Jump to content

సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు)

వికీసోర్స్ నుండి

అనుబంధము-2

సారంగధరచరిత్రము

[వచనము]

[శైలికి ఉదాహరణముగా గ్రంథమునందుఁ గొంతభాగము]

సముఖము వేంకట కృష్ణప్ప నాయకుఁడు

—అంత సారంగధరుండు బినతల్లిం గనినయంత, భయభక్తివినయసంభ్రమంబులు మనంబునఁ బెనఁగొన సాష్టాంగముగా మ్రొక్కిన నా జక్కువగుబ్బలాడి గ్రక్కునఁ జేతులు జాచి లేవనెత్తి తనచనుగుబ్బమొన లొకించుక నతనియురంబు సోఁకఁ గౌఁగలించుకొని, మొగంబు మొగంబునం జేర్చి చెక్కిలి నొక్కి ముద్దుఁబెట్టుకొని, నొక్కు చునుండు నచ్చేడియం గాంచి యాకుమారుండు బినతలికిం దనమీదినెనరు మిక్కిలి గావున నక్కరణి నాదరించె, నిది తక్కువ గా దని తలంచి, కరకమలంబులు ముకుళించి, 'రాజు లేనివేళ నే నిందు రాఁజెల్లదు; తల్లీ! యుల్లంబు సైచుకొమ్మనుటయు, నమ్మటుమాయలాడియు, 'నిట్లు పలుకంగాఁ దగునే? నీవు నావసుధావల్లభుండు నొక్కరూపంబు గావున తడఁబడి మొక్కఁజెల్లునే,' యని సుశీలయుంబలె

నాదుశ్శీల చేయిఁ జాపి, ముందుగ విచ్చేయుమని యమ్మహాత్మునిఁ దోడ్కొని, 'అతివినయం ధూర్తలక్షణ' మ్మనువిధంబున నరిగి కప్పురంబులు చిలికిన చల్లనిపన్నీట నాతనిపాదంబులు గడిగి యొత్తించి, బేర్చిన ముత్తియంబులు జేర్చిన పసిండిగద్దియఁ గూర్చుండ నునిచిన, యానరేంద్రనందనుండు, ‘జననీ! తక్కినవారికిం బలె యింత యుపచారం బేమిటికి? యేను నీకుమారుండనుఁ గానే!' యనుటయు నా పువ్వుఁబోఁడి, బొమ్మంచుకెమ్మోవిచిగురునం జిరునగవుమొలకలు గులుక, కప్పురంపువీడియంపుతావి ఘుమ్ము మన, తేనియచినుకు లొలుక నిటు పలికె; 'ఓ జగన్మోహనాంగ! నాకుమారుండ వగుదువు, నిక్కంబు పలికితివి. నీదుసుగుణత్వంబును, నీచక్కఁదనంబు నీ యొయ్యారంబు నిచ్చెలులు నిచ్చలు పలుక విని వీనులకు విందు లయ్యె; ఇప్పుడు కనుంగొనుటచే కన్నులకుం బండువయ్యె, నాకోరికలు లభించె, నే నోఁచిననోములు ఫలించె; చంద్ర జయంత వసంత కంతు నలకూబరాదుల చక్కఁదనంబులు విన్నదియే గాక కన్నది లేదు. డెందంబున కానందంబు కదలింపఁ గన్నులార నినుఁ జూడఁగంటి, నామనంబునం గల్గుదుందుడుకులు నేఁటితోడం దీఱె; కామినీకుసుమసాయకా! నీవంటి నిధానంబు గల్గుటంజేసి యెంతటి పలుకులకుఁ జింతవలదు, పచ్చవింటివజీరునింబోలు నీవు వచ్చుటం జేసి రాజేంద్రుండు రాలేదను పరితాపం బేటికి? వెన్న యుండఁగా నేయి లేదని చింతింపనేల? నీ వెన్నండును నన్నుఁ జూడరావని దూరుచునుంటి; ఇప్పుడు నాపై నెనరు గలందులకు గురుతుగంటి, నిన్నుఁ గూడి మనంగంటి; నాదు యపరంజిమేడ నీ వెన్నండునుఁ జూడరావుగదా! యీయింద్రనీలంపుసోరణగండ్ల యందంబు, యాసొగసు గొప్పటోవరుల చందంబు, నాకలువలరాయల రాతియరుంగుల రంగులు, నాహరువంజి(హురుమంజి)ముత్యముల మేలుకట్లును, నీమగరాల నిగరాల గోడల వేడుకలు నిచ్చు కీరపారావతాదుల వినోదంబులు, తక్కునుం గల విశేషంబుల సంతోషంబునఁ జూచి, యామానికెపుటోవరులందు పువ్వులపాన్సున కమ్మతెమ్మెరలు వీవఁ గొంతసేపు పవ్వళించి, గంధము చెక్కలాకులు గైకొని పోదువుగాని ర’ మ్మన—

