సుకవి మనోరంజనము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

సుకవి మనోరంజనము

పంచమాశ్వాసము

శ్రీ భారతీశ సన్నుత
భా భాద్బహునామ లింగ పంచపృషత్క
ప్రాభవ తూలాసహచ
క్షూ భవదగ్ని స్ఫులింగః కుక్కుటలింగా![1]

1

(అవధరింపుము) అప్పకవిగారి ఆక్షేపణలు—

[2]మహాకవి ప్రయోగములు గల యతిప్రాసములు కొన్ని కొట్టివేయడమున్ను, కొన్ని దిద్దడమున్ను, ఒకటియు మహాకవి ప్రయోగములు లేని యతిప్రాసములు నిలుపుటయు (మొదలగునవి అప్పకవిగారు చేసినవి వివరముగా వ్రాసినాము. ఇవి యిట్లుండగా-)

'డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయె'

అను అథర్వణ కారికను తెనిగించిన ముద్దరాజు రామన్నగారి నాక్షేపించి, పయ్యెద - ఉయ్యెల- తాయెతులకు యకారమున కేత్వము లేదనుటయు, ఒకపదముంటే అర్థము కుదురదని (మరి) యొకపదముగా నిర్ణయించి పొసగని లక్ష్యములు వ్రాసుటయు- ఈ మొదలైనవి (అప్పకవిగారి వ్రాతలు) అనేకములు గలవు.2
అందులకేమి (గాని), సంస్కృతాంధ్రవిద్వత్కవిరాజశేఖరుడు, రెండవ వాగనుశాసనుడు, రెండవ శ్రీనాథుడున్ను నైన శ్రీనాథుడుగారిని (అప్పకవిగా రాక్షేపించినారు ) ఆక్షేపించిన చోటు— 3

"నిత్య మనుత్తమ పురుష క్రియాస్వితః"

అను సూత్రమునకు వ్రాసిన గ్రంథ(ఘట్ట)ము. (ఆగ్రంథమిది) కూకునూరి అప్పకవిగారి ఆంధ్రశబ్దచింతామణి—
గీ

వసుధ నుత్తమ పురుషైకవచనమునను
దక్క భూతక్రియాపదాంతములఁ గల్గు
నిత్తులకు మీఁద నచ్చులు హత్తునపుడు
నిత్యముగ సంధులు ఘటించు దైత్యదమన. (5-61)

4


గీ.

పుడమి సూత్రోక్త ముత్తమ పురుష మనుచు
తత్పురుష మెల్లఁ గొనరాదు తద్భహూక్తి
మున్ను తిఙ్మధ్యములతోడ నెన్నుకతన
నిత్యముగఁ బ్రాణిసంధి దానికి ఘటించు. (5-62)

5


గీ.

వనిని దీవించిరట మునీశ్వరులు నిన్ను
రవిజు నేలితివట నీవు రామచంద్ర
మీరు గట్టితిరట కపులార జలధి
వింటి మీవార్త మేమన వెలయు నిట్లు. (5-63)

6


క.

విరచించెను శ్రీనాథుఁడు
ధరణిని శృంగారనైషధంబునఁ 'గూర్చుం
డిరి యెండొరు' లని కానుక,
పరపురుష క్రియలఁ బ్రకృతి భావము గలదే. (5-64)

7
‘నైషధంబునఁ 'గూడిరి' మీఁద విసంధిగా శ్రీనాథుడు చెప్పిన పద్యము (3-78)—
మ.

బలభిద్వహ్ని పరేతరాజు వరుణుల్ పర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుం గదిసి యర్థిం దత్ప్రదేశంబునన్
నలనాలీక మృణాలనాల లతికా నవ్యప్రణాలీ మిల
ల్లలనాలాప కథాసుధానుభవ లీలాలోక చేతస్కులై.

8
ఇటువంటి నిరుపమానపద్యము నాక్షేపించుటకు (అప్పకవిగారికి) నోరెట్లు వచ్చెనో, తెలియదు. ఇందుకు సమాధాన మిప్పుడే వ్రాసుతాము, గాని- 'ఇత్తులకు మీఁద' అని ఇట్టి వచియింపరాని గ్రామ్యపద మెటుల ప్రయోగించిరో! చెవులు, కనులు, బుగ్గలు, పండ్లు, చండ్లు, బొడ్లు, ముడ్డి, కాళ్లు— అనరాదు. వీనికి (వరుసగా) వీనులు, కన్నుదోయి, చెక్కులు, పలువరుస, నిక్కు చన్నుగవ, పొక్కిలి, పిఱుదు, చొక్కంపుటడుగులు— అనవలసిన' దని చెప్పిరే! ఇందులో చెవులు, కనులు, కాళ్లు- ఈ పదములు సాధారణముగా మహాకవులు ప్రయోగించినారు. బుగ్గలు మొదలైన మిగిలిన పదములైనా, తాము ప్రయోగించిన యవాచ్యపదమువలె నత్యంతనిందితములు గావు.9
గీ.పా.

కంపు తూపులుగల వన్నెకానిఁ గాంచె (2-82)

అని తాము పూర్ణబిందులకు చెప్పిన పద్యము (నందు 'కంపు') దుర్వాసనకు ప్రసిద్ధిగాని, పరిమలముకు ఎవ్వరు నొప్పలేదు. ఇది యెందుకు ప్రయోగించిరో! (ఇక)— 10

'నిత్య మనుత్తమ పురుష క్రియాస్వితః'.

నిత్యగ్రహణం వానువృత్తి నివృత్యర్థమ్. ఉత్తమ పురుష వ్యతిరిక్తక్రియాంత గత స్యేకార స్యాచా సహ నిత్యం సంధి స్స్యాత్. 'రాముని నుతించి రమరులు; చేసితి వచ్యుతపూజ; కంటి వతనిరూపము'— ఇత్యాద్యుదాహరణమ్. ఉత్తమ పురుషే తు

'ప్రాయస్తు స్యాత్ కిమాదిక స్యేత'

ఇతి వక్ష్యమాణః ప్రాయస్సంధిః. “చేసితి నచ్యుతార్చనము' ఇత్యాది. వికృత వివేక కారస్తు —

'ప్రథమే చోత్తిమే చైవ, క్రియేతో వా భవేత్ చ్యుతిః
నిత్య మన్యస్య వికృతౌ, క్త్వార్థేతో న భవేత్ సదా'

ఇతి ప్రథమ పురుషేపి సంధే ర్వికల్ప మాహ. అత ఏవ—

'బలభి ద్వహ్ని పరేతరాజ వరుణుల్ పర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుం గదిసి...

‘సిద్ధిఁగాంచిరి యవిముక్త సీమయందు...”
ఇత్యాదయః శ్రీనాథాది ప్రయోగాః సంగచ్ఛంతే, కాకునూ ర్యప్పకవిస్తు
ఏతర్గ్రంథ సంపాదన వైధుర్యేణ శ్రీనాథస్య భ్రాంతత్వ మాహ"

(కవిశిరోభూషణము. పు. 231)

అని (అహోబల పండితులవారు) అప్పకవిగారి నాక్షేపించినారు కాని, 'సిద్ధిఁ గాంచిరి...' అన్నదిన్ని శ్రీనాథునిగారి ప్రయోగమే గాన, '... ఇత్యాదయః శ్రీనాథాది ప్రయోగాః...' అనుట బాగులేదు. అప్పకవిగారు ఆక్షేపించినవారి ప్రయోగము లక్ష్యముగాదు. ఉపనిషత్తులు కన్నను నన్నయభట్టుగారి కారిక లప్పకవిగారికి ముఖ్యము. స్మార్తునికి హరిహరులందు సమబుద్ధివలె (అహోబల పండితుల వారికి) నన్నయభట్టుగారి కారికలు, అథర్వణాచార్యుల వారి కారికలు సమము గాన, (వారు) రెండింటిని గూడగట్టుకువచ్చినారు. 11
ఆధునికులున్ను అహోబల పండితులవారి మతము ననుసరించి వ్రాసిన గ్రంథము—12
"అనుత్తమ పురుషక్రియాసు= ఉత్తమ పురుష వ్యతిరిక్త క్రియా పదములందు, ఇతః = ఇకారముకు, అచి = అచ్చు పరమగు చుండగా, సంధిః = సంధి, నిత్యం = నిత్యముగాను, స్యాత్ = అగును. అనగా మధ్యమ పురుషంబునం దికారమునకు సంధి నిత్యముగా వచ్చునని తాత్పర్యము. ఉదాహరణము– సేవించితి వచ్యుతుని; సేవించితి వచ్యుతుని. ప్రధమోత్తమ పురుషంబులు కిమాదికములో చేరినవి గావున వానికి సంధి వైకల్పికంబని యెఱుఁగునది. ఉదాహరణము– వచ్చి రమరులు; వచ్చిరి యమరులు; వచ్చితి నిపుడు; వచ్చితి మిపుడు, వచ్చితిమి యిపుడు. ద్రుతాంతంబులైన టి, డి వర్ణకాంతంబులకు రాదు. వింటి నపుడు; తింటి నన్నము; పోషించెడి నచ్యుతుడు, ఇత్యాదులు.
కారిక.

ప్రథమే చోత్తమే చైవ, కియేతో వా భవేత్ చ్యుతిః
నిత్య మన్యస్య వికృతౌ, క్త్వార్థేతో న భవేత్సదా.

అనుట వలన ప్రథమ పురుషముకు సంధి వైకల్పికము” 13
ఇక, బాలసరస్వతిగారి వ్యాఖ్య—
'అనుత్తమ పురుష = ఉత్తమ పురుష వ్యతిరిక్తమైన, క్రియాసు = క్రియలందలి,ఇతః = ఇకారమునకు, నిత్యం = నిత్యముగాను సంధి గద్దు చెల్లి రసురులు; ప్రోచి రమరులు; చేసితి వచ్యుతుని పూజ; ఉత్తమ పురుషకైతే– కొలిచితి నంబను, విడిచితి మన్యులను. అన్నది కిమాదికము గనుక క్రియాగ్రహణాన నంటలేదు."
అని యెవరి మతానుసారము నాయాయి ప్రకారములు వ్రాసినారు.14
సూత్రార్థము పరిశీలించితే ప్రథమ, మధ్యమ పురుషములకు సంధి నిత్య మనిన్ని, ఉత్తమ పురుషకు వికల్ప మనిన్ని కనుపించుచున్నది. ఈలాగు వ్రాయక సూత్రమందు లేని యర్థమును సామరస్యము కొఱకు వ్రాసినంత మాత్రమున నేమి వినియోగము!15
అప్పకవి లాక్షణికచక్రవర్తి గారు (మహాకవి ప్రయోగముల)నేమి పరిశీలించిరో!16
ఉద్యోగ పర్వము (3-36)
మ.

గురు భీష్మాదులు సూచుచుండ సభ మీకుం గీడు నా డట్లు ము
ష్కరులై చేసిరి యంత చేసియును బశ్చాత్తాపముం బొందనో
పరు వా రెన్నఁడు నట్టిచోటఁ గృపయుం బంధుత్వముందక్కు మె
వ్వరు గోపింపరె యాదురాత్ముకుల గర్వ క్రౌర్యముల్ సూచినన్.

17
పారిజాతాపహరణము (5–47)
క.

విన నేర్చిరి బధిరులుగను
గొన నేర్చిరి యంధకులు లఘుత్వము మీఱన్
జన నేర్చిరి వికలాంగులు
యనిమిషతరు కుసుమ సౌరభావేశమునన్.

18
కవుల షష్ఠము
క.

మనుజులలో సత్కర్మం
బొనరుచువారెల్ల దండ్యులో వారలలోఁ
గనుఁగొనఁ గొందఱె దండ్యులొ
యనవుడు హరిభటుల కనిరి యప్పార్శ్వచరుల్.

19
రుక్మాంగదచరిత్రము (4–112)
ఉ.

కట్టిరి కొట్టి రీడ్చి రధికంబుగ నాగిరిగుండ్లు ఱొమ్మునం
బెట్టి రెసంగి ద్రోచిరి తపింపఁగ నెండల నిల్పి రంటఁగాఁ
జుట్టిన పచ్చడంబు వడిఁ జారఁగ ద్రోచిరి పట్టుకారులం
బట్టిరి యిట్లు పాపముల పాలుగఁ జేసిరి వీర లందరున్.

20
చేమకూరవారి సారంగధరచరిత్ర (1-48)
క.

'జోల ల్వాడిరి యమృతపు
జాలుం జోకొట్టఁ జాలు..............'

21
రామాభ్యుదయము (1-89)
ఉ.

కూడిరి యొండొరుల్ దొరసి కుంతలకాంతు లొసంగి వీడుజో
డాడిరి (క్రేళ్లు దాటెడు మదాళులతో వెలిదమ్మి ధూళి గో
రాడిరి కంతు దంతులను హస్తపుటంబుల వారి చల్లుఁ బో
రాడిరి యోలలాడిరి లతాంగులు రాగరసైకమగ్నులై)

22
మరియును (ప్రథమ పురుషమందు సంధి వికల్ప మగుటకు ప్రయోగములు బహులములు) గలవు. సోమయాజి, నందితిమ్మన్న, ప్రౌఢకవి మల్లన్న మొదలైనవారి నాక్షేపింపక శ్రీనాథుడు గారిని మాత్రమే 'కానక' ప్రయోగించెనని (అప్పకవిగారు) అనుట, తలంపగా–, విష్ణుతత్త్వ మించుకంతయు దెలియక విష్ణునింద సేయు వీరశైవుడొకడు, శివతత్త్వ మించుకంతయు దెలియక శివనింద సేయు వీరవైష్ణవు డొకడు– ఈ ఇద్దఱు మాత్రమే అతిసాహసికులు గలరు. అప్పకవ్యార్యుడు మూడవవా డుండె (ననిపించును.) 23
"సీ.

చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు.
             రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యౌవనమున
             శాలివాహన సప్తశతి నొడివితి
సంతరించితి నిండు జవ్వనంబున యందు
             హర్ష నైషధ కావ్య మాంధ్ర భాష

ప్రౌఢ నిర్భర వయః పరిపాకమునఁ గొని
             యాడితి భీమనాయకుని మహిమ
ప్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండ
కాశికాఖండ మను మహాగ్రంథ మేను
దెనుఁగు సేసెద కర్ణాటదేశకటక
పద్మ వనహేలి శ్రీనాథ భట్ట సుకవి

24
అని (కాశీఖండము 1-7) శ్రీనాథుడుగారు చెప్పుకొనినారు. హరవిలాసము మొదలైనవి మరియును రచించినారు. చిన్నతనము నుంచి నిరుపమానమైన యిన్నిప్రబంధములు చేసిన కవి (మరియొకడు) కనిపించడు. (అష్ట)దిగ్గజములందు ప్రసిద్ధుడైన రామరాజభూషణ కవి—
మ.

మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్ గుండలీంద్రుండు ద
న్మహనీయస్థితి మూలమై విలువ శ్రీనాథుండు బ్రోవన్ (మహా
మహులై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తిమయప్రపంచమున దత్రాగల్భ్య మూహించెదన్)

25
అని (వసుచరిత్ర 1-10 యందు శ్రీనాథుడుగారిని) వినుతించెను.26
శ్రీనాథునిగారి ప్రయోగములు విసంధికి మరియును గలవు.27
నైషధము (1-67)
ఉ.

ఱెప్పలు వ్రాల్ప కప్పుడమిఱేని మనోహరమూర్తి నిచ్చలుం
దప్పక చూచి చూచి ప్రమదల్ ప్రమదంబు లాత్మలం
జిప్పిలుచుండ నెద్ది పరిశీలన జేసిరి యట్టి యభభ్యాసం
బిప్పుడు వారు జూపుదు రపేత నిమేషములైన చూపులన్

28
'అభ్యసన' మని హ్రస్వము నున్నది.29
అందే (6–115)
ఉ.

లాలనఁ గ్రొత్త బెబ్బులి కలాసము వెట్టిరి యాసనంబుగా
గోలయు సాధువైన యొక కోమటికిన్ నిషధేంద్రు బచ్చుకున్

మేలపు మైవడిం దను సమీపపు ధూర్తులు తత్పురఃస్థలాం
గూలము యవ్వణిక్కునకుఁ గోళవిజృంభణ శంకజేయఁగన్.

30
(నాల్గవ చరణమున) ఉకారముకు సంధి వికల్పము.31
కాశీఖండము (3-282)
గీ.

చంద్రమౌలి భరద్వాజ సంయములును
హంసపదియను నొకకిన్నరాంగనయును
నా ప్రవాలోష్ఠి మగఁడు వేణీప్రియుండు
సిద్ధిఁ బొందిరి యవిముక్తసీమయందు.

32
అందే (2–38)
సీ. పా.

అందందఁ జేసిరి యభవు గేహమునకు
             ధన్యాత్ములుగఁ బ్రదక్షిణములు

33
(ఇక) మధ్యమ పురుషముకు విడియుండుటకు—
కవుల షష్ఠము
చ.

అదలిచి నిల్చి వారిం గని యంతక కింకరు లెవ్వరయ్య మీ
రిదె యమునాజ్ఞ ద్రోచితిరి యెచ్చటనుం డిటు వచ్చినార లె
య్యది గత మడ్డ పెట్టుటకు (నెవ్వరివార లెరుంగఁ జెప్పుఁడా
యదిఱి తనూజులో సురలొ యక్షులొ సిద్ధులొ కాక సాధ్యులో.

34
(ఇక) ఉత్తమపురుషముకు విడియుండుటకు—
ఆదిపర్వము (5-289)
క.

విలువిద్య నొరులు నీక
గ్గలముగ లేకుండ నిన్ను గఱుపుదు నని మున్
బలికితిరి నాకకాది
త్రిలోకముల నధికుఁ జూచితిమి యొక యొఱుకున్.

35
విరాటపర్వము (4-93)
క.

తలఁపగ రిపులకు నిమ్మగు
కొలఁది గడచి వచ్చితిమి యకుంఠితబాహా
బలము నెఱుపఁ దఱి యయ్యెన్
జలింప వలదింగ మనకు శత్రుల వలనన్.

36
హరిశ్చంద్రోపాఖ్యానము (4-28)
చ.

ధరణిప నేడు నెల్లియును దక్కువగా నెలనాళ్ళు నయ్యె నే
నరసితి లెక్కవెట్టితిని యాయము లేదొక వీసమైన నే
నెరవున నింక మా ఋణము వేగవె తీర్చెదుగాక, మిన్న కే
సురిగెదవో వివేకగుణశూన్యత బొంది యసత్యవాదియై.

37
క్లిష్టమై యుండుటకు—
అరణ్యపర్వము (6-99)
క.

జనపతి మేల్కని యంతయు
ననుజుం డెఱిఁగించి యిట్టు లను నబ్దముపై
నెనిమిది నెల లుండితి మి
వ్వనమునఁ దగు నింక నొండు వనమున కేగన్.

38
పారిజాతాపహరణము (5-41)
చ.

బలిదనుజేంద్రుఁ గట్టితని వల్కఁగ విందుముగాని నేడు మా
చెలి యిది పుష్పవాగురముచే నిను గట్టఁగఁ గంటి మింక నె
మ్మెలు పచరింపరా దనుచు మేలము లాడెడు సత్యబోంట్ల స
న్నల నెసఁ గొల్పుచున్ గెలవ నవ్విరి ధర్మజ భీమ ఫల్గునుల్.

39
మూడు పురుషములకు విడియుండుటకు (ఇట్లు) మహాకవి లక్ష్యము లనేకము లుండగా నప్పకవిగారు నిలువని సూత్రమున కర్థము పరిశీలించుటయు శ్రీనాథుడుగారి నాక్షేపించుటయు సర్వోత్కృష్టముగా నున్నది. 40
అప్పకవీయ మనే పేరు మాత్రమేకాని, గ్రంథము నెఱుగని కొందఱు పండితులు, నించుకంత గ్రంథ మెఱుంగుదురు గాని తదర్థ మెఱుగని కొందరు
పండితులను సుప్రసిద్ధమైన యప్పకవీయము నాక్షేపించినామని మము నందురు. అయితే, అప్పకవి స్వయముగ కల్పించినవిన్ని, కొన్ని దిద్దినవిన్ని, కొన్ని పొరపడినవిన్ని మహాకవి లక్ష్యములతో విశదపరచినాము గాని, అనంతునిని, ముద్దరాజు రామన్నను, శ్రీనాథాదుల నప్పకవి నిష్కారణ మాక్షేపించినట్టుల (మేము) ఎవరిని నాక్షేపించము. ఈ పామరులసడి రథ్యామృగాక్రందనము భద్రగజమున కెట్టిదో మాకు నట్టిది. 41
అమరవ్యాఖ్యాసుధ యందు భానోజీ దీక్షితులు గారు అమరవ్యాఖ్యాకారుల నందరి నాక్షేపించిరి. కోలచెల మల్లినాథ సూరిగారు మొదలైనవారు అదివరకు (ఇతరులు) రచించిన వ్యాఖ్యానాదులందు పొరపాటు లున్నచోటల నాక్షేపించినారు. ఆ లాగున వారు దిద్దక పోతే తప్పులే యొప్పు లవును. ఇప్పు డప్పకవి చెప్పిన తప్పులు పామరులకు గ్రాహ్యములైనవి కావు గనుకనా! మేము విశదపరచిన శంకాసమాధానములు సంస్కృతాంధ్రకవితాకలాధురంధరకలానిధి హృత్పమోదకరములు గాని కేవల బాలిశమానసోల్లాసకరములు గావు. కావున దేవానాంప్రియ ప్రియా ప్రియభాషణము లొక్కతీఱు.42
ఇన్ని తప్పు లప్పకవీయ మందుంటే నందఱు నెందుకు (దానిని) గొనియాడుదు రంటిరా? మొదట భూలోకములోనున్న గ్రంథముల పేరులన్నియును వ్రాసినందున (అప్పకవిగారు) ఇన్ని గ్రంథములు పరిశీలించినారనిన్ని; అలంకారముల పేరులు, రీతులు, వృత్తులు మొదలైనవాటి పేరులు, రసముల పేరులు వ్రాసినఁదున నిన్నియు విమర్శించినారనిన్ని పామరుల తాత్పర్యము. 'వేదములు నాలుగు అన్నంత మాత్రమున వేదములు చదివినవాడగునా!' ఈ గ్రంథమువలన నొక యలంకారము, ఒక రసము, ఒక రీతి మొదలగు కావ్యసామగ్రి తెలియవలసినవారి కించుకంతయు తెలియదు. తెలిసినవారల కీ పేరులతో నేమి పని యున్నది. గ్రంథముఖమున నున్న గ్రంథాదుల పేరులున్ను, ఆయన చెప్పించుకొన్న తన గ్రంథమహిమను చూచిన బాలిశులకు (అవియన్నియు) వారకామినీవేషభాషాదులవలె మోహకరములు.43
(అప్పకవిగారు చెప్పిన మరియొక అంశముగూర్చి ఇక్కడ వ్రాసుతున్నాము.)44
"గీ.

గ్రామ్యమైన నాంధ్రకవులు సంకేతిత
సుప్రసిద్ధమనుచు సూత్రమునను
గిలిమిఁ బూర్వకవులు కావ్యోక్తములు ప్రసి
ద్ధంబులైనఁ గూర్పఁ దలఁతు రెపుడు. (1-128)

45


వ.

అది యెట్లనినఁ, 'గనియె' ననవలసిన భూతార్థక్రియాపదైకవచనంబు నందు వర్ణలోపము చేసి 'కనె'నట యని గ్రామ్యపదముగా వాగనుశాసనులు
ప్రయోగించిరి గాన నది సాధకము చేసికొని యాంధ్రకవితాపితామహుడు 'కొనియె' ననుటకుఁ 'గొనె'నని చెప్పె, నవి యెవ్వియనిన—

46
ఆదిపర్వము (4-100) నందు
క.

వనకన్యక యట నే నట
వనమున గాంధర్వ మట వివాహం బట నం
దనుఁ గనెనట, మఱచితినట
వినఁ గూడునె యిట్టిభంగి విపరీతోక్తుల్.

47
ఆముక్తమాల్యద (1-4) నందు
ఉ.

పూని ముకుందు నాజ్ఞఁ కనుబొమ్మనె గాంచి యజాండభాండముల్
వాననుమీఁదఁబ్రోవ నడువంగొనె దన్నన నగ్రనిశ్చల
వ్యానచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతనల్
గా నుతికెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించెదన్."

48
అని వ్రాసినారు. మరి అహోబల పండితులవారు—

“చనెన్, వినెన్, కనెన్, ఇత్యాది క్రియాప్రయోగోపి ప్రబంధేషు వర్తతే.
'ఏదంతతాచ నామ్నా మన్యతరస్వామి యాంతానామ్'
ఇతిసూత్రం న ప్రవర్తతే నామ్నామితి నామమాత్ర స్యైవ
గ్రహణాత్ కింతు వికృతి వివేక సూత్రేణ తన్నిర్వాహః
'యస్వాద్దేశ్య క్రియాంతేయ భూతఏకత్వవాచకః ఇతి 'యః'
'ఇత్స్యాత్ భూతబహుత్వేతు, దేశ్యే తూభయతో భవేత్'
ఇతి ఎత్వమ్ చనియె, వినియె, కనియె-ఇత్యాది

'ఇయాంతాస్సాధవశ్శబ్దాః క్వచి దేదంతతాపివా' ఇతి వా ఎత్వయ్.
‘అచో౽చి కుత్రచిల్లోపో, బహులం స్వ్యాత్ప్రయోగతః
ఇతీకారలోపః చనె, వినె, కనె- ఇత్యాది

(క. శి. భూ.పు.188)


ఏవం స్థితే, మహాకవి ప్రయోగసిద్ధేః ప్రయోగవిధానత్వ కథనేన మహాకవి ప్రయోగ రూఢంచేత్ గ్రామ్యమపి ప్రయోగార్హ మిత్యాచార్య తాత్పర్యమితి బాలసరస్వత్యోక్షమ్. ఇదమేవ తాత్పర్యమభివర్ణ్య అప్పకవినాపి వినె, కనె, చనె- ఇత్యాదిశబ్దానాం గ్రామ్యత్వేపి మహాకవి ప్రయోగ రూఢత్వాత్సాధుత్వ ముక్తమ్ తన్న, చనె ఇత్యాది శబ్దానాం శాస్త్రరూఢత్వేన.'

(క శి. భూ. పు. 217)
అని ‘చనె, వినె' మొదలైనవి గ్రామ్యపదములు గావని స్పష్టముగా చెప్పినారు.49
గ్రామ్యపదములనగా — ఎక్కడ, ఏడ, అక్కడ, ఆడ-ఇటువంటిననిన్ని 'ఒరులఁ దెగడుచోట చెప్పవచ్చు' నని లాక్షణికులందఱి తాత్పర్యమున్ను. 'పాపడు ఏడ, కౌరవసేన ఏడ, ఒంటిసనుట ఏడ' అని విరాటపర్వమందు చెప్పినారు. 'కౌరవసేన యేడ' అనుచోట తిరస్కారము కనుపించదు. సరేకదా, 'ఒంటిసనుట యేడ' అనుటవలన నిక్కడ తిరస్కారమున్ను, మొదట స్తుతియు కనిపించుచున్నది. 50
విజయవిలాసమునందు 'భూజగ మేడ', మారుతాశనజగ మేడ -' ఇవి గ్రామ్యపదము లన్నారు. ఇక్కడనైనా నింద కనుపించదు. 'ఎంత ఘనసాహస మింతుల కంచు నెంచుచున్' అనుటవలన నాశ్చర్యము కనుపించుచున్నది.51
నూత్నదండిగారు 'వేదాలు, వాదాలు'- ఇటువంటివి గ్రామ్యము లన్నారు. మహాకవి ప్రయోగము లవియును గలవు. 52
మధ్యవర్ణలోపముగల పదములు గ్రామ్యములని సకలలాక్షణికుల తాత్పర్యము. చివర వర్ణలోప(మైన) పదముల గ్రామ్యములని యెవరు ననలేదు. అప్పకవి గారున్ను
గీ.

‘చులుకఁగా గ్రామ్యజనములు పలుకునట్టి
తెలుఁగుమాటలు గ్రామ్యంబు లనఁగ బరగు
వర్ణలోపంబు నొంది కావ్యములఁ జొరవు
పరులఁ దెగడెడుచోఁ నొప్పు పాలదొంగ' (1-128)

53

గీ.

అక్షరవిలోపమై యుండునట్టి పలుకు
గ్రామ్యమన నొప్పు నదె యపభ్రంశకంబు
ననఁగబడును నాకడ కాడ యనుచు మఱియు
నడుమనున్న కకారంబు నుడువకున్న (4-124)

54
అని చెప్పిరి. కనె, కొనె అనుచోట చివరివర్ణము పోయినది. చివర నువర్ణ లోపములుగల పదములున్ను గ్రామ్యము లనుకుంటే- (వనకన్యకయట...' యను) మొదటి పద్యమందు నాశ్చర్యము కనుపించుచున్నది. లేక, నిందయున్నదంటిరా ('పూని ముకుందు...' అను) రెండవ పద్యమందు నింద యెక్కడా కనుపించదు. మహాకవి ప్రయోగములు మరియును గలవు. 55
చేమకూరవారి విజయవిలాసము (అవ. 91)
చ.

నలువుగ నెన్ననైన రఘునాథ నృపాలుఁడు గల్గఁగా మహీ
స్థలి నఖిలైకధర్మములు తామరతంపరలై చెలంగఁ గొ
ల్లలుగ నశేషసజ్జనకులంబు సుఖంబు గనెన్ సమస్తవి
ద్యలఁ గసబెల్ల వాసి మెఱపై వెలకట్టి సభాంతరంబులన్.

56
శ్రీనాథుని కాశీఖండము (6-16)
గీ.

సవతి కద్రువ శేషతక్షకులు మొదలు
గాఁగ వేవురు భుజగపుంగవులఁ గాంచె
నండముల మూఁటిఁ గలధౌత గండశైల
సన్నిభంబులఁ గనెఁ బుణ్యసాధ్వి వినత.

57
రామాభ్యుదయము (3-114)
ఉ.

అంత సుమిత్రయుంగనె ననంతవిలాసుల ధర్మశాస్త్రసి
ద్ధాంతరహస్యకోవిదుల (నప్రతిమప్రతిభాప్రభావదు
ర్ధాంతుల శ్రీనిశాంతుల నుదగ్రగభీరిమచాతురీసర
స్వంతుల నిర్వురన్ విమతజైత్రులఁ బుత్త్రుల సచ్చరిత్రులన్).

58
శ్రీనాథుని భీమఖండము (5-112)
చ.

