షష్ఠాశ్వాసము
| |
రఘుకులచంద్ర! మరు
ద్వైరివధూవరహరప్రతాపవిధూతాం
భోరుహసఖశిఖిచంద్రా!
సౌరయశశ్చంద్ర! రామచంద్రనరేంద్రా!
| 1
|
| తే. |
అవధరింపుము భూతదయాగరిష్టుఁ, డగువసిష్ఠమునిశ్రేష్ఠుఁ డాత్మనిష్ఠుఁ
డనిలపుత్రువిచిత్రమోహనచరిత్ర, లమృతరసపూర మూర ని ట్లానతియ్య.
| 2
|
| భుజంగప్రయాతము. |
శతానందుఁ డాలించి సద్భక్తిఁ బల్కెన్
వ్రతిశ్రేష్ఠ! ము న్మీరె వాక్రుచ్చినా రే
గతిన్ మంత్రజాలం బగస్త్యుండు వేఁడెన్
హితప్రౌఢి శ్రీరాముఁ డే మాన తిచ్చెన్?
| 3
|
| మానిని. |
అప్పటిమంత్రరహస్యములో మరుదాత్మజువైభవ మమ్మునికిం
జెప్పిన దేమి విశేష మశేషము చెప్పుఁ డటన్న వసిష్ఠుఁడు మే
లిప్పుడు నీవిన నెంచిన దెవ్వఁడు నెవ్వని కెన్నఁడు నెన్నఁడు నా
చొప్పునఁ దెల్పెద సూక్ష్మతరోక్తుల సొంపుగ నీ కనుచుం బలికెన్.
| 4
|
| లయగ్రాహి. |
వారిజహితాన్వయవిహారి శతకంధరసురారి జయమొంది పురిఁ జేరి ఘనలక్ష్మిన్
మీఱి యొకనాఁడు కనఁగోరి ఘటసూతి చనుదేర వివిధార్చన లుదారవినయం బిం
పార నొనరించి తనచేరువ మణీమయమహారజతపీఠ మిడి మీరు సుఖు లై యు
న్నారుగద! బాధకులు లేరుగద! యన్న రఘువీరునకు నిట్టులని యాఋషి వచించెన్.
| 5
|
| శా. |
సాధుద్రోహవిధానదోహదభుజాశాఖాపలాశిచ్చటన్
సాధింపన్ జనియించి రాజ వయి విశ్వం బీవు రక్షించుటన్
సాధుల్ సాధులు గాక యెంతయు సముత్సాహాప్తి వర్తిల్లఁగా
బాధల్ మా కొనరింప నెవ్వ రని సంభావింతు సీతాపతీ!
| 6
|
| క. |
ప్రతివిశిఖసంజనితశో, ణికబిందుపరంపరావినిర్మితవితతా
యుతశతనిజావతారుని, శతకంఠునిఁ ద్రుంచు టెంత సంస్తుతి చేతున్.
| 7
|
| క. |
వెఱవేఁకి మానె వేలుపు, దొరలకుఁ దెఱఁగంటిచెలులతుందుడుకులతోఁ
జెఱ లుడిగెఁ దపసిమూఁకల, మొఱ లడఁగెన్ మీకటాక్షమున నని పొగడన్.
| 8
|
| మ. |
కలశసంభవుఁ జూచి రాముఁ డను లోకద్రోహియౌ నూఱుమో
ములరేద్రిమ్మరి గ్రుమ్మినన్ జగము లామోదించు టాశ్చర్యమే
కలిగెన్ మా కిటువంటికీర్తిరమ యక్షద్వేషి తోడై తగన్
బలవంతుం డగుబంటుగల్గుదొరకున్ బ్రఖ్యాతి రాకుండునే?
| 9
|
| క. |
శ్రీహనుమన్నామస్మృతి, యాహవమున విజయ మొసఁగు ననఁగా నతఁడే
సాహాయ్యమై వహింపఁగ, నాహవమున విజయ మొందు టరుదె? మునీంద్రా!
| 10
|
| క. |
ఇ న్నేల? యితఁడె రణమున, మున్నై జయ మిచ్చెఁ బంచముఖముల హానూ
మన్నామస్మరణము గై, కొన్నకుమారుండు తారకుని గెల్వండే.
| 11
|
| క. |
హనుమత్కవచము మాలా, మనురాజప్రముఖనిఖలమంత్రములు జపిం
చినవాఁడె లోకవిజయము, గనఁగా శతకంఠుఁ డెంత గలఁ డతని కనన్.
| 12
|
| క. |
ఆమాటలు విని విస్మయ, మామోదము భయము వినయ మైక్యంబుగ లో
పాముద్రాపతి రాముని, మోము గనుంగొని కరాబ్జములు మోడ్చి యనున్.
| 13
|
| ఉ. |
ఈమతిమత్స్వరూప మది యెట్టిది? షణ్ముఖుఁ డెన్నఁ డీకపి
గ్రామణి సంస్మరించి రిపుగర్వ మడంచెఁ? బ్రభావ మెద్ది? మా
లామనుముఖ్యమంత్రజపలక్షణ మెయ్యది? యందునన్ ఫలం బే
మి? యుపాస్తి యెద్ది? వచియింపఁగదే! యన రాముఁ డి ట్లనున్.
| 14
|
రాముఁ డగస్త్యునకు హనుమన్మంత్రమాహాత్మ్యముం దెల్పుట
| చ. |
మునివర! నీవు సత్పురుషముఖ్యులలోన సుబుద్ధి వౌట మా
హనుమరహస్యముల్ వినుట కాత్మఁ దలంచితి గావునన్ ముదం
బెనసె స్వరూపమంత్రవిధు లెల్ల గణించెద సూక్ష్మపద్ధతిన్
విను మిటువంటి వెల్ల విన వేఱొక రర్హులె? నీవు దక్కఁగన్.
| 15
|
| ఆ. |
పంచముఖుఁడు త్రిపురభంజనుఁ డార్యాభి
మతుఁడు ఫాలనయనుఁ డతనువైరి
శంకరుం డితండు నింక భేదం బేమి
హరునియందు నక్షహరునియందు.
| 16
|
| క. |
జవరాలి కపుడు సగమై, కవ వాయక యుండి యుండి కడు వేసఱి నీ
త్యవిరక్తి నిలుప వచ్చిన, శివుఁడు సుమా! యితఁడు వేఱు సేయకు మనఘా!
| 17
|
| క. |
ఏకాంతభక్తుఁ డితఁడే, గా కన్యుఁడు లేఁడు నా కొకఁడు సత్యము నే
నాకార మొందుటకు నీ, లోకోత్తరుభక్తి రంజిలుటయె ఫల మగున్.
| 18
|
| మ. |
తను వంతఃకరణంబు నాత్మయును దత్తత్కర్మముల్ నావశం
బని స్వాతంత్ర్యము మాని మద్భజన సేయం బూనె భారంబు వీ
డినఁ జుల్కందన మొందు భారవహుమాడ్కిన్ నేను నామేను నా
దని యాత్మాకృతి నేన కాఁ దలఁతు బాహ్యాభ్యంతరవ్యాప్తులన్.
| 19
|
| మ. |
హరి యై వైష్ణవపూజ్యుఁ డయ్యెఁ బరమేశాంశస్థుఁడై శైవభ
వ్యరతిం గాంచె ధవిష్యచబ్జభవుఁడై హైరణ్యగర్భార్చనా
విరళత్వంబు వహించె జ్ఞానఖనియై వేదాంతవిద్యోన్నతిన్
బరఁగెన్ దా నొకఁ డయ్యఁ బెక్కుగతులం బాటించి కుంభోద్భవా!
| 20
|
| తే. |
అన్నిట సమర్థుఁ డనవద్యుఁ డన్నియెడల
నందఱకు నాత్మహితుఁ డితఁ డఖిలసుతుఁడు
ఇష్టవస్తువు నాకంటె నెఱుఁగఁ డీతఁ
డితనికంటెను నాకు లేఁ డిష్టతముఁడు.
| 21
|
| శా. |
భాషేశాదులు మేము ధారుణి జనింపం దాము నేతెంచి శు
శ్రూషల్ సేయఁ దలంచి ఋక్షకపిరాడ్రూపంబులం బుట్టి రి
ట్టీషద్భేదము లేక యట్టిగమిలో నీవాయుజుం డగ్రియుం
డై షడ్భావవిదూరుఁ డై పరమభక్త్యన్వీతుఁ డై వర్తిలున్.
| 22
|
| తే. |
మూఁడుమూర్తుల కిరవైన వేఁడివేల్పు, పుట్టినప్పుడె పట్టెడిదిట్టతనము
గలిగి త్రైగుణ్యదూరుఁ డై తెలియరాని, జ్ఞానరీతి ననిర్వాచ్యుఁ డైనవాఁడు.
| 23
|
| శా. |
న న్నాలించు ననున్ గణించుఁ దలఁచున్ నామూర్తి నన్ బేర్కొనున్
న న్నర్చించు ననుం గనుంగొను మదిన్ నాయందె మోదించు నా
యన్నున్ నన్నును దల్లిదండ్రు లని పెంపానించు సర్వాత్మనా
నన్నే కాని భజింపఁ డన్యు నితఁ డన్నా! యెన్న సామాన్యుఁడే?
| 24
|
| తే. |
మత్పరాయణుఁ డగుహనునుత్స్వరూప, మిట్టి దని యన్య మెంచక యెవ్వఁడేని
యతనిదృఢభక్తి భజియించునట్టివాని, కతనివంటిమహత్త్వంబు లగు నిజంబు.
| 25
|
| సీ. |
అవి యెవ్వి యన నజేయత్వ మమర్త్యత్వ మిష్టకామప్రదాతృత్వ మమిత
వాక్పటుత్వము కవిత్వప్రదాతృత్వంబు కామరూపత్వంబు కాలసూక్ష్మ
గతివిధానత్వంబు కాలకాలజ్ఞదాతృత్వంబు మోక్షదాతృత్వ మఖిల
కాలకర్మగుణాతిగత్వసర్వజ్ఞత్వతత్త్వసౌఖ్యప్రదాతృత్వములను
|
|
| తే. |
నిగ్రహానుగ్రహత్వంబు నిర్మలత్వ, మవ్యయత్వంబు మొదలైనయధికమహిమ
ములు స్వతస్సిద్ధములు మంచుమలకుమారి, జఠరగోళంబునను వసించకయమున్న.
| 26
|
| ఆ. |
నీవు నిట్టిసూక్ష్మభావంబు భావించి, హనుమఁ గొలువు మనిన మునివరుండు
పంచముఖుఁ డటంచుఁ బలికితి రవ్విధం, బేమి? స్వామి! యనిన రాముఁ డనియె.
| 27
|
| క. |
పంచముఖవీరహనుమ, చ్చంచద్దివ్యస్వరూపసంపద గిరిజా
చంచలనయనకు శివుఁడు వ, చించినపరిపాటి. దెలియఁ జెప్పెద నీకున్.
| 28
|
| శా. |
ఆకైలాసనగాగ్రసీమ నొకనాఁ డార్యామహాదేవి తా
నేకాంతంబున నున్న శంభుఁ గని స్వామి! లోకరక్షేచ్ఛ ల
క్ష్మీకాంతుం డవతారముల్ వొరయుభంగిన్ మీరు నీరూపమే
గా కన్యాకృతి దాల్చినం దెలుపుఁ డాకర్ణింతు నే నావుడున్.
| 29
|
| శా. |
హాసాంకూరము మోముఁ గ్రమ్మఁ బతి ప్రోయాలిన్ విలోకించి దు
ర్వాసోముఖ్యులు మామకాంశజులు గారా? వార లధ్యాత్మవి
ద్యాసంపత్తినె కాని నావలె మహత్త్వం బొందలే దంటినే
నేసంపూర్ణశుభాకృతిం దనరు టింతీ! విన్ము వాక్రుచ్చెదన్.
| 30
|
| ఉ. |
జ్ఞాన విరక్తి భక్తి నయ సాత్విక సాహస శాంతి దాంతి వి
ద్యా నిపుణత్వ సత్వ జవ ధర్మ జయా గుణ ధైర్య నిశ్చల
ధ్యాన తపః ప్రభావగతు లన్నియుఁ దాల్చి పటుత్వ మొంది పం
చాననయుక్తి శ్రీహనుమదాఖ్య వహించితి నేనె పార్వతీ!
| 31
|
| తే. |
ఏగుణంబునఁ జూచిన నితనికంటెఁ
దక్కొరుఁడు లేఁడు ఘనుఁ డనఁ దనరినాఁడఁ
బంచముఖములు నిశ్చలబ్రహ్మచర్య
మమర లోకోపకారార్థ మై మృగాక్షి!
| 32
|
| క. |
ఈపదునాలుగుజగముల, లోపలిజను లట్టినను విలోకించికదా
యేపట్ల సకలకర్మ, వ్యాపార మెఱింగికొనఁగవలయు లతాంగీ!
| 33
|
| క. |
ఈరూపం బారూపము, నారూపము లగుట వే ఱనఁగరా దైనన్
ఈరూపు నిన్నుఁ బాయని, దారూపము సంగరహిత మగుట ఘన మగున్.
| 34
|
| మ. |
అలరుం గీశనృసింహపక్షికిటివాహాస్యంబులం దూర్పు గు
బ్బలిపై నుబ్బెడిసూర్యకోటిరుచితో బాహాదశాగ్రంబులన్
హలపాశాంకుశశూలముద్గరకపాలానోకహోద్యద్గదా
చలఖట్వాంగము లూని హైమపటి మించన్ వానరుం డెప్పుడున్.
| 35
|
| తే. |
షడ్దశాక్షరమంత్రప్రసన్నమూర్తి, నావహించినపంచముఖాంజనేయు
మంత్రము జపించి భక్తిసంపత్తి బుధులు, ధ్యాన మొనరించుక్రమము నీ వాలకింపు.