అప్పుడమియొడయని కొడుకు వెడనగ వంకురింప నప్పడంతుకం జూచి, 'సత్వరంబుగాఁ జనవలయు, ప్రాణపదంబగు నాపావురంబు యిచ్చోట వ్రాలె, నీవు మాపినతలివి గావున రవికిరణంబుల కేనియుఁ జొరఁగూడని యంతఃపురంబునకు వచ్చి నీపదంబులకు మ్రొక్కితి. నీకటాక్షంబున నన్నిభాగ్యంబులు గల్గియున్నయవి; కాలయాపనంబు సేయక పావురం బొసంగినం బోయెదు ననిన, నక్కురంగలోచన లోచనాంచలంబుల నించుకించుక చక్కచిక్కనిచంద్రిక లీనం జూచి, నవ్వుచు, 'నింత తీవరంబేమి? యించుకసేపు విశ్రమించి పోవుదువు గాక' యని, యారాచపట్టిఁ జేపట్టి నట్టియాసల నాదిట్టతోడనే లేచి మట్టుమీఱిన మోహంబునఁ బయిడిమేడకుం దోడుకొని పోయెను.

గద్యము.
సముఖ మీనాక్షి తనూభవ వేంకట కృష్ణప్ప నాయక
ప్రణీతంబైన సారంగధరచరిత్ర
వచనకావ్యంబునందు
యేడవయధ్యాయము.