మగటిమి చంద్రగుడ్డురక మట్టిన వామపదాంబుజంబుపై
నిగలమునన్ సురాసురుల నించిన యందియ ఘల్లుఘల్లనం
బొగడలు బొండుమల్లియలు బొన్నలు పాగడ నొల్లియంబునన్
నిగిడిచి వీరభద్రుఁడు చనెన్ శశిమౌలి సమీపభూమికిన్.

59
హరవిలాసము (7-29)
మ.

(భసితోద్ధూళితనిర్మలావయవుఁడున్ బంచాక్షరీసంతతా
భ్యసవవ్యాప్తిపరాయణుండును శివధ్యానానుసంధాతయున్
మసృణస్నిగ్ధతరక్షుచర్మమయకంఠాభద్రపీఠుండునై)
అసమస్థేమకిరీటి పాశుపతదీక్షారంభముం గైకొనెన్.

60
జైమినీభారతము (1-104)
శా.

చేదోయి న్ముకుళించి వీడుకొనె నక్షీణప్రమోదంబునన్
వేదవ్యాసు ప్రసాదభాసురవచోవిన్యాసు సంహస్సము
త్సాదాభ్యాసు సుధీవిలాసు నుతవిద్యావాసుఁ బ్రజ్ఞాకలా
సాదజ్ఞానసముల్లసచ్ఛిదమృతాస్వాదాధికోల్లాసునిన్.

61
అందే (2–76)
ఉ.

భీముని జానుదేశముల భీషణవాయువు లుప్పతిల్లి సం
గ్రామతలంబున న్విసరఁగాఁ జతురంగసమస్తసైనిక
స్తోమము లభ్రమండలముతో నొరయం జనే బొందితోన సు
త్రాముని వీటి కేగెడు విధంబున దివ్యులు చోద్యమందఁగన్.

62
మరియును గలవు.
ఆంధ్రనామసంగ్రహము (మానవ 40) నందు
క.

కనియెం జూచెను కాంచెను
గనుగొనియెం గనె ననంగ గలయవి పేళ్లై
చను వీక్షించె ననుటకున్
(ఘనతరగోరాజగమన కాయజదమనా)

63
అందే (మానవ. 39)
గీ.

అనియె నుడివె వక్కాణించె నాడెఁ జెప్పె
వినిచె వాక్రుచ్చెఁ బలికెనాఁ జను వచించె
ననుట యాలించె నాలకించెను వినియెను
వినె ననంగ నొప్పు శ్రుతుఁడయ్యెననుట పేళ్లు.

64
అనియున్నది. మరియు-
పారిజాతాపహరణము (2-84)
క.

మురమధనుఁ డివ్విధంబున
గరుడనిపై గగనపథము గడచి యరుగుచున్
తరలాయతాక్షి కిట్లనె
సరసమధురవచనరచనచాతురి మెఱయన్.

65
అందే (1-20)
చ.

అల ఫణిభోగరత్నములు నాదిశిలోత్కటగంధగంధముల్
తలివునఁ బాఱ నవ్వు వసుధాసతి దా భుజకీర్తి మౌక్తిక
చ్చలమునఁ గృష్ణరాయ నృపచంద్రుని ప్రాపున... భూషణో
జ్జ్వలనమణుల్ మృగీమదము వాసనయుం గనె దూర్దలంగలన్.

66
ఇట్లు మహాకవి ప్రయోగముల, నిఘంటువుల గలవాటిని గ్రామ్యములని యెవరు ననలేదు. అప్పకవిగారు వ్రాసిన గ్రంథమువలన నన్నయభట్టుగారు, పెద్దనగారు నప్పకవి గారితో (స్వయముగా తమపొరబాటు) చెప్పినట్లు కన్పించుచున్నది! 67

నామాంతముల అమ అయాదుల విచారము

(ఇదిట్టుండగా తెలుగున మనుష్యుల పేర్ల చివర చేర్చబడు అమ్మ, అయ్య మొదలగువాటికి సంబంధించిన యంశములు కొన్ని గమనింపదగినవి వ్రాసుతాము.) 68
విరాటపర్వము (1-10)
సీ.

మజ్జనకుండు సన్మాన్య గౌతమగోత్ర
             మహితుండు భాస్కరమంత్రితనయుఁ
డన్నమాంబాపతి యనఘులు కేతన
             మల్లన సిద్ధనామాత్యవరులు
కూరిమి తమ్ముఁడు గుంటూరి విభుఁడు కొ
             మన దండనాథుండు మధురకీర్తి
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప
             విత్రశీలుఁడు సాంగవేదవేది
యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్లు
నస్మదీయప్రణామంబు లాచరించి
దుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి
యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు.

69
ఈ పద్యమందు-అన్నమాంబ, సిద్ధనామాత్యుడు, కొమ్మన దండనాథుడు- అని ప్రయోగింపబడినది. 70
అరణ్యపర్వము (7-469)
సీ.

భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు
             శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
సంతతధ్యానసంసక్తచిత్తుఁడు సూర
             నార్యునకును బోతమాంబికకును
నందనుం డిల పాకనాటిలో నీలకం
             ఠేశ్వరస్థానమై యెసకమెసఁగు
గుళ్లూరు నెలవున గుణగరిష్ఠత నొప్పు
             ధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ
డెఱ్ఱనార్యుఁడు సకలలోకైకవిధితుఁ
డైన నన్నయభట్టమహాకవీంద్రు
సరససారస్వతాంశప్రశస్తి తన్ను
జెందుటయు సాధుజనహర్షసిద్ధిఁ గోరి.

71
ఇందు-సూరనార్యుడు, పోతమాంబ, ఎఱ్ఱనార్యుడు-అను ప్రయోగము లున్నవి. 72
శ్రీనాథుని నైషధము (1-32)
సీ.

గౌతమగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ
             పరమసంయమి సూత్రపావనుండు
గారాపు పౌత్రుండు గంధవారణుఁ డగు
             శ్రీ కేతనామాత్య శేఖరునకు
పేషిణీహనుమంత బిరుదాంకుడగు...
             వారికి నెయ్యంపు వరసుతుండు
చేహత్తిమల్లుండు దోహత్తనారాయ
             ణుం డఖండియరాయచండ బిరుద
మంత్రి యల్లాడరాజను మహితపుణ్యుఁ
డన్నమాంబయుఁ దనకు నత్యంతగరిమఁ
దండ్రియును దల్లియిను గాఁగ...
తల్లమాంబికదేవి నుద్వాహమయ్యె.

73
అందే (1-33)
మ.

వనితారత్నము తల్లమాంబికకు శ్రీవత్సాంకతుల్యుండు పె
ద్దనకుఁ బుట్టిన నందనుల్ విమలవిద్యాభారతీవల్లభుల్
వినతాసూనసమానవిక్రమనిధుల్ వీరుండు వేమాహ్వయుం
డును శ్రీ ప్రెగ్గడ దండనాథతిలకుండున్ సింగనామాత్యుఁడున్.

74

ఈ పద్యములందు - కేతనామాత్యుడు, అన్నమాంబ, తల్లమాంబ,

సింగనామాత్యుడు-అను ప్రయోగము లున్నవి. మరియు 75
అందే (1-36)
మ.

తగు కైవార మొనర్ప విక్రమకళాధౌరేయతాశాలి శ్రీ
ప్రెగడన్నధ్వజినీశుఁ డంబునిధిగంభీరుండు శుంభద్ద్విష
న్నగరద్వారకవాటపాటనవిధానప్రౌఢబాహార్గళా
యుగళుం డాహవసస్యసాచి ధరలోనొక్కండు పేరుక్కునన్.

76
ఈ పద్యమఁదు ప్రెగడ - అన్న = ప్రెగడన్న అని స్పష్టముగా నున్నది.77
కొందఱు కోనయ-కోనయ్య, రామయ-రామయ్య, సింగన-సింగన్న, వెంకమ-వెంకమ్మ, - ఈ మొదలైనవి ఏకపదములేగాని, వాటిలో అయ, అయ్య, అన, అన్న; అమ, ఆమ్మ; అని పదవిభాగము లేదంటారు. ఆంధ్రగీర్వాణాదులందు నామధేయమొకటేగావున అమాత్య, మంత్రి, దండనాథులు పురుషులకున్ను; అంబాదులు స్త్రీలకున్ను చెల్లునవుడు మధ్యను తెలుగుపదములైన అయ, అయ్య మొదలైనవి ఉండరాదని వారి తాత్పర్యము, కావున రామయ్య, వెంకమ్మ మొదలైనవి ఏకపదములే (అని అంటారు ) 78
(మరి ఇదే సరి) అయితే ప్రభునామయతులందు (రామయ్య, వెంకమ్మ ఇత్యాదులలో) అచ్చులకు (యతి) చెల్లకపోవలెను. ప్రభునామయతులు ఉభయయతులని యుండగా; స్పష్టముగా 'ప్రెగడ దండనాథు' డని; 'ప్రెగడన్నదండనాథు' డని యొకనికే రెండు విధములుగా మహాకవి ప్రయోగము లుండగా విమర్శకులు చెప్పిన (పైమాట) నిలువదు. 79
ప్రబోధచంద్రోదయమునందు
సీ.

కలరు కౌశికగోత్ర కలశాంబురాశి మం
             దారంబు సంగీత నంది, నంది
సింగమంత్రికిఁ బుణ్యశీలయౌ పోచమ్మ
             కాత్మసంభవుఁడు మల్లయ మనీషి
యతని మేనల్లుఁ డంచితభరద్వాజ గ
             త్రారామచైత్రోదయంబు ఘంట
నాగధీమణికి ధన్యచరిత్ర యమ్మలాం
             బకుఁ గూర్మి తనయుఁడు మలయమారు
తాహ్వయుఁడు సింగనార్యుడు నమృతవాక్యు
లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్ధు
లుభయభాషల నేర్పరు.......
మర్థు లీ కృతిరాజు నిర్మాణమునకు.

80
ఇందు ‘మల్లయ మనీషి' యను చోట ప్రభునామయతి. 81
పారిజాతాపహరణము (5-108)
సీ.

కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ
             సూత్రుఁ డార్వేలపవిత్రకులుఁడు
నంది సింగామాత్యునకుఁ దిప్పమాంబకు
             తనయుండు సకలవిద్యావివేక
చతురుండు మలయమారుతకవీంద్రునకు మే
             నల్లుఁడు కృష్ణరాయక్షితీశ
కరుణాసమాలబ్ధఘనచతురంతయా
             నమహాగ్రహారసన్మానయుతుఁడు
తిమ్మనార్యుఁడు శివపరాధీన మతి, య
ఘోర శివగురు శిష్యుఁడు పారిజాత
హరణ కావ్యమును రచించె నాంధ్రభాష
నాదివాకరతారాసుధాకరముగ.

82
తిప్పమాంబ, తిమ్మనార్యుడు.
చాటుధార
క.

మాకొలది జానపదులకు
నీ కవితారీతి యబ్బునే కూపనట
ద్భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా!

83
చాటుధార
ఉ.

ఆరవి వీరభద్రచరణాహతిఁ బోయిన బోసినోటికిన్
నేరకపోయె, రామకవి నేరిచెఁబో మన ముక్కుతిమ్మన
క్రూరపదాహతిం బడిన కొక్కిరపంటికి దుప్పికొమ్ము, బ
ల్గా రచియించినాఁడు రవి గాననిచోఁ గవి కాంచునే కదా!

84
ఒక పద్యమందు 'అమ్మ' అని, రెండు పద్యములందు 'తిమ్మన' అని యున్నది. మరియును— 85
పారిజాతాపహరణము (1-14)
క.

ఆ నరస మహీమహిలా
జానికి కులసతులు పుణ్యచరితులు తిప్పాం
బా నాగాంబిక లిరువురు
దానవదమనునకు రమయు ధరయుం బోలెన్.

86
కవి ‘అమ’ శబ్దము లేకుండగా 'తిప్పాంబా' 'నాగాంబిక' యని ప్రయోగించినాడు. నాగాంబిక అని నామకరణమే అయితే ఆకవియే ఆనాగాంబికనే (ఈ క్రింది పద్యమున) 87
శా.

వీరశ్రీనరసింగ శౌరిపిదపన్ విశ్వక్షమామండలీ
ధౌరంధర్యమునన్ జగంబు ముదమొందిన్ నాగమాంబాసుతుం
డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్నసింహాసనం
బారోహించె విరోధు లాగహనశైలారోహముం జేయఁగన్. (పారి. 1-18)

89
'నాగమాంబ' అని ప్రయోగించెను. కవీశ్వరుల యిష్టముగాని మరేమియులేదు. 89
వసుచరిత్ర (1-85)
క.

ఆమనుజేంద్రునకుఁ బురం
ధ్రీమణి యగు తిమ్మమాంబ శ్రీరామునకున్
భూమిజ, సుత్రామునకు పు
లోమజయను బోలె జగతిలో నుతికెక్కెన్.

90
సోమనాథ శాస్త్రులవారు ఈ పద్యవ్యాఖ్య యందు 'తిమ్మమాంబ' అని ప్రయోగించి నందుకు (అది) కవి ఔద్ధత్యమని వ్రాసినారు. మహాకవి ప్రయోగములలో బహులముగా రెండువిధముల నుండిన 'తిమ్మమాంబా'ది ప్రయోగముల నహోబల పండితులవారు నిషేధించి నందున, వారి మతము ననుసరించే, 'తిమ్మమాంబ' అని ప్రయోగించరాదని సోమనాథ శాస్త్రులవారు కోపమును ప్రకటించినారు. ఈ వెఱ్ఱి ఆధునికులకున్ను కొందఱికి గలదు. అటువంటి సర్వోత్కృష్ట పండితులకే ఉండగా ఆధునికుల కుండుట వింతగాదు. (మరికొన్ని ప్రయోగములు వ్రాసుతాము.) 91
మనుచరిత్రము (1-31)
గీ.

ఆనృసింహప్రభుండు తిప్పాంబ వలన
నాగమాంబిక వలన నందనులఁ గనియె
వీర నరసింహరాయ భూవిభుని నచ్యు
తాంశసంభవుఁ గృష్ణరాయక్షితీంద్రు.

92
ఆముక్తమాల్యద (1-28)
క.

ఆ యీశ్వరనృపతికిఁ బు
ణ్యాయతమతియైన బుక్కమాంబకు తేజ
స్తోయజహితు లుదయించిరి
ధీయుతులగు నారసింహ తిమ్మనరేంద్రుల్.

93
రాఘవపాండవీయము (1-6)
సీ. పా.

ఏనృపోత్తముతల్లి మానితపరమసా
             ధ్వీగుణంబుల ప్రోడ తిమ్మమాంబ...

94
చేమకూరవారి విజయవిలాసము (అవ. 11)
గీ.

ఠీవి నచ్యుతరాయల దేవియైన
తిరుమలాంబకు దేవియై తేజరిల్లు
మూర్తమాంబను బెండ్లియై కీర్తివెలసి
చెవ్వవిభుఁడు మహోన్నతశ్రీ చెలంగె.

95
రుక్మాంగదచరిత్రము (1-1)
ఉ.

శ్రీమయపత్రముల్ జటలు చెల్వగు నభ్రంతరగింణీకణ
స్తోమము పుష్పముల్ ఫలము సోముడునై పొలుపొందు పార్వతీ
కోమలదేహవల్లి పెనఁగొన్న సమంచితదక్షవాటికా
భీమయ దేవకల్పక మభీష్టఫలంబులు మాకు నీవుతన్.

96
అందే (1–47)
క.

వామాంగ కలిత గౌరీ
భామా కుచకుంభ ఘుసృణ పంకవిలిప్త

శ్రీమహితోరస్థలునకు
భీమయదేవునకు శాతపృథుబాహునకున్.

97
దేవనామములకు అయ, అయ్య అని తఱుచులేవు. శంకరయ, శంకరయ్య ఇటువలెనే ప్రయోగములు గలవు. 98
రుక్మాంగదచరిత్ర (1−11)
క.

మనమున సేవింతును మ
జ్జనకుని శ్రీవత్సగోత్ర సాగరచంద్రున్
ఘను పోతయ మంత్రీశ్వరు
ననయంబును భక్తి నమ్మళాంబా ప్రియునిన్.

99
హరిశ్చంద్రోపాఖ్యానము (2-207)
స్రగ్విణి.

లింగమాంబ సుతా లేలిహానేశ పా
దాంగద ధ్యానలీనాత్మ (గాంగేయ గ
ర్భాంగనా నర్తకీ హారి జిహ్వస్థలీ
రంగ సారంగ దృగ్రాజి మీనధ్వజా)

100
భారతమందు, ఆంధ్ర పంచకమందు, పారిజాతాపహరణ, విజయవిలాసాది మహాప్రబంధములందే కాదు గీర్వాణకావ్యములందున్ను (ఇట్టి ప్రయోగములు గలవు. వ్రాసుతున్నాము.) 101
సాహిత్యరత్నాకరము
శా.

తస్మా త్పర్వతనాథసూరిజలధేః శ్రీయల్లమాంబావియ
ద్గంగా సంగజహేయి సద్గుణమణే ర్లబ్ధో యశశ్చంద్రవత్
సోయం ధర్మ సుదీర్గవాం విలసితైః కర్తుం రసాలక్రియా
సంపూర్తిం సముదంచయేయ మథునా సాహిత్యరత్నాకరమ్.

102


స్రగ్ధర.

ధర్మాంతర్వాణి వర్య స్త్రిభువనవిదితే
             వారణాస్యన్వవాయే
యస్సంజాతః పర్వతేశాచ్ఛుభగుణగణ భూ
             ర్యల్లమాంబా సుగర్భః

వ్యాఖ్యావిఖ్యాత కీర్తి ర్వివరణగురు వా
             క్సాంఖ్యముఖ్యాగమానాం
తస్యాలంకారశా స్త్రే రఘుపతిచరితే
             త్రిత్వసంఖ్యస్తరంగః

103


స్రగ్ధర.

ధర్మాంతర్వాణివర్య స్త్రిభువనవిదితే
             వారణాస్యన్వవాయే
సంజాతోయల్లమాంబాకృత సుకృత ఫలం
             పర్వతేశస్య భాగ్యమ్
కావ్యాలంకార కృష్ణాస్తుతి రవిశతకా
             న్నాటకాది ప్రణేయ
స్తస్యాలంకారశాస్త్రే రఘుపతిచరితే
             తుర్య ఉచ్చైస్తరంగః

104

మేము లక్ష్యములు వ్రాసిన గ్రంథము లన్నియును అహోబల పండితులవారు పరిశీలించిన వేను. కవిశిరోభూషణమందు.

'రామయప్రభుడు, రామయమంత్రి, కోనమాంబ ఇత్యాదయో నప్రయోగార్హాః రామప్రభుడు, రామమంత్రి, కోనాంబ ఇత్యాకారేణ ప్రయోగార్హాః. 'లక్కమాంబా కుమారే'తి ప్రయోగస్తు ప్రౌఢోక్తిమాత్రనిష్పన్న ఇతి జ్ఞేయః'

అని వ్రాసినారు. 'లక్కమాంబా కుమార' అన్నది ఎవరి ప్రయోగమో తెలియదు. వారు భారతాది (గ్రంథము లందలి) ప్రయోగము లేమనుకొనిరో తెలియదు, ఆయన నిషేధించిన ప్రయోగములే బహులముగా నున్నవి. నిలిపినదే విరలము. ధర్మాభట్టుగారు ' యల్లమాంబ' అని ఆద్యంతస్థము ప్రయోగించినారు. కావున యల్లయ్య, యఱ్ఱన్న— ఈ మొదలైన విన్ని యకారాదు లుండవచ్చుననే తోచుచున్నది. 105
శ్రీనాథుని కాశీఖండము (1-24)
గీ.

అతని యర్ధాంగలక్ష్మి శ్రీ యన్నమాంబ
కాంచెఁ దనయుల నర్థార్థికల్పతరుల

నల్లయాధీశు పెదకోటయన్నప్రోల
కువలయేశ దొడ్డయ పిన్నకోటవిభుల

106
'యన్నమాంబ' యకారాది కాకపోతే 'ఇకోయణచి' సూత్రము ప్రవర్తించవలెను. ఈపద్యమందు 'యన్నమాంబ' 'అల్లమాధీశ' (అను రెండు పదములు నున్నవి.) 107

దీర్ఘాంతపదముల హ్రస్వాంతత

మరియు నహోబల పండితులవారు

"దీర్ఘాణాం హ్రస్వస్స్యాత్"

యే దీర్ఘాంతాశ్శబ్దాః తేషాం హ్రస్వః స్యాత్. సోమపుడు, గ్రామణి, లక్ష్మి, రమ ఇత్యాది, నచదేశ్యపదే నచైక వర్ణేపి, దేశ్యపదస్య, ఏకవర్ణ సంస్కృతపదస్య హ్రస్వో న స్యాత్. నవలా, నేజా, లకోరీ. మత్తా. ఇత్యాదయః దేశ్యాః శ్రీ, భూ, మా ఇత్యాదయః ఏకాక్షర సంస్కతృశబ్దాః.
ఆత్రేయం చింతా. హ్రస్వవిధాయకం శాస్త్రం భిన్నవిషయక మేవ, న తు సమాస విషయకమపి సమాసే తాదృశ ప్రయోగస్యాదృష్టత్వాత్. న చ గ్రామణి పుత్ర ఇత్యాది సద్విషయ ఇతివాచ్యమ్. 'ఇకోహ్రస్వోజ్యోగాలవస్యే'తి శాస్త్రేణ తత్సిద్ధేః న చ సమాసే స్త్రీప్రత్యయమాత్ర విషయత్వేన నియమః కార్య ఇతి వాచ్యమ్. అసమాసే సాధారణ్యేన ప్రవృత్త స్యాస్య సమాసే అన్యాయత్వాత్. తర్హి 'నది సుత గురు కర్ణ శల్య నాగపురీశుల్' ఇత్యాది కథం హ్రస్వ ఇతి చేత్

'హస్వోదీర్ఘ సమాసేపి, క్వచిద్దీపః ప్రయోగతః'

ఇత్యధర్వణయోగతః హ్రస్వః. న చాత ద్వితీయాతుల్యతా ప్రతిపాదక శాస్త్రప్రవృత్తిః. యత్ర సమాసాంత గతపదస్య షష్ట్యంతేనాన్వయ స్తత్రైవ తత్ప్రవృత్తిః న చ "జ్యాపోస్సంజ్ఞా ఛందసోర్బహులమ్' ఇతివార్తికమత్ర ప్రవర్తతే. శబ్దస్యాస్య సంజ్ఞాత్వేన రేవతిపుత్రాదివత్ హ్రస్వవిషయతా. తయా ఆద్యప్రకృత్యాం వ్యవహారాభావాత్ అధర్వణవచన మేవ మానమ్. ప్రయోగతఇత్యనేన స్థితి నిర్వాహార్థ మిదం వచనమ్. నాపూర్వ శబ్దకల్పనార్థ మసీత్యయ మర్థో ద్యోతతే. వాగనుశాసనస్యాప్యత్రరుచి రస్తీతి జ్ఞాయతే. ఆదిపర్వణి
చ.

నలినసరస్సుగంధి యమునా నది తుంగతరంగ సంతతా
నిల శిశిర స్థలాంతర వినిర్మత నిర్మలహర్మ్యరేఖలన్’

ఇతిపాఠస్య బహుపుస్తకేషు దర్శనాత్. 'రాకసుధాంశు మండలము' ఇత్యత్ర రాకాపదం షష్ఠ్యంతమ్, సప్త మ్యంతం వా భవతి.
క.

నెలకొనియె వేటతమి న
బ్బలియుఁడు శిశిరనగరుచిరపరిసరమహిమం
గల తమసవీరసికతా
విలసనములు డెందమునకు విందొనరింపన్.

ఇత్యాది ప్రయోగేతు తమసాది శబ్దానాం భిన్న పదత్వేనైన సాధుత్వ మవగంతవ్యమ్. అని వ్రాసినారు. (క. శి. భూ. ప్ర. 844.847)108
అధర్వణాచార్యుల వారియందు నుండెడు తాత్పర్యాతిశయము వలన నిటు లింత ప్రయాసము నొందుటే, కాని ఆకారిక కర్థ మదియుగాదు, ఈ నిర్ణయించినది సిద్ధాంతమున్నుగాదు. 109
ఈ సూత్రమునకే బాలసరస్వతులవారు
'దీర్ఘాణాం = దీర్ఘములకు, హ్రస్వస్స్యాత్ = తెలుగున హ్రస్వము గలదు. అంబ, లక్ష్మి, కరుభోరు, దేశ్యపదే = దేశీయపు తెలుగునందు, న చ = లేదున్ను. నవలా, నేజా, లకోరి— ఇత్యాది. ఏకవర్ణేపి = ఏకాక్షర తత్సమమందున్ను, న = లేదు. క్ష్మా, శ్రీ, భ్రూ.'
అని వ్రాసినారు. ఇది రాజమార్గం. 110
అహోబల పండితులవారి వ్యాఖ్యలో 'అత్రేయం చింతా' అని వ్రాసినది మొదలుకొని చింతించవలసినదౌను. అధర్వణ కారికవలననే ఈకారాంతము లికారాంతములైతే, చంచూ, తనూ మొదలైన శబ్దములు హ్రస్వము లెటుల నాయెనో? చామరా-చామరం, వ్రీడా- వ్రీడః ఈ మొదలైన శబ్దము లెటుల హస్వము లాయెనో తెలియదు. అయితే అధర్వణాచార్యుల వారికి నన్నయభట్టుగారికి, కాళిదాసాదులకు పూర్వులైన శ్రీ హర్షులవారు ద్విరూపకోశమందు.

'ప్రబోధమాధాయ మశాబ్దికానాం
కృపా మవాప్తుం చ సతాం కవీనామ్
ద్విరూపకోశో రచితో విచార్య
బహుప్రబంధస్థితశబ్దభేదాన్.'

అని చెప్పుటవలన శ్రీ హర్షులవారును పూర్వకవి ప్రయోగములను చూచి రచించినాము గాన సందేహ మొందవలదని నిశ్చయముకొఱకు చెప్పినట్లు స్పష్టముగా నున్నది.
ఆ ద్విరూపకోశమందు—

'స్వర్ణదీ స్వర్ణది శ్చాపి, వల్లీ వల్లిశ్చ కీర్తితా
దాడిమీ దాడిమిశ్చ స్యాత్, మహిశ్చాపి మహీ తథా
రజనీ రజనిశ్చ స్యాత్ లక్ష్మీ ర్లక్ష్మి ర్హరిప్రియా
వలభీ వలభిశ్చ స్యాత్ నాభీ నాభిశ్చ కథ్యతే
శాల్మలీ శాల్మలి శ్చాపి, యువతీ యువతి స్సమే'

ఇటువలె ననేక శబ్దములు ఈకారాంతములు, ఇకారాంతములును రూఢిగానున్నవి.111
అధర్వణాచార్యుల వారికి పూర్వులైన మహాకవుల ప్రయోగములు— 112
భోజ చంపు (బాల. 25)

నారాయణాయ నలినాయత లోచనాయ
నామావశేషిత మహాబలి వైభవాయ
నానా చరాచర విధాయక జన్మదేశ
నాభీపుటాయ పురషాయ నమః పరస్మై.

113
శంకరాచార్యులవారి రచన

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగా మోహావేశమ్
ఏత న్మాంస వసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్.

114
పై శ్లోకములలో 'నాభి' ఈకారాంతము.115
కిరాతార్జునీయము (8.24)

సముచ్ఛ్వసత్సంకజకోశకోమలై
రుపాహిత శ్రీణ్యుపనీవి నాభిభిః
దధంతి మధ్యేషు వలీవిభంగిషు
స్తనాతిభారా దుదరాణి నమ్రతామ్.

116
'నాభి' హ్రస్వమున్ను, 'వలీ' దీర్ఘమున్ను. 117
రఘువంశము

తదంక శయ్యాచ్యుత నాభినాలా
కచ్చిన్మృగీణా మనఘా ప్రసూతిః.

118
నాభి హ్రస్వము. 119
భోజ చంపు (బాల. 53)

మందమంద మపయ ద్వలిత్రయా
గాధతా విషయ నాభి గహ్వరా
కోసలేంద్ర దుహతు శ్శనై రభూ
న్మధ్య యష్టిరపి దృష్టి గోచరా.

120
నాభి, వలి హ్రస్వములు. 121
వాసవదత్త

కఠినతర దామ వేష్టన
లేఖా సందేహదాయినో యస్య
రాజంతి వలి విభంగాః
స పాతు దామోదరో భవతః.

122
వలి హ్రస్వము.123
నైషధము (2-35)

ఉదరం పరిమాతి ముష్టినా
కుతుకీ కోపి దవః స్వసుః కిము
ధృతతశ్చతురంగులీ వయ
ద్విలిభి ర్భాతి స హేమ కాంచిభిః.

124
వలి, కాంచి హ్రస్వములు. 125
మేఘసందేశము (పూ. 28)

వీచి క్షోభ స్తనిత విహగశ్రేణి కాంచీ గుణాయాః
(సంసర్పన్త్యాః స్ఖలిత సుభగం దర్శితావర్తనాభేః
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతర స్సన్నిపత్య
స్త్రీణా మాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.)

126
‘శ్రేణి’ - హ్రస్వము, 'కాంచీ' - దీర్ఘము. 127
అందే (ఉ. 3)

యత్రోన్మత్త భ్రమరముఖరా పాదసా నిత్యపుష్పాః
హంసశ్రేణీ రచిత రశనా నిత్యపద్మా నలిన్యః
(కేకోత్కంఠా భవన శిఖినో నిత్య భాస్వత్కలాపా
నిత్యజ్సోత్స్నా ప్రతిహతతమోవృత్తిరమ్యాః ప్రదోషాః)[3]

128
‘శ్రేణీ'- దీర్ఘము 129
భోజ చంపు (సుందర. 11)

ఉజ్జృంభిత స్స తరసా సురసాం విజేతుం
పాదౌ పయోధి కలితా పవమానసూనోః
అస్యోత్తమాంగ మభవ ద్గగన స్రవంతీ
వీచీచయ స్ఖలితశీకరమాలభారి.

130
'వీచీ' - దీర్ఘము 131
అందే (సుందర. 4)

పక్షాభిఘాత రయ రేచిత వీచిమాలా
త్పాథోనిధేః పవననందన విశ్రమాయ
ఉత్తుంగ శృంగకుల కీలిత నాకలోకో
మైనాక భూభృ దుదజృంభత సంభ్రమేణ

132
'వీచి '- హ్రస్వము 133
అందే (సుందర. 82)

రజని చరమభాగే వార సీమంతినీనాం
కరతల కలితాభి దీపికా మార్జనీభిః
దిశి దిశి పరిమృష్టం యత్తమస్తత్సమస్తం
హృదయ మవగాహే కేవలం రావణస్య.

