సూక్తి ముక్తావళి (పద్య కవిత)

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సూక్తి ముక్తావళి (పద్య కవిత)

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి


1. శ్రీ యటంచు మొదట వ్రాయుదురెందరో

గద్యరచనయందు పద్యమందు

కాని కవికి సిరులు కలుగుటే అరుదురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


2. కవితవ్రాయువారు భువిని కోకొల్లలు

వ్రాయుచుందురెపుడు రాశి కొలది

రమ్యమైన కవిత రాశికన్నను మిన్న

శాస్త్రిమాట నేటి జగతిబాట


3. భాషవచ్చినంత పండితుడేగాడు

మాట ఇచ్చినంత మంత్రి గాదు

ముష్టిఎత్తువాడు ముక్కంటిగాడురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


4. అప్పు అడుగువేళ గొప్పగా పొగడును

అప్పు పుచ్చుకొనగ అతని మరచు

అప్పుతీర్చమన్న అధముడేయగునురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


5. కట్నమీయమన్న కర్కశుడందురు

కట్నము వలదన్న కల్మషుండు

కష్టపడుచునైన కట్నమే యిచ్చురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


6. ఉవిదమగనితోడ వుద్యోగమునుచేయు

యింటిపనులుచేయు వంట చేయు

నాడునేడుకూడ ఆడబ్రతుకిదియేర

శాస్త్రిమాట నేటి జగతిబాట


7. అన్నదానమీయ అట్టెకరిగిపోవు

ధనముదానమీయ తరగిపోవు

విద్యదానమొకటె వికసించు నెప్పుడు

శాస్త్రిమాట నేటి జగతిబాట


8. కాలు బయట పెట్ట కావలె నెప్పుడు

రాజకీయమందు రక్షణంబు

నిత్యశంకితంబు నేతల బ్రతుకురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


9. కులము మతములనెడి కుత్సిత భావాలు

ఐకమత్యమునకు అడ్డుకావె?

మమతలేని మతము మనుజులకేలరా

శాస్త్రిమాట నేటి జగతిబాట


10. చవటవాని తెచ్చి సన్మాన మొనరింప

బుద్ధిశాలి యగునె మొద్దుగాక?

కాకి హంస యగునె కలరుకోటింగీయ

శాస్త్రిమాట నేటి జగతి బాట


11. ముసలివారలంచు విసవిస పడనేల

వృద్ధ వసతులందు వేయునేల?

ఆదరణకొరకు అర్రులుజాచరె?

శాస్త్రిమాట నేటి జగతిబాట


12. సెక్సు విద్యకూడ చెప్పవలయునంచు

వుబుసుపోక లేచె వుద్యమంబు

పాఠశాల అపుడు వ్యభిచారశాలరా

శాస్త్రిమాట నేటి జగతిబాట


13. ఓటుకొరకు వచ్చు ఒకసారి పదవిలో

ఓటువేయ ముఖము చాటుచేయు

ఓట్లు తనకు, మనకు పాట్లే మిగుల్చురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


14. సిల్కులాల్చి, పంచె, సేవకు శిష్యులు

ఫష్టు ఏసి మరియు బెష్టు వసతి

సౌఖ్యమొందువారు స్వాములీనాడురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


15. మూగజీవి యంచు ముంగిట కట్టిన

పశువు గడ్డిమేసి పాలనిచ్చు

పాలుత్రాగి మనిషి పశువునే చంపురా

శాస్త్రిమాట నేటి జగతిబాట


16. ఇంట బయటకూడ ఇంగ్లీషు మాట్లాడు

తెలుగు వచ్చికూడ తెగులు వలన

దేశభాషలందు తెలుగు లెస్సాయెరా (less)

శాస్త్రిమాట నేటి జగతి బాట


17. తెలుగు పలుకునింట అలవాటు గావింప

పిల్లలకది యబ్బు నెల్లవేళ

ఇంటిలోనకూడ ఇంగ్లీషుభాషేన?

శాస్త్రిమాట నేటి జగతి బాట


18. తేటనెనుగు నుడికి సాటిలేదిలలోన

ఎట్టిభాషలందు యెంచిచూడ

తెనుగు పదమునందు తేనెయే చిందురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


19. సీసపద్యమందు సింగారమొలికించు

తేటగీతియందు తేనెలొలులు

ఆటవెలది రాజహంసలానడుచురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


20. అంద మొప్పుచుండు కంద పద్యంబున

జాతివృత్తమటుల చాలగలవు

ఛందొబద్ధ కవిత సాహిత్య సామ్రాట్టు

శాస్త్రిమాట నేటి జగతి బాట


21. ఆంగ్లనవలనేడు ఆరాధ్యమయ్యెను

తెలుగునవల వ్రాయు తెరవునందు

సరస గ్రంధ చోర సాహిత్యమహిమరా

శాస్త్రిమాట నేటి జగతి బాట


22. దూరదేసమేగి దొరలాగ బ్రతికినా

వేషభాషలందు బేధమున్న

మాతృభాషనెపుడు మరచిఫోరాదురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


23. తెలుగుభాషలోన కలవు ప్రక్రియలెన్నొ

ఎవరికిష్టమేదొ ఎంచుకొంద్రు

దానిపైన ఏల తగవు విమర్శనల్

శాస్త్రిమాట నేటి జగతి బాట


24.మీడియాలొ మహిళ యాడులో కనుపించు

అర్ధనగ్నదేహ హాసలీల

వనిత బ్రతుకు తుదకు వ్యాపార మాయెరా

శాస్త్రిమాట నేటి జగతి బాట


25. మొదటిచూపులోన మోహమేజనియించు

ప్రేమ యంచు పెద్ద పేరుపెట్టు

పెళ్ళియాడి పిదప విడిపోవజూచురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