సారంగధరచరిత్రము

ఎనిమిదవ అధ్యాయము

అప్పుడు ప్రోడలగు చేడియ లాచేడియం జూచి, యక్కుమారుని చక్కదనంబును, యాచక్కెరబొమ్మ యక్కఱయుం జూచి, 'నేఁటి కిబ్బోటి కేమో పాటు వచ్చునని తోఁచుచున్నయది. ఇత్తఱి, యా బిత్తరి కింత తత్తఱం బేమిటికి? సూటిగానిచోట మోహంబు బాటించుట భాతి గాదు. ఇవ్విధంబు మాను మని బలికినఁ బగతుల మగుదుము. ఈ వనితను మనము మానుపలేము. దైవగతి విపరీతం బయ్యెనని దోఁచుచున్నయది. మేమి సేయంగలవారము? ఆయమ్మ నియమించు చందంబున నుండుద, మిక్రమీద నెటులయ్యె నట్టులగుఁ గాక!' యని గుస గుసలం బోవుచు నటునిటు నడయాడుచుండ, చిత్రాంగి విచిత్రంబైన మేడ మీద కతనిఁ దోడుకొని, తన పదపద్మరాగంబులు సౌపానపద్మరాగంబులు, పరస్పరంబు సంధింప, బంగరుశలాకయుం బోని యంగవల్లికాంతియు నచ్చటి కవాటంపుకుందనంపుతళుకులు నెయ్యంబున వియ్యంబులంద, పలకవజ్రంబులగవాక్షులు తనకటాక్షశాంతు లక్షులు నేకీభవింప, తృణగ్రాహి నీలమణిమయంబులైన కంబంబులడంబులు తన నీలాలకకదంబంబుల నొండొంటి నొరసికొని విలాసినీమణిప్రభావిభాసమానంబులైన చవికె, లుప్పరంబులు, తిన్నియలు, జవాదిగిన్నియ లిడినఠావులు, నాదియైన వినోదంబు, లాతనికిం జూపుచు, మేడమీదికిం బోవు నప్పుడు, చంద్రకాంతమణిమయంబు లైన యరుంగుల రంగులు, యింద్రనీలమాణిక్యమయస్తంభకాంతులు రెండునుఁ బెనంగొని గంగాయమునాసంగమంబులభంగి నెఱింగించె. నాయకంబులైన పద్మరాగకాంతినికాయంబులు సాంధ్యరాగంబు చందంబుఁ గందళింప, చెక్కడంపుటోవరులకప్పులు చవుకట్లుచప్పున నొప్పుమీఱ, మగరాలనిగరాలనెలకట్టుచాయలు వెన్నెలల వెదఁజల్లు మువ్వెలుంగులకు ఠావైన యారెలు, పరిమెళదట్టంబులైన గందపట్టియలు, త్రాణమీఱ మేళవించిన వీణియలును, గాలి సోఁకినఁ బలుకు కిన్నెరియలును, తేనియలం జిలుకు బలుకు చిలుకలును, నలువంకల నలంకరించిన గోరువంకలును, చక్కెరవిలుమాష్టీని ఢక్కల వలెఁ జెలంగు నంగులుఁ గల్గి, సకలశృంగారసంపదలసదనంబైన యాసదనంబున నొక్కమణిమయవేది నక్కుమారుం గూర్చుండ నునిచి, యెక్కడఁ జూచినం గొక్కోకకళారహస్యంబులైన చౌశీతిబంధంబులం బెనంగు గంధర్వకామినులను గంధర్వులను వ్రాసిన చిత్రపటంబులం జూపుచు, 'నోయీ, నెఱజాణ! యీ చక్కి నొక్కించుక చూడుము: గొల్లాయిల్లాండ్ర చనుగుబ్బలఁ బట్టి, వారి కెమ్మోవులఁ బలుమొనలుఁ బెట్టి యనురాగంబున భోగించు గోపాలుని చందంబు యెట్టులున్న' దనవుఁడు, నవ్విరక్తుండు నవ్వి!

'ద్రోణపుత్రుని బాణాగ్నిచేత దగ్ధంబై పడిన పరీక్షితుని, తనయఖండితబ్రహ్మచర్యవ్రతమహత్వంబునఁ బ్రతికించిన మహానుభావునకు నా విహారంబులు లోకవిడంబనంబు లింతియకాని సహజంబులు గాదు.'

'రాకుమారచంద్రా! చంద్రశేఖరుండు దారుకావనంబునఁ దపసిచపలాక్షి నొక్కతెం గదిసి మారుని నక్కనకాంగి జంకెన చూపులు జంకించె...'

'తల్లీ! తుంటవిల్తునిం గంటిమంటలచే మంటఁ గలిపిన ముక్కంటి . కామారికిం, గామాతురత్వంబు గలదే?'

‘విశ్వామిత్రుండు, మేనకను ముద్దు బెట్టుకొని, కచంబు నిమిరి, కుచంబు లంటఁ గమకించుటఁ గంటివా!'

'అమ్మా! యమ్మౌనివరుండు మహారాజరాజేశ్వరుండై, యపరిమితభోగంబు లనుభవించి, రోసి యాశాపాశంబులు తెగఁగోసి, విరక్తిం బొంది, బ్రహ్మత్వంబుఁగోరి మహాతపంబు సేయుచుఁ గురుకులంబునకు జననియైన శకుంతల నుత్పాదింపఁగోరి, యవ్విధంబున కొడఁబడియె నింతయ కాని, యంతవానికిఁ గంతుసంతాపంబు గలదె కలిఁగెనేని, త్రిజగన్మోహిని యైన రంభ తనకుందానే వలచి వచ్చిన యెడ చట్రాయిఁగా శపించునే!'