134
'రజని'- హ్రస్వము 135
అందే (సుందర. 110)

చక్రే శక్రఙిదాదాజ్ఞయా రణముభే యత్కర్మ రక్షో గణ
స్తత్కర్తుం రజనీచరక్షితిభృతా యుక్తోప్యశక్తో౽భవత్
సప్తార్చిశ్చ హనూనుతాః పరిచితో లంకామధాక్షీ ద్యధా
తత్పిత్రా మరుతాయుతోపి న తథా దాహక్రియాయాం పటుః

136
'రజనీ'- దీర్ఘము 137
బిల్హణ కావ్యము

పంచబ్రహ్మ షడంగ బీజముఖరప్రాసాద పంచాక్షరీ
వ్యోమవ్యా ప్తి పురస్సరేషు మనుషు ప్రౌఢః కులో మాదృశామ్
ఓంకారాది నమోంత ముద్రిత భవన్నామావలీ కల్పితం
సర్వం మంత్రతయా ప్రభోపరణమత్యంతర్బహిర్యాగయోః

138
'ఆవలీ'- దీర్ఘము 139
మేఘసందేశ వ్యాఖ్యానమందు సుదహరించిన
కర్మోదయము

గర్భం బలాకా దధతేబ్దయోగా
న్నాకే నిబద్ధా వలయ స్సమంతాత్.

140
'ఆవలి'- హ్రస్వము 141
కాలిదాసుగారి శ్యామలాదండకము

“... తారకారాజ నీకాశ హారావలిస్మేర చారుస్తనా
భోగ భారా నమన్మధ్య వల్లీ వలిచ్ఛేద వీచీసముల్లాస
సందర్శితాకార సౌందర్య రత్నాకరే, శ్రీకరే...”

142
'వల్లీ' - దీర్ఘము. 143
భోజ చరిత్ర

రాజన్నభ్యుదయోస్తు, శంకరకవే కిం పత్రికాయా మిదం,
పద్యం, కస్య, తవైవ భోజనృపతే, భోః పఠ్యతాం, పఠ్యతే,
ఏతాసా మరవింద సుందర దృశాం ద్రాక్చామరాందోలనా
దుద్వేలద్భుజ వల్లి కంకణ ఝణత్కారః క్షణం వార్యతామ్.

144
'వల్లి' - హ్రస్వము. 145
కాలిదాసుగారి శ్యామలాదండకము

'... కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్చారుణా
రోచనా పంకకేలీ లలామాభిరామే, తస్య లీలా సరోవారిధి స్తస్య కేలీ
వనం నందనమ్...'

146
'కేలీ’ - దీర్ఘము. 147
భోజ చంపు (కిష్కింధ. 6)

ఆదౌ సిద్ధౌషధి రివ హితా కేలికాలేన యస్యా
పత్నీత్రేతా యజనసమయే క్షత్రియాణ్యేవ యుద్ధే
శిష్యాదేవ ద్విజపితృ సమారాధనే బంధు రార్తౌ
సీతా సా మే శిశిరిత మహాకాననే కాన జాతా.

148
అందే (సుందర. 86)

సంగ్రామ కేలి పరిఘట్టన భగ్న భుగ్న
దిగ్దంతి దంత కృతముద్ర భుజాంతరాలమ్
ఛాయత్మనా ప్రతి తరంగ విరాజమాన
శీతాంశు మండల సనాథ మివాంబురాశిమ్.

149
'కేలి' - హ్రస్వములు. 150
కాలిదాసుగారి శ్యామలాదండకము

'...పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత
స్వర్ణభూభృత్తలే, చంద్రికాశీతలే...'

151
అమరము

'కలత్రం శ్రోణి భార్యయోః'

152
'శ్రోణి' - హ్రస్వములు. 153
మేఘసందేశము (ఉత్తర. 19)

(తన్వీశ్యామా శిఖరి దశనా పక్వబింఛాధరోష్ఠీ
మధ్యే శ్యామా చకితహరిణే ప్రేక్షణా నిమ్ననాభిః)
శ్రోణీభారా దలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం
(యా తత్ర స్యా ద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః)

154
శ్రోణీ' – దీర్ఘము.155
మేఘసందేశము (ఉత్తర. 19)

'...యా తత్ర స్యా ద్యువతి విషయే...'

156
'యువతి' - హ్రస్వము. 157
భోజచరిత్ర

'యువతీకర నిర్మథితం మథితం'

158
'యువతీ' - దీర్ఘము. 159
కాలిదాసుగారి శ్యామలాదండకము

'... దివ్యరత్నోర్మికా దీధితిస్తోమ సంధ్యాయ మానాంగుళీ
పల్లవోద్య న్నఖేందు ప్రభామండలే...'

160
అంగులీ' - దీర్ఘము. 161
భోజచరిత్ర

చిత్రాయ త్వయి చింతితే తనుభునా సజ్జీకృతం కార్ముకం
వర్తిం ధత్తు ముపాగతేంగులియుగే బాణా గుణే యోజితాః

ప్రారబ్ధే త్వయి చిత్రకర్మణి తదా తద్బాణ భగ్నాసతీ
భిత్తిం ద్రాగవలంబ్య సింహలపటే సా తత్ర చిత్రాయతే.

162
'అంగులి' - హ్రస్వము.163
శిశుపాలవధ

రాజీవ రాజీవశలోల భృంగ
ముష్ణంత ముష్ణం తతిభిస్తరూణామ్
కాంతాల కాంతా లలనా స్సురాణాం
రక్షోలి రక్షోబి తముద్వహంతమ్.

164
'రాజీ' - దీర్ఘము. 165
అందే

ఉచ్చైర్మహా రజతరాజి విరాజితాసౌ
దుర్వార భిత్తి రిహ సాంద్రసుధా సవర్ణా
అభ్యేతి భస్మపరిపాండురిత స్స్మరారే
రుద్వహ్ని లోచన లలామ లలాట లీలామ్.

166
'రాజి' - హ్రస్వము.167
ఇటువలెనే అనేక పదములు హ్రస్వదీర్ఘములు బహులములు గలవు. ఇదివరకే విస్తరించి వ్రాసినాము. ఇవి ఏ అధర్వణాచార్య కారిక వలన హ్రస్వము లనుకోను! బాలసరస్వతులవారు వ్రాసినది రాజమార్గమని తెలిపినాము. అలాగున అర్థము వ్రాయక, లేని యర్థము వ్రాసి (అహోబల పండితులవారు తమకు) ఉన్న పాండిత్యమునకు లోపము చేసికొన్నారు. పండితసార్వభౌములైన తాము అప్పకవివలె నిలువని సిద్ధాంతములు చెయ్యరాదు. కావున 'ఆత్రేయం చింతా' మొదలుకొని 'స్థితి నిర్వాహార్థం' వరకు వ్రాసిన గ్రంథము చింత కొఱకు వ్రాసినదౌను. 168
'లకోరి' పదము హ్రస్వమే కాని దీర్ఘము కన్పించదు. 169
ఇక, కొందఱు లాక్షణికులు ఆంధ్రకృతులందు (కేల్యాదులు) హ్రస్వము అని వ్రాసినారు. గీర్వాణకావ్యము లందు లేనివి తెలుగు కావ్యముల కెక్కడినుండి వచ్చెనో తెలియదు. ఇది వరకు మేము వ్రాసిన గీర్వాణప్రయోగము
లకు (వారు) ఏమిగతి కల్గించుకొనిరో తెలియదు. (ఇక, తెలుగులో నొకటి రెండు ప్రయోగములు)170
తిక్కనగారి ఉత్తరరామాయణము (1-11)
క.

ఎత్తఱి నైనను ధీరో
దాత్తగుణోత్తరుఁడు రామధరణీపతి స
ద్వృత్తమున భాగ్యమగుటను
నుత్తర రామాయణోక్తి యుక్తుఁడనైతిన్.

171
'ధరణీ' - దీర్ఘము.172
అందే (1-30)
సీ.

భూరిప్రతాపంబు వైరిమదాంధకా
             రమున కఖండదీపముగఁ జేసి
చరితంబు నిఖిలభూజననిత్యశోభన
             లతలకు నాలవాలముగఁ జేసి
కరుణ దీనానాథ కవిబంధుజన చకో
             రములకుఁ జంద్రాతపముగఁ జేసి
కీర్తిజాలము త్రిలోకీశారికకు నభి
             రామరాజితపంజరముగఁ జేసి
సుందరి జనంబు డెందంబులకుఁ దన
నిరుపమానమైన నేర్పుకలిమి
నంబురాశిఁ జేసి యసదృశలీల మైఁ
బరిగె మనుమసిద్ధి ధరణివిభుఁడు.

173
'ధరణి' - హ్రస్వము.174
అందే (1-33)
సీ.

లకుమయమంత్రి పోరికి నెత్తివచ్చినఁ
             గొనఁడె యాహవమున ఘోటకముల
దర్పదుర్జయులగు దబలాది నృపతుల
             నని మొనఁ బరపడే యశ్రమమున

శంభురాజాది ప్రశస్తమండలికుల
             చెఱిచి యేలండె కాంచీపురంబు
సింధు మంగళము గాసిగఁజేసి కాళవ
             పతి నీయకొలుపఁడే పలచమునకు
రాయగండ గోపాలు నరాతిభయద
రాయపెండెర బిరుదాభిరాము నుభయ
రాయగండాంకు ఖండియరాతి తిక్క
ధరణివిభుఁ బోల రాజుల కరిదిగాదె.

175
'ధరణి' - హ్రస్వము.176
క.

భూరి శుభగుణోత్తరులగు
వారికి ధీరులకు ధరణివల్లభులకు వా
క్పారుష్యము జనునే మహ
దారుణమది విషముకంటె దహనముకంటెన్.

177
'ధరణి' - హ్రస్వము.178
ఇటువలె తెలుగు కావ్యములందు ('ధరణి' మొదలగు పదములు కవులు) హ్రస్వములని వ్రాసినారు. గీర్వాణ సమాసములు ఏ (భాషా)కావ్యమందు (నైన) నొకటే.179
అంబ, లక్ష్మి మొదలైనవి ఏకపదములు (తెలుగున హ్రస్వములుగా)నుండును.180
ఇదివరకు వ్రాసిన సంస్కృతాంధ్ర లక్ష్యములు అధర్వణాచార్యులువారు పుట్టక మునుపటివి. ప్రతాపరుద్రయశోభూషణాది సంస్కృతకావ్యములందును, కాశీఖండము మొదలైన తెలుగుకావ్యములందున నిటువలెనే హ్రస్వ, దీర్ఘములు (గల రూపములు) గలవు. గ్రంథవిస్తరమని వ్రాయలేదు. అధర్వణాచార్యుల వారి కారికల కన్నను ముందువారును, పిమ్మటివారును గూడా రచించిన హ్రస్వదీర్ఘ(ములుగల పద)ప్రయోగములు బహులములు గలవు. కావున నహోబల పండితులవారు వ్రాసిన గ్రంథము- అనగా, 'అధర్వణ వచనమేవ మానం' 'స్థితి నిర్వాహార్థం' అను రెండు సిద్ధాంతములు వ్యర్థములు. హ్రస్వదీర్ఘములు ఇకారాంత, ఈకారాంతములే కావు. అకారాంత, ఆకారాంతములును గలవు. కొన్ని కొన్ని వివరించుతాము.181

భిన్నరూప సంస్కృతపదములు

ఇకారాంతములు

వీచిః
పాలిః
శ్రేణిః
వాపిః
నాభిః
భూమి
కృతిః
శాల్మలిః
కటిః
సూచిః
కేలిః
ఝల్లరిః
యువతిః
దాడిమిః
పృథివిః
ప్రతతిః
రాత్రిః
అంగులిః
ఆజిః
నాలిః
వల్లరిః
మహిః
కాశిః
ధరణిః
పాటలిః (=పురము)
మంజరిః
దేవకిః
రాజిః
వేణిః
వల్లిః
సుషిః
మణిః
క్షోణిః
మధూలి (=మకరందము)
దూషిః (=నేత్రమలము)
ధూలిః
శ్రోణిః
వలభిః
ఊర్మిః
రజనిః
అవనిః
దూతిః

—ఈ శబ్దములు ఈకారాంతములును గలవు. 'అంగులి' అనిమాత్రమేకాక 'అంగులః' అని అకారాంతమును గలదు. 182
ఉకారాంతములు

పునర్వసుః
చముః
సరయుః
భీరుః
చంచుః
తనుః
ఆలాబుః
హనుః
అవుతుః
స్వయంభుః

—ఈశబ్దములు ఊకారాంతములును గలవు. 183
అకారాంతములు—

శుండః
క్రోడః
బాణః
ప్రతిఘః
వ్రీడః
దాడిమః
జీవః
అప్సరసః
కందరః
ఫణః
నారః
సభః
కుధః
భుజః
మృగశిరః
జాగరః
ధారః

—ఈశబ్దములు శుండా, అప్సరసా అనురీతిలో ఆకారాంతములును గలవు. మరియు 184

జతుకం
చామరం
కరుణం
పాలనం
అక్షతం
తమిస్రం
తారం
జ్యేష్ఠం
చూడం
బాధం
తారకం
వజ్రం
మదిరం
నీరాజనం
అర్గలం
గణనం
వాసనం (=నివాసము)
స్ఫురణం
రచనం
నారం

—ఈ శబ్దములు జతుకా, నారా అనురీతిలో ఆకారాంతములును గలవు. 185
మరియు కొన్ని భేదములు వివరించుతాము.

పరిరంభః - పరీరంభః
పరిభవః - పరీభావం
పరిహారం - పరీహారం
పరివృత్తం - పరీవృత్తం
సమికం - సమీకం (యుద్ధము)
ఉదితం - ఉదీతం
సలిలం - సలీలం
వాల్మికిః - వాల్మీకిః
అభ్యుషః - అభ్యూషః
కంబుకం - కంబూకం
భల్లుకః - భల్లూకః
గాండివం - గాండీవం
బాహ్లికం - బాహ్లీకం ( = ఇంగువ, కుంకుమ)
మండుకం - మండూకం
బంధురం - బంధూరం
నిష్కుహః - నిష్కూహః
ఔశిరం- ఔశీరం
నిమిషః - నిమేషః
ఉచ్ఛ్రయః - ఉచ్ఛ్రాయః
ఖలినం - ఖలీనం
నియమః - నియామః
శ్యామకః - శ్యామాకః
ప్రగ్రహః - ప్రగ్రాహః
సహచరః - సహాచరః
నిగదః - నిగాదః
పరిహాసః - పరీహాసః
పరిపాకం - పరీపాకం
పరిమలం - పరీమలం
ప్రతిహారం - ప్రతీహారం
అన్వితం - అన్వీతం
కృపిటం - కృపీటం
వల్మికం - వల్మీకం
ప్రత్యుషః - ప్రత్యూషః
జంబుకః - జంబూకః
జతుకా - జతూకా
వాస్తుకం - వాస్తూకం
బాహ్లికః - బాహ్లీకః (= దేశము, గుఱ్ఱము)
డిండిరః - డిండీరః
ఎడుకం - ఎడూకం (గుంజలువేసి కట్టినగోడ)
మరిచం- మరీచం
మృద్వికా - మృద్వీకా
అధికారః - అధీకార
ఆశరః - ఆశారః
ఉల్లసితం - ఉల్లాసితం
సాలవృకం - సాలావృకం
సంయమః - సంయామః
శ్యామలః - శ్యామాలః
వదన్యః - వదాన్యః
వస్నసా - వస్నాసా
నికషః - నికాషః

—ఈ శబ్దములకు మధ్యవర్ణములందు హ్రస్వదీర్ఘములుగలవు. 186

భ్రుకుంసః - భ్రూకుంసః (=స్త్రీవేషధరపురుషుడు)
అపగా - ఆపగా
అరాతిః - ఆరాతిః
అమిషం - ఆమిషం
పటీర - పాటీరః
అవాసః - ఆవాసః
అంతరిక్షం - ఆంతరిక్షం
ఉషరం - ఊషరం
కదంబః - కాదంబః
కరిణి - కారిణీ
ఖనిః - ఖానిః
గుడః - గూడః (=బెల్లము)
చమరం - చామరం
ఝరీ - ఝారీ
ఝలః - ఝాలః (=పర్వతప్రవాహము)
తపింఛం - తాపింఛం
తుబరః - తూబరః (=వగరు)
మసారః - మాసారః (=మణి)
మదనః - మాదనః (=ఉమ్మెత్త)
వలుకా - వాలుకా
పులిందః - పూలిందః
చటుః - చాటుః
చపలం - చాపలః
ముసలః - మూసలః
భరః - భారః
అగరం - ఆగారం
అహితుండికః - ఆహితుండికః
అమర్షం - ఆమర్షం
అతిరూషః - ఆతిరూషః
నసా - నాసా
అవతారః - ఆవతరః
ఉషణం - ఊషణం
కమనః - కామనః
కలంబః - కాలంబః
కుణిః - కూణిః
గ్రహః - గ్రాహః
చతురః - చాతురః
చికురః - చీకురః
ఝరః - ఝారః
తపనః - తాపనః
త్రపుషం - త్రాపుషం
పలాశః - పాలాశః
మసురాః - మాసురాః (=వ్రీహులు, పణ్యస్త్రీలు)
యమః - యామః
శబరః - శాబరః
వణిజ్యం - వాణిజ్యం
చలం - చాలం
పటచ్చారః - పాటచ్చరః
మయూరః - మాయూర
ప్రచీరం - ప్రాచీరం

శ్రమః - శ్రామః.
సహస్రం - సాహస్రం
సుకరా - సూకరా=సాధుధేనువు
అహో - ఆహో=అన్వయము ఆశ్చర్యార్థము.
సదనం - సాదనం
సుత్రామః - సూత్రామః
స్ఫురత్ - స్ఫూరత్

—ఈ శబ్దముల ఆదివర్ణము అందు హ్రస్వదీర్ఘములు గలవు.187

చేటా - చేటీ
ఫేలా - ఫేలీ
కాహలా - కాహలీ
జ్యోత్స్నా - జ్యోత్స్నీ
శోణా - శోణీ
తండ్రా - తండ్రీ
రాత్రా - రాత్రిః
వాగురా - వాగురీ

—ఈ శబ్దములు ఆకారాంతములు, ఈకారాంతములు = స్త్రీలింగములు గలవు. 'రాత్రిః' అనునది ఇకారాంత స్త్రీలింగము. 188

సాహిత్యం - సాహితీ
పారంపర్యం - పారంపరీ
ద్వయం - ద్వయీ
అరరం - అరరీ
మృణాలం - మృణాలీ
ముకుటం - ముకుటీ
శస్త్రం - శస్త్రీ
పాండిత్యం - పాండితీ
చాతుర్యం - చాతురీ
త్రయం - త్రయీ
నగరం - నగరీ
ఖలినం - ఖలినీ
మకుటం - మకుటీ
నిర్ఝరః -నిర్ఝరీ

—ఈ శబ్దములు అకారాంత నపుంసకలింగములు, ఈకారాంత స్త్రీ లింగములు గలవు. 'నిర్ఝరః' అనునది పుంలింగము. 189

సధర్మా - సుధర్మా
మకులః - ముకులః
మకుటం - ముకుటం
భ్రకుంసః - భ్రకుంసః (=స్త్రీవేషధరపురుషుడు)
ద్వాంక్షః - ధూంక్షః
గల్భః - గుల్భః
మకురః - ముకురః
దరోదరం - దురోదరం
క్షరికః - క్షురికః (=బాలిదచెట్టు)

—ఈ పదముల ఆదియందు అకారము, ఉకారము కలవు. 190

మహికా - మిహికా
మహిరః - మిహిరః

లకుచః - లికుచః
గలితం - గిలితం
తమిరం - తిమిరం

—ఈ పదముల ఆదియందు అకారము, ఇకారము గలవు.191

కృమిః - క్రిమిః
తృణలూ - త్రిణలూ
తృఫలం - త్రిఫలం

—ఈ పదముల ఆదిని ఋత్వ-రేఫములు గలవు.192

అగరు - అగురు
భిదరం - భిదురం
శింశపా - శింశుపా
కుర్కరః - కుర్కుర
పాండరః - పాండురః
జాంగలికః - జాంగులికః

—ఈ పద్యముల మధ్యవర్ణములందు అకారము-ఉకారము గలవు.193

లేఖనీ - లేఖినీ
ధంమల్లః - ధంమిల్లః
ద్రుహణః - ద్రుహిణః

—ఈ పదముల మధ్యవర్ణములకు అకారము-ఇకారము గలవు.194

అరణం - హరణం =ద్రవ్యప్రాప్తి
అయనం - హయనం

—ఈ పదముల ఆదిని అకార, హకారములు గలవు.195

భృంగారః - భృంగారుః
గుగ్గులః - గుగ్గులుః
శైలః - శైలుః

ఈ పదములు అకారాంతములు, ఉకారాంతములు గలవు.196

కర్కశః - కర్కరః =కఠినుడు
మాధః = మధనం

—ఇట్లును గలవు.197
మరియు కొన్ని భేదములు వివరించుతాము

పారావతః - పారవతః
స్పర్శః - స్పృశః
మధ్యమం - మధ్యం
సరీషపః - సర్షపః
మర్దలః - మద్దలః
గ్రథితం - గ్రంథితం

గ్రథనం - గ్రంథనం
కౌమోదకీ - కౌముదకీ
దివిషదః - ద్యుషదః
మార్గశీర్షః - మార్గశిరః
మంథనం - మథనం
శకలః - శల్కః
లక్షం - లక్ష్యం
బ్రాహ్మీ - బ్రాహ్మణీ
శర్వః - సర్వః = శివుడు
గరలం - గరం
అన్వయః - అన్వవాయః
వేశః - వేషః = వేశ్యవాటిక
తుసః - తుషః
శూరః - సూరః = రవి
సరయూః - శరయూః
కబేరః - కూబరః
చమూరుః - సమూరుః
చరిత్రం - చరితం
వాసరః - వాశరః
గుచ్ఛః - గుత్యః=ముక్తాహార కలాపములు, స్తబక స్తంబ హార భేదములు.
జగత్రాణః - జగత్ = వాయువు
బర్హిశ్ముష్మా - బర్హిః
సురీ - సురా
అనడుహః - (అకారాంతము)
అనడ్వాన్ - (హకారాంతము)
లోలుపం - లోలుభం
వైదేహః - వైదేహిః
శిఖరం - శిఖా
పవిః - బవిః
నారంగం- నార్యంగం
నై చికీ - నీచికి
పృషతః - పృషః
వ్యాయామః - యామః
నఖరం- నఖం
ఉలూఖలం - ఉడూఖలం
పాణినిః - పానినిః
భాగ్యం - భగః
అత్తికా - అంతికా
పరిఖా - పరిఘా
సిందూరం - సింధూరం
బుసం - బుషం
బృశీ - బృషీ
మందరః - మంథరః
కక్ష్యా - కక్షా
కలశః - కలసః
లక్షణః - లక్ష్మణః = లక్షణయుక్తుడు
పారదం - పారతం
కింమీరః - కిమీరః
గౌః - గవీ
ముషితం - ముష్టిం
ఇందీ - ఇందిరా
కుటీ - కుటీరః
తటీ - తటిత్

వాజీ - వాజిః
రదః - రదనః
పులకః - పులః
యుక్తః - యుతం
గుంభం - గుంభనం
ఢక్కా - ధక్కా
వృక్కా. ఆకారాంత స్త్రీలింగము.
పృక్కం - అకారాంత నపుంసకలింగము = దంతిచెట్టు.
జృంభం - జృంభణం
చిరంతనః - చిరత్నః
స్వవాసినీ - సువాసినీ
యోషా - జోషా
భ్రూణః - బ్రూణః
సౌహార్దం - సౌహృదం
సింధుః - సింధురః
నైవేద్యం - నివేద్యం
ఉదకం - దకం - దగం
సౌదామనీ - సౌదామ్నీ - శాదామినీ
ధరిత్రీ - ధారయిత్రీ
ధర్మం - ధర్మః
కూషం - కూషః
లలామం - లలామః
విదారణం - దారణం.
ద్యూతం - ద్యూత్యం
ఘటీ - ఘటికా
కైకేయీ - కైకయీ
బంధుః - బాంధవః
ఎరకః - ఎడకః
ప్రత్నః - ప్రతనః
సహితం - సంహితం
అహిః - అహితః
శయ్యా - శయనం
జీవంజీవః - జీవజీవః
బీజం పూరః - బీజపూరః
వల్కలం - వల్కం
యౌవనం - యౌవతం
భర్త్సనం - భత్సనం
సమాఖ్యా - సమాజ్ఞా
సాంకర్యం - సంకరం
పారంగతం - పారగతం
కుద్దాలం - కులీలం
శిలోంఛం - ఉంఛశిలం
శోషణం - శోషః
కోరకం - కోరకః
బర్హం - బర్హః
భేదనం - భేదః
సింహణం - సింధూణం
మణీకం - మణీచం = ఒక పుష్పము.
ఉందురుః - ఉందురః = ఎలుక
సోదర్యః - సోదరః
సదృక్ - సదృక్షః - సదృశః

తాదృక్ - తాదృక్షః - తాదృశః
వాక్ - వాచా - వచః (సకారాంత నపుంసకము)
దిక్ - దిశా - దిశః
నవం-నవ్యం- నవీనం
అజగము - అజిగవం - అజాగవం
మరకతం - మకరతం - మతరకం
పారావారః - పారవారః - పారాపారః
పత్తనం - పట్టనం - పటణం
శృగాలః - సృగాలః - సృగాలీ
వాసనా - వాసనం - వాసః - నివాసము
పాదదా- పాదుకా - పాదుః - పాదావనీః
మరిచం - మరీచం - మరిచః
సుషిః - సుషిరం - శుషిరం
కుండూః - కండూయా - కండూయనం
విరించిః - విరించః - విరించనః
పురోగః - పురోగమం - పురోగామీ
స్వప్నం - స్వపనం - స్వాపం
లవః - లవనం - లావః
ధారుణీ - ధారణీ - ధరణీ
సముదాయః - సమదాయః - సముదయః
హర్మ్యం - హర్మ్యః - హర్మిః
అధ్వనీనః - అధ్వనః
హాలాహలం - హాలహలం - హలాహలం - హాలహలం
డాహలం - డహాలం - డాహాలం
మహిలా - మహీలా - మహేలికా = స్త్రీ
వనీపనః - వనీపకః
చెలం - చైలం
కదలం - కదలీ - కందలీ
విఖ్యః - విగ్రః = విగతనాసుడు
దుత్తూరః - దుర్తూరః - దుస్తూరః
చిలీచకు - చిలీచిమః = మత్స్యభేదము

కుటీ - కుటీరః - కుటికా
ఖురలీ - ఖురలికా - ఖురల - ఖలూరికా = గరిడీశాల
వారాణసీ - వరణాసీ - వారాణసీ - వారాణసీ = కాశి
చంద్రః - చంద్రమాః - చందిరః
చికురః - చిహురః.
తుందీ - తుందికః - తుందిల - తుందిభః
జీవనీయకః - జీవనం = జలము.
హాసః - హసః - హసనం - హాస్యం - హసికా
పద్గః - పదగః - పదాతిః - పదాతిగః - పదాలికః
కండుః - కండు - కండూః
పత్రా - పత్రీ - పత్రికా - పత్రికం - పత్రం
జంభం - జంభలః - జంబీరః = నిమ్మచెట్టు
కిసాలయం - కిసలయం - కిసాలం - కిసలం - కిసం
కువాలం - కువలయం - కువేలం - కువలం - కువం
శైవాలం - శైవలం - శైవాలుః - శేవలం - శివాలం
విస్తృతం - విస్త్రతం - వితతం - తతం
యుగలీ - యుగలం - యుగ్మం - యుగం
జాగరః - జాగరా - జాగర్యా - జాగరణం
పనితం - పణితం - పణయితం - పణాయితం
కౌతుకం - కుతుకం - కౌతూహలం - కుతూహలం
పీఠం - పీఠా - పీఠీ
మరుత్వాన్ = ఇంద్రుడు, మేఘము, మారుతము.
కవిః (పుంలిం) = శుక్రుడు - పండితుడు, కార్యకర్త - స్త్రీ ఖలీనము
తామిః (స్త్రీ) = అత్తగారు, చెల్లెలు, సత్కులస్త్రీ
తామీ (స్త్రీ) = కంచుకభేదము, తల్లి, సంతతి, చర్మము
జామి (అవ్వ) = ఆలస్యం, ఉపాంతికము, అధికము
వాసః (అ. ప్ర.) = గృహము, దేహము
వాసః (అ. నపుం)= వస్త్రము
వసనం = వస్త్ర, నివాసములు

వాసనా - వాసనం = వస్త్రము
ఝంఝణీ = కింకిణి = గజ్జెలు
అబ్జః = శంఖము, చంద్రుడు
అబ్జం = పదము
కచ్చరః = రాక్షసుడు, వ్యాఘ్రము
కర్బురః = రాక్షసుడు, మిశ్రవర్ణము, పాపుడు
కర్బురం = సువర్ణము, ఉదకము, ఆకాశము, సిందూరము
(ఈ పదము మూడులింగములందు నున్నది.)
ఫాలం - (ద్వితీయవర్ణాది) = వస్త్రము
ఫాలః - (ద్వితీయవర్ణాది) = కరుకోల
భాలః (చతుర్థవర్ణాది ) = నిటలము
(నిటలార్ధమున ద్వితీయవర్ణాదియని అందఱికి భ్రాంతి = ఫాలమునకు కరుకోల, వస్త్రము అని అర్థముగాని లలాటము గాదు)
పుండరీకః = అగ్ని, వ్యాఘ్రము, దిగ్గజము
చందిరః = ఏనుగు; చంద్రుడు
జుహురాణః = చంద్రుడు, గుఱ్ఱము
నప్తా = పుత్రపుత్రుడు, దుహితృపుత్రుడు, పౌత్రపుత్రుడు
కర్కంధుః (పుం)
కర్కంధూః (స్త్రీ) = రేగుచెట్టు
కర్కంధః (నపుంసక) = ఫలము
గుణనికా ( ఆ - స్త్రీ) నాట్యప్రయోక్తవ్యార్థము, ధనుర్విద్య
క్షుత్ - క్షుతం
యోషిత్ - యోషితా
శరత్ - శరదా - శారదా = ఋతువు
ప్రావృట్ - ప్రావృషా
విశ్వసృట్ - విశ్వసృక్
(ఈపదములు - అనేకార్థములిట్లుండగా—)
అకూపారః - కూపారః; అవస్యాయః - వస్యాయః;
అవతంసః - వతంసః; అవగ్రహః - వగ్రహః

అవలగ్నం - వలగ్నం; అసూర్ క్షణం - సూర్ క్షణం = అధిక్షేపము

—ఈపదముల కేకార్థమందే (పదాదిన) ఆకారములుండును, ఉండకుండునుగూడ. 198

భిన్నవర్ణాంతములైన కొన్నిశబ్దములు భిన్నలింగములు కూడ.
ధనుః - ధనుషౌ - ధనుషఃసకారాంతము పుంలింగము
ధనుః - ధనుషీ - ధనూంషిసకారాంతము నపుంసకలింగము
ధన్వా - ధన్వానౌ - ధన్వానఃనకారాంతము పుంలింగము
ధన్వ - ధన్వనీ - ధన్వానినకారాంతము నపుంసకలింగము
ధనుః - ధనూ - ధనవఃఉకారాంతము స్త్రీలింగము
ధనూః - ధనూ - ధనవఃఊకారాంతము స్త్రీలింగము
ధనుషా - ధనుషే - ధనుషాఃఆకారాంతము స్త్రీలింగము

( ఈ విధముగా ఈ క్రిందివి చూచుకోవలయును)

తనుః-ఉ. స్త్రీ ; తనూః ఊ.స్త్రీ; తనుః-తనుషీ-తనుంషి. స.న.; తనుషా-ఆ.స్త్రీ.; నిచులః, నిచోలః-అ.పుం.; నిచోలం-న; నిచోలీ ఈ స్త్రీ. = వస్త్రము; ఆపః-స. స్త్రీ నిత్యబహువచనము = ఆపః-ఆపసీ-ఆపాంసి. స న, అపః-అపసీ-అపాంసి; అప్నః-అప్నసీ-అప్నాంసి స. న; ఆశీః-ఆశిషౌ-ఆశిషః, స.స్త్రీ; ఆశీ-ఆశ్యా-ఆశ్యః, ఈ. స్త్రీ; సర్పదంష్ట్ర; దోః-దోషౌ-దోషః, స పుం; దోః-దోషీ-దోంషి, స న, దోషా-దోషే-దోషాః, ఆ. స్త్రీ; రజః, స. న; రజిం-రజే-రజాణి, అ. న; ఇట్లే 'శిరః'. సరః, స. న.; సరసి, ఈ. స్త్రీ ; వాసః, స. న; వాసం, అ. న.=వస్త్రము; అర్చిః-ఆర్చిషీ-ఆర్చీంషి, స. న.; అర్చిః-అర్చీ-అర్చయః ఇ. పుం.; ఓకాః. స. పుం; ఓకః ఆ. పుం; ఓజః, స. న. మరియు అ. పుం; భాః-భాసౌ-భాసః, స. పుం.: భా-ఆ. స్త్రీ.; భాసం-అ. న.; జలూకాః-స. పుం.; జలూకః-అ. పుం.; ప్రచేతాః-స. పుం.; ప్రచేతసః-అ పుం.; సుమనాః-స. పుం.; సమనసః-ఆ, పుం.; దమునాః- సం. పుం.; దమునః-ఆ. పుం ; రేతః-స, న.; రేతం-అ. న.; నభః-స. న.; నభం-అ. న.; తపః-స. న.; తపః-స. న.; తపం-ఆ. న.; జటాయుః-స. పుం.; మరియు ఉ. పుం.; ఇట్లే ‘జరాయు:'. శేఫః-స. న.; మరియు అ. పుం; మనః-స. న.; మనసంఅ. న.; మానసం- అ, న.; వయః-స, న.; వయసః-అ. న.; మహః- స, న. మరియు అ. పుం.; విహాయసః-స. న; విహాయః- అ. పు; కర్మా-న, పుం.; తమః-అ. పుం. = రాహుగ్రహము; తమం - అ.న.= అంధకారము తమా-ఆ. స్త్రీ = రాత్రి తమీ-ఈ. స్త్రీ = రాత్రి, తమః స.న. =తమోగుణము, దైన్యము, అంధకారము, శోకము, మోహము, లాంఛనము, వక్షఃస్థలము. తనూః-స.పుం.= అరవము, ధూలి. అస్మి= అహమర్ధమందు అవ్యయము, 'అయితిని' అనుట యందు క్రియాపదము.

