Jump to content

సీతారామస్వామి

వికీసోర్స్ నుండి


 సావేరి రాగం   ఆది తాళం

ప: సీతారామస్వామి నే జేసిన నేరంబేమి || సీతా ||


అ.ప: ఖ్యాతిగ నీపద పంకజములు నే

ప్రీతిగ తలుపక భేద మెంచితినా || సీతా ||


చ 1: తంగుగ నా పదివేళ్ళకు - రత్నపు టుంగరములు నిన్నడిగితినా

సంగతి బంగరు శాలువ పాగా - లంగీల్ నడికట్లడిగితినా

చెంగటి భూసుర పుంగవు లెన్నగ - చెవులకు చౌకట్ల డిగితినా

పొంగుచు మువ్వలు ముత్యపుసరములు - బాగుగ నిమ్మని యడిగితినా || సీతా ||


చ 2: ప్రేమతో నవరత్నంబులు దాపిన - హేమ కిరీటంబడిగితినా

కోమలమగు నీ మెడలో పుష్పపు - ధామంబులు నే నడిగితినా

మోమాటము పడకుండగ నీవగు - మురుగులు గొలుసులు అడిగితినా

కమలేక్షణ మిము సేవించుటకై - ఘనముగ రమ్మని పిలిచితిగాని || సీతా ||


చ 3: తరచుగ నీ పాదంబుల నమరిన - సరిగజ్జెలను అడిగితినా

కరుణారస ముప్పొంగ మీ గజ - తురగము లిమ్మని యడిగితినా

పరమాత్మ నీ బంగరు శాలువ - పై గప్పగ నే నడిగితినా

స్మర సుందర సురవర సంరక్షక - వరమిమ్మని నిన్నడిగితినా || సీతా ||


చ 4: ప్రశస్త భద్రాద్రీశుడవని నిను - ప్రభుత్వ మిమ్మని యడిగితినా

దశరధ సుత నీచేత ధరించిన - దాన కంకణ మ్మడిగితినా

విశదముగను నీ మేలిమి మొల నూల్ - వేడుకతో నే నడిగితినా

యేదుము భూమిని కుచ్చల నేలకు - నెక్కువగా నిన్నడిగితినా || సీతా ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.