'పంటిమొనల వాతెఱ గట్టిగా నొక్కుచు, నెమ్మేనులఁ జెమ్మట లుప్పతిల్ల నొండొరులఁ దొడరి పెనంగి, కళావిలాసంబులు వెలయ, నలసతఁ బొందియు సందీక సరిబిత్తరు లానుకొని కల్లంబునకుం బెనంగి వే మారుసాధనలం జేయు వీరలం జూచితే?'

'జననీ! జెట్లకు వేమారుసాదనలు జేయుట యుక్తంబె కదా!'

'కమ్మవిలుకానిసంగరంబుల ధేనుకబంధంబునం బెనంగు రంభానలకూబరుల వీక్షింపుము.

కరేణుకాబంధంబున భోగించు గురుసతీనిశాపతుల నాలోకించుము.

ఉపరతిక్రీడావిశేషంబుల నోలలాడు నహల్యాపురందరులఁ గనుఁగొనుము.

సింహవిక్రమంబునం గలయు తారాజయంతులఁ జూడుము.

ఊరుపీడనక్రీడలం జోడుగూడు దాశకన్యాపరాశరులం దిలకింపుము.

పద్మాసనంబను బంధభేదంబునఁ బద్మబాణునిసమరంబు సలుపు యూర్వశీవరుణుల విలోకింపుము!'