‘దాసే కృతాగసి భవత్సుచితః ప్రభుణాం
పాదప్రహార ఇతి సుందరి నాస్మి మాయే'

అని భారవి ఘంటాపథమందు వ్రాయబడినది. ధనంజయవిజయమునందు

'ప్రాసాద సంనమదధారకపోలభాషాః
తేజోభిః కనక నికాష రాజి గౌరైః'

'నికషణం - నికషోపలో వా.' అనియున్నది. ఇక :

‘హ్లాదీ సుఖే చేత్యాకారక ధాతూత్పన్నః కహ్లారశబ్దః ఏతచ్చ లింగాభట్టీయాదౌ ద్రష్టవ్యమ్, కల్హార శబ్దస్తు 'హ్లేర్హాః' ఇత్యాకారక ప్రాకృతీయ సూత్రేణ రూప నిష్పత్తి రితి బోద్ధవ్యమ్. ఏతచ్చ మణిదర్పణాదౌ ' ద్రష్టవ్యమ్'

199

గీర్వాణ శబ్దము 'కహ్లార' మని, ప్రాకృత శబ్దము 'కల్పార' మని తత్తద్ వ్యాఖ్యానాదుల వలన స్పష్టముగా కనుపించుచున్నది. వినిమయముగా సంస్కృతశబ్దముకు వాడుకగలదు. ప్రాకృతశబ్దమైన కల్హార శబ్దమును సంస్కృతముగా వాడుకచేసుటకు కారణము కనుపించదు.

'చిబుకం - చిబూకం - చీబుకం - చిబుః అని నాలుగు విధములు గలదు. అందఱు పండితులును 'చుబుక' మంటారు. (చకారమునకు) ఉత్వమని, కోశకారులు చెప్పలేదు. లింగభేదము, అంతభేదము, వచనభేదము, రూపభేదము, కలిగి ఏకశబ్దమే ఏకార్థమందే కోశాదులందున మహాకావ్యములందున ననేకశబ్దములుండగా ఈకారాంతము ఇకారాంతము గావడమకు అధర్వణాచార్యకారికే ‘మానం' అని అహోబల పండితులవారు నిశ్చయించుటకు కారణమేమిటో తెలియదు మంచిదే. ఇది అధర్వణ కారిక చేతనే వచ్చెననుకుంటే, క్రోడ, వ్రీడాది శబ్దములు ఆకారాంతములు, హ్రస్వములుగా నుండుటకు తను, చంచ్వాది శబ్దములు హ్రస్వముగా నుండుటకు ఎవరికారిక (కారణమో) తెలియదు. 200

కోశాదులందున, వ్యాఖ్యానాదులందున పరిశీలించి కొన్ని కొన్ని శబ్దముల (రూపములు) వ్రాసినాము. కొన్ని కొన్ని శబ్దములకు లక్ష్యములు వ్రాసుతాము.201

చిబుకము ఇత్యాది యగుటకు
భాగవతము అష్టమస్కంధము
సీ.గీ.

వందీ వ్రాలి కుంది వాడిన యిల్లాలి
వదనవారిజంబు వడువు చూచి
చేఱఁదిగిచి మగువ చిలుకంబు పుడుకుచు
వారిజాక్షి యేల వగచె దనుచు.

202
శ్రీనాథుని నైషధము (3–179)

అబ్జగర్భుండు సుషమాసమాప్తియందు
నెత్తి చూడంగఁబోలు నీయింతి వదన
మంగులీయంత్రణక్రియాభంగి నమరి
చిబుక మొనరించెనా నిన్ను సీమసంధి.

203

లేఖకులు ‘చుబుక’ మని పుస్తకములందు వ్రాసినారు. అది లేఖకప్రమాదము. భానోజీ దీక్షితులుగారు తమ అమరసుధావ్యాఖ్యయందుః -

“చివతి చివ్యతే వా, చివ్వ ఆధాన సంవరణయోః
మృగవ్యాధిః స్వార్థే కిన్. చినోతి శుభం వా ప్రాగ్వత్.
'అధస్తా దధరోష్ఠస్య, చిబుస్యా చ్చిబుకం తథా।' ఇతి నిగమః"

అని వ్రాసినారు. ఇక 'గురుబాలప్రబోధిక' యందు—

'చీయతే త్వఙ్మాంసాదిభి రితి చిబుకం. చిఞ్ చయనే.'

అని వ్రాసినారు. 'శబ్దార్థకల్పతరువు' నందు చాదులు ఇత్వాదులు (నైన పదములందు)

'చిబుకం. అదంతం క్లీబే. అమరః ఓష్ఠా దధః ప్రదేశే గడ్డము.
సరస్వతీ విలాసః. చిబూకం, చీబుకమ్'

అని వ్రాసినారు. ఉత్వాదియని యెవరును వ్రాయలేదు.204

‘భాలము' చతుర్థవర్ణాదియగుటకు
తిమ్మకవిగారి శివలీలావిలాసము

భసితాంగరాగాయ భక్తానురాగాయ
             భాలేక్షణాయ తుభ్యం నమోస్తు
భర్మాద్రిచాపాయ భద్రేంద్రవాహాయ
             భయవిదూరాయ తుభ్యం నమోస్తు
భరతప్రవీణాయ భవనాయితనగాయ
             భద్రప్రదాయ తుభ్యం నమోస్తు
భండనోద్దండాయ భానుప్రతాపాయ
             భవ్యరూపాయ తుభ్యం నమోస్తు
భావభవసంహరాయ తుభ్యం నమోస్తు
భవసరిన్నావికాయ తుభ్యం నమోస్తు
భద్రచర్మాంబరాయ తుభ్యం నమోస్తు
భారతీశార్చితాయ తుభ్యం నమోస్తు.

205

శబ్దాదివర్ణములన్నియు చతుర్ధవర్ణములు. రీతియను గుణము.206

'మకురము' అకారాది యగుటకు
జగ్గకవి సుభద్రాపరిణయము

ముకురాభవదన చెక్కులు
మకరంబులఁ గరము దవిలి మాయఁగఁ జేయన్
సకియ గలము ధరముల ను
త్సుకతమెయిం దెల్లబుచ్చి సుడివడఁ జేయన్.

207

'ముకరము' కు సులభము208

'అగరు.' అకారమధ్య మగుటకు
ఆదిపర్వము (8–78)
చ.

సరలతమాలతాలహరిచందనచంపకనారికేలకే
సరకదలీలవంగపనసక్రముకార్జునకేతకీలతా
గరుఘనసారసాలసహకారమహీరుహరాజరాజి సుం
దరనవనందనావలులఁ దత్పరబాహ్యము లొప్పు జూడఁగన్.

209
'అగురు' ఉకారమధ్య మగుటకు
ఆముక్తమాల్యద (2–6)
మ.

పరిఘం దత్పురకామినీజనము లంభఃకేలి సల్పంగ ద
ద్గురువక్షోమదలిప్తసంకుమదకస్తూరీమిలచ్చందనా
గురుపంకమ్ముల సౌరభమ్ములఁ జుమీ కుంభీనసావాసని
ర్జరకల్లోలిని కందు భోగవతినా జన్సంజ్ఞ గల్గెం దగన్.

210
'ధన్వ' అకారాంతముకు
పారిజాతాపహరణము (5-14)
చ.

హరిహయుఁ డాగ్రహజ్వలితుఁడై యనిఁ బాఱు దేశాధినాథులం
దిరుగుఁడు పోకుపోకుఁ డని తిట్టి యదల్చి నవోదయత్పయో
ధరము నలంకరించు తన ధన్వము సజ్యము జేసి గోత్రభి
త్కరమగు బాహువెత్తి తమకంబున సేనకుఁ జేయి వీచినన్.

211
'భాసం' ఆకారాంతమగుటకు
కూర నారాయణుని సుదర్శనశతకము
స్ర.

'శ్యామం ధామ ప్రసృత్యా క్వ చ న భగవతః
             కాపీ బభ్రు ప్రకృత్యా
శుభ్రం శేషస్య భాసా క్వచ న మణిరుచా
             క్వాపి వస్యైవ రక్తిమ్
నీలం శ్రీ నేత్రకాంత్యా క్వచిదపి మిథున
             స్యాదిమస్యైవ చిత్రాం
వ్యాతవ్వానం వితానశ్రియముపనత నతాం
             శర్మ వ శ్చక్రభాసమ్'

212
'వ్రీడః'
శిశుపాలవధ

యత్సాల ముత్తుంగతయా విజేతుం
దూరా దువస్థీయత సాగరస్య
మహోర్మిభి ర్వ్యాహతవాంఛితార్థైః
వ్రీడాదివాభ్యా సగతైర్విలిత్యే

213
తిమ్మకవిగారి రసికజనమనోభిరామము
గీ.

వ్రీడవతి యేడ్చె నెలుఁగెత్తి వెక్కి వెక్కి
యశ్రుపూరంబు కుచగిరు లంటి పొరల
కిన్నరీపాణి పంకజాంకిత సువర్ణ
వల్లకీరావ సదృశ భాస్వద్గలమున.

214
'స్ఫూరత్'
ఎఱ్ఱనగారి హరివంశము (పూ. భా. 9-200)
మ.

అని యుత్తుంగతరంగహస్తములఁ గ్రూరారాతిఁ దీరస్థలం
బునకుం దెచ్చిన నవ్విభుండు ప్రసభస్ఫూరత్కృపాణాహతిన్
దనుజున్ వ్రచ్చి (గతాసుభూసురసుతుం దత్కుక్షిలోఁ గాన కా
ఘనసత్త్వంబు శరీరజంబయిన శంఖం బొప్పుతో నుండినన్.)

215
'పరీహార'మునకు
అందే (ఉ. భా. 3-195)
క.

నీ రూపు చూచి వలచితి
కారుణికాగ్రణివి నన్ను గైకొనుము పరీ
హారంబునకున్ గారణ
మేరూపున లేదు నిక్క మిది గుణమహితా.

216

'పరిహారము' సుప్రసిద్ధమే.

'పరీభావ' మునకు
అందే (ఉ. భా. 4-120)
శా.

నీ వాశ్చర్యపరాక్రమంబున మహిన్ విశ్వైకరక్షార్థివై
దేవారాతులఁ గూల్చు చున్కి విని నీ తేజంబు సైరింప కు
గ్రావష్టంభరతిన్ నినుం దొడరి నా వాజిన్ బరీభావమున్
భావింపన్ భవదంతరంబ తుది నాకాక్షించు నెల్లప్పుడున్.

217
'సప్త ' - పౌత్రు డను నర్థమునకు
అందే (ఉ. భా. 7-126)
క.

దీప్తహుతాశుం బొదలెడు
దృప్తశలభతతులఁ బోలె దివిజబలము ల
ప్రాప్తపరిభవుం డగు హరి
నప్తఁ బొదవి రంత నుల్బణక్రౌర్యమునన్.

218

ఇచ్చట 'నప్త' అనగా ప్రద్యుమ్న పుత్రుడుగు అనిరుద్ధుడు. అనగా హరి' 'పుత్రపుత్రుడు'.219

'హవిః' ఇకారాంతమగుటకు
అందే (ఉ. భా. 9-77)
ఉ.

నా యశము న్మగంటిమియు నానయు వమ్ముగఁజేసెఁ జూడఁగా
దీ యసతి న్మదీయగృహ మిప్పుడె వెల్వడఁ ద్రోచి రండు గౌ
లేయకలీఢమైన హవి లెస్సఁగఁ జూతురు యన్యదూషితం
బాయగనైనగా కకట ప్రాయిడియైనను నిచ్చగింతురే.

220

ఇందు 'హవి' ఇకారాంతము. గృహము - సప్తమికి ప్రథమ.221

'అన్వీత'
అందే
సీ.

వరమునిసహితుఁడై వనజాసనుఁడు వచ్చె
             నమరసమేతుఁడై యనిమిషేంద్రుఁ
డేతెంచె నప్సరోన్వీతులై గంధర్వు
             లరుగుదెంచిరి పరిస్ఫురితలీల...

222
'ప్రయతన'
అందే (ఉ. భా. 10-45)

హయములు వేయు బూనిన మహారథ మెక్కి మహేశమిత్రుఁ డ
క్షయనిధి గోప్తయక్షత భుజాబలుఁ డర్థివిభుండు యక్షసం
చయసముపేతుఁడై నడచెఁ జంచదుదాత్తగదావివర్తన
ప్రయతనలీలఁ జూపఱకు భ్రాంతవిలోకన మావహింపఁగన్.

223
ఇటువలెనే నూతన ప్రతనా ద్యనేకపదములు తెలుసుకొనేది. 224

తెలుగుపదముల భిన్నరూపములు

ఱవికె యనగ మరియు ఱైక యనంగను
పైట పయట యనగ పయ్యెద యన
పయ్యదయు పయంట పయ్యంట యన నొప్పు
వృషతురంగ! కుక్కుటేశలింగ!

225
ఱవికె
శ్రీనాథుని నైషధము (6-181)
చ.

ఱవికెయుఁ బట్టుపుట్టము చెఱంగు మరంగయి యున్కిఁజేసి గౌ
రవపరిమాణముం దెలియరామికి ముచ్చిరుచున్న యొక్కప
ల్లవునకుఁ జూపె నొక్కతె విలాసముతోడన తోరపుంజనుం
గవ పొడగింత పొమ్మనిన కైవడి పానకహేమకుంభమున్.

226
ఱవికెకు (ఉదాహరణములు) బహులములు గలవు 227
ఱైక
ఆంధ్రభాషార్ణవము
చ.

తన ధను వేల యిమ్ముగను దాచితివే యని యాట పట్ల ఱై
కను సడలించి చన్నుఁగవఁ గ్రక్కునఁ బట్టఁగ నెంచు నాయకుం
గనిన సుగంధి కుంతల మొగంబునఁ దోచిన చిన్నినవ్వు కో
రిన వరమిచ్చి ప్రోవుతను శ్రీరఘునాథ నృపాలచంద్రునిన్.

228
తారాశశాంకవిజయము (4-63)
చ.

మలయజగంధి తా శిరసు మజ్జనమై తెలివల్వ యొంటికొం
గెలమి ధరించి ఱైక ధరియింపకయే కురు లార్పుచున్న నే
నలమిని గౌగలించుకొన నా హరిమధ్య యనంగసంగరా
కలనఁ బెనంగినట్టి రతికౌశలమున్ మదిలోఁ దలంచెదన్.

229
అందే (4-74)
చ.

కలఁగిన కొప్పుతోఁ జిటిలు గందముతో విడబడ్డఱైకతో
తలిరుల విల్తు పాలె మొకతట్టు తళుక్కను కట్టు కొంగుతో
సొలపుల కన్నుల న్నిదురు సొక్కులతో విరిపాన్పు డిగ్గి నీ
వెలమిని వచ్చురీతి మది నెన్నుదు నో మదహంసగామినీ.

230

పూర్వలాక్షణికుల గ్రంథములందు 'ఱవికె' అని కకారమున కేత్వ మున్నది. 'ఱైక' అని యతిస్థానమందు తలకట్టున్నది. రెండును గలవని తోచుచున్నది. (ఇట్లే) 'పోలిక' (కకారముకు) తలకట్టు సాధారణము. (ఎత్వము గలదు)231

శల్యపర్వము (1-153)
క.

పెనుఱొంపి లోపలను బ్రుం
గిన ధేనువు నెత్తు పోలికెను శల్యుం డ
మ్మొన.........

232
‘పైట’
చేమకూరవారి విజయవిలాసము (1-76)
సీ.పా.

బెళుకు కాటుక కంటి సొలపు చూ పెదలోనఁ
             బట్టియుఁడెడు ప్రేమఁ బట్టి యియ్య
చికిలి బంగరువ్రాత జిలుఁగు టొయ్యారంపుఁ
             బైట గుబ్బలగుట్టు బైట వెయ్య......

233
చేమకూరవారి సారంగధరచరిత్ర (2-89)
మ.

అని యూహింపుచు లజ్ఞవో విడిచి యేకాంతంబుఁగా నల్దెసల్
గనుచుం బైటతొలంగ నీవి వదలం గామాంధకారంబు నె

మ్మనముం గప్పినఁ గన్ను గాన కపుడా మత్తేభగంభీరగా
మిని యత్యంతనిరంకుశోద్ధతిని బల్మిం బట్టఁగాఁ జూచినన్.

234

మొదటి (చరణమున) నిత్యసమాసయతి.235

‘పయట'
తారాశశాంకవిజయము (2-75)
మ.

జనము ల్లేనియెడన్ శశాంకుసరసన్ సామ్రాణిధూపంబు వా
సన గుప్పన్ నెఱిగొప్పు విప్పి పయటం జన్దోయి నిక్కంగ వే
డ్కను గీల్గంటి ఘటించి చెంగలువ మొగ్గల్ చెక్కి రేరాజు యీ
నన నీవంటిన విచ్చునం చతని మేన న్మోపుఁ దా నవ్వుచున్.

236
అందే (3-89)
చ.

అని యిక మారువల్క వలదంచును దీనత దోప నాడుచున్
చనుగవ యుబ్బఁగాఁ బయట జాఱఁగఁ గ్రొమ్ముడి వీడ దేహమె
ల్లను బులకింప నీవి వదలం గరకంకణకింకిణీకన
ద్ఘనమణిమేఖలాధ్వనులు గ్రమ్మగఁ బైఁబడి కౌగిలించినన్.

237

పయ్యెద, పయ్యద (వీటి కుదాహరణములు) ప్రథమాశ్వాసము నందు వ్రాసినాము.238

‘పయంట.'
తిమ్మకవిసార్వభౌముని శివలీలావిలాసము
సీ.

కిన్నెర మీటి కన్గిఱిపి సన్నలు సేయు
             పకపక నగి యేలపదము పాడు
కెంగేల లాంతంబు గిఱగిఱఁ ద్రిప్పు లోఁ
             జొక్కుచు వెడవెడ మ్రొక్కు మ్రొక్కు
లింగ లింగ యటంచు చంగునఁ దాటు మీ
             సలు గీటి గడ్డంబు చక్కఁదువ్వు
కులుకుచు జిలిబిలిపలుకులు పలుకుఁ గా
             మిడియై పయంట కొంగిడిసి తిగుచు

తివిరి బతిమాలు దిక్కులు తిరిగిచూచు
నవల కరిగెడుచోఁ ద్రోవ కడ్డునిలుచు
వలపు లూఱంగఁ జెలి మరుల్ గొలుపు కొనుచు
కోడెప్రాయంపు జంగమకులవిభుండు.

239
తారాశశాంక విజయము (2-73)
ఉ.

కమ్మ జవాది వాసనలు గ్రమ్మఁగ నోరపయంట జాఱఁగా
యెమ్మెలు మీఱ నగ్గురుని యింతి తొలంగఁగ నిమ్ములేని మా
ర్గమ్మునఁ జంద్రునిం గదియఁగాఁ జని వాని భుజంబు సోకఁగా
జిమ్మును జన్మొనల్ కలలు చెమ్మగిలన్ తనువెల్ల ఝమ్మనన్.

240
పయ్యంట
తారాశశాంకవిజయము (4-6)
ఉ.

ఇంటికిఁ దోడి తెచ్చి మణిహేమమయోజ్జ్వలపీఠి నుంచి ప
య్యంట చలింపఁగా సురటి నల్లన వీచుచుఁ బ్రాణనాథ! న
న్నొంటిగ నుంచి యీకరణి నుండుదురే క్రతువాయెనే సుఖం
బుంటిరె యిన్నినాళ్లు పురుహూతు బహూకృతి గంటిరే యనన్.

241
చేమకూరవారి విజయవిలాసము (2-134)

గెంటని ప్రేమ మేను పులకింపఁ గిరీటికిఁ బూ లొసంగి వా
ల్గంటి గిరుక్కునం దిరుగు ఘమ్మని కస్తురితావి గ్రమ్ము కో
గింటెపు గబ్బిగుబ్బల జిగి న్వెలిజిమ్ము నొయారి జిల్గు ప
య్యంట చెఱం గొకింత తనయంకము నందటు సోకినంతటన్.

242
ఆంధ్రశేషమందు (52)
సీ. పా.

పయ్యెద యనఁగను పైట యనంగ సం
             వ్యానంబునకు నాఖ్య లగుచునుండు

243

అని రెండు పదములు మాత్రమే చెప్పినారు గాని, మహాకవి ప్రయోగము లాఱువిధములు గలవు.244

‘వుచ్చికొని-వుచ్చుకొని, వ్రచ్చికొని-వ్రచ్చుకొని' మొదలైన శబ్దములందు ఇత్వముత్వములు రెండును చకారమునకు గలవు245

‘వుచ్చికొని'
సౌప్తికపర్వము (2-5)
చ.

సకలజనప్రశస్తమగు చక్రము నీవొసఁగంగ నేను బు
చ్చికొని భవత్పదాంబురుహసేవ పదంపడి చేసియైనఁ బో
రికి నిను నియ్యకొల్పి మది ప్రీతియెలర్పఁ బెనంగి నీకు నో
డక విలసిల్లి యెల్ల బొగడం బెనుపొందఁగఁ గోరి వేడితిన్.

246

'ఎల్ల' యనఁగా సమస్తమైనవారని యర్థము. ఎల్ల, ఎల్లరు, ఎల్లవారు-3 విధములు గలదు. ఎల్ల- తెలుపు వర్ణమునకు నర్థముగలదు.247

'వ్రచ్చుకొని'
కృష్ణరాయల ఆముక్తమాల్యద (4-21)
చ.

ఒకమరి బుజ్జగింప విలయోదకముల్ పయి కుబ్బి చిప్ప వ్ర
చ్చుకొని మహాభ్రవీథిఁ జన సూకరత న్మెయివెంచి వెండి క్రిం
దికి గయిజాలు తత్సలిలనిర్మలధార నతఃపరిస్ఫురత్
ప్రకృతికి నీయజాండమును బంగరుముంగరగా నొనర్పవే.

248

'పళ్లెరము, ఓగిరము' అని ఆంధ్రనామసంగ్రహమందు చెప్పిరిగాని, 'పళ్యము, ఓయిరము' అనిన్ని గలదు.249

'పళ్యము'
శ్రీనాథుని కాశీఖండము (5-307)
ఉ.

అంబుజబాంధవాన్వయ నృపాగ్రణి బోనము నేడు సూర్యపా
కంబయి నాయితంబయిన ఖజ్జము భోజనశాలలోనఁ బ
ళ్యం బిడినారు పంకజదలాక్షులు రెండవజాము గంట వ్రే
యఁబడె నారగింప సమయంబని చెచ్చెర విన్నవించినన్.

250
'ఓయిరము'
అందే (5-297)
గీ.

అగ్ని మనలోన నొక్కరు డౌట కాఁడొ
చేయఁడే మారుతము మన చెప్పినట్ల
వరుణుఁ డెవ్వరివాఁడు మువ్వురును లేక
నాయితంబగు నెబ్బంగి నోయిరంబు.

251
ఆంధ్రనామసంగ్రహమునందు (స్థావర. 78)
గీ.

దండ చేరువ సంగడ దాపు చెంత
సరస చెంగట యొద్ద దగ్గర కురంగ
టండ పజ్జ యనా సమీపాఖ్యలు...

అని చెప్పిరిగాని, 'చెరువ' (ఎత్వముతో) అనిన్ని గలదు.252

'చెరువ'
విరాటపర్వము (4-01)
చ.

వెరవరిగాక వీఁడు కురువీరులకుం టొడసూపువాఁడె య
చ్చెరు వొక మ్రాన సేరి యిటు చేరఁగ వచ్చుచు నున్నవాఁ డహం
కరణము గాని యొండొకటి గానఁడు మూర్తి విశేషమారయన్
సురపతి యట్ల వీని మది చొప్పది యెట్లు యెఱుంగ నయ్యెడున్.

253

('రేయి' కి హ్రస్వేత్వముతో) 'రెయి' అనిన్ని గలదు.254

అడిదము సూరకవి కవిజనరంజనము
చ.

అనుపమహైమకుడ్యఘటితాంచదనంతమణిప్రణాలిచే
ననయము తత్పురీవరమహాగృహముల్ రెయి దోచకుండఁగా
నొనరుచుటం జుమీ గృహము లొప్పె నిశాంతసమాఖ్యయంబుల
న్వినుతి యొనర్సఁగాఁ దరమె వీటను గల్గిన రత్నసంపదన్.

255

'కూరుకు నిద్ర చేకూరుటయును' అని లాక్షణికులు రేఫములందు వ్రాసినారు. 'చేకూడె' యని డకారమున్ను గలదు.256

'చేకూడె'
చేమకూరవారి విజయవిలాసము
సీ.

కలిగెఁబో యీ యింతి కులుకుగుబ్బలు చూడ
             శీతశైలాదులసేవఫలము
కలిగెఁబో యీభామ వలులయందము చూడ
             గంగాతరంగముల్ గనిన ఫలము
కలిగెఁబో యీనాతి కనుబొమల్ చూడంగ
             మును ధనుష్కోటిలో మునుఁగు ఫలము
కలిగెఁబో యీచామ కటివిలాసము చూడ
             భూప్రదక్షిణము సల్పుటకు ఫలము
తోడుతోడనె యిటల చేకూరవలదె
తన్వి తీఱంగ నింక నిత్తన్విఁ గూడి
సరససల్లాపసంభోగసరణి దేలు
నాడుగాక ఫలించుట నాదుతపము.

257

ఇటువలెనే 'సమకూడె' ననవచ్చును. అలంకారికులు గ్రామ్యమనిన 'కటి' ప్రయోగము (కవి ప్రయోగముల) నున్నది. గ్రామ్యము కాదు. అలంకారికులు పరిశీలించని మాట.258

'చేకురె', 'సమకురె' అని హ్రస్వము (కకారోత్వము) గలదు.259

మనుచరిత్రము (2-58)
క.

కుశలవ యేవ్రతముల నగు
నశనాయాసమున నింద్రియవిరోధమునన్
కృశుఁడై యాత్మనలంచుట
సశరీరస్వర్గసుఖము సమకురియుండన్.

260

అచ్చుపుస్తకములందు 'సమకురి', 'చేకురి' (యనునవి) ఱకారములతో వ్రాసినారు, ఱకారమని లాక్షణికులు చెప్పనూలేదు, ప్రయోగములును కనిపించవు.261

'గూరిచి-గురిచి', 'జోహారు'-'జొహారు', 'బేహారి'-'బెహారి' అని యీమొదలైనవి (ఆద్యచ్చులు) హ్రస్వదీర్ఘములు(గా) గలవు. 'సోరణగండ్లు'-'సోర్ణగండ్లు' అనియు గలదు.262

'సోరణగండ్లు'
చేమకూరవారి విజయవిలాసము (1-11)
సీ.పా.

తెలతెలవార నా మలయ గంధవహుండు
             సోరణగండ్లలోఁ జొచ్చియాడు......

263
'సోర్ణగండ్లు'
ఉద్యోగపర్వము (2−112)
గీ.పా.

తెల్లవారుచున్న దివియ లల్లార్పుచు
సోర్ణగండ్ల యందుఁ జొచ్చి సుడిసి...

264

దివియ - దివ్వె - దివ్విటీ- దీవియ అని గలదు265

'దీవియలు'
భీష్మపర్వము (2-842)
క.

సమరక్రీడల లీలం
దమక తమక తనిసి మరలి తమతమ యావా
సములకు నరిగి రుభయసై
న్యముల జనంబులును దీవియలు వెలుఁగంగన్.

266
'దివ్విటీ'
తిమ్మకవిగారి అచ్చతెనుగు రామాయణము (సుందర. 6)
క.

అరిగెడుచో నీతఁడు సెలి
నరయుచునున్ వెలుఁగవలయు నని జేజేల్ వా
విరిఁ బట్టు దివ్విటీ యనఁ
దరముగ రేఱేఁడు తూర్పుదెసఁ గన్పట్లైన్.

267
'దివ్వె'
అందే (సుందర. 11)
సీ.పా.

ఒడమే ల్రవణంపు టుఱువు మానికెములు
             మలయు దివ్వెలతోడ మార్వెలుంగ...

268
‘తమ తమ' అనుటకు 'తన తన' అని బహుత్వమందును గలదు.269
(బహుత్వమున) 'తన తన'
భీష్మపర్వము (1-175)
క.

తన తన శంఖంబులు త
క్కును గల దొరలెల్ల ననికిఁ గొనఁగొని పూరిం
చిన వివిధ తూర్యనాదం
బును జెలఁగె నభంబు దిశలు పూర్ణంబయ్యెన్.

270

'ఉయ్యల - ఉయ్యాల - ఉయ్యెల - ఊయేల' అని గలదు. ప్రథమాశ్వాసమందు (మొదటి) మూడువిధము లున్నవి (వ్రాసినాము).271

'ఊయల'
తిమ్మకవిసార్వభౌముని అచ్చతెనుగు రామాయణము (అరణ్య. 59)
సీ.

వేల్పురాయఁడు బత్తి వెలయఁ బుత్తెంచిన
             వుడుకు మ్రాన్వలి దావి పూవుటెత్తు
లీదు మేపరిసామి యిమ్ముగాఁ బనిచిన
             మవ్వంపుఁ బలుదమ్మి మానికెములు
త్రాడుదాలుపు మిత్త తనమున కొసఁగిన
             క్రొత్త నున్గట్టాణి ముత్తియంబు
లెద్దుతత్తడి జోదు నుద్దికాడిడిన హొం
             బట్టు నాడెపు జిల్గు పుట్టములును
మఱియఁ దక్కిన కడలఱేం డ్రురక మంచి
సేయుటకుఁ బంచు నపరంజి యూయెలలును
గద్దియలు మేలుసెజ్జలు పెద్దతొడవు
లెపుడు నాయింటఁ గొదలేక యెనసియుండు.

272

'ఊయాల' అనియు నుండవచ్చును.273

'కార్ముకం బొప్పు విల్లు సింగాణి యనఁగ' అని ఆంధ్రనామసంగ్రహము. కాని 'సింగిణి, సింగిణీ విలు' అనియును గలదు.274
సింగిణి
తిమ్మకవిసార్వభౌముని రసికజనమనోభిరామము
క.

అంగన కనుబొమగవతో
సింగిణు లెదిరించి గెలుపు చేకురక వడిన్
వంగి శరమూని కడు నా
ర్తిం గొలుచుచు నుండెఁజుమ్ము నృపకులతిలకా.

275

‘చేకురక' (అని ఇక్కడ) హ్రస్వము.276

తిమ్మన పారిజాతాపహరణము (5-16)
ఉ.

ఱింగున మోత మోగుచును ఱెక్కల పావుల వోలె శౌరిచే
సిఁగిణి వింట వెల్లిగొను చిత్రశరంబుల (సూతు నొంచి ర
థ్యాంగకముల్ దశించుచు నిజావయవంబులు దూర్చి దేవతా
పుంగవుఁ డోసరించుటయు బోరన నడ్డము సొచ్చె సైన్యముల్)

277
'సింగిణీ విల్లు'
చేమకూరవారి విజయవిలాసము (1-134)
శా.

చెండ్లా గుబ్బలు జాళువాతళుకులా చెక్కిళ్ళడాల్ సింగిణీ
విండ్లా కన్బొమ (లింద్రనీలమణులా వేణీరుచుల్ దమ్మి లే
దూండ్ల బాహువు లింత చక్కదన మెందుం గాన మీ జవ్వనిం
బెండ్లాడం గలవాఁడు చేసినది సుమ్మీ భాగ్య మూహింపఁగన్)

278

(సాహిణి-సాహిణీ' అని రెండును గలవు.) సాహిణి సులభము. 279

'సాహిణీ'
శ్రీ కృష్ణరాయల ఆముక్తమాల్యద
చ.

పొలమరులందుఁ గూతలిడ భూసురు లన్నది వార్చి వార్చి మ్రా
కుల తుద లెక్కి సప్పటులఁగొట్టి యదల్పఁగ సాహిణీలు మా
వుల బరపంగ.....

280
'లకోరీ' దీర్ఘమని లాక్షణికు లన్నారు గాని (ఇకారము) హ్రస్వమును గలదు.281
'లకోరి'
చేమకూరవారి విజయవిలాసము (1-146)
చ.

వెడ విలుకానికిం జెఱుకువిల్లును గల్వలకోరి కోరికల్
గడలు కొనంగ నామని(యుఁ గల్వలరాయఁడు నిచ్చి మన్ననం
బడయుడు వానికెక్కుడుగ మౌర్యులు తామును గాన్క తెచ్చెనా
బడిబడి గంధలుబ్ధ మధుపంబులు రాఁ జనుదెంచెఁ దెమ్మెరల్)

282
తిమ్మకవిసార్వభౌముని అచ్చతెనుగు రామాయణము (బాల. 157)
ఉ.

అమ్మగ మానికంబు దిటమారగ నొక్క లకోరిఁ జెడ్డ రే
ద్రిమ్మరి కొమ్మ నుక్కడచి (తేటగ జన్నముగాచి చట్టు చం
దమ్మున నున్న పెందపసి తామరకంటినిఁ బ్రోచి యిందవ
చ్చె మ్మొగి నీదు జన్నమఱసేయక చూచు కడంక మీఱఁగన్)

283

'ముందట-ముందల' (అని రెండును గలవు).284

'ముందట'
ద్రోణపర్వము (4-94)
క.

ఎటు వోన వచ్చు నినుముం
దట నిడుకొని పోరనన్ను తగురాజునె నె
క్కటి దోలెడు సాత్యకి నీ
వటఁ దఱుముదుగాక యొదగ నగునే నీకున్.

285
'ముందల'
తిక్కనగారి ఉత్తర రామాయణము (7-68)
చ.

నలినజుఁడైన బ్రహ్మకును నాలవవాఁడు దశాననుండు ని
ర్మలగుణలోల వీఁడు మనుమండని చెప్పఁగ నాకు సిగ్గగున్
పలుకులు వేయునేటికి గృపాపరతాస్తుతిదక్క పనిముం
దల విడు నాకుగా నృపతి ధర్మవిచక్షణ పుణ్యవీక్షణా!

286
‘కన్గిఱుపుట-కన్గిలుపుట' అని రెండు విధములు గలవు.287
'కన్గిఱుపు'
విరాటపర్వము (5-141)
చ.

ఉఱక నరుండు ద్రోణసుతు యుగ్యముల న్వెస నొంచి నాతఁడం
దెఱపి యొకింత గాంచి ఘనతీవ్రశరంబున నారి ద్రుంచి క
న్గిఱిపినమాత్రలోన నతనిం బటు బాణచతుష్క.....యే
డ్తెఱఁ దొడి మౌర్విఁగ్రమ్మఱ ఘటించునెడ న్వడినేసి యార్చినన్.

288

‘తొడిగి' యనుటకు 'తొడి' అనియు గలదు.289

'కన్గిలుపు'
చేమకూరవారి విజయవిలాసము (3-28)
సీ.

పులకించె మే నేమి తలచుకొంటివొ యంచు
             మేలంబు పచరించె మిత్రవింద
యిన్నాళ్ళవలె మనసిచ్చి మాటాడవే
             మెందు దృష్టి యని కాలింది దెగడె
చెలిపెండ్లికత చెప్ప చెవియొగ్గి వినదేమి
             కలదులే యని గేలిసలిపె భద్ర
వలపు వాసనవేసె కలికి నీ ముఖ మంచుఁ
             ద్రస్తరినెఱపె సుదంత గొంత
జాంబవతి నవ్వె లక్షణ సరసమాడె
గేలి కడు సేసెదరు ముద్దరాలి ననుచు
వలికె రుక్మిణి సత్య కన్గిలిపె నపుడు
చిన్నిమఱదలి మోహంపుచిన్నె లెఱిఁగి.

290

‘సంబలము-సంబడము' (రెండునుగలవు)291

'సంబలము'
జయ రమా రామ శతకము
సీ.

రథభటతురగవారణకోటి నేలి సం
             బల మియ్యలేక కోతులబలంబు
గూర్చుకొంటివి పైడి కోకలు పెట్టెలఁ
             బెట్టి వల్కలములు గట్టుకొంటి

నన్నము గల్గ కాయలు పండ్లు దిన నేర్చు
             కొంటివి, మృదుశయ్య లింట దాచి
పవ్వళించితి చెట్లపంచల, మృగమద
             శ్రీగంధ మొకమూలఁ జేర్చి బూది
బూసుకొంటివి, ధనకాంక్ష భూపతులకు
సహజగుణమన్నమాట నిశ్చయము దోచె
నింత లోభివి నాకేమి యియ్యగలవు?
జయరమారామ! రామ! రాక్షసవిరామ!

292

'పవ్వళించితి' - 'వి' అను అక్షరలోపము.293

'సంబడము'
తిమ్మకవి అచ్చతెనుగు రామాయణము (సుందర- 154)
గీ.

అడవి దుంపలెకాని సంబడము లొసఁగఁ
గాసువీసంబు చేత నెక్కడను లేక
మగువఁ గోల్పోయి కడు నిడుమలఁ గలంగు
నలతిదొరఁ గొల్వఁగడఁగు వెంగళులు గలరె.

294

'దాపల-దాపర' (అని రెండు విధములున్నవి.){{float right|}295}

'దాపల'
అప్పకవీయము (5-145)
క.

లలిసరసస్థిరముల దా
పలి నాంతపదంబు లూది వలికెడుచో సం
ధులు గాంచును టతవర్గం
బులు నాఱిటిచెంతఁ దక్క బొల్లు లయి హరీ!

296
'దాపర'
అప్పకవీయము (2-21)
సీ. గీ.

(యామ్యమున గండ్రగొడ్డలి యట్లొనర్పఁ
గ్రాలు నోత్వ మిన్నింటి దీర్ఘములు కుడిని)
కరికరాకృతిఁ దనర దాపర వలపల
(నమరు నైత్వౌత్వములు త్రిశూలములకరణి.)

297
'తలము-తరము' (అని రెండును గలవు.)298
'తలము'
మనుచరిత్రము (2-11)

తలమే బ్రహ్మకునైన నీనగమహత్యంబెన్న నే నీయెడం
గల చోద్యంబులు జేపు గన్గొనియెద (న్గాకేమి నే డేగెదన్
నలినీబాంధవభానుతప్త రవికాంత స్యంది నీహారకం
దల చూత్కారపరంపరల్

299
'తరము'
తిమ్మకవిసార్వభౌముని సారంగధరచరిత్ర
ద్విపద.

దండించుఁ గాకేమి దైవయోగం బె
టుండినఁ దొలఁగఁ జేయుట కేదితరము
తరము గాదింక నీ దబ్బఱ ల్మాను
మరుదండ నిదె తెత్తు నవ్విహంగంబు.

300

‘మఱువక-మఱక-మర్వక-మఱాక' (అని నాల్గు విధములును గలవు.)301

'మర్వక'
ఉద్యోగపర్వము (4–70)
చ.

(అనుటయు నప్డు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ని
ట్లను దైవసంఘటన మక్కట యెట్లును దప్ప నేర్చునే)
అనుపమ సత్యవిస్ఫురణ నాడిన మాటలు మర్వకన్న నీ
యనుజుల నల్వురం గడపు నర్జును చేతకు సమ్మతించితిన్.

302
'మఱాకు'
తిమ్మకవి అచ్చతెనుగు రామాయణము (కిష్కింధ. 84)
గీ.

కోతి రాయఁడ మాపయిఁ గూర్మి నిలిపి
నాన తఱి యెల్లనగరుల లోన నుండు
తబిసిరూపుల బ్రోళ్లకు దవిలిరాగ
మాకు పొసఁగదు పొమ్ము మఱాక రమ్ము

303

మిగిలినవి సులభము.304

'అనక-అనాక' (అని రెండును గలవు. 'అనక' సులభము)305
‘అనాక'
తిక్కనగారి ఉత్తర రామాయణము (8-118)
ఉ.

ఐనను మీకు నొక్కతెఱఁ గస్ఖలితంబుగ నేను సెప్పెదన్
దానికిఁ గాదనాక భవనంబునకు న్నను శుద్ధుఁజేయుఁ డ
జ్ఞానికి నెల్లభంగుల నిజంబుగ నిప్డు పరిత్యజించినం
గాని యకీర్తి వాయ దటు గాదని నోరులు ముయ్యవచ్చునే.

306

'ఇపుడు’ అనుచోట 'ఇప్డు' అని యున్నది.307

'పోశ్చతర్థవాచకేషూతః'

అని నన్నయభట్టుగారి సూత్రమువలన 'అప్పుడు-ఇపుడు-ఎపుడు'- ఈపదముల పువర్ణము యొక్క ఉకారమునకు లోపమని స్పష్టము. కాని (ఇట్టి లోపము పొందునవి) మరియున్ను గలవు.308

'విడ్వ' విడువ
మహాప్రస్థానపర్వము (1-58)
చ.

జనులు నుతింపఁగా సుకృతసంపదఁ జేసి యమర్త్యభావముం
గనియును (జెంద) కిట్లునికి కార్యమె ద్రౌపది భీమసేను న
ర్జును గవలం ద్యజించుటకుఁ జాలితి చాలవయ్యె దీ
శునకము విడ్వ నిత్తెఱఁగు సూరినుతుండగు నీకు నర్హమే.

309
'విన్ము' (వినుము)
అందే (1-58)
చ.

అనఘచరిత్ర విన్ము శరణాగతుఁ జేకొనకున్కి శుద్ధ మి
త్రునియెడఁ జేయు ద్రోహము వధూటి వధించుట విప్రునర్థముం
గొనుట యనంగఁగల్గు నివి గూడ సమంబగు నాకుఁ జూడ భ
క్తు ననపరాధుని న్విడుపు దోషము తా నది యోర్వవచ్చునే.

310
'పొడ్మగ' (పొడుమగ)
అరణ్యపర్వము (6-178)
ఉ.

బోరన విస్ఫులింగములు పొడ్మగ నుగ్రవిషంబు గ్రక్కుచున్
(గ్రూరవిచేష్ట నాలుకలుగోయు మహోరగరాజయుగ్మముం

జేరి పదాహతిం గినియఁ జేయఁదలంచుటగా నెఱుంగు దు
ర్వారులు మాద్రిపుత్రులు కవజ్ఞయొనర్పఁ దలంచు టేర్పడన్)

311
'కుడ్చు' (కుడుచు)
అందే
సీ. పా.

పల్లెరంబుల గుడ్చు బ్రాహ్మణు లతిపుణ్యు
             లెనిమిదివేల సమిద్ధమతులు.....

312

పదద్వయసంధియందును ఉకారలోపము (కలదు).313

అందే (5-383)
మ.

బలియుం డా ధృతరాష్ట్రసూనుఁడు మహాభాగుండు దుర్యోధనుం
డలఘుం డీ కమలాకరంబునకుఁ గ్రీడార్థంబు కౌతూహలం
బెలయంగాఁ బ్రియకామినీసహితుఁడై యేతెంచుచున్నాఁడు మీ
ర్వల దిందుండఁ దొలఁగిపొం డనవుడు న్వా రుద్దతక్రోధులై

314

'వెలయ' అనుటకు 'ఎలయ' అని యున్నది.315

ఎఱ్ఱనగారి రామాయణము
ఉ.

త్యాగులు పాతకేతరులు నై నుతి కెక్కఁగ నాకలోక లీ
లాగరిమంబు నంబుదము లాగు దలిర్చిన సంస్కృతోల్లస
ద్వాగభియుక్తి నాత్మ విబుధత్వము సిద్ధత నొందఁగా సుధా
యోగము నొందుదు ర్శ్రుతిపయోధి మధించి రసజ్ఞులై కవుల్.

316
శ్రీనాథుని భీమఖండము
సీ.పా.

శాకపోకములతో సంభారములతోడ
             పరిపక్వమగు పెసర్పప్పు తోడ...

317
శ్రీనాథుని కాశీఖండము (1-161)
సీ.పా.

మగఁడు దన్మొత్తిన మార్మొత్తు నలివేణి
             వ్యాఘ్రియై చరియించు వనములోన...

318
పాదాంతమందు విడియుండును.319
శ్రీనాథుని హరవిలాసము (5–18)
క.

భూత ప్రేత పిశాచవ్రాతములుం దోడుగాఁగఁ బ్రమథులు పగలున్
రాతిరియును నష్టాదశ
జాతి ప్రజలకును దుర్దశలు సంధింతుర్.

320

ఇటువలెనే తెలుసుకొనేది.321

'క్వచి ద్గ కారో వః' అని నన్నయభట్టు సూత్రమున్నందున — పగలు-పవలు; తొగలు-తొవలు; పగడము-పవడము; అలిగి-ఆలివి; నగరు-నవరు; నిగుడించుట-నివుడించుట; తగులులు-తవులులు —ఈ మొదలైనవి తెలుసుకొనేది.322

కొన్ని పదముల పకారముకు వకారము (వచ్చును). ఒప్పుట - ఒవ్వుట(అని రెండు నుండును.)323

'ఒవ్వు'
విరాటపర్వము (2-286)
ఉ.

ఒవ్వనివారు నవ్వ మహిమోద్ధతి ధర్మసుతుండు దీనికై
నెవ్వగఁ బొంద భూజనులు నింద యొనర్పఁగ (నేనొనర్చు నీ
చివ్వకు నీవు నల్క మెయిఁ జేసిన యా పని గూఢవృత్తికిన్
దవ్వగునేని నియ్యభిమతం బొడఁగూడియు నిష్ఫలంబగున్)

324
అరణ్యపర్వము (6-16)
క.

ఒవ్వనివారల యెదురన
నివ్విధమున భంగపడితి నేనింక జనుల్
నవ్వంగ నేటి బతుకుగ
నివ్వసుమతి నేలువాఁడ నెట్లు చరింతున్.

325
కొన్నిచోటుల వకారము లోపించి దాపల వర్ణమునకు దీర్ఘము వచ్చును.'నొవ్వక-నోపిక '326
ఉద్యోగపర్వము (1-208)
క.

కావున మీపడిన యర
ణ్యావాసక్లేశమునకు నజ్ఞాతవిధిన్
సేవకుల రైనదానికి
నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరే.

327

నోవ, చావ, వెఱవ, మఱవ - ఈ మొదలైన పదముల వకారములు (కొన్నిచోట్ల) లోపించును.328

(నోవన్ + ఏయ =) 'నోనేయ'
ద్రోణపర్వము (4-198)
గీ.

బలము లచ్చెరువంద నట్లలవు మెఱసి
నీ సుతుం డనిలజుఁ దాకి నిశితసాయ
కముల నొప్పించి రథతురంగముల నొంచి
సూతు నోనేయఁ గ్రోధవిస్ఫూర్తినపుడు.

329
(లేవన్ + ఎత్త = ) 'లేనెత్త'
కవుల షష్ఠము
మ.

తనతో నల్గిన వాణిపాదములమీదన్ వ్రాల లేనెత్తి నొ
య్యనఁ బాశ్చాత్యనిజాస్యతన్ముఖములం దన్యోన్య మొక్కప్డు చుం
బన మబ్బంగఁ జతుర్ముఖత్వము ఫలింపం జోక్కు పద్మాసనుం
డనవద్యాయురుపేతుఁ జేయు చికతిమ్మాధీశుఁ దిమ్మాధిపున్.

330
(చావన్ + ఓప =) 'చానోప'
అరణ్యపర్వము (2-127)
క.

నాలుగు దిశలను దాన
జ్వాలావలి గదిసె మ్రంది చానోపఁ గృపా
లోలా నన్నొక్క సరి
త్కూలము చేరంగ నెత్తికొని పొమ్ము దయన్.

331
(వెఱువకు) 'వెఱకు'
శ్రీనాథుని కాశీఖండము (5-71)
గీ.

చెంచునింటికిఁ బోయి చెంచెతకుఁ బ్రియము
జెప్పి నమ్మించి తలమీదఁ జెయ్యి వెట్టి
వెఱకు మని తన్ముఖంబున నెఱుకుఱేని
గాంచి యాతనితోడ సఖ్యంబు సేసి

332

ఇటువలెనే (కవి ప్రయోగములు) తెలుసుకొనేది.333

'ఏనుగ-ఏనుఁగు-ఏనుంగు-ఏన్గు-ఏనిక' అని గలదు.334

'ఏనిక'
తిమ్మకవిసార్వభౌముని రుక్మిణీపరిణయము
చ.

అనుదినము న్మదిం జలన మానక మానక పూని దీనులన్
మనుచుచుఁ గార్యవేలలను మాధవ మాధవ ముఖ్యులౌ సురల్
దను వినుతింప మేలిడఁగఁ దానగు దాన గుణాఢ్యుఁ డంచు నిం
పెనయఁగఁ గోరి మ్రొక్కిడుదు నేనిక నేనికమోముసామికిన్.

335
'ఏనుంగు' ఏన్గు
తిమ్మకవి అచ్చతెనుగు రామాయణము (యుద్ధ. 188)
గీ.

తేరుతోడఁ దేరు తేజీలోఁ దేజి యే
నుంగుతోడ నేనుఁ ద్రుంగఁగొట్టి
బంట్ల చిత్తెఱఁగులఁ బరిమార్చివైచినఁ
జూచి దొడ్డయొడలి జోదుఁడలిగి.

336

ఇటువలెనే మరియు ననేకశబ్దము లనేకభేదములు గలవు. గ్రంథవిస్తరభయమువలన (వానిని జూప)మానినాము.337

మొదట వ్యంజనములు కలవి, లేనివి పదములు 'పూనె-ఊనె; నెగసె.ఎగసె; పొదవె-ఒదవె; పొనరె-ఒనరె; పొందె-ఒందె', - ఈ పదియు అప్పకవిగారు లక్ష్యములతో వ్రాసినారు. 'వేఁడి-ఏఁడి; నీల్గుట-ఈల్గుట; నెగయుట-ఎగయుట; నంటు-అంటు; నెగ్గు-ఎగ్గు' ఈ పదియు తిమ్మకవిసార్వభౌముడు లక్ష్యములతో వ్రాసినాడు. మరియునుగలవు.338

సి.

ఎడలుట యనఁగను వెడలుట యన నెల్ల
             వెల్ల యనంగను వెన్ను నెన్ను
వీయము నీయము వ్రేసె నేసె ననంగ
             వేచు టనంగను నేచు టనఁగ
వేర్పాటనఁగ మరి యేర్పాటనఁగ నెడ
             బావుటయును బెడబాపుటయును
హురుముంజి యన ముత్తెమురుముంజి యనఁగను
             మొగి యనంగను నట్ల నొగి యనంగ
నీరు మీ రనంగ నీరలు మీరలు
నీవు నీవు నేను నే ననంగ
నేము మే మనంగఁ గృతులందు నలరారు
పృథులకీర్తి! కుక్కుటేశమూర్తి!

339
'ఎడలఁగ' (వెడలఁగ)
హరిశ్చంద్రోపాఖ్యానము (2-90)
క.

అన్నలినాక్షుల వాలుం
గన్నుల కెదిరింపలేని కతమునగాదే
పన్నిన భయమున బేడిస
లెన్నఁగ జలదుర్గభూము లెడలఁగ వెఱచున్.

340
శాంతిపర్వము (5-371)
గీ.

తాను గ్రోధాదు లెడలించు గాని ముక్తి
దెచ్చి యీ దొకభంగి (ముక్తికిఁ బథంబు
నగుడ ననపాయమగు నుపాయం బనంగ
వలసె నీ నేర్పుపే రిందువంశవర్య)

341
'ఎల్ల' (వెల్ల)
శాంతిపర్వము (3-433)
క.

విను విప్రులు బేదలగుట
మనుజేంద్రుని బుద్ధిలేమి మాతాపితృ భా
వనతఁ దగవారిఁ బ్రోచిన
గను మేలున కెల్ల గలదె కౌరవనాథా!

342

‘ఎల్ల’నగా చేవగానిది— ' తెలుపు' అనుట. 'తెలుపు తెల్ల వెల్ల తెలి వెలి నాగ నా, హ్వయము లమరు ధవలవర్ణమునకు' అని ఆంధ్రనామసంగ్రహము.

('వెల్ల' పదమున) లకార (అకారముల) లోపమున్ను గలదు.343

ద్రోణపర్వము (5-190)
మ.

ధనువుం గేతువుఁ ద్రుంచి సారథిని రథ్యవ్రాతముం జంపి యే
పున పాంచాలతనూజు వెల్గొడుగు సొంపుంబెఁపు మాయించి యా
తని (పార్శ్యంబుల యోధవీరశతముం దన్మాన్యుల న్మువ్వురం
దునిమెన్ ద్రోణసుతుఁడు రాజు వొగడన్ దోర్గర్వదుర్వారుఁడై)

344
'ఎన్ను' (వెన్ను)
ఆంధ్రశేషము (72)
క.

వెన్ననఁగఁ బీజమంజరి
వెన్ననఁ జంగమునకు వెలయుం బేళ్ళై
కన్నులనం బర్వమ్ములు
కన్నులనన్ లోచనములు కంఠేకాలా.

345
రుక్మాంగద చరిత్ర (4-40)
గీ.

పండి యెండ ముక్కు వడి రాజనంబొప్పె
నితరసస్యసమితి యెన్ను వంచె
నదులు డింగి కాలునడ లయ్యె నయ్యెడం
బంక మింకె నీరు పలుచనయ్యె

346
వియ్యము-ఈయము
చేమకూరవారి విజయవిలాసము (3-123)
సీ. పా.

వియ్యంపు మర్యాద వెలయఁ దామును శచీ
             జాని బువ్వాన భోజనము చేసి...

347
అందే (3–123)
ఉ.

ఈయపురాల వైతివిగ యిపు డత్తవు (తొంటివావి నో
తోయజనేత్రు గాంచిన వధూమణి నీసుతఁ బెండ్లియాడఁగా

నాయము నాకుమారునకు నర్మిలి హత్తగ నత్త వావిచే
నాయువు గల్గువాఁ డవునటండ్రు శుభంబగు దీన నెంతయున్)

348

'వేసె-ఏసి' భాస్కర రామాయణ పద్యము శసలకు ప్రాసమందు (ప్రథమాశ్వాసమున) వ్రాసినాము.349

వేచుట-ఏపుట
శాంతిపర్వము (3-20)
చ.

విను మరి జంపనుం జెఱప వేచుట లెస్స ప్రతాపభాషణం
బున (వెడనుల్లికుట్టులను బొంకుల వానిఁ గలంగఁ జేసిరేఁ
చినఁ దనపూవు దప్పు నఱసేయని చందము నమ్మియున్న చా
డ్పును మెఱయంగఁ బల్కుచుఁ గడున్ మది నమ్మకయుండుఁగా దగన్)

350
సౌప్తికపర్వము (1-66)
గీ.

అలుక బొడమువాని కర్ణచింతకునకు
నాతురునకు మన్మథార్తునకును
నిద్రవచ్చునెట్లు నీవును దీనిని
నెఱిఁగి యుండి యేటి కేప నన్ను.

351
'వేర్పడు'
శాంతిపర్వము (3-228)
గీ.

మేలుచేసి తగిన మిత్రులఁ బడసి త
త్సుచరితముల వచ్చు సుఖము లనుభ
వింపఁ జూచు టుడిగి వేర్పడియుండుట
యరయ నీతివిదుల తెరవుగాదు.

352

అచ్చు (ఏర్పడు) కు కాకుస్వరములందు (లక్ష్య) మున్నది, 'ఎడబాపుట'సులభము.353

'పెడబాపు'
చేమకూరవారి విజయవిలాసము (3-119)
క.

వడిఁ దెఱవల్ తెర వంపం
బడుతుక నగుమోము గానబడియెన్ గాంతుల్
దడఁబడఁగ శరన్మేఘము
బెడపాసి వెలుంగు చంద్రబింబము వోలెన్.

354

'హరివాణము తెనె హరువును నరయఁగ, హురుమంజి ముత్తియంబు హొరంగుం, బరికింపఁగ రేఫములగు' నని లాక్షణికులు (హురుమంజి) హకారములలో వ్రాసినారు. (కాని అజాదిగా కూడ కలదు.)356

చేమకూరవారి సారంగధరచరిత్ర (2-62)
ఉ.

నా యపరంజిమేడ నొకనాడును జూడవుగా యగోచరం
బా యురుమంజి ముత్తి యపుటన్నువ సోరణగండ్లయంద మా
చాయలకెంపుటోవరుల చందము నా చెలువుల్ దొలంకురే
రాయల రాయరుంగులగు రాగము లామణికుడ్యభాగముల్.

356

హురుమంజి-ఉరుమంజి-ఆణి-సుపాణి-సుప్పాణి - ఈ పదములు ప్రశస్తమైన ముత్యములకు పేరు. (ఇవి) విశేషణ విశేష్యములు రెండునగును.

"ఉదయాద్రి కరిమీద హురుమంజి చౌడోలు" అని మృత్యుంజయవిలాసము
‘ఈసుపాణి రదశ్రేణియే సుపాణి' అని విజయవిలాసము. (1-130)

357

ఆత్తులు-హత్తులు; అదను-హదను; అజ్జ-హజ్జ; ఆంజ,—ఇటువలెనే కొన్నిపదములు రెండువిధములను గలవు.358

మొగి-ఒగి
ఆదిపర్వము (6–60)
సీ.పా.