26. పెళ్ళిగాకముందు పెరవారిరువురూను

తాళికట్టగానె దగ్గరైరి

మమత పెంచుకొంచు మసలగా వలయురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


27. పూలు కుంకుమయు పొలతికి సహజంబు

పెళ్ళిగాకముందె పెట్టుకొనదె?

పతిగతించ వాటి వర్జింపనేలరా

శాస్త్రిమాట నేటి జగతి బాట


28. నూరబద్ధములతొ నొక జంటకలుపగా

సాయపడుట యెంతొ న్యాయమగును

కాపురములుగూల్చు కల్లలాడ తగునె

శాస్త్రిమాట నేటి జగతి బాట


29. ఆలితోడ సినిమహాలుకు వెళ్ళును

పక్కనున్న పడతివంకజూచు

భార్యనటుల జూచువారిపై అరచురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


30. సంతుకలుగ కలుగు సంబరమును మించి

మనుమలుద్భవించ యినుముడించు

అసలుకన్న వడ్డి సిసలైన ముద్దురా

శాస్త్రిమాట నేటి జగతి బాట


31. శ్రీగణేశుపూజ చేతురు ముందుగా

విఘ్నమేమిలేక విజయమొంద

మంచిపనులనెపుడు మన్నించు గణపతి

శాస్త్రిమాట నేటిజగతి బాట


32. నెలకు జీతమెపుడు నిశ్చయముగ వచ్చు

శ్రధ్ధపట్టి పనులు చేయనేల

అనుచు బద్ధకించ అది ద్రోహమేకద

శాస్త్రిమాట నేటిజగతి బాట


33. రైలుకన్న మరియు రాకెట్టుకన్నను

గాలికన్న పోవు నీలివార్త

దానివేగ మెంచ తరముకాదెవరికి

శాస్త్రిమాట నేటిజగతి బాట


34. కుంటివారుగాని గుడ్డివారుగాని

అంగలోపమంచు బెంగ ఏల?

అభ్యసించ పనులు అలవాటె యగునురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


35. చిమ్మచీకటొక్క చిరుదీపకాంతిలో

మాయమగును అట్లె మంచిసూక్తి

మాపుమనసులోని మాలిన్య భావాలు

శాస్త్రిమాట నేటిజగతి బాట


36. చదువుకున్నవాడు సర్వఙ్ఞుడేయగు

చదువు కొనిన గాని చదువురాద?

విద్యనమ్ముకొన్న విలువేమి యుండురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


37. గద్దెకొరకు యెట్టిఘాతుకమైనను

సలుపటదియె నెపుడు సహజమయ్యె

రాజకీయమందు రౌడిజం హెచ్చురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


38. సభలలోన మంత్రి సర్వదా ప్రజలకు

సేవకుడనటంచు చెప్పుచుండు

తనను కలవబోవ దర్శనమీయడు

శాస్త్రిమాట నేటిజగతి బాట


39. పిసినిగొట్టువాడు పేరాశగలవాడు

అనుభవించకుండ ఆస్థిదాచ

తనయనంతరమది దాయాదిపాల్గాదె

శాస్త్రిమాట నేటిజగతి బాట


40. రాజసింహమౌర రాచరికమునందు

వీరసింహమౌర పోరునందు

గ్రామసింహ మింట గళమెత్తలేడురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


41. నిత్యజీవితమున నెలకొనె భీతియు

ఇల్లు వదలి బయటకేగువాడు

తిరిగి ఇల్లు చేరు తెరవె సంశయమురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


42. పాదచారి కాలిబాటపై నడవడు

వాహనములు పోవు బాటవెంట

పరగ రోడ్డురూల్సు పాటించు వారేరి

శాస్త్రిమాట నేటిజగతి బాట


43. మావటీడు చెంత మత్తగజంబైన

అణగి మణగియుండు అంకుశముకు

తెలివిముందు కండబలమెట్లు నిల్చురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


44. బిచ్చగానివోలె వేషంబు వేయును

నటనలోనకీర్తి నందుకొనును

ముష్టివాని జూచి ముఖము చిట్లించురా

శాస్త్రిమాట నేటిజగతి బాట


45. మనిషి జన్మ ఎంతొ మహనీయమైనది

మంచి గుణముతోడ మసలవలెను

దైవదత్త మిదియె ధన్యతనొందరా

శాస్త్రిమాట నేటి జగతి బాట


(సశేషం)