'జనయిత్రీ! ఇవి చిత్రంబులు; యిందు విశేషం బేమి!' యనియె. ఆ చిత్రాంగి, తానాడు యారజంపుమాటల కెల్ల నొగ్గక నేర్పునం ద్రోసి పల్కు, నక్కుమారుని భావం బెఱుఁగక, నా సైకతనితంబ కడంబించినచండంబున, పొంకంబగు కుంకుమంబును, బ్రోదిమీరు జవాదియు, విరివితానంబు, రత్నభూషణవిసరంబులు, గాజుగిన్నియల, పటికంపుదొన్నియల బంగరుతట్టల నమర్చి, తనర్చిన మోహంబునం దెచ్చి యునిచి, 'యోయీ, వన్నెకాడా! యీ విరిసరంబులు జుట్టుకొనుము, జవాదిచే తిలకంబుఁ బెట్టుకొనుము, యీమల్లికాగంధం బలందుకొనుము, యీభోగతరంబులైన రతనంబుల భూషణంబులు నలంకరించుకొనుము, యీయమూల్యదుకూలంబులు ధరింపు' మని, యాఱాఁగ యొసంగరాగా, సారోదాత్తుండును, ధౌతభావంబున నవి యొల్లక తల్పంబునం బెట్టి, 'తల్లియుఁ దండ్రియుఁ గూఢబెట్టిన ధనంబులన్నియుఁ గుమారు లవి గా కెవ్వరివి గానోపు వచ్చికొనిపోయెద, నిది నాసొమ్ముగా నీయింట నుండనిమ్ము; అని ప్రియంబు గడలుకొనం బలికిన నాచిలుకలకొలికి తనహావభావవిలాసంబుల జాణతనంపుమాటల, నమ్మేటి మానసంబు గోరంత యేనిఁ జలింపంజేయఁజాలక, యూరట లేని యారాటము మల్లడిఁగొను నుల్లంబున, 'నక్కటా! యేమి సేయుదు: చట్టు పిళ్లారికిఁ జక్కిలిగింత లిడిన చందంబున నీతని చిత్తంబు మెత్తనఁ బడదు. దాదాపులకు వచ్చిన తాలిమి చెల్లునే? తాళిన మీనకేతనుండు ఘాతకుండు; యింక నేమిటం గుట్టు; సముఖంబున రాయబార మేమిటికి?' యని యూహించి, నెగ్గుసిగ్గులనుఁ బరిత్యజించి, యేకాంతంబుగా నలుదిక్కులుఁ గాంచి, పయ్యెక తొలంగ మీటిన పక్కున విచ్చు చన్నుంగవ బైటపడ, నీవీబంధం బూడ, పొక్కిలి చక్కఁదనంబు మిక్కిలి గనంబడ, కామాంధకారంబు గప్పుటం జేసి కన్నుఁ గానక, యగ్గంధగజగామిని, బాహుమూలంబులు తళుకు తళుక్కనన్, సందిట దండలు కంకణంబులు రవలగాజులు ఘల్లు ఘల్లు మన, కరంబుల సాచి కౌఁగలింపఁజూచుటయు, నయ్యుత్తమపురుషుండు, పాపభయంబున గడగడ వడఁకుచు 'హరహర! యిది యేమిగొడవ వచ్చె!' ననుచు దిగ్గున లేచి, 'తల్లీ! నే వచ్చి తడవాయె, పోయివచ్చెద' ననుటయు, నా గరిత, 'యోయీ, రూపరేఖావసంత! కాసంతయు దయలేదే ఆత్మజాకారంబున నావేడుకం జెల్లింతువంటివి. 'సత్యవాణీ సరస్వతీ' యటన్నవాక్య మేమిటికిందప్పు? ఆత్మజుండను పేరు మన్మథునకుం గలదు. నీవును దదాకారంబున రతులందేల్పుము. ఏమిటిమాట, మరునకు మోమాటమి లేదు? అని పలుకుచు, నడుము జవ్వాడ, కుచకుంభంబుల తారహారము లసియాడ పులకాంకురంబులు 'మేనంగూడ, తాల్మియూడ, వాలుగడాలుమన్నీఁడు పైయాడ, నింపుఁ గొనియు నోడక, వాఁకిటి కడ్డంబు నిల్చి, యా గట్టువాయింతి, బలిమిం బట్టఁ బోవుటయు, నతం డవ్వాలుఁగంటిం గనుంగొని, 'నీకు నాయాన... అంటకు' మనిన, 'నోయి, మనోహరాంగ! నే నంటుఁబడినదానను గాను; నిన్నంటిన నేమి?' యనుటయు 'నో యమ్మా! యటంటఁ గాదు. మదీయజనకుం డంటిన పిమ్మట నిన్నంటఁ దగ'దనుటయు, 'నంటుమీఱి నిన్నంటకుండిన, మేనంబ్రాణంబులు గెంటక నెటులుండు? మేలుమేలు! నా మేలు దీటు సేయక నేలు, మేలా జాల, మేలా జాలి బెట్టుట?' యని, దీనత్వంబు దోపఁ బలుకుడు, వింతవింతచెయ్వులం గులుకుచుఁ, గీ లెడలించిన జంత్రంపుబొమ్మ కైవడి, నాతని యురంబున వాలి మోహాంబుధిం దేలి, కెమ్మోవిం గ్రోలం గమకించుటయు, 'హా మహాదేవ!' యనుచు, నా గజగామిని రెండుభుజంబులు రెండుచేతులం బట్టి తోయం బోవు నప్పు డవ్వనిత, మణికంకణంబు మెఱయ, నా రాచపట్టి హొంబట్టుదుప్పటిఁ జుట్టిపట్టుకొని, కూర్చుండఁ బెట్టి, ‘నను కన్నులవిలుమన్నీని బన్నంబుల పాలు చేసి కదలఁ జూచిన న్మెదలనిత్తునే? నా కన్నుల కఱవుం దీర్చిన నీమేను కౌఁగిటఁ జేర్చుకొనకయే, వీనులు తేనియలుఁ జిలుకఁ బలుకు నీ నోటికి బహుమానంబుగా నా తియ్యవాతెఱ విందు సెయ్యకయే, కప్పురంపువాసనలం గుప్పు నీ కమ్మకెమ్మోవికి సమ్మానంబుగా నే ముద్దాడకయే, నామనోభావంబుఁ గఱంచు నీదు హావభావంబులకు మెచ్చుఁగా నీవి నియ్యకయే, నిన్నుం బోవనిత్తునే రమ్ము రమ్ము: వేగిరమ్ము మానుము, కులుకుకోకిల నణంచు గళరవంబుపలుకులుసౌరు మొలనూలి గంటలనాదులు వినక నీకుఁ బోవందగ' దను మాటల వాడిశూలంబులు, చెవులలో నాటం దిమ్మువట్టి సొమ్మసిలి, క్రమ్మఱం దెలిసి, యమ్మంత్రినందను వాక్యంబులు నిక్కంబు లయ్యెనని విన్నంబోయి, కన్నీరుగార బెదవులు దడుపుచు, పులుకు పులుకునం జూచి, పలుకుపలునకుం దైన్యంబు దొలుక, “నేఁ జెల్ల, సతీమతల్లీ! నీవు పినతల్లివని వచ్చినందుల కెట్టిఫలంబు గలిగె, నెదుటివారి యుల్లం బెఱుంగక నీమాటలాడ నెట్టు నో రాడె? యేల తల్లడిల్లెదవు; నీవు తల్లివి నేను తనూజుండ, తల్లియుం దైవసమానంబు, అదియునుం గాక, యొరులచేడియలు నాకుం దోఁట్టువులు! యీ 'వెఱ్ఱిబుద్ధులు నీ కేలవచ్చె? యిట్టి పాపంబు నాకేల గట్టెదవు? యిందున, శాశ్వతంబైన యపకీర్తి వచ్చుఁ, బరలోకంబున దండధరుని దండన లోర్వం దరంబుగాదు; సీతాలతాంగివంటి రత్నాంగికిఁ జనియించిన తన కిట్టిగుణంబులు రానేర్చునే? భూమీశ్వరునాన, యీతలంపులు మానుము, పదివేలు బలుకనేల, నా హృదయశుద్ధి పరమేశ్వరుం డొక్కరుండె యెఱుంగు' ననుటయు, నయ్యలివేణియు నెలనవ్వు మొగంబునం బొలయ, “నిజంబు పలికితివి. నీవు పతివ్రత కొడుకవు. నీ గుణంబులు నీవె పొగడకొనవలదు, హృదయంబుంగంటి: నే తల్లింగాను, దైవంబునుంగాను, మీరాజునకు భోగస్త్రీని; మదనవేదనాదోదూయమానహృదయ లైనసుదతులకు, వావు లేటికి? ధర్మంబు లేటికి? తగవు లేటికి? నా కన్ను లాన, నిన్నుం గూడకమాన, తక్కుపలుకులు విడువుము, పెక్కు లేమిటికి నిమిషంబు నిన్నుం గలసినం జాలు' నని యంతకంతకు నగ్గలంబైన తళుకంబునం బెగ్గిలి, తలుపు మూయంబోవు నప్పువ్వుబోణిం