మొగిని దధీచి యెమ్మునఁ బుట్టదయ్యెనే
వాసవాయుధమైన వజ్ర మదియు...

359
అందే (3-58)
క.

ఆదిత్యదైత్యదానవు
లాదిగఁ గల భూతరాశి నగు సంభవముల్
మేదినిఁ దదంశముల మ
ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగన్.

360
ఈరు-మీరు, ఈరలు—మీరలు, ఈవు- నీవు, ఏన-నేను-ఏ-నే, ఏము-మేము; అంపుట-పంపుట. అనుపుట-పనుపుట, ఈ మొదలయినవి రెండు విధములు బహులములు (ఉదాహరణములు) గలవు.361
వ్రేసులు-క్రాముడుతో
కర్ణపర్వము (3-97)
చ.

అన విని యమ్మహీరమణుఁ డాతని కిట్లను మీకు నాకతం
బున బహుదుఃఖము ల్గలిగె భూరికులంబున కప్రియం బొన
ర్చిన యనినీతుఁ బాపవరు వేయఁదగుం దలద్రెవ్వ నీమనం
బున కృపపుట్టి కాచినను బోయెద నిప్పుడె యేను కానకున్.

362

ఇటువలెనే (ఇంకను) తెలుసుకొనేది.363

అందఱు – అందొఱు, ఒకటి-ఒకొటి, ఈ రెండు నప్పకవిగారును, కంటిపొరలు-పరలు, పొదమా-పదమా- ఈ రెండును తిమ్మకవి సార్వభౌముడు వ్రాసినారు. తలగుట-తొలగుట; నేల పొరలుట - పరలుట,- ఇవియును గలవు.364

కృష్ణరాయల ఆముక్తమాల్యద (2–46)
సీ.పా.

నిద్రిత ద్రుచ్ఛాయ నిలువర జరుగు వెం
బడనె యధ్వగపంక్తి పరలు నెట్లు......

365

వ్యాఖ్యయందు ‘పొరలు వెట్టు' అను (దానికి) అర్థము వ్రాసినారు. యతిభంగము కానలేదు. మిగిలినవి (పదములకు లక్ష్యములు) సులభము.366

తద్భవ సకారముకు-కొన్నింట తలకట్టు, కొన్నింట నేత్వము (గలదు.) 'శయ్యకు'కు రెండును (ఉన్నవి.) శంఖమునకు 'సంకు', శాణముకు 'సాన', శణక - సెలగ, శక్తి-సత్తి, శల్యుడు- సెల్లుడు, శపియించుట - సెపియించుట, శయ్య-సజ్జ, సెజ్జ, శణగ శబ్దముకు జనుము.367

'సెల్లుడు'
ఆదిపర్వము (7-204)
గీ.

సెల్లుఁ డట్లు నేలఁ ద్రెళ్లి చెచ్చెర లేచి
యెడలు దుడుచు కొనుచు నొయ్య నరిగె....

368
(ఈ పద్యమందు) 'సెల్లుఁడ'ని యెఱుగక-'శల్యుఁ డట్లు నేల చతికిలఁబడి' అని వ్రాసినారు.369
శల్యపర్వము (1-250)
చ.

వెరవును లావుఁ జేవయును వీరల కారయ నొక్కరూప సు
స్థిరభుజశక్తి ధర్మజుఁడు సెల్లుని రూపడఁగించి యివ్వనుం
ధరఁ గొను నొక్కొ నే డితనిఁ దా సమయించి సమస్తమేదినీ
శ్వరుఁడుగఁ జేయ నోపునొకొ శల్యుఁడు గౌరవరాజనందనున్.

370
'సెపియించు'
శాంతిపర్వము (4-157)
క.

నృప నీవు మదీయంబగు
జపము ఫలంబడిగితేను సమ్మతి నీఁగా
విపరీత ఫణితు లాడిన
సెపియింతుఁ జుమీ యెఱుంగఁ జెప్పితి నీకున్.

371

'(శపియింతు జుమీ) యెఱుంగఁ జాటితి నీకున్' అని దిద్దినారు. అర్థము బాగులేదు. రాజు, బ్రాహ్మణుడు ఎదురుగా నుండి మాటలాడుతఱి 'చాటితి' అనుట కూడదు.372

‘కొబ్బరి-కొబ్బెర అని రెండును గలవు.373
‘కొబ్బెర'
అప్పకవీయము {2-196)
'సీ.పా.

బిరుదు లబ్బురము కొబ్బెరకాయ బెరయుట'

అని ఏత్వములందు వ్రాసినారు.374

తిమ్మకవి శివలీలావిలాసము
గీ. పా.

పెరుగు పాలు జున్ను బెల్లంబు నెయ్యి కొ
బ్బరి యనంటి పనస పండ్లు.....

375

మన్నీడు-మనీడు, చెన్నటి-చెనటి, దున్నుట-దునుట, కొమ్మ-కొమ = స్త్రీ, కనుబొమ్మ-కనుబొమ, కన్నులు-కనులు, విల్లు-(విలు)-విల్, ముల్లు-ముల్, ప్రెగ్గడ— ప్రెగడ, — ఈ మొదలైన పదములు బహులములు గలవు.376

గండపెండేరము - గండపెండరము, చౌవంచి - చవువంచి అనియు గలవు.377
'గండపెండరము '
తిమ్మకవి అచ్చతెలుగు రామాయణము (యు. 203)

పొసఁగ నౌదలల హొన్బొమిడికమ్ములు పూని
డాకాల గండపెండర మమర్చి...

378
‘హొన్ను' అనుటకు 'హొన్' అని యున్నది. 379
'చవువంచి'
అందే (యు. 184)
సీ. పా.

కాలరిపౌజు వెక్కసపు టేర్పుల జంట
చవువంచి కటలును బెవడువడఁగ ...

380

'పసిడి బంగరు బంగారు పైడిహొన్ను, జాలువా పుత్తడి యనంగ స్వర్ణ మొప్పు' అని ఆంధ్రనామసంగ్రహము (స్థావర. 35) న చెప్పినారు గాని, 'బంగారము-బంగరము-బంగరువు'—అనిన్ని కలదు.381

'బంగారము'
శ్రీనాథుని కాశీఖండము (1-17)
గీ.

కలిగె పదియాఱు వన్నె బంగారమునకుఁ
బద్మరాగంబు తోడ సంపర్కలబ్ధి
(కాశికాఖండ మను మహాగ్రంథమునకు
నాయకుఁడు వీరభద్రభూనాథుఁ డగుట)

382
'బంగరువు'
అందే (7-40)
సీ. గీ.

గురుతనూభవ నాకు బంగరువు తోడ
వజ్రభూషలు సేయు తాల్పంపవలయు
(ననుచుఁ బ్రార్థించి రందఱ కతడు మ్రొక్కి
యిన్నియును దాను కల్పింప నియ్యకొనియె.)

388

పూ-పూవు-పువు-పువ్వు; దౌ-దౌవు-దవు-దవ్వు; మామిడి-మావిడి; కేళా-కూళి; మోసాల-మొగసాల-మోసల-సావడి; సంపెంగ-సంపంగి-సంపెగ - సం పగి; గొజ్జంగ–గొజ్జంగి-గొజ్జెగ; వే-వేయి-వెయ్యి-వెయి; నే-నేయి-నెయ్యి-నెయి; చే-చేయి-చెయ్యి-చెయి, ఈ మొదలగు భేదములు గలవు.384

'వే'
శ్రీనాథుని నైషధము (4-25)
గీ.

(స్మరశిలీముఖ కుసుమకేసరపరాగ
ధూళిపాళిక చుళుకించెఁ దూర్పుదిక్కు)
ఇంతి వే గన్నులను గానఁ డింద్రు డిపుడు
నీ విలాసంబు పెంపు వర్ణింపఁ దరమె?

385
'నే'
ఉద్యోగపర్వము (2-243)
క.

నావుడు సంజయుఁ డిట్లను
దేవా పాండవులయలుక ధృష్టద్యుమ్నుం
డే వెరవుమాట నైనన్
నే వోసిన యగ్నివోలె నిగుడం జేయున్.

386
గ్రంథవిస్తరభయమువలన (అన్నింటికి) లక్ష్యము లుదాహరించలేదు. 387
'కోయిల-కోవెల' (అని రెండున్నవి.) కోయిలకు సులభము. 388
‘కోవెల'
రాజశేఖరచరిత్ర (3-80)
సీ.

ఎలమామి కొనయెక్కి పెళ పెళనార్చి కో
వెలపోటు గూకలు వెట్టెనేని......

389
తిమ్మకవి శివలీలావిలాసము
గీ.పా.

విశ్వరూపంబు దాల్చి కోవెలలు నలులు.......

390
'వేళమ-వైళమ' (రెండు గలవు)391
‘వేళమ'- 'వైళమ'
రామాభ్యుదయము (7-250)
ఉ.

వ్రేసిన వ్రేటునం బడక వేళను దాటి పిరిందికంటి బా
హా సముదాయ మధ్యమున కర్కతనూభవునిం దగుల్పడన్

(జేసికొనంగఁ జేర్చి కడుఁ జిక్క గబట్టి సురారి నేలకున్
వేసిన వెంటనే యెగసి వ్రేసెఁ దటాలునఁ జెంప లాతఁడున్).

392
ఎఱ్ఱనగారి రామాయణము
ఉ.

అంగముతోడఁ గట్టు మిఁక యజ్ఞవిఘాతకచోరు నెందు వో
వంగలవాఁడ వింక నిటు వైళమ తాపసవేషధారివై...

393

'చైపులసాకిరి చాయమగడు' అని ఆంధ్రనామసంగ్రహము నందున్నది. పొరపాటని తిమ్మకవి సార్వభౌముడు 'లక్షణ సారసంగ్రహము, (2-441) న వ్రాసినారు.394

నూత్నదండిగారు
క.

మల్లెయు లంజెయు గద్దెయు
నొల్లెయు నను పగిది పలుకు లొప్పవు గృతులన్
మల్లియ లంజియ గద్దియ
నొల్లియ యని వలికిరేని యొప్పుం గృతులన్.

395

(77) అనిన్ని, వేదాలు, వాదాలు— ఈ మొదలైనవి గ్రామ్యపదములనిన్ని ఆంధ్రభాషాభూషణమందు (26) చెప్పినారు.[4] 'ఎదంతవాచనామ్నా మన్యతర స్యామియాంతానామ్' అని నన్నయభట్టుగారి సూత్రమున్నందున మల్లె-మల్లియ; లంజె-లంజియ; గద్దె-గద్దియ (ఒల్లె-ఒల్లియ) అని రెండువిధములు గలవు.396

'మల్లె'
వసుచరిత్రము (3-129)
రగడ.

మూలమూలల మల్లె లెంతటి మోహమో హరిణాక్షి డాచితి
యేల యేలకి పొదలు వెదకెద వింతవింతలె యెందుఁ జూచితి

397
'లంజె'
కవికర్ణరసాయనము (4-110)
సీ. గీ.

లంజెతల్లు లనఁగ లక్షింపగా నిట్టి
కట్టడులను నలువ కరుణలేక
భ్రాతిమాలినట్టి బతుకులు నిడుపుగాఁ
జేసి విటుల గోడు వోసుకొనియె.

398
'గద్దె'
శ్రీనాథుని కాశీఖండము (4-195)
సీ. గీ.

చంద్రికాపాండుకౌశేయశాటియైన
యతను జగజంపుగొడు గెవ్వఁ డవ్విభుండు
పెద్దకాలంబు ముత్యాలగద్దె యెక్కి
వసుధ పాలించు నేకోష్ణవారణముగ.

399
'ఒల్లె'
కృష్ణరాయల ఆముక్తమాల్యద (2-81)
సీ. గీ.

నారికేలాసనపుఁ దీపు టూరుపొలయ
వలిపె యొంటెల్లెతో నురఃస్థలులఁ గూడు
ప్రియులఁ దేకువతో నెచ్చరించి కలసి
రెలమి ధన్యులు పరపు వెన్నెల బయళ్ల.

400

అహోబల పండితులవారు నూత్నదండిగారి మతము నిర్మూలమన్నారు. ఇటువలెనే అందె-అందియ; పట్టె, మట్టె, మిద్దె, ఈటె, పల్లె, కన్నె- ఈ మొదలైనవి రెండును గలవు. ముత్తెము - ముత్తియ మనిన్ని గలదు. మల్లెలు- మొల్లలు- అని పదభేదమే కాదు, అర్థభేదము గలదని తోచుచున్నది.401

యయాతిచరిత్ర (1-36)
గీ.

అగరు లేలకి విరవాది యాకు తీగెఁ
మల్లియలు గొజ్జెగలు దాక మొల్ల మొగలి

మొదలు (గానివి యెప్పుడుఁ బూచి కాచి
యుండు తోట లమీనుఖానుండు నిలపె.)

402
అని (భిన్నార్థముతో ప్రయోగము) ఉన్నది.
'వేదాలు'
శ్రీనాథుని కాశీఖండము (3-188)
సీ.

అతిగుహ్యమై యకారాది క్షకారాంత
             పంచాశదక్షరప్రకృతియైన
మాతృకయే మహామంత్రరాజంబు నై
             దవయవంబులఁ బుట్టి యం దకార
మునకును నోంకారమునకు మకారంబు
             నకు బిందువునకును నాదమునకు
ప్రత్యేకము పదేసి పదియేసి వర్ణంబు
             లనఘ జన్యంబులై యతిశయిల్లు
నట్టి ప్రణవంబు హేమసింహాసనమున
భాస్కరుండను మాణిక్యపదకభూష
యఱుత ధరియించి దేవి గాయత్రి యొప్పు
కడుపు చల్లఁగ వేదాలఁ గన్నతల్లి.

403
'గండాన'
అందే (5-329)
గీ.

మూలనక్షత్ర మందును మొదలి కాల
కన్య గండానఁ బుట్టిన కారణమునఁ
జచ్చెఁ జింతా జ్వరము పైన జ్వరము దాకి
కర్మఠుఁడు విప్రుఁ డానందకాననమున.

404
‘ప్రాణాన'
ఉద్యోగపర్వము (3-345)
క.

మానుగ ధృతరాష్ట్రుఁడు ప్రా
ణానం గలుగంగ బంధునాశము రాజ్య
శ్రీనాశము నుద్దామ య
శోనాశముఁ జేయనేల చూచెదు చెపుమా.

405
'నిటలాన'
కర్ణపర్వము
గీ.

వెండిపింజెలతోడ వెడదయమ్ముల చిత్ర
సేన ధరణినాథు శిరముఁ ద్రుంచి
వాడి నారసంబు వర్ముని నిటలాన
నాట నేసె దివిజనాథసుతుఁడు.

406

'ధరణి' (ఇకారాంతమును గలదు) ఇటువలెనే (వేదాలు, ప్రాణానవంటివి) బహులములు గలవు. 'వికృతౌ క్వచిచ్చ లోపో మో ర్ధీర్ఘశ్చాత ఆదిమస్య భవేత్' అని (నన్నయభట్టు) సూత్రమున్నందు వలన తెలుగున వికల్పముగ 'జొంపములు - జొంపాలు' అని వ్యాఖ్య (లో లక్ష్యములు) వ్రాసినారు గాని, గీర్వాణపదములును గలవు.407

'ధూర్త వృద్ధౌ మూర్ఖ నీచా వుదంతావపి సమ్మతాః'

అని అధర్వణ కారిక ధూర్తు, వృద్దు, మూర్ఖు, నీచు— అనిన్ని గలవని యర్థము. 'ధూర్తుడు' అని డుకారము సిద్ధమే.408

'వృద్ధు'
సభాపర్వము (2–27)
క.

వృద్ధు లొక లక్ష యున్నను
బుద్ధియె యెవ్వరికి వారిఁ బూజింపంగా
నిద్ధరణీశులలో గుణ
వృద్దని పూజించితిమి త్రివిక్రము భక్తిన్.

409
'మూర్ఖు'
అందే (2–24)
చ.

అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి నీవు మూ
ర్ఖవు శిశుపాల యింకఁ బలుక న్వలసెన్ (సభలోన నున్న యీ
యవనిపులెల్ల నాతని దయం బ్రవిముక్తులు వానిచేత నా
హవజితులుం దదీయశరణార్థులుగా కొరులయ్య చెప్పుమా.)

410
'నీచు'
విరాటపర్వము (2-54)
క.

అని పలికిన పలుకుల కం
గన కోపము గదిరి నీచుగావున ఝంకిం
చినఁగాని మెత్తఁబడి పో
డని మనమునఁ దలఁచి యిట్టు లనియెం బెలుచన్.

411
ఇవి మాత్రమే కావు. మరియును (గలవు)412
సౌప్తికపర్వము (1-104)
ఉ.

భీకరవిష్ణురూపములు పెక్కిటు లొక్కటఁ దోపఁ దీవ్రతా
పాకులమానసుం డగుచు నగ్గురుసూనుఁడు దుర్మదంబునం
జేకొన వైచె నట్లు కృపు జెప్పిన సత్యహితోపదేశముల్
నా కివి పెద్దయే యని మనంబున నిట్లని పల్కె వెండియున్.

413

(ఇందు 'కృపుడు' అనుటకు 'కృపు' అని యున్నది. ఇటువలెనే జనమేజయు, ధృతరాష్ట్రు - అని యున్నవి.414

శ్రీనాథుని నైషధము (1-35)
సీ. గీ.

చక్కదనమున గాంభీర్యసారమునను
ప్రకటధైర్యకలాకలాపముల యందు
దండనాయకచూడావతంసమైన
మంత్రి మామిడి పెద్దనామాత్యు వేము.

415

'వేముడు' అని యుండవలె. ఇటువలెనే తమ్ముడు - తమ్ము, అల్లుడు - అల్లు —అనియు గలదు.416

'తమ్ము'
అరణ్యపర్వము (3-279)
గీ.

తమ్ముచేసిన దురితంబు తలఁగఁ బూని
ధర్మబుద్ధిని వ్రతములు పేర్మిఁ జేసి
(తనఘ నీకు నభీష్టంబు లైన వరము
లడుగు మిచ్చెద మీ మెచ్చు గడప నగునె.

417
'అగ్రజు'
అరణ్యపర్వము (5-334)
చ.

అనుపమతేజుఁ డున్నతభుజాగ్రుఁడు దుర్జనవైరి విగ్రహుం
డనఘుఁడు వాయుసూనుఁడు నిజాగ్రజుఁ జేసిన సత్యపాశబం
ధనమున (జిక్కి తత్సమయతత్పరుఁడై యిటు ఘోరదుఃఖవే
దనములు సైచెఁగాక మది తద్దయుఁ గ్రోధమయంబు వానికిన్).

418
'అనుజు'
విరాటపర్వము (5–81)
గీ.

అపుడు రాధేయుఁ డమ్మెయి ననుజు వడుట
చూచి (యేనుంగునకు సిళ్లు చూపినట్లు
కవిసి హయములు మత్స్యభూకాంతుతనయు
నేసి పండ్రెండు శరముల నేసె నరుని).

419

కొన్ని విభక్తి రూపముల విచారము

తిమ్మకవి సార్వభౌమడుగారు లక్షణసార సంగ్రహమునందు (1-353)
గీ.

కూర్చియను ద్వితీయకును నొక్కషష్ఠికిఁ
బై విభక్తి గానఁబడఁగ రాక
యడఁగియుండుఁ గృతుల నాచార్యుఁ బ్రణమిల్లె
రాజుకొడు కనంగ రాజమకుట!

420


గీ.

లలిఁ దృతీయాదులగు విభక్తులకు నెల్లఁ
గలుగు మధ్య నకారంబు, దొలఁగుచుండు
రాముచే రాముకొఱకు శ్రీరాముకంటె
రాముకును రామునం దని రాజభూష! (1-363)

421

'టాదివిభక్తా నిర్నేత్యేకే' అని శబ్దశాసనసూత్రము గలదు. దానికి తృతీయాది విభక్తులందు నికారానకు లోపము వచ్చి రాముచేత, రాముకొఱకు, రామువలన, రాముకు, రామునం దని బాలసరస్వతిగారు వ్యాఖ్య వ్రాసినను కొందరు షష్టికి రామునకు అనికద్దుగనుక, 'రామునకు' అన్నచోట నికారముగాక నకారము వచ్చుచున్నది. దానికి లోపములేదని 'రాముకు' అని అనరా దన్నారు.

నూత్నదండి ఆంధ్రభాషాభూషణమునందు
క.

సుతుఁ గనియె సుతుని గనియెన్[5]
సుతుచేతన్ సుతునిచేత సుతునకు నిచ్చెన్
సుతు కిచ్చె సుతునివలనన్
సుతువలనన్ సుతునిధనము సుతుధన మెలమిన్.

422
(69) అని చెప్పినాడు గనుక —
సభాపర్వము (3-196)
సీ. పా.

సహదేవ నకుల వాసవసుత భీమ ల
             గ్రమమున నలువురఁ గౌరవేంద్రు
కొక్కొక్కయేటున నుక్కినంబున నొడ్డి
             యోడి తన్నును నొడ్డియోటువడిన......

423

అనిన్ని మహాకవి లక్ష్యము మరియును వ్రాసినారు.424

విరాటపర్వము (5-342)
ఉ.

అత్తఱి లేచివచ్చి తన యన్నలఁ దమ్ములఁ గానుపించె న
య్యుత్తరు కర్ణునుండు వగనొందఁగ నప్పుడ బిల్వఁబంచె (మా
త్స్యోత్తము డార్యమిత్ర సచివోత్కర సోదరవర్గ పుత్రకో
దాత్త భటాది యోగ్యుల ముదంబునఁ బాండవదర్శనార్థమై).

425

అచ్చు పుస్తకములందు 'ఉత్తరకు' అని వ్రాసినారు. మరికొంత గ్రంథమైన పిమ్మట గాని యుత్తర కథ రాదు. ఇచ్చట సందర్భమున్ను లేదు. జనకునితో పుత్రుడు చెప్పుచున్న కథ గావున పొరపాటుగాని, సుష్ఠువుగాదు.426

క.

ధనవర్గంబులు వీ రి
చ్చిన యవి యట్లగుట వేడ్క సేయవు తగ నూ
తనమగు కానుక యీవల
యును దోడ్తేరంగఁ బనుపు ముత్తరఁ బ్రీతిన్.

అని (విరాట. 5–358) ఉత్తరుడే చెప్పినాడు. 427
ఎఱ్ఱనగారి హరివంశము. (ఉ. భా 4-275)
క.

అందఱు హరిదెస ప్రణయ
స్యంది మనోజ్ఞులును లబ్ధసంతానులునై
నందించిరి హరిమహిమల
చందము నజుకైన బొగడ శక్యమె బుద్ధిన్.

428

కవిత్రయ ప్రయోగముల మూడును గలవు.429

శ్రీనాథుని నైషధము (6–115)
ఉ.

(లాలనఁ గ్రొత్త బెబ్బులి కలాసము వెట్టిరి యాసనంబుగా)
గోలయు సాధువైన యొక కోమటికిన్ నిషధేంద్రు బచ్చుకున్
(మేలపుమై వడిం దమ సమీపపు ధూర్తులు తత్పురఃస్థలాం
గూలత యవ్వణిక్కునకుఁ గోళ విజృంభణ శంక సేయఁగన్)

430
కవికర్ణరసాయనము (3-117)
సీ. పా.

నీ తూపు కోర్వక నిటలాక్షుఁడును తనూ
             ఫలకంబు చాటును బాయఁ డెపుడు......

431

ఇటువలెనే మహాకవి ప్రయోగములు కలవు.432

అహోబలుడు కవిశిరోభూషణమందు

“నః కౌ. నే రపవాదః. నామ్నః కౌపరే నః స్యాత్. రామునకు కృష్ణునకు ఇత్యాది. ఉకారాదేకాక్షర గతా దూకారా దృకారాచ్చ పరోయం నకారః
అత ఏవ ద్వితీయాచార్యేణోక్తమ్.

“సర్వేషామే మచోదంత శబ్దానాం కౌపరే భవేత్
నః ప్రాయః స్యా దుకారాచ్చ సర్వపండిత సమ్మతే”.
రితి. 'రామాయణముగ రచించి ప్రాచేతసుకున్' ఇతి భాస్కరోక్తి రసంగతైవ. 'కై' విభక్త్యా పాఠ స్సాధుః. "వంతుకు వచ్చు సత్యగరువంబిక' ఇత్యత్ర ‘వంతున కెక్కు సత్యగరువం' బిత్యేవ పాఠ స్సాధుః. వ్యాకరణ ద్వయేపి నస్యైవ విధానాత్. విధాతృ... ఋకారాంతో దాహరణమ్. ప్రాయో గ్రహణా దూదంతతాదపి భవతీతి జ్ఞేయమ్.”

అని వ్రాసినారు.433

ఈ సూత్రమునకే బాలసరస్వతులవారు—

“కౌ=కు అనే విభక్తి పరమైతే నః=న అనే ఆగమము వచ్చును. 'ని' యనేది రాదు. అనితాం=ఇకారాంత వ్యతిరిక్తములైన నామముల యొక్క, జమః=షష్టికి, కు అనేదివచ్చును. రామునకు, సామాన్యాకారమున న్యాగమము వచ్చితే ఇకారాంత మవుచున్నది గనుక, 'అనితాం' అనే పర్యుదాసచేత నుక్వాదేశము రాదు 'ఙసః కిచ్చ' అను వక్ష్యమాణసూత్రము చేత 'కి' వచ్చును. 'రామునికి' అను రూపమున్ను గలదు.

అని వ్రాసినారు.434

అయితే, ఎంతటి పండితులకు నొకచోట భ్రాంతత్వము గలదు. అందఱు పండితులకు నొకచోటనే భ్రాంతత్వము గలుగదు. ఇన్ని ప్రయోగములు దిద్దక రెండు మాత్రము (అహోబలుడు గారు) దిద్దినారు. (అది) వారి ఔద్ధత్యముగాని (అవి) అసాధువులుగావు. రామునికి, రామునకు, రాముకు అని మూడు విధముల నుండవచ్చును.435


క.

గురునికి గురునకు ననఁగాఁ
బరఁగఁగ బాలునికి ననఁగ బాలున కనగా
(గరగకు గొరవకు ననఁగా
దరమున కుదరమునకు నా నుదాహరణంబుల్) (6)

436
అని నూత్నదండి ఆంధ్రభాషాభూషణమున (చెప్పినారు) 'విధాతకు” అనవచ్చును.437
పోతనగారి భాగవతము ప్రథమస్కంధము
ఉ.

చేతులు మోడ్చి మొక్కెద నశేషచరాచరభూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశిని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత
వ్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోకసుఖప్రదాతకున్.

438
సప్తమీవిభక్తికి నాలుగు విధములు గలవు. 439
అరణ్యపర్వము (6-357)
చ.

ఉరమునయందుఁ గన్నులు పృథూదరదేశమునందు నోరుఁ బ్ర
స్ఫురితభుజద్వయంబు (గులభూమిధరోన్నతభావముం గరం
బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ
స్మరుఁగుచున్నవాని దివిజారిఁ గబంధునిఁ గాంచి రచ్చటన్).

440
వసుచరిత్రము (1-81)
మ.

హరుఁడా తారకశైలదుర్గమున నధ్యాసీనుఁడై రాజశే
ఖర విఖ్యాతి వహించుఁ చంద్రగిరిదుర్గంబందు శ్రీ వేంకటే
శ్వరుఁ డొప్పున్ (బహురాజశేఖర సదాసంసేవ్యుఁడై యౌర యి
ద్ధర బంటేలికవాసి తద్గిరులకుం దద్వల్లభశ్రీలకున్.)

441
శ్రీనాథుని కాశీఖండము (2-119)
సీ. పా.

అవిముక్తమందు నుపాస్యుఁ డాత్మయటంచు
             యాజ్ఞవల్క్యుం డత్రి కానతిచ్చె......

442
కవికర్ణరసాయనము (పీఠిక. 58)
మ.

హరిదశ్వాన్వయమందు దాశరథినై యస్మత్పదాంభోజత
త్పరుఁడై యుండు విభీషణాఖ్యునకు (నుద్దామంబు శ్రీరంగ మే
గరుణాధీనత నీ నతఁడు గొనిఁరా గావేరిలోఁ జంద్రపు
ష్కరణితీరమునందు గైకొనియెదం గల్పావధిస్థైర్యమున్).

443
తిమ్మకవి లక్షణసారసంగ్రహమునందు (1-389)
క.

కదిసి ముకారాంతములగు
పదములపై సప్తమీవిభక్తి యొదవుచో

హ్రదమున హ్రదమునయందున్
హ్రదమందున్ హ్రదమునందు నన జను శర్వా!

444

సంబోధనకు 'సురలార, తరులాక, నరులార' (ఇత్యాదిగా) అనుట సులభము. ప్రథమాబహువచన మటుల ('ఆర’ విరహితముగాకూడ) వచ్చును.446

నూత్నదండి ఆంధ్రభాషాభూషణము (9)
క.

ఒప్పులు గలిగిన మెచ్చుడు
తప్పులు గలిగిన నెఱిఁగి తగఁ దీర్పుడు త
ప్పొప్పనకుఁ డొప్పు తప్పని
చెప్పకుఁడీ కవు లుపాస్తి చేసెద మిమ్మున్.

(సంబోధనమున) ఉకారాంతములకు 'విష్ణుడ, విష్ణుడా, విష్ణూ' (ఇత్యాదిగా) అనవచ్చును.447

ఓరి అనునది ఒకనికి అనేకులకు పిలువనగు.448

మై యనునది తృతీయావిభక్తికి నగును.449

షష్ఠికి ప్రథమ విశేషణము చెల్లును.450

ఉద్యోగపర్వము
క.

మీపనుపున రాజ్యము పా
లీ పాండుతనూభవులకు నీకున్న భుజా
టోపభయంకరుఁ డర్జును
కోపానల మడరి ముట్టుకొనదే వారిన్.

451
భీష్మపర్వము (2-392)
క.

అపరాహ్ణసమయమున ని
ట్లుపమాతీతముగ ఘోరయుద్ధం బయ్యెన్
రిపుభయదభుజుఁడు భీమున
కపరిమితబలుండు కౌరవాధీశునకున్.

452
ఆమహత్తులైన 'సముద్ర, మేఘ' పదంబులు మహత్తులవలె నగునన్నారు. మరియును గలవు.453
ఆదిపర్వము (1-107)
చ.

అరిది తపోవిభూతి నమరారులు బాధలు వొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ (డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నమయ్యెడున్.

454
అరణ్యపర్వము (4-100)
క.