| 36
|
| సీ. |
ప్రాగ్దిశాసౌమ్య మై బాలార్కరమ్య మై కామితార్థము లిచ్చుఁగపిముఖంబు
దక్షిణాభీల మై దంష్ట్రాకరాళ మై శ్రీకరం బగు నారసింహముఖము
పశ్చిమోద్దండ మై పటువజ్రతుండ మై గరళాపహృతి మించు గరుడముఖము
నుత్తరోదార మై యురురుక్ప్రహారమై కృష్ణదీప్తి ఘటించుఁ గిటిముఖంబు
|
|
| తే. |
ఊర్ధ్వ మొరసి సురారుల నుక్కడంచు
హయముఖముగూడఁ జౌవంచయాననములు
పరగుఁ బదియైదుకన్నులు బాహుదశక
కనకచేలంబు లూహింతు రనఘుమతులు.
| 37
|
| క. |
ఈయన పదిబుజములఁ దగు, నాయుధములు పదియుఁ దలఁచు నతఁ డొందు జగ
ద్గేయప్రభావ మఖిల, శ్రేయము లరిభయదబలవిశేషము లతివా!
| 38
|
| తే. |
అయిదుముఖములు మీఱ నాయాయివేల్పు, లొసఁగుఫలములు దా నియ్యనోపుఁ గానఁ
దనస్వరూపమునందే నిదానమయ్యె, సర్వదేవాత్మకత్వంబు చంద్రవదన!
| 39
|
| మ. |
తను నానాభరణాభిశోభితమహోదారాంగు రక్తానులే
పను రక్తాంబరు రక్తమాల్యధరు శుంభద్రక్తవర్ణున్ మనం
బునఁ జింతించిన నిచ్చుఁ బంచముఖుఁ డాపూర్ణేప్సితార్థంబు లా
యన మంత్రంబుఁ ద్రిసంధ్య లెంచిన వశం బౌ మూఁడులోకంబులున్.
| 40
|
| క. |
ఈమంత్రశిరోమణిగా, దే మున్ను కుమారకునకు దేవజ్యేష్ఠుం
డామూలాగ్రము దెలిపిన, నామహిమ వహించి విజయ మాతఁడు గాంచెన్.
| 41
|
| చ. |
విను మది యెట్టు లన్న మును విశ్వభయంకరమూర్తి తారకుం
డనుపొలదిండిమన్నెదొర యాజి సుధాంధుల నేలఁ గూల్చి యు
క్కునఁ దన కీడుగాన కనిఁ గోరి యెదిర్చినఁ బెక్కుగాలముల్
మనకొమరుండుఁ బోరి విసుమానముతో వసపోకయున్నెడన్.
| 42
|
| తే. |
వేల్పు లబ్బారి నలువకు విన్నవింపఁ, జిలువఖాణంబుపులుఁగుతేజీవజీరుఁ
జేరి వెఱఁగందుదురె చెండి పోర నిట్టు, లనుచు నల్లనఁ బలుకుఁ బ్రోయాలిమగఁడు.
| 43
|
| శా. |
ఏకాంతంబునఁ బల్కె శత్రుఁ డధికుం డీ వెంతయున్ శ్రాంతియున్
గైకొన్నా వటు గాన నాత్మబలరేఖన్ గెల్వ లేవిం కిటన్
లోకాతీతుఁ ద్రిలోకవందితుఁ గృపాళుం బంచవక్త్రాన్వితున్
శ్రీకంఠాత్మకు నాంజనేయు మదిలోఁ జింతింపుమా షణ్ముఖా!
| 44
|
| క. |
అని పంచముఖహనూమ, న్మను వుపదేశించి చనఁ గుమారుఁడు దానన్
దనశ్రమము దీఱ నొకపరి, మనమున స్మరియించి శక్తి మార్తుని వైవన్.
| 45
|
| క. |
తారకుఁ డంగారకనిభ, తారకుఁ డురుమస్తచలితతారకుఁడు బలో
దారకుఁ డపహృతదైవత, దారకుఁ డపు డుప్పుకడలిఁ దాఱునఁ బడియెన్.
| 46
|
| క. |
పంచముఖమంత్రయంత్రము, మించున్ భవవంచకము సమిజ్జయచంద
త్కంచుక మవహృతపాకక, పంచక మవితాఖిలప్రపంచక మగుచున్.
| 47
|
| క. |
అనిన విని షోడశాక్షర, మనురాజము గాక యెన్నిమంత్రములు గలా
వనిలజుఁ డాయామనువుల, ననువొందెడురూపు లెట్టి వనిన శివుఁ డనున్.
| 48
|
| క. |
భావిబ్రహ్మవరంబులు, గావే వర్ణంబు లతఁడె కాఁడే తత్త
ద్దైవము తన్మంత్రంబులు, గావే శ్రుతు లెన్ని దెలుపఁగా నాతరమే?
| 49
|
| ఆ. |
ఐన విను ముపాప్తి నఖిలార్థములు శీఘ్ర, మిచ్చుమంత్రమణుల నేర్పరించి
తత్తదర్హరూపధారియౌ సామీరి, ధ్యానవిధి గణింతుఁ దలిరుఁబోణి!
| 50
|
| సీ. |
తప్తకాంచనధగద్ధగితదివ్యశరీరు నానావిధప్రసూనమయహారు
బాలార్కకోటిప్రభాభాసికముఖాబ్జు నుపవీతధవళకాంత్యపగతాబ్జు
ఫాలలోచనకుండలాలంకృతకపోలుఁ గటిబద్దకౌపీనకనకచేలు
సురవిద్విషద్భయంకరటంకగిరిహస్తు దైవత్రయాత్మకత్వప్రశస్తు
|
|
| తే. |
మేరుగిరిధైర్యు గురుశౌర్యు ధీరవర్యు, రమ్యగుణవాసు సువిలాసు రామదాసు
సారమనుమంతు హనుమంతు సత్యవంతు, మతిఁ దలంతు గణింతు నమస్కరింతు.
| 51
|
| పంచచామరము. |
జపాప్రసూనకాంతిమంతు శాంతిమంతుఁ ద్ర్యక్షరీ
జపాత్మకస్వరూపశాలిశాపకేళికోన్మన
స్తపస్విదుస్తరప్రచారుఁ దత్తదంగసంగకాం
త్యపారభూషణాభిరాము నాంజనేయుఁ గొల్చెదన్.
| 52
|
| శా. |
లంకాదాహవిధానధానుఁ గరుణాలక్ష్మీహరిద్రప్రభా
శంకాసంగపిశంగనేత్రు విలసచ్చారిత్రు లోకస్తుతా
లంకారాంచితు హీరవర్ణు నమృతాలాపున్ శుభాష్టాక్షరీ
పంకేజాతమహాహనూజ్జ్వలముఖున్ భావింతు భావంబునన్.
| 53
|
| ఉ. |
ద్వాదశవర్ణమంత్రమణిదామవిభావిభవాభిరాముఁ గుం
తాదిరణోగ్రసాధనమహాభుజభీము నవోదయస్సుర
ద్ద్వాదశభానుబింబనిభధాము సుధామధురోక్తిధాము నా
నాదురితావహప్రవణనాము వలీముఖసోముఁ గొల్చెదన్.
| 54
|
| పంచచామరము. |
త్రయోదశాక్షరీవిరాజితస్వరూపు జానకీ
భయావహప్రతాపుఁ బద్మబంధుపుత్రబంధురా
శయాను గాంచితానులాపుఁ జంద్రహీరతారకా
పయఃకళాకలాపు భావిభారతీపుఁ గొల్చెదన్.
| 55
|
| మ. |
భయసంసారవిదూరుఁ జిత్రరుచిసంపచ్ఛాలిఁ బాశాంకుశా
భయటంకోగ్రచతుర్భుజున్ మకరికాప్రాణాపహారక్రియా
లయు దేవాసురసేవితాంఘ్రి యగు మాలామంత్రదీవ్యన్మణీ
మయసింహాసనమధ్యభాసితు జగద్మాన్యున్ హరినం గొల్చెదన్.
| 56
|
| క. |
అని యివ్విధమున ధ్యానం, బున కనుగుణఫణితి హనుమఁ బొగడినయేనిన్
జనుఁ డఖిలాఘచ్యుతుఁ డై, తనతలఁచినచింతితములు తడయక చెందున్.
| 57
|
| తే. |
అష్టమి చతుర్దశి విశేష మర్కమూల
మున వసించి హనుమంతుఁ బూజసేయ
నతివ! ముఖ్యంబు ద్వాదశి యంతకంటె
నర్కవారంబు హనుమత్ప్రియం బొనర్చు.
| 58
|
| చ. |
వనితరొ యర్కమూలమున వాయుజురూప యొనర్చి రక్తచం
దనకుసుమాదులం దొలుతఁ దత్పదపూజ ఘటించి జ్ఞానవం
తుని ద్విజునిన్ సపర్యఁ బరితుష్టునిఁ జేసి భుజింపఁబెట్టి యి
ట్లనయము పర్వపర్వ మిడునాతఁడు చెందు నభీత్సితార్థముల్.
| 59
|
| క. |
ఎక్కడి దనిలజపూజా, భాక్కర్మకులకును శస్త్రపవనసఖమరు
ద్ధిక్కాలభయము లిటు లిం, పెక్కినజనుఁ డతనిఁ బొగడు టెఱిఁగింతు నిఁకన్.
| 60
|
| శా. |
సీతాశోకదవానలాపనయవర్షీయస్సుధాబంధువా
క్చాతుర్యాత్మకు రామపాదయుగళీసంసేవనాసన్నదృ
క్చేతఃపద్ము దశాననాదిదనుజశ్రేణీమదోద్భేదని
ర్ఘాతప్రోద్ధతముష్టిఘాతు గిళితోగ్రద్యోతు నేఁ గొల్చెదన్.
| 61
|
| సీ. |
ఫలమనీషాహృతప్రత్యగ్రమార్తాండ! యాపదంధతమిస్ర మాపవయ్య
పంచవక్త్రత్వసంభరితగారుడవక్త్ర! బహురుజాభుణగాళిఁ బాపవయ్య
బ్రహ్మాస్త్రకృతపాశబంధనిర్బంధన! భవబంధముల హరింపంగదయ్య
శాఖామృగవ్యాజసాక్షాన్మహేశ్వర! లసమానవిభవంబు లొసఁగవయ్య
|
|
| తే. |
యమితబాహ్యాంతరారిసంహరణశూర!, నావిరోధుల నాశ మొనర్పవయ్య
సేవకమనోగణేయ! సంజీవరాయ!, మనోదుఃఖనివహంబు మాన్పవయ్య.
| 62
|
| మ. |
అని సంకల్పవికల్పదూరు బరమాత్మాకారు ధూమ్రాక్షము
ఖ్యనిశాటాభ్రసమీరు మేరునగధైర్యాధారుఁ గీర్తించుస
జ్జనుఁ డిష్టార్థసమృద్ధిఁ దత్కృపరహించం బుత్రపౌత్రాభివృ
ద్ధినిరాతంకవిశుద్ధబుద్ధి నజహత్తేజోధికుం డై మనున్.
| 63
|
| శా. |
హాహాకారముఖాంతనిర్యదనలోద్యజ్జ్వాలికాభీల మై
బాహాభావితశైల మై పటుతటిద్భాశోభినేత్రాంతవీ
క్షాహంకారకరాళ మై కహకహోదారార్భటిన్ దైవసం
దోహం బెంచ రహించు వీరహనుమద్రూపంబు రూపింపఁగన్.
| 64
|
| క. |
జ్వాలాహనుమద్రూపము, కాలానలకీర్తికాప్రకాశము బహుబే
తాళవ్యాళభయాపహ, మాలోకింపగను దుస్సహం బెవ్వరికిన్.
| 65
|
| శా. |
సాకేతాధిపదివ్యకోమలపదాబ్జన్యస్తహస్తాబ్జు నా
ళీకప్రోద్భవముఖ్యు దైవనుతకేళీలోలు వజ్రోపల
వ్యాకీర్ణాంచితహైమకుండలయుగున్ వాయూద్భవున్ భక్తితో
నేకీభావము చేసి భావమున నూహింపన్ శుభం బింపగున్.
| 66
|
| క. |
అని తెల్పె శివుఁడు పార్వతి, కనినం గలశజుఁడు రాఘవాధిప! మఱియున్
హనుమత్సరమంత్రంబులు, వినిపింపు మటన్న రామవిభుఁ డి ట్లనియెన్.
| 67
|
| క. |
అమరున్ షట్త్రింశద్వ, ర్ణమయం బై యొక్కమంత్రరాజము తద్వ
ర్ణముల నిజాంగన్యాసము, సమకూర్చినజనుఁడు చెందు సకలేప్సితముల్.
| 68
|
| క. |
ఇందున బ్రహ్మయు ఋషియును, ఛందము దైవంబు బీజశక్తులు కల్పో
క్తిం దెలిసి బుధుఁడు తత్పతి, యం దూనెడుధ్యాన మెట్టు లనిన విను మిఁకన్.
| 69
|
| సీ. |
సుందరోన్నతపీఠిఁ జుట్టి వచ్చిన వాలవల్లితో జిగిపాలవెల్లితోడఁ
బరిపూర్ణచంద్రబింబము విడంబముసేయు మోముతోఁ జిఱునవ్వుమోముతోడ
రత్నకుండలకాంతిరంగు లీనుకపోలపాళితో ముత్యాలతాళితోడ
మగరాలతెగరాలఁ దగుశుభ్రరదనాళిరూపుతో నునుఁబచ్చచూపుతోడ
|
|
| తే. |
హైమయజ్ఞోపవీతపీతాంబరాజి, నాపరాంగవిలంబశిఖాంబుజాత
కీలితకరద్వయాకారలీలతోడఁ, దనరుగుణవంతు హనుమంతుఁ దలఁపవలయు.
| 70
|
| క. |
భవభయదారిద్ర్యోప, ద్రవవిద్రావణనిరూఢదారుణముద్రల్
నవముద్రలు నవముద్రలు, సవరించినపుణ్యశాలి సర్వజ్ఞుఁ డగున్.
| 71
|
| క. |
లోకారాధ్యము శుభదీ, ప్రాకారాస్పదము భవభయాపహ మగ్ని
ప్రాకారమనువు వజ్ర, ప్రాకారము సాధకునకు పరమమునీంద్రా!
| 72
|
| క. |
హనుమద్గాయత్రీస్మృతి, ననఘా! నశియించు బ్రహ్మహత్యాదిమహా
ఘనికాయము జపియించిన, గనరాదె? యభీప్సితములు కైవల్యంబున్.
| 73
|
| పంచచామరము. |
అనుష్టుభాఖ్యమంత్రరాజ మష్టభూతిగాయకం
బనేకముద్విధాయకం బపాస్తశత్రుసాయకం
బు నై చెలంగు నేకవర్ణపున్ మనూత్తమంబెకా
యనేకవర్ణసిద్ధిఁ జేయు నాశ్రయించువారికిన్.
| 74
|
| పంచచామరము. |
మహావిభూతు లియ్య నేర్చు మాయ నేర్చుఁ జిత్కళా
మహాసుఖాబ్ధి నోలలార్చు మానసార్తిహవ్యభు
ఙ్మహార్చు లార్చు నిట్టి దంచు మాకు నెంచ శక్యమే
మహావిభూతినామదివ్యమంత్రమాత్మ విన్మణీ!
| 75
|
| క. |
చింతామణి దానాహృత, చింతామణి యనఁగ వేఱె చెప్పఁగ నేలా?