జూచి, 'నేను భోగస్త్రీని, వావులు నాకుఁ బనిలేదంటివి. వంశంబున కెల్ల యొక్కఁడేయని యొట్టిడిన పిన్నవాడే వేఱుపోయితి నన్నం దీరునే? యీ యవివేకంబున కేనందు? ఎందేని యీవావి జగమందుఁ గలదె? రత్నాంగి యొకటియు, నీ వొకటియుఁ గాదు: తలంచిచూడుము. పదరకుము, కాయంబు బుద్బుదప్రాయంబు ... ... యకృత్యంబులు చేయంబూనకుము, నిన్ను విభుం డఱచేతినిమ్మపండుగతి నత్యాస క్తితో లాలింప, నిలింపసంపద లనుభవింపుచు, సొంపున నుండునట్టి నీవు కావరంబునం గన్ను గానక నేల త్రుళ్లెదవు? ఇందున నాపత్పరంపరలు సిద్ధం' బనుటయు, నత్తరళాక్షి కటాంచలంబుల నొక్కించుక యంకురించిన యలుక సానఁదీఱిన చెఱుకువిలుతుని వాడితూపులం బోని మిటారిచూపులం జూచి, 'యోరీ! యెన్ని నేర్చినావురా! యిందున కొంతమోసంబునుఁ గలుఁగఁజేసి, జముం డనువాఁ డొక్కరుండు గలండని భయంబున దుద్దు పెట్టి పోవందలంచెదు. రాజయ్యీని, రెడ్జయ్యీని! ఆనాఁటికిం జూచుకొందము భూవల్లభుం డీకల్లఁ దెలిసి దండించిన దండించనిమ్ము. ఎక్కడి వావి, యెక్కడి పాపము? వెలకొమ్మ లెవ్వరిసొమ్ము? వలచివచ్చిన జవరాలిని విరాలిం బెట్టవలవదు. రతీదేవి పూవిలుతునకు వలచిరాదో, రంభ నలకూబరునకు మేలుఁ జెందదో, యీ వలపు తలంపు నాయెడనే బుట్టెనే? దారుకావని మౌనిమానినులకుం దగిలెఁగాని నీవలె నీలకంఠుండు నేరఁడయ్యెనో, గురునియిల్లాలిని రమించెంగాని కలువలచెలికాఁడు నీవలె నేరఁడయ్యెనో, యహల్యాకాంత నంటుకొనియెంగాని నీవలె నింద్రుండు నేరండయ్యెనో? వారికన్న నీకు వివేకం బధికంబు గాఁబోలు! నీకుఁ గలిగిన బుద్ధి వారికి లేదయ్యెనో? ఆనాఁటికి నీ వుంటివేని వారల యోజనలు జెఱుపవే' యనిన విని యా సుజనుండు, 'యీ పెడమాట లేమిటికి? సృష్టిస్థితిసంహారకర్తలైన దేవత లెటు వర్తిల్లినం జెల్లుగాని, తక్కినవారలకుం జెల్లునే? రంభ మొదలైన వెలయాండ్రు సైతము నిట్లు పుత్రులం బట్టిరే? మననేరవు: ఒక్కకార్యంబునుఁ గననేరవు, యెంత చెప్పిన విననేరవు: చాలుఁజాలు, విడువిడు, పోవలయు' నని బలికిన, నక్కలికి కలిబోసి వెనుక నుట్టిఁ గనుంగొనిన చందంబున నాశకుం బారంబు లేదు గావున నక్కుమారతిలకునిం దిలకించి 'యోరీ! ఱాయైనఁ గఱంగుఁ గాని నీమనంబు గఱుంగదయ్యె. ఇది నీకు మంచి దటరా? ఆఁడది యుసురుమంటే మోసంబు గాఁదటరా? నే బలికినపలుకుల కలుకచే గనుఁగొనలఁ గెంపు నించెదవు, యాకెంపు నాకెమ్మోవిపై నుంచితే దోసమా? నామనంబునం గోళ్లునిలిపెద, వది నా గబ్బిగుబ్బల నిలుపమంటే దోసమా, కుమారకా! వెన్నెలకాఁకకు, మందమలయానిలమ్ముల రాకకు, చిలుకలమూఁకకు, కోయిలల వీఁకకు, వసంతుని జోకకు, మదనుని ఢాకకు, నేకరణిఁ దాళుకొనుదానరా, కెమ్మోవి యానరా, నీకు మరునానరా, కౌఁగిలిఁ గరుణింపరా, యించుక చల్లనిచూపు నింపరా, నామనవి యాలింపరా!'