మృగయార్థ మరిగి హిమవ
న్నగభూముల యందుఁ బవననందనుఁ డొకప
న్నగుచేత పట్టువడి (యి
మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుఁ డయ్యెన్)

455
కర్ణపర్వము (2-74)

తలకొని జలములఁ బక్షం
బులు దుండము దోక జోక బొగిపొరి నెగయన్
బలమరి మై దిగఁబడఁగా
సొలసి యెగయ లేక వాయసుఁడు దెగడొందెన్.

456

ఇటువలెనే తెలుసుకొనేది.457

హంస - హంసము; దూత - దూతుఁడు అని గలవు. చరిత-చరిత్ర తరంగాంకాక్షతాది పదములు రెండు విధములు గలవు.458

అసుర పదము స్త్రీలింగము వంటిది.459

'సురలు' (దీనికి) ఏక వచనము లేదు.460

ఆప్ శబ్దము(నకు) ఏకవచనము లేదు.461

“అప్పుపాలైన శుభ్రాజ్ఞంబు రుచియెంత" ఇత్యాదయః కవిప్రయోగాస్తు న సాధవః. 'అప్పుల పాలైన యజ్ఞంబు రుచియెంత' ఇత్యాది పాఠ స్సాధుః. అని అహోబలుడుగారు కవిశిరోభూషణమున నన్నారు.

వసుచరిత్రము (1-36)
సీ.పా.

తన కూర్మిరేని నప్పుననే ముంచె.

'అప్సరసలు - అప్సర' రెండు గలవని అహోబల పండితులు కవిశిరోభూషణమున వ్రాసినారు.462 సుభ్రువుడు రాముడు, సుభ్రుడు, సుభ్రువునకు, సుభ్రునికి. క ప్రత్యయమందు - 'సుభ్రూకుడు'.463

కృష్ణరాయల ఆముక్తమాల్యదలోని
సీ. పా.

నిస్తులాన్యవయస్తంభవిక్షిప్త
             నింబచ్ఛదభ్రువల్పంబు నిక్క...

(5-67) ప్రయోగ మనాకరమన్నారు. 'సుభ్రూవు' అనవలెనని తాత్పర్యము.464

చతుర్ముఖ పరమైన బ్రహ్మ శబ్దముకు మాత్రము 'బ్రహ్మకు' అని యుండుటున్నది.465

దైవవాచకములైన నకారాంత (పద)ములకు- కృష్ణవర్త్మకు (ఇత్యాదిగా) అనరాదన్నారు. కృష్ణవర్త్మునకు అని యుండవలెను. వసుచరిత్రమందు ‘తొలుదొలుత కృష్ణవర్త్మకు కలయొసంగి' అను ప్రయోగము అనాకరమన్నారు. మనుష్యవాచకములు 'నిగమశర్ముడు - నిగమశర్మ' (ఇత్యాదిగా) అనవచ్చు నన్నారు.466

'పాండు భూవరునకుఁ గోడలైతి' అను తిక్కనగారి ప్రయోగము అనాకరమన్నారు. అయితే నన్నయభట్టుగారు, అధర్వణాచార్యులు నెవరును 'నువర్ణకమునకు (కోడలను అనుచోట) లోపము చెప్పలేదని అనాకరమన్నారు కాని) సోమయాజిగారిని నన్నయభట్టాధర్వణాచార్యుల వారికన్నను తక్కువ యనుకొనరాదు. లెస్స పరిశీలించనందుననే కాని, వీరిద్దరికన్న నుత్కృష్టులగుదురు.467

తిక్కనగారి ఉత్తర రామాయణము (1-2)
చ.

హరిహర పద్మగర్భులను నాదికవీంద్రుల నూత్నసత్కవీ
శ్వరులను భక్తిఁ గొల్చి తగవారికృపం గవితావిలాసవి
స్తరమహనీయుఁడైనను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
వరుఁడు దగంగ రాఁబిలిచి వారని మన్నన నాదరింపుచున్.

468
‘మహనీయుడనై' అని (ఉండవలసిన చోట 'మహనీయుడైన' అనిన్ని—469
ఉద్యోగపర్వము (3-108)
చ.

వరమునఁ బుట్టితిన్ భరతవంశము జొచ్చితి నందుఁ బాండుభూ
వరునకుఁ గోడలైతి జనవంద్యులఁ బొందితి (నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్
సరసిజనాభ యిన్నటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్.)

470

‘కోడలనైతి' అని (ఉcడవలసిన) చోట 'కోడలైతి' అనిన్ని సోమయాజిగారి ప్రయోగమున్నందుననే—

శ్రీనాథుని నైషధము (2-28)
గీ.

అధికతాపపరీతాత్ముఁడైన నాకు
నెట్లు వచ్చితి చలిగాడ్పునట్లు నీవు
(పూర్వజన్మమహాతపఃస్ఫురణఁ జేసి
నీదు సన్నిధి సమకూరె నిధియుఁబోలె)

471
శ్రీనాథుని కాశీఖండము (1-140)
సీ.గీ.

రండు నను గూడి యో పరివ్రాట్టులార
వత్సలత గల్గి, మీరేల వత్తురయ్య
పరమనిర్భాగ్యుఁడైన నాపజ్జఁ దగిలి
కటకటా సౌఖ్యజలరాశి కాశిఁ బాసి.

472

అని శ్రీనాథమహాకవి చక్రవర్తి ప్రయోగములున్ను గలవు. సోమయాజిగారి ప్రయోగమైనా, శ్రీనాథుడుగారి ప్రయోగమైనను ఒకటొకటే చాలును. సోమయాజిగారి ప్రయోగము ననాకరమనుట అహోబల పండితులవారి ఛాందసత్వమే.473

అస్మదర్థమందు 'ను' వర్ణకలోపమైనటుల యుష్మదర్థమందు 'వు' వర్ణకలోపమగును.474

తిక్కనగారి ఉత్తర రామాయణము (5-38)
క.

ఏ నొకటి నీకుఁ జెప్పేద
దానవకులముఖ్య దేవతలకు నవధ్యుం
డైన నినుబోటివాఁ డీ
మానవుల జయింప విక్రమమునుం గలదే.

475

'అవధ్యుండవైన' అనుటకు 'అవధ్యుండైన' అని 'వు' లోపము.476

వసుచరిత్రము (3-16)
చ.

అరుదుగ నీ విమానము ప్రజాధిపుడుం బురుషోత్తముండు శం
కరుఁడును దక్క నన్యులకుఁ గా దవరోహ మొనర్ప వారి సు
స్థిరకరుణావిశేషమున జిష్ణుఁడనై కయిగొంటి దీనినే
నరవర సర్వసద్గుణగణంబులప్రోవగు నీ కొసంగితిన్.

477

'ప్రోవవగు' అనుటకు 'ప్రోవగు' అని 'వు' లోపము. ఇటువలెనే మహాకవి ప్రయోగములు మరియును గలవు.478

ఆదిపర్వము (2-29)
మ.

వివిధోత్తుంగతరంగఘట్టనచలద్వేలావనైలావలి
లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు లీక్షించుచున్
ధవలాక్షుల్ సని గాంచి రంత నెదురం దత్తీరదేశంబునం
దవదాతాంబుజ ఫేనపుంజనిభు న య్యశ్వోత్తముం దవ్వులన్.

479

‘అశ్వోత్తమము' అనుటకు 'అశ్వోత్తము' అని మహద్వాచకముగా (నన్నయ్యగారు) ప్రయోగించినారు.480

'ఇంద్రజి, ఇంద్రజితుడు' - 'జిత్పదంబున కింద్రజి త్తింద్రజిత్తుండు...' అని లాక్షణికులు చెప్పినారు కాని, ఇంద్రజి, ఇందజితుడు' అనియు గలవు.481

తిక్కనగారి ఉత్తరరామాయణము (1-81)
క.

ఇంద్రజితుఁ జంపి రణమున
నింద్రాదిత్రిదశనుతుల కెక్కిన యనుజున్
సాంద్రామోదంబున రఘు
చంద్రుఁడు మోమెలమి వొంద సంభావించెన్.

482
అందే (2–13)
చ.

ఇవి యెఱుఁగఁగ నెంత పను లింద్రజి చావు దలంప వాని నా
హవమున శూలికైనఁ జెనయం భయ మాతఁడు (పిల్కు మారినన్
భువనము లెల్ల నిర్భయతఁ బొంది మహాధ్భుత మంది లక్ష్మణ
స్తవనకథావిధాచరణతాపరతంత్రము లయ్యె రాఘవా!)

483
అందే (4-18)
గీ.

పిదప నింద్రజి యనుపేరు పెంపు వడయు
న ద్దశానననందనుం డభిమతముగ
(దానిఁ బదపడి చెప్పెద మానవేంద్ర
వినుము తరువాతికథలు సవిస్తరముగ)

484

ఇటువలెనే పరిక్షిత్తు-పరిక్షితుడు; హనుమంతుడు-హనుమానుడు (ఇత్యాదిగా) మహాకవి ప్రయోగములు గలవు.485

మరుత్-మరుత్త అని రెండును గలవు. 'మరుత్' సులభము.486

'మరుత్త'
శ్రీనాథుని కాశీఖండము (1-7)
సీ.పా.

చిన్నారి పొన్నారి చిఱుత కూకటి నాడు
             రచియించితి మరుత్తరాట్చరిత్ర

487
అందే

వహ్ని సమాఖ్యుఁ దుర్వసుఁ డాత్మజుని గాంచె
             గోభానుఁడ న్వహ్ని కొడు కతనికి
నీశానుఁ డనఁ బుట్టె నీశానునకుఁ గరం
             దముఁ డుద్భవించె న ద్ధరణిపతికి
ధుర్యచిత్తుఁడు మరుత్తుఁడు నాఁగ జనియించె
             సంవర్తయజ్వుఁడై చను మరుత్తుఁ
డధిప యీతఁడు గాక యన్యుఁడు సుమ్మి మ
             రుత్తుఁ డపుత్రుఁడై రూఢతేజు......

488
ఇటువలెనే కేకయ-కైకయ; కోసల- కౌసల; అధర్వ-అధర్వణ; ధరణ-ధారణ, ఇత్యాది రూపభేదములు మహాకవి ప్రయోగముల బహులములు గలవు. గ్రంథవిస్తరమని (అన్నిటికిని లక్ష్యములు చూపుట) మానినాము.489

కొన్ని పదవాక్యార్థ దోషముల విచారణ

ప్రతాప రుద్రీయ మందు వాక్యదోషములు ఇరువది నాలుగు చెప్పినారు. వాటిలో భగ్నచ్ఛందము యతిభ్రష్ట మనునవి యున్నవి.

'ఛందోభంగం వచో యత్ర, తద్భగ్న చ్ఛంద ఉచ్యతే
యత్ర స్థానే యతిభ్రంశ, స్తద్యతిభ్రష్ట ముచ్యతే'

అని లక్షణము (దోష. 35) చెప్పి—

వింధ్యారణ్య కృత కుటుంబ రక్షణస్య
కిం భద్రం భవతి జనస్య మాదృశస్య'

అని లక్ష్యము చెప్పినారు. కోలచల మల్లినాధ సూరి పుత్రుండగు కుమారస్వామి సోమయాజి రచించిన రత్నాపణవ్యాఖ్య (ఈ సందర్భమున నిట్లున్నది)—

“ఛందోభగ్నమితి. భగ్నం ఛందో వృత్తం యత్ర తచ్ఛందో భగ్నమ్. యతి ర్విచ్ఛేద ఇతి ఛాందసాః. భ్రష్టా యతి ర్యత్ర తద్యతి భ్రష్టమ్. ఉభయత్ర వాహితాగ్న్యా దిష్వితి పరనిపాతః. వింధ్యారణ్యేతి. తృతీయవర్ణే యతిభంగః. ప్రహర్షిణీ వృత్తే తృతీయ దశమ వర్ణయోః విభేదో నిహితః. తదుక్తం వృత్తరత్నాకరే— 'మ్నౌజ్రే గస్త్రిదశ యతిః ప్రహర్షిణీయం' ఇతి. తత్ర తృతీయ వర్ణే పరభావా ద్యతి భ్రష్టమ్. పాదాంతవర్ణస్య గురుత్వాభావా చ్ఛందో భగ్నశ్చ. నను క్వచి దవసానేపి 'లఘ్వంత్య' మితి వచనేన గురుత్వ విధానా దత్రాపి గురుత్వాంగీకారే న చ్ఛందో భగ్న ఇతి చేత్, సత్యం. య త్రేంద్రవజ్రోపేంద్రవజ్రాదౌ పాదాంత వర్ణస్య లాక్షణిక గురుత్వేపి ళ్రావ్యత్వ భంగాభావ స్తత్ర మాభూ చ్ఛందోభంగః. ప్రహర్షిణీ, వైతాలీయ, వసంతతిలకాదౌ తు వైపరీత్యా దస్త్యేవ దోష ఇతి ప్రాచీనా:"

పాదాంత లఘువు వికల్పముగా గురువగు ననగా కావలసినపుడు గురు వగునని యర్థముగాని, కొన్ని వృత్తముల కగునని, కొన్ని వృత్తములకు కాదని అర్థముకాదు. లాక్షణిక మతమును ప్రతికూలించి ఆలంకారికులు ఛందోభంగమని చెప్పరాదు. వ్యాఖ్యాకారులును పరిశీలించనిది ప్రహర్షిణి వసంతతిలకాదు లందు (పాదాంతమందు లఘువుండుట) దోషమని చెప్పినారు. ప్రహర్షిణీ వృత్తమునకు లక్షణము వ్రాసిన ఆ వృత్తరత్నాకరమందే—

'సానుస్వారో విసర్గాంతో, దీర్ఘో యుక్త పరశ్చ యః
వా పాదాంత ‘స్త్వసౌ గ్వక్రో, జ్ఞేయోన్యో మాత్రికోల్పజుః'

(అని చెప్పబడినది. దీనికి) గోమేధభట్ట పండితపుత్ర శ్రీనాథ విరచిత వ్యాఖ్యానము (ఇట్లున్నది.)

‘సానుస్వారఇతి. అనుస్వారేణ బిందునా సమవర్తత ఇతి సానుస్వారః. విసర్గో బిందు ద్వయరూపో సోంతో యస్య సః విసర్గాంతః. దీర్ఘో ద్విమాత్రకః. యుక్తపరః సంయుక్తపరః ఇత్యర్థః. పరః అనంతరయుక్తః పరో యస్మాదసౌ యుక్తపరః. వా శబ్దో వికల్పార్థః. పాదాంతే వర్తమానః. తు శబ్తో పూర్వోక్తే భ్యోస్య విశేష సూచనే. అసౌ వర్ణ ఇతి శేషః. గీ గురు సంజ్ఞికః. ప్రస్తరే కుటిల రేఖాకారః. నాగలిప్యాః ఉకారసదృశః భవతీతి శేషః. యథోక్తగుర్వన్యో మాత్రికో హల్ లఘు సంజ్ఞికః. ప్రస్తరే ఋజుః. ఊర్ధ్వ సంజ్ఞస్థ రేఖై కదేశ మాన ఇతి యావత్ అయమన్వయః. యో మాత్రికః అనుస్వారేణయుక్తః భవతి అసౌ గ్ జ్ఞేయః. యో మాత్రకః విసర్గేణ సహితః భవతి అసౌ గ్ జ్ఞేయః యో మాత్రకః దీర్ఘో భవతి అసౌ గ్ జ్ఞేయః. యో మాత్రికః సంయుక్త పరో భవతి, అసౌ గ్ జ్ఞేయః. యో మాత్రికః పాదాంతో భవతి అసౌతు వా వికల్పేన గ్ జ్ఞేయః. అసౌ వక్రో భవతి. అన్యోత్ ఋజుః జ్ఞేయః.'

ఇందువలన పాదాంతలఘువు వికల్పముచే గురువగునని స్పష్టమగుచున్నది. ఏ శాస్త్రమున కెవరు కర్తలో వారి సిద్ధాంతము ముఖ్యము (ఆ శాస్త్రవిషయమున) అలంకారిక సిద్ధాంతము ముఖ్యముకాదు. అయినా వారు (ఆలంకారికులు)ను పాదాంతలఘువును గురువుగా ప్రయోగించిరి. ప్రతాపరుద్రీయమందు (నాయక-14)

'మురారే ర్యఃపూర్వం జలనిధి సుతాయా ముదభవత్
మహాదేవా జ్ఞాత స్స పున ర వనీభృ ద్దుహితరి'

అనుచోట పాదాంతమున 'రి' లఘువు గురువు.

రేరే ఘూర్జర జర్ఘరోసి సమరే లంపాక కిం కంపసే
వంగ త్వంగసి కిం ముధాబలరజః కాణోసి కిం కొంకణ'— (నాయక 31)

అనుచోట పాదాంతమున 'ణ' లఘువు గురువు విద్యానాథుని గారి ప్రయోగములే ఎన్నోగలవు. 'ఇంద్రవజోపేంద్రవజాది' అని వ్యాఖ్యయందు వ్రాసిరి గాన, శిఖరిణీ, శార్దూలములు 'ఆది'లోనివని తలంతురు.490

శ్రీ వీరభద్ర నృపతేః ప్రియ వల్లభస్య
రాజ్యాబిషేక సలిలై స్సరసీ కృతాయాః
సద్య స్సముచ్ఛ్వసిత సాంద్ర పరాగరేఖా
క్షోణ్యాః ప్రమోద పులకాంకుర మంజరీవ.

491

రెండు పాదాంతలఘువులు గురువులుగా నుండెను.492

'శ్రీ కాకతీంద్ర నగరీ మనిశం స్తువంతి'

మరియును వసంతతిలకములే గలవు. వ్యాఖ్యాకారు లచ్చట నేమనుకొనిరో తెలియదు. వృత్తరత్నాకరమందు—

'ఉక్తా వసంత తిలకా తభజా జగౌగ'

అని లక్షణము, లక్ష్యము చెప్పి, ఈ వసంతతిలకమునకే మరియును నామధేయములు గలవని చెప్పిన శ్లోక మిదిః —

సింహోద్దతేయ ముదితో ముని కాశ్యపేన
ఉద్ధర్షిణీయ ముదితా మునిసైతవేన
సోమేన సేయ ముదితా మధుమాధవీతి
శోభావతీయ ముదితా భుజగాధిపేన.

ఇందు నాలుగు పాదాంతలఘువులు గురువులుగా నుండెను. కోలచల కుమారస్వామిగారు వృత్తరత్నాకరము నేమి పరిశీలించిరో తెలియదు. మరియును కొన్ని వసంతతిలకలు ఉదాహరించుతాము.493

జగన్నాథ పండితరాయ శతకము

నీలం వపు ర్వహతు చుంబతు సత్ఫలాని
హర్మ్యేషు సంచరతు చూతవనాంతరే వా
పుంస్కోకిలస్య చరితాని కరోతునామ
కాకః కలస్వన విధౌ స తు కాక ఏవ.

494

—మూడు పాదాంత లఘువులు.

దానార్థినో మధుకరా యది కర్ణతాలైః
దూరీకృతాః కరివరేణ మదాంధబుద్ధ్యా
తస్యైవ గండయుగ మండన హాని రేవ
భృంగాః పరం వికచ పద్మవనే చరంతి.

495
—రెండు పాదాంతలఘువులు

ఏతావాంత్సరసిజ కుట్మల స్వయత్నః
భిత్వాంభస్సరసి వినిర్గమో యదంతః
ఆమోదా వికసన మందిరానివాస
స్తత్సర్వం దినకర కృత్య మామనంతి.

496
—ఇవి ప్రహర్షిణీ వృత్తము. ఇందొక పాదాంతలఘువు. 497
ప్రబోధచంద్రోదయము

ఉత్తుంగ పీవర కుచద్వయ పీడితాంగ
మాలింగితః పులకితేన భుజేన రత్యా
శ్రీమాన్ జగంతి మదయన్నయనాభిరామః
కామోయ మేతి మదఘూర్ణితనేత్ర పద్మః

498
—ఇది వసంత తిలక. ఇందు రెండు పాదాంతలఘువులు. 499
కిరాతార్జునీయము (7–7)

రామాణా మవజిత మాల్య సౌకుమార్యే
సంప్రాప్తే వపుషి సహత్వ మాతపస్య
గంధర్వై రధిగత విస్మయైః పతీయే
కల్యాణీ విధిషు విచిత్రతా విధాతుః

500
ఇది ప్రహర్షిణి. ఇందొక పాదాంతలఘువు. 501
శిశుపాలవధ

ఏకత్ర స్ఫటిక తటాంకు భిన్ననీరా
నీలాశ్మ ద్యుతిభిరుతాంభసో పరత్ర

కాలిందీ జల జనిత శ్రియశ్శ్రయంతే
వైదగ్ధమిహ సరితస్సురాపగాయాః

502

ఇదియు ప్రహర్షిణి. ఇందొక పాదాంతలఘువు.503

ఇటువలెనే వసంతతిలకా, ప్రహర్షిణీ వృత్తము లందును పాదాంతలఘువులు గురువులుగా బహులములు గలవు. వ్యాఖ్యాకారు లీప్రయోగము లన్నిటికి నేమి సమాధానము చేసికొనిరో తెలియదు. సమస్తవృత్తము లందును పాదాంతలఘువులు కావలసిననప్పుడు గురువు లగుట నిస్సందేహము. దోషముకానిదానిని దోషమనుట యొకదోషము. తాము దోషమనిన్ని, పాదాంతలఘువులు గురువులుగా ప్రయోగించుట రెండవ దోషము. ఆలంకారికుల తాత్పర్యము తెలియదు. వ్యాఖ్యాకారుల సిద్ధాంతము పరిశీలించక చేసినదని వేరే చెప్పనేల!504

విద్యానాథుడుగారు యతిభ్రష్టమునకు

'వింధ్యారణ్య కృతకుటుంబ రక్షణస్య'

అని లక్ష్యము చెప్పిరి. క్రమభ్రష్ట మనెడు దోషము తాము చెప్పినదే, ఇచ్చట సంభవించెను.505

పాదాంతలఘువు కావలసినపుడు గురువెటులగునో రేఫసంయోగమున కివతల నుండెడు వర్ణము (లఘువు) కావలసినపుడు లఘువగును.506

వృత్తరత్నాకరము

పాదాదా విహ వర్ణస్య సంయోగః క్రమ సంజ్ఞికః.
వ్యవస్థితేన తేన స్యా ల్లముతాపి క్వచి ద్గురోః.

వ్యాఖ్య
పాదాదా వితి. ఇహ అస్మిన్ వర్ణసంయోగ క్రమసంజ్ఞికః, పాదాదౌ— పాదస్యాదౌ పురఃస్థిత స్యేతి శేషః. వర్ణస్య సంయోగః క్రమసంజ్ఞికః. క్రమ ఇతి సంజ్ఞా యస్య స తథోక్తః. శేషాద్విభాషా ఇతి. కః పురఃస్థితేన అగ్రగతేన క్రమ సంజ్ఞేన పూర్వ స్యైవ వర్ణస్య గురోః క్వచిల్లఘుత్వ మపి స్యాత్. ఛందశ్శేఖర ఇదముక్తం—

సర్వాస్వపి చ భాషాసు, రహ యుక్తాక్షరే పరే
పూర్వ వర్ణస్య లఘుతా, వేష్టా తు క్వాదికే పరే.

అస్యార్థః. సంస్కృతాపభ్రంశ మాగధ శౌరసేన లక్షణాసు భాషాసు రేఫేణ హకారేణ వా యుక్తేక్షరే పరే పూర్వస్య పాదాంతస్య వర్ణస్య లఘుతా వికల్పేన ఇష్టా. రేఫ సంయుక్తే సతి— 'కథం భ్రమరగ్రామే వసతి–హసతి ప్రాజ్ఞా' ఇత్యుదాహరణమ్. హకార సంయుక్తే సతి— 'భవతి హ్రస విష హ్రస్వస్త్యజతి హ్రియ' మితి.

'తరుణం సర్షప కాకం
నవోదనం పిచ్చిలాని చ దధీని
అల్ప వ్యయేన సుందరి
గ్రామ్యజనో మృష్ట మశ్నాతి'

తరుణమితి, ఆర్యావృత్త మేతత్. మృష్టం నామ మధురం. అత్ర ద్వితీయ చతుర్థ పాదాంతయోః వర్ణయోర్గురుత్వమ్. తృతీయ పాదాంతస్య సుందరీతి పదాంతస్య ఇకారస్య ఉపరిస్థిత గకార రేఫ సంయోగాత్ లఘుత్వం దర్శిత మితి జ్ఞేయమ్.'

అనియున్నది. పూర్వార్థమందు చివరనున్న 'ని' వర్ణము; ఉత్తరార్థమందు చివరనున్న 'తి' వర్ణము (పాదాంత మందలి లఘువులగుటచే వికల్పముగా గురువులు ) తృతీయ పాదాంతమందున్న 'రి' (రేఫ) సంయుక్తమున కివతలనుండుట వలన గురువైనను లఘువు. ఇది లాక్షణిక సిద్ధాంతము. వాస్తవ మిటువలె నుండగా ‘సాహిత్యరత్నాకరము'న శబ్దాలంకారతరంగ మందు ధర్మాభట్టుగారు—

ఏకాచ్కం సర్వతో లఘు, నిరోష్ఠ్యం చ. యథా—

‘అను హరణ చరణ రణ చణ
దళగల గలగహనదహన సరలశర
రల నతరత నయజయ
జయదశరథతనయ జలజదళనయన'

అని వ్రాసినారు. ద్వితీయ చతుర్థ పాదాంత లఘువులైన ర, న— ఈ రెండక్షరములు ఆర్యావృత్తమునకు గురువులు కావలెను. గురువులు కాకపోతే ఛందోభంగము, గురువులైతే సర్వలఘునిర్ణయము పోవును. ఇంతేకాదు; ఆలంకారికులు పాదాంతలఘువును గురువుగా నంగీకరించలేదు. (కుమారస్వామి సోమ యాజి ఈ విషయమున వ్రాసినది ముందే వ్రాసినాము.) ఛందోభంగమును దోష మన్నారు. ధర్మాభట్టుగారి తాత్పర్యము గోచరించదు. (పై పద్యమును) అచలధృతియను వృత్తమని చెప్పితే మంచిదగును.507

'ద్విగుణిత వసులఘు రచల ధృతి రిహ తు'

అని అచలధృతి లక్షణమున్నది. పదారు లఘువులు పాదమునకు "సర్వతో లఘు 'వని చెప్పవచ్చును. అటువంటి జగదేక పండిత సార్వభౌములకు నిటువంటి పొరపాటులు. ఏమనుకోము!508

యత్సౌందర్యమవేక్ష్య జీర్ణమునయో వాతాంబు పర్ణాశనాః
ధైర్యం నార్య ఇవాపసార్య సహసా సంత్యజ్య లజ్జామపి
సంభోగం కీల వపు రిత్యభిదధే పౌరాణికై స్తత్క్వవా
రామస్య క్వ ను కామరూపవిభవ స్త్రీమాత్ర వేత్రప్రదః

509

ద్వితీయ పాదాంతము లఘువు. గురువు కావలెను. కాకపోతే ఛందోభంగము. అయితే ఆలంకారికులు నిర్ణయంచిన ఛందోభంగము.510

'రామాస్త్రేణ హతం ద్విషత్కరిశిరో భోగీంద్ర భోగా ఇవ' ఇచ్చట ఛందోభంగమని వ్రాసినారు. (పై పద్యమున ద్వితీయ పాదాంతమున) 'అసి' అనుచోట ఛందోభంగమెందుకు కారాదో తెలియదు. రెండును శార్దూల వృత్తములే. ఒకచోట ఛందోభంగమేమి? ఒకచోట కాకపోవటమేమి? ఇది ఏమనుకోము!511

'నిర్ముక్తం రుధిరాప్లవేన ఘనమాణిక్యత్త్విషే వారుణమ్'.

'మాణిక్యేత్యత్ర యతి భంగః' అన్నారు. పదమధ్య పదావసానములని వారి తాత్పర్యము. 'మాణిక్య' పదము మూడక్షరములు. అందులో రెండవ యక్షరము యతి. అటుల నుండరాదు. పదాది వర్ణమే ఉండవలెనని ఆలంకారికుల తాత్పర్యము. అయితే వారును (ఇట్లుండుట) దోషమనుటేకాని (ప్రయోగించుట) మానలేదు.512

‘జిత్వా రామావధాని ప్రవరమురు మరుద్వేగవద్వేద చర్చా
గోష్ఠ్యా నారాయణార్యస్సదసి బుధశతై శ్లాఘ్యమానావధానః
సంతుష్టా ధర్మభూపాదలభత శిబికాం చామరచ్ఛత్ర పూర్వం
గర్వాఖర్వావధానీశ్వర శరభఘటా గండభేరుండ చిహ్నమ్'

513

చతుర్థచరణమందు 'ఈశ్వర' పదమధ్యమందు తన 'శ్వ' వర్ణము యతి. ఇచ్చట ద్వితీయ వర్ణమే యతి. మరి యతిభంగ మెందుకు కాకపోయెనో తెలియదు.514

గీర్వాణ కవిత్వమందు, యతి యనగా నిలుపుటేకాని, పదమధ్య, పదావసానము కాకూడదని కాదు. ఆలంకారికులు చెప్పిన యతిభంగ చ్చందోభంగములు ప్రతికావ్యమందును గలవు. ఇవి దోషములైతే మహాకవు లేల రచింతురు! ఇంకను కొన్ని ఉదాహరణములు వ్రాసుతున్నాము.515

ప్రబోధచంద్రోదయము

ఏకత్రిస్సప్తకృత్వో నృపబహుల వసామాంసమస్తిష్కపంక
ప్రాగ్భారేకారి భూరిచ్యుతరుధిరసరి ద్వారిపూరాభిషేకం
యస్య స్త్రీబాలవృద్ధావధి నిధనవిధౌ నిర్దయో విశ్రుతోసౌ
రాజన్యోచ్ఛాంసకూట త్రుటన పటురటద్ఘోరధారః కుఠారః

516

(తృతీయ చరణమందు) 'అవధి' యందలి ద్వితీయ వర్ణము యతి.517

స్ఫురద్రామోద్భేదస్తరలతర తారాకుల దృశో
భయోత్కంపోత్తుంగస్తనయుగభరా సంగసుభగః
అధీరాక్ష్యాశ్శింజన్మణివలయ దోర్వల్లిరచితః
పరీరంభామోదం జనయతి చ సమ్మోహయతిచ.