చింతించినంత సంతత, చింతితసంతానఫలవిశేషము లొసఁగున్.
| 76
|
| ఉ. |
కంబునిభోపవీతలత కైరవబంధుసహసక్రాంతి హే
మాంబరమున్ భుజాయుగ ముదంచితకుండలముల్ పిశంగనే
త్రంబులు జ్ఞానముద్ర యనుతమ్మియుఁ గల్గి యనుష్టుభాఖ్యమం
త్రంబునఁ దేజరిల్లుపరదైవము శ్రీహనుమంతుఁ డెప్పుడున్.
| 77
|
| క. |
అక్షారిఁ గూర్చి నాలుగు, లక్ష లనుష్టుపు జపించులలితాత్ముఁడు స
ర్వక్షేమంకర మగుత, త్సాక్షాత్కృతిఁ గాంచి నిత్యసంపన్నుఁ డగున్.
| 78
|
| తే. |
ప్రకటమధ్యాహ్నరవివర్ణు రత్నకుండ, లాకలితవర్ణు జ్ఞానముద్రాక్షవలయ
దీపితుఁ దలంచి విజ్ఞానదీపమంత్ర, మాఱులక్షలు జపియింప హనుమ మెచ్చు.
| 79
|
| సీ. |
ఇచ్చ నెచ్చినకోర్కు లిచ్చు మెచ్చులచెట్టుచుట్టు నెట్టనిచందు చట్టుదిన్నె
నున్నమిన్నలవన్నె గన్నసింగపుగద్దె నిరువంకఁ దెఱఁగంటిదొరలు గొలువ
నెలకొని పసిఁడిఱింగులరంగు గలవింతవగవ్రాఁతపని బైరవాసుపసిమి
కనుదోయి పున్నమకలువనెచ్చెలి హెచ్చు నెమ్మోము వేల్పుమన్నీనివింటి
|
|
| తే. |
వంటినిడుఁదోఁక వెఱఁ బాపి వలయుతలఁపు
లొసఁగు టెఱిఁగించుకేల్దోయి పొసఁగువేల్పుఁ
దలఁచి మది నైదులక్షలు తలఁపుమిన్న
గొణఁగికొన్న ఫలించు లోఁ గోర్కు లెల్ల.
| 80
|
| క. |
మును నొడివినయష్టాక్షరి, యెనిమిదిలక్షలు జపింప నింపగుసద్భ
క్తిని బదిలక్షలు నొడివిన, మునినాథ! దశాక్షరంబు ముదమిచ్చు ననన్.
| 81
|
| తే. |
కలశజుఁడు రామచంద్రునిఁ గని యనుష్టు, భాఖ్యమంత్రంబు జపియించినందువలన
నగు ప్రయోజన మిదమిత్థ మని వచింపుఁ, డనిన ని ట్లని రఘురాముఁ డానతిచ్చె.
| 82
|
| సీ. |
షణ్మాసజపమున సత్కవిత్వము నేర్పు నొకయేట సుజ్ఞానయుక్తి నలరు
హాయనద్వయమున నపమృత్యువుఁ జరించు మూఁడేఁడులను గాలమును హసించుఁ
దనరు వర్షచతుష్కమునఁ జిరాయువుఁ జెంది యారోగ్యవంతుఁ డౌ నైదుసమల
భోగభాగ్యసమృద్ధిఁ బూను నాఱేఁడుల సప్తవర్షంబుల జరఁ గ్రమించు
|
|
| తే. |
నెనిమిదిటఁ దొమ్మిదింట సర్వేప్సితంబు, లింద్రియజయంబు గనుఁ బదియేఁడులకును
సకలభువనవశంకరప్రకటమహిమ, మెనయు జాపకుఁ డిది సిద్ధ మనఘవర్య.
| 83
|
| సీ. |
ఇరువదేఁడుల మింట నెగిరిపోవఁగనోపు మొనయు నెచ్చటికైన ముప్పదింట
నలువదివత్సరంబుల మనోవేగి యౌ నితరాంగములఁ జొచ్చు నేఁబదింట
నఱువదిసమలఁ బాయక కామరూపి యౌ ఢీకొను గిరియైన డెబ్బదింట
నెనుబదివర్షంబులను సిద్ధుఁ డై మించు దొరయు భూతుల నెల్లఁ దొంబదింట
|
|
| తే. |
సిద్ధసంకల్పుఁ డై సదాశివునిలీల, హాయనశతంబులఁ గృతార్థుఁ డగుబుధుండు
అభిలషించిన నపవర్గమైనఁ గలుగు, నమ్మహామంత్రమహిమ మే మని గణింతు.
| 84
|
| ఆ. |
వేయిసుద్దు లేల వినుము భూతప్రేత, శాకినీపిశాచసముదయములు
సంస్మరించినంత జరగుఁ గుష్ఠాదిక, దుష్టరోగములును దూలిపోవు.
| 85
|
| క. |
సంకెలలఁ దగిలినాతఁడు, శంకింపక యొక్కదినము జపియించినచో
సంకల్పించినపోలిక, సంకెల లవి తమకుఁ దామె సడలు మునీంద్రా!
| 86
|
| క. |
మతి భుజబలంబు కీర్తియు, ధృతి నిర్భయ మజడభావరీతి యరోగ
స్థితి వాక్పటుత్వ మనిలజు, స్మృతిఁ గల్గఁగ మంత్రజపము సేయఁగలేదే?
| 87
|
| క. |
తెలియరు గాక మనుష్యులు, దలఁపఁగ మాహనుమకంటె దైవతము న్మం
త్రలలామంబునకంటెను, బలమంత్రము గలదె? యేల బహుభేదంబుల్?
| 88
|
| శా. |
కల్పక్ష్మాజముఁ జేరి కాయఁ దనకుం గాంక్షించిన ట్లల్పసం
కల్పంబుల్ వహియింప కాత్మసుఖమే కాంక్షించి శశ్వద్దయా
కల్పున్ శంకరకల్పు భక్తపటలీకల్పున్ గుణాకల్పు హృ
త్తల్పస్థాయిగఁ జేసి తన్మనువు నిత్యంబున్ జపింపందగున్.
| 89
|
| మ. |
అనిశంబున్ జయింపఁడేని యొకనాఁడైనన్ దినద్వంద్వ మై
నను ఘసత్రయమైన నొక్కనెల యైనన్ వత్సరం బైన నో
పినచందంబునఁ గాలదేశ గుణసంభేదంబు లీక్షించి త
న్మనురాజంబు జపించినం గలుగు సంపన్మోక్షముల్ కుంభజా!
| 90
|
| క. |
హనుమన్మఘచింతామణి, మొనయక జనుఁ డెన్నిమంత్రములు గొణఁగినఁ గ
ల్గునె? స్వానుభూతిలీలా, జనితానందైకమోక్షసంపద జగతిన్.
| 91
|
| క. |
జపఫలదుం డనిలజుఁడఁట, జపమంత్ర మనుష్టుభాఖ్యసన్మనువఁట త
జ్జపిత కిహాముత్రానం, దపరంపర గలుగదో యనఁగ నేమిటికిన్?
| 92
|
| మ. |
పరదైవం బగునాంజనేయుని సదా భావించి రంభావనాం
తరవాసిన్ హనుమన్ దయాజలనిధిం దాసోహ మంచున్ నరుం
డురుభక్తిన్ స్మరియించెనేని యిహమం దుత్సాహి యౌనేకదా
జరగున్ నిత్యపదంబుఁ గూర్చి పిదపన్ సత్యంబు ముమ్మాటికిన్.
| 93
|
| క. |
నా విని ఘటజుఁడు హనుమ, ద్దేవార్చన సేయువిధము దెలుపంగదవే
యోవిశ్వైకహితోక్తిసు, ధావైభవ! యనిన రామధరణీశుఁ డనున్.
| 94
|
| తే. |
అనఘ! బ్రాహ్మీముహూర్తంబునందె లేచి
గురువులకు మ్రొక్కి యనుమతి గొని బుధుండు
ప్రాఙ్ముఖంబున నైన నుదఙ్ముఖంబు
గా నయిన నాత్మగృహసీమలోన నిలిచి.
| 95
|
| క. |
ఎనిమిదియావరణములకు, హనుమచ్చక్రము లిఖించి యందు హనూమం
తుని నావహించి ప్రణవ, ధ్వనితో వివిధోపచారతత్పరమతి యై.
| 96
|
| సీ. |
గురువరగురువులఁ బరమేష్ఠి గురువుతో మొదటియావరణాగ్రమున భజించి
గజరాజముఖ చండికా భారతీ క్షేత్రపాలుర రెండవపరిధిఁ గొల్చి
|
|
| |
యర్కజ జాంబవ దంగ దర్షభ నల నీలుల మూఁడవనేల నెంచి
యష్టదిక్పాలుర నవలినాల్గవభూమికాంతరంబునఁ బూజ లాచరించి
|
|
| తే. |
యష్టశక్తుల కైదవయండ మ్రొక్కి, నారదాదుల కాఱవదారి నెరఁగి
చక్రవారణముఖ్యుల సర్వదివిజ, సమితి మిగిలినరెండుసాలములఁ బొగడి.
| 97
|
| మ. |
పలుభక్ష్యంబులు పాయసాన్నములు రంభాముఖ్యనానాఫలం
బులు క్షీరంబులు లడ్డుకంబులు మహాపుండ్రేక్షుఖండంబులున్
తళిగల్ నీటి నివేద మిచ్చి మఱి మీఁదన్ బాద్యనీరాజనం
బులు పుష్పాంజలియున్ బ్రదక్షిణము లింపుల్ మీఱఁ గావించుచున్.
| 98
|
| క. |
అమితప్రణామములు మీ, ఱ మహాత్మ! మదూర్జితాపరాధశతసహ
స్రములఁ దలంపక కరుణను, క్షమియింపం దగునటంచు సంప్రార్థనతోన్.
| 99
|
| సీ. |
ఓంనమో వాయుదేవోద్భవాయ భవాయ లంకారయే వార్ధిలంఘనాయ
సీతార్తిహారిణే శ్రీరామదూతాయ సిద్ధాయ కపిలోకశేఖరాయ
దశకంఠదోర్దర్పదళనోద్ధతాయాక్షధూమ్రాక్షహరణైకదోర్బలాయ
సుభగాత్మనే బృహత్సుశ్రవసే విజితేంద్రియాయ కపీశ్వరేశ్వరాయ
|
|
| తే. |
పరమకపయే నమోస్తు మాం పాహి పాహి
యని నుతించి స్వకీయహృదబ్జవీథి
హనుమ నెలకొల్పువాఁడె కృతార్థుఁ డనుచు
మఱియు శ్రీరామచంద్రుఁ డమ్మౌని కనియె.
| 100
|
| మ. |
యమకాంక్షల్ ఘటియింప నింపగు సమిద్గవ్యాజ్యలాజాపయః
ప్రముఖద్రవ్యము లర్హమైనగణనం బాటించి విధ్యుక్తకుం
డములన్ వేల్చి కృతార్థలౌదురెకదా నట్టింట సామీరిరూ
పముఁ జిత్రించి భజించి చెందుదురు సౌభాగ్యంబు లార్యోత్తముల్.
| 101
|
| తే. |
సర్వలక్షణసౌభాగ్యసంగతముగ, హనుమవిగ్రహ మెనరించి మనుజుఁ డెవ్వఁ
డేని తనయింట నర్చించెనేని వాని, కరుదె సంకల్పసిద్ధియౌ ననఘచరిత!
| 102
|
| ఉ. |
ఇంతయు నీకుఁ గాఁగ వచియించితి నన్యు లనర్హు లౌట నే
కాంతముగా వచింపు మధికారులు గల్గిన నంచు బ్రహ్మసి
ద్ధాంతరహస్య మంతయుఁ గృపాన్వితుఁడై పరిపాటి రామభూ
కాంతుఁడు దెల్పఁగా విని యగస్త్యుఁడు కేల్గవమోడ్పుతో ననున్.
| 103
|
| ఆ. |
మీయనుగ్రహమున వాయుసూతిస్వరూప, మంత్రజపవిధానమహిమ లెల్ల
వింటి నతనికరుణఁ గంటిఁ గృతార్థుఁడ, నైతి నని యథేచ్ఛ నరిగె నంత.
| 104
|
| చ. |
మనుకులరాజమౌళి హనుమన్మహిమంబు జగద్ధితార్థ మ
మ్మునికి గణించుటల్ వినినపుణ్యుఁడు శాశ్వతభోగభాగ్యముల్
గను ననుచున్ వసిష్ఠుఁ డను గౌతమసూతి మునీంద్ర! తత్కథల్
విన విన నింపు పుట్టె మఱి వింతలు గల్గినఁ దెల్పవే యనన్.
| 105
|
| ఉ. |
అన్నయశాలి పల్కె వినవయ్య! మునీశ్వర! వాయునందనుం
డెన్నివిచిత్రలీలలు వహించినవాఁడొ యుగాంతరంబులం
దన్నియు నెన్న నాతరమె? యార్యముఖంబుల నేను విన్నదిం
గన్నది తోఁచియున్నయది గౌరవలీల నుపన్యసించితిన్.