—అంచు నత్యంతం బుప్పతిలి కనుఁగొలఁకులఁ గాటుకకన్నీరు మున్నీరువలె వెడలి చనుగొండ మునుంగసేయఁ బెక్కువిధంబుల వేఁడుకొను నప్పల్లవాధరిమాటలు విననొల్లక యాచకులం జూచిన లోభివానిచందంబున వేఱెపరాకుం జూచుచు, నేమనిన నేమి వచ్చునో యని నోరెత్త వెఱచి యూడఁబాఱు నుపాయంబు జింతింపుచు, కొంతతడవుండి యటు నిటుఁ జూచి 'యా చెలిం బట్టిన వలరాభూతంబు కొంచాన విడువదు; యెప్పగిదినేనిం దప్పించుకొనిపోవుట యెప్పు' నని యప్పడంతుక పట్టినదుప్పటి విడచి సాముసేసిన యరమట్టి దట్టిచల్లడంబులతో వెలువడి, పులిచే విడువబడిన లేడివడువున రాహుదంష్ట్రావిముక్తుండునైన చందురునిచాడ్పునఁ బోవునెడ, ‘నోరీ! రసికుండవని యుంటి; పైదుప్పటి విడచి పోయెదవు, నీ యంగులెల్లం గంటి మారుబారికి వెఱచి నేను కోరినయెడ చీరికింగొనక, నోరికిందగని క్రూరంబులు పలికి జారిపోయెదు, వలదురా దురాత్మకా! యేల జెడిపోయెదురా? వలదురా, లోపంబులు నారోపించి భూపాలునకుఁ గోపంబు దీపింపఁజేసి నీ కీలుఁగీలుఁ గోయింతు, యింతులతోనా యింతలేసి రంతులు? నీ గురుతు నా చెంతఁ జిక్కె, మంచిది పొమ్ము పొమ్మని ఱొమ్ముఁ దాటింపుచుం బగఁజాటు నవ్వధూటిం దిరిగిచూచి సుగుణాకరుండైన రాకుమారుం 'డంబా! నీవు కుసుమాంబకుని యంబకంబులకునోడి పొడివీడి యాడి గెలకు నన్నుం బాలు సేయుట తగవుగాదు నీవు బలుకు భయంకరభాషణంబులకు వెఱచి, నీ మనోరథంబు నెరవేర్చం బూనితేని, లోకంబున నపకీర్తియుఁ, బరలోకంబున యమునిచే నార్తియుం బొంది పెక్కుజన్మంబుల హీనజాతులం బుట్టవలయు. అంత బాధ పడుటకంటె రాజుచేత నాజ్ఞపడుటేనియు మేలు; వసుమతీపతి చిత్తంబు వకావకలై నన్నుందెగఁజూచునట్లుగా విపరీతంపుమాటలు పలికెదనంటివి. ‘వినాశకాలె విపరీతబుద్ధి' యనువితంబున నీకు బుద్ధి పొడమె. నీ వచించినసుద్దులే నిజంబని తండ్రి నాపయిం గోపించి యాజ్ఞసేయించెనేనియు నాకాశవాణియు, భూకాంతయు నెఱుంగరే? ఆకొల నిన్నుం దోడనె చుట్చుకొను, నీకు సరిపోయినట్టు లుండుము; పోయివచ్చెద' నని పలికి యా గురుకుచనగరు వెడలి, సారథి తెచ్చి నిలిపిన కనకమణిమయరధంబును, మావంతుండు దెచ్చిన భద్రదంతావళంబును, పడివాగెఁ జేసిన కాంభోజకాశ్వరాజంబును, శిబికావహులు దెచ్చిన బంగరుపల్లకియుం జూడక, యూడిగంబులు దెచ్చి పాదంబులఁ బూన్చిన రవలపావలు మెట్టకయే, చింతాకాంతహృదంతరుండై, దిక్కులు చూడకయె తననగరికిం జనియె... [సశేషము.]