518

ప్రథమ చరణమందు తారాలోని 'రా' యతి. చతుర్థ చరణమందు (పాదాంతలఘువు గాన) ఛందోభంగము. రెండు దోషములు చెప్పవలెను. 519

ఇందు ‘వల్లి' ఇకారాంతము, 'పరీరంభ' పదములో 'రీ' దీర్ఘము.520

దండి విరచిత 'అనామయము'

స్తోత్రం సమ్యక్ఫరమవిదుషా దండినా వాచ్యవృత్తా
న్మందాక్రాంతా త్రిభువనగురోః పార్వతీవల్లభస్య
కృత్వా స్తోత్రం యది సుభగ మాప్నోతి నిత్యం హి వృణ్యం
తేన వ్యాధిం హరహర నృణాం స్తోత్రపాఠేన సత్యమ్.

521
తృతీయ చరణమందు 'ప్నో' యతి. ద్వితీయ చరణమందు పాదాంతలఘువు గురువు. ఇది మందాక్రాంతవృత్తము.
దీనిలక్షణము

'మందాక్రాంతాజలధిషడగైర్మోభనే తౌ గురూచ'

లక్షణము చెప్పు నీ లక్ష్యమునందే (పాదాంత)లఘువు గురువు.522

హలాయుధము

త్వత్పూజాయాం కుసుమహరణే ధావతః పాదయుగ్మం
యత్పాషాణ వ్రజపరికరో ద్గీర్ణరేఖాంక మాసీత్
తస్యాప్యేవం తదనుచరతో రుద్రలోకం గతస్య
బ్రహ్మాదీనాం మకుట కిరణ శ్రేణయ శ్శోణయంతి.

523

(ద్వితీయ చరణమందు యతిభ్రష్టము ('ఉద్గీర్ణ' లో యతి) చతుర్థచరణమందు (పాదాంతలఘువుగాన) ఛందోభంగము.524

మేఘసందేశము (ఉత్తర. 6)

నేత్రా నీతా స్సతత గతినా యద్విమానాగ్రభూమీ
రాలేఖ్యానాం స్వజల కణికా దోష ముత్పాద్య సద్యః
శంకా స్పృష్టా ఇవ జలముచ స్త్వాదృశా జాలమార్గై
ర్ధూమోద్గారానుకృతినిపుణా ఝర్ఘరా నిష్పతంతి.

525

చతుర్థ చరణమందు యతి, ఛందోభంగములు రెండును. ఇటువలెనే మేఘసందేశమందు మరియును గలవు.526

నైషధము (2-102)

అశ్రాంత శ్రుతి పాఠపూతరసనావిర్భూత భూరి స్తవా
జిహ్మ బ్రహ్మముఖౌఘనిఘ్నిత నవ స్వర్గక్రియా కేలినా
పూర్వం గాధిసుతేన సామిఘటితా ముక్తానుమందాకినీ
యత్ర్పాసాద దుకూల వల్లిరనిలాందోలైరఖేల ద్దివి.

527

ప్రథమ, చతుర్థ చరణములందు యతి భంగములు. చతుర్థ చరణమందు ఛందోభంగమున్ను.528

భర్తృహరి సుభాషితము

లభేచ్చ సికతాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగతృష్టికాసు సలిలం పిపాసార్ధితః

కదాపి పర్యటన్ శశ విషాణ మాసాదయే
న్నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్త మారాభయేత్.

529

ఇది పృథ్వీవృత్తము. "జసౌజసయలా వసుగ్రహ యతిశ్చ పృథ్వీ గురుః" అను లక్షణము వలన ప్రథమ చరణమందు 'ల', ద్వితీయ చరణమందు సు', చతుర్థ చరణమందు 'ర్ఖ' పదాంత (వర్ణ)ములుగాన యతిభంగములు.530

వృత్తరత్నాకరము

వంశే భూ త్కాశ్యపస్య ప్రకట గుణగణ శ్శ్తైవ సిద్ధాంత వేత్తా
వీరః పచ్చేక నామా విమలతరమతి ర్వేదశాస్త్రార్థ బోధీ
కేదార స్తన్యపుత్ర శ్శివచరణయుగారాధనైకాగ్ర చిత్త
ఛదస్తే నాభిరామం ప్రవిరచిత మిదం వృత్తరత్నాకరాఖ్యమ్.

531

తృతీయ చరణమందు 'రా' ద్వితీయ వర్ణము యతి. లాక్షణికుడే ఇట్లు రచించగా ఆలంకారికులు యతిభంగ, ఛందోభంగములు దోషములనరాదు. ఇన్నిప్రయోగములు బాలుర తెలివిడి కొఱుకు వ్రాసినాము. పదమధ్య పదానసాద వర్ణములు యతులు గలవు. పాదాంతగురువు లఘువు కలదు. పాదమధ్య గురువును లఘువు కలదు.532

తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-23)
గీ.

సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు
నపుడు క్రారను గూడిన యక్కరంబు
లూదియుండు నొకొక్కచో నూదకుండు
తెనుఁగు కృతులందు సామజాజిన నిచోల.

533
లక్ష్యములు
శాంతిపర్వము (4–81)
ఉ.

కావున కామక్రోధములు గ్రాచుచు నాశ్రిత కోటి (గాచుచున్
భూవలయప్రజన్ సమతఁ బ్రోచుచు రాజ్యముసేత మేలు భి
క్షావిధి లోనుగా గలుగు సారపు ధర్మములం ఘటించు మే
ల్వావిరి ప్రయత్నమున వానికి వచ్చు నృపాల యమ్మెయిన్)

534

అచ్చు పుస్తకములందు లక్షణభంగ మనుకొని 'కామరోషముల' అని దిద్దినారు.535

ఉద్యోగపర్వము (2-24)
చ.

అనవుడు నిట్లను న్విదురుఁ డక్కట ధర్మసుతుండు బాంధవుం
డును చెలికాడునుం దగు భటుండును బ్రెగ్గడయుం గురుండుగా
డె నరవరేణ్య ధర్మప్రకటికృతచిత్తుఁడు శాంతమూర్తి స
ద్వినయవివేకశీలముల విశ్రుతుఁ డాతఁడు కీడు వల్కునే.

536
శల్యపర్వము (1-221)
చ.

కృపకృతవర్మలం గడిమి గిట్టి శిఖండి ప్రభద్రకుల్ మహో
గ్రపువడిఁ దోడ్పడంగ భుజగర్వము చూపిన నా బలాఢ్యులన్
(గుపితమనస్కులయ్యుఁ బలుగోల్తలఁ జేర్చిన లావు చేవఁ గ
య్యపు నెరవేల్పు దాల్మి సరివచ్చెడు పాటున ముంచెఁ జూపఱన్.

537

ఈ పద్యము లచ్చు పుస్తకములందు దిద్దలేదు. ఇక్కడ నేమనుకొనిరో తెలియదు.538

కాశీఖండము (4–81)
సీ. పా.

సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు
             గీతవాద్యవినోదక్రియలఁ దగులు...

539

అచ్చు పుస్తకము లందు 'వినోదకేలి' యని దిద్దినారు.540

సభాపర్వము (1-78)
ఉ.

వానికి నెయ్యుఁడై యమరవంద్యపదాంబుజుఁ డంబికాబృహ
త్సీనపయోధరాగ్రపరిపీడితవక్షుఁడు భూషణీకృతా
హీనుఁ డశేషలోకగురుఁ డీశ్వరుఁ డెప్పుడు నంద యుండు నా
నా నిశితాయుధాయుత సనాథ మహాద్భుతభూతకోటికిన్.

541
రాఘవపాండవీయము (1-35)
క.

వేంకటవరదుఁడు వెలయు ని
రంకుశవితరణనిరూఢప్రజ్ఞను రణని
శ్శంకితప్రాభవమున నక
లంకితకీర్తిప్రతాపలక్ష్ముల మహిమన్.

542

ద్వితీయ తృతీయ చరణములందు వరుసగా ఢ, త అను గురువులు లఘువులు.543

'సంయుక్తే సంస్కృతాద్యే స్వా, త్సర్వమాంధ్రపదం లఘు
భవే బాద్య సమాసేపి, రేఫయోగాత్పరం తథా
పదేపి చ తథాత్వం స్యాత్ క్వచిన్నైవ న రేభయోః
సర్వాస్వపి చ భాషాసు, రహయుక్తేక్షరే పరే
పూర్వవర్ణస్య లఘుతా, వేష్టా మల్హాది కేపి చ'

అని అధర్వణసూత్ర మున్నది గాన గీర్వాణమంచును ఈలాగు కలదు. ఉదాహరణము శిశుపాలవఛ యందలి

ప్రాప్తనాభిహ్రద మజ్జన...

మనునది వ్రాసినారు. మరియును గలవు. నన్నయభట్ట కారిక—

'ఈ దంతా ఇద్వదేవ కృత హ్రస్వాః' (ఆ. శ. చి. అజం. 41)


'రేఫ సంయోగే పరే పూర్వ వర్ణస్య లఘుత్వే. 'శత తాళదఘ్న హ్రదమునఁ బడియెన్' ఇత్యాదయః కవి ప్రయోగాః ఉవాహరణమ్'
(క. శి. భూ. పు. 173)

అని అహోబల పండితులు వ్రాసినారు.544 ప్రతాపరుద్రీయము నందు చెప్పబడిన పదదోషములలో క్లిష్టమున్న దొకటి. దానికి లక్ష్య మిట్లున్నది—

'నభస్వదశ నారాతి ధ్వజాగ్రజ విరోధిషు (దోష. 15)


“నభస్వదశనా స్సర్పాః తేషా మరాతిర్గరుత్మాన్. స ఏవ ధ్వజో యస్యేతి విష్ణు, స్తస్యాగ్రజ ఇంద్ర, సస్య విరోధిషు పర్వతేష్విత్యర్థః ప్రతీతే రతి దూరణ్వాత్ క్లిష్టమ్'

అని వ్రాసినారు. అతి దూరార్థమైనందున 'క్లిష్ట' మను దోషమును చెప్పినారు, సరే.545

కామారిః అంటే శివుడుగాని, శివారిః అంటే కాముడుగాడు. నాగారిః = సింహము, కాని సింహారిః = ఏనుగుకాదు. అనగా నోడినవారికి అరి, విరోధి ప్రభృతిశబ్దములు చెల్లవు, జయించినవారికి చెల్లును. ఇంద్రునికి పర్వతము లోడినవి గాని పర్వతముల కింద్రు డోడలేదు. సురాసురులకు సమానముగాన వారి కొకరి కొకరికి పరస్పరము చెల్లును. అమరమునందు బర్హిర్ముఖాః క్రతుభుజో గీర్వాణా దానవారయః' అని (దానవారయః) = రాక్షసులకు శత్రువులని చెప్పినారు. మరియు "శుక్రశిష్యాదితిసుతాః పూర్వదేవా స్పురద్విషః" అని (సురద్విషః = ) దేవతలకు శత్రువులని చెప్పినారు. కావున “నభస్వదశనారాతి ధ్వజాగ్రజః విరోధీ యేషాం తే" అని బహువ్రీహి చెప్పితే యుక్తముగా నుండును. మూల వ్యాఖ్యానములందు షష్ఠీ తత్పురుషమే వ్రాసినారు.546

ప్రతాపరుద్రీయమందు చెప్పబడిన అర్జదోషములలో 'అతిమాత్ర' మన్న దొకటి.547

'యత్సర్వలోకాతీతం త, దతిమాత్రం ప్రకీర్త్యతే' అని లక్షణము చెప్పి —

మా భూ దేకార్ణవం విశ్వ, మితి సంకోచితాశ్రుభిః
అరణ్యే హూణ నారీభిః, అసంఖ్యా నిమ్నగాః కృతాః (దోష. 54)

అని లక్ష్యము చెప్పినారు. ఇది దోషమైతే

పారిజాతాపహరణము (1-10)
ఉ.

రాజుల సేతయుం బరశురాముఁడు నంతలు సేసె రెండుమూఁ
డీ జగతిం గణింప నది యెంతటి విస్మయ మంచు, నీ సుహృ
త్తేజుఁడు కందుకూరికడ తిమ్మయ యీశ్వరుచేఁ జనించె మో
రాణి బెడందకోట యవనాశ్వికరక్తనదీసహస్రముల్.

548
వసుచరిత్రము (1–74)
మ.

జలధిన్ దానపయోనదీఝరులచే చంద్రున్ యశోలక్ష్మిచే
జలదవ్రాతము నాత్మకారితమహాసత్రాగ్నిధూమంబుచే

జెలువొప్ప న్వెలయింపఁజాలు భళిరే శ్రీరంగరాయక్షమా
లలనావల్లభుఁ డుర్వీదాతలకు నెల్లన్ దాత యూహింపఁగన్.

549

(అనుచోట్ల దోషము కావలెను. కాని, ఇటువలెనే మహాకవులందఱు నతిమాత్రమునే వర్ణించినారు. అవి యెన్నని వ్రాయము!550

వసుచరిత్రము (1-83) నందే
మ.

అతిధీరుం డతిదానశీలుఁ డతిరమ్యాకారుఁ డత్యంతసు
వ్రతుఁ డంచున్ దను సన్నుతించు కవి వాగ్వ్యాపారమెల్లన్ యథా
ర్థతరంబై విలసిల్ల తిర్మల మహారాయేంద్రు శ్రీ వేంకట
క్షితినాథోత్తముఁ డిందు నందు గతి గల్గించున్ గవి శ్రేణికిన్.

551

అన్ని పుస్తములందు (చతుర్థచరణమందు) 'కల్పించున్' ఆవి యున్నది. వ్యాఖ్యాకారులును యతిభంగము కానక తప్పునకే అర్థము వ్రాసినారు. 'కల్పించె' ననగా ఉత్తదనుటే, గాన నర్థమున్ను బాగులేదు. ధనకనకవస్తువాహనాదులచే గతి కల్గించినాడనిన్ని, ఉత్త మపురుషగుణస్తుతిచే నందు పరము గల్పించినాడనిన్ని అర్థము. ఇచ్చట నతిమాత్రమే కాకపోతే—552

స్వర్గారోహణపర్వము (1-98) నందు
క.

విను మొక్కటి సెప్పెద రా
జను వానికినెల్లఁ దప్ప దవనీశ్వర యె
ట్లును నారకస్థలంబుం
గనుగొనవలయు టిది వేదకథితము సుమ్మీ.

553

అని ధర్మరాజుతో నింద్రుడు చెప్పెనుగదా! మరియును—

‘అసత్కీర్తనకాంతార, పరివర్తన పాంసులామ్
వాచం శౌరికథాలాప, గంగయైన పునీమహే!

అని వేదవ్యాసులవారు రాజులను వర్ణించుట చేతను వాక్యము పాంసులమైనది. శ్రీ భగవత్కథాగంగ చేత పవిత్రమును చేయుచున్నామని హరివంశము రచించినారని స్పష్టముగా నుండగా వెంకటేంద్రుని వర్ణించిన కవీశ్వరులకు నుత్తమలోకము లెటుల గలుగును (కావున ఇది అతిమాత్రము. ఎటువంటి దుశ్చరితుడైనను కవీశ్వరులచేత వర్ణించబడేనా, వానికి నుత్తమలోకము సిద్ధము.

'కీర్తిం స్వర్గఫలా మాహుః, ఆసంసారం విపశ్చితః
అకీర్తిం తు నిరాలోక, నరకోద్దేశ దూతికామ్'.

ఎవ్వని కీర్తి ఎంత మట్టుకుంటున్నదో వానికి నంత మట్టుకు స్వర్గప్రాప్తి. ఎవ్వనికి ఎంతమట్టుకు నపకీర్తి ఉంటున్నదో వానికి నంతమట్టుకు నంధకారబంధురమైన నరకప్రాప్తి.

‘మహానదీ ప్రవిష్టాని, రథ్యాంబూ నీవ పావనాః
కావ్యే ష్వంకిత నామాన, స్సేవ్యంతే మానవా వరైః'

అని యున్నందున కవీశ్వరులచే వర్ణింపబడిన వారికి సద్గతి కల్గునని యుండగా, రాజులను వర్ణించిన కవీశ్వరులకు సద్గతి యనుట అతిమాత్ర మెందుకు కాకపోయెను ఇతర కవీశ్వరులు మాత్రమే కాదు, విద్యానాథుడుగారును అతిమాత్ర దోషమునకు పాల్పడిన వారే.554

ప్రతాపరుద్రీయము

"బ్రహ్మన్ మేరుగిరౌ కృతేపి కిమిదం నైవం విధాస్తే ముదః
స్వామిన్ సత్య మధిక్రియాద్య ఫలితా యద్వీరరుద్రః కృతః
మిథ్యా కిన్ను వికత్థసే త్రిజగతస్త్రాణాయ మత్ప్రార్థితః
శంభుః క్ష్మా మనతీర్ణవానితి కథా జాతా హరి బ్రహ్మణోః."

555

ఇచ్చట నతిమాత్ర మెందుకు కాకపోయెనో తెలియదు.556

"స్వామిన్ గోత్ర మహీధరాన్ కిమధునా నిచై ర్విధత్సే కుతో
గాధానంబునిధీన్ కురోషి కురుషే కిం దిక్పతీ నల్పకాన్
ఇత్థం పార్శ్వచరానులాప మఖిలం న్యక్కృత్య ధర్మైషిణా
స్పష్టః పద్మభువా గుణైక వసతిః శ్రీవీరరుద్రో నృపః"

557


“వదాన్యో నాన్యోస్తి త్రిజగతి సమో రుద్ర నృపతేః
గుణశ్రేణీ శ్లాఘా పిహిత హరిదీశాన యశసః
సమాంతా దుధ్భూతైర్ద్విరద మదగంధై స్సురభయః
క్రియంతే యద్విద్వజ్జనమణిగృహ ప్రాంగణ భువః." (నాయక.16)

558

ఇంతకన్న నతిమాత్రము కన్పించదు.559 విద్యానాథుడుగారు గల్ల కటి శబ్దములు గ్రామ్యములన్నారు. ధర్మాభట్టు గారు గల్ల శబ్దము మాత్రమే గ్రామ్యమన్నారు. కటి శబ్దము మహాకవు లందరును వాడుక చేసినారు.560

కాళిదాస దండకము

'చారు శింజక్కటీసూత్ర నిర్భర్త్సితానంగలీలా
ధనశ్శింజనీడంబరే, దివ్యపీతాంబరే....

561
ఆముక్తమాల్యద (1-56)
మ.

శయపూజాంబుజముల్ ఘటిం దడబడన్ జన్దోయి లేఁగౌను పై
దయదప్పం బసపాడి పాగడపుపాదంబొప్ప జెంగల్వ డి
గ్గియ నీ రచ్యుతమజ్జనార్ధము గటిం గిలించి దివ్యప్రబం
ధయుతాస్యల్ ద్రవిడాంగనల్ నడతు రుద్యానంపు లోఁద్రోవలన్.

562

ఇటువలెనే మహాకవి ప్రయోగములు బహులములు గలవు. సరసమైన కటి పదమును గ్రామ్యమనరాదు.583

ధర్మాభట్టుగారు అశ్లీలమునకు పదగతదోషములందు 'గుహ్యకేశ' పదమును, అర్థగతదోషములందు 'మదనధ్వజ' పదమును వ్రాసినారు. యుక్తముగా నున్నది. 'గుహ్యక' పదము, 'ఈశ' పదము- రెండు కలిపితే 'గుహ్యకేశ' అని వ్రీడాకరమైన అశ్లీలము. 'గుహ్యకేశ్వరః' 'యక్షేశః' అని ఉంటే, పదగతదోషము లేదు. 'మదన' పదము మంచిదే. 'ధ్వజ' పదమును మంచిదే. 'మదనధ్వజ' మని రెండు కలిపితే వ్రీడాకరమైన అశ్లీలము. మత్స్యము కర్థముండినా, చటుకున వ్రీడాకరమగు నర్థమే స్పురించును. 'గుహ్యకేశః' కుబేరున కర్థముండినా, వ్రీడాకరమగు నర్థమే చటుకున స్ఫురించును. గాన ధర్మాభట్టుగారి నిర్ణయము యుక్తముగా నున్నది.564

విద్యానాథుడుగారు అశ్లీలమును మూడు విధములుగా చెప్పినారు. 'అమంగల, జుగుప్సా, వ్రీడాకం త్రివిధ మళ్లీలం' అని. ఉదాహరణము, వివరణ ఇట్లున్నది.

'అభిప్రేత పదావాసః, కదా న స్సం భవిష్యతి
నీచం సాధన మేతేషాం, పరోత్సర్గైక జీవినామ్' .


“అత్ర అభిప్రేత పదాత్ ప్రేతలోక ప్రతీతే రమంగలత్వం, సాధనం నీచ మిత్యనేన తుచ్ఛ మేహన ప్రతీతేః వ్రీడాకరత్వం, పరోత్సర్గైకజీవినా మిత్యనేన అధోవాయు ప్రతీతేః జుగుప్సాకరత్వమ్"

సాధన పదముకు మేహనమున్ను కోశమం దర్థమున్న దీని వ్రీడాకరత్వమే అయితే: రఘువంశము (చతుర్థ సర్గ) యందు

'ప్రతి జగ్రాహ కాలింగ, స్తను స్త్రీర్గజ సాధనః
మణిర్ధ్వయో రజాకంఠ, స్తనే రత్నే ప్యలంజికే'

అనుచోట, 'లలంజః = నిరర్థక జన్మవాన్. స్వార్థే కః, మేహనాగ్రే' అని నానార్థరత్నమాల యందు ఉండుటచేత అశ్లీలమగును. ఇదిట్లుండగా, తేజశ్శబ్దమునకు రేతమని సాధారణముగా నర్థము ఉన్నది.

'శుక్రం తేజో రేత నీచ బీజ వీరేంద్రియాణి చ'

అని నిఘంటువు. తేజ శ్శబ్దము జుగుప్సాకరము కావలె. కాని మహాకవి ప్రయోగములు బహులములు గలవు.

సాహిత్యరత్నాకరమందు

'రాజతేద్రౌ సుధాబ్ధౌ చ, శ్రియమాహృత్య రాజతే
రాజతేజోనిధేః కీర్తిః, త్రైలోక్యే రఘు రాజతే.

అని యున్నది. మరి ఇది అశ్లీలము కావలె: 'భగ యోనిర్ద్వయోః' అని నిఘంటువున్నందున 'సుభగః' వ్రీడాకర మనవలె. కాని అహోబల పండితులవారు

"వీర్యసుభగాది శబ్దా, విక్రమ సుందర ముఖాభిధేయేషు
కావ్యేషు సంప్రయుక్తాః, కవిభిః శ్లాఘాయుజో భవంత్యేవ."

అని చక్రవర్తిగారు సంజీవని యందు చెప్పినారని వ్రాసినారు. వీర్య సుభగ పదములే మంచివని మహాకవి ప్రయోగము లుండగా, సాధన పదముకు మేహనార్థ మెక్కడో కోశమందున్నదని అశ్లీలమనుట యుక్తముగా కనిపించదు. అర్థమందున నిదే చూచుకొమ్మన్నారు. అటువంటిది అర్థగతదోషములందు వ్రాయరాదు. అన్ని విధములను సందర్భము కనిపించదు.565

'అంబికా రమణ' పదమున 'విరుద్ధమతికృత్' దోషమన్నారు. కానీ బహుల ప్రయోగములు కలవు.566

కవి రామభద్రుని జయరమా రామశతకము
సీ. పా.

గాధితనూజ యుగత్రాణవిశ్రుతం
             మంబికా రమణ శరాస భంగ...

ఆంధ్రనామసంగ్రహము
సీ. పా.

మరకతచ్ఛవికి నంబరమున కగుఁ బేరు
             పచ్చడాలనిన నంబాకలత్ర...

అందే
గీ.పా.

నాగవాసమనట నామమౌ వేశ్యాజ
నంబుమేళమునకు నంబికేశ

ఇటువలనే మహాకవులు ప్రయోగించినారు. ఆలంకారికు లెందుకు దోష మనిరో మహాకవు లెందుకు ప్రయోగించిరో తెలియదు.567

'ధావన్మృగేషసంభ్రామ్య త్కరిషూద్యత్తరక్షుషు
వింధ్యారణ్యేషు...

అనుచోట పతత్ ప్రకర్షదోషమని ఉదాహరించినారు.568

'భ్రామ్యత్కరి షూద్యత్తరక్షుషు, ధావన్మృగే ష్వితి
వక్త వ్యేన తధోక్త మితి పతత్ప్రకర్షతా'

అని వివరించినారు.569

'తురగాన్ కరిణోధవా'

అనుచోట క్రమభ్రష్ట మను దోషమన్నారు. రెండును పతత్ ప్రకర్షదోషమనే చెప్పవలెను. (రెంటికిని) భేదము లేశమును కనిపించదు. మరి పతత్ పకర్షము దోషమే అయితే

'న బ్రహ్మ విష్ణువచసామపి గోచరస్త్వ
మస్మద్విధస్య కిమహో తదవైమి సర్వమ్ '

అను మల్హణకవి పద్య మేమగునో మరియు అతని పద్యమే యగు

‘బ్రహ్మేంద్రవిష్ణుసురదానవలోకపాలైః'

అన్నదేమగునో! ఇంకను గలవు.570

దండిగారి అనామయము

వేధావిష్ణుర్వరుణధనదౌ వాసవో జీవితేశ
శ్చంద్రాదిత్యా వసన ఇతియా దేవతాభిన్న కక్ష్యాః
మన్యే తాసామపి న భజతే భారతీ తే స్వరూపం
స్థూలే త్వంశే స్పృశతి సదృశం తత్పున ర్మాదృకోపి.

571
సుభాషితరత్నావలి

శంభుస్స్వయంభు హరయో హరిణేక్షణానాం
యేనాక్రియంత నుతతం గృహకుంభదాసాః
వాచామగోచర చరిత్ర పవిత్రితాయ
తస్మై నమో భగవతే మదనధ్వజాయ.

572

ఇందు పాదాంతలఘువులు గురువులు, 'స్వయంభు' హ్రస్వాంతము, గమనించవలెను.573

'భద్రాసనాని దృషదః భద్రాణి చ మహీరుహాః
దుర్దశా రాజ్యమూర్థాభిషిక్తాః పున రహో వయః'

అనుచోట 'సంబంధ వివర్జిత' మను దోషమన్నారు. సరే, భిన్నలింగ వచన దోషములకు

'సముద్రా ఇవ గంభీరం, మనో మాల్మభూభుజః
గిరిణేనాంధ్రనృపతి ధ్వజిన్యా కలుషీకృతమ్'

అని లక్ష్యము వ్రాసినారు. ఈ భిన్నలింగ దోషము 'భద్రాసనాని' అను శ్లోకమందును కనుపించుచున్నది. (భిన్నలింగ, వచనములకు కొన్ని ఉదాహరణములు వ్రాసుతాము.)574

'రాత్రి ర్యామత్రయపరిమితా వల్లభా స్తే సహస్రమ్!

575

'వల్లభాస్తే సహస్రం' భిన్నలింగము.576

ధర్మాభట్టుగారి నరకాసురవిజయము

'శయ్యాంబరం శశిశిశోరివ భాతి, లాక్షా
             తాంబూలయో రివ రసై కరుణాభ్రలేశైః...

577

ఇదియు భిన్నలింగమే.578

జయదేవ మహాకవికృత ప్రసన్నరాఘవము

కిం శీతాంశు మరీచయః కిము సురస్రోతస్వినీ వీచయః
కిం వా కేతక సూచయః కిమధవా చంద్రోపల శ్రీ చయః
ఇతం జాతకుతూహలాభి.....స్సానందమాలోకితాః
కాంతాభిం స్త్రిదివౌకసాం దిశిదిశి క్రీడంతి యత్కీర్తయః

579

ఇచ్చట (వీచయః మొదలగునవి బహువచనములు శ్రీచయః ఏకవచనము) కాగా భిన్న వచనము.580

(ఇటువలెనే ఆలంకారికుల దోషమార్గమును మహాకవుల ప్రయోగమార్గమును పరిశీలించుకొనవలెను. దిక్సూచనగా బాలుర తెలివిడి కొఱ కివి వ్రాసినాము).581

గ్రంథాంత విజ్ఞప్తి

సీ.

సుకవీంద్రులార! సర్వకలాకలాపర
             త్నములార! మును లక్షణములు పెక్కు
గలుఁగఁగఁ గ్రోతలక్షణ మేల రచియించె
             నితఁ డని మీకు నుపేక్ష వలదు
తొల్లిటివారును దోచిన యటుల వే
             ర్వేర రచించినవారు గారె
నేనును దద్రీతినే రచియించితి
             నారసి మీకు గ్రాహ్యంబులైన
వీటిని గొనుండు తప్పులు వాటిలినఁ ద
గుదయ దనర దిద్దుడు తద్ద గ్రంథసమితి
నరసి, విబుధులఁ దెలసి సమంచితముగ
సంఘటించితి కుక్కుటేశ్వరుని కరుణ.

582


సీ.

అవనిపై శాలివాహనశకవర్షముల్
             జలనిధి జలజాత జాత శైల
కైరవమిత్ర సంజ్ఞాన్వితమైన ప్ర
             జోత్పత్తి శరదాశ్వయుజ సితేత
రచ్ఛదైకాదశీ రౌహిణేయదినంబు
             వరకు నీపేర సద్భక్తి మీర
నొనరిచి సుకవిమనోరంజనం బను
             లక్షణరాజంబు రాజమౌలి
నీకు నర్పించి తటుగాన నిధ్ధరిత్రి
నారవిశశాంకతారాగ్రహంబు గాఁగ
సుకవిగృహముల విలసిల్లుచుండజేయు
మీనశశిరథాంగ! శ్రీ కుక్కుటేశలింగ!

583


ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

  1. ఇది చతుర్థాశ్వాసాది పద్యము. చతుర్థాశ్వాసమునుండి వేరుచేసి విడిగా చూపబడిన ఈ పంచమాశ్వాసమున కదే ఆదిపద్యముగా చూపబడినది.
  2. ఈ ఆశ్వాసాదినుండి 149 వ పద్యమువరకు 'ఇ ప్రతి' నుండి గ్రహింపబడినది. (చూ. సమాలోకనము '—మూలప్రతి')
  3. ఈ శ్లోకము మేఘసందేశమున ప్రక్షిప్తమని కొన్నిప్రతులయందు చెప్పబడినది.
  4. 'వేదాలు, వాదాలు' గ్రామ్యమని ఆం. భా. భూ. నందు లేదు. ‘యేదాలు, వోదాలు' గ్రామ్యమని యున్నది. ‘... యేగ గొంటూ రమ్ము యేదాలు వోదాలు మోసేటివా రాస సేసు వారు...' ఆం. భా. భూ. 26.
  5. ము. ప్ర. 'సుతుఁడు సుతు సుతునిఁ గనియెన్...