| 106
|
శ్రీకృష్ణుఁడు హనుమంతునిచే గరుడగర్వభంగము చేయించుట
| సీ. |
ఏపక్షిపక్షవిక్షేపానిలోద్వృత్తిఁ గులపర్వతంబులు గునిసియాడు
నేపుల్గుపై వచ్చి యింద్రాయుధము రోమమాత్రదానమునకుఁ బాత్ర మయ్యె
నేవిహంగమునామ మించు కెంచినఁ జిల్వరాచవారలబిటారంబు లాఱు
నేఖగేంద్రునిడాక కెదిరింపఁగా లేక నాకలోకము గతాలోక మయ్యె
|
|
| తే. |
నట్టివిశ్వంభరాశ్వమై యలరుతార్క్ష్యు, వాలరోమాగ్రమున నేల వ్రాలఁ జేసెఁ
దుంబురుని నారదుని గెల్చెఁ దొడరిగాన, కలన నటువంటిహనుమ శక్యంబె పొగడ?
| 107
|
| క. |
జవసత్వగానవిద్యా, ప్రవణుం డగుహనుమఁ బొగడ బహుముఖములు గ
ల్గి వెలయు శేషాదులతర, మవునె? యన వసిష్ఠునకు శతానందుఁ డనున్.
| 108
|
| ఉ. |
ఏమని యంటి రిప్పుడు మునీశ్వర! మిక్కిలివింత యయ్యెడున్
రామునిదూత యేయుగమునన్ గరుడోద్ధతి మాన్చె? బాటచే
నేమినిమిత్త మామునుల నిద్దఱ గెల్చె? వివాద మేల? తా
నాముకొనెన్? గణింప నగునన్న వసిష్ఠమునీంద్రుఁ డిట్లనున్.
| 109
|
| ఉ. |
శ్రీ రమణీమణీశయకుశేశయలీల శుభైకరేఖలన్
దీరగు ద్వారకాపుర ముదీర్ణహిరణ్మయగోపురాగ్రత
స్తారమృగేంద్రదర్శన ముధాగతసాధ్వసధావదభ్రగం
గారుచిరాంబుపానకుతుకత్వరితోపగతేంద్రదంతి యై.
| 110
|
| మ. |
శతమన్యూవలసౌధమేఘతతికిన్ శ్యామామణుల్ చంచలా
లత లై కన్పడువీథికానదులకున్ లాలాస్యరంగత్తురం
గతతుల్ ఫేనమిళత్తరంగములజోకన్ దెల్పు కేళీనగ
వ్రతికిన్ శోణమణిప్రభల్ జడలఠేవన్ ఠీవి గుల్కుంబురిన్.
| 111
|
| ఉ. |
ఆపురి ద్వాపరాంతమున నంబుజనాభుఁడు భూమిభారముం
బాపుటకై జనించి పరిపాలన సేయుచు శత్రురాజశి
క్షాపరతంత్రుఁడై సుజనసంతతిచింతితముల్ ఘటింపఁగా
నోపి యమానుషైకమహిమోజ్జ్వలసంపద నొప్పు నెప్పుడున్.
| 112
|
| సీ. |
చెలువొందు నొకవేళ శ్రీరుక్మిణీకుచప్రసవమంజరులపై భ్రమరలీల
శయనించు నొకపూఁట సత్యభామాభుజాశ్లేషపంజరములోఁ జిల్కపోల్కి
సరి మించు నొకమాటు జాంబవత్యధరపల్లవరక్తి మదకోకిలంబుఠేవ
మెల పొందు నొకరేయి మిత్రవిందానందకరవయస్సరసిలోఁ గలువకరణిఁ
|
|
| తే. |
జెలఁగు భద్రాచలమబ్బుబలె సుదంత, మణికగర్జితములఁ గేకిమతిఁ గళింద
కస్యమొగమున లక్షణాకాంచిమృగమ, దేంద్రమణిరేఖ నొక్కొకయెడల శౌరి.
| 113
|
| చ. |
చికిలికడానిక్రొమ్మెఱుఁగుచెక్కిలి నొక్కిన నొక్కనీలకై
శిక నిలువెల్లఁ బెంజెమటచిత్తడి హత్తఁగఁ గన్ను మోడ్చి చే
ష్టకుఁ బ్రతిలేక లోఁ బరవశస్థితి నూరకయున్న నెంతసా
త్వికమని భావగర్భితగతిన్ హరి ముంచుఁ ద్రపాపయోనిధిన్.
| 114
|
| మ. |
వివిధోద్యానలతాకుడుంగముల గోవిందుండు మాధ్వీకబిం
దువులం దోఁగిన మాధవీలతికపొందుం జెందుపూగుత్తులన్
లవలీపత్రములన్ గణించి యొకతెన్ లజ్జాన్వితం జేయుచున్
గవయన్ మైఁజనుదోయిఁ జెక్కుఁగవ వాఁకల్ గన్నస్వేదస్మృతిన్.
| 115
|
| మ. |
ప్రసవాకల్పికకల్పసీమ నొకలేఁబ్రాయంపుఁబూఁబోఁడి నిం
పెసఁగన్ గూడి సుఖించి వేఱొకతెపేరే తప్పి వాక్రుచ్చి చి
ల్కసమాఖ్యం బ్రకటింప నల్క సన వాల్కందోయి బెళ్కన్ హసిం
ప సరోజేక్షణుఁ డెంచెఁ బూర్వభవసౌభాగ్యంబు భావంబునన్.
| 116
|
| మ. |
ఒకమంథాచల మాత్మరూపమున నుద్యోగించి పై దాల్పనో
పక కూర్మాకృతిఁ గన్నఁవెన్నుఁ డొకచోఁ బైకొన్నబ్రాయంపుబా
లిక బల్ సిబ్బెపుగుబ్బగుబ్బలులు కేళిన్ ఱొమ్మునన్ గ్రమ్మి పా
యక యున్నన్ సహియించుటం గనుట నైక్యంబంచు నెంచన్ దగున్.
| 117
|
| ఉ. |
కావిమెఱుంగుమోవి నునుఁగాటుకరేక ప్రియాంఘ్రిలాక్షకుం
దావగుపేరురంబు గల తన్ గని వేఱకయింతి కిన్కమో
మావలఁజేయఁ జూపు నలు పన్నను నవ్వినదాన నైల్యముం
బోవ నురోమణిప్రభలఁ బొందును శౌరి ద్వితీయశంకకున్.
| 118
|
| క. |
ఈలీల నీలవర్ణుఁడు, స్త్రీలం దమి నేలుకొని విశేషించియు స
త్యాలోలేక్షణ నెంతయు, బాలించుం జను వొసంగి పరమప్రీతిన్.
| 119
|
| సీ. |
పట్టంపుఁజెలులలోపల నెల్లఁ దను మెచ్చి చన విచ్చి తమి హెచ్చి మనుచుననుచు
నొకపువ్వు భీష్మకన్యక కిచ్చె నని తాను గినుకఁ బూసిన వేఁడుకొనియె ననుచుఁ
దనతోడ గరుడవాహనము నారోహించి దేవతాపూజ లందించె ననుచుఁ
బాకశాసను గెల్చి పారిజాతము దెచ్చి తనకేళివనములో నునిచె ననుచు
|
|
| తే. |
సకలసౌభాగ్యసౌందర్యసౌకుమార్య, లక్షణంబులఁ దానె శ్రీలక్ష్మి ననుచు
నన్యకాంతల సరకుసేయక మదించి, నంతకంతకుఁ బొంగి సత్యాలతాంగి.
| 120
|
| ఆ. |
ఈగి మ్రాను దెచ్చి యిచ్చి మచ్చిక సేయఁ, బంకజాక్షి యిటు లహంకరించె
నింగలంపుమంట నింధనంబులు వైచి, నెయ్యి వోయ మఱియు నిగుడుకరణి.
| 121
|
| చ. |
నరకుని ద్రుంచి దైవతవనద్రుమముం బెకలించి ద్వారకా
పురి కరుదెంచి పక్షికులభూషణుఁ గాంచి ప్రయాణశత్రుసం
హరణముఖప్రయోజనములందు భరించుట కీవు గల్గ దు
ష్కరపుఁబనుల్ ఫలించె నని శౌరి ఖగేంద్రుని గారవించినన్.
| 123
|
| సీ. |
జవసత్వములయందు సకలలోకములలోఁ దనయంతవాఁడు లేఁ డనెడుమాట
వైష్ణవాగ్రణులలో వైనతేయుఁడె గాక ఘనుఁ డెవ్వఁ డని పెద్ద లనెడుమాట
యేకార్యమునకు నీవేకదా! సాహాయ్య మని జనార్దనుఁ డప్పు డన్నమాట
విశ్వంభరుం డైనవిష్ణుని భరియించు నెంతవాఁ డని భక్తు లెంచుమాట
|
|
| తే. |
దనమనంబున గోచరించిన నొకించు, కేనియు వివేక మెంచక దానవారి
కెపుఁడు దనకంటెఁ బరమాప్తుఁ డెవ్వఁ డనెడు, గర్వము జనించె నావేళ గరుడునికిని.
| 124
|
| క. |
వినతానందన సత్యా, వనితాదుర్మదము లెఱిఁగి వనజాక్షుఁడు త
జ్ఞజనితాహంకృతు లడఁచుట, కొనరిక గలయొకయుపాయ మూహించు నెడన్.
| 125
|
| సీ. |
కైలాసశిఖరిఁ బేరోలగంబై పార్వతీదేవితోఁ గూడి దివిజు లెన్నఁ
బరమేశుఁ డున్నఁ దుంబురునారదులు వచ్చి కొలువు మ్రొక్కు లొనర్చి గూరుచున్న
తఱిఁ దుంబురుఁడు మున్ను తాను గానము చేసి రక్తి గన్పింప నారదుఁడు వెనుక
వినికి చేసిన మెచ్చి విశ్వేశుఁ డిప్పుడు పాట నీటయ్యె నన్మాట పలుకు
|
|
| తే. |
నంతఁ దుంబురుండు నాదుగానములోన, నితనిగానములోపల నెద్ది రక్తి
యనిన నీరక్తి నలువ సత్యముగఁ దేర్చు, సత్యమున కేఁగుఁడన్నఁ బ్రసాద మనుచు.
| 126
|
| చ. |
ఇరువురు త్రోవలోఁ జనుచు నెవ్వఁడు నావలెఁ బాటపాడ నే
ర్పరి? యని సారె నారదుఁడు పల్క నిఁకేటికిఁ బాలు నీరు నే
ర్పఱుచుహుమాయి నెక్కుదొర పల్కెడు నూరక రమ్మటంచుఁ దుం
బురుఁ డన నిట్టు లొండొరులు పోరుచుఁ జెచ్చెర ధాతపాలికిన్.
| 127
|
| చ. |
చని భాషాధిపుఁ గాంచి మ్రొక్కి యని రోస్వామీ! మహేశానుకొ
ల్వున సంగీతము చేసి గానమున మాలో రక్తి యెవ్వారి ద
న్నను గౌరీపతి బ్రహ్మ దీర్చు జనుఁ డన్నన్ గీతనిర్ణేత వీ
వని యేతెంచితి యేర్పరింపగవే యన్నన్ వచోనాథుఁడున్.
| 128
|
| మ. |
వరసంగీతకళానిరూఢి సము లై వర్తిల్లియున్ దుర్మద
స్ఫురణం బోరెడువీరిక్రొ వ్వడఁతు నంచున్ బుద్ధి నూహించి నా
తరమే? తీర్పగ మీపరస్పరవివాదం బార్పఁగా ద్వారకా
పురవాసుం డగు హైమువాసుఁ డెఱుఁగున్ బొండన్న లో నుబ్బుచున్.
| 129
|
| చ. |
నలువకు మ్రొక్కి తుంబురుఁడు నారదుఁడుం దమతారతమ్యముల్
దెలియుటకై ధరాస్థలి కుదీర్ణరయంబున డిగ్గి పర్వతం
బులు పురఘోషపక్కణతపోవనభూములు చూచుచుం గుశ
స్థలి మణిసౌధశృంగగతతారక ద్వారకఁ గాంచి వేడుకన్.
| 130
|
| చ. |
శరనిధిఁ బుట్టువంది బహుసంపద సొంపయి లోకమోహన
స్ఫురణ వహించి మేలుగని సొంపరి పోవని నీటుమాటుగా
హరి కనురక్తిగుల్కఁ గలయప్పురలక్ష్మి నుతించుచున్ వియ
చ్చరమును లందుఁ బోయి హరి సత్యగృహంబున నప్పు డుండుటన్.
| 131
|
| ఉ. |
అంతయుఁ దా మెఱింగి చని యంతిపురంబునఁ గొన్నికొన్నిక
క్ష్యాంతరముల్ గ్రమించి మఱియావలఁ బోవఁగరామి స్వామి యే
కాంతమువేళఁ గాన నొకకంచుకిఁ బిల్చి మదాగమంబు శ్రీ
కాంతున కింత దెల్పు మన గ్రక్కున వాఁడును బోవ నయ్యెడన్.
| 132
|
| సీ. |
చెలి యాకుమడుపు లిచ్చినఁ గైకొనక పంటఁ గొఱికి యి మ్మని వేఁడుకొనుబెడంగు
నంగన యటు లియ్య నందుచో మోవి చుఱుక్కున మొనపంట నొక్కుదుడుకు
కిసిసి యందులకు జంకెనతోడ విరిఁబోఁడి మోముమలంచిన మ్రొక్కుహొయలు
నందున నొకకొంత యలుక దీఱిన ముద్దుగుమ్మచెక్కిలి ముద్దుగొనువిలాస
|
|
| తే. |
మమర సకినలపట్టెమంచమునఁ దలిరు
పాన్పుపై సత్యతో నున్నపద్మనాభు
|
|
| |
తోడ నీవలికడ నుండి తుంబురుఁడును
నారదుఁడు స్వామి! వచ్చియున్నా రనుటయు.
| 133
|
| సీ. |
ఆనుడి చెవిఁ బడ నంత బంగరుచేలచెఱఁగులు నేలపై జీరియాడఁ
దటుకున లేచి పుక్కిటికప్పురపువీడె ముమిసి యత్తఱి నున్నయూడిగంపు
నెలఁతచే గిండిపన్నీట గండూషించి యడుగుఁ గెందమ్ములఁ దొడిగియున్న
మినుకుపావలు విడ్చి కనుసన్న సత్య కెంగేలఁ దమ్మిపసిండిగిండి పూని
|
|
| తే. |
మెట నేతేర దేవర్షివిభుని కెదురు
గాఁ జని నమస్కరించి యర్ఘ్యంబు పాద్య
మొసఁగి తగురీతిఁ దుంబురు నుపచరించి
తోడుకొని తెచ్చి బంగారుమేడమీఁద.
| 134
|
| ఉ. |
వారిజరాగపీఠములు వారిరుహాక్షులు మున్నె యుంచినన్
వారలఁ గూరుచుండ నిడి వారియనుజ్ఞ సువర్ణపీఠిపై
శౌరి వసించి నాయెడకుఁ జయ్యన మీ రిపు డేఁగుదేరఁగాఁ
గారణ మేమి? తెల్పఁదగు గాయకరత్నములార! నావుడున్.
| 135
|
| శా. |
వీణామౌని వచించెఁ గృష్ణ! విను మద్విఖ్యాతగీతోన్నతిన్
స్థాణుం బల్లవితాత్ముఁ జేయ నతఁ డెంచన్ మేము మాపాటలన్
రాణింపం గల దెద్ది? యన్న విధి దీర్ప న్నేర్చు నాఁ బోవ నా
వాణీదేవుఁడు మిమ్ముఁ జూపెఁ దగ మావాదంబు దీర్పం దగున్.
| 136
|
| క. |
ఆకృతి నేకం బైనను, గాకము సిక మనుచు స్వరముగతి దెలియుఁ గదా!
