకై చెప్పబడిన ధర్మములనైనను వారెఱిగియుండవలెను. కాన పురుషులవలె కాకపోయినను స్త్రీలేదో యొక విధమున విద్య నార్జించుచుండెడివారని చెప్పవలసి యున్నది.
స్మృతులలో స్త్రీల కళాశిల్పవిషయిక ప్రవేశ మొకింత గోచరించుచున్నది. నృత్యగానములలో స్త్రీలకు ప్రవేశముండెననియు వారిలో కొందఱీ నృత్యగానములను పురుషులతో గలసి చేసెడివారనియు నూహించుటకు మనుస్మృతిలోని రజస్వలతో నృత్యగానములను సలుపరాదను నిషేధమే యాధారముగ నున్నది.
ననృత్యేదధవాగాయయేత్
- (మను.8-64)
స్త్రీల ప్రకృతిపట్ల స్మృతికారులకు గల యభిప్రాయముల ననుసరించియే స్త్రీల వృత్తులను వారు నిర్ణయించినట్లు కన్పట్టును.
శయ్యాసన మలంకారం కామంక్రోధమనార్జవం'
- (మను. 9-17)
(శయ్య, ఆసనము, అలంకారము, కామము, క్రోధము, వక్రవర్తనము.)
ఇవి స్త్రీలకుగల కొన్ని ముఖ్యలక్షణములుగ చెప్పబడినవి. కావుననే వారికి లోకములోని యున్నతకార్యములతో నేమియు సంబంధము కల్పింపబడక గృహనిర్వహణధర్మమే విధింపబడినది. అదియైనను పురుషుని యాధిపత్యమునకు లోనయియే యున్నది.
- _______