యేకడ మాధవసన్నిధి, మా కేల వివాద మనిన మాధవుఁ డాత్మన్.
| 137
|
| చ. |
మొకరితనంబుతో వెనుకముంద రెఱుంగక తామె గాక వి
ద్యకుఁ బ్రభు లైనలీల దురహంకృతిఁ బోరెడువీరితోడ స
త్యకు ఖగరాజుకుం గలమదం బడఁగింపఁగ వేళ యయ్యె నే
నొకటికిఁ జూడఁ దోడుపడె నొండొకసేఁత విధాతచాతురిన్.
| 138
|
| ఆ. |
గానలీల వీరి ఘనశౌర్యజవములఁ, బక్షిరాజు భక్తిపటిమ సత్య
నడఁప సుగుణవంతు హనుమంతుఁ బిలిపింతు, నని తలంచి వారి కనియె శౌరి.
| 139
|
| శా. |
మీసంగీతకళావిలాసములలో మే లెంచ గానాదినా
నాసారస్యరహస్యవేది సకలామ్నాయాంతవిద్యాఖ్యభా
మాసర్వంకషశేముషీనిధి హనూమద్భ్రహ్మ యట్లౌట నేఁ
డాసర్వజ్ఞునిఁ బిల్వఁ బంతు నని నాగారాతిఁ జింతించినన్.
| 140
|
| సీ. |
తెలిదీవికడనుండి దిగన నెగయుచోఁ బసిఁడిపేరిసుము నల్ దెసల మసలఁ
దళుకుబంగరువుఱెక్కలగాలివడి దూలి లెక్క కెక్కువగాఁగఁ జక్కలురుల
నుదధులు మెయి వీఁకఁ జెదరిపో బలిపద్మమందలిఫణు లిట్టు నట్టు సురుఁగ
బలుమేని కెంజాయ నలినభాండకటాహ మట నిండి రవితేజ మపహరింపఁ
|
|
| తే. |
జిలువమేపరి తలఁపులోపలనె వచ్చి
వినతుఁ డై యిచ్చఁగలగచ్చుతనము హెచ్చ
నేమికార్యంబు ఘటియింతు నెఱుక సేయుఁ
డనిన లేనవ్వుతో శౌరి యతని కనియె.
| 141
|
| మ. |
ఘనతేజోబలయుక్తి నీసములు వక్కాణింపలేరేకదా
విను వీ రిర్వురు గీతనిర్ణయము గావింపంగ నన్ గోరి వ
చ్చినవా రిప్పని గంధమాదనగిరిన్ జెన్నొందుసామీరిచే
త నగుం గావునఁ దోడి తె మ్మిచటి కుద్యద్వేగి వై నావుడున్.
| 142
|
| ఆ. |
చెఱకువిల్తుతండ్రి చెప్పినమాటలు, మొఱకుఁదనముకల్మి సరకుగొనక
కఱకుకడిమి నతని బెరుకుగా నెంచుచు, నెఱుక మాలి గరుడుఁ డిట్టు లనియె.
| 143
|
| శా. |
నాసత్వోన్నతి నాజవద్రఢిమయున్ నాభక్తిసంపత్తియున్
గాసిం జెందఁగఁజేసి క్రోఁతిఁ బిల వేగం బేఁగు మన్బాస నా
యాసం బేల ఘటించి తిట్టిపని నా కర్హంబె నానాఁటికా
హా! సన్మానము లెస్స చేసితివి బాగాయెన్ యశోదాత్మజా!
| 144
|
| శా. |
హీనాధిక్యము లెంచి పంచితివొ! న న్నేమాడ్కిఁ బొమ్మంటి వా
హీనాత్మం గపిమాత్రుఁ బిల్చుటకుఁ బోనీ యొక్కవేగంబునం
దైనన్ నాకు సమానుఁడే? పలుకు లేలా? నీవె యిట్లాడఁగా
నేనా కా దనువాఁడ నం చడలుపక్షీంద్రున్ నిరీక్షించుచున్.
| 145
|
| క. |
ప్రౌఢాస్మదీయమాయా, ప్యూఢాత్ముఁడు గాన కానఁ డూహాపోహల్
మూఢాత్ముఁ డని తలంచుచు, గాఢాలింగనము చేసి కమలాక్షుఁ డనున్.
| 146
|
| శా. |
పక్షిశ్రేష్ఠ! విచార మేమిటికి? మాభక్తుండ వై యుండియున్
సాక్షాదీశుఁడు వైష్ణవాగ్రణి భవిష్యద్బ్రహ్మ సామాన్యుఁడే
యక్షద్వేషి? తదుజ్జ్వలత్కదళికోద్యానంబు దుర్లక్ష్య మా
త్ర్యక్షబ్రహ్మలకంటె నున్నతుఁడ వీ వౌ టెంచి యి ట్లాడితిన్.
| 147
|
| క. |
లావరి వని బలురయమునఁ, బోవఁగలా వనియు నిన్నుఁ బొమ్మన్న నయో!
నావచనము జవదాఁటుదు, రే? విహగకులేంద్ర! యనుహరికి గరుడుఁ దనన్.
| 148
|
| ఆ. |
ఉత్తమంపుఁగెంపు నిత్తడిఁ జెక్కిన, రతనమునకు నిందరానిలీలఁ
దారతమ్య మెఱిఁగి దాసు నేలనిఱేని, కింతె కాని వాని కేటిహాని?
| 149
|
| ఉ. |
తావకభాషితంబు జవదాఁటుదునే యిదె గంధమాదన
గ్రావముఁ జేరి వానరుని రమ్మని పిల్చెద రాకయున్న నా
లా వెఱుఁగండె యంచు నిటలంబున నంజలి సేర్చి మ్రొక్కి ప
క్షావహహాటకాద్రియొకదా! యన నాయన సత్వరోద్ధతిన్.
| 150
|
| శా. |
వ్యోమాధ్వంబున నేఁగసాగె నురుపక్షోద్వేగఝంఝామరు
త్సామర్థ్యంబున గట్టుగుం పదర యోపాయుక్తి వైమానిక
స్తోమంబుల్ చెదరన్ దిశాళి బెదరన్ ద్యోగంగపాంసుచ్ఛటా
సామగ్రిం గదురం దురంతజవచంచత్సాహసాహంక్రియన్.
| 151
|
| వ. |
చని చని తనయగ్రభాగంబున నుగ్రకరాదిగ్రహనివహోపరిమార్గపరిగ్రహణో
దగ్రజాగ్రన్నిజశిఖరముఖరచితగంగాతరంగిణీరంగద్గాంగేయకమలముఖాస్వాదనం
బును నిజాధిక్యకాస్థితాదిత్యకాంతశాంతకాంతాతిశీతలగీతలహరీసల్లలితవల్లకీవాద
నంబును ఘనఖనిస్థలీఘనీభవద్ధగద్ధగితబహిర్గతమణిగైరికధాతురాగవిచిత్రప్రభాన
చిత్రాంబరలక్ష్మీసమాచ్ఛాదనంబును విలోకమాత్రప్రవర్తితానేకజనుస్సంపాతకల్మష
పరంపరావిభేదనంబును నగుగంధమాదనంబు గనుంగొని తద్ధరాధరమధ్యంబున మలయ
పవనచలితలలితసువర్ణపర్ణంబులు మెఱపులయొఱపు నెఱప నసమకుసుమగుళుచ్చ
గళజ్ఝరీభూతమరందబిందువులసోన వానపోలికన్ భూనభోంతరాళంబుల సరా
ళంబు లెనయఁ దదీయవాసనలపై నాస చేసి డాసినమిళిందరవంబు లుఱుములగరిమ
పెరిమ గన నప్పటప్పటి కుప్పతిల్లు కప్పురంపుటురవడివడగంటిచాలు నేలుకొన
నంబరం బొరసి దట్టంపునీడలగబ్బిం బ్రబ్బునబ్బురంపునుబ్బులయుబ్బునం బొదలుకద
ళంబులయిరువంకలఁ గ్రేంకారంబు లొనర్చుచుఁ బురులు విచ్చుచు విచ్చలవిడిఁ
బేరెంబులు వాఱుమయూరంబులబారు చేరువయీఱంబులదారిం దారసిలుతెఱగంటి
యొప్పులకుప్పల జిగిగొప్పుకొప్పులయొప్పు తమచొప్పున మెప్పు గనంగఁ బెనంగొను
ననుఁగుఁదనంబునం గదియ నుదరిపడి కరకంకణంబులు గల్లనఁ జప్పటలు చఱచి
వెఱచి పఱచి గొల్లున నవ్వుజవ్వనుల మవ్వంపునవ్వువెన్నెలఁ గరంగి జాలువాఱు
నెలరాలనీరు పటికపుబానల ముంచి తమప్రోది సేయు గొజ్జంగపాదుల నుజ్జగించు జడ
దారిపడఁతులనడలబెడం గభ్యసించుట కంచల సంచరించునంచలచలద్గరుదంచలవ్యజ
నంబులు శ్రమం బవనయింపఁ దపంబు లొనరించుతపోనిధుల కధిష్ఠాననిదానంబు లై
యభీష్టప్రదానంబుల నిరవుకొని పరిపరివిధంబుల మున్ను విన్న కిన్నరుల చిన్నప్రా
|
|
| |
యంపుఁగన్నియల పాటలదీ టలరార రాగంబు లొనర్చుకోయిలయెలనాఁగలబా
గలవడుమరుత్కుమారుపారావారలంఘనాదిబిరుదప్రచారంబులు గావించుకీరకా
శారికావారంబులపొల్పు దెల్పు కల్పతరుశాఖల వ్రేలుచెలు లన లతకూనలు చిఱుత
తెమ్మెరల మరలుటలనెపంబున నటింప మెచ్చి వసంతుం డొసంగుబిరుదుపావడలఠే
వ ఠావుకొనఁ దావులకుఁ దావలం బై యీవలావల నావహిలుపూవుఁదేనియ నాని
పుప్పొడిదుమ్ములఁ గ్రమ్మినపచేళిమఫలప్రచయప్రచురరుచివిలసద్రసవాహినులమోహ
నీయం బై యసమయంబున నైనం దలంచినఁ దత్తదుచితసుఖంబు లొసంగం గల
ప్రభావంబునం బొసంగి సంగీతరతావాసం బయ్యును సంగీతరతావాసం బై పరిగత
సుమనోరజం బయ్యును పరిగతసుమనోరజం బై బహుతరద్విజసంతానశోభితం
బయ్యును బహుతరద్విజసంతానశోభితంబై నిత్యముక్తాస్పదం బయ్యును నిత్యముక్తా
స్పదం బై మాధవాశ్రయంబు గావున సరసపద్మాకరం బై భాస్వత్ప్రభావభాసురంబు
గావునఁ దమోనివారకం బై దుర్నిరీక్ష్యంబైనకన రంభావనంబు పొడఁగని.
| 152
|
| శా. |
ఛాయావర్ధనవైఖరిం గళితభాస్వద్బింబదీవ్యత్ఫల
శ్రీయుక్తిన్ సురసాదృతిస్ఫురికకీర్తిం గేసరప్రీతిసం
ధాయిత్వాప్తి నిజేశుఁ బోలినవనిం దాఁ జొచ్చి యింద్రాయుధ
చ్ఛాయన్ లోపల వాలసాలము రహించం గాంచి చిత్తంబునన్.
| 153
|
| సీ. |
శ్రీగంధమాదనాభోగకర్భురమణిశ్రీ లెల్ల నొకదారిఁ జేరెనొక్కొ
యారామలక్ష్మి శృంగారార్థము వహించుకాంచనాంచితరత్నకాంచి యొక్కొ
సిద్ధయోగీశ్వరుల్ సిద్ధౌషధము లొక్కకడ నించి యుంచినకణజ మొక్కొ
కడుఁబెద్దకాలంబు పుడమిఁ దాల్చినశ్రాంతి యడఁగిపోఁ గూర్కుశేషాహి యొక్కొ
|
|
| తే. |
గాక తను నెవ్వరికిఁ గానరాకయుండ
గాడ్పుకొమరుండు గట్టిగాఁ గట్టినట్టి
వజ్రసాలంబొకో యని వైనతేయుఁ
డంతికంబున కరుదెంచి యట్టె కాంచి.
| 154
|
| ఉ. |
పోల నెఱింగి హా తెలిసెఁబో యొకసాలముపోలికన్ వృథా
స్థూలము వాలముం బెనఁచి చుట్టును జుట్టుకయున్నఁ బక్షవ
చ్ఛైలవిఖండనప్రవణశస్త్రభయాపహమద్గరుచ్ఛటా
భీలమరుత్పరంపరలు భేదిలఁజేయక రిత్తవోవునే?
|
|
| ఆ. |
చుట్టు నట్టుకొట్టి యిట్టట్టు పడఁబెట్టి, గట్టిచట్టుపలను బుట్టుగాడ్పు
బిట్టు మట్టుపెట్టి యట్టెపైఁ దొట్టగ, నిట్టిక్రోఁతి నలపఁ కేల? కలఁగు.
| 156
|
| చ. |
తుద మొద లేమియుం గనక తుచ్ఛపుఁబుచ్ఛపుఁగోటలీల నా
కెదురుగ నొడ్డి తా నడుమ నెంతయు రాజసవృత్తి నున్నవాఁ
డెదురును ద న్నెఱుంగఁ డతిహీనుఁ డనంగను శౌరి తద్దయున్
జదురులు చెప్పె జొప్పడునె జాతికొలందియె కాక బుద్ధియున్.
| 157
|
| చ. |
మహి వడు గొక్కరుండె శతమర్కటతుల్యుఁడు నాఁగఁ గ్రోఁతియై
యహహ! వటుండు నైన మఱి యంతటికంటెను జేష్ట లెచ్చవే?
తహతహఁ జెంద నేమిటికిఁ? దా నెదురౌనొకొ మద్గరున్మరు
న్నిహతికిఁ జూత మంచు ఖగనేత భయంకరహుంక్రియార్భటిన్.
| 158
|
| క. |
ప్రళయాబ్ధినడుమ సైకత, మొలసినగతి విలయకాలహుతవహు నార్పన్
సులభమతి నొరయుశలభము, బలెఁ గపివాలంబు విహగపతి కదిసి వెసన్.
| 159
|
| సీ. |
పటపటార్భటి దిశాపటలి దీటుకొనంగఁ గఱకుఱెక్కలగాడ్పు గడలుకొల్పి
కహకహధ్వనిఁ ద్రిలోకములు నాకంపింపఁ జండతుండంబున సారె వొడిచి
చిటచిటార్భటి నేత్రశిఖి నిప్పు లొప్పారఁ బదనఖాంకురహతుల్ పరిఘటించి
కలకలధ్వని సుధాంధులగుండె లదరంగ మింటి కుద్దతి దాఁటి మీద దుమికి
|
|
| తే. |
పట్టు దప్పింప నిట్టట్టు చుట్టు దిరిగి, వీగి సన నొక్కదెస వేఁగుగాఁగ దూఱి
యంగము నెమర్ప నాదిమధ్యాంతరహిత, వాలసాలంబుఁ దెమలింపఁ జాలకపుడు.
| 160
|
| సీ. |
మత్పక్షవిక్షేపమారుతాహతి వకావక లగు నాచక్రవాళ మైన
మచ్చంచునిహతి దుమార మౌ జరఠకూర్మాధినాథునిచరమాంగ మైన
మత్పాదనఖరముఖోత్పాదనమునకు ధూళి యౌ శక్రదంభోళి యైన
మద్దివ్యమూర్తిశుంభద్ఘర్షణంబున గులగుల లౌ నాదిఘోణి యైనఁ
|
|
| తే. |
బగుల దగలదు నొగులదు బలుపు చెడదు, వానరునితోఁక కిట్టిదుర్వారమహిమ
యెట్టు ఘటియిల్లె నని యెంచి యీసు పెంచి, తోఁక కెగఁబాఱి యవతల దుముకదలఁచి.
| 161
|
| ఉ. |
అండజమండలేశ్వరుఁ డుదగ్రహిరణ్యయపక్షదీధితుల్
చండమరీచిరోచులకుఁ జా టొనరింపఁ బ్రచండమారుతో
ద్దండజవంబుతో నెగసి దారున నేఁగఁగసాగెఁ బద్మగ
ర్భాండము దాఁటి చన్నప్లవగాధిపువాలపుఁగోట వెంబడిన్.
| 162
|
| మ. |
గణుతింపన్ వసపోనభానునికడన్ ఖద్యోతమున్ సింధురా
గ్రణిచెంతన్ మశకంబు పూర్ణశశియోరం జుక్కయుం బోలి త
త్ఫణివిధ్వంసి కపీంద్రువాలలతికాప్రాకారమధ్యంబునం
దణుమాత్రంబుగ గానుపించె సురు లత్యాశ్చర్యముం బొందఁగన్.
| 163
|
| చ. |
పొడవుగఁ బోయి పోయి ఖగపుంగవుఁ డంగము చెమ్మరింపఁగా
వడి చెడి గుండె తల్లడిల వక్త్రము వెల్వెలఁ బోవఁ బాదముల్
తడఁబడ నీఁకలం జడిమ దార్కొని మారుతివాలసాలముం
గడ గనలేక కాఁకఁ బడి గర్వము దక్కియుఁ దక్క కక్కడన్.
| 164
|
| ఉ. |
దంటతనంబె కాని యుచితజ్ఞత లేదు వనాటుఁ డౌట నా
వంటిమహామహుండు దనవాలముఁ బాఁకఁగ నూరకున్నవాఁ
డొంటమి యేల? ముందరఁ బ్రియోక్తులఁ బిల్చెదఁ బల్కఁడేని నా
బంటుతనంబు జూపఁగ నెపం బగుఁ గా కని నిశ్చితాత్ముఁ డై.
| 165
|
| ఉ. |
బెట్టుగ నోకపీంద్ర! నినుఁ బిల్చుకరమ్మనె శౌరి ద్వారకా
పట్టణవాసుఁ డచ్యుతుఁడు పద్మదళాక్షుఁడు గృష్ణుఁ డింపు లోఁ
బట్టఁగ వేగ రమ్మనుచుఁ బల్మఱుఁ బిల్చిన రామభక్తిసం
ఘట్టితబుద్ధి యౌటఁ గపి కర్ణపదంబునఁ బెట్టుకున్నెడన్.
| 166
|
| మ. |
అవురా! క్రోఁతికి నింత వచ్చె నిది గాదా వింత! బ్రహ్మాదిదై
వవరుల్ సైతము భీతి నెవ్వనినుడిన్ వర్తించుచుం గొల్తు ర
ట్టివిభుం డంపెను రమ్మటన్న విని రాఁడే మారు మాటాడఁడే
చెవుడా యిట్టివివేకహీను నిఁక నే శిక్షింతు నం చుద్ధతిన్.
| 167
|
| చ. |
పదనఖరాజిఁ బై నదిమిపట్టి శతారము మీఱుముక్కునం
బొదివి కపీంద్రువాలలత బోరన వెన్కకుఁ బెల్లగిల్ల నీ
డ్చెద నని కంట నిప్పుకలు చిప్పిల నిట్టటు చుట్టు నూఁగఁగా
నది మదిలో నెఱింగి దరహాసముతోఁ గపిసార్వభౌముఁడున్.
| 168
|
| సీ. |
అలవోకవోలె వాలాగ్ర మొకించుక విదలించినంత నవ్విహగవిభుఁడు
మొదటఁ బట్టినపట్టు వదలి తన్మారుతోద్రేకంబునను సేకరింపలేక
మురముర ఱెక్కలు మొరయ నుద్భ్రాంతుఁ డై గిరగిర చక్రంబుక్రియఁ దిరుగుచు
వెఱ బెండువడి యొడ లెఱుఁగక దిగచెమ్మటలు గాలువలువాఱ బలిమి జాఱఁ
|
|
| తే. |
బృథివి చలియింప దశదిశల్ బెగడు కుడువ, జగము లచ్చెరుపడ మేరునగము పెకలి
వచ్చెనో! యని ద్వారకావాసు లగలఁ, గొలువులో వచ్చి గుప్పునఁ గూలఁబడియె.
| 169
|
| క. |
పడి వడి యడంగి నెత్తురు, బుడబుడఁ గ్రక్కుకొని యొడలిపోఁడిమి చెడి సొం
పెడలి బలుఱెక్క లగలం, బడలిక మూర్ఛిల్లి విన్నఁబాటున నున్నన్.
| 170
|
| ఉ. |
అన్నలినాక్షుఁ డాతఁడు నిజాగ్రతలంబున వీతచేతష్టుఁ డై
యున్నవిధంబు లో నెఱిఁగియున్ మఱియేమి యెఱుంగనట్ల యి
|
|
| |
ట్లెన్నఁడు విన్నఁబాటు గనఁ డెవ్వరిచే నిపు డేమి వచ్చె నీ
పన్నగవైరికం చుదరిపాటునఁ బీఠము డిగ్గి గ్రక్కునన్.
| 171
|
| ఉ. |
బంగరుచేల జాఱ నిరుప్రక్కల రుక్మిణి సత్య యేఁగుదే
రంగ విహంగపుంగవుకుఱంగటికిం జని కూరుచుండి య
య్యంగమునం దొఱుగురుధిరాశ్రుకణశ్రమవార్ఝరంబు లె
ల్లం గడిగించి యెత్తి తొడలం గదియించి దయాసమగ్రతన్.
| 172
|
| సీ. |
మేనిక్రొందడి డింద మిహికుందనపుఁజేలచెఱఁగునఁ దుడిచి మైఁ బొరలిపడిన
యురవడి నిటు నటు నెరయు పేరెఱకలఁ గలచిక్కు లెడలించి కలయ దువ్వి
తల కెత్తుగాఁ గేలుదామర యిడి కర్ణములఁ బాఱఁ గపురంపుబలుకు లూఁది
విరిఁబోఁడికెంగేలిమరువంపుసురఁటినెత్తావితెమ్మెర సోఁకుఠీవి నొసఁగి
|
|
| తే. |
తత్తదవయవవేదనల్ తలఁగ నల్ల
నల్లఁ దడవుచు నిజకటాక్షామృతమున
నుసురు నెసకొల్పఁ బిమ్మట యుడిగి పులుఁగు
కన్నుఁగవ విచ్చి నలుదెసల్ గలయఁ జూచి.
| 173
|
| మ. |
తొడపైఁ ద న్నిడి శ్రాంతి వాపెడు ముకుందుం గాంచి లక్షించి దం
దడి సెందం దల వాంచియున్నపులుఁగుం దర్శించి యిం దీగతిం
బడ నేలా? నినువంటివాని కిటులం బాటిల్లెనే! మారుతిం
దొడరంబోవుగదా! వనాటుఁ డని నీదుర్బుద్ధి ప్రేరేఁపఁగన్.
| 174
|
| ఉ. |
హెచ్చినభక్తి రాము భజియించుచుఁ బల్కకయున్న గర్వి గా
నెంచి యశక్తిదుర్జనత లేమి ఘటించితొ! రాముకింకరుం
డించుక కోపగించిన సహింతువె? యాతఁడు దక్క నిన్నుఁ గా
రించఁగ నన్యుఁ డేఁడి? వివరింపుము మాటికిఁ గొంక నేటికిన్?
| 175
|
| మ. |
హనుమంతుం డను పేరు కర్ణముల డాయన్ బ్రహ్మరుద్రాదు లా
త్మనె కీర్తింతురు నాఁగ నన్యులకుఁ గ్రోధం బూనఁగా వచ్చునే!
వినయోక్తుల్ ప్రకటింతువేమొ యని యవ్వీరాగ్రణిం బిల్వఁబొ
మ్మని ని న్నంపితిఁ గాక యిట్లయిన నాహా నిన్నుఁ బొమ్మందునే?
| 176
|
| ఉ. |
నా విని వైనతేయుఁడు ప్రణామము చేసి యెలుంగు రాల బా
ష్పావృతనేత్రుఁ డై పలికె నచ్యుత! నా కిఁక నేటికొంకు సం
జీవనదేవువాలలతచే నుడివోయె మదీయశౌర్యలీ
లావిభవంబు యుష్మదనులాపము గైకొనకున్కి నావుడున్.
| 177
|
| ఉ. |
నవ్వి ముకుందుఁ డోయి ఖగనాయక! యెంతటివాని కొక్కెడం
ద వ్వగు బుద్ధి యేల పరితాపము నే నని వివ్వ కీవు కాల్
ద్రవ్వకచువ్వె! జానకియు రాముఁడు రమ్మనిరంచు నొక్కమా
టవ్వటుఁ బిల్వు మిక్కిలిరయంబున వచ్చున టన్న భీతుఁ డై.
| 178
|
| చ. |
ఒకపరి పోవఁ దోఁకతుద నూడ విదిర్చిన నింతవచ్చెగా
యిఁక నొకమాటు వోయి పిల నెక్కడ దోఁకనె చుట్టికొట్టునో
తికమక కోర్వఁజాల వడి దీరె గతుల్ గడతేఱె రాపుసే
యకు మిఁకఁ గృష్ణ! నే వెఱతునయ్య సమీరజుదారిఁ జేరఁగన్.
| 179
|
| చ. |
అన విని శౌరి చిత్తమున హాస్యరసంబును వత్సలత్వముం
బెనఁగొనఁ బల్కె నేమిటికి భీతిలెదోయి ఖగేంద్ర! రాముపం
పునఁ జనుదెంచినా ననిన మున్పటిలీల వహింపఁ డీవు పొ
మ్మనుచుఁ గవుంగలించిన జొహా రిడి యాయన పోయి చెచ్చెరన్.
| 180
|
| ఉ. |
వానరచక్రవర్తి బలువాలముచెంగట నిల్చి యోవిధీ
శానముఖాదితేయనుత! సద్గుణరత్నవిధేయ! యాంజనే
యా! నిను సీతయున్ రఘుకులాగ్రణి రమ్మని రిప్డు ద్వారకా
స్థాననివాసు కై యనువచస్స్థితి యించుక వీనులం బడన్.
| 181
|
| మ. |
అతిశీఘ్రంబున లేచి కన్గొలఁకుల హర్షాశ్రువుల్
జాఱ నా
నతుఁ డై కేల్గవమోడ్పు నెన్నుదుటఁ జెందన్ మిక్కిలిం గొంచెమై
యతనిం గాంచి మహాత్మ! నీవలన నేఁ డాలించితిన్ భక్తసం
తతచింతాఘభిదాసమర్థములు సీతారామనామార్థముల్.
| 182
|
| మ. |
జపముల్ మేల్కనె నాతపంబు లలరెన్ సంకల్ప మీడేఱె నన్
విపులాకన్యయు స్వామి పిల్వు మనఁగా నీ విందు రా నైన నీ
కపరాధం బొనరించితిం తెలియలే కజ్ఞాని మన్నింపు మీ
కృప నన్నన్ ఖగరాజు నమ్రుఁ డయి పల్కెన్ భక్తి సామిరితోన్.
| 183
|
| మ. |
త్రిజగత్సేవ్యుఁ డవప్రతర్క్యమహిమోద్దీప్తుండ వశ్రాంతరా
మజపధ్యానసుధాధురీణమతి వామ్నాయార్ణనిర్ణేత వీ
వజహద్ధైర్యుఁ డ విట్లు పల్కఁదగునే యయ్యా మదీయాపరా
ధజనుష్కోటిఁ దలంప కేదఁగదవే త్వద్దాసుఁడన్ నావుడున్.
| 184
|
| శా. |
పక్షిశ్రేష్ఠుని నిండుకౌఁగిటను సంభావించి వెన్వెంట ధూ
మ్రాక్షధ్వంసనుఁ డేఁగుదేర వినయవ్యాసక్తిఁ దోకొంచుఁ బు
|
|
| |
ణ్యక్షేత్రక్షితిభృత్తటాకతటినీనానాశ్రమశ్రేణికా
వీక్షానందముఁ జెంది ద్వారకపురోవీథిన్ ప్రదీపించినన్.
| 185
|
| శా. |
సందర్శించితె ద్వారకాపురి ధరాజామాత నీమాతతో
నిందున్నాఁ డని పుల్గుఱేఁ డనఁ బ్లవంగేంద్రుండు కేల్మోడ్చి మ్రొ
క్కం దోడ్తో దరియంగఁజొచ్చి హరిరంగన్మందిరాళిందమున్
జెందం దా నట పోయి శౌరిఁ గని వచ్చెన్ స్వామి దాసుం డనన్.
| 186
|
| శా. |
శ్రీరామాపతి సత్యభామ కను నీరేజాక్షి! పామీరి సీ
తారాముల్ పిలిపించినా రనిన సత్యం బంచు వచ్చెం దదా
కారంబుల్ వహియింపకున్న నగునే కాఁబట్టి నేఁ జెందెదన్
శ్రీరామత్వము నీవు సీత వగుమా శీఘ్రంబుగా నావుడున్.
| 187
|
| శా. |
వ్రీడారూఢి మొగంబు వాంచి మిగులన్ రీఢాత్మ యై మారుమా
టాడం జాలక రూపభాగ్యజనితాహంకారముల్ దాఱుటన్
గోడం జిత్రములీల నున్న నగుచున్ గోవిందుఁ డుద్యజ్జగ
త్క్రీడాప్రౌఢచరిత్ర భీష్మకసుతం గ్రేఁగంట నీక్షించినన్.
| 188
|
| సీ. |
నెలవంగడపురాచకలువరాజన్నంపుఁబుడమి నాఁగేటికొమ్మునను బొడమి
వలిగట్టుదొరఁబుట్టుచెలువచుట్టమువింటికోపుమోపడపుటుంకువకు నొదిఁగి
యడుగుసోఁకున ఱాతి నలరుఁబాయపునాతి గానొనర్చినఱేనిఁ గలసి మెలసి
కవయేనుతలలరక్కసిమిక్కుటపుటుక్కుకడఁజెక్కు పూన్కికి వడి గడించి
|
|
| తే. |
తనరు నేకాంత యాకాంత తానె యగుచు
నట్టె యాకస్మికంబుగా నుట్టిపడిన
యట్టు కొలువున నున్నవా రచ్చెరుపడఁ
జెలువ సాక్షాత్కరించిన శ్రీహరియును.
| 189
|
| సీ. |
తనునీలసౌధాగ్రతలమిళద్రత్నకుంభంబు నా మణికిరీటంబు వెలుఁగ
మౌళికల్పకసూనపాళి మరందేఛ్ఛ దొరయుతేం ట్లనఁగ ముంగురులు వఱల
లలితగల్లచ్ఛద్మలవలీదళోత్ఫుల్లకుసుమవైఖరి మందహాస మెసఁగఁ
గంధరాశ్రీగంధగంధలోలవినీలభుజగంబు లన దీర్ఘభుజము లమరఁ
|
|
| తే. |
దత్తదవయవసముచితోదాత్తరత్న, భూషణోద్వృత్తిమునుపటిపొలుపు దెలుప
దాను శ్రీరాముఁ డై యంకతలమునందుఁ, గాంత నుంచి గరుత్మన్ముఖంబు గనిన.
| 190
|
| ఆ. |
స్వామిచిత్త మెఱిఁగి సామీరియున్నక, క్ష్యాంతరమున కరిగి యనఘ! రమ్ము
సమయ మయ్యె రామసంసేవ కన విని, నధికభక్తియుక్తి నరుగుదెంచి.
| 191
|
| సీ. |
కులుకుమోవులదారి మొలకనవ్వులపేరి జిలుఁగువన్నెలగూరి చెలఁగువారిఁ
గొలుచుపుణ్యులకోరికల నెల్ల నవ్వారి నొసఁగుకూరిమి మీఱి పొసఁగువారి
మెఱసిపోనిమిటారిమెఱుఁగు చేరువవారి దము దెల్పుకళ లూరి తనరువారి
ధనమనోగతి జారి చనక మించినభూరితరలీల నటఁ జేరఁదగినవారి
|
|
| తే. |
జానకీరాఘవులఁ గాంచి సంభ్రమించి
యాత్మ సద్య కృతార్థోస్మి యని తలంచి
యనిలతనయుఁడు సాష్టాంగ మాచరించి
యంజలి ఘటించి యిటు లని యభినుతించె.
| 192
|
| రగడ. |
శ్రీధరిత్రి కూర్మిపుత్రి క్షేమదాత్రి శరణుశరణు
సాధులోక బోధనైకజాగరూక శరణుశరణు
కమలనేత్ర కలుషజైత్ర ఘనచరిత్ర శరణు శరణు
సుమతిదీప శమిదురాప శ్రుతికలాప శరణు శరణు
కిసలపాణి భసలవేణి కీరవాణి శరణు శరణు
అసమధైర్య ప్రసవకార్య హారిచర్య శరణు శరణు
కరటియాన సుఖవిధాన గతినిదాన దాన శరణు
సరసవేష పరమతోష సద్విశేష భాష శరణు
కరసరోజసురసమాజగతపయోజపూజ శరణు
తరణితేజ నతహరాజ త్యాగరాజరాజశరణు
శతకఖండ సమయచండచటులకాండకాండ శరణు
వితతధామ క్షితిపసోమ విమలరామ రామ శరణు
జనని నన్నుఁ గనిననిన్ను సకలసన్నుతాత్మఁ గంటి
ఘననతార్తి హననకీర్తి గలయుమూర్తిఁ జూడఁగంటి
సగుణపాళి నెగడుహాళి సలుపుకేళి వెలయు దీవ
జగము లెన్నఁదగి ప్రసన్నజనుల నున్న స్వామి వీవ
యెలమి హెచ్చి కలిమి నిచ్చి హెచ్చుమచ్చెకంటి వీవ
జలధిలోన సకల మూనఁ జాలుమీనమూర్తి వీవ
కోరి యెంచువారి మంచుకూర్మి మించుబోటి వీవ
వారిప్రాపుఁ జేరి వీఁపు వంక మోపుగొంటి వీవ
జడిమ మాని నుడవరానిసరణిఁ బూని వెలుఁగు దీవ
|
|
| |
కడిమి దేరఁ బుడమికోరఁ గడిమి మీఱ నోపు దీవ
మదిని దృష్టి నొదవుసృష్టిమలయుయష్టి నొందు దీవ
కదిమిపుత్రుఁ బొదువుశత్రు గళితగాత్రుఁ జేసి తీవ
మిన్ను గాలి మన్ను కీలి మించుహేలఁ గాంచి తీవ
చిన్నిమాయ పన్నిదాయసిరులు వాయ మించి తీవ
వికృతి లేక ప్రకృతి నైకవిధులజోక కెక్కి తీవ
సకలరాజనికరభూజశమనతేజ మెనసి తీవ
పురములందు దొరయుచిందుఁ బొందుచందుతోడ వీవ
శరధి గట్టి యరిని గొట్టి జయము జట్టిగొంటి వీవ
బలువినోద మొలయు వేదభరితనాదమూర్తి వీవ
బలుఁ డనంగ ఖలుల భంగపఱప నంగ మొంది తీవ
తలఁపులోన మెలఁపుతోన తగినదాన వౌదు వీవ
యెలమి గొల్లచెలులచల్ల యెల్లఁ గొల్ల లాడి తీవ
కడమ గాక జడిమ లేక గలవివేక మెనయ దీవ
వెడఁగుబుద్ధి నొడివిసుద్ధి విడఁగఁ గొద్ది మీఱి? తీవ
కలిగియుండి కలుగకుండి కలిమి నిండి యుందు వీవ
ఖలులు దాఱఁ గలికిపేర ఘనత మీఱఁ గలుగు దీవ
యలసభావ మొలయుత్రోవ లడఁచి ప్రోవవమ్మ నన్నుఁ
దెలివి గ్రాలఁ బలుకు లేల తెలియఁజాల నయ్య నిన్ను.
| 193
|
| క. |
అని యాతఁడు కొనియాడినఁ, బునరుపగతరామమూర్తి బొసఁగినహరి పా
వని బిగికౌఁగిటఁ జేరుచు, కొని కనుఁగొనఁ గరుణ గడలుకొన నీటు లనియెన్.
| 194
|
శ్రీకృష్ణుఁడు హనుమచేఁ దుంబురునారదులగర్వ మడగించుట
| ఉ. |
ఓయనిలాత్మజన్మ మము నుల్లములోపల నెల్లవేళలం
బాయక చింత సేయుచుఁ దపంబునెపంబున నున్ననిన్ను నేఁ
డీయతిచంద్రగాయకుల యిద్దఱిపాటల మేలు దెల్పఁగా
నాయెద నెంచి పక్షికులనాథునిఁ బంచితిఁ దోడితేరఁగన్.
| 195
|
| క. |
ఆలాగున వచ్చితిగద, యాలస్యం బేల యింక నన్యోన్యవివా
దాలాప ముడిసి పాటల, మే లిది యని తెలుపు మన సమీరసుతుండున్.
| 196
|
| శా. |
హస్తద్వంద్వము మోడ్చి మీనుడికి మారాడంగ నే నోడుదున్
శస్తప్రాభవసర్వలోకపతి యై సర్వజ్ఞతాస్ఫూర్తిఁ బ్రా
|
|
| |
శస్త్యం బొందినమీ రెఱుంగరె యి దేసంకల్పమో యేల నై
కస్తోకోక్తులు నాయెఱింగినటులే గానంబు మే లెంచెదన్.
| 197
|
| మ. |
జవసూత్రంబులవాఁడు త్రిప్పుగతులం జంత్రంపుబొమ్మల్ నటిం
చువిధం బింతియ కాక జంతువుల కెచ్చో మిమ్ముఁదక్కన్ స్వతం
త్రవిధుల్ గల్గునె యంచు మ్రొక్కి పతిసన్నం బాదపీఠంబుచెం
త వినీతిన్ వసియించి తుంబరుని వీణామౌని నీక్షించుచున్.
| 198
|
| ఉ. |
గాయకచంద్రులార త్రిజగన్నుతతావకహృద్యగానవి
ద్యాయతతారతమ్యగతు లారయ శక్యమై యైన జానకీ
నాయకుదివ్యపాదనలినద్వయసన్నిధిఁ దేఱునిద్దఱున్
ఠాయిగ నొక్కరాగ మనుఁడా పరివాదిని నన్న వారలున్.
| 199
|
| సీ. |
గవుసెనల్ సడలించి కవవీణె లూని తంత్రులు దీటి మఱి బిరడలు బిగించి
యనురాగమున రాగమున కనుసారికగా శ్రుతు లొనఁగూర్చికరివె నివిరి
జఱువాటుగ నొక్కసారి మీటి యొకింతజాఱినసారెలు చక్కనొత్తి
సరససప్తస్వరసందర్భవిస్ఫూర్తి మీఱఁగా గమకంబు వేఱుపడఁగ
|
|
| తే. |
సారె మొరయించి తగునలంకారసరణి, గొన్నిగీతప్రబంధముల్ గులుకఁ దేనె
లొలుకఁ బలికించి ఠాయంబు లొదవఁ దాన, మానములు రాగముల రక్తి గానుపింప.
| 200
|
| మ. |
స్వరసందర్భ మయారె! మేల్ శ్రుతులు! మజ్జారయ్య ఠాయంబు! బా
పురె! యాలాపము స్థాయి యౌర! గమకంబుల్ మమ్మ! గీతంబు ల
ద్దిర! ముక్తాయము చాఁగురే! యని మరుద్దేవాత్మజన్ముండు తుం
బురుదేవర్షుల మెచ్చె గానరస మింపున్ సొంపు గావింపఁగన్.
| 201
|
| ఉ. |
ఈరహి వారి మెచ్చి బళిరే! యిటువంటిసుగీతచాతురిన్
దేరిచి పల్క నాతరమె దేవుఁ డెఱంగెడు మీదుముందరన్
నేరుతునంట గా దయిన నేనును నేర్చినకొన్నిగీతముల్
శ్రీరఘునేతకున్ వినికిసేతు వినందగు మీరు నావుడున్.
| 202
|
| ఉ. |
అందుల కొక్కయింతదరహాసముతోఁ దమపాటముందరన్
గందళ మొందునే? యితరగానము లంచుఁ దలంచి మంచిదే
యిందఱరక్తిఁ గుల్కుఁ డని యిద్దఱు వీణ లొసంగవచ్చుచో
నొందు నతిప్రియోక్తి వినయోన్నతి ధూర్తత గానిపింపఁగన్.
| 203
|
| క. |
దేవర్షి చేతివల్లకిఁ, దా వినయమునం గ్రహించి తంత్రులు మొరయన్
జీవాళిఁ గూర్చి రక్తిగఁ, బావని పలికింపసాగెఁ బరమప్రౌఢిన్.
| 204
|
| క. |
క్రమ మొంద నాభజావళి, గమకముగా శుద్ధసాళగములును సంకీ
ర్ణము లొగి పుంఖింపఁగ మం, ద్రము మధ్యము తార మత్యుదారత మీఱన్.
| 205
|
| క. |
ఘనవిధము రక్తివిధమును, దనరఁ గ్రియాసావధానతానంబులచేఁ
గనిపింప నింపుసరళియు, మునుకొన హరి కొన్నిగీతములు పలికింపన్.
| 206
|
| సీ. |
మధువిలాసస్ఫూర్తి నధిగమించుటఁ జేసి పరగించె మోటులఁ బల్లవములు
ఘనసుధాకరరక్తిఁ గాంచి మించుటఁ జేసి నిగిడించె నెలరాల నిర్ఝరములు
అతనుసౌభాగ్యసంగతిఁ బొసంగుటఁ జేసి మొనయించె సకలమోహననిరూఢి
మిత్రలాలిత్యవైచిత్రి హత్తుటఁ జేసి యలరించె జనహృదయాంబుజములు
|
|
| తే. |
సారజీమూతయుతసుభద్రారవాప్తి, కలిమిఁ జేసి నివాసబర్హులకుఁ బ్రమద
మావహించె నయారె! యక్షారిహృద్య, మాన్యదనవద్యవల్లకీవాద్యమహిమ.
| 207
|
| తే. |
శ్రుతుల బెరయుట స్వరముల చొప్పు విడక, ఘనవిధముగాన షడ్జతఁ గలసి మెలసి
సాలశుద్ధతఁ గనుట దోసములఁ బాసి, వానరస్వామి గాన మనూన మయ్యె.
| 208
|
| సీ. |
బహువిధాలంకారపర్యాప్తి చిత్తముల్ గరఁగించుటను వారకాంతఁ బోలి
పటుతరాలావసంబంధప్రబంధనిర్వహణవైఖరిఁ గవివాణిఁ బోలి
మహితాంగరాగసంపత్తి గ్రామస్ఫూర్తి బహుళ మై నృపునివైభవముఁ బోలి
వరతారకాంతరస్ఫురితనాదప్రౌఢిఁ దగి మహాయోగికృత్యంబుఁ బోలి
|
|
| తే. |
వెండియు భుజంగమోహనోద్వేలర క్తిఁ, జాలమాధుర్యగతి మించి రాలు వెలయ
పారవశ్యైకహేతు వై పవనసూను, మానితానునవల్లకీగాన మమరె.
| 209
|
| సీ. |
కనుదోయి మోడ్చి నిక్కముగఁ జొక్కనిబోటి నిలు వెల్లఁ గరఁగకుండినవధూటి
ప్రమదాశ్రు లొందనిప్రమదాశిరోమణి చెయ్వులు దక్కి రంజిలనిరమణి
మది పల్లవింప సొమ్మసిలనిలతకూన యొడ లెఱుంగక మ్రానుపడనిచాన
చెలి యని కొమ్మపైఁ జేతు లూఁదనికొమ్మ మునిముద్రఁ దాల్పనిముద్దుగుమ్మ
|
|
| తే. |
యాసభాస్థలి లేదయ్యె ననుచు వింత, గా నుడువ నింత యేల యాకాశగాంగ
జలవిహారపరామరీజనములోన, నైన నారీతిఁ గరఁగనియదియు లేదు.
| 210
|
| మ. |
బలురాలం గరఁగింప నోపినమహాభావ్యఙ్ఞభూవల్లకీ
కలనాదంబున కెంత దొడ్డు? దలఁపం గైకొన్నచోఁ గందుక్రొం
దలిరుంబాఁకులజోక డిందుపడు కాంతాస్వాంతపంకేరుహ
మ్ములరక్తిం గరఁగించి కన్గొలఁకులన్ మోదాశ్రువుల్ నించుటల్.
| 211
|
| సీ. |
కారుకమ్మి బలాహకము లాకసము నిండెఁ గొంచెంబుగా వాన కురియుచుండె
నీలకంఠంబులు నృత్యసంపద హత్తెఁ బాతాళమున ఫణుల్ పడగ లెత్తెఁ
|
|
| |
గొలువువారలరత్నములసొమ్ములు గరంగె శశిమణిస్తంభంబుఝురు లెసంగె
వైమానికులపారవశ్యవైభవ మెచ్చె హరిరాగలహరు లాహరుని మెచ్చె
|
|
| తే. |
జటిలగంధర్వమదశిఖిజ్వాల డిందె, జీవదంతంపుబొమ్మలు జీవ మొందె
నాఘనరసౌఘరంజకమేఘరంజి, మంజులానూనబహుతానమానములను.
| 212
|
| సీ. |
మేటి యై మజ్జారె! మీటుమీటు వహించె నింపయ్యె నయ్యారె! కంపితంబు
నానంద మొందించె నాందోళితం బౌర! బళిబళి! మూర్ఛన బాగుమీఱె
శ్రుతులగతుల్ మమ్మ! శ్రుతులకు హితవయ్యె మేలు! డాలు విరాళి గీలుకొలిపెఁ
జల్లనై యోహోరె! యుల్లాసిత మొసంగె స్ఫురితవిస్ఫూర్తి బాపురె! స్ఫురించె
|
|
| తే. |
నని నిజస్వామి భామతో నభినుతింప, ననిలసుతుఁడు త్రిలోకమోహనము గాఁగ
మేఘరంజి యొనర్చి యమేయతాన, లహరిఁ జెంగటిగండోపలంబు గరఁచె.
| 213
|
| క. |
చండింపక తాళంబు లి, టిం డని కొని కరఁగురాతియెడ నిడి ప్రౌఢిన్
గుండుక్రియం గావించిన, గండోపల మెప్పటట్ల కఠినం బయ్యెన్.
| 214
|
| క. |
ఇటువలె నఘటనఘటనా, పటుఁడు వటుఁడు రాగగరం బంధించి మరు
జ్జటి చేతికి వల్లకి యె, ప్పటిపటిమ నొసంగి యిటులు పలికెఁ బ్రియోక్తిన్.
| 215
|
| క. |
ఈగుండు కరఁగి పోవన్, రాగం బని తాళములు గొనంగలవారే
పో గానవిద్య నధికులు, నాఁగ నిజృంభించి యపుడు నారదమునియున్.
| 216
|
| క. |
ఘనవిధము పంజరంబును, బెనఁగొనఁ బలికింప మఱియు బిగియంగఁ దొడం
గెను రాయి చదువఁ బెట్టిన, మునుపటిమతి వోయె నను టమోఘము గాఁగన్.
| 217
|
| క. |
తన కాస్తి యైనతానము, లని యని వస గాక కాఁక నతివిహ్వలుఁ డై
ముని యున్నఁ దుంబురుండును, దనచే నైనటులు చూచి తహతహ గదురన్.
| 218
|
| ఉ. |
వల్లకి నేల నుంచి తల వాంచి యహంక్రియ డించి సిగ్గుమై
నుల్లము తల్లడిల్ల వెత నూరక చెయ్వులు దక్కి యున్నచోఁ
జెల్లరె గానవిద్యలఁ బ్రసిద్ధులు రాగరఁగింపలేకపోఁ
జెల్లునె? యిట్టు లైన నిఁకఁ జెప్పెడి దేగతి తారతమ్యముల్.
| 219
|
| క. |
జగతి బయకారిపద్దున, నెగడెడిమీ కింతచింత నిజతాళంబుల్
దిగవిడిచిపోవు టు చితం, బగునే యని యాంజనేయుఁ డాడిన వారున్.
| 220
|
| శా. |
చేతు ల్మోడ్చి వచించి రో త్రిజగతీశ్రేయోవిధానక్రియా
చాతుర్యాత్మక! యెంతయైనఁ గల దెంచన్ మామదోద్వృత్తి యే
లా తద్విస్మృతు లుగ్గడింప నగుఁ బాటాయెంగదా యిం కిటన్
మాతాళంబులు మాకు నెప్పటివలెన్ మన్నింపవే సత్కృపన్.
| 221
|
| క. |
ఎంతటివారము మే మీ, చెంతను గానంబు సేయ శ్రీరామమహా
హంత వహించినదుర్మతు, లింతేనియు నెదురుఁ దమ్ము నెఱుఁగంగలరే?
| 222
|
| శా. |
గ్రావంబుల్ గరగింపనోపిన భవత్కల్యాణసంగీతవి
ద్యానిస్ఫూర్తికిఁ దీటు గాఁ దెలియలే కజ్ఞస్థితిన్ గ్రమ్మఱన్
మావీణల్ మొరయింపఁబోయితి మహో మా చెయ్దిముల్ మాకుమా
కే విభ్రాంతి ఘటించెఁ బ్రోవఁగదవే హీనాత్ములన్ మమ్మిఁకన్.
| 223
|
| ఉ. |
ఈపదునాల్గులోకములు నెల్లఁ జరింపఁగలేదొ గానవి
ద్యాపరతంత్రులం గదిసి తద్విధముల్ వినలేదొ యిట్లు రా
రూపులు నీరు సేయఁగలరూఢి యెఱుంగము గాక వింతయే?
యీపని శబ్దసంజననహేతుమయాత్మకు నీకుఁ బావనీ.
| 224
|
| సీ. |
భానుతేజుఁడ వని ప్రస్తుతించెద మన్నఁ బుట్టినప్పుడె భానుఁ బట్టినావు
వనధిగంభీరుండ వని నుతించెద మన్నఁ గడలిమైవడిలోఁతు గాంచినావు
వజ్రకాయుఁడ వని వర్ణించెద మటన్న హనుతటోద్ధతి వజ్ర మడఁచినావు
శైలధీరుం డని సన్నుతించెద మన్న వాలాగ్రమున గిరుల్ వ్రాల్చినావు
|
|
| తే. |
ఒకగుణంబున నొకవిద్య నొక్కసరణి, నీకు సరి యెంచవచ్చునే లోకమునను
సాటి మీరితి వన్నిట మేటి వౌదు, మహితరుచిచంద్ర శ్రీహనూమత్కపీంద్ర.
| 225
|
| చ. |
కృపణుల సాపరాధుల విహీనమనస్కుల మమ్ముఁ బ్రోవవే
కృప నని పెక్కువాక్కులను గీర్తన చేసిన గారవించి య
య్యుపలము మేఘరంజి మఱియుం గరఁగించి తదీయతాళముల్
నిపుణతఁ బుచ్చి యిచ్చి కపినేత వచించె సమంచితోక్తులన్.
| 226
|
| శా. |
గానప్రౌఢిని విూర లిర్వురు సమఖ్యాతిం బ్రవర్తిల్లియున్
హీనాధిక్యము లెంచి వచ్చిన విభుం డీలాగు గావించినాఁ
డే నంచుం గణుతింపనేల చనుఁడా యింకన్ మిథోవాదముల్
పూనంబో కితరేతరప్రియగుణాపూర్ణాత్ము లై నావుడున్.
| 227
|
| మ. |
తమలోఁ దా రరుదంది మారుతిప్రసాదం బొంది నీసాటి గా
నముగా మూఁడుజగంబులం దని యమందస్ఫూర్తిఁ దత్కీర్తి గా
నము గావించుచు స్వామి వీడుకొని సన్నన్ వాయుపుత్రుండు భూ
రమణీజం బతి నెంచి తత్కృపకుఁ బాత్రం బైనచిత్తంబుతోన్.
| 228
|
| క. |
పని గలయప్పుడు దలఁచినఁ, జనుదె మ్మని స్వామి పనుప స్వామి ప్రసాదం
బనీ గంధమాదనాద్రికిఁ, జని నిశ్చలభక్తితపము సలుపుచు నుండెన్.
| 229
|
| క. |
శ్రీకృష్ణుఁడు సతితోడ ని, జాకృతి ధరియించి సత్యహామిక గరుడో
ద్రేకము గాయకగర్వము, లీకరణిం బాయ నాత్మ నింపు వహించెన్.
| 230
|
| క. |
ఈకథ విన్నకృతార్థుల, కాకల్పాయుతచిరాయురారోగ్యంబుల్
చేకుఱు ఫల్గునసఖుని ద, యాకలితకటాక్షవీక్షణాతిశయమునన్.
| 231
|
ఆశ్వాసాంతము
| మ. |
శరణార్థ్యాదరణా! రణార్థిహరణా! షడ్వర్గహృత్కారణా!
పరిభూతప్రకృతీకృతిప్రియకృతీ! పద్మాస్త్రరమ్యాకృతీ!
ధరణీజానుభవా! భవాతివిభవా! త్రయ్యంతసత్ప్రాభవా!
పరమార్థగ్రధనా! ధనార్తినిధనా! బ్రహ్మైక్యసంబోధనా!
| 232
|
| క. |
నారదనుత! రుచినారద, శారదఘనకీర్తితులితశారదలీలా!
కారణకార్యనికారణ! వారణముఖజనకహృదయవారణరూఢా!
| 233
|
| తోటకము. |
సరసాదరసాగర! సాంద్రమదా
హరణాచరణా! చరణానతికృ
ద్వరదా! ద్విరదాసురదారిధను
ర్ధరతావిరతావరతాంకహరా!
| 234
|
| గద్యము. |
ఇది శ్రీమదంజనాతనయదయారసలసత్కటాక్షవీక్షామహత్వసంప్రాప్తకవిత్వ
విద్యావధాన సగుణనిర్గుణధ్యానవాసనానిధాన మానసబిసపుష్ప పుష్పగిర్యప్పనార్య
కుమార సమాశ్రితబుధాచార గురుజనవిధేయ తిమ్మననామధేయప్రణీతం బైనసమీర
కుమారవిజయం బనుమహాప్రబంధంబునందుఁ గుంభసంభవాగమనంబును, హనుమ
న్మాహాత్మ్యవర్ణనంబును, పంచముఖాంజనేయస్వరూపకథనంబును, తారకాసురమధ
నంబును, మాలామంత్రాదిసకలమంత్రజపయంత్రాచరణమానసపూజావిశేషంబులును,
ద్వారకానగరవర్ణనంబును, అంగజగురుశృంగారభంగీప్రసంగంబును, తుంబురునా
రదాగమనంబును, వాయుజువాలవిక్షేపంబున గరుఁడుండు వాసుదేవునిసన్నిధిం
గూలుటయు, హరి యతని నూఱడించి మరలఁ బనుచుటయు, హనుమ యరుదెం
చుటయు, సీతారాములస్తోత్రంబును, సత్యగర్వనిర్వాపణంబును, హనుమంతుండు
తుంబురునారదులతాళంబు లపహరించి తనగానమహిమంబున రాయి గరఁగించి
యందు వైచుటయు, అందునఁ దద్గర్వపరిహారంబు చేసి మరల వారితాళంబు
లొసంగుటయు నన్నది షష్ఠాశ్వాసము.
|
|